29, నవంబర్ 2021, సోమవారం

నందనందను డమ్మ నవనీతచోరుడమ్మ

నందనందను డమ్మ నవనీతచోరుడమ్మ
ఎందులేని చేతల నితడు చేయునమ్మ
 
అమ్మచేతి వెన్నముద్ద లారగించి హాయిగా
నెమ్మదిగా యిలువెడలి నీలమేఘశ్యాముడు
గుమ్మముగుమ్మమున కానికొనియున్న గోపమ్మల
నెమ్మెయి తా దాటునో యిల్లిల్లు జొరబడును

ఒక్కడైన నేదోరీతి నువిదల నేమార్చుచు
చక్కగా దూరునని సరిపెట్టుకొందుమే
పెక్కురు నేస్తులతో విందుగుడిచి పోవు
నెక్కడైన గనవచ్చునె యిట్టివింతలౌరా

యితడెంత తినిపోయిన నింతింతౌ పాడియు
నతులితైశ్వర్యముల నాయిల్లు పెంపొందు
యితడేమి దేవుడా యిట్టివింతలు చేయ
ప్రతియిల్లును వీనికై ప్రతీక్షించు నోహో


ఆడే నదే మీరు చూడరే

ఆడే నదే మీరు చూడరే లేగ
దూడలతో యశోద దుడుకుకొడుకు

హేలగా గోపాలబాలు డాడుచు నుండ
ఫాలాన ముంగురులు బలే చిందులాడ
 
ఘల్లుఘల్లున కాళ్ళగజ్జెలందెలు మ్రోయ
అల్లరిగా నెగురుచు నల్లపిల్లవాడు

దూడల గిట్టలచే ధూళిరేగుచు నుండ
క్రీడించుచు వాటితో కిలకిలా నవ్వుచు

పట్టి తోకలను మెలిపెట్టి యదలించుచు
ముట్టెలకు త్రాళ్ళను గట్టుచును నవ్వుచు

పెద్దగా నరచుచు పేర్లుబెట్టి పిలుచుచు
ముద్దుసేయుచు వాటి ముందు గంతులిడుచు

గంగడోళ్ళు నిమురుచు గారాబము సేయుచు
చెంగుమని పైకెక్కి చేత నదిలించుచు

పరువులెత్తు దూడల పదేపదే‌ యడ్డుచు
చిరుకోపము జూపుచు చెవులబట్టి గుంజుచు

అంభారవముల తాననుకరించుచు వేడ్క
శంభుడన వాటిపై చాల శోభిల్లుచు


27, నవంబర్ 2021, శనివారం

రామా రామా యనరాదా

రామా రామా యనరాదా సీతా
రామా యనరాదా

రాముని జగదభిరాముని గుణములు
ప్రేమగ నుడువగ రాదా
రాముని రవికులసోముని పొగడెడు
నీమము మంచిది మనసా

రాముని దనుజవిరాముని మిక్కిలి
ప్రేముడి గొలువగ రాదా
రాముని కొలిచిన రాని సుఖంబులు
భూమిని గలవా మనసా

రామ రామ యని ప్రేమగ పలికిన
రాముడు పలుకును కాదా
రాముడు పలికిన చాలు కదా యిం
కేమి వలయునే మనసా

26, నవంబర్ 2021, శుక్రవారం

వెన్నమెక్క వచ్చితివా వెన్నదొంగా

వెన్నమెక్క వచ్చితివా వెన్నదొంగా - నేను
నిన్నుచూడ వచ్చితినే వన్నెలాడీ

నన్నుచూడ వచ్చితివా నంగనాచీ - నీవు
నన్నుచూడ వేచితివా సన్నుతాంగీ

నిన్నుపట్ట వేచితిరా చిన్నికృష్ణుడా - పట్టి
యెన్నిముద్దులిచ్చెదవే వెన్నపెట్టి

కొట్టగలను సుమా నిన్ను కొంటెకృష్ణుడా - వెన్న
పెట్టగలవు కాని నన్ను కొట్టలేవే

ఇల్లిల్లూ దూరనేల నల్లనయ్యా  - ఎవరి
యుల్లము ననుతలచు వారి యిల్లు సొత్తునే

ముద్దుసేయుచున్నానని మోహనకృష్ణా నీవు
హద్దుమీఱుచున్నావుర అల్లరి కృష్ణా

ముద్దుచేయుదాన వైన మోహనాంగీ వెన్న
ముద్ద చేతబెట్టి చిన్న ముద్దుపెట్టవే

ముదురుమాట లాడుచున్ఞ మురళీకృష్ణా నిన్ను
వదిలిపెట్టబోను సుమా యదుకులకృష్ణా

నీవు నన్ను వదలకున్న నిర్మలాంగీ - నేను
నీవాడను నిన్నువదల నిశ్చయంబుగ

అందమైన పలుకులాడు నందనందనా ఉట్టి
యందున్న వెన్న నీదే అందుకోరా





హరిహరి దీనికే మనవచ్చురా

హరిహరి దీనికే మనవచ్చురా నీ
కరుణయె గాక వేరు కారణమున్నదా

పరమపాతకు డగు నరుడను నేను
పరమపురుషుడ వగు వాడవు నీవు
మరియు నీతో నాకు మంచి చనువట
అరయ విడ్డూరమే యగు కాదా

పుట్టుచు జచ్చుచు పుడమిని నేను
పుట్టువే లేనట్టి పొలుపున నీవు
గట్టి నెయ్యంబునే గలవారమై
యెట్టులున్నామో యోమోరా

నారాముడే యనుచు నమ్ముదు నిన్ను
చేరదీయుదు వీవు కూరిమి నన్ను
మేరునగధీర యీ వీఱిడి నెయ్య
మారయ నీకు హితమాయెను చూడ

24, నవంబర్ 2021, బుధవారం

మ్రోగించరా దివ్యరాగాల మురళిని

మ్రోగించరా దివ్యరాగాల మురళిని 
సాగించరా హాయిసంతర్పణమును
 
కరముల నీవూన కడుపొంగి యానంద
భరితమై వేణువిటు పాడనేర్చును కాని
చిరువెదురు ముక్కలో చిందునా సుధలనే
మురళీధరా పాట  మొదలుకానీయరా

మురళి తా జేసిన పుణ్యమెట్టిదో కాని
తరచు నీపెదవుల దాకి పరవశమందు 
మురళి పాటలోని భూరిమాధుర్యము
హరి నీదు పెదవుల నంటిన పుణ్యమే 

జగమునే మురిపించు చక్కని నీపాట
జగమునే మరపించు చక్కని నీపాట
నగధరా వినుట యేనాటి పుణ్యమొ మాకు
జగదీశ రేయెల్ల సాగనీ నీపాట
 

23, నవంబర్ 2021, మంగళవారం

నామజపము చేయరే పామరులారా

నామజపము చేయరే పామరులారా రామ
నామజపము చేయరే రక్తిమీఱ

ఇరుగుపొరుగు వారితో యిచ్చకంబు లాడుచును
కరిగించుచున్నా రేల కాలమంతయు
ఉరక రసన నటుల నిటుల ఊపుచున్న నేమొఱుగు
పరమాత్ముని నామ మేల పలుకకున్నారో

నరులుగా పుట్టినందుకు నారాయణ నామమును
సరసముగా పలుకకున్న జన్మమేటికి
హరినామజపము మోక్షకర మన్నది తెలిసియును
హరేరామ హరేరామ యనకున్నారే

భవతారక మని తెలిసి యెవడు రామనామమును
పవలురేలు పాడుచుండు వాడే ఘనుడు
వివరించి చెప్పనేటికి వేరొండు దారిలేదు
భవచక్రము దాటి పరమపదము చేరగా

పలుకరా శ్రీరామా భవబంధమోచనా

పలుకరా శ్రీరామ భవబంధమోచనా
నళినీదళాయతనయన కర్తవ్యము

చిఱుతప్రాయము నుండి శ్రీరామ ప్రేమతో
తఱచుగా నీపేరు తలచుచుండిన నేను
కుఱుచబుధ్ధుల వారు కువలయేశ్వర నిన్ను
వెఱువక నిందించ విని యోర్వ లేనురా

పేరాశతో నేను వేరుదైవము నెంచి
శ్రీరామ నీనామ చింతన విడువనే
కోరికోరి జనులు క్రొత్తదైవములకు
మారిపోవుట చూచి మరి యోర్వలేనురా

ధనధాన్యముల కేను తహతహ లాడనే
మనుజేశ నీనామమును పలుకనే కాని
ధనలోభమున మతమును మారి కొందరు
నిను నిందచేయుట వినియోర్వ లేనురా


22, నవంబర్ 2021, సోమవారం

పరమానందమాయె

పరమానందమాయె హరి నీ కరుణ మాకు కలిగె
మరి మాకు వేరే వరమేమి వలయున
 
మహదైశ్వర్యము నీకృపయే యని మదినెంచు మాకు నేడు
అహరహమును నీస్మరణము జేయుచు విహరించు మాకు నేడు
సహచరుండవును స్వామివి నీవని సరిదల మాకు నేడు
బహుజన్మంబుల జేసినతపములు ఫలియించి తుదకు నేడు
 
సురవరు లెప్పుడు చక్కగ కోరెడు సౌభాగ్య మిదిగొ కలిగె
నిరతము మునివరు లెప్పుడు కోరెడు వరమిదే మాకు దొరకె
పరమయోగులకు వాంఛితమగు ఘన భాగ్యమ్ము మాకు కలిగె
హరిభక్తాగ్రేసరు లెప్పుడు నడిగెడునది నేడు మాకు దొరకె
 
దానవమర్దన దశరధనందన దయచూపి నావు నీవు
మానవనాయక మోక్షప్రదాయక మన్నించి నావు నీవు
జ్ఞానానందమయస్వరూప హరి సంసార ముడిపినావు
జానకీరమణ రామచంద్ర నను సంతోషపరచి నావు


రామా రఘువర రాజీవాక్షా

రామా రఘువర రాజీవాక్షా
కామితవరదా కరుణించవయా

సామాన్యులము పామరుల మయా
సోమరులము కడు తామసులము
నీమాహాత్మ్యము నేమెఱుగుదుము
స్వామీ దయతో సంరక్షింపుము

ఎఱుగము మంత్రము లెఱుగము పూజల
నెఱుగము నీతత్త్వ మిసుమంతయును
ఎఱుకలేని మాకీశ్వర నినుగూర్చి
ఎఱుక గూర్చు గురు వెవని నెఱుంగము

శరణమనినచో శత్రువునైనను
కరుణించెదవని కాదా విందుము
పరమపురుష నీమఱువు జొచ్చితిమి
శరణము నీవే జానకీపతీ







20, నవంబర్ 2021, శనివారం

కృష్ణా కృష్ణా జయ శ్రీకృష్ణ


కృష్ణా కృష్ణా జయ శ్రీకృష్ణ భవతృష్ణానివారక శ్రీకృష్ణ

గొల్లపిల్లవాడ శ్రీకృష్ణ హరి నల్లనివాడా శ్రీకృష్ణ
వల్లవికాప్రియ శ్రీకృష్ణ హరి ఫుల్లాబ్జాక్ష శ్రీకృష్ణ 

సత్యము నీయందు శ్రీకృష్ణ మది నిత్యము నిల్పుదు శ్రీకృష్ణ
నిత్యానంద రూప శ్రీకృష్ణ హరి భృత్యసంపోషక శ్రీకృష్ణ

నిత్యము నిన్నెన్ని శ్రీకృష్ణ కృతకృత్యుల మౌదుము శ్రీకృష్ణ
సత్యధర్మాశ్రయ శ్రీకృష్ణ దుష్కృత్యనివారక శ్రీకృష్ణ

వర్జించి సర్వము శ్రీకృష్ణ నీవారమైతి మయ్య శ్రీకృష్ణ
నిర్జరవందిత శ్రీకృష్ణ యమళార్జునభంజక శ్రీకృష్ణ

సజ్జనులను గాను శ్రీకృష్ణ మము చక్కగ చేయుము శ్రీకృష్ణ
సజ్జనరక్షక శ్రీకృష్ణ బహుదుర్జనశిక్షక శ్రీకృష్ణ

దేహధారులమో శ్రీకృష్ణ నిన్నూహించ నేర్తుమె శ్రీకృష్ణ
మోహవిదారక శ్రీకృష్ణ ఖగవాహన శ్రీహరి శ్రీకృష్ణ

మోహాంధుల మము శ్రీకృష్ణ నిర్మోహులజేయుము శ్రీకృష్ణ
పాహి మహోదార శ్రీకృష్ణ జగన్మోహన రూప శ్రీకృష్ణ













19, నవంబర్ 2021, శుక్రవారం

నిను దెలియ బ్రహ్మాదులును సమర్ధులు కారు

 నిను దెలియ బ్రహ్మాదులును సమర్ధులు కారు
వనజాక్ష మేమనగ వల్లవికల మయ్య

చనుబాల విషమీయ జనుదెంచు పూతనను
కనుగొంటి వెట్లు పసితనమందు నీవు
నిను సుడిగాలియై గొనిపోవు రక్కసుని
పనిబట్టితివి శిశుప్రాయమం దెటుల

గోవర్ధనంబు నొక గొడుగుగా జేసితివి
గోవులను గోపాలకులను రక్షించితివి
నీవు చేసిన లీల భావించి పులకించి
గోవిందుడను బిరుదు దేవేంద్రుడొసగె

గోగోపకుల నొక్క గుహను దాచగ బ్రహ్మ
యోగమాయను జేసి యొక్కడవె నగుచు
బాగొప్ప గోగోప బాలకులు గానైన
సాగిమ్రొక్కెను నలువ చక్కగా నీకు


వచనకవిత్వం ఎంత సులువో!!

పుస్తకం.నెట్ సైట్‌లో ఒక కవిత్వసమీక్ష "కాలం కంపనలో కొన్ని క్షణాలు, శ్రీకాంత్ తో" చదివిన తరువాత నాస్పందన ఇది.

అక్కడ ఒక బాక్స్ కట్టి మరీ‌ ప్రచురించిన ఒక కవితను చూడండి:

“వంటలో నిమగ్నమై హటాత్తుగా తల ఎత్తి

మసి అంటిన అరచేతితో

తన ముఖాన్ని తుడుచుకుంటూ

నీవైపు చూసి అప్రయత్నంగా నవ్వుతుంది తను

మరి

ఇక ఆ తరవాతా, ఆ రాత్రి అంతా

మండుతూనే ఉండింది

ఆ కట్టెల పొయ్యి అప్రతిహతంగా ఉజ్వలంగా –“

 

నిజానికి అదంతా ఒక వాక్యం. చూడండి తిన్నగా వ్రాస్తే అది ఇలా ఉంటుంది.

"వంటలో నిమగ్నమై హటాత్తుగా తల ఎత్తి మసి అంటిన అరచేతితో తన ముఖాన్ని తుడుచుకుంటూ నీవైపు చూసి అప్రయత్నంగా నవ్వుతుంది తను. మరి ఇక ఆ తరవాతా, ఆ రాత్రి అంతా మండుతూనే ఉండింది ఆ కట్టెల పొయ్యి అప్రతిహతంగా ఉజ్వలంగా"

ఏమిటండీ ఈ వ్యవహారం?

ఓహో. తెలుగు వాక్యాన్ని ముక్కలుముక్కలుగా విరిచి, ఆముక్కల్ని నిలువుగా పేర్చి వ్రాస్తే అది ఆటోమేటిగ్గా (వచన)కవిత్వం ఐపోతుంది! ఎంత సులువూ కవి కావటమూ కవిత్వం బరికేయటమూను!!

ఇన్నాళ్ళూ ఎంత అమాయకత్వం ఎంత అజ్ఞానంలో ఉన్నాం మనం అంతానూ. కవి కావాలంటే గొప్ప భావాలు కలగాలీ గొప్ప వ్యక్తీకరణ ఉండాలీ గొప్ప భాషాపటిమ ఉండాలీ అదుండాలీ ఇదుండాలీ అని.

అవేమీ అక్కరలేదూ ఎలాగో కాస్త పేరూ పలుకుబడీ వంటివి ఉండాలీ అని జ్ఞానోదయం అయింది.

ధన్యవాదాలు.

పైగా ఆ సమీక్షకు ముక్తాయింపు వాక్యం ఇలా ఉంది:

"శ్రీకాంత్ కవిత్వం కూడా పాఠకుడికి ఇంత జీవధాతువుని ప్రసాదిస్తుంది."

జీవధాతువు అంటే ఏమిటో మరి!

ఈరోజుల్లో తెలుగు కవిత్వం అంటే ఇలాగే ఉంటుందీ, ఇలా ఉంటేనే జనం ఆదరిస్తున్నారూ అనకండి. కవిత్వసంకలనాలు ఇలా సాటి కవులూ రచయితలూ మెచ్చి వ్యాసాలు వ్రాయటం వరకే తప్ప అవి జనాదరణ పొందటం లేదు.

మరొక పార్శ్వమూ ఉంది. కొన్నికొన్ని తమాషాల కారణంగా పద్యకవులూ ఇబ్బడిముబ్బడిగా పెరిగారు. శతకాలూ వగైరా జోరైనాయి. అవి కొనేవాళ్ళు కూడా ఎవరూ లేరు లెండి.

కొత్త రకం కవిత్వం పుస్తకాలైనా పాతధోరణి కవిత్వం పుస్తకాలైనా చివరకు సభల్లో పంచుతున్నరు దారిలేక పాపం వాటిని వ్రాసినవారు. చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే వారి సాటి కవులూ వగైరా బిరుదులున్న వారు కూడా వాటిని అక్కడే కుర్చీల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు!


రారా నవనీతచోరా

రారా నవనీతచోరా ఇటు
రారా నందకిశోరా

కాలియందియలు ఘల్లుఘల్లన నుదుట 
నీలిముంగురు లల్లలాడ
కాలమేఘము వోలె కనుపించే‌ మైచాయ 
చాలా చక్కంగను దోచగ

తగిలించి నెమలీక సొగసుగ తలమీద
వగకాడ మావాడకి రారా
జగములేలే మంచి నగుమోము కలవాడా
యుగములాయే నౌరా రారా

అటలాడగ రారా అందాలబాలుడ
కోటికోటిమన్మథాకారా
మాటిమాటికి నీ మంచితనమునే మా
వీట నెంచుదు మయ్య రారా


జయజయ బృందావనసంచారీ జయజయ రాసవిహారీ

జయజయ బృందావనసంచారీ జయజయ రాసవిహారీ
 
జయజయ మురళీగానవిలోలా జయజయ గోవిందా
జయజయ యమునాతీరవిహారీ జయజయ జయ కృష్ణా

జయజయ మోహవిమోచనకారీ జయజయ గోవిందా
జయజయ నందయశోదాతనయా జయజయ జయ కృష్ణా
 
జయజయ సురగణవైరివిదారీ జయజయ గోవిందా
జయజజయ గోపకులాలంకారా జయజయ జయ కృష్ణా
 
జయజయ గోపీమానసచోరా జయజయ గోవిందా
జయజయ శతశత మదనాకారా జయజయ జయ కృష్ణా
 
జయజయ జయ హరి సర్వాధారా జయజయ గోవిందా
జయజయ జయ హరి విజయవిహారీ జయజయ జయ కృష్ణా
 
జయజయ జయ హరి గోపకుమారా జయజయ గోవిందా 
జయజయ జయ హరి పరమోదారా జయజయ జయ కృష్ణా
 
జయజయ కరుణాపారావారా జయజయ గోవిందా
జయజయ బృందారకపతిసన్నుత జయజయ జయ కృష్ణా
 
జయజయ ప్రావృణ్ణీరదశ్యామా జయజయ గోవిందా
జయజయ జలజాతాసనసన్నుత జయజయ జయ కృష్ణా
 
జయజయ గోవర్ధనభూధరధర జయజయ గోవిందా
జయజయ గోగోపజనోధ్ధారా జయజయ జయ కృష్ణా
 
జయజయ రామానుజ స్మితవదనా జయజయ గోవిందా
జయజయ ఆశ్రితజనసంరక్షక జయజయ జయ కృష్ణా
 
జయజయ తాపత్రయసంశోషణ జయజయ గోవిందా
జయజ నిగమశిఖరసంచారా జయజయ జయ కృష్ణా
 
జయజయ బ్రహ్మానందప్రదాయక జయజయ గోవిందా
జయజయ త్రిజగన్మంగళరూపా జయజయ జయ కృష్ణా
 

వినవచ్చుచున్న దదే వేణుగానము

వినవచ్చుచున్న దదే వేణుగానము సఖి
మన కొంటెకృష్ణుని మధురగానము 

వేణువేమి గానమేమి వినవచ్చుట యేమి
యేణాక్షీ యీనిశీధి యెంతో నీరవం

వెన్నెలలో యమునవద్ద విహరించుచు మన
వెన్నదొంగ చేయుచున్న వేణుగానమే

పున్నమ పున్నమకు భలే పూవుబోడి నీకు
వెన్నెలలో వినిపించును వేణుగానమే

ప్రాప్తమున్నవారి చెవుల బడునందురే  హరి
కాప్తురాలవే కావా అయ్యో గోపికా
 
నిన్ను పిలుచుచున్నాడా నన్నుపిలువక ఓ
వన్నెలాడి వానికొఱకు పరుగునపోవే
 
మురళీమనోహరుని మోహనగానం విన
పరువులిడని గొల్లపిల్ల బ్రతుకెందుకే
 
అటులైతే నీతో నేను నరుదెంతు యమునా
తటికి నన్ను కొనిపోవే దయతో చెలియా

 
 

18, నవంబర్ 2021, గురువారం

జలధరశ్యామా రామా నీదయ చాలు నదే చాలు

జలధరశ్యామా రామా నీదయ చాలు నదే చాలు
కలలో నైనను నీకన్యులనే కొలువను నన్నేలు

భవవిషశోషణ నృపకులభూషణ పరమపురుష పాహి
అవనీతనయావర కావవయా అంబుజాక్ష పాహి
పవమానసుతార్చిత పాదయుగా ఆశ్రితుడను పాహి
రవికులవర్ధన దితికులమర్దన రామచంద్ర పాహి
 
మునిగణపూజిత సురగణపూజిత మురహర హరి పాహి
జననాథోత్తమ చాపధరోత్తమ జలజనయన పాహి
వనజాతేక్షణ విశిఖసుతీక్షణ ఘనవిక్రమ పాహి
వనజజసన్నుత శశిధరసన్నుత వాలిమథన పాహి 

సుగుణవిభూషణ సురగణతోషణ శుభ్రతేజ పాహి
జగదోధ్ధారణ అసురవిదారణ జానకీశ పాహి
తగిన విధంబున దురితనివారణ దశరథసుత చేసి
వగచెడు నాపై తగుకృప జూపి పాలించగ రారా


17, నవంబర్ 2021, బుధవారం

మురళీ మురళీ మోహనమురళీ

మురళీ మురళీ మోహనమురళీ
సురుచిరసుమధుర మురళీ

వల్లవికాజనపరివేష్ఠితుడగు నల్లనయ్య మురళీ
చల్లని వెన్నల వేళల మ్రోగే చక్కనైన మురళీ
 
శ్రుతిరూపిణులగు గోపికలకు వినసొంపుగొలుపు మురళీ
అతిచతురముగా హరిభక్తులకు హాయి గొలుపు మురళీ
 
అనన్యగోపిక లందరకును మహదానందమిడు మురళీ
వినుతశీలరగు గోపికలకు బహువేడ్క గొలుపు మురళీ
 
గోపికలైన ఋషిపుంగవులకు కొమరు మిగులు మురళీ
తాపత్రయహర సుమధురమృదునాదమును చేయు మురళీ
 
హరికరసంస్పర్శానందంబున నతిశయించు మురళీ
పరమమనోహర గానామృతమును పంచిపెట్టు మురళీ

మ్రోగనీ నీమురళీ కృష్ణా సాగనీ మృదురవళీ

మ్రోగనీ నీమురళీ కృష్ణా
సాగనీ మృదురవళీ

యమునాతటిపై యదుకులభూషణ
మము మురిపించే గానమై

వెన్నెల వేళల వేడుక గొలిపే
సన్నని రాగాలాపనై

పలుకగలేని పులకితలతికలు
జలజల పూలే రాల్చగా

మనసుల కమృతమును రుచిచూపుచు
తనివి తీరని దాహమై

నందయశోదానందన బ్రహ్మా
నందము మాకందించుచు


మరియొకసారి మురళినూదరా

మరియొకసారి మురళినూదరా
పరమపురుష కృష్ణా
 
వీనులవిందుగ మురళీగానము వినితరియించితిరా
మేనున పులకలు మొలిచెనురా నీ గాన మహిమ చేత
 
మరలమరల నీ మురళిపాటనే మనసు కోరుకొనురా
పరమమధురమగు మురళిపాటనే పరవశించి వినురా 

పరమానందము కలిగించే నీ మురళిపాట వినగ
పరుగున వచ్చితి పరవశించితిని మరల పాడవయ్యా
 
వేణుగానమును వినివిని నాలో వేణువు మ్రోగెనురా
ప్రాణమునకు నీ వేణుగానమే‌ ప్రాణముగా నిలచె

పరమ మధురముగను మురళిని వాయించర

పరమ మధురముగను మురళిని వాయించర 
పరమాత్మ నీపాట ప్రాణము మాకు
 
పిల్లంగోవి పాటకు నల్లనయ్య మా
యుల్లంబు లుత్సహించు నల్లనయ్య

వెన్నెల వేళ లందు చిన్నికృష్ణ గొల్ల
కన్నియ లందరు మెచ్చ చిన్నికృష్ణ

పరుగున వచ్చి మేము బాలకృష్ణ చాల
పరవశమున విందుము బాలకృష్ణ 
 
నందయశోదల నందనకృష్ణ ఇంద్ర
వందితచరణారవింద కృష్ణ

వేదాంతవేద్యగోవింద కృష్ణ నీవు
మాదైవమవు జగన్మంగళ కృష్ణ

16, నవంబర్ 2021, మంగళవారం

గొల్ల పిల్లోడికి పిల్లంగోవి యెందుకంటా

గొల్ల పిల్లోడికి పిల్లంగోవి యెందుకంటా నా
పిల్లంగోవి సంగతి నీ కెందుకంటా

ఏవేళను జూచినా ఇదే పిల్లంగోవి ధ్యాస
గోవులను మేపేది కొంచె మున్నదా
ఆవు లటూయిటూ బో నదిలించే దున్నదా
నీవు దాని నూదియూది నిదుర బోయేవా
 
పగలు వెక్కిరించేవో  వల్లవికా బలే బలే
వగలాడి వెన్నెలవేళ వచ్చేవు కదే
జగము మరచి మురళిపాట తగునంటూ వినవలచి
తగవు లేలనే నీతో తరళాక్షి నాకు

నీ‌ మురళి పాటవిని నిలువలే కుందుమురా
నీ మూలమున మాకు నిందలొచ్చేను
రాముడితో అడవికేగి రాత్రిదాక ఊదుకోర
మామీద కరుణజూపి మాధవ నీవు


అల్లరి యిక చాలునురా కృష్ణా పిల్లనగ్రోవిని యూదరా

అల్లరి యిక చాలునురా కృష్ణా పిల్లనగ్రోవిని యూదరా
 
నీమృదుమురళీ గానము దయతో నించుమురా మా గుండెల 
మా మురిపములే తీరగ వేగమె మధురముగా మ్రోగించరా

గోపికలందరు నీపాటను విన కూడుకొనిరి కనుగొనరా
గోపాలక ఓ‌ నందకుమారా మాపై నీవు దయగొనరా

వెన్నెల వేళను వృథ సేయకురా మన్నించర మురళీధరా
కన్నియలందరి తహతహ తీరగ గానామృతమును పంచరా

మోహనమురళీగానము వినగా మోహములే నశియించురా
దేహికి తాపము లణగించే నీ దివ్యగాన మందించుమురా

 

15, నవంబర్ 2021, సోమవారం

ఇంత మాధుర్యమిది యీమురళిదేనా

ఇంతమాధుర్య మిది యీమురళిదేనా
కొంత నాపెదవులదే గొల్లపిల్లా

అవునా ఆ పెదవుల కెటులబ్బు నంతతీపి
మివుల వెన్న మెసవుటచే ముద్దరాలా
నవనీతము కమ్మన కద నందకుమారా
అవురా అది తీపి యందు వల్లరి కృష్ణా

ఎన్నడును వినము సుమా యింతతీపి మురళి
వెన్నెలకే వన్నెతెచ్చె వేణుగోపాలా
అన్న నేర్పలేదు కదా అమ్మ నేర్పలేదు 
కన్నయ్యా నీదు మురళి కడు మధురమురా

కమ్మదనమె కాని తీపి కనమురా వెన్నలో
నమ్ము మింకెటుల వచ్చె నాపెదవుల తీపి
అమ్మకచెల్ల వెన్న యంత తీపి యెటుల
నమ్మకుంటే ముద్దుపెట్టి నమ్మవె పిల్లా

శ్రీరఘురామా సీతారామా

శ్రీరఘురామా సీతారామా మారజనక సంగరభీమా
నారాయణ హరి మంగళదాయక తారకనామా శ్రీరామా

నీకారుణ్యము నీసౌజన్యము నీవిక్రమమును నిత్యమును
లోకములన్నియు నొక్కగొంతుతో ప్రాకటముగ కీర్తించునయా

శ్రీకర శుభకర శాంతస్వరూపా జీవలోకపాలనచతురా
లోకాధీశ్వర నీకుమ్రొక్కెదము మాకు ప్రసన్నుండవు కమ్ము

ఎన్నోతనువుల దాల్చుచు విడచుచు నెప్పుడు నీభవచక్రమున
విన్నదనంబును పొందుచు తిరుగుచు వేడుచు నుందుము నిన్నెపుడు

కన్నతండ్రివై కాపాడుమని కడుభక్తిని నిను వేడెదము
విన్నపములు విని యెన్నడు మాపై వేదవేద్య దయచూపెదవో

జీవకోటికి నీవే శరణము కావున నీకే భక్తులము
భావము లోన బాహ్యము నందున గోవిందా నిను కొలిచెదము

నీవే తప్ప నితఃపరమెఱుగము కావుము దయజూపిం
చవయా
పావననామా పట్టాభిరామా శ్రీవైకుంఠాధిప శలణు



శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనవే చిలుకా బంగారుచిలుకా

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనవే చిలుకా బంగారుచిలుకా
క్షీరాన్న మిదిగో తినవే చిలుకా శ్రీరామ యనవే చిలుకా

రామలోరిగుడి తోటలో పండ్లన్ని రంజుగా రుచిచూచు చిలుకా
ప్రేమతో నేనిచ్చు క్షీరాన్నమును తిని శ్రీరామ యనవే చిలుకా

క్షీరాన్న మేమిరుచి శ్రీరామనామమే చింతింప రుచికదా నరుడా
శ్రీరామ యనుటకు లంచమెందుకు నాకు చేయనా రాంభజన నరుడా

హాయిగా నగరసంచారమ్ము గావించి అరుదెంచిన మంచి చిలుకా
తీయని పండ్లివే తిని రామభజనను తీయిగా చేయవే చిలుకా

తీయతీయని పండ్లు రామనామము కన్న తీయగా నుండునా నరుడా
హాయిగా రాంభజన చేయువేళల యందు ఆకలి వేయునా నరుడా

ఆకలి నటులుంచి భజనచేయుట యన్న నతికష్ట మగుకదా చిలుకా
ఈ కొంచెమైన తిని శ్రీరామభజనము నింపుగా చేయవే చిలుకా

నాకు లేని చింత నీకెందు కో నరుడ నాకన్న మన రామనామం
శ్రీకరము రాంభజన చేయు వేళను నీకు ఆకలి గోలేల నరుడా



14, నవంబర్ 2021, ఆదివారం

శ్రీరామ నీనామమే చాలు

శ్రీరామ నీనామమే చాలు
ఘోరసంసారాబ్ధి దాటింప

శ్రీరామ నీబాణమే చాలు
ఘోరాసురాళిం బడంగొట్ట
శ్రీరామ నీపాదమే చాలు
ఈరేడు లోకంబు లేలంగ

శ్రీరామ నీనామమే చాలు
నారసన ధన్యత్వంబంద
శ్రీరామ నీరూపమే చాలు
ఈ రెండు నేత్రంబు లీక్షింప

శ్రీరామ నీగాథయే చాలు
పారాయణంబునకు నాకు
శ్రీరామ నీపాదమే చాలు
చేరి నేసేవించి యుప్పొంగ


13, నవంబర్ 2021, శనివారం

ధనమదము కలవారికి దైవము మోక్షమీయడే

ధనమదము కలవారికి దైవము మోక్షమీయడే
మనసా శ్రీరామనామము మాత్రము మరువకే

దండిగాను సంపాదించి ధనము చాల వెచ్చించి
కొండమీద గుడికడితే గొప్పయేమిటే
ఉండుండి యుత్సవాలు నూరేగింపులను చేసి
పండగలు చేయ దేవుడు పడిపోతాడా

కులుకుచు బంగారుపూలు కొనివచ్చి పదిమంది
తిలకించగ పూజచేయు తీటదేనికే
వలచేనా రాముడు నీ ప్రదర్శనాటోపములు
తులలేని వరములను దోచిపెట్టేనా

ధనము రామపరముగా తనువు రామపరముగా
జనుడు మసలెనేని హరి సంతోషించునే
మనసు రామమయముగా మాట రామపరముగా
కనవచ్చిన రాముడు మోక్షము నొసంగునే


ఏమరక నుడువుదు నీ రామనామము

ఏమరక నుడువుదు నీ రామనామము
నా మనసున నిండిన దీ  రామనామము

కామితార్ధముల నొసంగు రామనామము
కామాదుల నణచివేయు రామనామము
ప్రేమతో నన్నేలెడు రామనామము
రామనామము నా రామనామము

కామారికి యిష్టమైన రామనామము
సామీరికి సర్వమైన రామనామము
భూమిసుతకు ప్రాణమౌ రామనామము
రామనామము నా రామనామము

తామసత్వ మరికట్టు రామనామము
క్షేమంకరమై యుండెడు రామనామము
నీమముగా మోక్షమిచ్చు రామనామము
రామనామము నా రామనామము



జయ జయ జయ కరుణారససాగరా రామా

జయ జయ జయ కరుణారససాగరా రామా రిపు
క్షయకరములు నీశరములు సార్వభౌమా

ఆశరములు తాటకాపటాటోపము నణచె
ఆశరములు గాధేయుని యాగంబును కాచె
ఆశరములు ఖరదూషణలను దుష్టుల గొట్టె
ఆశరములు వారసైన్య మంతటిని మ్రింగె

ఆశరముల నొకటి మారీచాధముని జంపె
ఆశరముల నేడు తాళ్ళ నణచి చెలగె నొకటి
ఆశరముల నొకటి వాలి నంతము కావించె
ఆశరములు దెబ్బ కుదధి యంజలి ఘటియించె

ఆశరములు కుంభకర్ణు నని ద్రెళ్ళగ వేసె
ఆశరములు త్రెంచె రావణాసురుని శిరములు
ఆశరములు నొకటి రావణాంతకమై నిక్కె
దాశరథీ నీశరములు ధర్మంబును నిలిపు



రామనామం శ్రీరామనామం

రామనామం శ్రీరామనామం
శ్రీమన్నారాయణుని శ్రేష్ఠనామం

యోగివరుల హృదయంబుల నుండెడి నామం
సాగి భక్తజనులు కొలుచు చక్కని నామం
భోగీంద్రుడు వేయినోళ్ళ పొగడెడి నామం
రాగద్వేషముల నణచు రామనామం

అవలక్షణముల నణచెడు యమృత నామం
కవులు సదా ప్రశంసించు కమ్మని నామం
భవతారక మనగ కీర్తి బడసిన నామం
రవికులాధిపుని నామం రామనామం

విమలమతుల నాల్కలపై వెలసెడు నామం
భ్రమల నణచి రక్షించే బంగరు నామం
సుమధురమై శోభిల్లెడు సుందరనామం
రమణీయంబైన నామం రామనామం



11, నవంబర్ 2021, గురువారం

కొలిచెద నిన్నే గోవిందా

కొలిచెద నిన్నే గోవిందా దయ
తలచుము నాపై గోవిందా

మెలకువ లోన గోవిందా నీ
తలపును విడువను గోవిందా
కలలో నైనను గోవిందా నీ
తలపే నాకో గోవిందా

ప్రతి జన్మమున గోవిందా నీ
కతిభక్తుడనో గోవిందా
వ్రతమిది నాకో గోవిందా నిను
నుతిచేయుట యన గోవిందా

హరేరామ యని గోవిందా నే
నిరతము పాడుదు గోవిందా
హరేకృష్ణ యని గోవిందా భవ
హర కీర్తింతును గోవిందా

10, నవంబర్ 2021, బుధవారం

జానక్యాః . . . . . శ్లోకం గురించి


ఈ రోజున వాత్సల్య గారు పంపిన వ్యాఖ్య ఆలోచనీయంగా ఉంది.

శ్యామలీయం గారూ,
నిష్కర్షగా నేను-నా రాముడు అని చెప్పడం చాలా బాగుందండీ.
జానక్యాః శ్లోకం ఇంటర్నెట్లో ఒకొక్కచోట ఒకొక్కలాగ ఉంది.మీకు వీలయితే సరి అయిన శ్లోకాన్ని ఇక్కడ జవాబు ద్వారా వ్రాయగలరా?

చలామణీలో ఉన్న ఈ శ్లోకంలో ఉన్న తప్పులని ఎత్తిచూపుతూ ఎవరైనా వ్రాయకపోయి ఉంటారేమో, ఇంటర్నెట్లో వెతకాలి అనుకున్నప్పుడు నాకు గుర్తు వచ్చినది మీ బ్లాగు, శర్మగారి బ్లాగే. 

ఈ జానక్యాః .. శ్లోకం శ్రీరామకర్ణామృతం లోనిది.

జానక్యాః కమలామలాంజలిపుటే యాః పద్మరాగాయితా 
న్యస్తా రాఘవమస్తకే తు విలసత్కుంద ప్రసూనాయితాః  
స్రస్తాః శ్యామలకాయకాంతికలితాః యా ఇంద్రనీలాయితాః 
ముక్తా స్తా శ్శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః ॥ 1-82॥
 
ఇప్పుడు నేను పైన చూపిన పాఠం వావిళ్ళవారు 1972లో ప్రచురించిన ప్రతిలోనిది. ఈప్రతి ఒక నాదగ్గర జీర్ణావస్థలో ఉంది! వావిళ్ళవారి ప్రచురణలు ప్రమాణంగా గ్రహించటం అన్నది పరిపాటి. దానికి కారణం ప్రచురణకర్తలు స్వయంగా మహాపండితులు కావటం.

ఒక ఐతిహ్యం ఉన్నది. వావిళ్ళవారు ప్రచురించే పుస్తకాలకు సంబంధించిన ప్రతులకు తప్పొప్పులను సరిచూడటానికి పండితులకు ఒక గొప్ప అవకాశం ఉండేదట. అచ్చులోనికి వెళ్ళక ముందు వావిళ్ళవారి పరిష్కర్తల బృందం సరిచూడటం జరిగిన తరువాత ఆ అవకాశం ప్రెస్సుకు వచ్చే కవిపండితులకు తప్పకుండా ఉండేదట. ఏవన్నా తప్పులు కనుక ఎత్తి చూపటం ఎవరన్నా చేస్తే వారికి తప్పుకు ఒక అణా చొప్పున పారితోషికం కూడా వావిళ్ళవారు ఇచ్చేవారట.

అందుచేత నా బాల్యం నుండి గమనిస్తున్నాను, సాహిత్య చర్చల్లో వావిళ్ళవారి పాఠం అంటే అదొక ప్రమాణంగా పరిగణించబడుతూ ఉండటం.

ఈశ్లోకం తెలుగునాట బహుళ ప్రచారం పొందినది. ముఖ్యంగా పెళ్ళిశుభలేఖల్లో ముపాతికమువ్వీసం లేఖలు ఈశ్లోకంతో ప్రారంభం అయ్యేవి. స్వయంగా నేనే చాలా సార్లు పెళ్ళిశుభలేఖల్లో ఈ శ్లోకం ప్రతి సరిదిద్దటం జరిగింది.

అంతర్జాలంలో ఈశ్లోకం చాలాచోట్ల తప్పులతో కనిపిస్తున్నమాట నిజమే.
సాక్షిపత్రిక వారి వ్యాసంలో ఈ శ్లోకంలో "రాఘవ మస్తకే చ" అనీ "ముక్తా తా" అనీ పొరపాటు ముద్రణ ఉంది.
సుజనరంజని పత్రిక వారి వ్యాసంలో కూడా ఈశ్లోకంలో "రాఘవ మస్తకేచ" అని ఉంది.
చాగంటి సత్సంగ్ వారి పేస్‌బుక్ పేజీలోనూ "రాఘవ మస్తకేచ" అని ఉంది.
తెలుగుపద్యం బ్లాగు పేజీలో కూడా ఇలాగే "రాఘవ మస్తకేచ" అని ఉంది.
ఇలా "రాఘవ మస్తకేచ" అని చాలా ప్రచురంగా కనిపిస్తోంది.
 
ఇంకా అనేక చోట్ల రకరకాల తప్పులతోనే కనిపిస్తోంది. ఒకచోట "ముక్తాః శుభదాః భవంతు" అనిఉంది  
 
వావిళ్లవారి పాఠం ఇచ్చాను కదా, దీనిలో "పద్మరాగాయితా" అని విసర్గరహితంగా ఉంది. కాని దాదాపు అందరూ "పద్మరాగాయితాః" అని అంటున్నారు. అంతర్జాలం నిండా ఈపాఠమే ఉంది. మరి వావిళ్ళవారు విసర్గను వదలటం పొరపాటున చేసారా అన్నది నా సందేహం. ఈవిషయంలో పెద్దలను సంప్రదించాలి.

ఇకపోతే, ఈశ్లోకానికి వివరణ ఇవ్వమని మిత్రులు శర్మగారు ఆదేశించారు. అవశ్యం అలా చేయవలసినదే.

ఈశ్లోకం అంతా ముక్తాః అని ఇందులో ఒక ముక్క ఉంది చూడండి, దాని చుట్టూ తిరుగుతుంది. మరి ముక్తాః అంటే ముత్యాలు. మౌక్తికం అంటే సంస్కృతంలో ముత్యం అని అర్ధం. ముక్త అన్నా ముత్యమే. శ్లోకంలో ముక్తా అని విసర్గ లేంకుడా ఉందనుకోకండి. విసర్గ ఉంది కాని సంధికార్యం జరిగి కనబడకుండా పోయింది ముక్తాః తాః అన్నది ముక్తాస్తా అయ్యిందన్నమాట. ఇవి మామూలు ముత్యాలు కావండోయ్. ముత్యాల తలంబ్రాలు. సీతారాముల పెండ్లిలోని ముత్యాల తలంబ్రాలు. ఆ తలంబ్రాల ఘట్టంలో కొట్టొచ్చినట్లు కనిపించిన ఒక సంగతి గురించి ఈశ్లోకం మనకు చెప్తోంది.
 
తలంబ్రాలు అన్న మాటలో‌ తల అన్నది తెలుస్తోంది. కదా జాగ్రతగా చూడండి, చివర్న ప్రాలు అన్నది మరొక మాట కనిపిస్తోంది కదా, ఆ ప్రాలు అంటే ఏమిటీ? ఏమిటంటే బియ్యం. మరి బియ్యం ఎలాగుంటాయీ తెల్లగా కదా. సరే మన యిళ్ళల్లో పెళ్ళిళ్ళైతే బియ్యంతో తలంబ్రాలు పోసుకుంటారు వధూవరులు.
 
కాని రాముడూ‌ సీతా అంటే మనలాంటి సామాన్యులా ఏమిటీ? రాములవారేమో దశరథుడనే‌ మహారాజు గారి కొడుకైతే సీతమ్మ యేమో జనకుల వారనే మరొక మహారాజు గారి కూతురు. ఒక యువరాజూ ఒక యువరాణీ‌ పెండ్లాడుతుంటే మనలాగా మామూలు బియ్యంతో తలంబ్రాలు పోసుకోవటమేం! ఇంచక్కా మంచి ముత్యాలతోనే తలంబ్రాలు పోసుకుంటారు. అవును కదా.

ఆ మంచి ముత్యాలేమో అందంగా తెల్లగా ఉంటాయి. అదీ నిజమే‌ కదా. కాని అక్కడట అవి సీతమ్మ దోసిటలో  ఉన్నప్పుడు  ఎఱ్ఱగా మంచి పద్మరాగాల్లాగా ఉన్నాయట. పద్మరాగాలు అంటే మాణిక్యాలు. అవి చాలా ఎఱ్ఱగా ఉంటాయి కదా. వీటిల్ని రూబీలు అంటార్లెండి ఇంగ్గీషులో.
 
అవునండీ, సీతమ్మవారి దోసిటలో అవి ఎఱ్ఱగా ఉండక తప్పదు కదా, ఆ తల్లి అరచేతులు చక్కగా ఎఱ్ఱగా ఉండటం వలన. శ్లోకంలో కమలామలాంజలిపుట అన్నారు. మామూలు కమలాలు అనగా తామరలు కావు కెందామరలు అంటే ఎఱ్ఱతామరలు. ఈ సమాసంలో ఉన్న అంజలి అంటే దోసిలి అని అర్ధం.

అమ్మ ఆ మంచిముత్యాలని తన ఎఱ్ఱని దోసిటిలో పట్టి రామయ్య శిరస్సు మీదకు వదలింది. అంటే తిన్నగా నెత్తికి చేయి తాకించి కాక కొంచెం పైనుండి పోసిందన్నమాట తలంబ్రాలు. అప్పుడవి చక్కగ కుందప్రసూనాల వలె అనగా మల్లెపూల వలె
స్వఛ్చమైన తెలుపుతో ప్రకాశించాయట.

 ఆ మంచిముత్యాలే రామయ్య నెత్తి మీద నుండి క్రిందికి జారుతున్నప్పుడు ఇంద్రనీలమణుల్లా ఉన్నాయట. ఇంద్రనీల మణుల్ని మనం నీలమణి అంటాం సాధారణంగా. ఇంగ్లీషులో సఫైర్ అంటారు లెండి. అలా ఎందుకైనవండీ అని అనవచ్చును మీరు. సమాధానం సుళువే‌ సుమా. రామయ్య నీలమేఘఛ్చాయ కలవాడు కదా. అందుకే ఆయన శిరస్సుమీద నుండి ఆయన వంటి మీదిగా క్రిందికి జారుతున్నప్పుడు అవే‌ మంచి ముత్యాలు తమాషాగా నీలమణుల్లాగా నల్లగా ఐపోయాయట ఆయన కాయకాంతి అంటే శరీరవర్ణం పొందటం వలన.

ఈశ్లోకంలో మంగళాశాసనం చేస్తూ అటువంటి అద్భుతమైన ఆ సీతారాముల పెండ్లివేడుకలోని ముత్యాల తలంబ్రాలు మీకు శుభాలను ప్రసాదించు కాక అంటున్నారు.

ఈశ్లోకంలో ఈసంగతులు చెప్పటానికి పద్మరాగాయితా, కుందప్రసూనాయితా, ఇంద్రనీలాయితా అంంటూ‌ ఆయితా అన్న శబ్దంతో చెప్పారు కదా, ఈ ఆయితా అంటే ఏమిటీ అంటే సంస్కృతంలో సిధ్ధంగా ఉండటం తయారుగా ఉండటం అన్నమాట. పద్మరాగాయితా అంటే‌ పద్మరాగాలుగా తయారైనవి అని అర్ధం. అంటే మారిపోయినవి అని మన అన్వయం చేసుకోవాలి.
 
పెండ్లిలో ముత్యాల తలంబ్రాలు ఎందుకూ అంటే మనం కారణం ఇప్పటికే చెప్పుకున్నాం మహారాజుల బిడ్దల పెండ్లి కదా అని. అంతే కాదు ఎంతో కొంత మొత్తంలో తలంబ్రాలలో ముత్యాలను కలపటం మంచిది. ముత్యం అనేది అందరికీ మంచిని చేసే గుణం కల రత్నవిశేషం. అందుచేత సామాన్యులమైనా మన యిండ్లల్లో పెండ్లివేడుకలోనూ తలంబ్రాలలో కొన్ని ముత్యాలు కలపటం మంచి ఆచారం.

ఈరోజుల్లో ఐతే నానా చెత్తనూ రంగురంగుల ప్లాస్టిక్ పూసలతో సహా తలంబ్రాలలో కలిపి వాటిని అపవిత్రం చేస్తున్నారు. అందులో చాలావరకూ రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ అని చెప్పనవసరం లేదుగా. రీసైకిల్ అంటే ఆ ప్లాస్టిక్ పూర్వం ఏ తాగిపాడేసిన ప్లాస్టిక్ స్ట్రాలనుండో తినిపారేసిన టిఫిన్ సంచీలనుండో మరే కశ్మలం నుండో చెప్పలేం - అదంతా పెళ్ళికొడుకూ‌ పెళ్ళికూతురూ తలంబ్రాల్లో కలిపి నెత్తిన పోసుకోవట మేమిటీ దరిద్రం‌ కాకపోతే.

పవిత్రమైన మంచి ముత్యాలనే వాడండి తలంబ్రాల్లో కలిపేందుకు. ఆ ముత్యాలు రాములవారి పెండ్లి తలంబ్రాలు అనుకొని ఈశ్లోకాన్ని అనుసంధానం చేసుకోండి. ఆ ముత్యాలు శుభం కలిగించు కాక అని కోరుకోండి.

ఈశ్లోకం ఈపాటికి చక్కగా మీ అందరికీ బోధపడిందని అనుకుంటున్నాను. మరలా మరలా శ్లోకాన్ని మననంచేసుకొని ఆస్వాదించండి దానిలోని సారస్యాన్ని.

శుభం.

9, నవంబర్ 2021, మంగళవారం

ముద్దుముద్దు కోపాల మురళీకృష్ణా

ముద్దుముద్దు కోపాల మురళీకృష్ణా రా
వద్దు వద్దనకురా బాలకృష్ణా

విందుచేయ చెవులకు వేణుగానము మే
మందరము నిను చేరితి మదిలించకు
అందమైన మురళిపాట యదే చాలురా గో
విందుడా మరి యేమీ కోరము నిన్ను

అచ్చరలు మింటనిలచి యాలకించ గొల్ల
మచ్చెకంటులు వినగ వచ్చుట తప్పా
ముచ్చటైన మరళిపాట మురిపెము తీర విన
నిచ్చుటే కాకేమీ నిన్నడుగము

మరియాద కాదనుచు మమ్ము కసరకు నీ
మరువుసొచ్చుటే పెద్ద మరియాదరా
మురళిని వాయించు హరి మోహనాంగుడా నిను
శరణము జొచ్చితి మింక శాంతించరా

5, నవంబర్ 2021, శుక్రవారం

పూలదండ లీయ వస్తివా గోపికా

పూలదండ లీయ వస్తివా గోపికా
మేలుమేలే నిన్ను మెచ్చుకొందును

పూలదండ లీయ వస్తివా గోపికా యీ
పూలన్నీ మీతోట పూవులేనా
పూలన్నీ మాతోట పూవులే కాక యీ
పూలన్నీ నాతలపై పూచినట్టివా

పూలదండ లీయ వస్తివా గోపికా యీ
మాలలన్నీ నీవే చేసినావా
మాలలన్నీ నేను కాక మాయమ్మ చేసెనా
మేలమాడు నందగోపబాల కైకోరా

పూలదండ లీయ వస్తివా గోపికా నీ
వేల పూలు కొప్పులో పెట్టలేదే
పూలన్నీ నిన్ను చేర పుట్టినట్టివే కొన్ని
పూలకు నే నన్యాయము నేలచేతురా


సరసుడవు కావటరా స్వామి

సరసుడవు కావటరా స్వామి నేడు
విరసుడవు కాకు మాకు వేణుగోపాల

నిను గానక ప్రొద్దుబుచ్చ నేరమురా నంద
తనయ గోపబాల యెందు దాగినావురా
వినుత సుగుణజాల రార వేగ వల్లవికాం
గనల తోడ నవ్వుచుండు ఘనుడ రారా

రామనము మేము నీతో రాసక్రీడలకు 
యీమనము నీకు వెన్న లెంతెంతైన
మామననము లిచ్చి నాము మారెంచకుండ
యేమని తలపోసి యలిగి యెందుంటివి

నందవ్రజము లేదుకదా నవనీత చోరుడ
అందగాడ నీవు లేక యశోదాత్మజ
సందడించు మురళితోడ చప్పున రారా
వందనాలు వందనాలు పరమాత్మా





4, నవంబర్ 2021, గురువారం

కృష్ణగీతికలు ప్రారంభం.

శుభోదయం.

ఈరోజునుండి కొత్త శీర్షిక ఒకటి మొదలుపెడుతున్నాను. కృష్ణగీతికలు అన్నపేరుతో. దీని అర్ధం రామకీర్తనలకు మంగళం అని కాదు. అవీ ఇవీ కూడా నడుస్తూ ఉంటాయి.

రామకీర్తనలు ఈనెలకో పైనెలకో  1500 సంఖ్యకు చేరుకుంటాయి. కృష్ణగీతికలు కొత్తగా మొదలౌతున్నాయి కాబట్టి అంచనాలు లేవు. వీలుంటే ఒక వేయైనా వస్తాయనుకుంటాను. ఇది నా పేరాశ కావచ్చును.

మొదటి కృష్ణగీతిక ఈ క్రింది పల్లవితో వెలువడింది.

వెన్నెల వేళలో కన్నయ్యా నువ్విలా
పొన్నచెట్టెక్కి మధుర మురళి ఊదకు

రామకీర్తనలతో పోల్చితే కృష్ణగీతికలు కొంచెం భిన్నత్వాన్ని పాటించవచ్చు లక్షణంలోనూ సరళత్వంలోనూ. రామకీర్తనలు సంకీర్తనసంప్రదాయానికి అనుగుణంగా యతిప్రాసలతో కొంచెం గంభీరమైన భాషతో ఉంటున్నాయి కదా. కృష్ణగీతికల భాష మరింత వ్యవహారశైలిలో ఉండవచ్చు, యతిప్రాసలు ఐఛ్ఛికంగా పాటించబడవచ్చును - ఈవిషయంలో కొంతదూరం సాగితే కాని మరింత స్పష్టత రాదని అనుకుంటున్నాను.

ఒక ముఖ్యవిషయం. కొన్ని కృష్ణగీతికలు రామకీర్తనలుగా కూడా లెక్కించబడే అవకాశం ఉంది.

శ్యామలీయం పాఠకు లందరకూ దీపావళీపర్వదినం సందర్భంగా అనేక శుభాకాంక్షలు.


వెన్నెల వేళల్లో కన్నయ్యా నువ్విలా

వెన్నెల వేళల్లో కన్నయ్యా నువ్విలా
పొన్నచెట్టెక్కి మధుర మురళి యూదకు

నిలిచేనా చెప్పవయ్య నేలమీద మాకాళ్ళు
పిలిచే నీమురళిపాట వినబడితే చెవులకు
ఇలను పతులు సుతు లత్తల నెవ్వరిని గణించక
లలనల నిదె తొందరించురా నీమురళి మహిమ

రామచంద్రుడు పుట్టిన భూమిలో పుట్టాము
రామపత్ని ఆదర్శమురా మాకెప్పుడును
మేము మాయిళ్ళను వదలి యేమని వచ్చేము
రామంటే నీమురళీ రవము రప్పించురా

ఈమురళీ మృదురవమే యెసగ ప్రణవనాదమై
మేమనగ జీవులము నీవేమో దేవుడైతే
నీమనోహరగానమే నిండనీ నలుదెసల
ఆమాట దబ్బర యైతే ఆపరా మురళిని


నారాయణ నీకొఱకే నరుడ నైనాను

నారాయణ నీకొఱకే నరుడ నైనాను
కూరిమితో నిన్ను పొగడుకొనుచు నున్నాను

తల్లిలేక తండ్రిలేక తనవారెవ్వరును లేక
యెల్ల వారలకు నీవే తల్లివి తండ్రివి యగుచు
చల్లగ పరిపాలించెడు నల్లనయ్య నినుపొగడ
తెల్లముగ నేనుంటిని తేజరిల్లుమా

ఎన్ని మార్లు వచ్చితినో యిలకు నిన్ను పొగడగ
ఎన్ని మార్లిక వత్తునో యెఱుగుదు వీ వొకడవే
ఎన్ని నీవెత్తిన రామకృష్ణాద్యవతారముల
సన్నుతించ వచ్చితిని చాలప్రేమతో

ఆలపింతును నీకీర్తి నదియొక ముచ్చట నాకు
ఆలకింతువు నాపాట నదియొక ముచ్చట నీకు
కాలము గడచిన కొలది గడుసుదేరె నాపాట
ఆలకించు నీముచ్చట యతిశయించగా












2, నవంబర్ 2021, మంగళవారం

హరిని భజించవె

హరిని భజించవె హరిని భజించవె హరిని భజించవె మనసా
స్మరుని భజించక నరుల భజించక హరిని భజించవె మనసా

నరులను కొలిచి చెడినది చాలిక హరిని భజించవె మనసా
స్మరునకు దాస్యము చేయుట చాలిక హరిని భజించవె మనసా

సురలను కొలిచి సిరులను వేడక హరిని భజించవె మనసా
సిరులిడి పరమును కొనలేవు కదా హరిని భజించవె మనసా

స్మరుడన ప్రాయము చెడిన విడచునే హరిని భజించవె మనసా
నరునకు ప్రాయము నాలుగునాళ్ళే హరిని భజించవె మనసా

హరేరామ యని హరేకృష్ణ యని హరిని భజించవె మనసా
హరిని భజించుట యందే సౌఖ్యము హరిని భజించవె మనసా

హరిభక్తులకు మోక్షము సిధ్దము హరిని భజించవె మనసా
మరి వేరెవరును మోక్షము నీయరె హరిని భజించవె మనసా

పరమాత్ముడని జగదీశ్వరుడని హరిని భజించవె మనసా
స్మరణాన్ముక్తి కదా కలియుగమున హరిని భజించవె మనసా




అనుమానము నీ కక్కరలేదే

అనుమానము నీ కక్కరలేదే
మనసా రాముడు మనవాడే

సుజనుల నేలే సొంపు గలాడు
కుజనుల నణచే గోవిందుడు
విజయశీలుడు వీరవరేణ్యుడు
నిజముగ రాముడు నీవాడే

త్రిజగద్వంద్యుడు దేవదేవుడు
భజితసురేంద్రుడు పరమాత్ముడు
నిజభక్తజన నిత్యపోషకుడు
నిజముగ రాముడు నీవాడే

పరమమధురమును భవతారకము
నరయగ రామా యను నామము
స్మరియించగదే మరిమరి మనసా
తరియించగదే తప్పకను