15, అక్టోబర్ 2022, శనివారం

తెనాలి రామకృష్ణ కవి చాటు పద్యం - 5

చ. తెలియనివన్ని తప్పు లని దిట్టతనాన సభాంతరంబున్     
బలుకఁగ రాకురోరి పలుమాఱుఁ బిశాచపుఁబాడెకట్ట నీ     
పలికిననోట దుమ్ముపడ భావ్య మెఱుంగవు పెద్దలైనవా     
రల నిరసింతురా ప్రెగరాణ్ణరసా విరసా తుసా బుసా

ఒకసారి రాయల వారి ఆస్థానానిని ప్రెగడరాజు నరస కవి అనే ఒకాయన వచ్చి తన ప్రజ్ఞలు విన్నవించుకుంటూ ఇతరుల కవిత్వంలో తాను తప్పులెన్నగలనని కూడా ఒక ప్రజ్ఞగా చెప్పుకున్నాడు. 

తెనాలి రామకృష్ణకవికి ఆమాటకు చాలా ఆగ్రహం కలిగి ఇలా అన్నాడట.

చ. ఒకని కవిత్వమం దెనయు నొప్పులు తప్పులు నా కవిత్వమం 
దొకనికి తప్పు బట్ట పని యుండదు కాదని తప్పు బట్టినన్ 
మొకమటు క్రిందుగా దిగిచి మ్రొక్కలు వోవ నినుంప కత్తితో 
సికమొదలంట గోతు మరి చెప్పున గొట్టుదు మోము దన్నుదున్ !

ఎవడో ఒకడి కవిత్వంలో తప్పులూ ఒప్పులూ అని ఉంటాయని చెప్పి అందరి కవిత్వమూ లోపభూయిష్టంగానే ఉంటుందని ఆలోచించి అందరి కవిత్వంలోనూ తప్పులు పడతానని, అదొక ప్రజ్ఞగా, చెప్పుకొని తిరుగుతున్నావా? నా కవిత్వంలో ఒకడికి తప్పుపట్టే పనే ఉండదు!  (అసలు తప్పంటూ‌ ఉండదు కదా అని). 
 
అలాకాదు తప్పులు వెదకి తీరతాను అని ఎవడైనా (నీలాంటి వాడు) అంటే ఊరుకొనేది లేదు. 
 
అలా అన్నవాడి ముఖం క్రిందకి అదిమి పెట్టి, ఇనపకత్తితో వాడి సిగ మొదలంటా తరిగేస్తాను. అంతే కాదు వాడిని చెప్పుతో కొడతాను. వాడి ముఖం మీద తన్నుతాను 
 
అని రంకెలు వేసాడు అసహ్యంతో.

అంతటితో ఊరుకోక మళ్ళా ఇలా అన్నాడట.

చ. తెలియనివన్ని తప్పు లని దిట్టతనాన సభాంతరంబున్     
బలుకఁగ రాకురోరి పలుమాఱుఁ బిశాచపుఁబాడెకట్ట నీ     
పలికిననోట దుమ్ముపడ భావ్య మెఱుంగవు పెద్దలైనవా     
రల నిరసింతురా ప్రెగరాణ్ణరసా విరసా తుసా బుసా
 
ఓరీ! విరసా!  ప్రెగరాణ్ణరసా! తుసా! బుసా! నీకు నీవే ఏదో దిట్టనే అనుకొని (గర్వించి) సభాంతరంలోనికి వచ్చి (నీకు) తెలియనివి అన్నీ తప్పులని పలుమారులు పలకటానికి రాకురా!!
 
భావ్యము (ఏది ఎలా తెలుసుకొని మాట్లాడాలో) ఎఱుంగవు!
 
పెద్దలైనవారల నిరసింతురా? (అంటే పెద్దల తప్పులు ఎన్నుతారా ఎక్కడైనా)
 
అలా పలికిన నీనోట దుమ్ముపడ!
 
(నీకు) బిశాచపుఁబాడెకట్ట! నీపాడెనుకూడా మనుష్యులన్నవాళ్ళు ముట్టుకోరురా నీలాంటి పిశాచాలే మోయాలీ అని.


కొందరు స్వల్పప్రజ్ఞతో కవిత్వాన్ని ముక్కస్యముక్కార్ధః అన్నట్లుగా ప్రతిపదార్ధం నిఘంటువుల్లో చూసి తెలుసుకుందుకు ప్రయత్నం చేస్తారు. భంగపడతారు. వాళ్లకు కవిచెప్పేది సరిగా తెలియదు. పైగా అనర్ధాలు గోచరిస్తాయి. అలాంటి వాళ్ళు తమ ప్రజ్ఞ చాలటం లేదని అర్ధం చేసుకోవాలి. పెద్దలను ఆశ్రయించి సరిగా తెలుసుకోవాలి. అంతే కాని కనిపించిదిరోయ్ దోషం అని టముకు వేయటానికి ప్రయత్నిస్తే నవ్వులపాలైపోతారు.

ఇక్కడ ఒక్క విషయం చెప్తాను. వేదసాహిత్యాన్ని మేక్స్ ముల్లర్ మహాశయుడు అర్ధం చేసుకున్న తీరు కూడా ఇటువంటిదే. ఆయన సంప్రదాయజ్ఞుడు కాదు కదా. నిఘంటువుల సాయంతో మిడిమిడి జ్ఞానపు పండితులతో చర్చించి వేదసాహిత్యానికి వ్యాఖ్యానం చేయాలని చూసాడు. వేదసాహిత్యాన్ని అర్ధం చేసుకుందు నిరుక్తం అని ఉంది వేదాంగం ఒకటి - అది ఈయనకు తెలియని విద్య. అందువలన ఆయన చెప్పిన అర్ధాలు చాలా వరకూ తప్పులతడకలు.

ఈవిషయాన్ని దయానంద సరస్వతి చెప్పాడు. అరవింద మహర్షి కూడా వాతలు పెట్టి మరీ చెప్పాడు.

ఒక ఋక్కులో ఇంద్రుడి గుర్రాలు పరుగెడుతుంటే వాటి గిట్టలనుండి నేయి కారుతున్నది అని అర్ధం వస్తుందట నిఘంటువుల ప్రకారం. ఇలాంటి అర్ధాలు చూసి మాక్స్ ముల్లర్ వేదాలను కొంత అపహాస్యధోరణిలో వ్యాఖ్యానించాడు. ఈఋక్కుకు సరైన అర్ధం అది కాదు అని అరవిందులు ఏకంగా ఒక పుస్తకం అంత సరైన వ్యాఖ్యానం వ్రాసి చూపారు.

సాహిత్యంలో మార్మికత ఉంటుంది. సింబాలిక్‌గా ఏదైనా ఉంటే అక్కడ నిఘంటువులు ఆట్టే పనికిరావు. వాటిని సంప్రదాయం తెలిసి అర్ధం చేసుకోవాలి. ఇలా నరసకవి లాంటి వారు తప్పులు పడతామంటే రామకృష్ణకవిలాంటి వారు ఉగ్రులౌతారు మరి.

త్యాగరాజస్వామి వారు కీర్తనలు పాడుతుంటే శిష్యులు వ్రాసుకొనే వారు. అయన నదీస్నానానికి వెళ్ళి వస్తూ కొత్త కీర్తనను గానం చేస్తున్నారు. ఆయనను అనుసరిస్తున్న వారిలో కొత్తశిష్యపరమాణువు ఒకడున్నాడు. అతడేదో కొంచెం సాహిత్యం పైపైన చదువుకొని ఉండవచ్చు. అయ్యవారి కీర్తనలో ఈపిల్లవాడికి తప్పుతోచి ప్రక్కవారితో గుసగుసలాడాడు. అది పెద్దాయన గమనించనే గమనించారు. తన కీర్తనలో, ఏదో తెలిసినట్లు గర్వమేలే, అని కూడా అని పాడి గాలితీసారు.

పెద్దలకంటే మనకే ఎక్కువ తెలుసును అనుకోవటం మంచిది కాదు. తగినంత కృషి చేసి తెలుసుకుందుకు ప్రయత్నించటం వివేక లక్షణం.

ఆపాటి వివేకంలేని ఒక నరసరాజు అనే వాడు ప్రచారంలో ఉన్న గ్రంథాలలో తప్పులని తాననుకొన్నవి బాగా మనసుకు ఎక్కి సభల్లో దూరి పెద్దల కవిత్వంలో కూడా తప్పులు పట్టగలనూ అని ప్రకటించుకొని అభాసు పాలయ్యాడు.