17, సెప్టెంబర్ 2020, గురువారం

హరి హరి హరి హరి యనరాదా

 హరి హరి హరి హరి యనరాదా శ్రీ
హరి మావాడని యనరాదా

హరి కన్యులు లే రనరాదా శ్రీ
హరి మా హితుడని యనరాదా
హరి నావాడని యనుకొన నొల్లని
నరజన్మము వృధ యనరాదా

హరియే చుట్టం బనరాదా శ్రీ
హరియే నేస్తం బనరాదా
హరియే తనవా డనుకొననిది ఆ
నరజన్మము వృధ యనరాదా

హరినే యఱసెద ననరాదా శ్రీ
హరినే కలిసెద ననరాదా
హరిని కలియుటం దభిరుచి లేని
నరజన్మము వృధ యనరాదా

హరి సేవయె చాలనరాదా శ్రీ
హరి సేవను మురియగరాదా
హరి సేవలలో మురియని జన్మము
హరి హరి వలదని యనరాదా

హరియే దైవం బనరాదా శ్రీ
హరినామము చాలనరాదా
హరినామము రుచిమరుగని జన్మము
హరి హరి వలదని యనరాదా

హరి భక్తియె గొప్పనరాదా శ్రీ
హరి భక్తులు ఘను లనరాదా
హరి భక్తిని సొంపారని జన్మము
హరి హరి వలదని యనరాదా

హరి భజనము చేయగరాదా శ్రీ
హరి భజనమె సుఖ మనరాదా
హరి భజనలతో నలరని జన్మము
హరి హరి వలదని యనరాదా

హరి దాసుల గలియగరాదా శ్రీ
హరి దాసుడె నరు డనరాదా
హరి దాసుల మరియాద చేయనిది
నరజన్మము కాదనరాదా

హరి విశ్వేశ్వరు డనరాదా శ్రీ
హరియే విశ్వం బనరాదా
హరి విశ్వాత్మకు నెరుగని జన్మము
హరి హరి వలదని యనరాదా

హరియే గతి యని యనరాదా శ్రీ
హరిని మరువరా దనరాదా
హరిని మరచితే యధోగతే ఆ
నరజన్మము వృధ యనరాదా

హరియే రాముం డనరాదా ఆ
హరియే కృష్ణుం డనరాదా
తరచుగా హరిని తలచని జన్మము
హరి హరి వలదని యనరాదా

హరి మావాడని యనరాదా శ్రీ
హరి మావాడని యనరాదా
హరి మావాడిక యన్యుల సంగతి
హరిహరి వలదని యనరాదా

1 కామెంట్‌:

  1. నారాయణ నారాయణ జయ గోవింద హరే || నారాయణ నారాయణ జయ గోపాల హరే || కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ || ౧ || ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ || ౨ || యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ || ౩ || పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ || ౪ ||
    మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ || ౫ || రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ || ౬ || మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ || ౭ || బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ నారాయణ || ౮ || వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ || ౯ || జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ || ౧౦ || పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ || ౧౧ || అఘ బకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ || ౧౨ || హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ || ౧౩ || దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ || ౧౪ || గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ || ౧౫ || సరయుతీరవిహార సజ్జన‌ఋషిమందార నారాయణ || ౧౬ || విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర నారాయణ || ౧౭ || ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ || ౧౮ || జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ || ౧౯ || దశరథవాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ || ౨౦ || ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ || ౨౧ || వాలివినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ || ౨౨ || మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ || ౨౩ || జలనిధి బంధన ధీర రావణకంఠవిదార నారాయణ || ౨౪ || తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ నారాయణ || ౨౫ || గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ || ౨౬ || సంభ్రమసీతాహార సాకేతపురవిహార నారాయణ || ౨౭ || అచలోద్ధృతచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ || ౨౮ || నైగమగానవినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ || ౨౯ || భారత యతవరశంకర నామామృతమఖిలాంతర నారాయణ || ౩౦ ||

    జై శ్రీమన్నారాయణ

    రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.