19, మార్చి 2020, గురువారం

అతడి పేరు రాము డంట అమితసుకుమారు డంట


అతడి పేరు రాము డంట  అమితసుకుమారు డంట

ప్రతిలేని వీరు డంట అతని గంటిరే



సితతామరసాక్షు డంట జీమూతశ్యాము డంట

ధృతిని మేరుగిరి యంట దురితనాశకుం డంట

సతతశాంతమూర్తి యంట సకలమౌనినుతు డంట

అతిమథురవచను డంట అతని గంటిరే



సమరవిజయశీలి యంట సదాసత్యవ్రతు డంట

విమలధర్మచరితు డంట వీరలోకనుతు డంట

సుమశరసన్నిభు డంట కుమతిజనకాలు డంట

అమితగుణశాలియంట అతని గంటిరే



చిరునగవుల వా డంట వరదీర్ఘభాహు డంట

పరమదయాశాలి యంట పతితపావనుం డంట

గురుమఖరక్షకు డంట కోదండపాణి యంట

హరధనుఛ్ఛేత్త యంట అతని గంటిరే


4 కామెంట్‌లు:


  1. మీరేమన్నా న్యూసు చానల్సు తీర్థము పుచ్చుకున్నారా యేంటి అన్ని " ట " 'ట " అంటున్నారు :)


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అదేం వెటకార మంట?

      నేనే మన్నా సెలబ్రిటీనా యేమిటీ ఏ న్యూస్‍ఛానెల్‍ వారైనా పిల్చి తీర్ధప్రసాదా లివ్వటానికి?

      తొలగించండి
  2. ఆ కోదండముపట్టు ఠీవి , కనులందార్తావన జ్యోతులున్
    రాకాశోభలుగుల్కు నెమ్మొగము , శ్రీరాజిల్లు వక్షంబునున్
    లోకాలేలు కిరీటభాస్వికలు నీలోగంటి రామా ! త్రిలో
    కైకారాధననామ ! నిన్గొలిచి మ్రొక్కంగల్గు సర్వార్థముల్ .

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.