19, ఆగస్టు 2020, బుధవారం

ముచ్చటగా మూడు రాజధానులు.

రాష్ట్రానికి మూడు రాజధానులా అని ఆశ్చర్యపోయిన వాళ్ళ, పోతున్న వాళ్ళ, ఇంకా ఇంకా పోబోతున్న వాళ్ళ సంఖ్యే చాలా ఎక్కువగా ఉందని అనిపిస్తోంది.

అలాగే కొంపములిగిపోతోంది అని విచారపడుతున్న వాళ్ళ, విచారంలో కూరుకుపోతున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్లుంది.

అలాగే ఈవిషయంలో ఆశ్చర్యం అనే మెదటి అంకం దాటి ఆగ్రహం అనే ద్వితీయాంకంలో గంతులేస్తున్న వాళ్ళ సంఖ్యా, ఆ అంకంలో ప్రవేశించ బోతున్న వాళ్ళ సంఖ్యా కూడా బాగానే ఉంది.

ఏదైనా అహితం మీదికి వస్తే మనుష్యస్వభావం‌ మొదట అదంతా అబధ్ధం అలా జరిగి ఉండదు, అలా కాదులే అంటూ నిరాకరణకు దిగుతుంది. ఆ తరువాత మెల్లగా పరిస్థితిని ఆకళింపు చేసుకున్న పిదప ఆవేశపడటం, ఆగ్రహపడటం. ఆ తరువాత పరిస్థితి ఇలా రాకుండా ఉండవలసినదనీ దానికి గాను ఇలా జరిగి ఉండవలసినదనీ అలా జరిగి ఉండవలసినదనీ వాపోవటం. ఆ తరువాత నైరాశ్యంలో కూరుకు పోవటం. చిట్టచివరికి జరిగిందేదో‌ జరిగింది, ఎలాగో అలా సర్దుకుపోదాం అనో ఇదీ‌ మనమంచికే వచ్చింది అనో‌ మనస్సును కుదుటపరచుకోవటం జరుగుతుంది.

అసలెందుకు అశ్చర్యపోవటం. ఆందోళన పడటం, ఆగ్రహపడటం  వంటివి మూడు రాజధానుల విషయంలో అంటే ఇది ఆంధ్రులు ఊహించనిది కాబట్టి, అది ఆ జనంలో ఒక విపత్తుగా భావనకు వచ్చింది కాబట్టి.

నిజానికి అనుకోనివి జరగటం, నష్టపోవటం, దుఃఖపడటం వటివి ఆంద్రులకు జాతిసహజమైన లక్షణాలు. ఇందులో కొత్తగా వచ్చినది ఏమీ లేదు. ఇది అటువంటి సాధారణమానవులు అనుకోని మరొక ఉపద్రవం ఐతే మాత్రమేం, అది ఆంధ్రులకు ఆనవాయితీగా వచ్చే చిక్కుల్లో మరొకటి. అంతే.

ఆంద్రులు అని ఉన్నారు చూడండి. వారికి ప్రథాన జాతి లక్షణం ఏమిటో తెలుసునా? అనైక్యత. వాళ్ళలో ఎన్నడూ ఐకమత్యం అన్నది లేదు. ఇద్దరు ఆంధ్రులు ఒక చోట చేరితే అక్కడ మూడు పార్టీలు కనిపిస్తాయి. ఆ ఇద్దరూ‌ చెరొక పార్టీ, ఆ యిద్దరూ‌ కలిసి పేరుకు మరొక పార్టీ. ఇంత గొప్పది వీళ్ళ ఐక్యత.

ఎప్పటికప్పులు చిక్కులు కొని తెచ్చుకోవటం అన్నది వీరి అద్భుతమైన అనైక్యతావరసిధ్ధికి ఫలంగా లభించిన మరొక చక్కని లక్షణం.

ఒకప్పుడు ఉమ్మడి మదరాసు రాష్ట్రంగా తెలుగువారు అరవలతో‌ కలిసి ఒకే‌ రాష్ట్రంగా ఉన్నారు. తరువాత అరవలూ‌ ఆంధ్రులూ వేరు వేరు రాష్ట్రాల క్రిందకు వచ్చారు. ఆ విడిపోతున్న సందర్భంలో మదరాసు ఎవరిదీ‌ అన్న ప్రశ్న వచ్చింది. అది చెన్న(ప్ప)పట్టణమూ - చెన్నపురీ అక్కడ తెలుగువారమే‌ ఎక్కువ సంఖ్యలో ఉన్నాం అది మాదే అని ఆంద్రులూ అలా వీల్లేదు మదరాసు మాదే‌ అని అరవలూ చాలా గట్టిగానే‌ గొడవ పడ్డారు. మన ఆంధ్రావారిలో రాజకీయనాయకులు మాత్రం ఎంత కాదన్నా ఆంధ్రా రక్తం ప్రవహిస్తున్న మహామహులే‌ కదా. వాళ్ళలో ఉన్న అద్భుతమైన అనైక్యత అన్నది అరవలకే‌ లాభించింది. ఫలితాంశంగా కట్టుబట్టలతో ఆంధ్రులు బయటకు వచ్చారు. నిర్వేదంతో‌ మన ఆంధ్రాడబ్బులతో మదరాసులో రోడ్లు వేసి వచ్చాం - మనకు చిప్పమిగిలింది అనుకున్నారు.

ఒకసారి దెబ్బతింటే బుధ్ధిరావాలి కాని అలా వస్తే ఆంధ్రులు ఎందు కయ్యారూ?

తెలంగాణా వచ్చి ఆంధ్రాలో కలిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ రాష్ట్రం ఏర్పడింది. దానికి దారితీసిన కారణాలూ వగైరా ఇప్పుడు చర్చించి ఉపయోగం‌ ఏమీ‌ లేదు కాని, ఆ కారణాల్లో అప్పటి హైదరాబాదు సర్కారు వారి తీర్మానం‌ కూడా ఒక కారణం అన్నది మాత్రం నిజం. పదేళ్ళూ దాటాయోలేదో ప్రత్యేక తెలంగాణా పోరు మొదలు.  దానికి రిపార్టీగా కాబోలు జై ఆంద్రా ఉద్యమం మొదలైంది. ఇదేమిటీ‌ అనకండి. ఐకమత్యంగా ఉంటే తెలుగువాళ్ళు ఎలా అవుతారు, ముఖ్యంగా అంద్రులు? చివరికి ఇందిరమ్మ గారు చచ్చినా తెలంగాణా ఆంధ్రా విడదీయం అని తేల్చి పారేసారు. కాని మరొక కొన్ని దశాబ్దాల తెలంగాణా ప్రతేకవాదం చేసిన ఒత్తిడి చివరికి ఫలించి అత్తగారు ఇవ్వనన్న ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని కోడలు గారు సోనియమ్మ తన స్వలాభం లెక్కలు బాగా వేసుకొని మరీ ఇచ్చింది.

ఫలితం? మరలా ఆంధ్రులు హైదరాబాదును వదులుకొని ఈసురో మంటూ రోడ్డున బడ్డారు. ఒకప్పుడు మద్రాసులో కాసులు క్రుమ్మరించి చెడ్డది మరచి హైదరాబాదుకు ఆంధ్రాసొమ్ములు తరలించి దెబ్బతిన్నాం అని ఆంధ్రులు అనవచ్చును కాని దానికి తెలంగాణా వారిని తప్పుపట్టలేరు కదా?

ఆరోజుల్లో వాళ్ళు వచ్చి మాతో‌ కలిస్తే‌ మేం ద్రోహం చేసామంటున్నా రిప్పుడు అని ఆంధ్రావాళ్ళు వాపోయి లాభం లేదు. ఆ కలయికకు కారణమైన రాజకీయ కుట్రలని ఏవున్నాయో అవన్నీ అంధ్రారాజకీయవాదులే చేసారు కాబట్టి మోసగాళ్ళు ఆంద్రావాళ్ళే అంటున్నారు ఈరోజున తెలంగాణా నాయకులు.

జరిగిందేదో‌ జరిగింది. యధావిధిగా కొత్త రాజధానికోసం వేట ఆట మొదలైంది. వినూత్మ ఆంధ్రాకు మొదటి ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మధ్యలో రాజధాని ఉండాలీ, అది అంతర్జాతీయ నగరం ఐతే ఆంధ్రా అభివృధ్ధి చెందుతుందీ‌ అంటూ‌ అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసారు. పైగా అది అభివృధ్ధిచెందటానికి మార్గాలంటూ ఏవేవో‌ స్కీములూ‌ చెప్పారు.

ఎన్నికలొచ్చాయి మరొకసారి.

అధికారం చేతులు మారింది.

అధికారంలోనికి వచ్చిన వారి దృక్పథం వేరేగా ఉంది.

ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మొత్తానికి ఫలించిందా లేదా?  అ తెలంగాణా ఇలా వచ్చింది లెండి, అలా వచ్చింది లెండి అని ఏదేదో‌ మాట్లాడి లాభం లేదు. వచ్చిందా లేదా అన్నదే‌ ముఖ్యం. క్రియా సిధ్ధి ర్భవతి మహతాం‌ నోపకరణే! అంటే ఇదే. ఫలితం‌ దేని మహత్తు వలన వచ్చింది అన్నది  కాదు ఫలితం రావటంలోనే‌ మహత్తు ఉంది. 

ప్రత్యేక రాయలసీమ ఉద్యమం అంటూ‌ ఒకటి ఉంది అని మర్చిపోతే ఎలా ఆంధ్రులు? ఎవరికన్నా గుర్తుందో‌ లేదో రాయలసీమను కర్ణాటకలో కలపండి అని ఒక అభిప్రాయమూ‌ ఆప్రాంతపు నాయకులు వినిపించారు ఈమధ్యనే.

జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఐనా దీనిని గురించి నేడే‌ ఆలోచించటం‌ మంచిది. ఆంధ్రులు ఎంతో‌ గొప్ప వారు. వారిలో కొందరు ఆంధ్రావిభన కోసం ఉద్యమాలు చేసి తీరుతారు. ఎవరి కారణాలు వారికుంటాయి.

మరలా ఎన్నోసారి రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రులు ఏర్పాటు చేసుకోవటం, అభాసు పాలు కావటం జరగాలి? 

అసలీ‌ ఆంధ్రరాష్ట్ర ఇలా ఇంకెన్ని సార్లు ముక్కలు చెక్కలు కావాలి? ఎవడికి తెలుసు? ఆంధ్రుల అద్భుతమైన అనైక్యత గురించి ఆలోచించుకోవాలి ముందు అని మన నాయకులకు ఎందుకు తోచదు?

గతప్రభుత్వానికి తోచీతోచనట్లు తోచినట్లు అనిపిస్తున్నది. అందుకే వివిధప్రాంతాల్లోను వివిధరకాలుగా అభివృధ్ధి కార్యక్రమం అంటూ‌ ఆ ప్రభుత్వం మాట్లాడేది.

ఈ‌కొత్త ప్రభుత్వం‌ ఈవిషయంలో కొంచె ఎక్కువ స్పష్టతతో‌ ఉన్నట్లు అనుకోవచ్చును. ఒకే‌ చోట రాజధాని అంటే అది మద్రాసు హైదరాబాదుల వారసత్వానికి దారితీసి తీరుతుందని వారికి గట్టి నమ్మకం కుదురినట్లే‌ భావించవచ్చును.

అందుకనే‌ ఆంధ్రరాష్ట్రం మూడు ప్రాంతాల్లోనూ మూడు రాజధానులు ఏర్పాటు చేయవలసిందే‌ అన్న పట్టుదల మీద ఉన్నారు. చివరికి ఈ విషయం కోర్టుకు ఎక్కినా సరే వారు నిన్నగాక మొన్న స్వాతంత్ర్యదినోత్సవం నాడు కూడ తమ ఆశయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎలాగోలా న్యాయవ్యవస్థనూ దారికి తెచ్చుకోవాలన్న వారి ఆకాంక్ష కొంచెం భయంకరమైనదే‌ కాని అలా చేసి ఐనా వారు మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారని అంటే అది సత్యదూరం కాకపోవచ్చును. అంత పట్టుదలతో‌ ఉన్నారు వారు.

ఎలాగూ మరిన్ని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలను ఆంధ్రులు దిగ్విజయంగా చేయబోతారన్న దివ్యదృష్టి ఎలాగూ‌ ఉన్న మన ఆంధ్రాప్రభుత్వం వారికి వాటిలో‌ ప్రత్యేకకోనసీమరాష్ట్రం కోసం జరిగే ఉద్యమం కూడా ఉంటుందన్న స్పృహ తప్పకుండా ఉంటుందని నమ్మవచ్చును.

అందుచేత రాబోయే , అదేలెండి ఏదో‌ ఒక నాటికి రాబోయే కోనసీమరాష్ట్రం అవసరాలను దృష్టిలో‌ ఉంచుకొని కొన్ని పనులు చేయాలి. కేవలం‌ కోనసీమతో అంటే‌ మరీ చిన్నది అవుతుంది కాబట్టి ఉభయగోదావరీ‌జిల్లాలను కలిపి ప్రత్యేక రాష్ట్రంగా మునుముందు ఏర్పడేందుకు దోహదపడాలి. ఆ కొత్త రాష్ట్రానికి కూడా ముచ్చటగా మూడు రాజధాని నగరాలుండాలి. కాకినాడ, రాజమండ్రి, మరొక ఎంపిక చేసిన ముఖ్యనగరమూ‌ వెరసి మూడు నగరాలూ రాజధానులుగా ఉండాలి. రాజమండ్రి వాణిజ్య రాజధాని అందాం. కాకినాడ పారిశ్రామిక రాజధాని అందాం. మరొక నగరానికి తగిన పోర్టుఫోలియో‌ కేటాయిద్దాం. ఈవిధంగానే ఆంధ్రాలో ముందుముందు పుట్టబోయే ప్రత్యేకరాష్ట్రాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాజధాని కేండేట్ నగరాలను ఇప్పటినుండే నిర్మాణం చేస్తూ‌ పోవాలి.

ఇప్పటికే ఆంధ్రావారి ఆదర్శవంతమైన బహుళరాజధానుల సిధ్ధాంతం ఇతర రాష్త్రాల వారినీ‌ ఆకర్షిస్తోందని వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో మదురైని రెండవ రజధానిగా చేయమని అడుతున్నారట.

ఈ ముచ్చట ఇలా కొనసాగితే, యావద్దేశంలోనూ‌ రాష్ట్రాలూ - రాజధానులూ‌ అన్న అంశం విద్యార్ధులకు మంచి పాఠ్యాశం అవుతుంది.

దేశానికేం‌ కర్మం! యావత్ప్రపంచానికీ‌ ఈ‌ బహుళరాజధాని వ్యవస్థ ఆదర్శప్రాయం కావచ్చును.


17, ఆగస్టు 2020, సోమవారం

కరోనా కష్టసముద్రంలో ఒంటరిగా......

ప్రసాద్ ఆత్రేయ.

మంచి కవి, పండితులు.

కొన్ని పుస్తకాలు ప్రచురించారు.

ఒకప్పుడు హైదరాబాదులో ఈ.సీ.ఐ.యల్. కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసి పదవీవిరమణ చేసారు.

ప్రస్తుతం విశాఖపట్నం వాస్తవ్యులు.

హోమ్ క్వారంటైన్ ఆయన పరిస్థితి.

కరోనాకు ఎవరైనా ఒకటే.

ఆయన నాకన్నా చాలా పెద్ద వారు.

నాకు చాలా ఆత్మీయులు.

నాకు మేనమామ గారు. అంటే మా అమ్మమ్మ గారి సోదరి కుమారులు.

 ఆయన కొడుకుల్లో ఒకడు అమెరికా మనిషి. 

మరొక కొడుకు విశాఖపట్నం లోనే ఉంటాడు.

"రాడు. వాడిని చూసి పదకొండేళ్ళైంది" అంటా రీయన. 

ఐనా ఇప్పుడు ఎవరు వస్తారు?  ఎవరు పలకరిస్తారు.

సొంత అపార్ట్మెంట్ లోపల ఒంటిరిగా బేలగా ఉన్నారు.

కరోనా వస్తూనే  ఒంటరితనాన్ని బహుమానంగా ఇస్తుంది.

హాస్పిటల్ వైద్యం వి.ఐ.పీలు కాని వాళ్ళకి దుర్భరమైన జనరల్ వార్డు సౌకర్యం రూపంలో మాత్రమే అందుబాటులో ఉంది.

ఇతరులు స్పెషల్ రూమ్ తీసుకుంటే వైద్యం బాగుంటుందేమో తెలియదు. 

కాని ఇల్లూ ఒళ్ళు గుల్ల అవటం అన్నది ఖాయం.

ఆ స్పెషల్ అందని అందాల చందమామే మన బోటి సామాన్యులకు.

ఈ దేశంలో ముసలాళ్ళు టాక్సులు కట్టటానికీ, వైద్యశాలకు బిల్లులు కట్టుకకోవటానికీ ఉన్నారు. 

వి.వి.ఐ.పీలో,  కాకపోతే కనీసం వి.ఐ.పీలో కాని ముసలి వాళ్ళ గురించి ఎవరూ పట్టించుకోరు దేశంలో.

ఈమాట శంకరులు ఎప్పుడో చెప్పారు.

ఇప్పుడు ప్రసాద్ గారిని చూసే వాళ్ళెవరూ లేరు.

సరైన సదుపాయాలు లేవు.

వేళకింత సరైన ఆహారమూ అందించే వారు లేరు.

సరైన వైద్యం చెసే వారూ లేదు. 

నా కింకేం మాట్లాడాలో తెలియటం లేదు.








15, ఆగస్టు 2020, శనివారం

విశ్వనాథ వారి శ్రీమద్రామాయణ కల్పవృక్షము (Download)

 విశ్వనాథ వారి శ్రీమద్రామాయణ కల్పవృక్షము మనకు అంతర్జాలంలో లభిస్తోంది. ఇక్కడ డౌన్‌లోడ్ సూచికలు ఇస్తున్నాను.


  1. బాల కాండము
  2. అయోధ్యా కాండము 
  3. అరణ్య కాండము
  4. కిష్కింధ కాండము
  5. సుందర కాండము
  6. యుధ్ధ కాండము

ఈ‌పై పుస్తకాల్లో అరణ్య కాండము సుందర కాండము తి.తి.దే వారి సైట్‌లోనూ మిగిలిన నాలుగు కాండములూ అర్కీవ్ సైట్‌లోనూ‌ లభిస్తున్నాయి.

అసక్తి కలవారు తప్పక దిగుమతి చేసుకోండి. అంతర్జాలంలో ఈనాడు లభిస్తున్నా అవి రేపోమాపో అక్కడ ఉండకపోవచ్చును. కాబట్టి బధ్ధకిస్తే మనకే ఇబ్బంది మరి.

కావ్యకంఠ గణపతిముని అధ్యాత్మికపూజా స్తోత్రం

కృతేన సా నిసర్గతో
ద్రుతేన నిత్య మాననే
సితేన శీత శైలజా
స్మితేన శం తనోతు మే

ప్రతి క్షణం వినశ్వర
నయే విసృజ్య గోచరాన్
సమర్చ యేశ్వరీం మనో
వివిచ్య విశ్వ శాయినం

విశుద్ద దర్పనేన వా
విదారితే హృదాంబ మే
అయి ప్రయచ్చ సన్నిధిం
నిజే వాపు ష్యగాత్మజే

పురస్య మధ్య మాశ్రితం
సితం  య దస్తి పంకజం
అజాండ మూల మస్తుతే
సురార్చితే తవాసనం

ఆఖండ ధారయా ద్రవన్
నవేందు శేఖర ప్రియే
మదీయ భక్తి జీవనం
దదాతు తేంబ పాద్యతాం

వివాస నౌఘ మానస
ప్రసాద తోయ మంబ మే
సమస్త రాజ్ఞి హస్తయో
రనర్ఘ మర్ఘ్య మస్తుతే

మహేంద్ర యోని చింతనా
ద్భవన్ భవస్య వల్లభే
మహారసో రసస్త్వయా
నిపీయతాం విశుద్ధయే

సహస్ర పాత్ర పంకజ
ద్రవ త్సుదా జలేన సా
సహస్ర పత్ర లోచనా
పినాకినో భిషిచ్యతే

మమార్జితం య దిన్ద్రియై
స్సుఖం సుగాత్రి  పంచభిః
తదంబ తుభ్య మర్పితం
సుదాఖ్య పంచాకాయతమ్

వసిష్ట గోత్ర జన్మనా
ద్విజేన నిర్మితం శివే
ఇదం శరీర మేవ మే
తవాస్తు దివ్య మంశుకం

విచిత్ర సూక్ష్మ తంతు భ్రు
న్మమేయ మాత్మ నాడికా
సుఖ ప్రబోధ విగ్రహే
మఖోప వీత మస్తుతే

మహాద్విచిన్వతో మమ
స్వకీయ తత్వ విత్తిజం
ఇదం తు చిత్తసౌరభం
శివే తవాస్తు చందనం

మహేశ నారి !నిస్శ్వసన్
తధాయ ముచ్చ్వసన్ సదా
తవానిశం సమర్చకో
మమాస్తుజీవ మారుతః

విపాక కాల పావక
ప్రదీప్త పుణ్య గుగ్గులుః
సువాసనాఖ్య ధూప భ్రు
ద్భవ  త్వయం  మమాంబ తే

గుహావ తార మౌనినా
మయీశ్వరీ ప్రదీపితా
ఇయం ప్రబోధ దీపికా
ప్రమోద దాయికా స్తుతే

ఇమామయి  ప్రియా త్ప్రియాం
మహా రసా మహాం కృతిం
నివేద యామి భుజ్యతా
మియం త్వయా నిరామయే

సరస్వతీ సుదాయతే
మనో దదాతి పూగతాం
హృదేవ పత్ర మంబికే
త్రయం సమేత్యతే ర్ప్యతే

వినీల తోయ దాంతరే
విరాజ మాన విగ్రహా
నిజా విభూతి రస్తుతే
తటిల్లతా ప్రకాశికా

స్వరోయ   మంత రంబికే
ద్విరేఫ వత్స్వరన్ సదా
మమాభి మంత్ర్య దీసుమం
దదాతి దేవి తేన్ఘ్రయే

తవార్చనం నిరంతరం
యతో విధాతు మస్మ్యహం
న విశ్వనాధ పత్నితే
విసర్జనం విధీయతే

వియోగ మిందు దారిణా
న చేహ విశ్వ నాయకే
మదంబ సోత్ర రాజతే
తటిల్లతా శిఖాంతరే

అయం తవాగ్రిమః సుతః
శ్రితో మనుష్య విగ్రహం
తనూజ వేశ్మ సౌష్టవం
మృడాని !పశ్య కీద్రుశం

గణేశితు ర్మహాకవే
రసౌ ప్రమాణికావలీ
మనోంబుజే మహేశ్వరీ
ప్రపూజ నేషు శబ్ద్యతాం

12, ఆగస్టు 2020, బుధవారం

కరారవిందేన పదారవిందం...

 

 



కరారవిందేన పదారవిందం
ముఖారవిందే వినివేశయంతం
వటస్యపత్రస్యపుటే శయానం
బాలం ముకుందం మనసా స్మరామి

పుట్టీపుట్ఝగనే గట్టిమాయ చేసి

పుట్టీపుట్ఝగనే గట్టిమాయ చేసి
యెట్టులో జారుకొన్నా డెంతవాడో

ఏమో యిటు పుట్టగనె ఏదోమాయతో
అన్న రాము డున్న తావునకు రయమున తా నరగె
ఏమందుము పురిటిబిడ్డ డెట్లు దాటిపోయె
ఏమో యది యెవరి కెరుక యీశ్వరు డెరుగు

మొదలాయె వీని మాయ ముందుముందు దుష్టుల
వదలక బాలకుడు పట్టిపల్లార్చు రాయనుచు
మది నెంచి తలిదండ్రులు మరిమరి మురియగ
కుదురు లేని పిల్లవాడు గొల్లపల్లె చేరె

ఏమి మాయ లెరుగనట్టి రాముడై చేసినదే
ఈ మాయదారి శిశువు నిపుడు చేయనున్నది
భూమిపై రాకాసుల పోడిమి నడగించుట
స్వామి దివ్యలీలలను జనులార కనుడు

పుట్టువే లేని వాడు పుట్టినాడు

పుట్టువే లేని వాడు పుట్టినాడు వాడు
పుట్టుట మనభాగ్య మనగ పుట్టినాడు

తల కింత జూలుతో తానొక కంబము నుండి
బలవంతుడు హేమకశిపు పట్టిపల్లార్చ
నలనాడు తోచె నృహరి యసుర సంధ్య వేళ
తిలకించుడు వాడే కలిగె మరల నేడు

ఇలకు తా నరుడ నని యెంచుకొనుచు వచ్చె
బలవంతుడు రావణుని పట్టిపల్లార్చ
కలిగె మిట్టమధ్యాహ్న కాలాన రాముడై
తిలకించుడు వాడే తిరిగి వచ్చె నేడు

ఇలకు తా వెన్నుడ నని హెచ్చరించుచు వచ్చె
బలవంతుల నసురుల పట్టిపల్లార్చ
కలికి కద్దమరాతిరి కలిగినాడు కృష్ణుడై
తిలకించుడు వాడా దేవుడే నేడు

11, ఆగస్టు 2020, మంగళవారం

రాధేయుడు అంటే కృష్ణుడట!

"రాధేయుడు అంటే కర్ణుడు కదా
ఇక్కడ గుడిలో ప్రవచనాలు చెబుతుంది ఒకావిడ.కృష్ణుడు అంటోంది.నిజమేనా
"

పైన ఉన్నది వాట్సాప్‌లో మాచెల్లెలు అరుణ పంపిన ప్రశ్న.

 

మా చెల్లెలికి నేను చెప్పిన మాటలు

"పరమశుంఠలు సభాపూజ్యులైరి ఒక శతకకారుడు అన్నాడు. దాని అర్ధం ఇదే. కుంతి కొడుకు కర్ణుడిని అతిరథుడు అనే సూతుడు గంగలో దొరికితే తీసుకొని వెళ్ళి తనభార్య ఐన రాధ చేతికి ఇచ్చాడు. అలా కర్ణుడు రాధేయుడు అంటే రాధకొడుకు అయ్యాడు. ఈసంగతి మనదేశంలో అందరికీ తెలుసును. ఇదిగో కొత్తకొత్త గురువులు వస్తున్నారు. జాగ్రత జాగ్రత అని పిల్లలకి చెప్పాలి మర్చిపోకు."

 

ఇంత చక్కని గురువును జనానికి పరిచయం చేయకపోతే ఎలా అని అనిపించి ఈముక్కలు బ్లాగులో వ్రాస్తున్నాను.

ప్రజలారా తస్మాత్ జాగ్రత. కొత్త గురువుల నుండి పిల్లలను కాపాడుకోండి!


10, ఆగస్టు 2020, సోమవారం

ఎన్నడో నాస్వామి సన్నిథి

 ఎన్నడో నాస్వామి సన్నిథి కేనేగుట

యెన్నడో రాము డొక్కింత కృపజూపుట


పన్నుగ నాస్వామి కొరకు పాడగ నేనిచ్చట

నున్నానే కాని యిల నుండగ నాకేల

నిన్ను మెచ్చితి నని నన్ను నారాముడు

సన్న చేసి పిలుచుట జరిగేది యెన్నడో


ఉచితములై యొప్పారుచు నుండు నాపాటల

రుచిమరిగిన రాముడే యుచితమని తలచి

అచట పాడినది చాలు నలసినదా దేహమే

ఇచటనే యుండి పాడు మిక మీదట ననుట


పాటలా యవి నాకు పరమమంత్రము లందు

మాటలన్నియును వాని మహిమనే చాటునవి

నేటికో రేపటికో వాటికి మెచ్చి తన

వీటికి కిరమ్మని హరి పిలుచునో నన్ను


9, ఆగస్టు 2020, ఆదివారం

హరిని కీర్తించునదే యసలైన రసనయే

 హరిని కీర్తించునదే యసలైన రసనయే
మరి యన్యములు తాటిమట్టలేనే

కోమళుల గూడి యా కుచకచంబుల కనుల
నేమేమొ మాటాడి హీనుడు కాక
పామరత్వము విడచి పరమాత్మునే‌ యెన్ని
రామ రామా యని రాజీవనయన యని

అధికారుల మెప్పు లాసించి యిచ్చకము
లధికంబుగా పలికి యల్పుడు గాక
బుధులు మెచ్చగ హరి పురుషోత్తము నెన్ని
మధురంబుగ రామ మంగళాకార యని

కల్లగురువుల నమ్మి కానిపనులు చేసి
చిల్లర దేవుళ్ళ చింతించి చెడక
నల్లనయ్యను హరిని నారాయణు నెన్ని
ఎల్లవేళల రామ హృదయేశ్వరా యని


8, ఆగస్టు 2020, శనివారం

రారే రారే రమణీమణులార

రారే రారే రమణీమణులార
శ్రీరామదంపతుల చేరరారే

శ్రీరామచంద్రులను సీతమ్మవారినీ
మీరు పూమాలలతొ మెప్పింపరే
శ్రీరామచంద్రులను సీతమ్మవారినీ
మీరు గంధాదులతొ మెప్పింపరే

శ్రీరామచంద్రులను సీతమ్మవారినీ
మీరు మణిభూషలతొ మెప్పింపరే
శ్రీరామచంద్రులకు సీతమ్మవారికీ
మీరు హారతులిచ్చి మెప్పింపరే

శ్రీరామచంద్రులను సీతమ్మవారినీ
మీరు పాటలు పాడి మెప్పింపరే
శ్రీరామచంద్రులను సీతమ్మవారినీ
మీరు చక్కగ నాడి మెప్పింపరే

 

5, ఆగస్టు 2020, బుధవారం

నీ కన్యుల కెన్నడును నేను మ్రొక్కనే

నీ కన్యుల కెన్నడును నేను మ్రొక్కనే 
నాకు పరాంగ్ముఖుడ వగుట న్యాయమేనా

భగవంతుడ వగుటచేత బాగుబా గనవలయును
తగినవైన తగనివైన తమరి చేతలు
అగణితసద్గుణరాశివి అమితదయాశాలివని
జగమెల్లను కొనియాడెడు చాలమొండివాడివి

చిన్నచిన్న దొసగులెంచి చిలిపికయ్యము చేసి
చిన్నబుచ్చుకొనుట నీకు చెల్లుచుండె
నిన్ను నమ్ముకొని యుండిన నన్ను చిన్నబుచ్చినను
ఎన్నడైన నీ తప్పుల నెంచిపలుక బోనుగా

మానవుడ వైతివి మరి మాబాధల నెరిగితివి
జానకీరామ నిన్ను శరణు వేడు
మా నైజాము లెట్టి వైన మాతప్పు వెట్టి వైన
దీనతలు బాపు నీవే దిక్కు మాకందునుగా
 







4, ఆగస్టు 2020, మంగళవారం

హరినిపొగడు పాటలనే యాలపించరయ్యా

హరినిపొగడు పాటలనే యాలపించరయ్యా
హరిని మీరు పొగడితే నాలకించ మనసాయె

హరిచేసిన విశ్వములో హరి యిచ్చిన జీవముతో
హరిమయమగు ప్రకృతిలో హరినే గాక
హరిహరి ఇంకెవరి నయ్య యింక మీరు పొగిడేది
మరి యొక్కరి పొగడ మీకు మనసొప్పేనా

మీకు తెలియినో‌ లేదొ మీమనసున నామనసున
లోకులందరి మనస్సుల లోపల హరియే
శ్రీకరుడు శుభకరుడు శ్రీమహావిష్ణువే
మేకొని యున్నాడనుచు మిత్రవరు లార

వేనవేల నామంబుల విలసిల్లెడి వాడు
జ్ఞానుల కెఱుకైన సత్యము గలాడు
తానే శ్రీరాముడై తానే శ్రీకృష్ణుడై
మానితముగ మనమధ్యనె మసలె గాన


రామభజన చేయరే రామభజన చేయరే

రామభజన చేయరే రామభజన చేయరే
రామభజన మోక్షసామ్రాజ్యదయకం

రాముడిచ్చిన ధనములా రామునకే యంకితమని
రాముడిచ్చిన పదవులా రామునికే‌ యంకితమని
రాముడిచ్చిన పలుకులా రామునకే‌ యంకితమని
రాముడిచ్చిన జీవితమా రామునకే‌ యంకితమని

రామచరితమే మనోరంజకమైనట్టిదని
రామనామామృతమే ప్రాణాధారకమని
రామసంసేవనమే రమ్యమైనవృత్తియని
రామనామ మొక్కటే రక్తిముక్తిప్రదమని

రామచంద్రుడు త్రిలోకారాధ్యుడనుచు తెలిసి
రామరక్ష సకలజగద్రక్ష యనుచు తెలిసి
రామచంద్రుడు శ్రీమన్నారాయణుడని తెలిసి
రాముని హృదయమున నిలిపి రామ రామ యనుచును

3, ఆగస్టు 2020, సోమవారం

రాముడే వైద్యు డతని నామమె మందు

రాముడే వైద్యు డతడి నామమె మందు మన
పామరత్వవ్యాధి కదే పసందైన మందు

తేనియల కన్న నిదే తీయనైన దందు మరి
దీని ముం దమృతమే తీసికట్టందు
దీనిని రుచిచూచితే మానలే రందు  నిక
పైన భవరోగము మిము బాధించ దందు

ఎందరో పెద్దలు సేవించిరీ మందు వా
రందరకు మంచి చేసి నట్టిదీ ముందు
ముందు రామరాజుగారి మందుగొను డందు నా
ముందుకన్నా మంచిమందు మోహిని లేదందు

లక్షలు వెచ్చించకున్న లభియించే ముందు బహు
లక్షణమైన ముందు లాభించేమందు
రక్షించే మందు శ్రీరామ వైద్యుని మందు 
తక్షణమే గుణమిచ్చే దైన గొప్పమందు





1, ఆగస్టు 2020, శనివారం

హరివచ్చు హరివచ్చు హరివచ్చు నవనికి

హరివచ్చు హరివచ్చు హరివచ్చు నవనికి
సిరియు తన వెంటరా చిచ్చరపిడుగై

తనను తా నెరుగడట దశరథుని కొడుకట
మునులతో నుండునట వనముల తిరుగునట
మునుకొని సురవైరి మూకలను చెండునట
తనరాణికై శివుని ధనువునే విరచునట

జనకుని యానతి గొని చనునట వనములకు
వనమున మాయజింక వచ్చి మోసగించునట
జనకజను లంకకు రావణుడు కొనిపోవునట
వనధికి హరి యంతట వారధిని కట్టునట

మనుజుడనని భావించు మాధవుని చేతిలో
మనుజాశనేశుడును మరణమును పొందునట
వినుతశీలు డంతట తననుతా నెరుగునట
జనపతియై ధరనేలి స్వధామము చేరునట