19, ఆగస్టు 2020, బుధవారం

ముచ్చటగా మూడు రాజధానులు.

రాష్ట్రానికి మూడు రాజధానులా అని ఆశ్చర్యపోయిన వాళ్ళ, పోతున్న వాళ్ళ, ఇంకా ఇంకా పోబోతున్న వాళ్ళ సంఖ్యే చాలా ఎక్కువగా ఉందని అనిపిస్తోంది.

అలాగే కొంపములిగిపోతోంది అని విచారపడుతున్న వాళ్ళ, విచారంలో కూరుకుపోతున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్లుంది.

అలాగే ఈవిషయంలో ఆశ్చర్యం అనే మెదటి అంకం దాటి ఆగ్రహం అనే ద్వితీయాంకంలో గంతులేస్తున్న వాళ్ళ సంఖ్యా, ఆ అంకంలో ప్రవేశించ బోతున్న వాళ్ళ సంఖ్యా కూడా బాగానే ఉంది.

ఏదైనా అహితం మీదికి వస్తే మనుష్యస్వభావం‌ మొదట అదంతా అబధ్ధం అలా జరిగి ఉండదు, అలా కాదులే అంటూ నిరాకరణకు దిగుతుంది. ఆ తరువాత మెల్లగా పరిస్థితిని ఆకళింపు చేసుకున్న పిదప ఆవేశపడటం, ఆగ్రహపడటం. ఆ తరువాత పరిస్థితి ఇలా రాకుండా ఉండవలసినదనీ దానికి గాను ఇలా జరిగి ఉండవలసినదనీ అలా జరిగి ఉండవలసినదనీ వాపోవటం. ఆ తరువాత నైరాశ్యంలో కూరుకు పోవటం. చిట్టచివరికి జరిగిందేదో‌ జరిగింది, ఎలాగో అలా సర్దుకుపోదాం అనో ఇదీ‌ మనమంచికే వచ్చింది అనో‌ మనస్సును కుదుటపరచుకోవటం జరుగుతుంది.

అసలెందుకు అశ్చర్యపోవటం. ఆందోళన పడటం, ఆగ్రహపడటం  వంటివి మూడు రాజధానుల విషయంలో అంటే ఇది ఆంధ్రులు ఊహించనిది కాబట్టి, అది ఆ జనంలో ఒక విపత్తుగా భావనకు వచ్చింది కాబట్టి.

నిజానికి అనుకోనివి జరగటం, నష్టపోవటం, దుఃఖపడటం వటివి ఆంద్రులకు జాతిసహజమైన లక్షణాలు. ఇందులో కొత్తగా వచ్చినది ఏమీ లేదు. ఇది అటువంటి సాధారణమానవులు అనుకోని మరొక ఉపద్రవం ఐతే మాత్రమేం, అది ఆంధ్రులకు ఆనవాయితీగా వచ్చే చిక్కుల్లో మరొకటి. అంతే.

ఆంద్రులు అని ఉన్నారు చూడండి. వారికి ప్రథాన జాతి లక్షణం ఏమిటో తెలుసునా? అనైక్యత. వాళ్ళలో ఎన్నడూ ఐకమత్యం అన్నది లేదు. ఇద్దరు ఆంధ్రులు ఒక చోట చేరితే అక్కడ మూడు పార్టీలు కనిపిస్తాయి. ఆ ఇద్దరూ‌ చెరొక పార్టీ, ఆ యిద్దరూ‌ కలిసి పేరుకు మరొక పార్టీ. ఇంత గొప్పది వీళ్ళ ఐక్యత.

ఎప్పటికప్పులు చిక్కులు కొని తెచ్చుకోవటం అన్నది వీరి అద్భుతమైన అనైక్యతావరసిధ్ధికి ఫలంగా లభించిన మరొక చక్కని లక్షణం.

ఒకప్పుడు ఉమ్మడి మదరాసు రాష్ట్రంగా తెలుగువారు అరవలతో‌ కలిసి ఒకే‌ రాష్ట్రంగా ఉన్నారు. తరువాత అరవలూ‌ ఆంధ్రులూ వేరు వేరు రాష్ట్రాల క్రిందకు వచ్చారు. ఆ విడిపోతున్న సందర్భంలో మదరాసు ఎవరిదీ‌ అన్న ప్రశ్న వచ్చింది. అది చెన్న(ప్ప)పట్టణమూ - చెన్నపురీ అక్కడ తెలుగువారమే‌ ఎక్కువ సంఖ్యలో ఉన్నాం అది మాదే అని ఆంద్రులూ అలా వీల్లేదు మదరాసు మాదే‌ అని అరవలూ చాలా గట్టిగానే‌ గొడవ పడ్డారు. మన ఆంధ్రావారిలో రాజకీయనాయకులు మాత్రం ఎంత కాదన్నా ఆంధ్రా రక్తం ప్రవహిస్తున్న మహామహులే‌ కదా. వాళ్ళలో ఉన్న అద్భుతమైన అనైక్యత అన్నది అరవలకే‌ లాభించింది. ఫలితాంశంగా కట్టుబట్టలతో ఆంధ్రులు బయటకు వచ్చారు. నిర్వేదంతో‌ మన ఆంధ్రాడబ్బులతో మదరాసులో రోడ్లు వేసి వచ్చాం - మనకు చిప్పమిగిలింది అనుకున్నారు.

ఒకసారి దెబ్బతింటే బుధ్ధిరావాలి కాని అలా వస్తే ఆంధ్రులు ఎందు కయ్యారూ?

తెలంగాణా వచ్చి ఆంధ్రాలో కలిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ రాష్ట్రం ఏర్పడింది. దానికి దారితీసిన కారణాలూ వగైరా ఇప్పుడు చర్చించి ఉపయోగం‌ ఏమీ‌ లేదు కాని, ఆ కారణాల్లో అప్పటి హైదరాబాదు సర్కారు వారి తీర్మానం‌ కూడా ఒక కారణం అన్నది మాత్రం నిజం. పదేళ్ళూ దాటాయోలేదో ప్రత్యేక తెలంగాణా పోరు మొదలు.  దానికి రిపార్టీగా కాబోలు జై ఆంద్రా ఉద్యమం మొదలైంది. ఇదేమిటీ‌ అనకండి. ఐకమత్యంగా ఉంటే తెలుగువాళ్ళు ఎలా అవుతారు, ముఖ్యంగా అంద్రులు? చివరికి ఇందిరమ్మ గారు చచ్చినా తెలంగాణా ఆంధ్రా విడదీయం అని తేల్చి పారేసారు. కాని మరొక కొన్ని దశాబ్దాల తెలంగాణా ప్రతేకవాదం చేసిన ఒత్తిడి చివరికి ఫలించి అత్తగారు ఇవ్వనన్న ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని కోడలు గారు సోనియమ్మ తన స్వలాభం లెక్కలు బాగా వేసుకొని మరీ ఇచ్చింది.

ఫలితం? మరలా ఆంధ్రులు హైదరాబాదును వదులుకొని ఈసురో మంటూ రోడ్డున బడ్డారు. ఒకప్పుడు మద్రాసులో కాసులు క్రుమ్మరించి చెడ్డది మరచి హైదరాబాదుకు ఆంధ్రాసొమ్ములు తరలించి దెబ్బతిన్నాం అని ఆంధ్రులు అనవచ్చును కాని దానికి తెలంగాణా వారిని తప్పుపట్టలేరు కదా?

ఆరోజుల్లో వాళ్ళు వచ్చి మాతో‌ కలిస్తే‌ మేం ద్రోహం చేసామంటున్నా రిప్పుడు అని ఆంధ్రావాళ్ళు వాపోయి లాభం లేదు. ఆ కలయికకు కారణమైన రాజకీయ కుట్రలని ఏవున్నాయో అవన్నీ అంధ్రారాజకీయవాదులే చేసారు కాబట్టి మోసగాళ్ళు ఆంద్రావాళ్ళే అంటున్నారు ఈరోజున తెలంగాణా నాయకులు.

జరిగిందేదో‌ జరిగింది. యధావిధిగా కొత్త రాజధానికోసం వేట ఆట మొదలైంది. వినూత్మ ఆంధ్రాకు మొదటి ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మధ్యలో రాజధాని ఉండాలీ, అది అంతర్జాతీయ నగరం ఐతే ఆంధ్రా అభివృధ్ధి చెందుతుందీ‌ అంటూ‌ అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసారు. పైగా అది అభివృధ్ధిచెందటానికి మార్గాలంటూ ఏవేవో‌ స్కీములూ‌ చెప్పారు.

ఎన్నికలొచ్చాయి మరొకసారి.

అధికారం చేతులు మారింది.

అధికారంలోనికి వచ్చిన వారి దృక్పథం వేరేగా ఉంది.

ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మొత్తానికి ఫలించిందా లేదా?  అ తెలంగాణా ఇలా వచ్చింది లెండి, అలా వచ్చింది లెండి అని ఏదేదో‌ మాట్లాడి లాభం లేదు. వచ్చిందా లేదా అన్నదే‌ ముఖ్యం. క్రియా సిధ్ధి ర్భవతి మహతాం‌ నోపకరణే! అంటే ఇదే. ఫలితం‌ దేని మహత్తు వలన వచ్చింది అన్నది  కాదు ఫలితం రావటంలోనే‌ మహత్తు ఉంది. 

ప్రత్యేక రాయలసీమ ఉద్యమం అంటూ‌ ఒకటి ఉంది అని మర్చిపోతే ఎలా ఆంధ్రులు? ఎవరికన్నా గుర్తుందో‌ లేదో రాయలసీమను కర్ణాటకలో కలపండి అని ఒక అభిప్రాయమూ‌ ఆప్రాంతపు నాయకులు వినిపించారు ఈమధ్యనే.

జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఐనా దీనిని గురించి నేడే‌ ఆలోచించటం‌ మంచిది. ఆంధ్రులు ఎంతో‌ గొప్ప వారు. వారిలో కొందరు ఆంధ్రావిభన కోసం ఉద్యమాలు చేసి తీరుతారు. ఎవరి కారణాలు వారికుంటాయి.

మరలా ఎన్నోసారి రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రులు ఏర్పాటు చేసుకోవటం, అభాసు పాలు కావటం జరగాలి? 

అసలీ‌ ఆంధ్రరాష్ట్ర ఇలా ఇంకెన్ని సార్లు ముక్కలు చెక్కలు కావాలి? ఎవడికి తెలుసు? ఆంధ్రుల అద్భుతమైన అనైక్యత గురించి ఆలోచించుకోవాలి ముందు అని మన నాయకులకు ఎందుకు తోచదు?

గతప్రభుత్వానికి తోచీతోచనట్లు తోచినట్లు అనిపిస్తున్నది. అందుకే వివిధప్రాంతాల్లోను వివిధరకాలుగా అభివృధ్ధి కార్యక్రమం అంటూ‌ ఆ ప్రభుత్వం మాట్లాడేది.

ఈ‌కొత్త ప్రభుత్వం‌ ఈవిషయంలో కొంచె ఎక్కువ స్పష్టతతో‌ ఉన్నట్లు అనుకోవచ్చును. ఒకే‌ చోట రాజధాని అంటే అది మద్రాసు హైదరాబాదుల వారసత్వానికి దారితీసి తీరుతుందని వారికి గట్టి నమ్మకం కుదురినట్లే‌ భావించవచ్చును.

అందుకనే‌ ఆంధ్రరాష్ట్రం మూడు ప్రాంతాల్లోనూ మూడు రాజధానులు ఏర్పాటు చేయవలసిందే‌ అన్న పట్టుదల మీద ఉన్నారు. చివరికి ఈ విషయం కోర్టుకు ఎక్కినా సరే వారు నిన్నగాక మొన్న స్వాతంత్ర్యదినోత్సవం నాడు కూడ తమ ఆశయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎలాగోలా న్యాయవ్యవస్థనూ దారికి తెచ్చుకోవాలన్న వారి ఆకాంక్ష కొంచెం భయంకరమైనదే‌ కాని అలా చేసి ఐనా వారు మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారని అంటే అది సత్యదూరం కాకపోవచ్చును. అంత పట్టుదలతో‌ ఉన్నారు వారు.

ఎలాగూ మరిన్ని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలను ఆంధ్రులు దిగ్విజయంగా చేయబోతారన్న దివ్యదృష్టి ఎలాగూ‌ ఉన్న మన ఆంధ్రాప్రభుత్వం వారికి వాటిలో‌ ప్రత్యేకకోనసీమరాష్ట్రం కోసం జరిగే ఉద్యమం కూడా ఉంటుందన్న స్పృహ తప్పకుండా ఉంటుందని నమ్మవచ్చును.

అందుచేత రాబోయే , అదేలెండి ఏదో‌ ఒక నాటికి రాబోయే కోనసీమరాష్ట్రం అవసరాలను దృష్టిలో‌ ఉంచుకొని కొన్ని పనులు చేయాలి. కేవలం‌ కోనసీమతో అంటే‌ మరీ చిన్నది అవుతుంది కాబట్టి ఉభయగోదావరీ‌జిల్లాలను కలిపి ప్రత్యేక రాష్ట్రంగా మునుముందు ఏర్పడేందుకు దోహదపడాలి. ఆ కొత్త రాష్ట్రానికి కూడా ముచ్చటగా మూడు రాజధాని నగరాలుండాలి. కాకినాడ, రాజమండ్రి, మరొక ఎంపిక చేసిన ముఖ్యనగరమూ‌ వెరసి మూడు నగరాలూ రాజధానులుగా ఉండాలి. రాజమండ్రి వాణిజ్య రాజధాని అందాం. కాకినాడ పారిశ్రామిక రాజధాని అందాం. మరొక నగరానికి తగిన పోర్టుఫోలియో‌ కేటాయిద్దాం. ఈవిధంగానే ఆంధ్రాలో ముందుముందు పుట్టబోయే ప్రత్యేకరాష్ట్రాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాజధాని కేండేట్ నగరాలను ఇప్పటినుండే నిర్మాణం చేస్తూ‌ పోవాలి.

ఇప్పటికే ఆంధ్రావారి ఆదర్శవంతమైన బహుళరాజధానుల సిధ్ధాంతం ఇతర రాష్త్రాల వారినీ‌ ఆకర్షిస్తోందని వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో మదురైని రెండవ రజధానిగా చేయమని అడుతున్నారట.

ఈ ముచ్చట ఇలా కొనసాగితే, యావద్దేశంలోనూ‌ రాష్ట్రాలూ - రాజధానులూ‌ అన్న అంశం విద్యార్ధులకు మంచి పాఠ్యాశం అవుతుంది.

దేశానికేం‌ కర్మం! యావత్ప్రపంచానికీ‌ ఈ‌ బహుళరాజధాని వ్యవస్థ ఆదర్శప్రాయం కావచ్చును.


1 కామెంట్‌:

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.