రామాయణకీర్తనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రామాయణకీర్తనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, మార్చి 2020, బుధవారం

దశరథునకు కొడుకై తాను రాముడాయె


దశరథునకు కొడుకై తాను రాముడాయె

ప్రశస్తమగు మాయను పన్నినట్టి శ్రీహరి



ఆ రావణు డేమని వరము లడిగినాడు

వారిజభవుడును వల్లెయనంగ

కోరునప్పుడు వాడు కోతులను నరులను

వేరు పెట్టి విడచెను వెఱ్ఱివాడు



అసురవిజృంభణము నణచలేక సురలు

దెసపడి దెసపడి దీనులగుచును

బిసరుహనాభు జేరి విలపించి నంతట

కసిమసంగ దైత్యుని గర్విష్ఠిని



సమయ మెఱిగి రఘువంశ జలధిసోము డగుచు

అమరులకై నిజ మాయనుగొని నరుడై

సమరజయశీలమై సర్వమనోహరమై

అమరువేష మంది యసురు జంప


15, ఫిబ్రవరి 2020, శనివారం

పరబ్రహ్మమే రామభద్రుడై రాగా


పరబ్రహ్మమే రామభద్రుడై రాగా
పరమభక్తు లిదె వచ్చిరి బ్రహ్మాదులు

పరమేష్ఠి మున్నె జాంబవంతుండై యుండెను
హరిసేవకు డగుచు నిలువ ధరాతలమున
పరమశివుడు తాను గాలిపట్టియై జనియించె
పరమరామభక్తు డగుచు పరవశింపగ

దేవశిల్పివిశ్వకర్మ తేజరిల్లె నలుడై
దేవవైద్యులైరి మైందద్వివిద వీరులు
దేవగురుడు తారు డగుచు దిగివచ్చెను ధరణికి
వేవెలుంగు సుగ్రీవ కపీంద్రుడాయెను

ధనేశుడును గంధమాదనుడుగా నరుదెంచె
జనియించెను సుషేణుడై ఘనుడు వరుణుడు
జననమందె పర్జన్యుడు శరభుడను వీరుడై
అనవద్యులు వీరందరు హరికి తోడైరి

6, జనవరి 2020, సోమవారం

తామసుడు మాయన్న నుండి

తామసుడు మాయన్న నుండి దయతొ నన్ను గాచినావు
రాముడా ప్రియమిత్రుడా నను రాజుగా నొనరించినావు

కపివర సుగ్రీవ నేనన నృపతిధర్మము నెరపినాను
శపధ మొక్కటి కలదు నాకు శరణుజొచ్చిన కాచితీరుదు
కుపధవర్తను లైన వారల గొట్టు టన్నది రాజధర్మము
చపలచిత్తము లేక నీవును చక్కగా నీరాజ్యమేలుము

మిత్రుని క్షేమంబు గోరుట మిత్రధర్మము లోక మందున
మిత్రు నభ్యుదయము గోరుట మిత్రధర్మము లోక మందున
మిత్రు డర్ధించినది చేయుట మిత్రధర్మము లోక మందున
మిత్రధర్మము నెరపినాడను మీదు మిక్కిలి యేమి సేసితి

రామ జయజయ వాగ్విదాంవర నీమనోరధ మేనెరుంగుదు
భూమికన్యక జాడలరయగ నామహాసైన్యంబు గలదు
శ్యామసుందర నాల్గు దిక్కులు చక్కగా జల్లించ గలదు
ఆ మహాసాధ్వియును నీవును నవని నంతయు నేలగలరు

రామలక్ష్మణు లార రమ్యగుణశాలు లార

రామలక్ష్మణు లార రమ్యగుణశాలు లార
యీ మహానుభావులు విశ్వామిత్రులు

వీరి పాదకమలములకు వినయముతో మ్రొక్కుడు
వీరి యాశీర్వాదములు విజయసోపానములు
వీరు మీ కభ్యుదయము కోరి వచ్చి  యున్నారు
మీరు వీరి వెంట జని వెలయించుడు యాగరక్ష

ఇన్నాళ్ళును తండ్రి వెనుక నున్న చిన్ని కుఱ్ఱలై
యున్నవార లిరువురు భయ మన్నదే యెఱుగరు
జన్నమును రక్షించగ జనుచు నున్నారు మీరు
కన్నతండ్రు లార తపసి కటాక్షమును బడయుడు

కామరూప కామగమన ఘనవిద్యలు కలవారిని
యేమాత్రము లక్షించక యీసడించి రాకాసుల
మీ మార్గణముల ధాటి మెరయించి సమయించి
యీ మహానుభావు మెప్పు నిపుడు మీరు బడయుడు

శ్రీరస్తని సతము శుభాశీశ్శు లొసగు వశిష్ఠులు

శ్రీరస్తని సతము శుభాశీశ్శు లొసగు వశిష్ఠులు
మీరు మా పురోహితులు మిగుల గూర్చు వారు

పరమపావనము సూర్యవంశ ముందు నేను పుట్టి
యరువది వేలేండ్లుగా నవని నేలుచున్న వాడ
పరమాత్ముని దయ యిది యనుచు భావించు వాడ
పరమవృధ్ధుడను నేను వ్రాలుచున్న సూర్యుడను

సురలు పొగడ విక్రమము చూపి పేరు తెచ్చుకొంటి
సురలు మెచ్చ ధర్మమును శోభ లీనగ జేసితి
హరికి కరుణ యేల రాదాయెనో యెరుగనయా
పరమునిచ్చు సుపుత్రుని బయడనైతి మహాత్మా

ఇనకులాబ్ధి సోముడై యిందువదనుడై సుజన
మనఃకాము డగుచు సర్వమంగళాకారు డగుచు
మనసును చల్లన జేయు మంచి కొడుకు కలుగగా
ననుగ్రహము చూపి దశరథుని ధన్యుని చేయరే

1, జనవరి 2020, బుధవారం

వీ డన్నకు ప్రాణమైన వాడు


వీ డన్నకు ప్రాణమైన వాడు మా  లక్ష్మణుడు
వీడు నాకు ప్రాణమైన వాడు రాముడు

మునివర వీ రిరువురు మీ ముందు నిలచి యున్నారు
వినయశీలురైన బాలవీరులు వీరు
వనములకు వచ్చి మీ సవనమును రక్షించుటకు
ఇనకులాలంకారుల ననుమతించుడు

నేల మీద నడచుచున్న నిండుచందమామలను
చాల సుగుణవంతుల మీచరణయుగళిపై
చాల భక్తి తోడ నేను సమర్పణము చేసితినిదె
యేలు కొనుడు మీ సొమ్ము లీబాలకులు

వరయజ్ఞఫలము లనగ ప్రభవించిన బాలురను
వరయజ్ఞరక్షణకై పంపుచుంటిని
పరమసంతోషముతో పంపుచుంటి నాబిడ్డల
వరమునీంద్ర మీదే యిక భారమంతయు

27, డిసెంబర్ 2019, శుక్రవారం

ఎంత చక్కని వాడంటే యేమి చెప్పేదమ్మా


ఎంత చక్కని వాడంటే యేమి చెప్పేదమ్మా
యింత చక్కని మగవాడీ యిలలో నిత డొకడే

చారెడేసి కన్నులు గల సాకేతయువరాజు
వీరుడంటే వీరుడమ్మా విరచెను శివధనువు
నోరారా సభలోని వారెల్లరు పొగడ
భూరిభుజుడు సిగ్గున తలమునకలాయె నమ్మ

రాజుగారు భుజము తట్టి రామచంద్ర నీకు
మా జానికి నిత్తు నంటె మరియు సిగ్గు పడుచు
భూజాని తండ్రి యాజ్ఞ పొందవలయు నాకు
మా జనకుల నడుగుడనుచు మరియాదగ పలికె

మదనుడైన వీనికే మాత్రమును సరికాడు
మదనకోటి సమగాత్రుడొ మన రామచంద్రుడు
మదనునకే యబ్బయో మనము చెప్పలేము
మదనాంతకు విల్లువిరచి ముదిత నీకు దక్కె

22, డిసెంబర్ 2019, ఆదివారం

వీడు రాచవారి బిడ్డ వీడు నా శిష్యుడు


వీడు రాచవారి బిడ్డ వీడు నా శిష్యుడు
వీడు యజ్ఞవిరోధుల పీచమడచు నేడు

ఘనమైన సూర్యకుల క్షత్రియు డీబాలుడు
మన దశరథుని యింటి మణిదీపము రాముడు
ఘనుడు బ్రహ్మర్షి వసిష్ఠునిచే సుశిక్షితుడు
పనిబట్టు రావణుని యనుచరుల నిప్పుడు

బాలుడీ రాముడన పరమసుకుమారుడు
పౌలస్త్యు నెదిరింప జాలువా డెటులగును
కాలమేఘాకృతుల గడ్డురాకాసులతో
నేలాగు పోరువా డెఱుగలేకున్నాము

ఇతడితో ననబోకు డితడు రావణు జంప
ప్రతిన చేసి వచ్చిన భగవంతుడు శ్రీహరి
నుతమతి మాయామానుషవిగ్రహుడై నాడు
అతిత్వరలో నసురుల యతిశయంబు నణచును



16, డిసెంబర్ 2019, సోమవారం

ఎవడవురా హరుని విల్లిట్టే విరచినావట


ఎవడవురా హరుని విల్లిట్టే విరచినావట
రవికులోద్భవుడ నన్ను రాము డందురు

హరు డెవ డనుకొంటివిరా యపచారము చేసితివి
హరదేవున కతిభక్తుడ నయ్యా పరశురామ
హరభక్తుడ వైన నీవు హరుని విల్లు విరతువా
విరచితినా యెక్కుపెట్ట విరిగె నంతే కాని

హరచాపము నెక్కుపెట్టెడు నంతటి భుజశాలివా
హరిచాపం బిదె యెక్కిడి శరమును సంధించుమా
హరిచాపము నెక్కిడితిని శరము నిదే సంధించితి
పరశురామ శరమెక్కడ వదలమందు వయ్యా

పరశురామునకు గర్వభంగం మొనరించితివి
శరమున నాపుణ్యమెల్ల క్షయము చేసెదవు గాక
వరవిక్రమ రామచంద్ర పురుషోత్తమ హరిసన్నిభ
స్థిరమగును నీ కీర్తియు సీతారామ సెలవు

7, డిసెంబర్ 2019, శనివారం

సీతమ్మ నపహరించిన రావణు జంపె


సీతమ్మ నపహరించిన రావణు జంపె
కోతులె తన సైన్యముగ  కోదండరాముడు

రూపుగట్టిన ధర్మమగు లోకేశుడు రాముడు
లోపరహితశాంతస్వరూపుడౌ రాముడు
కాపురుషుల కెల్లపుడు కాలుడైన రాముడు
పాపాత్ముని చెఱ నుండి కాపాడగ సతిని

ఖ్యాతికెక్కిన దివ్యపరాక్రమము గల రాముడు
చేతలలో దొడ్డవాడు సీతారాముడు
నాతి బహిఃప్రాణమైన నయనాభిరాముడు
చేతోమోదమును గూర్చ చేడియ కపుడు

అపవర్గప్రదుండైన హరియగు శ్రీరాముడు
అపకర్ముల దుర్మార్గము లణచు రాముడు
ప్రపన్నుల కభయమిచ్చు వాడైన రాముడు
విపన్నయౌ నిజసతికి వేదన మాన్ప

22, అక్టోబర్ 2019, మంగళవారం

శ్రీరామ లక్ష్మణులకు సీతమ్మ వారికి


శ్రీరామ లక్ష్మణులకు సీతమ్మ వారికి
నారచీర లందించె కూరిమితో కైక

మందస్మితవదనుడై మహాప్రసాదం బని
యందుకొని రఘునాథు డంతలో ధరించె
నందుకొని బుసబుసల నణచుచు కట్టుక చే
నంది విల్లు లక్ష్మణు డన్న వంక జుచె

చీర నందుకొని యంత చిన్నబోయి నిలబడె
నే రీతిని దాల్చుటో యెరుగని సీతమ్మ
శ్రీరామచంద్రు డంత చీరగట్ట సుదతికి
భోరుమనె నంతిపురి భోరుమనె రాజు

చల్లబడ్డవా నీ కళ్ళిప్పు డనె రాజు
చల్లబడు లోకమిక సత్య మనెను కైక
తల్లివి రాముని దయదలచవే యనె రాజు
తల్లిని కొడుకు మేలు తలచితి ననె కైక

21, సెప్టెంబర్ 2019, శనివారం

అందరను పట్టు మాయ


అందరను పట్టు మాయ యచ్చెరువుగ గో
విందునితో పలుకాడు విధము జూడుడు

నరుల సురాసురులను సరకుగొన కుందును
పరమేష్టిని కూడను పట్టుకొన నేర్తును
హరుని నీయాన బట్టి నట్టిదియు నుకలదు
పరమాత్మ నీవిచ్చిన ప్రభావంబు వలన

నన్ను పట్టవుగ యని నవ్వగ మాధవుడు
మన్నించు మని పలికె మాయ తానంతట
నన్నును పట్టవలెను నరుడనై రావణు
మన్నుజేయగ ధరను మసలు నాడనె హరి

నరునిగ నిన్ను నీవు మరచితే నెటులన
మరచియును రావణుని మట్టుబెట్టెద ననె
వరము నాకిడితి వని పలికి మాయె చనెను
హరియును శ్రీరాముడై ధర నవతరించెను

సీతా ఆ రాకాసులు చెడ్డవారోయి


సీతా ఆ రాకాసులు చెడ్డవారోయి
ఐతే కావచ్చు వైర మవసరగునా

వారు ఋషుల కందరకు భయకారకులు
వారు ఋషుల జన్నములు భంగపరతురు
వారు ధర్మవిరోధులై వర్తించుటను
వారిజాక్షి వారు నాకు వధ్యు లగుదురు

ఇక్ష్వాకుల భూమి యిది యిగురుబోడి
ఇక్ష్వాకుల కులధర్మము హింసనణచుట
ఇక్ష్వాకుల ప్రతినిధిగ నిచట నుంటిని
ఇక్ష్వాకుల కోడలా యిదియె ధర్మము

విడచెదను లక్ష్మణుని విడచెద నిన్ను
విడచెదనా ప్రాణమును విదేహపుత్రి
విడువ నార్తులను రఘువీరుడ నేను
పుడమి మీద నా ప్రతిన చెడక నిలచును



20, సెప్టెంబర్ 2019, శుక్రవారం

చల్లచల్లని వెన్నెలలో తెల్లతెల్లని పిల్లొకతె


చల్లచల్లని వెన్నెలలో తెల్లతెల్లని పిల్లొకతె
మెల్లమెల్లగ విహరించె నల్లనల్లన నవ్వులతో

అల్లనల్లన నవ్వులతో పిల్ల విహరించుచు నుండ
తెల్లవారితే పెండ్లంటే పిల్లకు నిదురే రాదంటూ
పెళ్ళిపీటలపై రేపు పిల్ల నిదురించే నంటూ
పిల్ల చెలికత్తియ లంత సల్లాపంబుల సేయగను

పిల్లను పెండ్లాడే వాడు వెన్నెల వేడికి వగచుచును
అల్లడిగో ఆ విడిదింటి నంటి యుండిన తోటలో
తెల్లవారే దెపుడనుచు తెరలుచు నున్నా డావంక
చల్లని రేడా చంద్రుడును సాగుచుండె మెల్లగను

నల్లనల్లని వాడంట కళ్ళు కలువరేకులట
విల్లువిరిచిన వాడంట వీరుడి పేరు రాముడట
ఎల్లరు మెచ్చిన వాడంట పిల్లకు నచ్చిన వరుడంట
పిల్ల పేరూ సీతంట పిల్లకు రేపే పెండ్లంట

14, సెప్టెంబర్ 2019, శనివారం

కాలాగ్ని యొకటి నిన్న కాల్చి చన్నది


కాలాగ్ని యొకటి నిన్న కాల్చి చన్నది అయ్యో
కాలమేఘ మొకటి నేడు క్రమ్ముకున్నది

రాజు మంచి వాడైన రాజ్యము సుభిక్షము
రాజు విషయవశుడైన రాజ్యము చెడును
ఆ జానకిని దెచ్చి యవివేకివైతివి
ఓజ నిదే రామమేఘ ముత్సహించి క్రమ్మెను

దూడ లాబోతులాడు దొమ్మిని జచ్చు
నేడు నీవు రాముడును నిలచి పోరగ
జూడగ  లంకావాసులకు జావగును
రేడా అదిగదిగొ క్రమ్మె శ్రీరామమేఘము

భూవలయము నందు పెద్ద పోటుమగడవు
రావణా లంక నెట్లు రక్షింతువో యింక
నీ విపదంబురాశి నీదు నుపాయమును
నీ వెటుల జేయుదువో నీదె సుమ్ము భారము

9, సెప్టెంబర్ 2019, సోమవారం

ఆటలాడే బాలునకు అందమైన బొమ్మవిల్లు


ఆటలాడే బాలునకు అందమైన బొమ్మవిల్లు
గోట బుగ్గ మీటి యిచ్చి గోముగ కైకమ్మ పలికె

భూమిని విలుకాండ్ర లోన రామచంద్రు డధికు డని
రామబాణ మెపుడు ధర్మ రక్షణము చేయు నని
మేము విందుము రేపొమాపో మేనులు పులకించగ
రామ నా ముద్దుల కొడుక రారా విల్లెక్కుడు మని

భూమిపైన రాకాసులు భూరిసంఖ్యలో నున్నారు
రామబాణములకు వారు రాలిపడెడు రోజువచ్చు
భూమిజనులకు నీవు రక్ష పొలుపుగ చేకూర్చగలవు
రామ నా ముద్దుల కొడుక రారా విల్లెక్కుడు మని

శ్యామలాంగ చిన్నివిల్లు చక్కగ పైకెత్త వయ్య
కోమలాంగ రేపు గొప్పగొప్ప విండ్లెత్త గలవు
తామసుల పీచమణచి తాపసుల కావగలవు
రామ నా ముద్దుల కొడుక రారా విల్లెక్కుడు మని

24, జూన్ 2019, సోమవారం

విల్లెక్కుపెట్టు మంటె విరచితి వయ్యా


విల్లెక్కుపెట్టు మంటె విరచితి వయ్యా ఓ
నల్లనయ్య యిది యేమి యల్లరయ్యా

ఎన్నో తరాల నుండి యెనలేని యీ విల్లు
మన్నికగ నున్నదయ్య మాయింటి లోన
ఎన్నెన్ని పూజలందు కొన్నదో యీవిల్లు
చిన్న వాడ వెరుగవుగ శ్రీరామ చంద్రుడా

రేపు దేవతలు వచ్చి కోపగించెద రేమో
మీ పెద్దల కిచ్చినది మేలైన విల్లే
ఆపురారి పెనువిల్లే అపురూపమైనదే
యే పగిదిని పిల్లవాని కిచ్చినా వందురే

పూని యీ విల్లెత్తిన పురుషోత్తముడ వీవే
తానిది మున్నెత్తెను మా తనయ సీత
మానితమౌ ధనువు మిమ్ము మన్నించె నీరీతి
కాన నీకు సీత నిత్తు కాదన రాదయ్యా

12, ఫిబ్రవరి 2019, మంగళవారం

మాయావీ రావణా మాయలకే మాయ


మాయావీ రావణా మాయలకే మాయ హరి
మాయ నిన్ను పట్టిన మాట యెఱుగవే

వరమడిగెడు వేళ నరుల వానరులను విడచి
గరువముతో పలుకాడితివో
సరిసరి హరి నరుడై నిను చంపవీ లగునని
హరిమాయ నిన్నట్లడిగించెను

నీవేదో మాయపన్ని నేరుపు జూపింంచి
శ్రీవిభునే వంచించితివా
నీ వెఱ్ఱియేకాని నీవు మాయచేయుటేమి
ఆ విష్ణుమాయకే యగ్గమైతివి

కాలుడేమొ నలువమాట కాదనక విడచిన
కాలుని గెలిచిన ఘనతతోచ
కాలాత్మకుడైన హరి కకుత్స్థ రాముడైన
నేలాగు హరిమాయ యెఱుగనిచ్చు

30, జనవరి 2019, బుధవారం

సీతజాడ గోదావరి చెప్పదేమి లక్ష్మణా


సీతజాడ గోదావరి చెప్పదేమి లక్ష్మణా
యే తీరున మాటలాడు నీనది శుభచరితుడా

నీటికొరకు వచ్ఛియన్న నిశ్చయముగ తెలియదా
యేటికి నా సీతజాడ యేమందువు లక్ష్మణా
పాటించుట మౌనమును పాడిగామి యెరుగదా
యేటికి నిర్దయను బూని యిటులున్నది లక్ష్మణా

ప్రీతిగల యక్క రఘువీరుల కీ గోదావరి
ఖ్యాతిగల కులవధువు గతి చెప్పదు లక్ష్మణా
చేతులు జోడించితే చెప్పునేమొ గోదావరి
చేతులిదే జోడించితి చెప్పు మనుము లక్ష్మణా

సీత నేడు రాకాసుల చేజిక్కుట చూచినదా
నాతో వచియించుటకు భీతిగొనెనొ లక్ష్మణా
ఈ తల్లికి తెలుపవే యితడు విష్ణుతేజుడని
సీతను రక్షించునని చెప్పు మనుము లక్ష్మణా

26, జనవరి 2019, శనివారం

వాడెమో రాకాసి వీడేమో వెన్నుడు


వాడెమో రాకాసి వీడేమో వెన్నుడు
వేడుకగా సాగినది వింతముచ్చట

వాడు వచ్చె వీడు కొట్టె వాడు తూలి వనధిజొచ్చె
వాడిబాణమేల విడిచె వాని జంపక
వాడితోడ వచ్చినట్టి వాడు కాలి బూడిదాయె
చూడ తూలిపడినవాడు చుట్టమాయెనా

వాడు మరల వచ్చినాడు వీడు వాని జూచినాడు
వాడిగలవి వేసినాడు మూడుశరములు
వాడు మూడుబాణములకు కూడ దొరుక డేమివింత
వీడు వాని తరిమికొట్టి విడచిపెట్టెనా

లేడిరూపు దాల్చినాడు వాడు తిరిగి వచ్చినాడు
వాడు రామకథను ముఖ్య పాత్రధారి
వీడు వాని జంపె కాని విడచె నేల రెండు మార్లు
చూడ వెన్నుడల్లినట్టి సొంపగులీల