29, అక్టోబర్ 2022, శనివారం

రామ రామ సీతారామ


రామ రామ సీతారామ రామ జయరామ
రామ భవతారక నామ రామ శుభనామ
 
రామ రామ కేశవ రామ నారాయణ
రామ రామ మాధవ రామ గోవింద
రామ రామ విష్ణుదేవ రామ మధుసూదన
రామ రామ త్రివిక్రమ రామ వామనా

రామ రామ శ్రీధర రామ హృషీకేశ
రామ రామ పద్మనాభ రామ దామోదర
రామ రామ సంకర్షణ రామ వాసుదేవ
రామ రామ  ప్రద్యుమ్న రామ అనిరుధ్ధ

రామ రామ అధోక్షజ రామ పురుషోత్తమ
రామ రామ నరసింహ రామ అచ్యుత
రామ రామ ఉపేంద్ర రామ జనార్దన
రామ రామ  శ్రీహరి రామ శ్రీకృష్ణ

27, అక్టోబర్ 2022, గురువారం

శరణు శరణు శ్రీజానకీపతీ

శరణు శరణు శ్రీజానకీపతీ శరణు శరణు శరణు

శరణు శరణు శ్రీరామచంద్ర వనజాసననుతచరితా
శరణు శరణు శ్రీరామచంద్ర గిరిజాపతినుతచరితా
శరణు శరణు శ్రీరామచంద్ర సురసన్నుతనిజచరితా
శరణు శరణు శ్రీరామచంద్ర మునిసంస్తుతశుభచరితా
 శరణు శరణు శ్రీరామచంద్ర మునిసతిప్రస్తుతనామా
శరణు శరణు శ్రీరామచంద్ర ఆంజనేయనుతనామా
శరణు శరణు శ్రీరామచంద్ర జనసన్నుతశుభనామా
శరణు శరణు శ్రీరామచంద్ర జలజాక్ష ఘనశ్యామా
 శరణు శరణు శ్రీరామచంద్ర దనుజాంతక రణధీరా
శరణు శరణు శ్రీరామచంద్ర సురవిరోధి ప్రాణహరా
శరణు శరణు శ్రీరామచంద్ర విజ్ఞానప్రభాకారా
శరణు శరణు శ్రీరామచంద్ర సంసారభయాపహరా


26, అక్టోబర్ 2022, బుధవారం

జయ గోపాలా జయ గోపాలా

జయ గోపాలా జయ గోపాలా
జయ జయ మురళీ లోలా

నందకుమారా నవనీతచోరా
బృందావిహార సదా
నందా సనందాదివందితచరణార
వింద ముకుంద హరీ

కుందరదన బహుసుందరవదన
మందస్మితజితమదన
ఇందీవరశ్యామ బృందారకాధిప
వందితపాద హరీ

సుందరవిగ్రహ సురుచిరపాదార
విందాశ్రితగోపబృంద
కందర్పజనక కరుణాపాంగా
నందితసుజన హరీ

25, అక్టోబర్ 2022, మంగళవారం

ఎంత మంచిది రామనామం‌ బెంత మధురమైనది

ఎంత మంచిది రామనామం‌ బెంత మధురమైనది
ఎంత మందికి దారిచూపిన దెంత సులభమైనది

కోతులై బహు కొండకోనల గ్రుమ్మరు జీవములకు
ప్రీతితో తన సేవ నొసగిన విభుడు రాముని నామము
నాతికై హరి పోరు వేళను నడపె ధైర్యము నిచ్చుచు
నాతని కడు గొప్పసేనగ నదియె తీర్చి దిద్దెను

అన్నకు తన నీతి వాక్యము లాగ్రహము కలిగించగ
తిన్నగా వినువీధి కెగుర దేవదేవుని నామమా
పన్నునకు శుభమార్గముగ హరిపాదములను చూపగ
సన్నుతించుచు భక్త విభీషణుడు శరణము పొందెను

దారితప్పిన మునికుమారుడు దారిదోపిడి దొంగయై
క్రూరుడై చరియించుచుండగ నారదాదిమహర్షులు
కూరిమి శ్రీరామనామము గూర్చ నాతని బుధ్ధికి
దారినెఱిగెను రామచరితము తారచించె వాల్మీకియై

చప్పచప్పని దీపావళిలో చిన్నిచిన్ని ఆనందాలు


ఈ దీపావళి పండుగ కూడా ఎప్పటిలాగే చప్పచప్పగా గడవటం మొదలుపెట్టింది.

ఉండ్రాళ్ళతద్ది నుండే ఊరిస్తూ ఉండే దీపావళి హడావుడి అట్టతద్దితో రంగప్రవేశం చేసేది మాయింట్లో ఒకప్పుడు.

అట్లతద్ది నాటికే నేనూ మాతమ్ముడు రామం ఇద్దరమూ సిసింద్రీల తయారీలో తలమునకలు అయ్యేవాళ్ళం.

మరికొద్ది రోజులకే మతాబాల తయారీ సన్నాహం బహు కోలాహలంగా మొదలయ్యేది. మతాబాల తరువాత చిచ్చుబుడ్లనూ తయారు చేసేవాళ్ళం.

వీశ సూరేకారానికి నూటయిరవై మతాబాలూ డజను చిచ్చుబుడ్లూ అని మానాన్నగారు లెక్కవేసేవారు.

ఆలెక్కను నేను పెద్దయ్యాక మార్చాను మతాబాలను సన్నగా చేయటం మొదలుపెట్టి.

నేను తాటాకు టపాకాయలనూ చేసేవాడిని. అదీ నాలుగైదు వందలు.

అగ్గి పెట్టెలూ కాకరపూవొత్తులూ సీమటపాకాయలూ మాత్రం కొనేవాళ్ళం తప్పదు కాబట్టి.

దీపావళీ అంటే మా నాన్నగారికి గొప్ప సరదా. ఆయన చిన్నప్పుడు పిచికలు అని ఒకరకం కాల్చేవారట. వాటిని పటాసూ పంచదారా కలిపి చేస్తారట.

మాఅమ్మగారికి కూడా దీపావళి చాలా యిష్టం.

మాయింట్లో అంతా మహాలక్ష్మీ స్వరూపాల సందడే సందడి. అందుకని పండుగల కళకళ బ్రహ్మాండంగా ఉండేది.

మానాన్నగారి నిర్యాణం తరువాత అందరూ నాదగ్గరకు హైదరాబాద్ వచ్చినా దీపావళి సందడి ఎప్పటి లాగే కొనసాగింది.

క్రమంగా రోజులు మారాయి.

అమ్మాయిలంతా పెళ్ళిళ్ళై అత్తవారిళ్ళకు వెళ్ళారు.

మగపిల్లలమూ ఇళ్ళూవాకిళ్ళూ ఏర్పరచుకొన్నాం.

నేను గచ్చిబౌలిలో స్థిరపడ్డాను.

ఇద్దరమూ అంటే నేనూ మాశ్రీమతి పెద్దవాళ్ళం ఐపోయాం. ఆరోగ్యసమస్యలూ ఉన్నాయి. ఇద్దరం రంగురంగుల మందుబిళ్ళలను నిత్యం‌ ముప్పూటలా మింగుతూ ఉంటాం.

కేవలం ఇద్దరు వృధ్ధులు మాత్రం ఉండే ఇంట్లో దీపావళి ఏమి శోభగా ఉంటుంది!

మంగళవారం నాడు సూర్యగ్రహణం కాబట్టి సోమవారం నాడే దీపావళి అన్నారు. శుభం. అలాగే అనుకున్నాం. మాకు దీపావళి ఎప్పుడైనా ఒక్కటే!

మంగళవారం నాడు మాశ్రీమతి శారదకు డయాలసిస్ సెషన్ ఉంటుంది. వారంలో మూడుసార్లు డయాలసిస్. మంగళవారం, గురువారం శనివారం ఆరోజులు.

శనివారం నుండి మంగళవారం వరకు అంటే మూడు రోజుల వ్యవధి. డయాలసిస్ పేషంట్ శరీరంలో వ్యవధి ఎక్కువ ఐన కొలదీ నీరు చేరటం ఎక్కువ అవుతుంది.

నీరు ఎక్కువ ఐపోతే డయాలసిస్ పేషంట్ ఆయాసం బారిన పడే ప్రమాదం ఉంది.

అందుచేత డయాలసిస్ పేషంట్ ద్రవాహారాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి.

దానికి తోడు ఈపేషంట్లు శరీరంలో పొటాషియం మోతాదు పెరుగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మేము అన్ని కూరలూ ఒకసారి వార్చి మరీ వండుకుంటాం.

ఇలా తిండికి ఇన్ని ప్రతిబంధకాలు ఉన్నాయని చెప్పి పండుగలకు కూడా సాధారణంగా ఇల్లు కదలం.

దీపావళి నాటి రాత్రి  కాబేజీ చప్పిడి కూరతో భోజనం అయిందంటే అయింది అనిపించాం.

కాలక్షేపానికి రెండు సినీమాలు చూసాం. పెద్ద రామారావు చేసినవి. మొదట భట్టివిక్రమార్క చూసాం. తరువాత బాలనాగమ్మ చూసాం.

మేముండే కమ్యూనిటీలో ఆరువందల కుటుంబాల వరకూ ఉన్నా ఆట్టే సందడి కనిపించలేదు. ఈసారి కమ్యూనిటిలో ఉన్న పదహారు బిల్డింగులకూ అటూ ఇటూ ఉన్న విశాలమైన ఖాళీస్థలాల్లో బాణాసంచా కాల్చవద్దని చెప్పారు. ఒక స్థలం చెప్పి అక్కడ కాల్చుకోమన్నారు. కొందరికి ఆ ప్రతిపాదన నచ్చలేదు. పొలోమని అందరూ పోయి ఒక చిన్నస్థలంలో ఎలా బాణాసంచా కాల్చేదీ అని వాళ్ళ అభ్యంతరం. సబబే మరి. దాంతో ఈరాత్రి టపాసుల మోత వినిపించనే లేదు.

ఇదేమిట్రా ఈదీపావళీ మరీ చప్పగా ఉందీ అనుకుంటున్నాం.

ఇంతలో మావాళ్ళ ఇళ్ళల్లో దీపావళి సందడి ఫోటోలూ వీడియోలూ వచ్చాయి.

అందులో రెండు చూదాం.

మొదటిది మాశ్రీనిథి దీపాలు వెలిగిస్తున్న దృశ్యం. శ్రీనిథి మానలుగురు అన్నదమ్ములకూ ఏకైక కుమార్తె. అందుచేత చిట్టితల్లి ప్రత్యేకం.


రెండవది మాపెద్దచెల్లెలు అనురాధ దీపాలు వెలిగిస్తున్న దృశ్యం. మానాన్నగారి పెద్దకూతురు ప్రత్యేకం కదా మరి మా అందరికీ.

 

ఇవి కాక ఇంకా కొన్ని వచ్చాయి. మొత్తానికి ఇలా చిన్న సంతోషాలు కలగటంతో దీపావళి మాకూ కొంచెం సంతోషంగానే గడిచింది.

సినీమాలు రెండూ పూర్తిగా చూసి, యధాప్రకారం మొబైల్‌లో ఉదయం ఆరున్నరకు అలారం సెట్ చేసుకొని విశ్రమించాం. తెల్లారి గబగబా తెమిలి డయాలసిస్ సెంటర్‌కు వెళ్ళాలి కదా!

రామ రామ అనలేని

రామ రామ అనలేని దేమి జన్మము

రాముని పూజింపలేని దేమి జన్మము


తామసుడై తిరుగుచు తప్పులే చేయుచు

పామరుడై తిరుగుచు పాపాలు చేయుచు

కాముకుడై తిరుగుచు కాపురుషుడై

భూమిపైన తిరిగెడు పురుషుని జన్మము


ధనములను నమ్ముచు ధనములకై తిరుగుచు

ధనికులను నమ్ముచు దాస్యమును చేయుచు

ధనేతరము నిమ్మహి తానెఱుగకే

అనుదినము గ్రుమ్మరు నధముని జన్మము


పర మొకటి కలదని భావించని జన్మము

హరి యొకడు కలడని అరయలేని జన్మము

ధర మీద కలుగుట తప్పనుకొనక

మరలమరల కలుగెడు మనుజుని జన్మము


రాము డున్నాడు

రాము డున్నాడు సీతారాము డున్నాడు రాజా

రాము డున్నాడు పరంధాము డున్నాడు


తనను సేవించుటకై తహతహలాడుచును

మునివరులును సురవరులును ముచ్చటటడగ

జనకసుతాసమేతుడై జననాథశిఖామణి

కనకపు సింహాసనమున కరుణతో నిదే


సకలలోకముల నున్న సజ్జనుల కందరకు

ప్రకటించుచు నభయంబును భగవంతుడై

సకలసంపదల నొసంగి సర్వార్ధముల భక్త

నికరంబున కెపుడు దీర్చ నిష్ఠతో నిదే


శరణమనెడు వారి నెపుడు సాగి రక్షించుచు

పరులను పీడించు వారి పట్టి యణచుచు

హరేరామ యను వారల కపవర్గ మొసంగుచు

కరుణచూపుచుండు వాడు పరమపురుషుడు


24, అక్టోబర్ 2022, సోమవారం

దీపావళీ తాటాకు టపాకాయలు!


ఈరోజు దీపావళీ పర్వదినం. 
 
ఈ సందర్భంగా కష్టేఫలీ బ్లాగు శర్మ గారు తాటాకు టపాకాయలు అని ఒక చక్కని టపా వేసారు. 

ఆ టపాలో తాటాకు టపాకాయల్లో ఉపయోగించేది సూరేకారం, పటాసు , గంధకం,బొగ్గుపొడి, ఒక్క జొన్నగింజ అని చెప్పారు. కాని నాకు తెలిసి అలా చేసే కాయల్ని నల్లమందు కాయలు అనేవారు. నేను అరవైల్లో తాటాకు టపాకాయలు చేయటం మొదలుపెట్టే నాటికే నల్లమందు కాయల తయారీ బాగా తగ్గిపోయింది.

ఆధునికమైన టపాకాయల తయారీ అప్పటికే మొదలయ్యింది. వాటిలో ఉపయోగించేవి పటాసు, గంధకం, మెగ్నీషియం పౌడర్ మాత్రమే. సీమటపాకాయల్ని మీరు విడదీసి చూస్తే మీకు కనిపించేది ఈమందే.

పటాసు గంధకం అనేవి రెండూ విడివిడిగా అంత వెంటనే పేలేవి ఏమీ కావు కాని రెండింటినీ కనుక కలిపినట్లైతే ఏమాత్రం వత్తిడి సోకినా తక్షణం పేలుడు సంభవిస్తుంది.

అందుకనే ఆరెండిటినీ నేరుగా కలపకుండా మందుగుండు తయారు చేయాలి. మొగ్నీషియం పౌడర్ తీసుకొని దానిలో పటాసు కలిపి ఆమిశ్రమంలో అప్పుడు గంధకం పొడిని కలపాలి.
 
ఆరోజుల్లో రోలు-రోకలి అనే ఒక చిన్న సాధనం అమ్మేవారు. అందులో రోలు అనే గుంటలో కొంచెం‌ పటాసు కొంచెం గంధకం వేసి ఆ సాధనాన్ని మూసివేయాలి. దాని హేండిల్ పట్టుకొని ముందుభాగాన్ని ఏ రాతి అరుగుమీదో ఒక దెబ్బవేసి కొడితే ధన్ మని పెద్ద సౌండ్ వచ్చేది.
 
నాస్నేహితుడు ఒకతను చావలి నరసింహం (పూర్తిపేరు చాలా పొడుగు!) ఒక చిన్న కథ చెప్పాడు ఒకసారి. వాళ్ళ ఊరిలో ఒకబ్బాయి బోలెండంత పటాసునూ తగినంత గంధకాన్నీ కలిపి ఎత్తునుండి పడేస్తే ఊరంతా అదిరిపోయిందట ఆపేలుడు శభ్దానికి.

మణిశిల అని ఒకటి దొరుకుతుంది. దానిని టపాకాయల్లో వాడటం అత్యంత ప్రమాదకారి అని చెప్పారు మానాన్నగారు . అది వాడిన కాయలు బిగింపు చేసే సమయంలో ఆ ఒత్తిడికే చేతుల్లో పేలిపోయి మనుషుల కాళ్ళూ చేతులూ తెగిపడిపోతాయట.
 
ఈమెగ్నీషియం పౌడర్‌ని అప్పట్లో జనం ఎలక్ట్రిక్ పౌడర్ అనే తమాషా పేరుతో పిలిచే వారు. అందుకని ఈ టపాకాయలకు ఎలక్ట్రిక్ కాయలనే పేరు కూడా ప్రచారంలో ఉండేది.
 
మా ఊరు కొత్తపేటలో పొన్నాడ రత్తమ్మ గారి ఇంట్లో ఈ రెండురకాల‌ తాటాకు టపాకాయనూ భారీఎత్తున తయారు చేసి అమ్ముతూ ఉండేవారు దీపావళికి. ఈ పొన్నాడ రత్తమ్మ గారి అబ్బాయి భీమశంకరం హైస్కూల్లో సైన్స్ లాబ్ అసిస్టెంట్ ఉద్యోగంలో ఉండేవాడు. అప్పట్లో ఎలక్ట్రిక్ కాయల ఖరీదు పాతికకు రెండు రూపాయలుగా ఉండేది. నల్లమందు కాయలైతే పాతిక రూపాయే. వీళ్ళ దగ్గర ఒకసారి యభై ఎలక్ట్రిక్ కాయలను కొని తెచ్చాను.

మా స్కూలు పిల్లవాడు ఒకతని ద్వారా నాకు ఈతాటాకు టపాకాయలను చేసే విధానం తెలిసింది. అతడితో వాళ్ళింటికి వెళ్ళి ఆయింట్లో వాళ్ళు దీన్ని ఎలా తయారు చేస్తున్నారో చూసి నేర్చుకున్నాను.

శర్మ గారు మామూలు తాటాకులు పనికి రావు అని అన్నారు కాని మేము మాత్రం మామూలు తాటాకులనే వాడి చేసే వాళ్ళం. తాటిమట్టలను తెచ్చి ఆకులు విడదీసుకొని ఆరబెట్టి సిధ్ధం చేసుకొనేవాడిని. మరీ ఎక్కువగా ఎండితే పొడిపొడి ఐపోతుంది ఆకు. ఆవిషయంలో కొంచెం పదును తెలియాలి.

టపాకాయను చుట్టే టప్పుడు మూలల్లో కొద్దిగా సూక్ష్మరంధ్రం ఉండిపోయి పేల్పు సరిగా రాకపోయే ప్రమాదం ఉంది. అందుకని వత్తి పెట్టిన మూల కాక ప్రక్కన ఉండే మూల ఒక చిన్న గింజను ఉంచితే దట్టింపు బాగా వస్తుంది. అలా బాగా బిగించి కట్టిన కాయ భలే చప్పుడుతో పేలుతుంది. కాని ఒక చిన్న చీకాకు ఉంది. ఆగింజ ఎంతవేగంగా ఎగిరిపోతుందీ అంటే ఒక తుపాకీగుండులా అనుకోండి! మరి అది అలా ఎటైనా పోవచ్చును కదా. అంటె మనమీదకూ రావచ్చును కదా. ఒక్కోసారి అలా ఎగిరి వచ్చిన గింజలు టపాకాయల పేల్పు చూసి వినోదిస్తున్నవాళ్ళకు తాకి ఇబ్బంది పెట్టటం గమనించాను. కొద్ది సార్లు నాకే తగిలాయి. ఇది మంచిది కాదని గింజలు గట్రా వాడటం మాని వేసాను. వాటిబదులు చిన్న కాగితం ముక్కను ఉంచేవాడిని. కట్టటంలో టైం వేష్ట్ అవుతోందని అదీ మానివేసాను.

తాటాకులు సరిగా దొరకని పక్షంలో న్యూస్ పేపర్ ముక్కని పొడుగ్గా మడతలు వేసి దానితో కూడా టపాకాయలు కట్టి ప్రయత్నించాను. బాగానే వచ్చాయి తాటాకులంతగా సౌండ్ చేయకపోయినా.

నేను కాలేజీ చదువుకు వచ్చి అమలాపురం వెళ్ళిన సంవత్సరం దీపావళికి ముందుగా చాలా పెద్ద తుఫాను వచ్చింది. అమలాపురంలో ఐతే కాలేజీ కుర్రవాళ్ళకు కొద్దిరోజులు తిండికే ఇబ్బంది ఐనది. హోటళ్ళు అన్నీ మూతబడ్దాయి కాబట్టి. పోనీ ఇళ్ళకు పోదాం అంటే చెట్లు పడిపోయి దారులన్నీ మూసుకొని పోవటం వలన బస్సు సౌకర్యం నిలిచిపోయింది మళ్లా కార్తీకపౌర్ణిమ దాకా.

అప్పట్లో నేను వండుకొని తినే వాడిని రూములో. అందుకని నాకూ నారూమ్మేటు స్వర్గీయ గుడిమెళ్ళ పాండురంగా రావుకూ తిండికి ఏ ఇబ్బందీ రాలేదు. 

ఐతే ఇంటి వెళ్ళాలి పండక్కు అనుకుంటే దారి లేని పరిస్థితి.

దీపావళికి ముందురోజున మరెవరోతోనో కలిసి సైకిల్ మీద ఊరికి వెళ్ళాడు పాండురంగా రావు.

నాకంత సీన్ లేదు. నాకు సైకిల్ త్రొక్కటం కూడా రాదు.

అందుచేత నేను అమలాపురంలోనే చిక్కుపడి పోయాను.

దీపావళికి నేను ఎలాగైనా రాగలుగుతానని ఇంట్లో అందరూ ఎదురుచూస్తూ ఉంటారు.

అంతకు చాలా ముందుగానే దీపావళికి తాటాకు టపాకాయలను కట్టటానికి అంతా సిధ్ధం చేసుకొన్నాను కూడా. అవి కాక మాయింట్లో ఆనవాయితీగా ఎప్పుడూ మతాబాలూ చిచ్చుబుడ్లూ మేమే తయారు చేసుకుంటాం. వాటి తయారీ హడావుడి ముఖ్యంగా మానాన్నగారిది.

అవి కాక నేనూ మా తమ్ముడు స్వర్గీయ సత్యశ్రీరామచంద్రమూర్తీ కలిపి వందల లెక్కన సిసింద్రీలు తయారు చేసుకుంటాం ఏటా. నిజం చెప్పాలంటే వాడి చేతిమీదుగా మందు తయారుచేస్తేనే సిసింద్రీలు మహబాగా తూనీగల్లా ఎగిరేవి.

ఇంత హడావుడి ఉంది.

నేనేమో అమలాపురంలో చిక్కుపడిపోయాను.

మరెలా?

రాత్రంతా నిద్రపట్టలేదని గుర్తు. పైగా నిత్యం నేనూ పాండూ కబుర్లు చెప్పుకుంటూ‌ నిద్రపోయే వాళ్ళం. ఆరాత్రి వాడు రూములో లేడు కదా. దీపావళికి ఎలాగో ఇంటికి వెళ్ళగలిగాడు కదా. మరి నాసంగతి ఏమిటీ?

ఇంక గట్టిగా నిర్ణయం చేసుకున్నాను.

కొంచెం తెల్లవారగానే, అమలాపురం నుండి కాలినడకన మాఊరు కొత్తపేటకు బయలుదేరాను.

దారిపొడుగునా రహదారిని ఆక్రమించుకొంటూ అనేకచోట్ల వృక్షాలు కూలిపోయి ఉన్నాయి.

అప్పటికే చాలాచోట్ల కొందరు వాటి కొమ్మలని కొద్దిగా ప్రక్కకు నెట్టి నడకకు కొంచెం దారి చేసుకున్నారు. ఇంకా అనేక చోట్ల అలా వీలు పడలేదని తెలుస్తూనే ఉంది. కష్టపడి సైకిళ్ళను పెకి ఎత్తి దాటించి మరీ ప్రయాణం చేసారేమో జనం.

నేనూ అంతే వీలైన చోట్ల ఆ కొమ్మల మధ్యన సందులోనుండి ఆవలకు వెళ్తూ దాటాను లేదా కొమ్మల మీదనుండి వీలైన చోటు చూసుకొని ఎక్కి ఆవలికి దిగి వెళ్ళాను. కొద్ది చోట్ల కష్టం అయింది అలా దాటటం కూడా.

మధ్యాహ్న కావస్తున్నది.

ఇంకా నేను నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉంది.

ఒకప్రక్కనుండి నీరసం వస్తున్నది. అప్పటికే పదమూడు కిలోమీటర్ల దూరం నడిచి అలసి ఉన్నాను కదా.

ఉదయం అమలాపురంలో నారూములో కొంచెం ఉప్మా చేసుకొని తిని బయలుదేరాను. అదెంత సేపని ఆపగలుగుతుంది మరి?

ఐనా ఇంక నాలుగు కిలోమీటర్లే కదా ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్న ఆలోచనతో ఓపిక తెచ్చుకొని నడుస్తూనే ఉన్నాను.

ఒక చెట్టు కొమ్మను ఎక్కి దిగబోతుంటే ఒకతను సైకిలుతో వచ్చి ఆగాడు నావెనుకనే.

నా సంగతి విచారించి నన్నూ తనతో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తానన్నాడు.

నిజానికి అప్పటికి నాప్రయాణంలో ఎందరో అలా సైకిళ్ళపై వెళ్ళటం చూసాను కాని ఎవ్వరూ ఆమాట అనలేదు సాయం చేస్తానని.

అక్కడినుండి ఇద్దరమూ సైకిల్ ప్రయాణం అన్నమాట.

మధ్యమధ్యలో పడిపోయిన చెట్లు వచ్చినప్పుడు దాటుకొంటూ సైకిల్ పుణ్యమా అని ముఖ్యంగా ఆ సహాయం చేసిన అబ్బాయి పుణ్యమా అని పదకొండున్నర దాటిన తరువాత కొత్తపేట చేరాను. అతను ఇంకా ముందుకు సాగిపోయాడు నన్ను మెయిన్ రోడ్డు మీద హైస్కూల్ దగ్గర్ దించి.

నేను ఇంటికి రావటంతో అందరూ చాలా సంతోషపడ్డారు. అప్పటి ఒక్కొక్కరి సంతోషస్పందన మీదా ఒక్కొక్క పేరాగ్రాఫ్ వ్రాయవచ్చును.

స్నానమూ భోజనమూ పూర్తి అయ్యాక టపాకాయలను కట్టటంలో పడ్డాను.

అప్పటికే కొన్ని సిధ్ధం చేసానో లేదో ఇప్పుడు గుర్తు లేదు. చేసే ఉండాలి. ఎందుకంటే మొత్తం టపాకాయలన్నీ సాయంత్రానికి రెడీ చేసేసాను. అన్ని కలిపి ఒక నాలుగువందలు వరకూ చేసి ఉంటాను.

నాకాలేజీ చదువు పూర్తి అయిన వెంటనే‌ మానాన్నగారికి రంపచోడవరం ట్రాన్స్‌ఫర్ అయింది. అక్కడా నేను తాటాకు టపాకాయలు చేసాను. అదీ ఒకటి రెండేళ్ళే!

నేను హైదరాబాదుకు ఉద్యోగం నిమిత్తం వచ్చాక తాటాకు టపాకాయలను ఇంక చేయటం వీలు పడలేదు.

కాని మతాబులూ చిచ్చుబుడ్లూ మాత్రం చేయటం మానలేదు చాలాకాలం పాటు. మానాన్నగారు నా ఉద్యోగజీవితం ప్రారంభంలోనే స్వర్గస్థులయ్యారు. అమ్మా తమ్ముళ్ళూ చెల్లెళ్ళూ అంతా హైదరాబాదుకు నావద్దకు వచ్చేసారు. మోండామార్కెట్లో మందుగుండు సామాగ్రినీ చిచ్చుబుడ్ల గుల్లలనూ కొనే వాళ్ళం. మా నాన్నగారికి లాగానే మా అమ్మగారికి కూడా దీపావళీ అంటే ఎంతో సరదా ఉండేది. అందుకని పండుగకు నెల్లాళ్ళ ముందునుండీ దీపావళీ బాణాసంచా తయారీ మొదలయ్యేది మాయింట్లో. ఆ సందడి దీపావళి నాడు సాయంత్రం దాకా ఏదో ఒకటి తయారు చేస్తూనే ఉండటంగా కొనసాగేది.

ఆరోజులే వేరు!

22, అక్టోబర్ 2022, శనివారం

రామపరంబై రహియించనిచో

రామపరంబై రహియించనిచో

    రామ రామ అది యొక బ్రతుకా


రాముని మహిమను విన నొల్లనిచో

    రామ రామ అది యొక బ్రతుకా

రాముని చరితము నెఱుగలేనిచో

    రామ రామ అది యొక బ్రతుకా


రాముని నమ్మితి నని పలుకనిచో

    రామ రామ అది యొక బ్రతుకా

రాముడె సర్వంబని పలుకనిచో

    రామ రామ అది యొక బ్రతుకా


రాముడె తల్లియు తండ్రి యననిచో

    రామ రామ అది యొక బ్రతుకా

రాముడె సద్గురు వని పలుకనిచో

    రామ రామ అది యొక బ్రతుకా


రాముని నిరతము తలచ లేనిచో

    రామ రామ అది యొక బ్రతుకా

రాముని సేవను కోర లేనిచో

    రామ రామ అది యొక బ్రతుకా   


రాముని చేరి చరియించనిచో

    రామ రామ అది యొక బ్రతుకా

రామాంకితమై యుండని దగుచో

    రామ రామ అది యొక బ్రతుకా   


రాముడె దైవం బని పలుకనిచో

    రామ రామ అది యొక బ్రతుకా

రాముడె మోక్ష ప్రదాయకు డననిది

    రామ రామ అది యొక బ్రతుకా


రామా యననిది యొక బ్రతుకా

రామా యననిది యొక బ్రతుకా

    రాముని పొగడని దొక బ్రతుకా


పుంసాంమోహన రూపుని రాముని

    పొగడని బ్రతుకును నొక బ్రతుకా

సంసారార్ణవతారకనాముని

    చక్కగ పాగడని దొక బ్రతుకా


కనులవిందుగా మనసిజమోహను

     కనుగొన దలచని దొక బ్రతుకా

తనివితీరగా మురియుచు కనుగొన

     దలచని మనుజుని దొక బ్రతుకా


మురియుచు నిరతము హరిభక్తులతో

    ముచ్చట లాడని దొక బ్రతుకా

హరిభక్తుల సచ్చరితంబులను

     మురియుచు తెలియని దొక బ్రతుకా


ఇనకులతిలకుని వినుతించుటకై

    మనసుపడనిదియు నొక బ్రతుకా

జనవినుతుని గుణగణములు నుడువుచు

    తనువును మరువని దొక బ్రతుకా


సత్యవ్రతుడగు రాముని సేవల

    నిత్యము గడుపని దొక బ్రతుకా

భృత్యుడ శ్రీరఘువీరున కేనని

     నిత్యము పలుకని దొక బ్రతుకా


నిరతము రాముని కీర్తిని చాటుచు

    తిరుగని మనుజుని దొక బ్రతుకా

పరమపురుషుడగు రాముని చేరగ

    పరితపించనిది యొక బ్రతుకా



19, అక్టోబర్ 2022, బుధవారం

మురళీరవము విని

మురళీరవము విని పరుగున వచ్చితిమి

పరుగులు తీయకురా బాలగోపాలా


మురళినూది పిలచినది మరల పారిపోవుటకా

విరిపొదల దూరి నిన్ను వెదుకలేమురా

సరసమైనమురళిపాట చాలని రాగా యిటు

పరుగులు తీసేవు నీవు మరియాదటరా


పరుగుపరుగన వనితలు వచ్చిరని చులకనయా

పరుగులుతీయించి యాడవచ్చు నను భావనయా

మురళిపిలుపు వేరొకరికి పంపిన సంకేతమా

మురళీధర నీకిపుడు పరుగులేలరా


పాటపాడు వరకు నిన్ను పారిపోనీయమురా

నీటుకాడ మురళితీసి పాటపాడరా

గోటితో కొండ నెత్తిన గోవిందుడా మురళి

పాట లింక వినిపించర పారిపోకురా



18, అక్టోబర్ 2022, మంగళవారం

ఏలా రాడాయెనే

ఏలా రాడాయెనే బాల గోపాలుడు

వేళమించి వెన్నెలా వెలతెలబోయేనే


తలకు నెమలి యీక తగిలించి బంగారు

వలువగట్టి కస్తూరి తిలకము పెట్టి

గళమున ముత్యాలు గంతులు వేయగ

విలాసముగ చేత పిల్లనగ్రోవితో 


కాళ్ళ గజ్జెలు మ్రోయ గంతులు వేయుచు

వ్రేళ్ళ రత్నాంగుళులు వెలుగులు చిమ్మ

రాళ్ళను కరగించు రాగాల మురళితో

త్రుళ్ళుచు మోహనరూపుడు చెలులార


ఏమైన యన్నారే యెవరైన సఖులార

మోమాటపడి వాడు మోముచాటు చేసె

ఆమోహనాకార మా మురళిపాటయు

నేమాయె నెవ్వరి నేమందుమే నేడు



ఓ మనోజ్ఞ మంగళమూర్తీ

ఓ మనోజ్ఞ మంగళమూర్తీ 
     ఓహో నందకుమారా
ఓమురళీధర యెందున్నావో 
    మాముందుకు రావేలా
 
ఏ తరుశాఖల నెట దాగితివో 
ఈతరుణీమణు లిందరు నీకై
తరువుతరువునకు తహతహలాడుచు 
పరువులెత్తుచును పరుగిడు చుండగ 

ఏ పూపొదలో నెట దాగితివో 
తాపము చెందుచు గోపికలందరు 
పూపొదలన్నిట గోపార్భక తమ 
చూపుల చేతుల జొనిపి వెదుకగను
 
కన్నుల  నిండుగ కనకుండగ నిను
వెన్నెల రాత్రియె వృథయై చనునా
అన్నుల మిన్నల కానందముగా
చిన్నికృష్ణుడా చేరగ రారా

 

15, అక్టోబర్ 2022, శనివారం

తెనాలి రామకృష్ణ కవి చాటు పద్యం - 5

చ. తెలియనివన్ని తప్పు లని దిట్టతనాన సభాంతరంబున్     
బలుకఁగ రాకురోరి పలుమాఱుఁ బిశాచపుఁబాడెకట్ట నీ     
పలికిననోట దుమ్ముపడ భావ్య మెఱుంగవు పెద్దలైనవా     
రల నిరసింతురా ప్రెగరాణ్ణరసా విరసా తుసా బుసా

ఒకసారి రాయల వారి ఆస్థానానిని ప్రెగడరాజు నరస కవి అనే ఒకాయన వచ్చి తన ప్రజ్ఞలు విన్నవించుకుంటూ ఇతరుల కవిత్వంలో తాను తప్పులెన్నగలనని కూడా ఒక ప్రజ్ఞగా చెప్పుకున్నాడు. 

తెనాలి రామకృష్ణకవికి ఆమాటకు చాలా ఆగ్రహం కలిగి ఇలా అన్నాడట.

చ. ఒకని కవిత్వమం దెనయు నొప్పులు తప్పులు నా కవిత్వమం 
దొకనికి తప్పు బట్ట పని యుండదు కాదని తప్పు బట్టినన్ 
మొకమటు క్రిందుగా దిగిచి మ్రొక్కలు వోవ నినుంప కత్తితో 
సికమొదలంట గోతు మరి చెప్పున గొట్టుదు మోము దన్నుదున్ !

ఎవడో ఒకడి కవిత్వంలో తప్పులూ ఒప్పులూ అని ఉంటాయని చెప్పి అందరి కవిత్వమూ లోపభూయిష్టంగానే ఉంటుందని ఆలోచించి అందరి కవిత్వంలోనూ తప్పులు పడతానని, అదొక ప్రజ్ఞగా, చెప్పుకొని తిరుగుతున్నావా? నా కవిత్వంలో ఒకడికి తప్పుపట్టే పనే ఉండదు!  (అసలు తప్పంటూ‌ ఉండదు కదా అని). 
 
అలాకాదు తప్పులు వెదకి తీరతాను అని ఎవడైనా (నీలాంటి వాడు) అంటే ఊరుకొనేది లేదు. 
 
అలా అన్నవాడి ముఖం క్రిందకి అదిమి పెట్టి, ఇనపకత్తితో వాడి సిగ మొదలంటా తరిగేస్తాను. అంతే కాదు వాడిని చెప్పుతో కొడతాను. వాడి ముఖం మీద తన్నుతాను 
 
అని రంకెలు వేసాడు అసహ్యంతో.

అంతటితో ఊరుకోక మళ్ళా ఇలా అన్నాడట.

చ. తెలియనివన్ని తప్పు లని దిట్టతనాన సభాంతరంబున్     
బలుకఁగ రాకురోరి పలుమాఱుఁ బిశాచపుఁబాడెకట్ట నీ     
పలికిననోట దుమ్ముపడ భావ్య మెఱుంగవు పెద్దలైనవా     
రల నిరసింతురా ప్రెగరాణ్ణరసా విరసా తుసా బుసా
 
ఓరీ! విరసా!  ప్రెగరాణ్ణరసా! తుసా! బుసా! నీకు నీవే ఏదో దిట్టనే అనుకొని (గర్వించి) సభాంతరంలోనికి వచ్చి (నీకు) తెలియనివి అన్నీ తప్పులని పలుమారులు పలకటానికి రాకురా!!
 
భావ్యము (ఏది ఎలా తెలుసుకొని మాట్లాడాలో) ఎఱుంగవు!
 
పెద్దలైనవారల నిరసింతురా? (అంటే పెద్దల తప్పులు ఎన్నుతారా ఎక్కడైనా)
 
అలా పలికిన నీనోట దుమ్ముపడ!
 
(నీకు) బిశాచపుఁబాడెకట్ట! నీపాడెనుకూడా మనుష్యులన్నవాళ్ళు ముట్టుకోరురా నీలాంటి పిశాచాలే మోయాలీ అని.


కొందరు స్వల్పప్రజ్ఞతో కవిత్వాన్ని ముక్కస్యముక్కార్ధః అన్నట్లుగా ప్రతిపదార్ధం నిఘంటువుల్లో చూసి తెలుసుకుందుకు ప్రయత్నం చేస్తారు. భంగపడతారు. వాళ్లకు కవిచెప్పేది సరిగా తెలియదు. పైగా అనర్ధాలు గోచరిస్తాయి. అలాంటి వాళ్ళు తమ ప్రజ్ఞ చాలటం లేదని అర్ధం చేసుకోవాలి. పెద్దలను ఆశ్రయించి సరిగా తెలుసుకోవాలి. అంతే కాని కనిపించిదిరోయ్ దోషం అని టముకు వేయటానికి ప్రయత్నిస్తే నవ్వులపాలైపోతారు.

ఇక్కడ ఒక్క విషయం చెప్తాను. వేదసాహిత్యాన్ని మేక్స్ ముల్లర్ మహాశయుడు అర్ధం చేసుకున్న తీరు కూడా ఇటువంటిదే. ఆయన సంప్రదాయజ్ఞుడు కాదు కదా. నిఘంటువుల సాయంతో మిడిమిడి జ్ఞానపు పండితులతో చర్చించి వేదసాహిత్యానికి వ్యాఖ్యానం చేయాలని చూసాడు. వేదసాహిత్యాన్ని అర్ధం చేసుకుందు నిరుక్తం అని ఉంది వేదాంగం ఒకటి - అది ఈయనకు తెలియని విద్య. అందువలన ఆయన చెప్పిన అర్ధాలు చాలా వరకూ తప్పులతడకలు.

ఈవిషయాన్ని దయానంద సరస్వతి చెప్పాడు. అరవింద మహర్షి కూడా వాతలు పెట్టి మరీ చెప్పాడు.

ఒక ఋక్కులో ఇంద్రుడి గుర్రాలు పరుగెడుతుంటే వాటి గిట్టలనుండి నేయి కారుతున్నది అని అర్ధం వస్తుందట నిఘంటువుల ప్రకారం. ఇలాంటి అర్ధాలు చూసి మాక్స్ ముల్లర్ వేదాలను కొంత అపహాస్యధోరణిలో వ్యాఖ్యానించాడు. ఈఋక్కుకు సరైన అర్ధం అది కాదు అని అరవిందులు ఏకంగా ఒక పుస్తకం అంత సరైన వ్యాఖ్యానం వ్రాసి చూపారు.

సాహిత్యంలో మార్మికత ఉంటుంది. సింబాలిక్‌గా ఏదైనా ఉంటే అక్కడ నిఘంటువులు ఆట్టే పనికిరావు. వాటిని సంప్రదాయం తెలిసి అర్ధం చేసుకోవాలి. ఇలా నరసకవి లాంటి వారు తప్పులు పడతామంటే రామకృష్ణకవిలాంటి వారు ఉగ్రులౌతారు మరి.

త్యాగరాజస్వామి వారు కీర్తనలు పాడుతుంటే శిష్యులు వ్రాసుకొనే వారు. అయన నదీస్నానానికి వెళ్ళి వస్తూ కొత్త కీర్తనను గానం చేస్తున్నారు. ఆయనను అనుసరిస్తున్న వారిలో కొత్తశిష్యపరమాణువు ఒకడున్నాడు. అతడేదో కొంచెం సాహిత్యం పైపైన చదువుకొని ఉండవచ్చు. అయ్యవారి కీర్తనలో ఈపిల్లవాడికి తప్పుతోచి ప్రక్కవారితో గుసగుసలాడాడు. అది పెద్దాయన గమనించనే గమనించారు. తన కీర్తనలో, ఏదో తెలిసినట్లు గర్వమేలే, అని కూడా అని పాడి గాలితీసారు.

పెద్దలకంటే మనకే ఎక్కువ తెలుసును అనుకోవటం మంచిది కాదు. తగినంత కృషి చేసి తెలుసుకుందుకు ప్రయత్నించటం వివేక లక్షణం.

ఆపాటి వివేకంలేని ఒక నరసరాజు అనే వాడు ప్రచారంలో ఉన్న గ్రంథాలలో తప్పులని తాననుకొన్నవి బాగా మనసుకు ఎక్కి సభల్లో దూరి పెద్దల కవిత్వంలో కూడా తప్పులు పట్టగలనూ అని ప్రకటించుకొని అభాసు పాలయ్యాడు.

తెనాలి రామకృష్ణ కవి చాటుపద్యం - 4

మ. కలనన్‌ తావకఖడ్గఖండితరిపుక్ష్మాభర్త మార్తాండ మం  
డల భేదంబొనరించి యేగునెడ తన్మధ్యంబునన్‌ హారకుం  
డలకేయూరకిరీటభూషితుని శ్రీనారాయణుం గాంచి లో  
గలగం బారుచు నేగె నీవ యను శంకన్‌ కృష్ణరాయాధిపా!

మనం గతటపాలో చెప్పుకున్న చాటువు అల్లసాని వారి శరసంధానక్షమాది.. అన్నపద్యానికి ప్రతిస్పందనగా రామకృష్ణ కవి కూడా రాయలను పొగడుతూ చెప్పాడని జనశ్రుతిగా ఉన్న చాటుపద్యం ఇది.

ఈ కలనన్ తావక ఖడ్గఖండిత పద్యం ఎంత  ఉత్సాహాన్ని సభలో కలిగించిందీ అంటే అల్లసాని పెద్దనగారు కూడా వెంటనే ఒకతమాషా పద్యం చెప్పి రంజించారట సభను. అది వినండి.
 
మ.సమర క్షోణిని కృష్ణరాయల భుజాశాతాసిచే పడ్డ దు  
రమ దోర్దండ పుళిందకోటి యవన వ్రాతంబు సప్తాశ్వమా  
ర్గమునన్‌ కాంచి సెబాసహో హరిహరంగా ఖూబు ఘొూడాకి తే  
తుముకీ బాయిల బాయిదే మలికి యందు ర్మింటికిన్‌ పోవుచున్‌ 

మరి ఆపైన మన ముక్కుతిమ్మనగారు ఊరుకున్నారా. పెద్దనగారు ఉర్దూ మాటలు దట్టించి తమాషాపద్యం చెప్తే తిమ్మన గారు ఓఢ్రభాషానైపుణ్యం చూపుతూ ఇలా పద్యం చెప్పారట.

శా.రాయగ్రామణి కృష్ణరాయ భవదుగ్ర క్రూర ఖడ్తాహిచే  
గాయం బూడ్చి కళింగ దేశ నృపతుల్‌ కానిర్హరీ పోషణీ  
మాయా ఖీకుముటూరు లోటు కుహుటూ మాయా నటాజా హరే  
మాయాగ్షేయ మడేయటంద్రు దివి రంభాజారునిన్‌ యక్షునిన్‌ 

ఈపద్యాలన్నింటికీ చెప్పుకోవటం వీలౌతుందో లేదో అవటుంచుదాం. మనం తావకఖడ్గఖండిత పద్యాన్ని చూదాం ప్రస్తుతానికి. కొంచెం దీర్ఘసమాసాలను విడివిడిగా వ్రాస్తూ  పద్యభాగాలను విడదీసీ చూస్తే పద్యం ఇలా ఉంది.

మ. కలనన్‌ తావక ఖడ్గ ఖండిత రిపుక్ష్మాభర్త, మార్తాండ మం  
డల భేదంబొనరించి యేగునెడ, తన్మధ్యంబునన్‌ - హార కుం  
డల కేయూర కిరీట భూషితుని శ్రీనారాయణుం గాంచి, లో  
గలగం బారుచు నేగె, నీవ యను శంకన్‌, కృష్ణరాయాధిపా!
 
ఈ పద్యానికి అన్వయం చూదాం.  కలనన్‌, తావక ఖడ్గ ఖండిత రిపుక్ష్మాభర్త,  మార్తాండమండలభేదం బొనరించి యేగునెడ, తన్మధ్యంబునన్‌, హార కుం  డల కేయూర కిరీట భూషితుని, రీనారాయణుం, గాంచి, లో గలగం బారుచు నేగె, నీవ యను శంకన్‌, కృష్ణరాయాధిపా అని.

కలను అంటే యుధ్ధం.
తావక ఖడ్గ ఖండిత రిపుక్ష్మాభర్త అంటే నీ కత్తిచేత ఖండించబడిన శత్రు రాజు అని అర్ధం. ఇక్కడ తావక అంటే నీ‌యొక్క, ఖండనం అంటే నరకటం. ఖండితుడు అంటే చంపబడ్డవాడు. రిపుడు అంటే శత్రువు. క్ష్మాభర్త అంటే భూమిపతి అనగా రాజు. వెరసి నీకత్తి దెబ్బకి చచ్చిన శత్రురాజు అని అర్ధం.

మార్తాండమండలం అంటే సూర్యమండలం. యుధ్ధంలో మరణించినవాడు వీరమరణం పొందాడు కాబట్టి స్వర్గానికి వెళ్తాడు. వారు సూర్యమండలం చేరి ఆపైన ఊర్ద్వలోకాలకు వెళ్తారని ప్రతీతి. సామాన్యజనం మృతిపొందితే వారు చంద్రమండలం చేరి పితృలోకాలకు వెళ్ళి అపైన ఊర్ద్వగతులు పొందుతారని అంటారు. రాయలవారి చేతిలో ఇలా వీరమరణం పొందిన శత్రురాజు సూర్యమండలం చేరాడట, ఆమండలాన్ని


భేదం బొనరించి యేగునెడ అంటే ఆ సూర్యమండలాన్ని  దాటి వెళ్ళే‌ సందర్భంలో ...

అక్కడ వారికి శ్రీనారాయణుడు కనిపించాడని అంటున్నారు శ్రీనారాయణుం గాంచి అని చెప్పటం ద్వారా.
 
ఆనారాయణుడు ఎలా ఉన్నాడు?

అయన హార కుండల కేయూర కిరీట భూషితుడుగా ఉన్నాడు. అంటే ఎంతో వైభవంగా ఉన్నాడు. ఆయన మెడలో అనేక రత్నహారాలున్నాయి. ఆయన అందమైన రత్నకుండలాలను ధరించి ఉన్నాడు. అయన చక్కటి వజ్రాలు పొదిగిన భుజకీర్తులను ధరించి ఉన్నాడు. గొప్ప నవరత్నశోభితమైన అందమైన కిరీటం ధరించి ఉన్నాడు.
 
ఇంత వైభవంగా ఆసూర్యమండలాంతర్గతుడైన శ్రీనారాయణుణ్ణి చూసి ఆ చచ్చి అక్కడికి వచ్చిన శత్రురాజు ఎంతో భయపడ్డాడట.

కలగు అంటే కలతపడటం అని అర్ధం. గలగంబారు అంటే కలతపడి పరిగెత్తాడు అని!

ఎందుకు అలా భయపడి పరిగెత్తుతూ పోయాడు అంటే 

కృష్ణరాయాధిపా (అనగా ఓ‌కృష్ణదేవరాయ మహారాజా), 

నీవయను శంకన్! (అంటే అయ్యబాబోయ్ ఇక్కడ ఉన్నది  కృష్ణదేవరాయలురా అన్న అనుమానంతో) అట.

సూర్యమండలంలో  ఉండేది సూర్యనారాయణ మూర్తి అని అంటాం కదా, ఆ సంగతిని కవిగారు బహుచక్కగా ఉపయోగించుకున్నారు.

ఓకృష్ణదేవరాయా, నీవు నారాయణమూర్తిలాగా ఉంటారు. నీచేతిలో వీరమరణం పొందిన వాడు యధాప్రకారం సూర్యమండలం చేరినా అక్కడ ఉన్న నారాయణుణ్ణి చూసి నీవే అన్న భ్రమతో కలతపడి అక్కడినుండి పారిపోతాడు సుమా అని పద్యంలో కవి చమత్కారం.

ఇక్కడ ఛందస్సంబంధి ఒకటి రెండు విశేషాలు. రెండవపాదంలోనూ మూడవపాదంలోనూ కూడా యతిమైత్రి భంగం ఐనదేమో అని పిల్లకవులు అపోహపడే ప్రమాదం ఉంది. యతిమైత్రికి ఇబ్బందులు ఏమీ లేవు. పద్యాన్ని ఇల్లా చూడండి.
 
మ. కలనన్‌ తావకఖడ్గఖండితరిపుక్ష్మాభర్త మార్తాండ మ 
న్డల భేదంబొనరించి యేగునెడ తన్మధ్యంబునన్‌ హారకు 
న్డడ లకేయూరకిరీటభూషితుని శ్రీనారాయణుం గాంచి లో  
గలగం బారుచు నేగె నీవ యను శంకన్‌ కృష్ణరాయాధిపా!
 
మండల అన్న మాటను మన్డల అనీ కుండల అన్నమాటను కున్డల అనీ కూడా వ్రాయవచ్చును నిక్షేపంగా.
యతి సరిపోతున్నది కదా!

తెనాలి రామకృష్ణ కవి చాటుపద్యం - 3

 
మ. శరసంధాన బల క్షమాది వివిధైశ్వర్యంబులుం గల్గి దు 
ర్భర షండత్వ బిలప్రవేశ చలన బ్రహ్మఘ్నతల్ మానినన్ 
నరసింహక్షితిమండలేశ్వరుల నెన్నన్వచ్చు నీసాటిగా 
నరసింహ క్షితిమండలేశ్వరుని కృష్ణా! రాజకంఠీరవా!

ఇది తెనాలి రామకృష్ణ కవి చెప్పిన చాటుపద్యం కాదు!

ఈపద్యాన్ని చెప్పిన కవి సత్తముడు ఆంధ్రకవి పితామహ బిరుదాంకితు డైన అల్లసాని పెద్దన గారు.

ఐతే అద్భుతమైన చమత్కారం కల ఈపద్యాన్ని రాయలవారిని పొగడుతూ అల్లసాని పెద్దన గారు భువనవిజయం సభలో చెప్పగా అష్టదిగ్గజ కవుల్లో మరొక ప్రసిధ్ధకవి ఐన తెనాలి రామకృష్ణ కవి తప్పుపట్టాడని ఐతిహ్యం.

ఇది ఐతిహ్యం మాత్రమే అయ్యుండాలి. రాయల వారి భువనవిజయంలో ఉన్న అష్టదిగ్గజాల్లోని కవుల్లో తెనాలి రామకృష్ణ కవి ఉండేందుకు అవకాశం లేదు. రామలవారు స్వర్గస్థు లయ్యే సమయానికి రాకకృష్ణకవి చిన్నపిల్లవాడు. పదిహేనేళ్ళుంటాయేమో.

ఈవిషయం ప్రక్కన పెట్టి, ఈశరసంధాన.... పద్యంలోని చమత్కారం ఏమిటో తెలుసుకొనే‌ ప్రయత్నం చేద్దాం.

ఈ పద్యాన్ని కొంచెం పదాలను విడదీసి చదవాలి నిజానికి.

మ. శరసంధాన - బల - క్షమాది వివిధైశ్వర్యంబులుం గల్గి దు
ర్భర షండత్వ - బిలప్రవేశ - చలన - బ్రహ్మఘ్నతల్ మానినన్ 
నర - సింహ - క్షితిమండ - లేశ్వరుల నెన్నన్వచ్చు నీసాటిగా 
నరసింహ క్షితిమండలేశ్వరుని కృష్ణా! రాజకంఠీరవా!

అని పదాలమధ్య ఎడం ఇచ్చి చదవాలి.కంటికి చెవికి మొదట కనిపించే చమత్కారం  నరసింహ క్షితిమండలేశ్వర అన్న ప్రయోగం రెండుసార్లు రావటమే. అదెందుకో తెలుసుకోవాలి మనం.

ఈ‌పద్యం అన్వయం చూదాం ముందుగా. 

శరసంధాన, బల, క్షమాది వివిధైశ్వరంబులం గల్గి (ఉన్నప్పటికిన్నీ), దుర్బల షండత్వ, బిలప్రవేశ, చలన, బ్రహ్మఘతలు మానినన్, నర, సింహ, క్షితిమండల, ఈశ్వరులను ఎన్నన్ వచ్చు, క్షితిమండలేశ్వరుని నీసాటిగా, రాజకంఠీరవా నరసింహ కృష్ణా,

వివరంగా చూదాం. నరుడు అంటే అర్జునుడు. నరనాయాయణులని విష్ణువు రెండురూపాలుగా బదరీవనంలో తపస్సు చేసాడనీ వారిలో నరుడే అర్జునుడిగానూ, నారాయణుడే శ్రీకృష్ణుడిగానూ అవతరించారని అంటారు. అందుచేత అర్జునుడికి ఉన్న అనేక నామాల్లో నరుడు అన్న నామం కూడా బహుప్రసిధ్ధం. ఈ నరుడు విలువిద్యలో తిరుగులేనివాడు. శరములు అంటే‌ బాణాలు. శరసంధానం అంటే విటికి బాణం తొడగటం. ఈపని అర్జునుడు ఎంతవేగంగా చేస్తాడూ అంటే అవతలి శత్రువుకు అర్జునుడి వింటినుండి బా‌ణాలు వర్షంలాగా విరుచుకు పడుతూ ఉండటమే‌ కనిపిస్తుంది కాని, ఆ అర్జునుడు ఎప్పుడు బాణం తీస్తున్నాడో అమ్ములపొది నుండి ఎప్పుడు దాన్ని వింటినారికి తగిలించుతున్నాడో ఎప్పుడు బాణాన్ని విడుస్తున్నాడో అన్న మూడుక్రియలూ విడివిడిగా ఏమీ కనిపించవు. పూర్వం శ్రీరామచంద్రమూర్తి మాత్రమే అంత వేగంగా బాణప్రయోగం చేసేవాడని అంటారు. పైగా ఈఅర్జునుడి దగ్గర మరొక తమాషా నైపుణ్యం కూడా ఉంది. ఆయన మూపున రెండువైపులా అమ్ములపొదులు ఉంటాయి. వాటిలో బాణాలు తరగనే తరగవు.ఆయన కుడిచేతితో విల్లుపట్టుకొని ఎడమచేతితో బాణాలను తీయకలడు లేదా ఎడమచేతితో విల్లుపట్టుకొని కుడిచేత్తో బాణాలను తీయకలడు. అందుకే ఆయనను సవ్యసాచి అంటారు. ఆబిరుదు మరెవరికీ లేదు మరి. ఇంత గొప్ప అర్జునునికీ ఒక లోపం ఉందిట! అదేమిటీ అంటే కొన్నాళ్ళు ఆయన షండుడు అనగా నపుంసకుడు ఐపోయాడు. పాపం అయన్ను ఊర్వశి అలా శపించింది. ఆఒక్క లోపమూ ఆయనకు కలుగక పోయుంటే మాత్రమే ఆయన రాయల వారికి సాటి వస్తాడని అల్లసాని వారి చమత్కారం. అంటే రాయలు అర్జునుడి అంతగొప్ప యుధ్ధ వీరుడని చెప్పటం ఇక్కడ తాత్పర్యం.

బలం అనే‌ లక్షణానికి సింహాన్నే చెప్తారు. అందుకే సింహాన్ని మృగరాజు అంటారు. ఆఁ సింహానిదేం‌ బలం! అది బిలప్రవేశం చేస్తుంది దాక్కుందుకు అని కవిగారు అసంతృప్తిని వెలిబుచ్చుతున్నారు. దానిదీ ఒకబలమేనా అది రాయలవారితో బలంలో సాటి అని చెప్పలేం. ఆ బిలప్రవేశం చేసి దాక్కోవటం మానేస్తే మాత్రం మన రాయలవారితో సమంగా ఎన్నవచ్చును బలంలో అంటారు. అంటే రాయలు సింహాన్ని మించిన బలశాలి అని చెప్పటం ఇక్కడ తాత్పర్యం.  సింహమే నీకు సాటీ కాదు పోవయ్యా అంటున్నారు.
 
ఇకపోతే క్షితిమండలం అంటే భూమి. భూమికి క్షమాగుణం మెండు అని ప్రతీతి క్షమయాధరిత్రీ అని వినే ఉంటారు కదా.  ఉత్తమ పత్నీ లక్షణాలను చెబుతూ 

కార్యేషు దాసీ కరణేషు మంత్రీ 
రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ 
భోజ్యేషు మాతా శయనేషు రంభా 
షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ
 
క్షమాగుణం భూమి లక్షణం అని సాహిత్యకారులంతా నిత్యం కీర్తిస్తూ ఉంటారు. కాని ఆ భూమికీ ఒక అవలక్షణం ఉందిట! అదేమిటయ్యా అంటే చలనం! ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది కాని కుదురుగా ఉండలేదు కదా. అలా చలించే అవగుణం మానితే మాత్రం ఆక్షమాగుణం కల భూమిని నీకు సాటి అని చెప్పవచ్చునయ్యా రాయా అంటున్నారు కవి.

ఇక శివుడి సంగతి. ఆయన వివిధమైన ఐశ్వర్యాలకూ మూలం కదా. అసలు ఐశ్వర్యం అంటే ఈశ్వరుని లక్షణం అని అర్ధం కదా. ఐనా ఈశ్వరుణ్ణి నీతో సరిపోల్చలేమయ్యా అంటున్నారు కవి. అదేమిటీ అదెలా అంటే ఈశ్వరుడు బ్రహ్మఘుడు. మీకు తెలుసో తెలియదో నిజానికి బ్రహ్మగారికి ఐదు తలకాయ లుండేవి. ఐదో తలకాయను శివుడు గిల్లి తీసివేసాడట కోపించి. అందుచేత శివుదికి బ్రహ్మహత్యాదోషం వచ్చింది. విష్ణువు సహాయంతో దాన్ని ఆయన తొలగించుకున్నాడట. ఐనా కించిత్తుగా ఆదోషం ఆయన్ను వదలలేదట. ఆయన చేతిలో భిక్షాపాత్రగా పట్టుకొనేది అబ్రహ్మకపాలం అనే‌ అంటారు. రాయలూ, ఇదిగో ఇలా బ్రహ్మహత్య చేయకుండా ఉండి ఉంటే శివుడు నీకు సాటివచ్చే వాడయ్యా అని కవి చమత్కారం.

క్షితిమండలేశ్వర నరసింహ కృష్ణదేవరాయా, రాజకంఠీరవా ఈ నరుడూ, సింహమూ, క్షితిమండలమూ, ఈశ్వరుడు తమతమ లోపాలను సరిదిద్దుకుంటే‌ మాత్రమే యుధ్ధనపుణ్యంలోనూ, బలంలోనూ, క్షమాగుణంలోనూ, ఐశ్వర్యంలోనూ  నీకు సాటిగా ఎన్నవచ్చునయ్యా (లేకపోతే వీలుకాదు) అని ఈపద్యంలో కవిగారిచ్ చమత్కారం అన్నమాట.

ఐతే సభలో ఈపద్యంలో ఒక తప్పుంది అని రామకృష్ణ కవి అన్నాడు.

సింహం మన రాయలవారికి సాటి కాదు అని చెబుతూనే రాజకంఠీరవా అని కంఠీరవం అంటే సింహంతో ఆయన్ను పోల్చుతావేమిటయ్యా అని అక్షేపించాడట.

ఇది ఒక అందమైన చాటూక్తి మాత్రమే.

ఇక్కడొక్క చిక్కుఉంది. శరసంధానబలక్షమాదివివిధైశ్వర్యంబులు అన్నప్పుడు ఆది అనగా మొదలైన అని సమాసం మధ్యలోనే వచ్చింది కదా ఐశ్వర్యం అన్న పదం విడిగా ఎలా లెక్కిస్తారూ‌ అని ఎవరైనా ప్రశ్న వేయవచ్చును. ఆ ఇబ్బందినీ సులభంగా తీర్చవచ్చును. చూడండి శరసంధాన, బల, క్షమ, ఆదివివిధైశ్వర్యంబులు అని చెప్పటం సమజసం అని అనటం ద్వారా. ఆదివివిధైశ్వర్యంబులు అంటే అన్నిటికీ‌మూలమైన అనేకరకాలైన సంపదలు అని అర్ధం. మరి భగవంతుడైన శివుడి నుండే కదా అన్ని సంపదలూ ఏర్పడినదీ. ఇలా అన్వయం చేసుకోవాలి.  అలా చేసి శివుడిని కూడా లిష్టులో లెక్కించాలి అన్నమాట. ఇక్కడ ఒక్కొక్క లక్షణానికి ఒక్కక్క లక్ష్యం క్రమంగా చెప్పుకోవాలి అని తెలుస్తూనే ఉంది కదా. ఆవిషయం విస్తరించ నవసరం ఉందని అనుకోను.

ఈపద్యంలో అల్లసాని వారి అల్లిక జిగిబిగి కనిపిస్తుంది. అలాగే రామకృష్ణ కవి దాన్ని ఎలా చమత్కారంగా తప్పు పట్టాడో‌ తెలుస్తుంది.

14, అక్టోబర్ 2022, శుక్రవారం

ఉ‌ర్వినిగల వారికెల్ల

ఉర్విని గల వారికెల్ల నున్నది యొక రక్ష

సర్వవేళ లందు నదే సాగించును రక్ష


అంతగొప్ప రక్ష యున్న నది యేదో తెలుపుమా

వింత కదా యట్టి సర్వవిధముల రక్ష

అంతకన్న గొప్పరక్ష యనగ నెందును లేదు

వింతలేదు రామ‌రక్ష విశ్వమంతటికి రక్ష 


ఆ‌రుగురు శత్రువులను తీరుగ నది యణచునా

మారునితో కట్టగట్టి వారి నణచును

దారుణభవవారిధి నది దాటించ జాలునా

తారక మారామరక్ష తప్ప వేరొకటి లేదు


కాలు డనే వాడొకడు కబళించ వచ్చినపుడు

చాలినంత రక్ష నది సలుపజాలు నందువు

కాలుడెవడు గీలుడెవడు కబళించ వాడెవడు

రాలేడు నీదరికి శ్రీరామరక్ష నీకుండ



తెనాలి రామకృష్ణ కవి చాటుపద్యం - 2


కం.మా కొలది జానపదులకు 
నీ కవనపు ఠీవి యబ్బునే కూపనట 
ద్భేకములకు గగనధునీ 
శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా

ఈపద్యాన్ని తెనాలి రామకృష్ణ కవి నంది తిమ్మనను ప్రశంసిస్తూ చెప్పాడని ప్రతీతి.

ఈపద్యానికి అన్వయం చూదాం. సింగయ తిమ్మా , కూపనటద్భేకములకు గగనధునీశీకరముల చెమ్మ (అబ్బునే)? మా కొలది జానపదులకు నీ కవనపు ఠీవి యబ్బునే? 
 
కూపనటద్భేకములు అంటే బావిలోతిరిగే కప్పలు. కూపం అంటే బావి. భేకం అంటే కప్ప అన్నవి అర్ధాలు కాబట్టి, కూపనటద్భేకములు అంటే బావిలోతిరిగే కప్పలు.
 
గగనం అంటే ఆకాశం. ధుని అంటే నది. శీకరములు అంటే నీటి తుంపురులు. గగనధుని అంటే ఆకాశగంగ. కాబట్టి గగనధునీశీకరములు అంటే ఆకాశగంగా ప్రవాహం తాలూకు నీటి తుంపురులు. ఇక్కడ చెమ్మ అంటే తడి అని ఒక మాట ఉంది. నిజానికి దీనిని ఇంక పెద్దగా పట్టించుకోనక్కర లేదు. తుంపురుల తడి అని చెప్పవచ్చును కావాలంటే.
 
బావిలో ఉండే కప్పలకు ఆకాశగంగ తుంపురులు అబ్బుతాయా? అబ్బే అవి వాటికి లభించేందుకుఆస్కారం లేదు అని కదా సమాధానం.

జానపదులు అంటే కవిహృదయం పల్లెటూరి జనం అని. పల్లెటూరి జనానికి సహజంగానే వ్యవసాయాది వృత్తుల నైపుణ్యాలే‌ కాని తీరికగా సాహిత్యకృషి చేసేందుకు పెద్దగా అవకాశం ఎక్కడ ఉంటుంది? ఉండటం అరుదు. మాకొలది జానపదులకు అంటే మాలాంటి పల్లెప్రజలకు అని అర్ధం.

కవనపుఠీవి అంటే కవిత్వంలో గాఢత (గొప్పదనం) అని అర్ధం.

ఓ నంది తిమ్మయా, నీకవిత్వంలోని ఠీవి మాలాంటి పల్లెటూరి వాళ్ళకు అబ్బుతుందా? ఎక్కడన్నా బావిలో కప్పలకు ఆకాశగంగలో తుంపురులు లభిస్తాయా? 

ఇలా కవి నంది తిమ్మన్నను రామకృష్ణ కవి ప్రస్తుతించాడు.

ఇలా రాయలవారి సభలో నంది తిమ్మన్న కవిపై రామకృష్ణ కవి ఈపద్యం చెప్పిన తరువాత రాయల వారు కలుగ జేసుకొని గగనధుని బదులు నాకధునీ అంటే ఇంకా బాగుంటుందేమో అని సవరించారట. ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మూడవపాదంలో భేకములకు నాకధునీ అని అనటం వలన ప్రాసగా కకారం పడుతున్నది భేక - నాక శబ్ధాల పొందికతో. ఆసవరణను రామకృష్ణ కవి మెచ్చి రాయలను రాజకవివే‌ కావయ్యా కవిరాజువు అని పొగిడాడని ఐతిహ్యం.

తెనాలి రామకృష్ణ కవి చాటుపద్యం - 1

కం.నరసింహ కృష్ణరాయని
కర మరుదగు కీర్తి వెలయు కరిభి ద్గిరిభి
త్కరి కరిభి ద్గిరిగిరిభి
త్కరిభిద్గిరి భిత్తురంగ కమనీయంబై

ఈ చాటు పద్యం తెనాలి రామకృష్ణకవికృతం అంటారు. ఈపద్యాన్ని కొంచెం సరళంగా విసంధిగా వ్రాస్తే ఇలా వస్తుంది.

కం. నరసింహ కృష్ణరాయని
కర మరుదగు కీర్తి వెలయు కరిభిత్ గిరిభిత్
కరి కరిభిత్ గిరి గిరిభిత్
కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయంబై
 
ఈపద్యంలో చమత్కారం అంతా కరిభిత్ గిరిబభిత్ అన్న పదాలు మళ్ళా మళ్ళా రావటంలో ఉంది. ఇలా ఉండటం వలన ఈపద్యాన్ని పఠించేటప్పుడు కలిగే శబ్దసౌందర్యంలో ఉంది.
 
ఈ పద్యానికి అన్వయం చూదాం  (1)కరిభిత్ (2) గిరిభిత్ కరి (3) కరిభిత్ గిరి (4) గిరిభిత్ (5) కరిభిత్ గిరిభిత్ తురంగ (6) కమనీయంబై (7) నరసింహ కృష్ణరాయని (8) కరమరుదగు (9) కీర్తి (10) వెలయు అని. 

ఇప్పుడు ఈపద్యానికి కొంచెం వ్యాఖ్యానం చేసుకుందాం.
 
(7)నరసింహ కృష్ణరాయల కీర్తి ఎటువంటిదో ఈపద్యం చెబుతున్నది. నరసింహ కృష్ణరాయలు అనటం ఎందుకు? ఎందుకంటే కృష్ణదేవరాయ చక్రవర్తిగారి తండ్రిపేరు తుళువ నరసనాయకుడు. ఆయనను నరసింహరాయలు అని కూడా అంటారు - ఎందుకంటే నరస పదం నరసింహ పదానికి అభిన్నం కదా. అందుకని. కృష్ణదేవరాయలను నరసింహ కృష్ణరాయలు అంటున్నాడు కవి ఈపద్యంలో.

(8)కరమరుదగు అంటే కరము + అరుదు + అగు అని పదవిభజన. ఉకారం చివర ఉన్న పదానికి ఆతరువాత వచ్చే పదంలో మొదట అచ్చు ఉంటే ఆ అచ్చు ఈ ఉకారాన్ని మింగేస్తుంది అని సూత్రం. కాబట్టి కరము + అరుదు + అగు => కరమరుదగు ఐనది. ఇక్కడ కరము అంటే మిక్కిలి అని అర్ధం. (కరము అంటే ఏనుగు తొండమూ, కిరణమూ వగైరా అర్ధాలు కూడా ఉన్నాయి కాని సందర్భాన్ని బట్టి మిక్కిలి అన్న అర్ధాన్నే‌ మనం  తీసుకోవాలి. అరుదు అంటే విశేషం, అపూర్వం - చాలా తక్కువగా కనిపించటం అని అర్ధం. వెరసి కరమరుదగు అంటే చాలా అపూర్వమైన అని అర్ధం చెప్పుకోవాలి. కరమరుదగు కీర్తి అంటే చాలా విశేషమైన ఆశ్చర్యకరమైన కీర్తి అన్నమాట.

(10)వెలసె అని ఒకమాట ఉంది కదా. వెలయటం అంటే కనిపించటం, ప్రకాశించటం అని అర్ధం. కరమరుదగు కీర్తి వెలసె అంటే చాలా అపూర్వమైన కీర్తి కనిపిస్తోంది అని పిండితార్దం. ఎవరిది ఈ‌కీర్తి? నరసింహకృష్ణరాయనిది.

ఆకీర్తి ఎలా కనిపిస్తోందో మిగిలిన పద్యభాగంలో చెప్తున్నాడు కవి.

(1)కరిభిత్ అంటే అర్ధం చూదాం. కరి అంటే‌ ఇక్కడ ఏనుగు అని కాక ఏనుగు రూపంలో ఉన్న రాక్షసుడు అనగా గజాసురుణ్ణి తీసుకోవాలి. భిత్ అన్న పదానికి భేదించటం అనగా ముక్కలు చేయటం చంపటం వగైరా అర్ధాల్లో చంపటాన్ని తీసుకున్నాడు. కరిభిత్ అంటే‌ గజాసురుణ్ణి చంపినవాడు. ఎవడండీ? ఇంకెవడు శివుడు. శివుడిలా ఉందిట కీర్తి. శివుడిలా ఉండటం ఏమిటీ అంటే తెల్లగా ఉందీ అని. శివుడు తెల్లగా ఉంటాడు కదా. పూర్వం రంగుల పద్యాలు ఉండేవి ఎక్కాలపుస్తకంలో. అందులో తెలుపు మీద పద్యంలో పార్వతీపతి తెల్పు పాలసంద్రము తెల్పు అంటూ వస్తుంది లిష్టు. శివుడు తెల్లగా ఉంటాడు. ఈరోజున మనకు దొరుకుతున్న ఫోటోల్లో శివుడికి నీలం రంగు వేసేస్తున్నారు. అజ్ఞానం! అదంతా సరే, కీర్తి తెల్లగా ఉండటం ఏమిటీ? అంటే తెలుపు స్వఛ్చతకు చిహ్నం. అంటే కృష్ణదేవరాయల కీర్తి అద్భుతంగా శివుడి తెలుపులా మచ్చలేని స్వఛ్చతకలది అని తెలుసుకోవాలి.

(2)ఇంకా ఆ కీర్తి గిరిభిత్ కరి అన్నట్లుగా ఉందిట, గిరి అంటే‌ పర్వతం. పర్వతాలను చంపటం ఉండదు కదా. అంటే పర్వతాలను ఇంద్రుడు రెక్కలు విరిచి దండించాడని చెబుతారు. అంతకు ముందు పర్వతాలు కూడా రెక్కలతో ఎగురుతూ చిత్తం వచ్చిన చోట ఊళ్ళమీదపడి వాలుతూ ఉంటే జనం అశేషంగా చస్తూ ఉండే వారు. ఇంద్రుడు ముల్లోకాలకూ పాలకుడు కదా. జనం ఇలా చస్తుంటే వీళ్ళ బాధ చూసి కోపించి అన్ని పర్వతాల రెక్కల్ని తన వజ్రాయుధంతో నరికేసాడట. (ఒక పర్వం మైనాకుడు మాత్రం ఎగిరి సముద్రంలోనికి దూకి దాక్కున్నాడని రామాయణంలో వస్తుంది) అందుచేత పర్వతాలకు ఎగిరే‌శక్తి నశించింది. ఇక్కడ కవి చెప్పిన గిరిభిత్ అంటే వాడు పర్వతాల రెక్కలు విరిచిన ఇంద్రుడు. గిరిభిత్ కరి అంటే ఆ ఇంద్రుడి ఏనుగు. అది ఐరావతం కదా. ఐరావతం అంటే అది ప్రపంచంలోని ఏకైక తెల్లఏనుగు. కీర్తి  తెల్లఏనుగులా ఉండటం అంటే అంత తెల్లగా అనగా స్వఛ్చంగా ఉండటం అని అర్ధం తీసుకోవాలి. అంటే కృష్ణదేవరాయల కీర్తి అద్భుతంగా ఐరావతం తెలుపులా మచ్చలేని స్వఛ్చతకలది అని తెలుసుకోవాలి.

(3)ఆతరువాత కరిభిత్ గిరి అని వస్తున్నది. కరిభిత్ అంటే ఇందాకనే శివుడు అని అర్ధం చెప్పుకున్నాం. కాబట్టి కరిభిత్ గిరి అంటే శివుడి కొండ. అంటే కైలాసం అనే తెల్లని మంచుకొండ. ఇంకేమిటి అది స్వఛ్చంగా తెల్లగా ఉంటుంది కదా. అంటే కృష్ణదేవరాయల కీర్తి అద్భుతంగా మంచుకొండ కైలాసం తెలుపులా మచ్చలేని స్వఛ్చతకలది అని తెలుసుకోవాలి.
 
(4)ఆతరువాత మళ్ళా గిరిభిత్ అని వస్తోంది. ఇక్కడ బిత్ అనగా గిరులు అనగా పర్వతాలను భేదించిన వజ్రాయుధాన్ని తీసుకోవాలి. అదీ తెల్లగా ఉండేదే. అదెలా అంటే, అదేమీ లోహంతో చేసినది కాదు. దధీచి మహర్షి వెన్నెముకతో చేసినది. మరి ఎముక తెల్లగానే కదా ఉండేది. ఆయుధాల్లో అత్యంత శ్రేష్ఠమైన అయుధం వజ్రాయుధం. దానికి తిరుగు లేదు. అంటే కృష్ణదేవరాయల కీర్తి అద్భుతంగా వజ్రాయుధం తెలుపులా మచ్చలేని స్వఛ్చతకలది అని తెలుసుకోవాలి.
 
(5)ఆతరువాత కరిభిద్గిరిభిత్తురంగ అని వస్తోంది విడదీస్తే కరిభిత్ + గిరిభిత్ + తురంగ. ఇక్కడ ఒక విశేషం గమనించాలి కరిభిద్గిరిభిత్తురంగ అన్నపదానికి అన్వయంలో కరిభిత్తురంగ మరియు గిరిభిత్తురంగ అనితీసుకోవాలి. కరిభిత్ అంటే ముందే గజాసురుణ్ణి చంపిన వాడైన శివుడు అని చెప్పుకున్నాం. ఆయన తురంగం ఏమిటీ? నందీశ్వరుడు. అంటే ఎద్దు. రంగు తెలుపే‌ కదా. ఇక్కడ తురంగం అంటే వాహనం అనే‌ తీసుకోవాలి కాని తురంగం అంటే గుఱ్ఱం మాత్రమే‌ కదా అని వాదించ కూడదు. కొన్ని పద్యాల్లో  విష్ణుమూర్తిని ఖగతురంగ అనటం కూడా కనిపిస్తుంది మరి. అందుచేత కృష్ణదేవరాయల కీర్తి అద్భుతంగా నందీశ్వరుడి తెలుపులా మచ్చలేని స్వఛ్చతకలది అని తెలుసుకోవాలి. అలాగే గిరిభిత్ తురంగ అంటే ఇంద్రుడి వాహనం ఐన ఊఛ్ఛైశ్రవం అని తీసుకోవాలి. ఈ ఉఛ్చైశ్రవం గుర్రమే. తెల్లగుర్రం.  ఇది తెల్లగుర్రమే ఐనా దానిలో కొంచెం నలుపుందని డబాయించి, మాయచేసి తన సవతి వినతను ఓడించి కద్రువ ఆవిడని తనకు దాసిగా చేసుకుంది అని భారతంలో కథలా వస్తుంది. నిజానికి ఉఛ్చైశ్రవం అతి తెల్లని గుర్రం అన్నమాట. అంటే కృష్ణదేవరాయల కీర్తి అద్భుతంగా ఉఛ్ఛైశ్రవం తెలుపులా మచ్చలేని స్వఛ్చతకలది అని తెలుసుకోవాలి.
 
ఇలా పద్యంలో కవిగారు తెల్లగా ఉండే శ్రేష్ఠమైన వాటిని వరుసపెట్టి చెప్పి కృష్ణదేవరాయల కీర్తి అద్భుతంగా వాటి వాటి తెలుపులా మచ్చలేని స్వఛ్చతకలది అని తెలుసుకోవాలి అని చెప్తున్నారు.
 
(6)కమనీయంబై అంటే మనోహరమై అని అర్ధం. ఇక్కడ మనోహరంగా ఉన్నది అని చెబుతున్నది దేనిని గురించి? కృష్ణదేవరాయల కీర్తిని గురించి. ఇక్కడ మనోహరత్వం చెప్పటంలో ఒక చమత్కారం ఉంది. తెల్లని బట్ట ఉందనుకోండి. ఆబట్టమీద ఒక చిన్న మచ్చ ఉందను కోండి. ఇంకేముందీ, మన దృష్టి ఆ మచ్చమీదకే‌ పోతుంది! ఆమచ్చ గుమ్మడికాయంత ఉండనక్కర లెదు - గురివిందగింజంత ఉన్న సరే మన దృష్టిని అదే అకర్షిస్తుంది! మనోహరమైన తెలుపు అంటే ఎక్కడా మచ్చలేని తెలుపు అని కదా. అందుకే మనదృష్టిని చెదరనీయక ఆ తెలుపు ఆకట్టుకుంటుంది. అంటే కృష్ణదేవరాయల కీర్తి ఎంత స్వచ్చమైనదీ అంటే మనదృష్టిని చెదరగొట్టేందుకు ఒక చిన్న కళంకం కూడా ఆయన కీర్తికి లేదు. అదీ కవి గౌణంగా సూచిస్తున్నది.  అదీ ఇక్కడ కమనీయంబై అనటంలోని రహస్యం.

ఇప్పుడు పద్యం తాత్పర్యం ఏమిటీ అని ఒకసారి చూదాం. కృష్ణదేవరాయల వారి అద్భుతమైన కీర్తి స్వఛ్చంగా చాలా మనోహరంగా ఉంది. ఎంత స్వఛ్చంగా ఉందీ ఆ కీర్తి అంటే శివుడూ, ఐరావతమూ, కైలాసమూ, వజ్రాయుధమూ, నందీశ్వరుడూ, ఉఛ్చైశ్రవమూ ఎంత స్వఛ్చమైన మచ్చలేని తెలుపురంగులో ఉంటాయో అంత స్వఛ్చమైనది ఆ కృష్ణదేవరాయల కీర్తి.


13, అక్టోబర్ 2022, గురువారం

రామనామమే రామనామమే

రామనామమే రామనామమే శ్రీ
రామనామమే నాప్రాణనామము

రామనామమే యణచు కామాదివికారముల
రామనామమే యొసగు రాజయోగములను
రామనామమే సతము కామా‌రి జపించును
రామనామమే జనుల రక్షించుచు నుండును
 
రామనామమే సర్వకామితముల నిచ్చును
రామనామమే పాపరాశిని దహియించును
రామనామమే జ్ఞానప్రాప్తిని కలిగించును
రామనామమే జన్మరాహిత్యము నిచ్చును

రామనామమున పొందరాని దేమియు లేదు
రామనామమే యిచ్చు బ్రహ్మపదంబైనను
రామనామమే ముక్తిప్రదమై రహియించును
రామనామమే చాలురా యని నేనందును

కొంచెము మురళినూద కూడదటోయీ

 
కొంచెము మురళినూద కూడదటోయీ కృష్ణ
మంచిసమయ మోయి నామాట వినవోయి

మెల్లగ పొద్దువాలు చల్లని సమయమిదే
చల్లనిగాలి వీచు సంధ్యాసమయ మిదే
పిల్లనగ్రోవి నూద వీలగు వేళ యిదే
నల్లవాడ మురళీనాదము చేయవోయీ

ఎవరూ లేని చోట ఎంతో చక్కని చోట
ఎవరూ రాని చోట ఎంతో మంచి చోట
ధవణాంశు డరుదెంచు తరుణమిది కాదా
సవరించి నీమురళి చక్కగ పాడవోయో

చీటికిమాటికి నిన్ను చేరగ రాలేనుర
మాటికిని పెద్దలను మాయచేసి రాలేను
ఆటలింక చాలుర అనువైన సమయమిది
నీటుకాడ యిక మురళి పాట పాడవోయీ


భజభజ శ్రీరఘురామం మానస

భజభజ శ్రీరఘురామం మానస భజభజ సీతారామం
 
భజభజ మేఘశ్యామం రామం భజభజ సుగుణధామం
భజభజ భండనభీమం రామం భజభజ దనుజవిరామం
భజభజ కరుణాధామం రామం  భజభజ భవనాశక‌రం
భజభజ త్రిభువననాథం రామం భజభజ సీతానాథం

భజభజ తరుణీశాపవిమోచనపావనచరణం రామం
భజభజ దుస్తరఘనవారాన్నిధిబంధననిపుణం రామం
భజభజ సీతాతరుణీబంధనభంజనవీరం రామం
భజభజ భవవారాన్నిధితారకపావననామం రామం

భజభజ సత్యపరాక్రమమనిశం భజభజ శ్రీరఘురామం
భజభజ దీనజనావనశీలం భజభజ సీతారామం
భజభజ బృందారకజనవంద్యం భజభజ శ్రీరఘురామం
భజభజ వాయుసుతార్చితపాదం భజభజ సీతారామం


అనవయ్యా శ్రీరామ యనవయ్యా నరుడా

 
అనవయ్యా శ్రీరామ యనవయ్యా నరుడా
అనవయ్యా అపవర్గము గొనవయ్యా నరుడా
 
హరిహరి జనార్దనా యనవయ్యా నరుడా 
జనార్దనా ననుకావు మనవయ్యా నరుడా
జనార్దనా ఇనకులేశ యనవయ్యా నరుడా
ఇనకులేశ ననుకావు మనవయ్యా నరుడా

హరిహరి అనామయా యనవయ్యా నరుడా
అనామయా ననుకావు మనవయ్యా నరుడా
అనామయా అనిరుధ్ధా యనవయ్యా నరుడా
అనిరుధ్ధా ననుకావు మనవయ్యా నరుడా

హరిహరి మనోహరా యనవయ్యా నరుడా
మనోహరా ననుకావు మనవయ్యా నరుడా
మనోహరా వనమాలీ యనవయ్య నరుడా
వనమాలీ ననుకావు మనవయ్యా నరుడా

11, అక్టోబర్ 2022, మంగళవారం

నీవే చెప్పుము శ్రీరామా

నీవే చెప్పుము శ్రీరామా యిది నిజమోకాదో రఘురామా


తీరుగ నీవుండగ మిత్రుడవై వేరే స్నేహితు లెందుకయా

ఆరుగు రుండగ శత్రువు లగుచును వేరే శత్రువు లెందుకయా


పెద్దచుట్టమై నీవుండగ మరి వేరే చుట్టము లెందుకయా

ముద్దపెట్టు నీవుండగ నితరుల పోషణకోరే దేమిటయా


గురుడవు నీవై నాకుండగను గురువును వెదకే దెందుకయా

అరయ నాకన్నియు నీవిడగా పరులను వేడే దెందుకయా 


తారకనామము పరమమంత్రమన తక్కిన మంత్రము లెందుకయా

తీరముజేర్చే భారము నీదన దిగులుపడుట నాకెందుకయా


నీవే యోగక్షేమము లరయగ నేను భయంపడు టెందుకయా

దేవుడ వని ని న్నెఱిగి యితరులను భావించుట నాకెందుకయా


నేటికవిత్వం - 8



అందరూ కవు లయ్యారు

రణగుణధ్వని కవిత్వం అయింది


గుణగణభరితకవిత్వం పోయింది

గుణగణరహితకవిత్వం వచ్చింది


వినేవాళ్ళు చెవులు మూసుకున్నారు

కనేవాళ్ళు కళ్ళు మూసుకున్నారు

సరస్వతీదేవి తలుపుల మూసుకుంది




నేటికవిత్వం - 7



ఒకప్పుడు కవులు కవిత్వం రాసేవారు

అప్పుడు జనం దాన్ని చదివేవారు


ఆ కవులూ మాయమయ్యారు

ఆ కవిత్వమూ ఆగిపోయింది


ఇప్పుడు అందరూ కవిత్వం రాసేవారే

ఎక్కడా జనం దాన్ని చదవటంలేదు




10, అక్టోబర్ 2022, సోమవారం

నేటికవిత్వం - 6

రాజుల్నీ బూజుల్నీ పొగడిపొగడి

కవిత్వం అలసిపోయింది


ఇజాల్ని బుజాలపై మోసిమోసి

కవిత్వం సొమ్మసిల్లింది


భాషరాని కవుల కబంధహస్తొల్లో

కవిత్వం గిలగిల్లాడుతోంది


భావహీనమైన కవితల దెబ్బలకి

కవిత్వం చచ్ఛిపోతోంది




నేటికవిత్వం - 5

 

 

కవిత్వాన్ని సృష్టించలేని

కవుల్ని సృష్టించేవి

కవుల ఫాక్టరీలు

ఫాక్టరీ కవుల ఫేక్ కవితలు

కాలుష్యకాసారాలు



నేటికవిత్వం - 4

 

 

కవుల ముఠాల్లో

కవుల మఠాల్లో

కవులుంటా రనుకోకు



నేటికవిత్వం - 3

అనంత మహావిశ్వంలో

అనేక ఒంట‌రి నక్షత్రాలు

ఆనేక తుంటరి గ్రహాలు

గమ్యంలేని పయనంలో

కాలం గడుపుతున్నాయి


అనంత కవిత్వాకాశంలో

అనేక మసక నక్షత్రాలు

అనేక చీకటి పీఠాలు

నిరుపయోగ పయనాల్లో

కాలం గడుపుతున్నాయి

నేటి కవిత్వం - 2

కవివై పోతున్న పెద్దమనిషీ

ముందు చదివేవాళ్ళను వెతుక్కో

కవిత్వం రాస్తున్న పెద్దమనిషీ

ముందు ఆత్మశోధన చేసుకో

కవితలు గిలికే కవిరాజా

ముందు భావాన్ని పలికించు

పాతిక కవితల పుస్తకంలో

పది మంచివిషయాలు చెప్పు

నువ్వెప్పుడో వీపుగోకిన కవి

నీవీపును గోకుతాడు సరే

ఎవరూ కొనని పుస్తకాన్ని

ఎవరెవరికో పంచుతావు సరే

ఐనా సరే చెల్లని పుస్తకాలని

ఎన్నాళ్ళు పంచగలవు మరి

కవులముఠాలు ఎప్పటికీ

కవిత్వాన్ని సృష్టించలేవు

కావలసినన్న అవార్డు లిచ్చుకున్నా

కాలగర్భంలో కలిసిపోతాయి

కవిత్వరహితకవితాసంకలనాలు



నేటికవిత్వం - 1

 

కవిత్వం రాస్తే పేరేమీ రావటంలేదు

పేరున్నోడు రాస్తే కవిత్వం అవుతోంది

ఆకవిత్వం మేటలుమేటలు వేస్తోంది

లోకం శీతకన్ను వేస్తోంది.

చూడరే కృష్ణుని సొగసుకానిని

 
చూడరే కృష్ణుని సొగసుకానిని ఆట
లాడుచున్న బాలుని అతివలారా

నందుని కుమారుని నవనీతచోరుని 
    బృందావిహారిని వనితలారా 
మందస్మితవదనారవిందుని గోవిందుని 
    యిందువదనుని మందయానలారా

కమలాయతాక్షుని కమనీయగాత్రుని 
    కరుణాలవాలుని కాంతలారా
యమళతరుభంజనుని యశోదానందనుని 
    సుమకోమలమూర్తిని సుదతులారా

గోలోకరక్షకుని గోపాలనాయకుని 
    గోపీమనోహరుని కొమ్మలారా
కాలీయఫణిఫణాజాలవిక్రీడనుని
    కాలమేఘశ్యాముని భామలారా

సరసవచోనిపుణుని సకలసుగుణధాముని  
    సదావ్రజానందుని సకియలారా
పరమశుభమూర్తిని గిరిధరగోపాలుని 
     మురళీవినోదుని తరుణులారా


మంచి నామమని..

మంచినామ మని నరులందరును తరించు నామమని తెలియండీ

అంచితమగు సద్భక్తిని గలిగి స్మరించిన చాలని తెలియండీ


ఎన్నగ వైకుంఠాధిపు డగు హరి ఈరాముడని తెలియండీ

పన్నుగ బాలప్రహ్లాదుని బ్రోచిన వాడే వీడని తెలియండీ

తిన్నగ రాముని తారకనామము దీక్షగ మీరు స్మరించండీ

మున్ను స్మరించి మహాత్ములు పెక్కురు మోక్షము పొందిరి తెలియండీ


ఇంతకన్న కడుతీయని నామం బెందును లేదని తెలియండీ

చింతలు బాపెడు శుభనామంబని చిత్తశుద్ధిగా తెలియండీ

పంతంగించి పైబడెడు కాలుని పా‌రద్రోలునని తెలియండీ

సంతోషముతో స్మరణము చేసిన చాలు మోక్షమని తెలియండీ


రాతిని నాతిగ నొనరించిన బహు రమ్యనామమని తెలియండీ

కోతికి బ్రహ్మపదంబు నొసంగిన గొప్పనామమని తెలియండీ

ఫూతచరిత్రులు తలచి మోక్షమును పొందునామమని తెలియండీ

ధాతయు గౌరీపతియును నిత్యము తలచు నామమని తెలియండీ


8, అక్టోబర్ 2022, శనివారం

భవిష్యదర్శిని. ప్రపంచ రాష్ట్ర సమితి

 తేదీ 2029 మార్చి 26.


ఈరోజున ప్రపంచం అంతా గొప్ప హడావుడిగా ఉంది.

ఈరోజు ఉదయమే భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక గొప్ప తీర్మానం చేసింది.

భారత ప్రధాని మరియు భారాస సిధ్ధాంత కర్త కల్వకుంట్ల చంద్రశేఖర‌ రావు గారి ఆలోచన ప్రకారం భారాస పార్టీని అంతర్జాతీయ రాజకీయ పార్టీగా మార్చటం జరిగింది.

ఈమేరకు భారాస సర్వసభ్యసమావేశంలో నిర్ణయించారు.

హైదరాబాద్ నగరంలోని ప్రధానమంత్రి నివాసం ప్రగతి భవన్లో బ్లహ్మాండమైన భారాస సర్వసభ్యసమావేశం జరిగింది.

సభాద్యక్షులు చంద్రశేఖర రావు గారు అద్భుతమైన ప్రారంభోపన్యాసం చేసారు. ప్రపంచపరిస్థితులు ఏమీ బాగోలేవు. అస్తమానం ఏవేవో దేశాలు గిల్లికజ్జాలతో ప్రపంచశాంతిని భంగపరుస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసారు. 

ఇలా ఐతే ప్రపంచం త్వరలోనే నాశనం అవుతుంది. అమెరికా చైనా రష్యా లాంటి పెద్దదేశాలూ బుధ్ధిలేకుండా ప్రవర్తించటం ఏమిటని ఆ దేశాలను చంద్రశేఖర రావు గారు నిలదీశారు.

యుధ్ధాలను నివారించవలసిన ఐక్యరాజ్య సమితి ఆచరణలో సంపూర్ణంగా విఫలం ఐనదని అది ఇంక కాలంచేసిందని నేనే ప్రకటిస్తున్నాను అన్నారు

బాగా ఆలోచించి తాను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాననీ దాని ప్రకారం భారాసను అంతర్జాతీయ పార్టీగా మార్చటం యావత్తు ప్రపంచానికీ అతిముఖ్యమైన అవసరం ఆనీ అన్నారు.

భారాస ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎందరో ఏవేవే అన్నారనీ తుదకు భారాస ద్వారానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణా మధ్యన, అలాగే చాలా రాష్ట్రాల మధ్య వివాదాలూ సానుకూలంగా పరిష్కరించబడ్డాయనీ అదేవిధంగా ప్రరాస ద్వారా దేశాల మధ్య వివాదాలు కూడా బ్రహ్మాండంగా పరిష్కారం చేసెయ్యవచ్చును అనీ ఆసత్తా తమ సొత్తు ఆనీ అన్నారు.

క్రమంగా అన్ని ముఖ్యదేశాలలోనూ మన పార్టీని అధికారంలో నిలబెట్టటం ద్వారా యుధ్ధాలను నివారించి ప్రపంచంలో శాంతినీ సుస్థిరతనూ నెలకొల్పవచ్చు అనీ చంద్రశేఖర రావు గారు వక్కాణించారు.

అందుకే ఇక ఆలస్యం చేయకుండా వెంటనే భారాస పార్టీని ప్రపంచ రాజ్య సమితిగా మార్చుతూ సభవారు తీర్మానం చేయాలని ఆదేశపూర్వకంగా సూచించారు.

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు తీర్మానాన్ని ప్రతిపాదించారు.

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవిత గారు ఆ తీర్మానాన్ని బలపరిచారు.

మహారాష్ట్ర గవర్నర్ సంతోష్ రావు గారూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హరీష్ రావు గారూ కూడా ఆ తీర్మానాన్ని బలపరచారు.

అనంతరం సభాద్యక్షులు ప్రధానమంత్రి శ్రీ కల్వకుర్తి చంద్రశేఖర రావు గారు భారాస పార్టీని అంతర్జాతీయ రాజకీయ పార్టీగా ప్రకటిస్తూ తీర్మానాన్ని సభవారు ఏకగ్రీవంగా ఆమోదించారని ప్రకటించారు. దాని కొత్త పేరు ప్రపంచ రాజ్య సమితి అని వెల్లడించారు.

త్వరలోనే జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమపార్టీ అభ్యర్థి నిలబడబోతున్నాడని ప్రకటించారు. అమెరికా దేశంలో భారతీయులు ఎంతో సంఖ్యాబలం కలిగి ఉన్నారనీ, వారిలో తెలుగు వారు అందునా మన తెలంగాణా వారు అత్యధికులు అనీ అన్నారు. వారంతా కలిసికట్టుగా ప్రచారం చేస్తే మన పార్టీ వాడు అమెరికా అద్యక్షుడు కావటం తథ్యం. దానిని ఆపే మొనగాడు పుట్టలేదు - పుట్టబోడు అనీ కరతాళధ్వానాల మధ్యన సగర్వంగా అన్నారు. 

ఈవార్త వెలువడిన వెంటనే అమెరికాలో భారతీయుల సంబురాలు అంబరాన్నంటాయి. ఆస్ట్రేలియా నుండీ మరికొన్ని దేశాల నుండీ కూడా తమ దేశాల్లోనూ ప్రరాస తప్పకుండా అధికారం చేపట్టాలని కోరుతూ తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి.

తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చును. మాది ఫ్రీ కంట్రీ అని అమెరికా అద్యక్షులు వ్యాఖ్యానించారు.

రష్యా ఈవిషయంలో స్పందించటానికి ఆసక్తి చూపలేదు. చైనా మాత్రం ఇదంతా ఒక తమాషా అని కొట్టిపారేసింది. ఆస్ట్రేలియా స్పందన ఇంకా తెలియరాలేదు. వారూ స్వాగతిస్తున్నారనే వినబడుతోంది.

ఐక్యరాజ్య సమితి కాలంచేసింది అనటాన్ని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ తప్పు పట్టారు.

ఐతే ఐక్యరాజ్య రాజ్యసమితిలో భారత ప్రతినిధి భారతప్రధాని వ్యాఖ్యలను సమర్ధించారు. ప్రపంచానికి భారతదేశం నాయకత్వం వహించే సమయం ఆసన్నం అయినదనీ చంద్రశేఖర రావు తప్ప నేడు ప్రపంచశాంతి సుస్థిరతలను నెలకొల్పగల మహానాయకుడు ఎవరూ ముల్లోకాల్లోనూ లేరని భారతప్రతినిధి ఉద్ఘాటించారు.

ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా అంతా ఈ సమాచారాన్ని గురించిన చర్చలతో హోరెత్తిపోతోంది.

ప్రపంచాన్ని ఏలబోయేది మనమే అంటూ హైదరాబాద్ నగరంలో వేలాది పెద్దపెద్ద కటౌట్లు వెలిసాయి. ప్రధానరహదారులూ గల్లీలు అని తేడా లేకుండా విశేషంగా ర్యాలీలు సందడి చేస్తున్నాయి.

దునియాకీ నేతా కేసీఆర్ అన్న నినాదంతో తెలంగాణాయే కాదు దేశం అంతా దద్దరిల్లుతోంది. ఈనినాదం ప్రపంచాన్ని చుట్టేస్తోందని వార్తలు జోరందుకున్నాయి.


రారా బృందావిహారీ కృష్ణా

రారా బృందావిహారీ కృష్ణా సుకు
మార నవనీతచోర కృష్ణా
 
ఇంతలోనె వచ్చి నీ వంతలోనె జారిపోవు
టెంతమాత్ర మొప్పమని యెఱుగుము కృష్ణా
కంతుడు జయంతుడు నీకాలిగోటిపాటి కారు
పంతగించకుండ నీవు పరుగున రారా

దారులన్ని కాచినాము దానవాంతకా నిన్ను
పారిపోవనీయ మింక చేరగ రారా
నీరజాక్ష నీకొఱకై నేడు చాల వేచినాము
వారిజాక్షులతో నాడ పరుగున రారా

దాగిదాగి మురళినూద తగదుర కష్ణా భవ
రోగమణచు వాడ పద్మలోచన కృష్ణా
దాగుడుమూతలు చాలిక తాండవకృష్ణా స
ర్వాగమనుత దివ్యభావ పరుగున రారా






విన్నారా యిది విన్నారా

 విన్నారా యిది విన్నారా
చిన్నికృష్ణుడు చేసినలీల
 
చల్లచల్లని సంధ్యాసమయము 
పిల్లనగ్రోవి పిలిచే సమయము
అల్లరి గోపిక లందరి యడుగులు
మెల్లగ చేరెను బృందావనము
 
ఎన్నడులేనిది ఈనాడేమో
చిన్నికృష్ణు డట చేరనె లేదు
కన్నయ్యేడీ కనబడడే యని
అన్నులమిన్నల కాందోళనము
 
విరిపొద లన్నిట వెలసెను తానే
తరుశాఖలపై తానే తోచెను
తరుణుల మధ్యన తానే నిలచెను 
మురళీరవముల మునిగెను వనము

7, అక్టోబర్ 2022, శుక్రవారం

సుఖము సుఖ మందు రది చూడ నెక్క డున్నది

సుఖము సుఖ మందు రది చూడ నెక్క డున్నది
సుఖముగా నున్నా ననుచున్నాడా నరుడు

ధనకనకము లున్నచో తగిన సుఖమున్నదా
తనకు తృప్తి లేక చాల తహతహయే యున్నదా
 
మంచిపదవి యున్నచో మహాసుఖ మున్నదా
కొంచెమైన శాంతిలేని గొడవలే యున్నవా

మేడలును మిద్దె లున్న మిక్కిలి సుఖమున్నదా
మేడలున్న రోగములు మిగుల బాధించవా

బంధుబలగ మున్నచో‌ బలే సుఖమున్నదా
బంధువులను మేపలేక బాధలే యున్నవా

దారాపుత్రుల వలన తగిన సుఖమున్నదా
వారు పెట్టే తిప్పల వలన కష్టమున్నదా

తారకనామము వలన తనకు సుఖమున్నదా
ఆ రాముని దయచేత నంతా సుఖమేకదా

మురళిపాట వింటినిరా మోహనకృష్ణా

మురళిపాట వింటినిరా మోహనకృష్ణా నేను
పరుగున నిటు వచ్చితిరా బాలకృష్ణా
 
పాట నాపవద్దుర బాలకృష్ణా నీ
పాట నా ప్రాణము గోపాలకృష్ణా
ఆటపాటలందున అల్లరికృష్ణా మరి
మేటివి నీవేకదా మేదిని కృష్ణా
 
అంద రిటే వచ్చుట నరయుము కృష్ణా నీ
యం దనురక్తులమో యశోద కృష్ణా
సుందరాంగుడవో సుశోభన కృష్ణా మా
యందు దయతో పాడవయ్యా కృష్ణా

గోగణార్తివారణ గోకులకృష్ణా శ్రుతి
సాగరా పాడరా చక్కగ కృష్ణా
మ్రోగనీ నీమురళి మోహనకృష్ణా భవ
రోగమణగ నీరజలోచన కృష్ణా


6, అక్టోబర్ 2022, గురువారం

విన్నారా గోపాలుని వేణుగానము?

విన్నారా గోపాలుని వేణుగానము వీను
లున్నందుల కది వినుటే యుత్తమఫలము

ఈపొదలో నున్నాడో ఆపొదలో నున్నాడో
యేపొదలో నున్నాడో యెవ్వరి కెఱుక
ఈపొద లెందేని లేడొ యీపొద లన్నిటను కలడొ
గోపాలుని కొఱకు వెదకు గోపికలారా

తాపోపశమనకరము కోపోపశమనకరము
పాపసంహారకరము పడతుక లారా
ఆపాట వినుట చాలు  గోపాలుడు గుండెలలో 
గూడుకట్టికొని లేడో గోపికలారా

వెలి నుండును లో నుండును విశ్వమయుడై యుండును
కులుకుచు నీ బృందావనము నలుదిక్కులను
కలయదిరుగుచుండు గోపికలకు దొరకుచుండు మఱియు
విలాసముగ దాగి యిటుల వేణువూదును

 

అతడు వేణు వూదును

అతడు వేణు వూదును అది పాటలు పాడును

ప్రతిపాటకు ఆ బృందావనము పరవసించగా


అదిగో ఆపూపొదల గను డవి యెంతటి ధన్యలో

మదనగోపబాలు నెపుడు పొదవుకొని దాచును

వెదకివెదకి వేసారి వేడుకొనెడు గోపికలకు

సదయుడై యునికిచాట పొదల లోపలి నుండియే


అదిగో సురపొన్నచెట్టు ఇదిగో యీ కడిమిచెట్టు

మదనగోపబాలు డెపుడు నధివసించు చెట్లు

ముదమారగ మనోహరమురళి నూదు శాఖ లవే

ఇదిగో యీనాడు పూలపొదల మాటు నుండియే


అదిగదిగో పొదపొదను వెదకు గోపికల  గనుడు

మదనగోపబాలు డెంత వెదకిన కనరాడాయె

సుదతు లందరును చాల చోద్యమందగా నదే

పొదపొదలో నుండి తాను మురళిని సవరించుచు



5, అక్టోబర్ 2022, బుధవారం

ప్రేమమీఱ నీవిజయగాథలను పేర్కొని పాడెదము

ప్రేమమీఱ నీవిజయగాథలను పేర్కొని పాడెదము సీతా
రామ నీకు సరిసాటిలే రనుచు భూమిని చాటెదము

కరుణారససుధాంబుధి వని శ్రీకర నీదరిజేరి సదా
సురనరవరులును సిధ్ధసాధ్యకింపురుషాదులు నిదే
కరమనురక్తిని నిరంతరమును పరిచర్యలు సలుప
విరాజిల్లు శుభమంగళ మూర్తివి వేడుక నిను గనుచు

నిగమంబులు నిను ప్రస్తుతించగను నెగడు రామచంద్రా 
యుగయుగంబులుగ భూమిని నెలకొని యున్నది నీ సత్కీర్తి
జగములన్నిటను విస్తరించినది చక్కగ నీ సత్కీర్తి
పగలురేలు నిను పొగడుచు మిక్కిలి భక్తితోడ మేము

జయజయ జానకిరమణా యంటే చాలును మాకికపై
భయహేతువులు నశియించునని బాగుగ లోనెఱిగి
రయమున భవబంధములు తొలగునని రామచంద్ర నిన్నే
దయజూపుమని వేడెదమయ్యా జయశీలా సతము
 

1, అక్టోబర్ 2022, శనివారం

రామా రామా రామా యని

రామా రామా రామా యని శ్రీరామచంద్రుని నామమును

ప్రేమగ నిత్యము పలికెడు వాడే రాముని సన్నిధి చేరునయా


రామ రామ యని ప్రేమగ పలుకగ రాముడు మనసున నిలువవలె

కామవికారము లణగెడు దాక రాముడు మనసున నిలువడుగా

రాముడు మనసున నిలచెడు దాక కామవికారము లణగవుగా

రాముని సత్కృప కలిగిన నాడే యీముడి చక్కగ విడివడుగా


రామ రామ యని చింతన చేయగ రాముని తత్త్వము తెలియవలె

భూమిని సద్గురు బోధకలుగక రాముని తత్వము తెలియదుగా

సామాన్యుల కిల సద్గురుబోధలు చాలదుర్లభం బనదగుగా

రామునిచరితమె సద్గురువగుచును భూమిజనులకు కలదు కదా


రామ రామ యని స్మరణము చేయుట కేమియు సరి కావిల ననుచు

రామున కన్యము తలపక నిత్యము రామస్మరణము చేయుచును

రాముని చరితమె బోధగురువుగా రాముని కృపయే ప్రేరణగా

రామున కంకిత మొనరించవలె ప్రేమమీఱ తన జీవితము