14, అక్టోబర్ 2022, శుక్రవారం

తెనాలి రామకృష్ణ కవి చాటుపద్యం - 1

కం.నరసింహ కృష్ణరాయని
కర మరుదగు కీర్తి వెలయు కరిభి ద్గిరిభి
త్కరి కరిభి ద్గిరిగిరిభి
త్కరిభిద్గిరి భిత్తురంగ కమనీయంబై

ఈ చాటు పద్యం తెనాలి రామకృష్ణకవికృతం అంటారు. ఈపద్యాన్ని కొంచెం సరళంగా విసంధిగా వ్రాస్తే ఇలా వస్తుంది.

కం. నరసింహ కృష్ణరాయని
కర మరుదగు కీర్తి వెలయు కరిభిత్ గిరిభిత్
కరి కరిభిత్ గిరి గిరిభిత్
కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయంబై
 
ఈపద్యంలో చమత్కారం అంతా కరిభిత్ గిరిబభిత్ అన్న పదాలు మళ్ళా మళ్ళా రావటంలో ఉంది. ఇలా ఉండటం వలన ఈపద్యాన్ని పఠించేటప్పుడు కలిగే శబ్దసౌందర్యంలో ఉంది.
 
ఈ పద్యానికి అన్వయం చూదాం  (1)కరిభిత్ (2) గిరిభిత్ కరి (3) కరిభిత్ గిరి (4) గిరిభిత్ (5) కరిభిత్ గిరిభిత్ తురంగ (6) కమనీయంబై (7) నరసింహ కృష్ణరాయని (8) కరమరుదగు (9) కీర్తి (10) వెలయు అని. 

ఇప్పుడు ఈపద్యానికి కొంచెం వ్యాఖ్యానం చేసుకుందాం.
 
(7)నరసింహ కృష్ణరాయల కీర్తి ఎటువంటిదో ఈపద్యం చెబుతున్నది. నరసింహ కృష్ణరాయలు అనటం ఎందుకు? ఎందుకంటే కృష్ణదేవరాయ చక్రవర్తిగారి తండ్రిపేరు తుళువ నరసనాయకుడు. ఆయనను నరసింహరాయలు అని కూడా అంటారు - ఎందుకంటే నరస పదం నరసింహ పదానికి అభిన్నం కదా. అందుకని. కృష్ణదేవరాయలను నరసింహ కృష్ణరాయలు అంటున్నాడు కవి ఈపద్యంలో.

(8)కరమరుదగు అంటే కరము + అరుదు + అగు అని పదవిభజన. ఉకారం చివర ఉన్న పదానికి ఆతరువాత వచ్చే పదంలో మొదట అచ్చు ఉంటే ఆ అచ్చు ఈ ఉకారాన్ని మింగేస్తుంది అని సూత్రం. కాబట్టి కరము + అరుదు + అగు => కరమరుదగు ఐనది. ఇక్కడ కరము అంటే మిక్కిలి అని అర్ధం. (కరము అంటే ఏనుగు తొండమూ, కిరణమూ వగైరా అర్ధాలు కూడా ఉన్నాయి కాని సందర్భాన్ని బట్టి మిక్కిలి అన్న అర్ధాన్నే‌ మనం  తీసుకోవాలి. అరుదు అంటే విశేషం, అపూర్వం - చాలా తక్కువగా కనిపించటం అని అర్ధం. వెరసి కరమరుదగు అంటే చాలా అపూర్వమైన అని అర్ధం చెప్పుకోవాలి. కరమరుదగు కీర్తి అంటే చాలా విశేషమైన ఆశ్చర్యకరమైన కీర్తి అన్నమాట.

(10)వెలసె అని ఒకమాట ఉంది కదా. వెలయటం అంటే కనిపించటం, ప్రకాశించటం అని అర్ధం. కరమరుదగు కీర్తి వెలసె అంటే చాలా అపూర్వమైన కీర్తి కనిపిస్తోంది అని పిండితార్దం. ఎవరిది ఈ‌కీర్తి? నరసింహకృష్ణరాయనిది.

ఆకీర్తి ఎలా కనిపిస్తోందో మిగిలిన పద్యభాగంలో చెప్తున్నాడు కవి.

(1)కరిభిత్ అంటే అర్ధం చూదాం. కరి అంటే‌ ఇక్కడ ఏనుగు అని కాక ఏనుగు రూపంలో ఉన్న రాక్షసుడు అనగా గజాసురుణ్ణి తీసుకోవాలి. భిత్ అన్న పదానికి భేదించటం అనగా ముక్కలు చేయటం చంపటం వగైరా అర్ధాల్లో చంపటాన్ని తీసుకున్నాడు. కరిభిత్ అంటే‌ గజాసురుణ్ణి చంపినవాడు. ఎవడండీ? ఇంకెవడు శివుడు. శివుడిలా ఉందిట కీర్తి. శివుడిలా ఉండటం ఏమిటీ అంటే తెల్లగా ఉందీ అని. శివుడు తెల్లగా ఉంటాడు కదా. పూర్వం రంగుల పద్యాలు ఉండేవి ఎక్కాలపుస్తకంలో. అందులో తెలుపు మీద పద్యంలో పార్వతీపతి తెల్పు పాలసంద్రము తెల్పు అంటూ వస్తుంది లిష్టు. శివుడు తెల్లగా ఉంటాడు. ఈరోజున మనకు దొరుకుతున్న ఫోటోల్లో శివుడికి నీలం రంగు వేసేస్తున్నారు. అజ్ఞానం! అదంతా సరే, కీర్తి తెల్లగా ఉండటం ఏమిటీ? అంటే తెలుపు స్వఛ్చతకు చిహ్నం. అంటే కృష్ణదేవరాయల కీర్తి అద్భుతంగా శివుడి తెలుపులా మచ్చలేని స్వఛ్చతకలది అని తెలుసుకోవాలి.

(2)ఇంకా ఆ కీర్తి గిరిభిత్ కరి అన్నట్లుగా ఉందిట, గిరి అంటే‌ పర్వతం. పర్వతాలను చంపటం ఉండదు కదా. అంటే పర్వతాలను ఇంద్రుడు రెక్కలు విరిచి దండించాడని చెబుతారు. అంతకు ముందు పర్వతాలు కూడా రెక్కలతో ఎగురుతూ చిత్తం వచ్చిన చోట ఊళ్ళమీదపడి వాలుతూ ఉంటే జనం అశేషంగా చస్తూ ఉండే వారు. ఇంద్రుడు ముల్లోకాలకూ పాలకుడు కదా. జనం ఇలా చస్తుంటే వీళ్ళ బాధ చూసి కోపించి అన్ని పర్వతాల రెక్కల్ని తన వజ్రాయుధంతో నరికేసాడట. (ఒక పర్వం మైనాకుడు మాత్రం ఎగిరి సముద్రంలోనికి దూకి దాక్కున్నాడని రామాయణంలో వస్తుంది) అందుచేత పర్వతాలకు ఎగిరే‌శక్తి నశించింది. ఇక్కడ కవి చెప్పిన గిరిభిత్ అంటే వాడు పర్వతాల రెక్కలు విరిచిన ఇంద్రుడు. గిరిభిత్ కరి అంటే ఆ ఇంద్రుడి ఏనుగు. అది ఐరావతం కదా. ఐరావతం అంటే అది ప్రపంచంలోని ఏకైక తెల్లఏనుగు. కీర్తి  తెల్లఏనుగులా ఉండటం అంటే అంత తెల్లగా అనగా స్వఛ్చంగా ఉండటం అని అర్ధం తీసుకోవాలి. అంటే కృష్ణదేవరాయల కీర్తి అద్భుతంగా ఐరావతం తెలుపులా మచ్చలేని స్వఛ్చతకలది అని తెలుసుకోవాలి.

(3)ఆతరువాత కరిభిత్ గిరి అని వస్తున్నది. కరిభిత్ అంటే ఇందాకనే శివుడు అని అర్ధం చెప్పుకున్నాం. కాబట్టి కరిభిత్ గిరి అంటే శివుడి కొండ. అంటే కైలాసం అనే తెల్లని మంచుకొండ. ఇంకేమిటి అది స్వఛ్చంగా తెల్లగా ఉంటుంది కదా. అంటే కృష్ణదేవరాయల కీర్తి అద్భుతంగా మంచుకొండ కైలాసం తెలుపులా మచ్చలేని స్వఛ్చతకలది అని తెలుసుకోవాలి.
 
(4)ఆతరువాత మళ్ళా గిరిభిత్ అని వస్తోంది. ఇక్కడ బిత్ అనగా గిరులు అనగా పర్వతాలను భేదించిన వజ్రాయుధాన్ని తీసుకోవాలి. అదీ తెల్లగా ఉండేదే. అదెలా అంటే, అదేమీ లోహంతో చేసినది కాదు. దధీచి మహర్షి వెన్నెముకతో చేసినది. మరి ఎముక తెల్లగానే కదా ఉండేది. ఆయుధాల్లో అత్యంత శ్రేష్ఠమైన అయుధం వజ్రాయుధం. దానికి తిరుగు లేదు. అంటే కృష్ణదేవరాయల కీర్తి అద్భుతంగా వజ్రాయుధం తెలుపులా మచ్చలేని స్వఛ్చతకలది అని తెలుసుకోవాలి.
 
(5)ఆతరువాత కరిభిద్గిరిభిత్తురంగ అని వస్తోంది విడదీస్తే కరిభిత్ + గిరిభిత్ + తురంగ. ఇక్కడ ఒక విశేషం గమనించాలి కరిభిద్గిరిభిత్తురంగ అన్నపదానికి అన్వయంలో కరిభిత్తురంగ మరియు గిరిభిత్తురంగ అనితీసుకోవాలి. కరిభిత్ అంటే ముందే గజాసురుణ్ణి చంపిన వాడైన శివుడు అని చెప్పుకున్నాం. ఆయన తురంగం ఏమిటీ? నందీశ్వరుడు. అంటే ఎద్దు. రంగు తెలుపే‌ కదా. ఇక్కడ తురంగం అంటే వాహనం అనే‌ తీసుకోవాలి కాని తురంగం అంటే గుఱ్ఱం మాత్రమే‌ కదా అని వాదించ కూడదు. కొన్ని పద్యాల్లో  విష్ణుమూర్తిని ఖగతురంగ అనటం కూడా కనిపిస్తుంది మరి. అందుచేత కృష్ణదేవరాయల కీర్తి అద్భుతంగా నందీశ్వరుడి తెలుపులా మచ్చలేని స్వఛ్చతకలది అని తెలుసుకోవాలి. అలాగే గిరిభిత్ తురంగ అంటే ఇంద్రుడి వాహనం ఐన ఊఛ్ఛైశ్రవం అని తీసుకోవాలి. ఈ ఉఛ్చైశ్రవం గుర్రమే. తెల్లగుర్రం.  ఇది తెల్లగుర్రమే ఐనా దానిలో కొంచెం నలుపుందని డబాయించి, మాయచేసి తన సవతి వినతను ఓడించి కద్రువ ఆవిడని తనకు దాసిగా చేసుకుంది అని భారతంలో కథలా వస్తుంది. నిజానికి ఉఛ్చైశ్రవం అతి తెల్లని గుర్రం అన్నమాట. అంటే కృష్ణదేవరాయల కీర్తి అద్భుతంగా ఉఛ్ఛైశ్రవం తెలుపులా మచ్చలేని స్వఛ్చతకలది అని తెలుసుకోవాలి.
 
ఇలా పద్యంలో కవిగారు తెల్లగా ఉండే శ్రేష్ఠమైన వాటిని వరుసపెట్టి చెప్పి కృష్ణదేవరాయల కీర్తి అద్భుతంగా వాటి వాటి తెలుపులా మచ్చలేని స్వఛ్చతకలది అని తెలుసుకోవాలి అని చెప్తున్నారు.
 
(6)కమనీయంబై అంటే మనోహరమై అని అర్ధం. ఇక్కడ మనోహరంగా ఉన్నది అని చెబుతున్నది దేనిని గురించి? కృష్ణదేవరాయల కీర్తిని గురించి. ఇక్కడ మనోహరత్వం చెప్పటంలో ఒక చమత్కారం ఉంది. తెల్లని బట్ట ఉందనుకోండి. ఆబట్టమీద ఒక చిన్న మచ్చ ఉందను కోండి. ఇంకేముందీ, మన దృష్టి ఆ మచ్చమీదకే‌ పోతుంది! ఆమచ్చ గుమ్మడికాయంత ఉండనక్కర లెదు - గురివిందగింజంత ఉన్న సరే మన దృష్టిని అదే అకర్షిస్తుంది! మనోహరమైన తెలుపు అంటే ఎక్కడా మచ్చలేని తెలుపు అని కదా. అందుకే మనదృష్టిని చెదరనీయక ఆ తెలుపు ఆకట్టుకుంటుంది. అంటే కృష్ణదేవరాయల కీర్తి ఎంత స్వచ్చమైనదీ అంటే మనదృష్టిని చెదరగొట్టేందుకు ఒక చిన్న కళంకం కూడా ఆయన కీర్తికి లేదు. అదీ కవి గౌణంగా సూచిస్తున్నది.  అదీ ఇక్కడ కమనీయంబై అనటంలోని రహస్యం.

ఇప్పుడు పద్యం తాత్పర్యం ఏమిటీ అని ఒకసారి చూదాం. కృష్ణదేవరాయల వారి అద్భుతమైన కీర్తి స్వఛ్చంగా చాలా మనోహరంగా ఉంది. ఎంత స్వఛ్చంగా ఉందీ ఆ కీర్తి అంటే శివుడూ, ఐరావతమూ, కైలాసమూ, వజ్రాయుధమూ, నందీశ్వరుడూ, ఉఛ్చైశ్రవమూ ఎంత స్వఛ్చమైన మచ్చలేని తెలుపురంగులో ఉంటాయో అంత స్వఛ్చమైనది ఆ కృష్ణదేవరాయల కీర్తి.