9, సెప్టెంబర్ 2021, గురువారం

రామ రామ యట్టిబ్రతుకు మేము కోరము కోరము

రామ రామ యట్టిబ్రతుకు మేము కోరము కోరము
 
ఏమి చేసిన నేమిలాభము రామకార్యము చేయక
ఏమి చదివిన నేమిలాభము రామచరితము చదువక
ఏమి పాడిన నేమిలాభము రామకీర్తిని పాడక
ఏమి యాడిన నేమిలాభము రామునకునై యాడక
 
ఏమి యెఱిగిన నేమిలాభము రామతత్త్వము నెఱుగక
 ఏమి నేర్చిన నేమిలాభము రామసేవన నేర్వక
ఏమి చూచిన నేమిలాభము రామమూర్తిని చూడక
ఏమి యబ్బిన నేమిలాభము రామదాస్యం బబ్బక
 
ఏమి పూజల నేమిలాభము రాముని పూజించక
ఏమి జపమున నేమిలాభము రామజపమును చేయక
ఏమి తపమున నేమిలాభము రామునకునై చేయక
ఏమి బ్రతుకిం కేమిలాభము రామభక్తికి నోచక