6, జనవరి 2020, సోమవారం

తామసుడు మాయన్న నుండి

తామసుడు మాయన్న నుండి దయతొ నన్ను గాచినావు
రాముడా ప్రియమిత్రుడా నను రాజుగా నొనరించినావు

కపివర సుగ్రీవ నేనన నృపతిధర్మము నెరపినాను
శపధ మొక్కటి కలదు నాకు శరణుజొచ్చిన కాచితీరుదు
కుపధవర్తను లైన వారల గొట్టు టన్నది రాజధర్మము
చపలచిత్తము లేక నీవును చక్కగా నీరాజ్యమేలుము

మిత్రుని క్షేమంబు గోరుట మిత్రధర్మము లోక మందున
మిత్రు నభ్యుదయము గోరుట మిత్రధర్మము లోక మందున
మిత్రు డర్ధించినది చేయుట మిత్రధర్మము లోక మందున
మిత్రధర్మము నెరపినాడను మీదు మిక్కిలి యేమి సేసితి

రామ జయజయ వాగ్విదాంవర నీమనోరధ మేనెరుంగుదు
భూమికన్యక జాడలరయగ నామహాసైన్యంబు గలదు
శ్యామసుందర నాల్గు దిక్కులు చక్కగా జల్లించ గలదు
ఆ మహాసాధ్వియును నీవును నవని నంతయు నేలగలరు