2, సెప్టెంబర్ 2021, గురువారం

గొప్పగ నీముందర శ్రీరామ చెప్పుట కేమున్నది

గొప్పగ నీముందర శ్రీరామ చెప్పుట కేమున్నది
ఒప్పనగ నొకటున్నదా నాచరిత తప్పుల మయమైనది

ధరమీద బ్రతుకుటకు శ్రీరామ ధనములె ముఖ్యమని
ధర నందరి రీతిగా నాతండ్రి తహతహ లాడితిని
హరి నిన్ను సేవించుట శ్రీరామ మరచి దుష్టుడనైతిని
పొరపాటు చేసితిని నాతండ్రి పొగులుచు నిలచితిని

కల్లలాడుట యందున శ్రీరామ కడునేర్పు లేకున్నను
కల్లలాడక దినమును నాతండ్రి గడుపంగ లేనైతిని
కల్లలాడెడు వారికి శ్రీరామ కష్టంబులే వచ్చుగా
కొల్లలై నాచిక్కులు నాతండ్రి ఘూర్ణిల్లుచు నుంటిని
 
జపమేది తపమేదిరా శ్రీరామ సంస్కార మసలేదిరా
కుపథంబు లందుండితి నాతండ్రి కపటంపు బ్రతుకాయెను 
విపరీతచారిత్రుడ శ్రీరామ ఇపుడు నే బుధ్ధెఱిగితి 
కృపజూడవయ్య శరణు నాతండ్రి కేవలము నీవె దిక్కు