ఎంత మంచిది రామనామం బెంత మధురమైనది
ఎంత మందికి దారిచూపిన దెంత సులభమైనది
కోతులై బహు కొండకోనల గ్రుమ్మరు జీవములకు
ప్రీతితో తన సేవ నొసగిన విభుడు రాముని నామము
నాతికై హరి పోరు వేళను నడపె ధైర్యము నిచ్చుచు
నాతని కడు గొప్పసేనగ నదియె తీర్చి దిద్దెను
అన్నకు తన నీతి వాక్యము లాగ్రహము కలిగించగ
తిన్నగా వినువీధి కెగుర దేవదేవుని నామమా
పన్నునకు శుభమార్గముగ హరిపాదములను చూపగ
సన్నుతించుచు భక్త విభీషణుడు శరణము పొందెను
దారితప్పిన మునికుమారుడు దారిదోపిడి దొంగయై
క్రూరుడై చరియించుచుండగ నారదాదిమహర్షులు
కూరిమి శ్రీరామనామము గూర్చ నాతని బుధ్ధికి
దారినెఱిగెను రామచరితము తారచించె వాల్మీకియై
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.