5, ఆగస్టు 2020, బుధవారం

నీ కన్యుల కెన్నడును నేను మ్రొక్కనే

నీ కన్యుల కెన్నడును నేను మ్రొక్కనే 
నాకు పరాంగ్ముఖుడ వగుట న్యాయమేనా

భగవంతుడ వగుటచేత బాగుబా గనవలయును
తగినవైన తగనివైన తమరి చేతలు
అగణితసద్గుణరాశివి అమితదయాశాలివని
జగమెల్లను కొనియాడెడు చాలమొండివాడివి

చిన్నచిన్న దొసగులెంచి చిలిపికయ్యము చేసి
చిన్నబుచ్చుకొనుట నీకు చెల్లుచుండె
నిన్ను నమ్ముకొని యుండిన నన్ను చిన్నబుచ్చినను
ఎన్నడైన నీ తప్పుల నెంచిపలుక బోనుగా

మానవుడ వైతివి మరి మాబాధల నెరిగితివి
జానకీరామ నిన్ను శరణు వేడు
మా నైజాము లెట్టి వైన మాతప్పు వెట్టి వైన
దీనతలు బాపు నీవే దిక్కు మాకందునుగా
 కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.