16, మార్చి 2020, సోమవారం

ఎవ్వనిఁ దలఁచితివే ఎక్కడ మోహించితివే - అన్నమయ్య సంకీర్తన


ఎవ్వనిఁ దలఁచితివే ఎక్కడ మోహించితివే

చివ్వనఁ జెప్పవే నాతో సిగ్గుపడనేఁటికి



చెక్కులేల చెమరించె చెలియ నీ కిదె నేఁడు

వెక్కసపు టెండలతో వేసవి రాదు

గక్కున నీమేనేల కడుఁ  బులకించె నేఁడు

వక్కణింప నింక జడివానలు రావు



వెలువెల్లఁ బారనేలే వెన్నెలబొమ్మ వలె

అలరు శారదసమయంబు గాదు

పలకేనీమోవి నేల పక్కులుగట్టే నేఁడు

కలికి యిప్పుడు మంచుకాలము గాదు



కప్ప నేల పయ్యదను కాలమిది చలి గాదు

చెప్పలేదు వసంతము చిగిరించెను

దప్పిదేర నిటు గూడె తరగ నిన్ను నింత చేసె

యిప్పుడా శ్రీ వేంకటేశుఁ డేడనున్నాఁడే


అన్నమయ్య చేసిన శృంగారసంకీర్తనల్లో ఒకటి ఇది.

ఈ సంకీర్తనంలో ఋతువులను చమత్కారంగా ప్రస్తావించటం మనం గమనించ.వచ్చును.  చూడండి. వసంతము , వేసవి, జడివానలు, శారదసమయంబు, మంచుకాలము, చలికాలము అంటూ ఋతువులను సూచిస్తున్నారు.

చెలికత్తె నాయికతో అంటున్న మాటలుగా ఈ సంకీర్తనం ఉంది.  చెలికత్తియ అంటున్నది కదా

    ఎవ్వనిఁ దలఁచితివే ఎక్కడ మోహించితివే
    చివ్వనఁ జెప్పవే నాతో సిగ్గుపడనేఁటికి

అని. అంటే

అమ్మాయీ నీతీరు చూస్తుంటే నువ్వు ఎవరినో తలచి క్రిందుమీదు లౌతున్నావని తెలుస్తూనే ఉంది. అతడెవరో చెప్పవే. నేను నీ యిష్టసఖిని కదా, నాతో చెప్పవచ్చును కదా, సిగ్గుపడటం దేనికీ?  వెంటనే సంగతి ఏమిటో చెప్పు. ఎక్కడి మోహాలివీ? ఎవరిని తలచుకొనీ?

నువ్వు చెప్పకపోయినా నీ తీరు పట్టి యిస్తూనే ఉంది, విషయం ఏదో ఉందని.


    చెక్కులేల చెమరించె చెలియ నీ కిదె నేఁడు
    వెక్కసపు టెండలతో వేసవి రాదు

చెక్కులు అంటే చెక్కిళ్ళు. అవి చూపుతూ సఖి అంటున్నది ఇలా. చూడూ నీ చెక్కిళ్ళు ఎలా చెమరిస్తున్నాయో. ఎందుకలా చెమటలు పడుతున్నట్లూ? ఏం వేసవి కాలం ఏమీ రాలేదే దుస్సహం ఐన ఎండలతో?


    గక్కున నీమేనేల కడుఁ  బులకించె నేఁడు
    వక్కణింప నింక జడివానలు రావు


పైగా నీ ఒళ్ళు చూస్తే ఒకటే పులకరింతలు వస్తున్నాయని తెలిసిపోతూ ఉంది. చెప్పాలంటె ఇది వానాకాలం కాదే, భోరున వానలూ కురవటం లేదే?

వానాకాలానికీ పులకరింతలకూ సంబంధం ఏమీ లేదు కాని ఆచార్యులవారు ఎందుకు ఇలా ముడేసి చెప్పారో మరి. ముగ్ధ ఐన నాయిక జడివానల భీభత్సానికి బెదరి నాయకుడి చెంత చేరటం అన్నది ఒక ముచ్చట. కనీసం నాయకులకు ముచ్చట. అటువంటి సందర్భాలు నాయికా నాయకుల మధ్యన నడిచాయనుకోండి. వానలు పడినప్పుడల్లా నాయిక పూర్వస్మృతుల లోనికి వెళ్ళి పరవశించటమూ తత్కారణంగా ఆమె మేను పులకరించటమూ అన్నవి ఇక్కడ సూచించబడింది అనుకోవాలి. అన్నట్లు మగవాళ్ళకు పులకరింత అనకూడదు రోమాంచం అనాలి. విషయం ఒక్కటే.

ఇక్కడ సఖి అంటున్నది ఏమిటంటే ఏమి తలచుకుంటున్నావే అని కదా. అంటే ఏపూర్వ సంఘటనలు నెమరు వేసుకొంటూ నీ మేను పులకరిస్తున్నదీ అని నిలదీస్తున్నది అన్నమాట.

ఇంకా చెలికత్తె ఏమంటున్నదీ అంటే

    వెలువెల్లఁ బారనేలే వెన్నెలబొమ్మ వలె
    అలరు శారదసమయంబు గాదు

ఏమిటోయ్ అమ్మాయీ అలా వళ్ళంతా తెలతెల్లగా ఐపోతున్నదీ? చూడటానికి అచ్చం వెన్నెలను ముద్దచేసి బొమ్మచేసినట్లున్నావు. ఇదేమనా శరదృతువా? కాదే?

ఋతువులన్నింటిలో శరత్తుకు ఒక విశిష్ఠ స్థానం ఉంది. వానలు వెనుకబట్టి, ఆకాశం నిర్మలంగా ఉంటుంది. పుష్కలంగా నీరు దొరికిన ప్రకృతిలోని చెట్టూ చేమా అంతా నిండుగా పచ్చగా ఉంటుంది. దానికి తోడు వెన్నల రాత్రులైతే ఆ శోభ చెప్పనలవి కాదు. శారదరాత్రు లుజ్వల తారక హార పంక్తులం జారు తరంబులయ్యె వంటి పద్యాలను స్మరించుకుంటే ఆ ఋతుశోభ మనసుకు వస్తుంది. ధగధగలాడే శరత్పూర్ణిమ రాత్రి వెన్నెలకు సాటే లేదు ప్రకృతిలో.

ఇప్పుడు మన నాయిక, ఆ శరత్పూర్ణిమ రాత్రి వెన్నలను పిసికి ముద్దచేసిన బొమ్మలా ధగదగ లాడుతోందట.

చెలికత్తియకు అనుమానం వస్తోంది, చూస్తుంటే ఇదేదో వ్యవహారం తనకుతెలియకుండా నడిచినట్లుంది అన్న భావన కలిగి అంటున్నది కదా,

    పలకే నీమోవి నేల పక్కులుగట్టే నేఁడు
    కలికి యిప్పుడు మంచుకాలము గాదు

ఈ మాట చెప్పూ? నీ ముఖం ఏమిటీ అక్కడక్కడా పుండ్లు ఆరి పక్కులు కట్టినట్లు తోస్తోందీ? విషయం ఏమిటీ? ఊరికే పగుళ్ళు వచ్చి అలా అవటానికి ఇదేం మంచు పడే కాలం కాదే అని గదమాయిస్తోంది. అంటే నీకు నాయకుడితో సమాగమం కలిగి ఉండాలె? నాక్కొంచెం కూడా ఉప్పంద లేదే అని నిష్టూరంగా అంటోందన్న మాట.

పైగా

    కప్ప నేల పయ్యదను కాలమిది చలి గాదు

అంటోంది కదా, ఎందుకలా పమిట కప్పుకుంటున్నావూ,  ఇప్పుడు చలికాలం కాదు కదా అని.

అంటే నాయిక తనకు నాయకుడితో సమాగమం కలిగిందా అన్నప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి బదులుగా తనను సఖి మరీ పరిశీలనగా చూడకుండా పమిట కప్పుకుంటున్నదిట, ఆ సంగతి చెలి గ్రహించి ఎత్తిపొడుస్తున్నది ఇది చలికాలం కాదే ఎందుకు పమిట కప్పుకోవటం అని.

ఎలాగూ చెలికత్తెకు విషయం తెలిసిపోయింది. ఇంక దాపరికం ఏముంది. చెలి మాత్రం తెలిసిందిలే అని ఊరికే వదుల్తుందా

మొదట

    చెప్పలేదు వసంతము చిగిరించెను

అని మేలమాడింది. నాయిక అచ్చం వసంతలక్ష్మి లాగా ఉందట. వసంతం సంతోషానికి ప్రతీక కదా, నాయిక సంతోషం అంటే నాయక సమాగమం అన్నసంగతి చెప్పాలా వేరే. అందుకే ఇష్టసఖి అంటున్నది కదా,


    దప్పిదేర నిటు గూడె తరగ నిన్ను నింత చేసె
    యిప్పుడా శ్రీ వేంకటేశుఁ డేడనున్నాఁడే

సరే నమ్మాయీ విషయం తెలిసిపోయిందిలే. నీకు సమాగమసౌఖ్యాన్ని ప్రసాదించి శ్రీ వేంకటేశ్వరుడు నిన్నిలా విరహంలో ముంచి వెళ్ళినట్లు తెలుస్తున్నది. ఇంతకీ శ్రీవారు ఆ శ్రీవేంకటేశ్వరుడు ఎక్కడున్నాడమ్మా?

దొంగా, అడడు ఎక్కడున్నాడో నీకు తెలుసును, వస్తున్నాడనీ తెలుసును. ఆయనకోసం ఎదురుచూస్తున్నావు కదా అని మేలమాడటం అన్నమాట.


2 కామెంట్‌లు:

  1. ఆహా! ఏమి గీతం Sir ఇది. మీరు అర్థం వివరించి చెబితే మనసు పరవశించి పోతుంది.

    అన్నమయ్యకు శతకోటి వందనం. ఒక గీతం లో ద్వాదశ రాశులు, మరొక గీతం లో నవ రత్నాలు, ఇంకొక గీతంలో ఆరు ఋతవులు, ఒక గీతం లో నవ విధ భక్తులు, ఎన్నో గీతాలలో దశావతారాలు.. అసలు అన్నమయ్య స్పృశించని హైందవ జీవన పార్శ్వం ఉందా అనిపిస్తుంది.

    వేసవి రాదు, జడివానలు రావు అని చెప్పడం లో ఉన్న అభివ్యక్తి వారికే సాధ్యం.

    ప్రతి పదం లోనూ వేంకటేశుని దే ముద్ర. Such self effacing effort is the ultimate in devotion.
    🙏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నమయ్య సంకీర్తనం ఏంకటేశ ముద్ర కలది ఎప్పుడూ. ఆయన ఏవూరికి వెళ్ళి ఏదేవుణ్ణి దర్శించుకొని ఆయనపై ఒక సంకీర్తనం చెప్పినా సరే ఆదేవుడికీ వేంకటేశముద్ర తప్పదు.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.