15, అక్టోబర్ 2022, శనివారం

తెనాలి రామకృష్ణ కవి చాటుపద్యం - 3

 
మ. శరసంధాన బల క్షమాది వివిధైశ్వర్యంబులుం గల్గి దు 
ర్భర షండత్వ బిలప్రవేశ చలన బ్రహ్మఘ్నతల్ మానినన్ 
నరసింహక్షితిమండలేశ్వరుల నెన్నన్వచ్చు నీసాటిగా 
నరసింహ క్షితిమండలేశ్వరుని కృష్ణా! రాజకంఠీరవా!

ఇది తెనాలి రామకృష్ణ కవి చెప్పిన చాటుపద్యం కాదు!

ఈపద్యాన్ని చెప్పిన కవి సత్తముడు ఆంధ్రకవి పితామహ బిరుదాంకితు డైన అల్లసాని పెద్దన గారు.

ఐతే అద్భుతమైన చమత్కారం కల ఈపద్యాన్ని రాయలవారిని పొగడుతూ అల్లసాని పెద్దన గారు భువనవిజయం సభలో చెప్పగా అష్టదిగ్గజ కవుల్లో మరొక ప్రసిధ్ధకవి ఐన తెనాలి రామకృష్ణ కవి తప్పుపట్టాడని ఐతిహ్యం.

ఇది ఐతిహ్యం మాత్రమే అయ్యుండాలి. రాయల వారి భువనవిజయంలో ఉన్న అష్టదిగ్గజాల్లోని కవుల్లో తెనాలి రామకృష్ణ కవి ఉండేందుకు అవకాశం లేదు. రామలవారు స్వర్గస్థు లయ్యే సమయానికి రాకకృష్ణకవి చిన్నపిల్లవాడు. పదిహేనేళ్ళుంటాయేమో.

ఈవిషయం ప్రక్కన పెట్టి, ఈశరసంధాన.... పద్యంలోని చమత్కారం ఏమిటో తెలుసుకొనే‌ ప్రయత్నం చేద్దాం.

ఈ పద్యాన్ని కొంచెం పదాలను విడదీసి చదవాలి నిజానికి.

మ. శరసంధాన - బల - క్షమాది వివిధైశ్వర్యంబులుం గల్గి దు
ర్భర షండత్వ - బిలప్రవేశ - చలన - బ్రహ్మఘ్నతల్ మానినన్ 
నర - సింహ - క్షితిమండ - లేశ్వరుల నెన్నన్వచ్చు నీసాటిగా 
నరసింహ క్షితిమండలేశ్వరుని కృష్ణా! రాజకంఠీరవా!

అని పదాలమధ్య ఎడం ఇచ్చి చదవాలి.కంటికి చెవికి మొదట కనిపించే చమత్కారం  నరసింహ క్షితిమండలేశ్వర అన్న ప్రయోగం రెండుసార్లు రావటమే. అదెందుకో తెలుసుకోవాలి మనం.

ఈ‌పద్యం అన్వయం చూదాం ముందుగా. 

శరసంధాన, బల, క్షమాది వివిధైశ్వరంబులం గల్గి (ఉన్నప్పటికిన్నీ), దుర్బల షండత్వ, బిలప్రవేశ, చలన, బ్రహ్మఘతలు మానినన్, నర, సింహ, క్షితిమండల, ఈశ్వరులను ఎన్నన్ వచ్చు, క్షితిమండలేశ్వరుని నీసాటిగా, రాజకంఠీరవా నరసింహ కృష్ణా,

వివరంగా చూదాం. నరుడు అంటే అర్జునుడు. నరనాయాయణులని విష్ణువు రెండురూపాలుగా బదరీవనంలో తపస్సు చేసాడనీ వారిలో నరుడే అర్జునుడిగానూ, నారాయణుడే శ్రీకృష్ణుడిగానూ అవతరించారని అంటారు. అందుచేత అర్జునుడికి ఉన్న అనేక నామాల్లో నరుడు అన్న నామం కూడా బహుప్రసిధ్ధం. ఈ నరుడు విలువిద్యలో తిరుగులేనివాడు. శరములు అంటే‌ బాణాలు. శరసంధానం అంటే విటికి బాణం తొడగటం. ఈపని అర్జునుడు ఎంతవేగంగా చేస్తాడూ అంటే అవతలి శత్రువుకు అర్జునుడి వింటినుండి బా‌ణాలు వర్షంలాగా విరుచుకు పడుతూ ఉండటమే‌ కనిపిస్తుంది కాని, ఆ అర్జునుడు ఎప్పుడు బాణం తీస్తున్నాడో అమ్ములపొది నుండి ఎప్పుడు దాన్ని వింటినారికి తగిలించుతున్నాడో ఎప్పుడు బాణాన్ని విడుస్తున్నాడో అన్న మూడుక్రియలూ విడివిడిగా ఏమీ కనిపించవు. పూర్వం శ్రీరామచంద్రమూర్తి మాత్రమే అంత వేగంగా బాణప్రయోగం చేసేవాడని అంటారు. పైగా ఈఅర్జునుడి దగ్గర మరొక తమాషా నైపుణ్యం కూడా ఉంది. ఆయన మూపున రెండువైపులా అమ్ములపొదులు ఉంటాయి. వాటిలో బాణాలు తరగనే తరగవు.ఆయన కుడిచేతితో విల్లుపట్టుకొని ఎడమచేతితో బాణాలను తీయకలడు లేదా ఎడమచేతితో విల్లుపట్టుకొని కుడిచేత్తో బాణాలను తీయకలడు. అందుకే ఆయనను సవ్యసాచి అంటారు. ఆబిరుదు మరెవరికీ లేదు మరి. ఇంత గొప్ప అర్జునునికీ ఒక లోపం ఉందిట! అదేమిటీ అంటే కొన్నాళ్ళు ఆయన షండుడు అనగా నపుంసకుడు ఐపోయాడు. పాపం అయన్ను ఊర్వశి అలా శపించింది. ఆఒక్క లోపమూ ఆయనకు కలుగక పోయుంటే మాత్రమే ఆయన రాయల వారికి సాటి వస్తాడని అల్లసాని వారి చమత్కారం. అంటే రాయలు అర్జునుడి అంతగొప్ప యుధ్ధ వీరుడని చెప్పటం ఇక్కడ తాత్పర్యం.

బలం అనే‌ లక్షణానికి సింహాన్నే చెప్తారు. అందుకే సింహాన్ని మృగరాజు అంటారు. ఆఁ సింహానిదేం‌ బలం! అది బిలప్రవేశం చేస్తుంది దాక్కుందుకు అని కవిగారు అసంతృప్తిని వెలిబుచ్చుతున్నారు. దానిదీ ఒకబలమేనా అది రాయలవారితో బలంలో సాటి అని చెప్పలేం. ఆ బిలప్రవేశం చేసి దాక్కోవటం మానేస్తే మాత్రం మన రాయలవారితో సమంగా ఎన్నవచ్చును బలంలో అంటారు. అంటే రాయలు సింహాన్ని మించిన బలశాలి అని చెప్పటం ఇక్కడ తాత్పర్యం.  సింహమే నీకు సాటీ కాదు పోవయ్యా అంటున్నారు.
 
ఇకపోతే క్షితిమండలం అంటే భూమి. భూమికి క్షమాగుణం మెండు అని ప్రతీతి క్షమయాధరిత్రీ అని వినే ఉంటారు కదా.  ఉత్తమ పత్నీ లక్షణాలను చెబుతూ 

కార్యేషు దాసీ కరణేషు మంత్రీ 
రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ 
భోజ్యేషు మాతా శయనేషు రంభా 
షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ
 
క్షమాగుణం భూమి లక్షణం అని సాహిత్యకారులంతా నిత్యం కీర్తిస్తూ ఉంటారు. కాని ఆ భూమికీ ఒక అవలక్షణం ఉందిట! అదేమిటయ్యా అంటే చలనం! ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది కాని కుదురుగా ఉండలేదు కదా. అలా చలించే అవగుణం మానితే మాత్రం ఆక్షమాగుణం కల భూమిని నీకు సాటి అని చెప్పవచ్చునయ్యా రాయా అంటున్నారు కవి.

ఇక శివుడి సంగతి. ఆయన వివిధమైన ఐశ్వర్యాలకూ మూలం కదా. అసలు ఐశ్వర్యం అంటే ఈశ్వరుని లక్షణం అని అర్ధం కదా. ఐనా ఈశ్వరుణ్ణి నీతో సరిపోల్చలేమయ్యా అంటున్నారు కవి. అదేమిటీ అదెలా అంటే ఈశ్వరుడు బ్రహ్మఘుడు. మీకు తెలుసో తెలియదో నిజానికి బ్రహ్మగారికి ఐదు తలకాయ లుండేవి. ఐదో తలకాయను శివుడు గిల్లి తీసివేసాడట కోపించి. అందుచేత శివుదికి బ్రహ్మహత్యాదోషం వచ్చింది. విష్ణువు సహాయంతో దాన్ని ఆయన తొలగించుకున్నాడట. ఐనా కించిత్తుగా ఆదోషం ఆయన్ను వదలలేదట. ఆయన చేతిలో భిక్షాపాత్రగా పట్టుకొనేది అబ్రహ్మకపాలం అనే‌ అంటారు. రాయలూ, ఇదిగో ఇలా బ్రహ్మహత్య చేయకుండా ఉండి ఉంటే శివుడు నీకు సాటివచ్చే వాడయ్యా అని కవి చమత్కారం.

క్షితిమండలేశ్వర నరసింహ కృష్ణదేవరాయా, రాజకంఠీరవా ఈ నరుడూ, సింహమూ, క్షితిమండలమూ, ఈశ్వరుడు తమతమ లోపాలను సరిదిద్దుకుంటే‌ మాత్రమే యుధ్ధనపుణ్యంలోనూ, బలంలోనూ, క్షమాగుణంలోనూ, ఐశ్వర్యంలోనూ  నీకు సాటిగా ఎన్నవచ్చునయ్యా (లేకపోతే వీలుకాదు) అని ఈపద్యంలో కవిగారిచ్ చమత్కారం అన్నమాట.

ఐతే సభలో ఈపద్యంలో ఒక తప్పుంది అని రామకృష్ణ కవి అన్నాడు.

సింహం మన రాయలవారికి సాటి కాదు అని చెబుతూనే రాజకంఠీరవా అని కంఠీరవం అంటే సింహంతో ఆయన్ను పోల్చుతావేమిటయ్యా అని అక్షేపించాడట.

ఇది ఒక అందమైన చాటూక్తి మాత్రమే.

ఇక్కడొక్క చిక్కుఉంది. శరసంధానబలక్షమాదివివిధైశ్వర్యంబులు అన్నప్పుడు ఆది అనగా మొదలైన అని సమాసం మధ్యలోనే వచ్చింది కదా ఐశ్వర్యం అన్న పదం విడిగా ఎలా లెక్కిస్తారూ‌ అని ఎవరైనా ప్రశ్న వేయవచ్చును. ఆ ఇబ్బందినీ సులభంగా తీర్చవచ్చును. చూడండి శరసంధాన, బల, క్షమ, ఆదివివిధైశ్వర్యంబులు అని చెప్పటం సమజసం అని అనటం ద్వారా. ఆదివివిధైశ్వర్యంబులు అంటే అన్నిటికీ‌మూలమైన అనేకరకాలైన సంపదలు అని అర్ధం. మరి భగవంతుడైన శివుడి నుండే కదా అన్ని సంపదలూ ఏర్పడినదీ. ఇలా అన్వయం చేసుకోవాలి.  అలా చేసి శివుడిని కూడా లిష్టులో లెక్కించాలి అన్నమాట. ఇక్కడ ఒక్కొక్క లక్షణానికి ఒక్కక్క లక్ష్యం క్రమంగా చెప్పుకోవాలి అని తెలుస్తూనే ఉంది కదా. ఆవిషయం విస్తరించ నవసరం ఉందని అనుకోను.

ఈపద్యంలో అల్లసాని వారి అల్లిక జిగిబిగి కనిపిస్తుంది. అలాగే రామకృష్ణ కవి దాన్ని ఎలా చమత్కారంగా తప్పు పట్టాడో‌ తెలుస్తుంది.