సంతోషవర్ధనము చింతితార్ధఫలదము
చింతాశోకనాశకము శ్రీరామదర్శనము
శ్రీరాముని దర్శనమున చింతతీరె తాపసికి
కారడవుల నతని యాగకార్యము సంపన్నమాయె
శ్రీరాముని దర్శనమున చింతతీరె రాజర్షికి
భూరిధనువు నెక్కిడగల వీరుడు లభియించెను
శ్రీరాముని దర్శనమున చింతవదలె భరతునకు
శ్రీరఘువరు పాదుకలను శిరసునగొని పొంగెను
శ్రీరాముని దర్శనమున చింతతీరి జటాయువు
చేరె మోక్షపదమునకు సీతాపతి యాజ్ఞబడసి
శ్రీరాముని దర్శనమున చింతతీరె కబంధునకు
ఘోరరూపమణగి హరిని కొనియాడి చనెను
శ్రీరాముని దర్శనమున చింతతీరె శబరికిని
కూరిమి నాతిథ్యమిచ్చి చెందెను కైవల్యమును
శ్రీరాముని దర్శనమున చింతతీరె సామీరికి
పేరుపెట్టి పిలిచి స్వామి విలుచుకొనె తనవానిగ
శ్రీరాముని దర్శనమున చింతగడచె సుగ్రీవుడు
భూరిభుజుని మైత్రిచే పొందె కపిరాజ్యమును
శ్రీరాముని దర్శనమున చింతబాసె విభీషణుడు
కారుణ్యమూర్తి వలన కలిగె లంకారాజ్యమును
శ్రీరాముని దర్శనమున చింతతీరె పౌరులకు
కూరిమితో ప్రభువేలును కువలయమని పొంగిరి
శ్రీరాముని దర్శనమును చేయువారు పుణ్యాత్ములు
వారి చింతలెల్ల దీరు వారి కబ్బు భాగ్యగరిమ
శ్రీరాముని దర్శనమును చిత్త మందునిలుపుకొను
వారికన్న ఘనులుండరు వారికబ్బు కైవల్యము
మీ కీకీర్తన నచ్చినందుకు ధన్యవాదాలు ్
రిప్లయితొలగించండి