16, జనవరి 2020, గురువారం

కలలో నైనా యిలలో నైనా


కలలో నైనా యిలలో నైనా కలరా వేరొక రెవరైనా
తలచుట కైనా వలచుట కైనా దశరథరాజకుమారా

భూమికి వచ్చిన తొలనాళ్ళను నా బుధ్ధియె పెడదారినిపోయె
నీ‌మాటయె నే మరచి యుంటి నది నిక్కముగా నా తప్పేను
ఈమాయామయ లోకంబున నే నెంతటి తెలివిడి గలవాడ
రామా నను దారికి తెచ్చితివి రక్షించితివని మురిసితిని

నిజము వచించితి నీయాన ఇక నీవు నమ్మితే అది చాలు
ఋజువులు సాక్ష్యము లెందుకయా నా నిజతత్త్వము నీ వెఱుగుదువే
విజయరామ బహుకాలముగా నీ వెనుకనె తిరుగుచు నుంటిగదా
అజాపజా లేకుండ దాగెదవు అన్యాయం బిది రామయ్యా

నను సామాన్యుని నీదాసునిగ నొనరించుకొని నిత్యమును
కనుసైగలలో నన్నుంచుకొని కాపాడెడు నా రామయ్యా
నిను కనలేక నేనెటు లుందును నీ వెఱుగనిదా రామయ్యా
మనవిని విని నను మన్నించి యిక మఱుగుపాటు విడనాడవయా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.