30, మార్చి 2020, సోమవారం

మంత్ర మిదే మంత్రము మహిమాన్విత మంత్రము


మంత్ర మిదే మంత్రము మహిమాన్విత మంత్రము

మంత్రసప్తకోటి తలమానిక మగు మంత్రము



అభయ మిచ్చు మంత్రము ఆర్తిదీర్చు మంత్రము

ఉభయ లోకముల యందు కీర్తినిచ్చు మంత్రము

విభవమిచ్చు మంత్రము విద్యలిచ్చు మంత్రము

సభల యందు నీకెపుడు జయము నిచ్చు మంత్రము



అతిసులభ మంత్రము అందమైన మంత్రము

సతతముపాసింప దగిన సత్యమైన మంత్రము

ప్రతిలేని మంత్రము పావనమగు మంత్రము

అతులితైశ్వర్యముల నందించెడు మంత్రము



కోరదగిన మంత్రము  కొంగుబంగరు మంత్రము

ఘోరభవారణ్యమున దారిచూపు మంత్రము

నారాయణ మంత్రము నమ్మదగిన మంత్రము

శ్రీరామ రామ యను శీఘ్రఫలద మంత్రము


28, మార్చి 2020, శనివారం

చాలదా యేమి యీ చక్కని మంత్రము


చాలదా యేమి యీ చక్కని మంత్రము

మేలైన మంత్రము మేలుచేయు మంత్రము



మునులుమెచ్చు మంత్రము జనులుమెచ్చు మంత్రము

మనసున్న వారెల్ల మదినెంచు మంత్రము

తనివార ధ్యానించ దగినగొప్ప మంత్రము

వనజాక్షి జనకజకు ప్రాణమైన మంత్రము



బ్రతుకు నిచ్చు మంత్రము పావనమగు మంత్రము

చతురాస్య నుతమైన చక్కనైన మంత్రము

మెతుకు నిచ్చు మంత్రము వెతలుదీర్చు మంత్రము

అతులితైశ్వర్యముల నందించు మంత్రము



పావనమగు మంత్రము ప్రతిలేని మంత్రము

భావించు వారి కపవర్గమిచ్చు మంత్రము

పావనికి ప్రాణమై వరలునట్టి మంత్రము

దేవుడు శ్రీరాముని దివ్య నామ మంత్రము



ఇత డెవ రందు వమ్మా యితడే రాముడు


ఇత డెవ రందు వమ్మా యితడే రాముడు

యితడే రాము డంటే యితడే శ్రీహరి



ఇతడే శ్రీహరి యైతే యితడి చక్ర మేది

యితడి చక్ర మేదమ్మా యితడి శంఖమేది

యితడి గదానందకంబు లెందున్నవమ్మా

చతురుడై యవి దాచి చనుదెంచెనా



చనుదెంచెనమ్మ హరి జానకీరాముడై

మనుజు డైన కాని  రావణుని జంప రాదని

కనవమ్మ యదే గగనఘననీల వపుషము

మన శ్రీహరి రాముడై మహి నవతరించెను



అవతరించెనా ఓహో హరి శ్రీరాముడై

ధవళాక్షు డితడు సర్వదైత్యజాతి నణచ

అవునవును సురలు నరులు నందరును మెచ్చగ

భువి నేలె హరి రామభూమీశుడై





భజభజ మానస పావనమంత్రం


భజభజ మానస పావనమంత్రం

విజయరామ మంత్రం



నారకశిక్షావారకమంత్రం

వారిజభవసంభావిత మంత్రం

ఘోరభవార్ణవ తారకమంత్రం

నారాయణ శుభమంత్రం



సీతాసాధ్వీసేవిత మంత్రం

వాతాత్మజసంభావిత మంత్రం

భూతనాథసంపూజిత మంత్రం

దైతేయాహిత మంత్రం



సురగణసేవిత శోభన మంత్రం

వరముని జన సంభావిత మంత్రం

నిరుపమమహిమాన్విత హరిమంత్రం

పరమపదప్రద మంత్రం


26, మార్చి 2020, గురువారం

ధనుర్వేదమే యౌపోసనము పట్టినావు


ధనుర్వేదమే  యౌపోసనము పట్టినావు

నిను మించిన వాడు లే డన మించినావు



విల్లుచేత బట్టితివి విపినములు చేరితివి

చిల్లరరాకాసుల చెండాడి నిలచితివి

చల్లగా విశ్వామిత్రు సవనమును కాచితివి

నల్లవాడ కౌసల్యానందనా దాశరథి



పెద్దవిల్లు విఱచితివి పెండ్లిపీట లెక్కితివి

పెద్దకనుల జానకికి పెనిమిటి వీవైతివి

సద్దుచేయు జామదగ్ని సందడి నణచితివి

ముద్దు కుఱ్ఱడా ఓ మోహనాకారుడా



ఘన విష్ణుకోదండమున రాక్షసాళిని

మొనలనేసి కైకసి పుత్రుని జంపితివి

వనజసంభవుడు శివుడు వచ్చి నిన్ను పొగడగ

ఘనతకెక్కి నావో కమలాయతాక్షుడా


24, మార్చి 2020, మంగళవారం

దారిచూపే దైవమా దశరథాత్మజా


దారిచూపే దైవమా దశరథాత్మజా నిన్ను

చేరు దారి యొకటి వేగ చెప్పవేమయా



కొందరేమో వైరాగ్యమున కూడియుండు నట్టి వారు

చెందుదురు నిన్ననుచు చెప్పుచుందురు

ముందు నాకా వైరాగ్యము బోధచేసే వారెవ్వరు

కందు వెఱుగు నీవే చెప్ప గలవుగా దారి



జ్ఞానసంపన్నులకు బాగుగాను తెలియవచ్చు నండ్రు

మానవులకు నిన్ను చేరు మంచిదారులు

జ్ఞానమిది యజ్ఞానమనుచు పూని బోధించే దెవ్వరు

నేనెఱుగ నట్టి ఘనుల నీవు చెప్ప వలయు దారి



యుక్తి యొక్క టున్న దదియు ఓహో నాబోంట్ల కైన

యుక్తమై యుండు ననుచు  నొక్కమాటను

భక్తిమార్గమును గూర్చి బాగుగాను వినుచునుందు

భక్తుడనే గనుక చూపవయ్య నాకు దారి నింక


19, మార్చి 2020, గురువారం

మంచిమాట పలుకవే మనసా ఓ మనసా



మంచిమాట పలుకవే మనసా ఓ మనసా

మంచివాడు రాముడని మరువకే మనసా


ఇద్దరినద్దరిని రాము డేగతియను మనసా

పెద్ధలలో పెద్ద రామ విభుడనవే మనసా

పెద్దలిచ్చు దీవనలే ముద్దుకదా మనసా

హద్దులేదు రామునికృప కనవే ఓ మనసా


రామనామ మెపుడు మరువ రాదనవే మనసా

రామసేవ నెపుడు విడువ రాదనవే మనసా

రామభక్తసమాగమము రంజనవే మనసా

రామవిరోధుల చెలిమి రద్దనవే మనసా


రామున కన్యులను తలప రాదనవే మనసా

రాము డొకడె త్రిలోకారాధ్యుడనవె మనసా

రామపదము లందు నిలచి రంజిల్లవె మనసా

రాముడే మోక్షసామ్రాజ్యమిచ్చు మనసా


అతడి పేరు రాము డంట అమితసుకుమారు డంట


అతడి పేరు రాము డంట  అమితసుకుమారు డంట

ప్రతిలేని వీరు డంట అతని గంటిరే



సితతామరసాక్షు డంట జీమూతశ్యాము డంట

ధృతిని మేరుగిరి యంట దురితనాశకుం డంట

సతతశాంతమూర్తి యంట సకలమౌనినుతు డంట

అతిమథురవచను డంట అతని గంటిరే



సమరవిజయశీలి యంట సదాసత్యవ్రతు డంట

విమలధర్మచరితు డంట వీరలోకనుతు డంట

సుమశరసన్నిభు డంట కుమతిజనకాలు డంట

అమితగుణశాలియంట అతని గంటిరే



చిరునగవుల వా డంట వరదీర్ఘభాహు డంట

పరమదయాశాలి యంట పతితపావనుం డంట

గురుమఖరక్షకు డంట కోదండపాణి యంట

హరధనుఛ్ఛేత్త యంట అతని గంటిరే


18, మార్చి 2020, బుధవారం

భావించ వలయును పరమపూరుషుని



భావించ వలయును పరమపూరుషు నొరుల

భావించి సాధించు ప్రయోజనము లేదు



పలుమాట లెందులకు పరమపురుషు రాముని

తలపులలో నుంచుకొన్న తనకు చాలదా

తలపులు భోగాశల తగుల దుర్జనులను

కొలిచి యాపదలలో కూరుకు పోనేల



పలుచేత లెందులకు  పరమపురుషు రాముని

అలయక సేవించుకొన్న నదియె చాలదా

పలుగాకులను గొల్చి పనులు వారికి జేసి

కలతపడుచు జన్మచక్రమమున నుండనేల



పలుజన్మ లెందులకు  పరమపురుషు రాముని

వలచి జీవించితే భవము లుడుగవా

సులభుని విడనాడి పురే క్షుద్రులభావించి

కలగుచు పలుయోనుల కలిగి మలగ నేల


చక్రము శంఖము చక్కగా డాచి


చక్రము శంఖము చక్కగా డాచి

విక్రమించ వచ్చెనే వెన్ను డిప్పుడు



రాముడై జగదభిరాముడై మునిమనః

కాముడై యినకుల సోముడై యిదే

పాముపడకను వదలి వచ్చెనే లెస్సగా

భూమి మీదకు రణభూమి మీదకు



కాముని జనకుడు కామారి వినుతుడు

భూమీశుని కొడుకై భూమిజ మగడై

రాముడై కోదండరాముడై వచ్చెనే

భూమి మీదకు రణభూమి మీదకు



పాములపుట్టపై పక్షీంద్రుని కైవడి

దోమటి సురవిరోధులపై నిదే

రాముడై దూకెనే చాల యుద్రేకియై

భూమి మీదకు రణభూమి మీదకు


దశరథునకు కొడుకై తాను రాముడాయె


దశరథునకు కొడుకై తాను రాముడాయె

ప్రశస్తమగు మాయను పన్నినట్టి శ్రీహరి



ఆ రావణు డేమని వరము లడిగినాడు

వారిజభవుడును వల్లెయనంగ

కోరునప్పుడు వాడు కోతులను నరులను

వేరు పెట్టి విడచెను వెఱ్ఱివాడు



అసురవిజృంభణము నణచలేక సురలు

దెసపడి దెసపడి దీనులగుచును

బిసరుహనాభు జేరి విలపించి నంతట

కసిమసంగ దైత్యుని గర్విష్ఠిని



సమయ మెఱిగి రఘువంశ జలధిసోము డగుచు

అమరులకై నిజ మాయనుగొని నరుడై

సమరజయశీలమై సర్వమనోహరమై

అమరువేష మంది యసురు జంప


17, మార్చి 2020, మంగళవారం

ఏమి చేతుర లింగ ఏమి చేతుర -- తత్త్వ గీతం.


ఏమి  చేతుర లింగ ఏమి చేతుర
ఏమి  చేతుర లింగ ఏమి చేతుర

గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేద మంటే
గంగ నున్న చేప కప్ప ఎంగిలంటున్నాది లింగా
మహానుభావా మహదేవ శంభో మా లింగమూర్తీ

అక్షయావుల పాడి తెచ్చి అర్పితము చేద మంటే
అక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాది లింగా
మహానుభావా మహదేవ శంభో మా లింగమూర్తీ

తుమ్మి పూవులు తెచ్చి నీకు తుష్టుగా పూచ్చేద మంటే
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా
మహానుభావా మహదేవ శంభో మా లింగమూర్తీ

ఈ పాటను బాలమురళి అద్భుతంగా గానం చేసారు. ఆయన గొంతులో యీ తత్త్వాలన్నీ గొప్పగా ఉంటాయి వినటానికి.

తత్త్వాలలో కొట్టవచ్చేటట్లు ఉండే ఒక గుణం ఏమిటంటే వాటిలో భాషాశుధ్ధికి కొంచెం తక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

చేతు కోతు ఇత్యాదులు తప్పు ప్రయోగాలు. వ్యాకరణం ఒప్పదు మరి.

కాని ఈపాటలో చేతురా అన్న ప్రయోగం ఉంది. ఇంకా అనేక తత్త్వాల్లోనూ ఇలాంటి వ్యాకరణ విరుధ్దమైన ప్రయోగాలు బహుళంగా కనిపిస్తాయి.

దీనికి పెద్ద కష్టపడి కారణం వెదుక నక్కర లేదు. ఈ తత్త్వాలను పాడే వారు ఎక్కువగా దేశద్రిమ్మరులైన సాధువులు. వాళ్ళలో ఎక్కువ మంది వేరే వాళ్ళు పాడుతుండగా విని నేర్చుకొని పాడిన వారే, పాడేవారే.

ఏ తత్త్వగీతం మూలప్రతి ఐనా ఎవరో ఒక కవి శుధ్ధంగా వ్రాసి ఉండవచ్చును. ఆ కవి కూడా ఒక దేశద్రిమ్మరి గోసాయి కావటానికి బోలెడు సావకాశం ఉంది.

అతడి నుండి ముఖతః విని నేర్చుకున్న వారు, వారి శక్తి మేరకు పాడటం వారి ద్వారా ఆ తత్త్వగీతం వ్యాప్తి చెందటం అన్నది సాధారణమైన విషయం.

ఐతే ఈపాడే వాళ్ళలో అనేకమంది గోసాయిలకు పెద్దగా చదువూ సంధ్యా ఉండదు. అందుచేత కొన్ని పదాలను వారు తప్పుగా ఉఛ్ఛరించటం తరచు జరుగుతూ ఉంటుంది. ఆతప్పులు అలాగే ప్రచారం కావటం కూడా అంతే సహజంగా జరుగతూ వస్తుంది కూడా.

ఐతే ఈ తత్త్వాలు ఎంతో ప్రచారంలోని వచ్చినవే మనం నేడు వింటున్నాం. ఇంకా కొన్ని అంత తేలిగ్గా బోధపడకో అంతగా మనస్సుకు హత్తుకోక పోవటం వలననో జనానికి అంది ఉండవు. అందాయీ అంటే వాటిల్లో ఉన్న శ్రవణసుభగత ముఖ్య కారణం.

ఈ ఏమి చేతుర లింగా అన్న తత్త్వ గీతం బాలమురళి గొప్పగా గానం చేసారు.




భగవంతుడికి మనం పూజ చేస్తాం. కాని అసలు పూజ అంటే ఏమిటో ప్రజల్లో అనేక మందికి సరైన అవగాహన ఉన్నట్లు కనిపించదు. ఎందుకంటే ఎక్కువ మంది చేసే పూజావ్యవహారం అంతా వట్టి మొక్కుబడి వ్యవహారం కాబట్టి.

అసలు భగవంతుడి గురించిన సరైన అవగాహన - అంటే భగవంతుడికీ భక్తుడికీ మధ్యన ఉండే బంధం గురించిన సరైన అవగాహన సర్వే సర్వత్రా తప్పుగా అర్ధం చేసుకోబడుతున్నది. ఇది చాలా విచారించవలసిన విషయం.

భక్తి అనేది పరమప్రేమరూపా అంటారు నారదమహర్షి, ఆయన కన్నా గొప్ప భక్తిపరులను ఎవరిని మనం ఎరుగుదుం చెప్పండి. ఆయన మాట ప్రమాణం. ఆప్త వాక్యం కదా.

భగవంతుడిని అత్యంతం ఆత్మీయుడు అని భావించి అంతా ఇంతా అనరానంత ప్రేమతో మెలగటమే భక్తి.

మరి పూజ అంటే?

భగవంతుడిని పిలిచి సత్కరించి ప్రవర్తించటం అన్నమాట.

మీకు అత్యంత ఆత్మీయుడైన వ్యక్తి మీ యింటికి వచ్చాడని అనుకోండి. అప్పుడు ఆ వ్యక్తితో ఎలా ప్రవర్తిస్తారు?

ఎలా అతిథి సత్కారం చేస్తారు?

ఎలా మీ మంచి చెడ్డలు చెప్పుకుంటారు?

ఎలా మెలగుతారు?

ఆ వ్యక్తి వీడ్కోలు తీసుకుంటుంటే ఎలా సాదరంగా సాగనంపుతారు?

ఇదంతా మీకు సులువుగానే అవగాహన అవుతున్నది కదా.

అదే విధంగా, మీకు అత్యంత ఆత్మీయుడైన భగవంతుడిని మీరు ఆహ్వానించారు మీ యింటికి. ఆయన వచ్చాడు. మీరు సాదరంగా స్వాగతం పలికి ఎంతో ప్రేమతో గౌరవంతో మెలగుతూ ఆయన్ను సంతోష పెట్టటమే పూజ అంటే.

సంప్రదాయం ప్రకారం పూజలో పదహారు ఉపచారాలను చేయాలి. ఏదో రూలుందని చేయటం కాదండీ, ప్రేమతో శ్రధ్ధగా చేయాలి. మనం పరాకు పడకుండా ఉండటానికే ఈ పట్టికను గుర్తుపెట్టుకోవాలి.

1. ఆవాహనం, 2. ఆసనం, 3. పాద్యం, 4. అర్ఘ్యం, 5. ఆచమనీయం, 6. అభిషేకం, 7. వస్త్రం, 8. యజ్ఞోపవీతం, 9. గంధం, 10. పుష్పం, 11. ధూపం, 12. దీపం, 13. నైవేద్యం, 14. తాంబూలం, 15. ప్రదక్షిణం, 16. నమస్కారం.

ఇవీ ఆ ఉపచారాలు.

వీటి గురించి కొంచె క్లుప్తంగా చెప్పుకుందాం.

ఆవాహనం అంటే ఆహ్వానం పలకటం.  కాలింగ్ బెల్ మోగగానే పనమ్మాయి వచ్చి తలుపుతీసి సరే రండి అనటమూ ఇంటి యజమాని స్వయంగా గుమ్మంలో ఎదురుచూస్తూ ఉండి ఇంత పెద్ద ముఖం చేసుకొని ఆనందంగా రండి రండి అని సంభ్రమంగా ఎదురొచ్చి లోపలికి తీసుకొని వెళ్ళటమూ రెండూ ఒకటి కావు కదా. పూజలో ఆవాహనం అంటే భక్తి శ్రధ్ధలతో సంతోషంతో భగవంతుడిని ఆహ్వానించటం అన్నమాట.

అసనం అంటే కూర్చోండి అని మంచి కుర్చీ చూపించటం. మనం చూడండి ముఖ్యమైన అతిథులు వస్తున్నారని తెలిస్తే ఎంత హడావుడి చేస్తాం? ఇల్లంతా సర్దేసి, వారొస్తే కూర్చోవటానికి మంచి మంచి ఆసనాలు సిధ్ధం చేస్తాం కదా. సోఫా కవర్లు మొన్నమొన్ననే మార్చినవే ఐనా సరే బీరువాలోనుండి కొత్తవో ఇస్త్రీవో తీసి అలంకరించి మరీ ఎదురుచూస్తాం. ఆ మర్యాదకీ వారు లోపలికి వచ్చాక ఏదో కుర్చీలో నుండి తువ్వాలో మరొకటో తీసి కూర్చోండి అనటానికి అబ్బో ఎంతో తేడా లేదా? ఆసన మర్యాద అంటే తెలిసింది కదా. మన ఇంటికి భగవంతుడు వచ్చాడు. ప్రేమతో ముందే సిధ్దం చేసిన ఉచితాసనం అర్పించటమే ఆ మర్యాద మరి.

పాద్యం అనేది ఒకటుంది. ఈ కాలంలో ఐతే మాయమై పోయింది కాని పూర్వం ఇంటికి వచ్చిన అతిథులకు కాళ్ళుకడుక్కుందుకు నీళ్ళివ్వటం మర్యాద. ఐతే అతి ముఖ్యమైన అతిథి వస్తే? ఆ అతిథి కాళ్ళు కడుక్కుని వచ్చాక కుర్చీ చూపటం కాదు - ముందే మంచి కుర్చీలో కూర్చో బెట్టి స్వయంగా కాళ్ళు కడిగి గౌరవం చేయటం బాగుంటుంది కదా. అది కదా ఆత్మీయ మర్యాద,  మరి భగవంతుడే వచ్చాడే, అంత కంటే అత్యంత ఆత్మీయుడైన అతిథి ఎవరుంటారు చెప్పండి. అందుకని మనం స్వయంగా ఆయన్ను ఆసీనులను చేసి కాళ్ళు కడిగి గౌరవించటం పాద్యం అర్పించటం.

ఆచమనీయం అంటే బయటనుండి వచ్చిన అతిథికి కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వటం వంటిది. చూడండి ఎవరన్నా వస్తే మంచితీర్ఘం ఇవ్వటం ముందుగా చేస్తాం కాని కారప్పూసా మిఠాయి ఉండా పెట్టిన ప్లేటు ముందుగా తేము కదా. అదలా ఉంచి బయట నుండి వచ్చిన వ్యక్తికి ఎంత లేదన్నా కాస్త దుమ్మ ధూళీ ఆ దిష్టీ ఈదిష్టీ తగిలి కాస్త శౌచం లోపం అవుతుంది. వచ్చిన వారు కాస్త పురాణాచమనం ఐనా చేసి తిరిగి శుచి కావటం సంప్రదాయం. భగవంతుడికి నిత్యశుధ్ధి ఐనా సరే కాస్త మనం గొంతు తడుపుకుందుకు మంచినీళ్ళివ్వాలా వద్దా చెప్పండి?

ఆ వచ్చిన పెద్దమనిషికి హాయిగా స్నానం చేసి రండి భోజనం సిధ్ధంగా ఉందని చెబుతాము కదా అదే అభిషేకం. ఆ భోజనమే నివేదనం. ఇలా ఉపచారాలన్నీ కూడా భగవంతుడనే విశిష్టమైన అతిథికి మనం చేసే మర్యాదలు.

ఎంతో ప్రేమతో ఆ మర్యాదలు నెరవేర్చటమే పూజ అన్నమాట.

ఈ రోజుల్లో చూస్తున్నాం.  ఒకరింట్లో సత్యనారాయణ వ్రతం అంటారు. మనం వెళ్తాం. ఏదో మన భక్తి మనది. దేవుడి పూజ చూదాం అని వీలు కుదుర్చుకొని మరీ వెళ్తాం.

తీరా వెళ్ళాక చూడండి. ఆ పూజలో కూర్చున్న వారు వచ్చిన వారిని స్వాగతిస్తూ కనిపిస్తారు. సాధారణంగా ఐతే అది మంచి పధ్ధతే. కాని అక్కడ వాళ్ళు దేవుణ్ణి పిలిచి పూజ చేస్తున్నారు కదా. శ్రధ్ధ ఎక్కడ ఉండాలి? పూజ మొక్కుబడిగా నడుస్తూ ఉంటుంది. పూజచేస్తున్న వాళ్ళు వెనక్కి తిరుగుతూ ఉంటారు ఎవరన్నా వచ్చినప్పుడల్లా, వాళ్ళని పలకరిస్తూ.

మధ్యలో ఆ బ్రహ్మ గారు కలగ జేసుకొని అయ్యా ఆ పూవులు రెండు తీసుకొని దేవుడి దగ్గర ఉంచండి వంటిది ఏదో అనటం. వీళ్ళు అది కాస్తా మమ అనిపించి మళ్ళీ వెనక్కి తిరగటం.

ఇదా పరమ ప్రేమతో భగవంతుడిని పిలిచి మర్యాదలు చేయటం?

ఈ దిక్కుమాలిన పూజకు మురిసి దేవుడు వీళ్ళ అడ్దమైన కోరికలూ తీర్చాలా?

ఏమన్నా న్యాయంగా ఉందా?

శాఖా చంక్రమణం కాదు. కావాలనే ఈవిషయాలను ప్రస్తావించాను. ఈతత్త్వంలో పరమప్రేమతో భగవంతుడికి పూజ చేయాలని తాపత్రయ పడే భక్తుడి సందేహాలను ప్రస్తావిస్తున్నారు.

భగవద్గీతలో ఒక చోట భగవానుడి మాట

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః

అని. అంటే భగవంతుడికి కూడా మన పైన అపారమైన ప్రేమ కదా. ఆయన అందుచేత మనని ఇది పెట్టవోయ అది ఏదోయ్ అని నిలదీయడు. పాపం మనం ఏది పెట్టగలిగితే అది పెడితే చాలు సంతోషంగా స్వీకరిస్తాడు.

అలా మనం అర్పించ గలిగినది ఒక పండు కావచ్చు ఒక పువ్వు కావచ్చు. చివరకు ఒక గ్లాసు మంచినీళ్ళిచ్చి నా పరిస్థితి ఇంతేనయ్యా అన్నా సరే ఆయన అబ్బెబ్బె ఇది చాలు నాకు నిజానికి తినే వచ్చాను ఆకలిగా లేదు అనేస్తాడు. అది మనకు తెలిసో తెలియకో మనం చాలా హడావుడి పడిపోతాం.

వచ్చిన వాడు పెద్దవాడు. సాక్షాత్తూ భగవంతు డాయిరి. ఏదో ఒకటి పెట్టి పంపిద్దాం అంటే బాగుండదు కదా. ఇలా అనుకొని అప్పోసొప్పో చేసి ఐనా సరే ఖర్చుకు వెనుకాడకుండా బ్రహ్మాండంగా నైవేద్యాలు సిధ్ధంచేస్తాం. ఒక్కొక్కసారి తెలివిగా, పూజకు సరిపడా కొద్దిగా నైవేదం సిధ్ధంచేస్తాం. మనకోసం సాదాసీదాగా ఏదో వండేసుకొని, ఆ భోజనంలో పిసరంత ప్రసాదం కూడా పెట్టుకొని తింటాం.

నిజానికి అలా చేయటం తప్పు.

మీయింటికి వచ్చిన ఆత్మీయుడికి మాత్రం నవకాయపిండివంటలతో ముందుగా భోజనం పెట్టి ఆపైన మనం ఆ పెద్దమనిషి చూడకుండా పచ్చడి మెతుకులతో భోజనం కానిస్తే, అది తెలిసి ఆయన ఎంత బాధపడతాడు? అయ్యో నా వల్ల ఎంత ఇబ్బందీ వీళ్ళకి అని ఎంతగా ఇదవుతాడు? ఆలోచించండి. అందునా మీరు ఎవరో పెద్దమనిషికి ఐతే ఆ వ్యక్తికి తెలియకుండా చడీ చప్పుడూ కాకుండా పచ్చడి మెతుకులూ మజ్జిగాతో సరిపెట్టుకో వచ్చును కానీ భగవంతుడి కళ్ళెలా కప్పుతారండీ? ఆయనకు తెలియనిది అంటూ ఉంటుందా?

భగవంతుడు అందుకే మరొక మాట కూడా అన్నాడు గీతల్లో

    యత్క రోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్
    యత్తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ - మదర్పణం

దీని అర్ధంలో విశేషం ఏమిటంటే నాయనా, నువ్వు ఏది చేసినా నాపేరు చెప్పుకొని చేయి. ఏది తింటున్నావో అదే నాకు అర్పించు అని.

అందుచేత మనం మజ్జిగ పోసుకొని భగవంతుడికి పెరుగు స్పెషల్ అనకూడదు. ముందటి శ్లోకంలో ఆయన చెప్పాడు కదా, నీవు ఏది పెట్టగలవో దానినే నేను సంతోషంగా ఆరగిస్తాను అని.

ఇంతవరకూ మనం పూజ అంటే ఏమిటో అది ఎలా ఎంత ప్రేమగా చేయాలో చెప్పుకున్నాం.

అలా చేసేందుకు ఎంతో ఇబ్బంది వస్తోందట ఒక భక్తుడికి.

అందుకని శివుడితో ఇలా విన్నవించుకుంటున్నాడు.

ఏమయ్యా శివుడా నీకు నా శక్తి మేరకు పూజ చేదాం అనుకుంటున్నాను.  కాని చూడవయ్యా ఎన్ని చిక్కులో, ఏమి చేయమంటావో నువ్వే చెప్పు?

    గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేద మంటే
    గంగ నున్న చేప కప్ప ఎంగిలంటున్నాది లింగా

నీకోసం అతిపవిత్రం కదా అని గంగోదకం తెద్దామని వెళ్ళాను. తీరా చెంబు నీళ్ళలో ముంచగానే  అందులో ఉన్న ప్రతి చేపా కప్పా కూడ నన్ను చూసి నవ్వాయి. ఏమయ్యా ఈనీళ్ళన్నీ మా ఎంగిలే కదా అన్నాయి.  ఓ మహానుభావా ఏం చేయమంటావయ్యా?

    అక్షయావుల పాడి తెచ్చి అర్పితము చేద మంటే
    అక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాది లింగా

అక్షయావులూ అని ఉన్నాయి. అంటే ఎప్పుడు అడిగితే అప్పుడు కావలసినన్ని పాలిచ్చే ఆవులు అన్నమాట.  వాటి పాలు తెచ్చి నీకు సమర్పిద్దాం అనుకున్నాను. కాని ఆ ఆవుల దగ్గర తారాడే ప్రతిదూడా నన్ను చూసి నవ్వింది. అయ్యో ఆ పాలన్నీ మేము ఎంగిలి చేసిన పొదగుల కారణంగా అవీ ఎంగిలి ఐపోయాయి కదయ్యా అంటున్నాయి. ఓ మహానుభావా ఏం చేయమంటావయ్యా?

    తుమ్మి పూవులు తెచ్చి నీకు తుష్టుగా పూచ్చేద మంటే
    కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నాది లింగా

పోనీ నీకోసం కాసిని పూవులు తీసుకొని వద్దాం అని బయలు దేరాను.  తుమ్మి చెట్టు కనిపించింది. బాగుంది పచ్చగా ఈపూలు బాగున్నాయి కోసుకొని వద్ధాం అనుకున్నాను. కాని ఆ పూవుల చుట్టూ బోలెడు తుమ్మెదలు తిరుగుతున్నాయి. అవేమో నన్ను చూసి ఈపూలన్నీ మేం ఎంగిలి చెసేసాం కదా ఎలా పనికొస్తాయీ నీకు అంటున్నాయి. ఓ మహానుభావా ఏం చేయమంటావయ్యా?

చూస్తుంటే ఈ సృష్టిలో ఏదో ఒకరకంగా ఎంగిలి పడని దినుసే కనిపించటం లేదే! ఏదో ఒకటి అతి పవిత్రంగా తెచ్చి నీకు అర్పిద్దాం అనుకుంటే అది సాధ్యపడేది కాదని అనిపిస్తోంది.

ఆఁ. ఇప్పుడు తెలిసిందయ్యా, ఈ సృష్టిలో నేను దేనినీ సాధించి తెచ్చి నీకు అర్పించటం జరిగే పని కాదు.

మరి ఇంక నీకు అర్పించటానికి నా దగ్గర ఏమీ లేకపోయిందే! ఈ విధంగా అలోచిస్తే పరస్పరాశ్రయమైన ప్రాకృతిక వస్తువులతో నిన్ను పూజించటం అసాధ్యం అని తేలుతున్నది.

ఇంక మిగిలిందీ, అచ్చంగా నాదీ అనదగ్గదీ ఒక్కటే.

అదే నా మనస్సు.

దానినే నీకు అర్పిస్తాను.

(ఇలా మనస్సును అర్పిస్తానూ అన్నది పాటలో చెప్పకపోయినా మనం అవగతం చేసుకోవాలి స్వయంగా.  భగవంతుడు మనం ఏది మనకు ఇంతే నా శక్తి స్వామీ అని ఇస్తే అదే స్వీకరిస్తాడు కదా.)

ఆరగించి కూచున్నాడల్లవాఁడె చేరువనే చూడరె లక్ష్మీనారసింహుఁడు - అన్నమయ్య సంకీర్తనం


(మాళవి)

ఆరగించి కూచున్నా డల్లవాఁడె

చేరువనే చూడరె లక్ష్మీనారసింహుఁడు



ఇందిరనుఁ  దొడమీద నిడుకొని కొలువిచ్చీ

అందపు నవ్వులు చల్లీ నల్లవాఁడె

చెందిన మాణికముల శేషుని పడగె మీఁద

చెంది వరాలిచ్చీ లక్ష్మీనారసింహుఁడు



బంగారు మేడలోన పచ్చల గద్దియల మీఁద

అంగనల ఆట చూచీ నల్లవాఁడె

రంగగు సొమ్ముల తోడ రాజసపు విభవాల

చెంగట నున్నాడు లక్ష్మీనారసింహుఁడు



పెండెపు పాదము చాఁచి పెనచి వొ కపాదము

అండనే పూజలుగొనీ నల్లవాఁడె

కొండల శ్రీ వేంకటాద్రి కోరి అహోబలమున

మెండుగాను మెరసీ లక్ష్మీనారసింహుఁడు


ఇది అన్నమాచార్యుల వారు నరసింహస్వామిపైన చెప్పిన సంకీర్తనం.

అన్నమయ్య శ్రీవేంకటేశ్వర స్వామి వారి పైన అనేక వేల సంకీర్తనలు విరచించారు. అలాగే భగాంతుడి ఇతర అవతార మూర్తుల గురించి కూడా సంకీర్తనలు చెప్పారు. వాటిలో అధికభాగం నరసింహ స్వామి పైన చెప్పినవే.

అహోబిలం సుప్రసిధ్ధ నారసింహ క్షేత్రం. అక్కడ ఉన్న పీఠానికి తొలి అధిపతి ఐన శఠకోప యతి అన్నమయ్యకు వేదాంత గురువు. అంతే కాదు శఠకోప యతి వద్ద అన్నమయ్య నరసింహ మంత్రాన్ని ఉపదేశం పొందారు.

ఆ నరసింహ మంత్రం 32 బీజాక్షరాలు కలది. బహుశః అందుకే అన్నమాచార్యులు శ్రీవేంకటేశుడి పైన ముప్పది రెండు వేల సంకీర్తనలను వెలువరించారు.

ఈ సంకీర్తనలో అహోబిలం లక్ష్మీనరసింహస్వామి వారి వైభవం వర్ణిస్తున్నారు అన్నమయ్య.


    ఆరగించి కూచున్నాడల్లవాఁడె
    చేరువనే చూడరె లక్ష్మీనారసింహుఁడు

అంటూ విందు ఆరగించి దర్జాగా కూర్చున్న నరసింహ స్వామి వారిని స్తుతిస్తున్నారు.

ఈపాట పల్లవిని లక్ష్మీనారసింహుడు అని ముగించినట్లే ఆచార్యుల వారు పాటలోని మూడు చరణాలను కూడా అదేవిధంగా లక్ష్మీనారసింహుడు అనే ముగించారు. విశేషం ఏమిటంటే పరిష్కర్తలు సరిచేసిన విధంగా లక్ష్మీనారసింహుడు అని మనకు కనిపిస్తున్నది కాని నిజానికి రాగిరేకు మీద ఈపాటలో అంతటా లక్ష్మీనారసింహ్వుడు అనే ఉన్నది.

మీకు తెలుగు భాష పైనా దాని నుడికారం పైనా మంచి మక్కువ ఉంటే ఈపాట మీకు తప్పకుండా మనస్సుకు హత్తుకుంటుంది.  చూడండి ఈ పాట నిండా హాయిగా పరచుకున్న తెలుగు పదాల రాజసం.

ఈ పాటను తిరుమల తిరుపతి దేవస్థానంలో గాయకుడైన పారుపల్లి రంగనాథ్‍ గాత్రంలో వినవచ్చును.




ఈ సంకీర్తనాన్ని బాలకృష్ణ ప్రసాద్ గారి గళంలో కూడా మనం వినవచ్చును.




ఈ పాట పల్లవి

    ఆరగించి కూచున్నా డల్లవాఁడె
    చేరువనే చూడరె లక్ష్మీనారసింహుఁడు

అంటే, శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారు హాయిగా భోజనం చేసి కూర్చున్నారని పాట మొదలు పెడుతున్నారు ఆచార్యుల వారు.

అదిగో చూడండయా వాడే,  మనకు దగ్గరగానే, ఎదురుగానే లక్ష్మీనారసింహుఁడు హాయిగా ఆరగింపు కానిచ్చి కూర్చున్నాడు అంటున్నారు. అయన ఎలా ఉన్నాడు?

    ఇందిరనుఁ  దొడమీద నిడుకొని కొలువిచ్చీ
    అందపు నవ్వులు చల్లీ నల్లవాఁడె
    చెందిన మాణికముల శేషుని పడగె మీఁద
    చెంది వరాలిచ్చీ లక్ష్మీనారసింహుఁడు

అయన మనతల్లి ఇందిరమ్మను  (అంటే  లక్ష్మీదేవిని) తన తొడమీద కూర్చుండ బెట్టుకొని సభ తీర్చి ఉన్నాడు. హాయిగా అందమైన చిరునవ్వులు చిందిస్తున్నాడు. అదుగో ఆయనే చూడండి మరి అని మనని హెచ్చరిస్తున్నాడు అన్నమయ్య.

ముందుగా అన్నమయ్య సాహిత్యంలో వచ్చీని చేసీని వచ్చీని వంటి మాటల గురించి ఒక మాట చెప్పుకోవాలి. ఈ రోజు మనం చేసెను/చేసేను వచ్చెను/వచ్చేను అన్న అర్ధంలో చేసే వచ్చే అన్న మాటలను వాడుతున్నాము. అన్నమయ్య కాలంలో ఆ మాటలనే చేసీని వచ్చీని అని వాడేవారు అన్నమాట. అలాగే చివర ద్రుతం లేకుండాను కూడాఅ వచ్చీ అప్పట్లో అన్న మాటకు నేటి వాడుక వచ్చే అని.

ఇక్కడ కొలువిచ్చీ వరాలిచ్చీ అన్నప్పుడు ఈకాలం వారు వాటిని కొలువిచ్చే వరాలిచ్చే అని అన్వయం చేసుకోవాలి.  అంటే కొలువిచ్చెని వరాలిచ్చెను అని అర్ధాలు తీసుకోవాలి అన్నమాట.

అందపు నవ్వులు చల్లీ నల్లవాఁడె అన్న పాదం నేటి పధ్ధతిలో అందపు నవ్వులు చల్లే నల్లవాఁడె అని వ్రాయవలసి ఉంటుంది. చల్లేను అల్లవాడే అని పదవిభాగం వస్తుంది.  ఈ చల్లేను అన్నది ఆనాటి భాషలో చల్లీని అని ఉందన్నమాట. అందుచేత మూల ప్రతిలో చల్లీని అల్లవాడె అని ఉంది.

ఐతే ఇటువంటి పాటలు పాడేటప్పుడు ఒక సందిగ్ధత వస్తుంది. చల్లీని అని పాడితే మన కాలం శ్రోతలకు వింతగా అనిపిస్తుంది. కాని మూలం సాధ్యమైనంత వరకూ ఏమాత్రమూ మార్చకుండా పాడటం అన్నది చాలా ఉచితమైన విధానం. మనం పూర్వకాలపు వాగ్గేయకారుల రచనలను మనకాలానికి అనుగుణంగా భాష మార్చి పాడటం మంచి పధ్ధతి కాదు.

అల్లాగే మరొక ముఖ్య విషయం. అన్నమయ్య తన సంకీర్తనల్లో వాడిన విధానం ఏమిటంటే ఆయన ప్రతి పాదంలోనూ - అది పల్లవిలో ఐనా, చరణాల్లో ఐనా సరే - ప్రాసనూ యతినీ పాటించారు. ఒక్కొక్కసారి యతి ప్రాసలకు అనుగుణంగా చెప్పే ఉద్దేశంతో ఆయన వాక్యంలో పదక్రమాన్ని చిత్రమైన విధాలుగా ముందువెనుకలు చేసారు. తెలుగులో అది దోషం కాదు.

రాముడు ఇంటికి వెళ్ళెను అన్న వాక్యాన్ని మనం ఇంటికి రాముడు వెళ్ళెను అన్నా వెళ్ళెను రాముడు ఇంటికి అన్నా తేడా లేదు. కవిత్వంలో ఇది సాధారణమే.

ఐతే అన్నమయ్య ఒక్కొక్క సారి పదబంధాలను కూడా విరుగకొట్టి మరీ తన దారికి తెచ్చుకొని అటూఇటూ చేయటం పరిపాటి. ఒక్కొక్కసారి అవి చాలా వింతగా అనిపిస్తాయి. కనీసం మనకాలం వాళ్ళకు వింతగానే ఉంటాయి.

చెందిన మాణికముల శేషుని పడగె మీఁద చెంది అంటే ఏమిటో చూదాం. శేషుడు అంటే తెలుసు కదా ఆది శేషుడు. ఆయన గారు స్వామివారికి పడక మంచం. నిజానికి శేషుడు భగవానునికి ఏది అవసరం ఐతే ఆరూపం లోనికి మారి సేవచేస్తాడు. శయ్య అవుతాడు, ఆసనం అవుతాడు. కావలసి వస్తే పాదుకలు కూడా అవుతాడు.

అంత గొప్పవాడు ఆ శేషుడు. అయనకు పదివేల పడగలు. ఆపడగల మీద ధగధగ లాడే మణులు. వాటిని ఇక్కడ అన్నమయ్య మాణికములు అన్నాడు అంటే మాణిక్యాలు అన్నమాట. ఇక్కడ పదాలను శేషుని పడగె మీఁద చెందిన మాణికముల చెంది అని మార్చుకోవాలి. అంటే ఆ పడగ(లు) పట్టిన శేషుడి సేవ కారణంగా స్వామివారు మరింత ధగధగను చెందుతున్నారని అర్ధం.  ఈ విధంగా శేషుడు తన తనువెల్లా స్వామివారి సేవకు వినియోగిస్తున్నాడు. స్వామివారు శేషుని ఆసనంగా అంగీకరించారు. ఆ శేషస్వామి పడగల మణులను తాను తన శిరోభూషణాలుగా స్వీకరించారు. అవి ఆయన శోభను మరింతగా హెచ్చిస్తున్నాయి.

ఆదిశేషుడి పడగల మీది మాణిక్యాలు ఆదిశేషుడికి చెందినవి. కాని వాటి ధగధగల సొంపంతా శ్రీలక్ష్మీనరసింహస్వామికి సేవగా చెందుతోంది.

ఇదీ విషయం.

మరి, ఆరగింపు ముగించుకొని, అంత ధగద్ధగాయమానంగా కొలువు తీరి  లక్ష్మీసమేతుడై దర్శనం ఇచ్చిన స్వామివారు ఊరికినే ఉన్నారా?

ఉండరండి. దేవతల దర్శనమే అమోఘం. వారు మనకు కనిపించాక ఏదో ఒకటి అనుగ్రహించాలి మనకు. అది వారి రివాజు. సంప్రదాయం.

మరి దేవాధిదేవుడైన లక్ష్మీనారసింహుడు వట్టినే ఉంటాడా? ఉండడు కదా. అందుక వరాలిచ్చీ లక్ష్మీనారసింహుఁడు అన్నాడు అన్నమయ్య. అయన మనకు వరాలు అనుగ్రహిస్తున్నాడని చెబుతున్నారు.

ఆ లక్ష్మీనారసింహస్వామి వారి వైభవాన్ని ఇంకా ఇలా వర్ణిస్తున్నారు.

    బంగారు మేడలోన పచ్చల గద్దియల మీఁద
    అంగనల ఆట చూచీ నల్లవాఁడె
    రంగగు సొమ్ముల తోడ రాజసపు విభవాల
    చెంగట నున్నాడు లక్ష్మీనారసింహుఁడు


అది బంగారు మేడ. ఆ మేడ మీద ఒక గొప్ప సభాభవనం. దానిలో ఒక దివ్య మంటపం. ఆమంటపంలో ఒక పచ్చలు తాపడం చేసిన గద్దె ఉంది.  ఆ గద్దె మీద స్వామివారు మంచి రంగైన సొమ్మలను అలంకరించుకొని కూర్చున్నారట. ఇక్కడ రంగగు అంటే మణిభూషణాలకు సంబంధించిన రంగురంగులు అని అర్ధం కాదు. రంగగు అంటే దివ్యమైన అద్భుతమైన అని అర్ధం. అటువంటి సొమ్ముల దిగవేసుకొని మహారాజవైభవంతో మరీ కూర్చున్నాడు స్వామి.

ఆయన మనకు చెంగటనే ఉన్నాడు అని హెచ్చరికగా చెబుతున్నారు ఆచార్యులు. అంటే మనం ఆ సభాభవనంలోనే అయనకు ఎదురుగా కొంచెం పెడగా ఉభయపార్శ్వాలనూ సభాసీనులమై ఉన్నాం అని చెప్పటం.

అలా గొప్ప సభతీర్చి కూర్చున్న స్వామి వారు ఏం చేస్తున్నారయ్యా అంటే అంగనల ఆట చూచీని అనగా నట్టువరాండ్రు ఆయన యశోగీతాలు గానం చేస్తుంటే తిలకిస్తున్నాడట.

ఇదంతా స్వామి వారు ఆరగింపు ముగించుకొని కూర్చున సభలో జరుగుతున్న ముచ్చట.

ఇక్కడ నేనొక విషయం మనవి చేయాలి. ఆమంటపంలో ఒక పచ్చలు తాపడం చేసిన గద్దె ఉంది అని నేను వ్యాఖ్యానం చేసాను కాని నిజానికి కీర్తనను పరికిస్తే పచ్చలగద్దియల మీఁద అంగనల యాట చూచీ అని కనిపిస్తోంది కదా అన్న అనుమానం వస్తుంది చదువరులకు. గద్దె లేదా గద్దియ అన్నమాటకు ఆసనం అన్న అర్దప్రతీతి ఉన్నది కాని వేదిక అన్న ప్రతీతి లేదు. ఆసనం మీద నాట్యం చేయటం అన్నది అసంగతమైన అన్వయం కదా. అందుచేత మనకు గద్దియ అన్నమాటకు వేదిక అన్న అర్ధం కావలసి వస్తున్నది. కాని అది పొసగదు. వాంగ్మయంలో కూడా గద్దెకెక్కటం అన్న నానుడికి అర్ధం సింహాసనం ఎక్కడం అనే అన్నది అందరికీ తెలుసు. కాబట్టి సభాంగణంలో పచ్చలవేదికల మీద నాట్యం జరుగుతున్నది అన్న అన్వయం తీసుకోవటం లేదు. స్వామి వారు బంగారు మేడలోన పచ్చల గద్దియ పైన ఆసీనులై ఉన్నారన్న అన్వయాన్ని తీసుకున్నాను.

ఐతే ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చును నాకు. అన్నమయ్యకు మెఱుగులు దిద్దటమా, ఉచితమా అన్నది. సభలో సింహాసనానికి ఎదురుగా నాట్యవేదిక ఒక్కటే ఉందనుకోవటం, అనేక నాట్యవేదికలు అలా ఉన్నాయనుకోవటం కన్నా ఎక్కువ సబబుగా ఉండటం కూడా ఒక కారణం అని ఒక సమర్ధన. మరొకటి, నా అభిప్రాయంలో పచ్చల గద్ధియ మీఁద అన్నదే మంచి పాఠంలా అనిపించటం ముఖ్యకారణం నా వివరణకు.

సాంకేతికాంశం ఒకటి ఉందిక్కడ.చరణాల్లోని రెండవపాదాలు మినహాయించి ప్రతిపాదంలోనూ ఉత్తరార్ధం అనగా యతిస్థానం నుండి పాదాంతం వరకూ కల భాగం పదిమాత్రల ప్రమాణంతో ఉన్నది. నేను చెప్పేది ఉఛ్ఛారణాప్రమాణం గురించి. వరుసగా ఇడుకొని కొలువిచ్చి,  శేషుని పడగ మీద,  క్ష్మీనారసింహుడు, రాజసపు విభవాల, పెనచి ఒక పాదము, కోరి యహోబలమున అన్నవి అన్నీ ఇలా పదిమాత్రల ఉఛ్ఛారణకు చక్కగా వస్తున్నాయి. కాని పచ్చల గద్దియల మీద అన్నప్పుడు పదకొండు మాత్రల ప్రమాణం అవసరం అవుతున్నది. పచ్చల గద్దియ మీద అంటే చక్కగా సరిపోతున్నది.

కాబట్టి పచ్చలగద్దియల మీద అన్నది వ్రాయసకాని పొరపాటే కాని ఆచార్యుల వారి రచనలో పచ్చల గద్దియ మీద అని ఉన్నదనే అభిప్రాయం స్థిరపడుతున్నది.

అలా నాట్యాది విలాసాలను తిలకిస్తున్న స్వామి వారి గురించి ఇంకా ఇలా చెబుతున్నారు.

    పెండెపు పాదము చాఁచి పెనచి వొ కపాదము
    అండనే పూజలుగొనీ నల్లవాఁడె
    కొండల శ్రీ వేంకటాద్రి కోరి అహోబలమున
    మెండుగాను మెరసీ లక్ష్మీనారసింహుఁడు

ఆయన పాదాలకు గండపెండేరాలు ఉన్నాయి. అవి బ్రహ్మాండమైన శోభను వెదజల్లుతున్నాయి.  ఒక పాదం క్రిందకు పదపీఠంపైన ఆన్చి ఉంచారు స్వామి. మరొక పాదాన్ని మడత వేసుకొని ఉన్నారు. అప్పుడే కదా మరి అది అమ్మవారు అంకపీఠిపై కొలువు తీరటానికి ఆసనంగా అమరేది. అందుకని అన్నమాట.

ఈ లక్ష్మీనారసింహ స్వామి ఎవరను కుంటున్నారు?

సాక్షాత్తూ వేంకటాద్రి కొండల మీద వెలసి ఉన్న శ్రీ వేంకటేశుడే ఇతడు!

ఆయనే కోరికోరి ఇలా అహోబలం లో శ్రీలక్ష్మీనారసింహుడై వెలసి ఉన్నాడు.

చూడండి, ఈయన ఎంత గొప్పగా ఇక్కడ (అహోబిలంలో) ప్రకాశిస్తూ ఉన్నాడో!!


16, మార్చి 2020, సోమవారం

ఎవ్వనిఁ దలఁచితివే ఎక్కడ మోహించితివే - అన్నమయ్య సంకీర్తన


ఎవ్వనిఁ దలఁచితివే ఎక్కడ మోహించితివే

చివ్వనఁ జెప్పవే నాతో సిగ్గుపడనేఁటికి



చెక్కులేల చెమరించె చెలియ నీ కిదె నేఁడు

వెక్కసపు టెండలతో వేసవి రాదు

గక్కున నీమేనేల కడుఁ  బులకించె నేఁడు

వక్కణింప నింక జడివానలు రావు



వెలువెల్లఁ బారనేలే వెన్నెలబొమ్మ వలె

అలరు శారదసమయంబు గాదు

పలకేనీమోవి నేల పక్కులుగట్టే నేఁడు

కలికి యిప్పుడు మంచుకాలము గాదు



కప్ప నేల పయ్యదను కాలమిది చలి గాదు

చెప్పలేదు వసంతము చిగిరించెను

దప్పిదేర నిటు గూడె తరగ నిన్ను నింత చేసె

యిప్పుడా శ్రీ వేంకటేశుఁ డేడనున్నాఁడే


అన్నమయ్య చేసిన శృంగారసంకీర్తనల్లో ఒకటి ఇది.

ఈ సంకీర్తనంలో ఋతువులను చమత్కారంగా ప్రస్తావించటం మనం గమనించ.వచ్చును.  చూడండి. వసంతము , వేసవి, జడివానలు, శారదసమయంబు, మంచుకాలము, చలికాలము అంటూ ఋతువులను సూచిస్తున్నారు.

చెలికత్తె నాయికతో అంటున్న మాటలుగా ఈ సంకీర్తనం ఉంది.  చెలికత్తియ అంటున్నది కదా

    ఎవ్వనిఁ దలఁచితివే ఎక్కడ మోహించితివే
    చివ్వనఁ జెప్పవే నాతో సిగ్గుపడనేఁటికి

అని. అంటే

అమ్మాయీ నీతీరు చూస్తుంటే నువ్వు ఎవరినో తలచి క్రిందుమీదు లౌతున్నావని తెలుస్తూనే ఉంది. అతడెవరో చెప్పవే. నేను నీ యిష్టసఖిని కదా, నాతో చెప్పవచ్చును కదా, సిగ్గుపడటం దేనికీ?  వెంటనే సంగతి ఏమిటో చెప్పు. ఎక్కడి మోహాలివీ? ఎవరిని తలచుకొనీ?

నువ్వు చెప్పకపోయినా నీ తీరు పట్టి యిస్తూనే ఉంది, విషయం ఏదో ఉందని.


    చెక్కులేల చెమరించె చెలియ నీ కిదె నేఁడు
    వెక్కసపు టెండలతో వేసవి రాదు

చెక్కులు అంటే చెక్కిళ్ళు. అవి చూపుతూ సఖి అంటున్నది ఇలా. చూడూ నీ చెక్కిళ్ళు ఎలా చెమరిస్తున్నాయో. ఎందుకలా చెమటలు పడుతున్నట్లూ? ఏం వేసవి కాలం ఏమీ రాలేదే దుస్సహం ఐన ఎండలతో?


    గక్కున నీమేనేల కడుఁ  బులకించె నేఁడు
    వక్కణింప నింక జడివానలు రావు


పైగా నీ ఒళ్ళు చూస్తే ఒకటే పులకరింతలు వస్తున్నాయని తెలిసిపోతూ ఉంది. చెప్పాలంటె ఇది వానాకాలం కాదే, భోరున వానలూ కురవటం లేదే?

వానాకాలానికీ పులకరింతలకూ సంబంధం ఏమీ లేదు కాని ఆచార్యులవారు ఎందుకు ఇలా ముడేసి చెప్పారో మరి. ముగ్ధ ఐన నాయిక జడివానల భీభత్సానికి బెదరి నాయకుడి చెంత చేరటం అన్నది ఒక ముచ్చట. కనీసం నాయకులకు ముచ్చట. అటువంటి సందర్భాలు నాయికా నాయకుల మధ్యన నడిచాయనుకోండి. వానలు పడినప్పుడల్లా నాయిక పూర్వస్మృతుల లోనికి వెళ్ళి పరవశించటమూ తత్కారణంగా ఆమె మేను పులకరించటమూ అన్నవి ఇక్కడ సూచించబడింది అనుకోవాలి. అన్నట్లు మగవాళ్ళకు పులకరింత అనకూడదు రోమాంచం అనాలి. విషయం ఒక్కటే.

ఇక్కడ సఖి అంటున్నది ఏమిటంటే ఏమి తలచుకుంటున్నావే అని కదా. అంటే ఏపూర్వ సంఘటనలు నెమరు వేసుకొంటూ నీ మేను పులకరిస్తున్నదీ అని నిలదీస్తున్నది అన్నమాట.

ఇంకా చెలికత్తె ఏమంటున్నదీ అంటే

    వెలువెల్లఁ బారనేలే వెన్నెలబొమ్మ వలె
    అలరు శారదసమయంబు గాదు

ఏమిటోయ్ అమ్మాయీ అలా వళ్ళంతా తెలతెల్లగా ఐపోతున్నదీ? చూడటానికి అచ్చం వెన్నెలను ముద్దచేసి బొమ్మచేసినట్లున్నావు. ఇదేమనా శరదృతువా? కాదే?

ఋతువులన్నింటిలో శరత్తుకు ఒక విశిష్ఠ స్థానం ఉంది. వానలు వెనుకబట్టి, ఆకాశం నిర్మలంగా ఉంటుంది. పుష్కలంగా నీరు దొరికిన ప్రకృతిలోని చెట్టూ చేమా అంతా నిండుగా పచ్చగా ఉంటుంది. దానికి తోడు వెన్నల రాత్రులైతే ఆ శోభ చెప్పనలవి కాదు. శారదరాత్రు లుజ్వల తారక హార పంక్తులం జారు తరంబులయ్యె వంటి పద్యాలను స్మరించుకుంటే ఆ ఋతుశోభ మనసుకు వస్తుంది. ధగధగలాడే శరత్పూర్ణిమ రాత్రి వెన్నెలకు సాటే లేదు ప్రకృతిలో.

ఇప్పుడు మన నాయిక, ఆ శరత్పూర్ణిమ రాత్రి వెన్నలను పిసికి ముద్దచేసిన బొమ్మలా ధగదగ లాడుతోందట.

చెలికత్తియకు అనుమానం వస్తోంది, చూస్తుంటే ఇదేదో వ్యవహారం తనకుతెలియకుండా నడిచినట్లుంది అన్న భావన కలిగి అంటున్నది కదా,

    పలకే నీమోవి నేల పక్కులుగట్టే నేఁడు
    కలికి యిప్పుడు మంచుకాలము గాదు

ఈ మాట చెప్పూ? నీ ముఖం ఏమిటీ అక్కడక్కడా పుండ్లు ఆరి పక్కులు కట్టినట్లు తోస్తోందీ? విషయం ఏమిటీ? ఊరికే పగుళ్ళు వచ్చి అలా అవటానికి ఇదేం మంచు పడే కాలం కాదే అని గదమాయిస్తోంది. అంటే నీకు నాయకుడితో సమాగమం కలిగి ఉండాలె? నాక్కొంచెం కూడా ఉప్పంద లేదే అని నిష్టూరంగా అంటోందన్న మాట.

పైగా

    కప్ప నేల పయ్యదను కాలమిది చలి గాదు

అంటోంది కదా, ఎందుకలా పమిట కప్పుకుంటున్నావూ,  ఇప్పుడు చలికాలం కాదు కదా అని.

అంటే నాయిక తనకు నాయకుడితో సమాగమం కలిగిందా అన్నప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి బదులుగా తనను సఖి మరీ పరిశీలనగా చూడకుండా పమిట కప్పుకుంటున్నదిట, ఆ సంగతి చెలి గ్రహించి ఎత్తిపొడుస్తున్నది ఇది చలికాలం కాదే ఎందుకు పమిట కప్పుకోవటం అని.

ఎలాగూ చెలికత్తెకు విషయం తెలిసిపోయింది. ఇంక దాపరికం ఏముంది. చెలి మాత్రం తెలిసిందిలే అని ఊరికే వదుల్తుందా

మొదట

    చెప్పలేదు వసంతము చిగిరించెను

అని మేలమాడింది. నాయిక అచ్చం వసంతలక్ష్మి లాగా ఉందట. వసంతం సంతోషానికి ప్రతీక కదా, నాయిక సంతోషం అంటే నాయక సమాగమం అన్నసంగతి చెప్పాలా వేరే. అందుకే ఇష్టసఖి అంటున్నది కదా,


    దప్పిదేర నిటు గూడె తరగ నిన్ను నింత చేసె
    యిప్పుడా శ్రీ వేంకటేశుఁ డేడనున్నాఁడే

సరే నమ్మాయీ విషయం తెలిసిపోయిందిలే. నీకు సమాగమసౌఖ్యాన్ని ప్రసాదించి శ్రీ వేంకటేశ్వరుడు నిన్నిలా విరహంలో ముంచి వెళ్ళినట్లు తెలుస్తున్నది. ఇంతకీ శ్రీవారు ఆ శ్రీవేంకటేశ్వరుడు ఎక్కడున్నాడమ్మా?

దొంగా, అడడు ఎక్కడున్నాడో నీకు తెలుసును, వస్తున్నాడనీ తెలుసును. ఆయనకోసం ఎదురుచూస్తున్నావు కదా అని మేలమాడటం అన్నమాట.


రాము నొక్కని నమ్మి రాము నాజ్ఞ బడసి


రాము నొక్కని నమ్మి రాము నాజ్ఞ బడసి

రామసేవకు డైన రక్తిముక్తులు కలవు



పంతగించి వట్టి పాపచిత్తులు పలుక

చింతించుట వలన చేకురు ఫలమేమి

అంతకంతగ దిట్ట నావేశపడ కుండ

వంతపడక రామ పాదంబుల తలచి



పండ్లున్న చెట్లపై పడుచుండును రాళ్ళు

ముండ్ల చెట్ల నెవరు మొత్త గోరుదురు

కండ్ల నీళ్ళు బెట్ట కాట్లాడ బనిలేదు

వాండ్లవీండ్ల గోల వదలి రామేఛ్ఛయని



మంచివారల బుధ్ధిమంతుల భక్తుల

కొంచెపు వారల కుటిలబుధ్ధుల నుండి

అంచితముగ కావ నవనిజా పతియుండు

టెంచి శ్రీరామ నీవేయింక గతియని


15, మార్చి 2020, ఆదివారం

అందగించు నన్ని యెడల హరికీర్తనము


అందగించు నన్ని యెడల హరికీర్తనము

అందరకును శుభము లిచ్చు హరికీర్తనము



వినుడు పాపరాశి పైన పిడుగు హరికీర్తనము

జనలారా మన పుణ్య సమితి కది గొడుగు

మనసారా చేయుడీ మానక హరికీర్తనము

తనివి తీర చేసిరేని తరియించుట నిశ్చయము



సుజనులార యమృతమున చూడ నింత రుచేది

భజనచేయు వారి కెల్ల ఋజువైన దీరుచి

ప్రజలారా చేయుడీ బాగుగ హరికీర్తనము

నిజభక్తుల కిచ్చునిది నిశ్చయముగ మోక్షము



హరే రామ హరే రామ యనుటే హరికీర్తనము

హరే కృష్ణ హరే కృష్ణ యనుటే హరికీర్తనము

నరులారా చేయుడీ నమ్మి హరికీర్తనము

మరి యొక్క సాధనమున మనకు లేదు మోక్షము


14, మార్చి 2020, శనివారం

అన్నిటికి నొడయఁడ వైన శ్రీపతివి నీవు - అన్నమయ్య సంకీర్తనం


అన్నిటికి నొడయఁడ వైన శ్రీపతివి నీవు

యెన్నరాదు మాబలఁగఁ మెంచుకో మాపౌఁజు


జ్ఞానేంద్రియము లైదు శరీరిలొపల

ఆనక కర్మేంద్రియము లైదు

తానకపుకామక్రోధాలవర్గములారు

యీనెలవు పంచభూతా లెంచు మాపౌఁజు



తప్పని గుణాలు మూడు తనువికారములారు

అప్పటి మనోబుద్ద్యహంకారాలు

వుప్పతిల్లువిషయము లుడివోని వొక అయిదు

యిప్పటి మించే కోపము యెంచుకో మాపౌఁజు



ఆఁకలి దప్పియును మానావమానములును

సోఁకినశీతోష్ణాలు సుఖదు:ఖాలు

మూఁకగమికాఁడ నేను మొక్కెద శ్రీవేంకటేశ

యేఁకటార గడపేవా నెంచుకో మాపౌఁజు


ఈ సంకీర్తనంలో ఆచార్యుల వారు వేదాంతపరిభాషను వంకాయలో కారం కూరినట్లు దట్టించారు.
కొంత మందికి ముందుగా ఈ పరిభాష ( అంటే  terminology) ముందుగా పరిచయం చేయకపోతే వారికి అవగాహన కావటం కష్టం కాబట్టి ముందుగా ఆపదాల సంగతి చూదాం.

జ్ఞానేంద్రియము లైదు: 1. చర్మము, 2. కన్నులు, 3. ముక్కు, 4. చెవులు, 5.. నాలుక. వీటి వనన జీవి స్పర్శను, దృశ్యమును, వాసనలను, శబ్దమును, రుచిని గ్రహిస్తాడు.

కర్మేంద్రియము లైదు:  1. చేతులు, 2. కాళ్ళు, 3. వాక్కు, 4.జననేంద్రియము, 5. విసర్జనేంద్రియము.

కామక్రోధాలవర్గము లారు:  1. కామము, 2. క్రోధము, 3. లోభము, 4.మోహము, 5. మదము, 6. మాత్సర్యము.

పంచభూతాలు: 1. ఆకాశము. 2. వాయువు, 3. అగ్ని, 4. జలము, 5. భూమి.

గుణాలు మూడు: వీటినే సాధారణంగా త్రిగుణా లని అంటాము,  ఇవి సత్వగుణము, రజోగుణము, తమోగుణము.

తనువికారములు ఆరు:  1. పుట్టటం, 2. ఉండటం, 3.పెరగటం, 4. గిట్టటం, 5. తగ్గటం, 6. చెడటం.

మనోబుద్ద్యహంకారాలు:  1. మనస్సు, 2. బుద్ధి, 3. అహంకారము, 4. చిత్తము. ఈ నాలుగింటిని కలిపి అంతఃకరణ చతుష్టయం అంటారు.

విషయములు అయిదు: 1. స్పర్శ, 2. రసము, 3. రూపము, 4. గంధము, 5. శబ్దము.

ద్వంద్వములు: 1. ఆకలి - దప్పిక 2. శీతము - ఉష్ణము 3. సుఖము - దుఃఖము 4. చీకటి - వెలుగు 5. లాభము - నష్టము 6. జయము - అపజయము, 7. సన్మానము -  అవమానము మొదలైనవి.


సంకీర్తనం పల్లవిలో

    అన్నిటికి నొడయఁడ వైన శ్రీపతివి నీవు

   యెన్నరాదు మాబలఁగఁ మెంచుకో మాపౌఁజు

అని మొదలుపెట్టారు. పౌఁజు అంటే బలగం. అనగా సైన్యం అన్నమాట. ఒడయడు అంటే రాజు. శ్రీపతివైన ఓ వేంకటేశా నువ్వేమో అన్నిటికీ ఏలికవు. ఐనా మా బలం ఏమంత తక్కువేం కాదయ్యా, కావలిస్తే వివరిస్తాను. నువ్వే లెక్కించుకో అని ఈ పల్లవి భావం.

ఇంక చరణాల్లో ఆ లెక్కా డొక్కా అంతా ఇల్లా వివరిస్తున్నారు.

మొదటి చరణం.

    జ్ఞానేంద్రియము లైదు శరీరిలొపల
    ఆనక కర్మేంద్రియము లైదు
    తానకపుకామక్రోధాలవర్గములారు
    యీనెలవు పంచభూతా లెంచు మాపౌఁజు

అయ్యా ఈ లెక్క విను. ఈ శరీరి (శరీరం కలవాడు శరీరి అనగా జీవుడు) ఉన్నాడే, వీడికి జ్ఞానేంద్రియాలొక ఐదు ఉన్నాయి. అలాగే మరొక ఐదు కర్మేంద్రియా లున్నాయి. ఇంకా కామక్రోధాదులని ఒక వర్గం వాళ్ళొక అరుగు రున్నారు. ఈ వీడి శరీరాన్ని ఆశ్రయించుకొని పంచభూతాలని లొంగదీయరానివి ఒక అయిదు ఉన్నాయి. మా బలగాన్ని లెక్కవేసుకో వయ్యా.

రెండవచరణం.

    తప్పని గుణాలు మూడు తనువికారములారు
    అప్పటి మనోబుద్ద్యహంకారాలు
    వుప్పతిల్లువిషయము లుడివోని వొక అయిదు
    యిప్పటి మించే కోపము యెంచుకో మాపౌఁజు

ఈ జీవితో పాటుగా త్రిగుణాలని ఉన్నాయి. శరీరానికి  వికారాలని అవొక ఆరు ఉన్నాయి. అంతఃకరణ చతుష్టయం అని ఒక నలుగు రున్నారు. (ముగ్గురిని పేరుపెట్టి చెప్పారిక్కడ వారిలో) . వీరు కాక విషయాలని మరొక ఐదుగురు ఉన్నారు. అపైన కోపం అనే పెద్ద వీరుడొకడు. లెక్కపెట్టుకోవయ్యా మా సైన్యాన్ని.

మూడవ చరణం.

    ఆఁకలి దప్పియును మానావమానములును
    సోఁకినశీతోష్ణాలు సుఖదు:ఖాలు
    మూఁకగమికాఁడ నేను మొక్కెద శ్రీవేంకటేశ
    యేఁకటార గడపేవా నెంచుకో మాపౌఁజు

ఈచరణంలో మూక అన్నా గమి అన్నా దండు అనే అర్ధం వస్తుంది కాని గమికాడు అంటే దండుకి అధిపతి అని తీసుకున్నాక మూక గమికాడ అంటే ఇంత పెద్ద దండుకు అధిపతిని అని గ్రహించాలి.

ఏకట అంటే ఇష్టం. ఏకటి + ఆర --> ఎంతో ఇష్టంగా (తనివార లాగా అన్నమాట)


అంతే కాదయ్యోయ్. ద్వంద్వాలని కొందరు జంటవీరులున్నారు. వాళ్ళ సంఖ్యా? ఓ. బోలెడు మంది సుఖమూ దుఃఖమూ, వేడీ, చల్లనా, ఆకలీ దప్పికా ఇలా లెక్కలేనంత మందున్నారు బలగం.

ఇంత దండుకి నేను సేనాపతిని. ఐనా నీకు దాసుణ్ణి. మ్రొక్కుతున్నానయ్యా నీకు వినయంగా.  ఎంతో ఇష్టంగా నీ సేవలో గడిపే వాడిని. నా సైన్యాన్ని ఎంచుకోవయ్యా. ఇదంతా నీదేను, నీ సేవకై ఉన్నదేను.


ఈ సంకీర్తనంలో ఇలా ఆచార్యుల వారు జీవుడిని ఆశ్రయించుకొని ఉన్న సమస్తమూ అతడి సైన్యం వంటిదనీ, దానితో వాడి భగవత్కైంకర్యం ఇష్టంగా చేస్తూ ఉన్నాడని చమత్కారంగా చెబుతున్నారు.

13, మార్చి 2020, శుక్రవారం

అందమంతా రామమయమై


అందమంతా రామమయమై యున్న దనుటకు

సందియమే లేదిది సర్వకాలసత్యము



అందమైన మాటలకు అందమైన పాటలకు

అందమైన ఆటలకు అందమైనది

అందమైన సభలలో అందరకు హితకరమై

విందుభోజనము వంటి విభుని నామము



అందమైన కథలకు అందమైన కవితలకు

అందమైన కావ్యములకు అందమైనది

అందమైన మన రామచందురుని జీవితమే

అందించు చున్నదది అందరకు శుభము



అందమైన నడతలకు అందమైన బ్రతుకులకు

అందమైన ధర్మములకు అందమైనది

ముందు రానున్న తరము లందును నిలచున దీ

అందమైన రామతత్త్వ మన్న దొక్కటే

విచారించు హరి నావిన్నప మవధరించు - అన్నమయ్య సంకీర్తన.


(కాంబోది)

విచారించు హరి నావిన్నప మవధరించు

పచారమే నాదిగాని పనులెల్లా నీవే



తనువు నాదెందు గాని తనువులోనింద్రియములు

అవిశము నా చెప్పినట్టు సేయవు

మనసు నాదెందుగాని మర్మము నాయిచ్చ రాదు

పనిపడి దూరు నాది పరులదే భోగము



అలరి నానిద్దర నాదెంద గాని సుఖమెల్ల

కలలోని కాపిరాలకతలపాలె

తెలివి నాదెందుగాని దినాలు కాలముసొమ్ము

యెలమి బేరు నాది యెవ్వరిదో బలువు



కర్మము నాదెందు గాని కర్మములో ఫలమెల్ల

అర్మిలి నాజన్మముల ఆధీనమె

ధర్మపు శ్రీవేంకటేశ దయానిధివి నీవు

నిర్మితము నీ దింతే నేరుపు నీమాయది



ఇది అన్నమయ్య ఆథ్యాత్మసంకీర్తనల రెండవసంపుటం లోనిది.  ఈ క్రీర్తన యొక్క రాగం కాంబోది. ఇటీవలి కాలంలో కొందరు దీన్ని కాంభోజి అంటున్నట్లు కనిపిస్తుంది. కాని అసలు పాత రాగం కాంబోది వేరే ఉంటే ఉండవచ్చును. ఇప్పుడు అది ప్రచారంలో లేదు. అన్నమయ్య సాహిత్యంలో అలాంటి పాత రాగాల పేర్లు చాలానే కనిపిస్తాయి.

ఈ సంపుటం యొక్క పరిష్కర్త గారు శ్రీమాన్ గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారు. వారు ఈ సంకీర్తనల్లోని సంధులలో రెండింటిని గూర్చి అధఃపీఠికలో


నాది + అందు గాని --> నాదెందు గాని

తనువులోని + ఇంద్రియములు --> తనువులోనింద్రియములు


అని అంటూ ఇట్టి సంధు లీ వాంగ్మయమున కలవు అని అభిప్రాయం వెలిబుచ్చారు.  ఇటువంటి చిత్రమైన సంధులు అన్నమయ్య చేయటం సర్వసాధారణం. కాని ఇక్కడ వాటికి సులభంగానే అన్వయం కుదురుతున్నది కదా అని అభిప్రాయం కలుగటానికి ఆస్కారం ఉంది.

ఎందుకంటే, నాది + ఎందు --> నాదెందు అన్నది వ్యాకరణామోదితమైన సంధి. తనువు నా దెందు గాని అన్నదానికి పదవిభాగం తనువు, నాది ఎందున్, కాని అని వస్తున్నది. అంటే ఇక్కడ ఎందున్ అన్న పదం ఏ జన్మలోనైనా అంటే ఏ ఉపాధిలోనైనా అన్న స్ఫూర్తిని కలిగిస్తున్నది అని గ్రహిస్తే సరిపడుతున్నది చక్కగా. అలాగే తనువులో నింద్రియములు అన్న ప్రయోగాన్ని తనువులోన్ + ఇంద్రియములు అని గ్రహిస్తే చాలు కదా, లోన్ అన్నది సరైన విభక్తి ప్రయోగమే కదా. సులువుగా ఆలోచన ఇలా సాగుతుంది.

కాని రామసుబ్బశర్మ గారు నాది + అందు గాని --> నాదెందు అని అన్నమయ్య సంధి చేసినట్లు ఊరికే అభిప్రాయపడ లేదు. ఎందుకలా అనుకున్నారు అన్నదానికి ముందుముందు వివరణ ఇస్తాను.

ఇక ఈ అథ్యాత్మ సంకీర్తనం యొక్క భావానుశీలనం చేయడానికి ప్రయత్నిద్దాం.


మొదట పల్లవిని చూదాం.

   విచారించు హరి నావిన్నప మవధరించు
   పచారమే నాదిగాని పనులెల్లా నీవే

మొట్టమొదట పచారమే నాది లో ఉన్న పచారం అంటే ఏమిటి? పచారం అంటే అంగడి, దుకాణము అన్నమాట. మన ఇప్పటికీ పచారీసరుకులు అన్నమాట వాడకం చేస్తూనే ఉన్నాం కదా. ఒక్కసారి గుర్తుచేసుకోండి.

ఓ శ్రీహరీ, కొంచెం ఆలోచించి చూడవయ్యా, నా విన్నపం కాస్త దయచూపి వినవయ్యా. ఈ నా ఉపాధి ఒక పెద్ద దుకాణం. పైకి దీనికి నేను యజమానిలాగా కనిపిస్తున్నాను కాని ఈ దుకాణం పనులన్నీ నడిపించేది నువ్వే కదా అంటున్నారు అన్నమయ్య ఈ సంకీర్తనం ఎత్తుకుంటూ. ఇక చరణాల్లో తన వాదనకు సమర్ధనలు మనవి చేసుకుంటున్నారు.


మొదటి చరణం.

    తనువు నాదెందు గాని తనువులోనింద్రియములు
    అవిశము నా చెప్పినట్టు సేయవు
    మనసు నాదెందుగాని మర్మము నాయిచ్చ రాదు
    పనిపడి దూరు నాది పరులదే భోగము

ఇదిగో ఈదుకాణం పెట్టిన కొట్టుందే అది నాదే. అబ్బో ఇప్పటికి ఇలా ఎన్ని దుకాణాలు తెఱచి ఉంటానో మూసి ఉంటానో. ఎప్పుడైనా సరే ఆ దుకాణం నాదే అంటాను. కాని అందులో పనివాళ్ళుగా నియమించుకున్న ఇంద్రియాలు మహా గడుసువి. అవి ఎప్పుడూ నేను చెప్పిన మాటను విననే వినవు సుమా. అలాగే ఈ దుకాణం మీద పెత్తందారుగా  నియమించిన ఈ మనస్సును నేను నాదే అంటాను కాని, అది పేరుకు మాత్రమే నాది. కాని దాని నడత ఎన్నడూ నా యిష్టప్రకారంగా లేనేలేదు.  అసలు ఈ పెత్తనం పుచ్చుకున్న మనస్సూ దాని క్రింద పనిచేసే ఇంద్రియాలూ అన్నీ కూడా అవి నువ్వు చెప్పినట్లుగా నడుచుకుంటున్నాయే కాని అయ్యో పాపం దుకాణందారు వీడు కదా అని నాకు పూచికపుల్లంత విలువైనా ఇవ్వటం లేదు.


ఇక రెండవ చరణం.

    అలరి నానిద్దర నాదెంద గాని సుఖమెల్ల
    కలలోని కాపిరాలకతలపాలె
    తెలివి నాదెందుగాని దినాలు కాలముసొమ్ము
    యెలమి బేరు నాది యెవ్వరిదో బలువు

ఈ చరణం అదాటున చూస్తే, చరణంలో మొదటిపాదంలో ప్రస్తుతం లభిస్తున్న ప్రతిలో లోపం ఉందని అనిపిస్తుంది. అలా అనుకొని పప్పులో కాలు వెయ్యకండి. ఈమాట చెప్పక తప్పదు.  ఎందుకలా చెప్పవలసి వచ్చిందీ అంటే పాఠకులకు సులభంగా ఉండటానికి అన్నిచరణాల మొదటి పాదాలనూ, మూడవపాదాలనూ వరుసగా చూపుతున్నాను.

    తనువు నాదెందు గాని నువులోనింద్రియములు  1 -1
    మనసు నాదెందుగాని ర్మము నాయిచ్చ రాదు 1 - 3

    అలరి నానిద్దర నాదెంద గాని సుఖమెల్ల  2 - 1
    తెలివి నాదెందుగాని దినాలు కాలముసొమ్ము 2 - 3

    కర్మము నాదెందు గాని ర్మములో ఫలమెల్ల  3 - 1
    ధర్మపు శ్రీవేంకటేశ యానిధివి నీవు 3 - 3

ఈ పైన ఇచ్చిన పాదాలన్నీ ఒకసారి పరిశీలించండి. రెండవచరణం మొదటి పాదం కురుచ అనిపిస్తుంది. ఎందుకో చూదాం. ప్రతిపాదాన్ని క్రీగీటుతో చూపిన యతిస్థానం దగ్గర విరచి చూడవచ్చును. పాదంలోని రెండుభాగాలూ తూకంగా ఉంటాయి.  కొంచెం ఛందస్సూ మాత్రలూ అంటూ ఆలోచించగల వారికి ఉభయభాగాలూ సరిగ్గా పదకొండేసి మాత్రలుగా ఉండటం గమనించ గలరు. గానసౌలభ్యం కోసం ఈభాగాలన్నీ పన్నెండేసి మాత్రలుగా ఉఛ్ఛరించవచ్చును. దయానిధివి నీవు అని చివరి చరణం ఆఖరున ఉన్నా అది పన్నెండు మాత్రల కాలానికి చక్కగా తూగుతుందని కూడా కొంచెం కూనిరాగం తీయగల వారు గమనించ గలరు.

ఇక్కడ చిక్కల్లా రెండవ చరణం మొదటి పాదంతోనే.  ఇది కాస్తా అలరి నానిద్దర నాదెంద గాని సుఖమెల్ల అని ఉండటంతో యతి లోపించిందని తోస్తుంది.  మరి అది అన్నమయ్య రచనావిధానం కాదే. ఆయన నియతంగా యతి ప్రాసలు రెండూ పాటిస్తారు కదా. మరి ఈపాదంలో సమన్వయం ఎలాగు అంటే, అది ఈ నాదెందు అన్న సంధి ప్రయోగం పైన కొంచెం గురిపెట్టి కుదుర్చుకోవాలి.  నాది + అందు గాని --> నాదెందు అని రామసుబ్బశర్మ గారు చెప్పారు కదా. ఆప్రకారం చూసి ఈ   అలరి నానిద్దర నాదెంద గాని సుఖమెల్ల అన్న పాదాన్ని విడమరచి వ్రాస్తే

   అలరి నానిద్దర నా దందు గాని సుఖమెల్ల

అవుతున్నది. ఇప్పుడు అలరి లో అ కు, అందు గానిలోని అం కు యతి మైత్రి చక్కగా సిధ్ధిస్తోంది. ఐనా ఒక్క చిన్న శంక ఉండి పోయింది 'నాదెంద గాని' అని కాక 'నాదెందు గాని' అని ఉండాలి. వ్రాయసకాని తప్పు ఐ ఉండవచ్చును. పోనిద్దాం.


ఇంక ఈ చరణం భావాన్ని తెలుసుకుందాం. పగలంతా అలసి ఉంటాను నీ కైంకర్యాదులతో అనుకుంటే రాత్రికి హాయిగా నిద్రపోవచ్చును ఆ నిద్రా సుఖం అంతా నాదే అనుకుంటాను. ఆఁ, ఏం సుఖం లేవయ్యా. ఏనాటి నిద్రాసుఖం ఐనా, అదంతా కలలోని కాపురం పాలె. అంటే కలల ధాటికి అంతా కలత నిద్రే అన్నమాట వేరే చెప్పాలా?

నేనేదో అంతో ఇంతో తెలివైన వాడిని అనుకుంటాను. నాతెలివి గొప్ప యేముంది. దానితో పనేముంది. రోజులు ఎట్లా గడిచేదీ నిర్ణయించేది కాలం ఐతేను.

ఇలా రాత్రి నిద్రను కలలు దోచి పగటి నా శ్రమను కాలం అజమాయిషీ చేసి నా గొప్ప అన్నది యేమీ లేదని తేలుస్తున్నది.

పగలు నాదుకాణం ఎలా నడపాలీ అన్న విషయంలో ఎన్నో తెలివైన ఆలోచనలు చేస్తే ఏ రోజు ఎట్లా గడిచేదీ అన్నది కాస్తా, నా తెలివి కాక, కాలం నిర్ణయిస్తోంది. పోనీలే రాత్రిపూట ఐనా సరే కాస్త హాయిగా ఉందాం అనుకుంటే ఆ రాత్రి అన్నది కూడా నీ పుణ్యమా అని వచ్చే కలలే లాగుకొని నిద్రాసుఖం కూడా లేకుండా చేస్తున్నాయి.


చివరి చరణం.

కర్మము నాదెందు గాని కర్మములో ఫలమెల్ల
అర్మిలి నాజన్మముల ఆధీనమె
ధర్మపు శ్రీవేంకటేశ దయానిధివి నీవు
నిర్మితము నీ దింతే నేరుపు నీమాయది

ఇక్కడ ధర్మపు శ్రీవేంకటేశ అన్న సంబోధనలో ధర్మపు పదం ధర్మపురిని సూచిస్తున్నదని అనుకోకూడదు. నిజానికి అన్నమయ్యకు వేంకటేశుడి తరువాత అమిత ఇష్టమైన దైవస్వరూపం నారసింహస్వరూపం. ఆయన సంకీర్తనలో ఏక్షేత్రంలో ఏరూపంలో ఉన్న మూర్తికి ఐనా వేంకటేశ ముద్ర తప్పని సరి. కాబట్టి ధర్మపు శ్రీవేంకటేశ అని సంబోధించ బడినది ధర్మపురి యోగనృసింహమూర్తి అనిపించవచ్చును. కాని అలా కాకపోవటానికే ఎక్కువ అవకాశం ఉన్నది. ఎందుకంటే ధర్మపురి తెలంగాణాలో ఉన్నది. అన్నమయ్య అంత దూరం వెళ్ళి ఆ క్షేత్రదర్శనం చేసి స్తుతించాడా అన్నది విచార్యం. కాబట్టి. ఇక్కడ సంబోధిత దైవమూర్తి వేంకటరాయడే అనుకోవటం సబబుగా అనిపిస్తుంది.

ఓ శ్రీహరీ, వేంకటేశా, ఏవేవో కర్మములు చేస్తూ ఉంటాను.  అవన్నీ ఈ దుకాణం బాగుకోసం అనుకుంటాను. మరి ఈదుకాణం నాది కదా. కాని నేను ఏమి చేసినా దానికి ఎటువంటి ఫలితం వస్తుందో అన్నది తెలియకుండా ఉంది.  నేను ఏమి కోరి ఏమి చేసి ఏమి ఫలితం ఆశించాలన్నా దానికి నాకు ప్రాప్తం అని ఉండాలి కదా. అదేమో నా పూర్వజన్మల అధీనంలో ఉంది. అప్పట్లో నేను చేసిన మంచి చెడ్డల ఫలితాలు నా కర్మలను నడిపిస్తున్నాయి కాని ఈదుకాణం నాదో నాదో అంటూ నేనూ చేయగలుగుతున్నది ఏమీ లేదయ్యా.

అసలు నాచేత ఈకొట్లు పెట్టించిందే నువ్వు. ఇలా పూర్వం కూడా ఎన్నో కొట్లు తెరిపించావు మూయించావు.

నువ్వు పెట్టించిన దుకాణాన్ని నేను నిర్వహిస్తున్నానని అనుకొవటం వట్టి భ్రమ. అదంతా నీమాయ నడిపిస్తున్న నాటకం.  ఆమాయ నేర్పుగా నన్ను కొట్లో యజమానిగా కూర్చో బెట్టి అన్ని కార్యక్రమాలనూ నీవిగా నడిపిస్తున్నది.

నేను నిమిత్తమాత్రుడిని అంతే!

నువ్వే నాచేతనూ నాబోటి అనేక జీవులచేతనూ ఈసంసారంలో అనేకానేక విధాలైన అంగళ్ళు (దేహాలు) తెరిపిస్తున్నావు. వాటిలొ మేము ఊరికే కూర్చొని యజమానులం కాబోలు ననుకొని భ్రమపడుతూ ఉంటాము. కాని అదంతా నీ మాయా విలాసం మాత్రమే. నీమాయచే నీవినోదం కొరకు నడుస్తున్న నాటకం మాత్రమే అని ఈ సంకీర్తన యొక్క ఆంతర్యం.


12, మార్చి 2020, గురువారం

సీతారాముల సేవచేయగ చిత్తమొల్లని వాడు


సీతారాముల సేవచేయగ చిత్తమొల్లని వాడు

ప్రీతిమై నరకద్వారము ముంగిట వేచియున్నట్టి వాడు



రామచంద్రుని నామామృతమున రక్తిలేదను వాడు

కాముని బాణపుదెబ్బల సుఖము గట్టిగ మరగిన వాడు



భాగవతుల సద్భక్తిని చూచి పరిహసించెడి వాడు

రోగగ్రస్థ మైనట్టి మనసుతో రోజు చున్నట్టి వాడు



రాము కలడో లేడో యనుచు రచ్చ చేసెడి వాడు

పామరత్వమే పాండిత్యంబని భ్రమపడుచున్న వాడు



కల్లగురువుల మరగి రాముని ఖాతరు చేయని వాడు

గుల్లై ఒళ్ళు నిల్లు తుదకు గోవింద కొట్టెడు వాడు



రాముని కాదని రావణు గొలిచే రక్కెసబుధ్ధుల వాడు

తామసత్వమున కన్నుగానక తప్పులు చేసెడి వాడు



వేరు దైవముల నెన్నుచు హరిపై విముఖత గల్గిన వాడు

శ్రీరాముని నిజతత్వ మెఱుంగక చెడిపోవుచు నున్నాడు


అంతకన్నను కావలసిన దన


అంతకన్నను కావలసిన దన నయ్యా యింకేమున్నది

అంతకన్నను కోరదగినదన నయ్యా యింకేమున్నది



హరిసేవనమే మీకెల్లప్పుడు నానందముగా తోచినచో

హరికీర్తనమం దెల్లప్పుడు మీ కత్యుత్సాహము తోచినచో

హరినామామృత మెల్లప్పుడు మీకతిమధురముగ తోచినచో

హరేరామ యని హరేకృష్ణ యని యనుటే గొప్పగ తోచినచో



హరితీర్ధములను దర్శించుట మీ కానందంబుగ తోచినచో

హరిచరితములను చదువుటలో మీ కత్యుత్సాహము తోచినచో

హరిని స్మరించుట యెల్లప్పుడు మీ కతిమధురముగ తోచినచో

హరేరామ యని హరేకృష్ణ యని నిరతము పాడగ తోచినచో



హరిభక్తులను దర్శించుట మీ కానందంబుగ తోచినచో

హరిభక్తుల సేవించుటలో మీ కత్యుత్సాహము తోచినచో

హరిభక్తుల సద్బోధలు విన మీ కతిమధురముగ తోచినచో

హరేరామ యన హరేకృష్ణ యన నాత్మానందము తోచినచో


11, మార్చి 2020, బుధవారం

ఆరగింపవో మాయప్ప యివే పేరిన నేతులు పెరుగులును - అన్నమయ్య సంకీర్తన


ఆరగింపవో మాయప్ప యివే
పేరిన నేతులు పెరుగులును

తేనెలు జున్నులు తెంకాయ పాలును
ఆనవాలు వెన్నట్లును
నూనె బూరెలును నురుగులు వడలును
పానకములు బహుఫలములును

పరమాన్నంబులు పంచదారలును
అరిసెలు గారెలు నవుగులును
కరజికాయలును ఖండమండెగలు
పరిపరివిధముల భక్ష్యముల

కడుమధురంబగు కమ్మఁబూరణపుఁ
గుడుములు నిడ్డెన కుడుములును
సుడిగొను నప్పాలు సుకినప్పాలును
పొడి బెల్లముతోఁ బొరఁటుచును

కాయపు రుచులకు గనియగు మిరియపుఁ
గాయలు నేలకి కాయలును
పాయరాని యంబాళపుఁగాయలు
నాయతమగు దధ్యన్నములు

ఒడికవుఁ గూరలు నొలుపుఁ బప్పులును
అడియాలపు రాజాన్నములు
బడిబడిఁ గనకపుఁ బళ్ళెరములతోఁ
గడువేడుక వేంకటరమణా

ఇది ఆరవసంపుటం లోని సంకీర్తనం. ఇందులో, అన్నమాచార్యుల వారు వేంకటరమణుడికి ఆరగింపు నివేదిస్తున్నారు. చాలా భక్క్ష్య భోజ్యాదికాన్ని ప్రస్తావిస్తున్నారు. కొన్నింటిని చూదాం.

ముందుగా ఒక మాట.

ఈ సంకీర్తనం నాకు ఆర్కీవ్ డాట ఆర్గ్ లోనూయూట్యూబ్‍ లోనూ కనిపించింది. ఇది సుశీల, నాగేశ్వరనాయుడు గార్లు ఆలపించింది.  ఆపాతమధురమైన సుశీల గాత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? నాయుడు గారి గళం కూడా బాగుంది. ఐతే అదనంగా ఆరగింపవయ్యా అంటూ తరచూ వారి గానంలో వాడుక చేయటం నాకైతే అభ్యంతరం చెప్పదగిన విషయంగా అనిపించింది.  అదీకాక నాయుడు గారు పాటను పల్లవితో మొదలు పెడుతూ ఆరగించవయ్యా అన్నారు. ఏదో ఒక మాటనే వాడుక చేయాలి కదా అన్నది మరొక అభ్యంతరం.  అన్నమయ్య ఆరగింపవో అన్నప్పుడు పాటలో ఆద్యంతం అదే మాటను వాడుక చేయాలి. లేక పోతే మనం అన్నమయ్యకు మెఱుగులు దిద్ది ఆయనకే విద్య నేర్పినట్లు ఎబ్బెట్టుగా ఉంటుంది కదా.

ఈ సంకీర్తనలంలో అన్నమాచార్యుల వారు కాయపు రుచులకు గనియగు మిరియపుఁ
గాయలు అని మిరపకాయలను ప్రశంశించి చెప్పటం గమనించండి.

అన్నమయ్య జీవించిన కాలం మే 9, 1408 నుండి ఫిబ్రవరి 23, 1503 వరకు. ఈ సమాచారం వికీపీడియా నుండి స్వీకరించాను. అలాగే వికీపీడియాలో మిరపకాయ సమాచారం చూదాం. ఆపేజీలో "1493లో వెస్టిండీస్‌కి రెండో నౌకాయానం చేసిన కొలంబస్‌కు ఫిజీషియన్ అయిన డిగో అల్వరేజ్ చన్కా, మొట్టమొదటగా మిరపకాయలను స్పెయిన్‌కు తీసుకొని పోవడంతో పాటు వాటి వైద్యపరమైన ప్రభావాల గురించి 1494లో అక్షరబద్దం చేశారు." అనీ, ఆ తరువాత "స్పెయిన్ నుంచి మిరపకాయలను పొందిన పోర్చుగీస్ వీటిని భారతదేశంలో సాగుచేయడం సైతం మిరప అనేది అన్ని దేశాలకు విస్తరించడానికి మరో ముఖ్యమైన కారణంగా నిలిచింది"  అనీ చూడవచ్చును. వికీపీడీయా ప్రకారం మిరపకాయలు మొదట భారతదేశంలోని పోర్చుగీసు కాలనీలకూ ఆతరువాత మెల్లగా ఇతర ప్రాంతాలకూ విస్తరించాయి.

ఈ కీర్తనలో అన్నమయ్య నేరుగా మిరియపు కాయలు అని మిరపకాయలను పేర్కొన్నారు కదా,  భారతదేశంలోని ప్రవేశించిన మిరపకాయ కేవలం 1494 - 1503 మధ్యకాలంలో తిరుమల దాకా వ్యాపించటం అంత నమ్మశక్యం కాదు. పైగా విశ్వామిత్రసృష్టి అని మనవాళ్ళు దూరం పెట్టకుండానూ, ఆగమశాస్తం తాలూకు అభ్యంతరాలు దాటుకొని పూజారుల మడి ఇళ్ళలో దేవుడి ప్రసాదంలోనికి అంత త్వరగా మిరపకాయలు దూరగలవా? మీరే ఆలోచించండి. నాకైతే నమ్మకం లేదు. బహుశః మిరపకాయలు ఆ పోర్చుగీసు వాళ్ళు పట్టుకొని రాకముందే మనదేశంలో వాడకంలోంకి వచ్చి ఉండవచ్చును అనిపిస్తోంది నాకు.

ఈ కీర్తనలో తెంకాయ అన్నమాట కనిపిస్తుంది. తెంకాయ అంటే టెంకాయ అన్నమాట, తెన్ అంటే దక్షిణాది అని అర్ధం. దక్షిణప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుందని కాబోలు ఈపేరు. అన్నట్లు తెనుగు అన్న మాటలో తెన్ కూడా ఇదే నట.

కరజికాయలు అన్నమాట కూడా ఉందిక్కడ. ఇప్పుడు మనం కజ్జికాయలు అంటున్నాం కాని పూర్వరూపం కరజికాయలు  అన్నమాట.

ఇక్కడ అంబాళపు కాయలు కనిపిస్తున్నాయి కదా అవి అడవిమామిడి లేదా నల్లమామిడి పండ్లు అన్నమాట. ఈ చెట్టును శాస్త్రీయంగా Spondias mangifera అంటారు.

ఇప్పుడందరూ ఇడ్లీ అని అరవమాటకు పెద్దపీట వేసేస్తున్నారు కాని మొన్నమొన్నటి వరకూ ఇడ్డెన్లు అనే అనే వాళ్ళం.

ఖండమండిగెలు అంటే పాలూ చక్కర గోధుమపిండితో చేసే భక్ష్యం అట. బహుశః మన గోరుమీటీల వంటివేమో.

ఈ సంకీర్తనాన్ని అన్నమయ్య బ్లాగులో కూడా చూడవచ్చును.

10, మార్చి 2020, మంగళవారం

ఊరూరా వెలసినట్టి శ్రీరాముడు


ఊరూరా వెలసినట్టి శ్రీరాముడు

వీడు కోరికోరి చేరువారి కొంగుబంగరు



మన యెదుట ననిశ ముండు మంచి చేయుచుండు

మనసులలో నిలిచియుండు మనవాడై యుండు

చెనటుల శిక్షించుచుండు జనుల నేలుచుండు

తన భక్తుల నెల్లపుడు తనర బ్రోచుచుండు



అడుగడుగున తోడుండు నాపదల కడ్డుండు

అడిగినట్టి వరములిచ్చి యాదుకొనుచు నుండు

పడనీయడు వేదనలు చెడనీయడు బ్రతుకులు

వడిగా కరుణించి యపవర్గ మిచ్చుచుండు



వాడవాడ లందు రామ భజన నడచుచుండు

వేడుక రాముని పాటలు పాడుచుందు రందరు

వాడుకగా విభుని గుడికి వచ్చుచుందు రందరు

చూడ రామభక్తులతో సొంపారు నూళ్ళన్నియు


9, మార్చి 2020, సోమవారం

చింతలన్ని తీర్చును శ్రీరాముడు


చింతలన్ని తీర్చును శ్రీరాముడు ని

శ్చింత చేకూర్చును సీతారాముడు



పిల్లకు పెళ్ళెప్పుడని తల్లికి చింత

విల్లెత్తెడు వాడేడని విభునకు చింత

విల్లెత్తుట కష్టమనుచు వీరుల చింత

విల్లు విరిచి చింతలు రఘువీరుడు తీర్చె



తరుణి చేతి వరమాలకు ధన్యత చింత

పురమునకు రాచబిడ్డ పరిణయ చింత

హరిస్పర్శకు హరునివింటి కాయెను చింత

హరి మన రఘువీరు డివి యన్నియు దీర్చె



పరశురాము డచ్చోటికి వచ్చుట చింత

వరుని కయ్యమాడ బిలువ ప్రబలెను చింత

హరిధనువు నెత్తుమనుచు హఠ మొనరింప

మరి  రఘువరు డతని చింత మాన్పి పంపెను


ఎంతో‌ మంచి దేవుడండీ ఈరాముడు


ఎంతో‌ మంచి దేవుడండీ ఈరాముడు వాడు

చింతలన్ని చిటికెలోన చెదరగొట్టును



కడుపుతీపి వలన బొందె కైకమ్మ చింతను

యడిగినది పడతి మగని నడుగరానివి

ఒడయ డౌను కాదనక యుర్విని గూల

వడిగ తల్లి కోర్కె దీర్చ నడవి కేగెను



ఆపైన భరతున కంతు లేని చింతాయె

కాపాడు మనుచు వచ్చి కాళ్ళను బడియె

శ్రీపాదుని పాదుకలను శిరసున దాల్చి

తాపోపశమన మాయె తమ్మున కపుడు



రాముడు పురమందు లేక ప్రజలకు చింతాయె

రాముడు పాదుకల నొసగి రక్షణ గొలుప

భూమి నెల్ల వారలును పొంది రూరట

స్వామి వలన చింత దీర సంతసించిరి



8, మార్చి 2020, ఆదివారం

రామ రామ రామ రామ


రామ రామ రామ రామ

రామ రామ రవికులసోమ



శ్రీవిష్ణురూప రామ రామ శ్రీరమణీప్రియ రామ రామ

దేవగణార్చిత రామ రామ దీనజనావన రామ రామ

భూవలయాధిప రామ రామ భూరిప్రతాప రామ రామ

రావణమర్దన రామ రామ రాజలలామ రామ రామ



భూమిసుతావర రామ రామ పురుషోత్తమ హరి రామ రామ

కామితవరద రామ రామ కమలదళేక్షణ రామ రామ

ప్రేమస్వరూప రామ రామ వేదాంతవేద్య రామ రామ

తామసహరణ రామ రామ ధర్మస్వరూప రామ రామ



కరుణాభరణా రామ రామ కలుషనివారణ రామ రామ

నిరుపమవిగ్రహ రామ రామ తరణికులేశ్వర రామ రామ

వరదారక హరి రామ రామ భక్తజనప్రియ రామ రామ

హరి గోవింద రామ రామ అపవర్గప్రద రామ రామ


హరికి చేయనట్టి పూజలు


హరికి చేయనట్టి పూజ లన్నియును వృథా వృథా

హరి తత్త్వము యోచించ నట్టి బ్రతుకు వృథా వృథా



హరి పురాణములు చదువ నట్టి బ్రతుకు వృథా వృథా

హరి భక్తుల కూడిమాడ నట్టి బ్రతుకు వృథా వృథా

హరి కథలను విన నొల్ల నట్టి బ్రతుకు వృథా వృథా

హరిని తలపని కాల మంతయును వృథా వృథా



హరికి నివేదితము కాని యాహారము వృథా వృథా

హరినామము పలుకకుండు నట్టి నాల్క వృథా వృథా

హరితీర్థము లందు తిరుగ నట్టి తనువు వృథా వృథా

హరిభక్తి విరహితమై నట్టి జన్మ వృథా వృథా



హరిని తెలుపనట్టి చదువు లన్నియును వృథా వృథా

హరిని రాముడనుచు తెలియ నట్టి బుధ్ధి వృథా వృథా

హరికన్యము తలచు నట్టి యతని తెలివి వృథా వృథా

హరిసంకీర్తనము లేనట్టి దినము వృథా వృథా

సత్యము నెఱిగించవయ్య చక్కగాను


సత్యము నెఱిగించవయ్య చక్కగాను

భృత్యులము మాకు కనువిప్పుగాను



నీ కన్య మసత్యమని నీవొకడవె సత్యమని

మాకు తెలియజెప్ప వయ్య మంచిగాను

లోకుల మజ్ఞానులము మాకేమి తెలియును

నీ కరుణ వలన మాకు నిజము తెలియును



హరిమయము కాని ద్రవ్యమణుమాత్రము లేదని

పరమభాగవతులు చెప్ప పలుకు విందుము

మరి విశ్వమంతయు నీవై పరిఢవిల్లు చుండ

అరయ నే దసత్యమనుచు నెఱుగ వలయును



దశరథాత్మజుడవగుచు దయతోడ తోచితివి

విశదపరచినావు ధర్మ వివరమెల్ల

వశవర్తుల మగు మాకు పరగ నీసంశయము

ప్రశమితముగ చేయవయ్య బాగు గాను

7, మార్చి 2020, శనివారం

తాపసివై వనములకు తరలు వేళ

తాపసివై యడవులకు తరలు వేళ

చాపమేల శ్రీరామచంద్ర నీ కిపుడు



వనవాసము చేయవలయు ననగానే సిధ్ధమని

ఘనుడ నారచీరలను కట్టుకొన్నావే

పనిగొని మర్రి పాలు పట్టించి తలనిండుగ

ముని వలె వేషమును వేసి వనములో జొచ్చితివే



నరుడవై వచ్చినట్టి నారాయణుండ వని

హరు డెఱుగును బ్రహ్మాదు లంద లెఱుగుదురు

మరి నీవది యెరుగవే శరశరాసనంబుల

నిరసించవు విపినంబుల నీవు జొచ్చునపుడు



వనజేక్షణ వనములను మునులకు నిష్కంటక

మొనరింపగ వచ్చునని యోచించితివో

వనముల కాపురమె కాని వానప్రస్థాశ్రమమని

పినతల్లియు విధించ లేదని నీవు తలచితివో

6, మార్చి 2020, శుక్రవారం

వీని పేరు రాముడు వీడు నా దేవుడు


వీని పేరు రాముడు వీడు నా దేవుడు

తానే నా చేయు పట్టి దయచూపెను



అంతులేని భవజలధి యందున్న వాడను

చింతలపాలైన వాడ స్నేహితులార

యెంతో దయచూపి వేగ నిచ్చె కైదోడు నాకు

వింత గాదె మున్ను సేవింపని నన్ను గాచె



వచ్చి చేయిచ్చి మృదు వచనంబుల నాడి

మెచ్చి తన నామ మంత్ర మిచ్చెనండి

అచ్చముగ నవ్యాజమౌ నట్టి కారుణ్యము కాక

ముచ్చటగా చేరదీయ వచ్చుట నేమందుము



ఎన్ని జన్మముల బంధమిది యెట్లెఱుగుదు

నన్నియు బాగుగ నెఱుగు నతడొక్కడే

విన్నాడా రామదేవు డున్నాడు నావాడని

యెన్నడును  దండధరుడు నన్ను జూడ రాడు


5, మార్చి 2020, గురువారం

రామకోవెల కేగుదమా రామభజన చేయుదమా


రామకోవెల కేగుదమా రామభజన చేయుదమా

రామా రామా రామా యనుచు  రామకృపనే పొందుదమా


ప్రీతిగ మన గుడిలో నున్న ఖ్యాతి గలిగిన దేవుళ్ళు

సీతారామలక్ష్మణుల సేవలతో తరించుదమా

భూతలవాసుల కందరకు పురుషోత్తముని కొలువొకటే

చేతోమోదము గూర్చునది శ్రీకైవల్యము చేర్చునది



రామభక్తుల చేరుదమా  రామవైభవ మెఱుగుదమా

రామగాథలు పాడుదమా  రామతత్త్వము నెఱుగుదమా

రామకీర్తిని పొగడుదమా  రామనామము చేయుదమా

రామబ్రహ్మోపాసనమే రక్తి ముక్తి దాయకము



రామభజన చేసినచో పామరత్వము తొలగు కదా

రామభజన చేసినచో కామితమే సిద్ధించు కదా

రామభజన చేసినచో కామక్రోధము లణగు కదా

రామభజన చేసినచో రాముడు సంతోషించు కదా