31, అక్టోబర్ 2023, మంగళవారం

హరినామము మరచినచో


కం. హరినామము మరచినచో
మరి యెందుకు పుట్టినట్లు మనుజునిగా ఆ
నరజన్మము చెడి రామా
పురుగగు పులుగగును చెట్టుపుట్టువు గాంచున్


ఓ రామచంద్రప్రభూ!

మానవ జన్మం ఎత్తి హరినామాన్నే మరిచిపోతే ఎట్లా గయ్యా జీవుడు?

అసలు అటువంటప్పుడు మనిషిగా ఎందుకు పుటినట్లూ అని?

అయ్యో ఆ నరజన్మం చెడిపోతున్నదే!

మరలా వాడు ఒక పురుగుగా జన్మించవలసి ఉంటుందో

లేక

ఒక పక్షిగా జన్మించవలసి ఉంటుందో

లేక

ఒక చెట్టుగా జన్మించవలసి ఉంటుందో కదా!

మాబోంట్లకు జగమంతయు దుఃఖమయము


కం. జగమే శ్రీరామమయం

బుగ నెఱిగన వాని కన్న పుడమిని ధన్యుం

డగుపడునే మాబోంట్లకు

జగమంతయు దుఃఖమయము జగదీశ హరీ


హరీ, ఓ జగదీశ్వరా!


ఈప్రపంచం అంతా రామమయం అని చక్కగా లోనెఱిగిన మనిషే ధన్యుడు. వాడి కంటే ధన్యుడు మరొకడు ఉండనే ఉండడు.


సరేలే, మాబోటి వాళ్ళ మాట వేరే చెప్పాలా?


మాకు ఈజగమంతా దుఃఖమయం అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది.


యథాఽస్మై రోచతే విశ్వం తథేదం పరివర్తతే అన్నారు. అందుకే విశ్వం రామమయం అనుకొంటే అంతే దుఃఖమయం అనుకొంటే అంతే.


30, అక్టోబర్ 2023, సోమవారం

భవము చీలమండల లోతే


కం. ఇనకులపతి నీదయగల
మనుజునకున్ భవము చీలమండల లోతే
యనగా దానిని యీదుట
యను క్రియ యెక టెటుల గలుగు నయ్యా రామా

మహాత్మా సూర్యవంశనాయకా!

నీ దయ ఎంతో గొప్పది.
అది పొందినవాడే కదా అదృష్టవంతుడు.

వాడికి ఈభవసముద్రం ఒక లెక్కా?
అది వాడికి చీలమండలలోతు ఉంటుందంతే.

ఇంక వాడు దానిని ఈదటం అనే క్రియకు అవకాశమే కలుగుదు కదయ్యా రామచంద్రప్రభో.

27, అక్టోబర్ 2023, శుక్రవారం

పరదైవతముల భావన

పరదైవతముల భావన సేయుచు
హరిని మరచిదే యధోగతే

హరినామంబుల ననిశము బలుకక
పరులనాముముల పలుకుచు కులుకుచు
హరిచరితామృత మానగ నొల్లక
పరులచరితములు పడిపడి చదువుచు

హరిమహిమను హృదయంబున దలపక
పరులకు లేని మహాత్మ్యము లెంచుచు
హరిసేవలలో నహరహ ముండక
పరుల సేవలో బ్రతుకుచు సతమును

హరేరామ యని యాత్మీయముగా
హరేకృష్ణ యని యానందముగ
నిరతము పలుకుచు నరజన్మమును
హరిభజనల సంబరమున గడుపక25, అక్టోబర్ 2023, బుధవారం

చిన్నివిల్లు చేతబట్టె శ్రీరాముడు


చిన్నివిల్లు చేతబట్టె శ్రీరాముడు భలే
చిన్నిచిన్ని నగవులతో శ్రీరాముడు

బాలుడవు నీకెందుకు బాణము లంటే
చాల యలిగి చూచుచుండు బాలరాముడు

ములకులతో నెవ్వరిని మొత్తెద వంటే
పలువురు రాకాసుల నను బాలరాముడు

చాలు వారిజోలి కేగ నేలర యంటే
నేలను నాకెదు రెవరను బాలరాముడు

పరముదుష్టులయ్య వారు వద్దుర యంటే
పరమవీరుడను నేనను బాల రాముడు

వారు దాగికొందు రేమొ బాలుడ యంటే
వారిని నే వెదకెద నను బాలరాముడు

వారిని గురిచేయు టేల బాలుడ యంటే
వార లధర్మాత్ములనును బాలరాముడు


దేవుడండి దేవుడు


దేవుడండి దేవుడు దేవాధిదేవుడు
భావనాతీతు డగుచు పరగు దేవుడు

సురలనేలు దేవుడు చూడచక్కని దేవుడు
సురవైరులబట్టి యణచుచుండు దేవుడు

సురలకొఱకు నరలోకము జొచ్చినట్టి దేవుడు
తరణికులేశ్వరుడైన దశరథసుతుడు

మందహాసవదనుడు మధురమధురవచనుడు
ఇందీవరశ్యాము డరవిందాక్షుడు

వందారుభక్తలోకమందారుడు సకలముని
బృందములు పొగడునట్టి వేదవేద్యుడు

నిరుపమాన వీరుడు నిర్మలశుభచరితుడు
శరణాగతవత్సలు డగు జానకీపతి

వరములిచ్చు దేవుడు పరమునిచ్చు దేవుడు
మరలమరల మనము పొగడు మనరాముడు

పరమహరిభక్తులకు బాధలు లేవు


పరమహరిభక్తులకు బాధలు లేవు

పరులకు లేనట్టి బాధలు లేవు


ధరకు దిగి వచ్చిన హరిని కొలుచుట మాను

పరమమూర్ఖులకు లేని బాధలు లేవు


హరియుండ రక్షకుడై యన్యులను వేడుకొను

పరమమూర్ఖులకు లేని బాధలు లేవు


హరేరామ హరేకృష్ణ యనుటకు మనసొప్పని

పరమమూర్ఖులకు లేని బాధలు లేవు


హరిని భవతారకుని యనిశము ప్రార్ధించని

పరమమూర్ఖులకు లేని బాధలు లేవు


వరములిఛ్చు రాముని వదలి యన్యుల గొలుచు

పరమమూర్ఖులకు లేని బాధలు లేవు


సరాసరిగ రామునకు శరణాగతులు కాని

పరమమూర్ఖులకు లేని బాధలు లేవురామభక్తి లేకుంటే రాదు మోక్షము


రామభక్తి లేకుంటే రాదు మోక్షము శ్రీ
రామ రామ యనకుంటే రాదు మోక్షము

ధర్మాత్మున కైనను కర్మిష్ఠున కైనను

నిర్మలున కైనను నిర్మోహున కైనను


వేదముల నేర్చినా విజ్ఞానము కలిగినా

వేదాంత మెఱిగనా విశ్వమర్మ మెఱిగినా


తంత్రములు నేర్చినా తనకు మహిమలుండినా
మంత్రసిధ్ది కలిగినా మహిని కీర్తి బడసినా

త్యాగములు చేసినా రాగమును వదలినా
యాగములు చేసినా భోగములు వదలిగా

దానములు చేసినా ధర్మములు చేసినా
ధ్యానములు చేసినా  తపములు చేసినా

తీర్ధములు తిరిగినా దేవతలను కొలిచినా
స్వార్ధమును వదలినా సర్వమును వదలినా


జయములు కలుగుట యచ్చెరువా


జయములు కలుగుట యచ్చెరువా భవ
భయమును తొలగుట యచ్చెరువా

నియమము దప్పక నీశుభనామము నిత్యము పలికే నీభక్తులకు
భయభక్తులతో నినుసేవించగ రయమున కదలే నీభక్తులకు

పరమానందముతో నీచరితము నిరతము చదివే నీభక్తులకు
సురుచిరసుందరమగు నీరూపము చూచుచు వలచే నీభక్తులకు

నిను వర్ణించుచు  నిను కీర్తించుచు మనసున మురిసే నీభక్తులకు
నిను ప్రార్ధించుచు నిను సేవించుచు నిలచియుండెడు నీభక్తులకు

మనసారగ నిను పూజించుచు దినదినమును దనిసే నీభక్తులకు
నిను గా కన్యుల కలలో నైనను మనసున దలచని నీభక్తులకు

హరి నీచరణములే శరణంబని యాశ్రయించు నీ నిజభక్తులకు
పరాత్పరా నీకరుణామృతమును పానము జేసిన నీభక్తులకు

తమ యెడదలు నీవిడుదులు చేసిన ధన్యాత్ములగు నీభక్తులకు
భ్రమలు విడచి శ్రీరామచంద్ర నీపదముల నుండే నిజభక్తులకు


 

24, అక్టోబర్ 2023, మంగళవారం

సరసమైన నామం చక్కని నామం


సరసమైన నామం చక్కని నామం
పరమాత్ముని నామం పావననామం

పరమమధుర మైయున్నది భగవన్నామం
పరమసులభ మైయున్నది భగవన్నామం
పరమ సుఖద మైయున్నది భగవన్నామం
పరమపదము నొసంగునది భగవన్నామం

ముదమారగ ప్రేమించు ముముక్షువులను
వదలకుండ రక్షించును వదలకండి 
నిదుర నైన మీరెన్నడు వదలకండి 
వదలకండి మధురమైన భగవన్నామం

జగముల రక్షించునది భగవన్నామం
నిగమసార మైయున్నది  భగవన్నామం
భగవంతున కబేధము భగవన్నామం
జగదీశ్వరుడైన రామచంద్రుని నామంసీతారాం సీతారాం


సీతారాం సీతారాం సీతారాం జయ సీతారాం

సీతారాం సీతారాం శ్రీరఘురాం జయ సీతారాం


ఇనకులతిలక సీతారాం ఇందువదన హరి సీతారాం

వనరుహలోచన సీతారాం భండనపండిత సీతారం

దనుజవిమర్దన సీతారాం దశరథనందన సీతారాం

మనసిజమోహన సీతారాం వనజాసననుత సీతారాం 


శ్రీరఘునాయక సీతారాం శ్రితజనపోషక సీతారాం

మారుతిసేవిత సీతారాం మంగళరూప సీతారాం

కారణకారణ సీతారాం  కారుణ్యాలయ సీతారాం

నారాయణ హరి సీతారాం ఘోరభవాంతక సీతారాం


సీతారాం హరి  సీతారాం శివదేవనుత సీతారాం

సీతారాం హరి  సీతారాం చిన్మయరూప సీతారాం

సీతారాం హరి సీతారాం శ్రీకర శుభకర సీతారాం

సీతారాం హరి  సీతారాం చింతితఫలద సీతారాంజయ యనరే జయజయ యనరే

జయ యనరే జయజయ యనరే మన జానకిరామునకు
భయము లన్నిటిని పారద్రోలు మన పట్టాభిరామునకు

ఒక్కబాణమున రక్కసి తాటక నుక్కడగించిన వీరునకు
ఒక్కబాణమున సుబాహు బూదిగ  నొనరించిన రఘువీరునకు
ఒక్కబాణమున మారీచాసురు నుదధిని ద్రోచిన వీరునకు
చక్కగ గాధేయుని యాగమ్మును సంరక్షించిన రామునకు

కరమునదాలిచి హరు పెనువింటిని విరచిన ఘనబలవంతునకు
ధరణిజ కరమును గైకొని మురిసిన దశరధరాజకుమారునకు
పరుసములాడిన భార్గవరాముని భంగపరచిన వీరునకు
నిరుపమవిక్రమస్ఫురణకు పేరై నిలచిన శ్రీరఘురామునకు

వనసీమలలో దనుజులమూకల పనిబట్టిన సీతాపతికి
జనకసుతను గొనిపోయిన రావణు జంపిన భండనభీమునకు
వినయాన్వితులగు సుజనుల ననిశము వేడ్కను బ్రోచెడు రామునకు
తననామము భవతారకమై యిల తనరారెడు ఘనశ్యామునకు


19, అక్టోబర్ 2023, గురువారం

రామనామమే మధురం


రామనామమే మధురం

శ్యామసుందర సర్వులకు


హరి నీనామమ లన్నిటిలో

పరమమధురమై వరలునది

నరులము మము నీపురమునకు

త్వరగా చేర్చునది


పాపుల నోటను పలికినను

కాపాడుటకై కలిగినది

లోపము లెంచక తాపములు

మాపుచు చెలగునది


కామితమగు మోక్షమునిచ్చే

నామమిదే యని నమ్మెదము

ప్రేమగ నీశుభనామమును

మేము స్మరించెదము

16, అక్టోబర్ 2023, సోమవారం

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని పలుకు

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని పలుకు జిహ్వ నీకుండిన చాలు
శ్రీరామ తత్త్వమును నిత్యమును చింతించు చిత్తము నీకున్న చాలు

శ్రీరామచంద్రుని గుణముల కీర్తించు జిహ్వ నీకుండిన చాలు
శ్రీరామచంద్రుని పదముల ధ్యానించు చిత్తము నీకున్న చాలు

శ్రీరామభజనలో చిందులు త్రొక్కెడి జిహ్వ నీకుండిన చాలు
శ్రీరామునే దక్క యన్యుల నెన్నని చిత్తము నీకున్న చాలు

శ్రీరాము నెప్పుడు వర్ణించి మురిసెడు జిహ్వ నీకుండిన చాలు
శ్రీరాము నెల్లపుడు సేవించి మురిసెడు చిత్తము నీకున్న చాలు

శ్రీరాముడే నాకు జీవితమని పలుకు జిహ్వ నీకుండిన చాలు
శ్రీరాము డిచ్చిన భాగ్యమే చాలను చిత్తము నీకున్న చాలు

శ్రీరామపారమ్యమును లెస్స బలికెడు జిహ్వ నీకుండిన చాలు
శ్రీరామపారమ్యమును నిశ్చయించిన చిత్తము నీకున్న చాలు

15, అక్టోబర్ 2023, ఆదివారం

నిత్యము శుభములు కలుగునయా

 
నిత్యము శుభములు కలుగునయా యిది సత్యము సత్యము సత్యమయా

నీశుభనామము పలుకుచు మురిసెడు నీనిజభక్తుల కందరకు
నీశుభచరితము చదువుచు నుండెడు నిర్మలబుధ్దుల కందరకు

నీదాసులతో సాహచర్యమును నెఱపెడు సజ్జను లందరకు
నీదాసత్వము గైకొని మిక్కిలి నిష్ఠగ నుండెడు సుమతులకు

నిన్నే తల్లిగ తండ్రిగ దలచెడు నిశ్చలబుధ్ధుల కందరకు
నిన్నే పతిగా గతిగా దలచుచు నున్నమహాత్ముల కందరకు

భవతారక నీపాదాంబుజములు వదలని భక్తుల కందరకు
భువనేశ్వర శ్రీరామచంద్ర నిను పొగడెడు భక్తుల కందరకు


14, అక్టోబర్ 2023, శనివారం

నాలుకపై శ్రీరామనామ మున్నది


నాలుకపై శ్రీరామనామ మున్నది అది

వీలైన పీఠమని వీడకున్నది


సుందర మగు మంత్రమని సురలు పొగడుచు

నుందురిది శివునికృపను చెందెను నాకు

అందమైన నోటి గూట నమరి యున్నది ఆ

నందసుధాదివ్యరసస్యంది యైనది 


బహుజన్మలు తపముజేసి బడసితి దీని న

న్నహరహమును కావ నిది యవతరించెను

ముహూర్తమైన దీని మరచిపోవు టుండునా

వహించి దీని నాలుకపై పరవశించనా


అంది వచ్చిన దపురూప మైనమంత్రము శివు

డందించిన భవతారకమైన మంత్రము

ముందుముందు జన్నలెత్తు ముప్పుతప్పెను ఏ

మందు నింక మోక్ష మదే యందివచ్చెను

12, అక్టోబర్ 2023, గురువారం

రాబోయే రోజుల్లో


రాబోయే రోజుల్లో

కేంద్రంలో మరొకసారి బీజేపీ ప్రభుత్వం వస్తుంది. కాంగ్రెసు వారేదో ఇండియా కూటమి అంటున్నారు కాని అది అతుకులబొంత అని దేశప్రజలు అనుకొనే అవకాశమే హెచ్చు. రాహుల్ గాంధీ గారి ఇమేజ్ పెరిగిందీ అని వార్తలు జోరుగానే వినిపిస్తున్నాయి. కొన్ని నిదర్శనాలూ కనిపిస్తున్నాయంటున్నారు. కాని ఆ ఒక్క ఇమేజ్ చాలా అంటే చాలదనే అనుకుంటున్నాను. ఇండియా కూటమికి అధికారం వస్తే ఎవరండీ ప్రథాని అంటే సరైన జవాబుందా? రాహుల్ అన్న మాట ఏకగ్రీవంగా వినిపిస్తోందా? లేదు కదా. ఇంక మోదీకి తిరుగు ఎక్కడ? ప్రస్తుతం కాంగ్రెసు వాళ్ళు పాలస్తీనాను వెనుకవేసుకొని వచ్చి లోపాయకారీగా హమాస్ వాళ్ళను సమర్ధించటాన్ని భారతసమాజం హర్షిస్తున్నట్లు లేదు. ఇటువంటి తప్పులు కాంగ్రెసు చేయకూడదు. ఇస్లామిక్ టెర్రరిజం అన్నది పాకీస్తానం వాళ్ళు చేస్తేనే తప్పూ హమాస్ చేస్తే ఒప్పూ అని ఏలాజిక్ ద్వారా జనానికి నచ్చజెబుతారూ మరి?

తెలంగాణాలో మరలా కేసీఆర్ గారి దొరతనమే కొనసాగుతుంది. బీజేపీ వారు తెలంగాణాలో తమబలాన్ని మరీ ఎక్కువగా ఊహించుకుంటూన్నారు. షర్మిలగారి పార్టీకి ఓట్లు రాలే అవకాశం లేదు. జనసేన + టీడీపీ ఇక్కడ రంగంలోనికి దిగితే కాసిని ఓట్లు పడవచ్చును కాని వాళ్ళు కాసిని సీట్లు పడతారని అనుకోవటం కష్టం. మరలా తెలంగాణాలో నాయకచతుష్టయం పాలన తప్పదు. తెలంగాణా ఒక మిగులు రాష్ట్రంగా ధనికరాష్ట్రంగా ఏర్పడింది కదా ఇప్పుడు అప్పులకుప్ప ఎందుకైపోయిందీ అని ప్రతిపక్షాలు నిలదీసినా పెద్దగా లాభం ఉండదు. ఇదంతా కేసీఆర్ గారి కరిష్మా అనుకోండి ప్రతిపక్షాలు చీలికలుపేలికలుగా ఉండటం వలన అనుకోండి. మరలా ఆనలుగురే హీరోలిక్కడ.

ఆంధ్రాలో మళ్ళా వైకాపా వస్తుందనే చెప్పవచ్చును. కేసీఆర్ ఫండెడ్ అండ్ సపోర్టెడ్ పార్టీ అది. పైగా అది బీజేపీ బ్లెస్సుడు అండ్ సపోర్టేడ్. కాబట్టి వైకాపాకే గెలుపు అవకాశాలు ఎక్కువగ కనిపిస్తున్నాయి మరి. టీడీపీ + జనసేన పోటీ గట్టిగానే ఇచ్చినా అవసరం ఐతే ఆపార్టీల ముఖ్య మరియు చిన్నాచితకా నాయకులందరిపైనా క్రిమినల్ కేసులు పడిపోతాయని చిన్నపిల్లలకూ ఈపాటికే అర్ధమైపోయిన సంగతి. అందుచేత వాళ్ళ అభ్యర్ధులందరిపైనా నామినేషనుల కన్నా ముందే కేసులూ జైళ్ళూ సిధ్ధంగా ఉంటాయి. అభర్ధులకే దిక్కులేని పార్టీలేమి పోటీ ఇస్తాయీ ఏమి ప్రచారం చేస్తాయీ. కాబట్టి వైకాపాకు తిరుగుండదు. ఐనా ఆంధ్రా ఓటర్లకు కావలసినవి తాయిలాలు (ఇస్తామంటే చాలు ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు) కాని అభివృధ్ధి కాదు కదా. అదీకాక వైకాపా వచ్చాకనే ఆంద్రా బాగుపడిందనీ కొందరి అభిప్రాయం కూడా వినిపిస్తోంది.మరలమరల నిను తలచుట

 
మరలమరల నిను తలచుట కన్నను 
పరమసుఖము మరి వసుధను గలదా

దశరథనందన తాపత్రయహర
నిశాచరాంతకనిరుపమవిక్రమ
దశముఖహర కోదండపాణి యని
యశోవిశాల విహగవాహ యని

సురనాయక యని శుభదాయక యని
కరివరదా యని కంసాంతక యని
నరకాంతక యని నారాయణ యని
కురువంశాంతక గోవిందా యని

హరేరామ యని యానందముగా
హరేకృష్ణ యని యపురూపముగా
కరుణాజలధే కమలానాయక
నరసింహా హరి నాతండ్రీ యనిఈరాముడు దేవుడు


ఈరాముడు దేవుడు మీరెల్లరు తెలియు

డీరాముడే దేవుడు


వనిత లక్ష్మి యెకతె వసుమతి యొకతె

తనకు దేవేరు లనగ తనరారు వెన్నుడు


వనజాసను డొకడు మనసిజు డొకడు

తనకు సుపుత్రు లనగ తనరారు వెన్నుడు


దుష్టుల శిక్షించు శిష్టుల రక్షించు

సృష్టికారకుడైన శ్రీమన్నారాయణుడు


సురలు ప్రార్ధింపగ ధరణి ప్రార్ధింపగ

నరుడై జన్మించినట్టి నారాయణ స్వామి


సుజనుల కరుణించి కుజనుల నడగించి

నిజధామ మందున్న నీరజాక్షుడు హరి


శ్రీరామ రామ రామా


శ్రీరామ రామ రామా శ్రితపారిజాత రామా 

కారుణ్యధామ రామా కమనీయనామ రామా


సురవైరినాశ రామా పురవైరిస్తుత్య రామా

నరలోకసార్వభౌమా పరమాత్మ సుగుణధామా

సరసీరుహాక్ష రామా శాంతిప్రదాత రామా

ధరణీసుపుత్రిసీతాతరుణీసమేత రామా


జయ జానకీశ రామా  జగదేకసార్వభౌమా 

జయ ధర్మనిలయ రామా సత్యప్రతిజ్ఞ రామా

జయ నిగమవేద్య రామా జ్ఞానప్రకాశ రామా

జయ భక్తవరద రామా సర్వార్తిశమన రామా


మరుతాత్మజాతసేవ్యమహనీయపాద రామా

వరయోగిరాజహృదయాంబరసూర్యమూర్తి రామా

సురలోకనిత్యవంద్యచరణారవింద రామా

శరణాగతార్తినాశబిరుదప్రసిధ్ధ రామా


రామా శ్రీరామా జయరామా రఘురామా

రామా శ్రీరామా జయరామా రఘురామా నీ
నామము మరువగ లేము గుణధామా

పరదైవతములను భావించబోమయ్య

నరనాథ నిన్నెడద నమ్మినామయ్య

సిరులకై మేము వెంపరలాడ మయ్యా

పరమాత్ముడా మమ్ము కరుణించవయ్యా


ధర్మస్వరూపుడవు దయగల స్వామివి
నిర్మలచరితుడవు నిగమవేద్యుడవు
నిర్మోహులుగ మమ్ము నిలబెట్టవయ్యా
కర్మబంధము లూడ్చి కరుణించవయ్యా

మేము నీదాసులము మిక్కిలి భక్తులము
కామితములు లేవు కైవల్యమే చాలు
పామరరత్వము నుడిపి భవము లేకుండ
మామీద దయచూప మది నెంచవయ్యా 


9, అక్టోబర్ 2023, సోమవారం

శ్రీరామనామామృతమును


శ్రీరామనామామృతమును పానము చేయని జీవితమెందుకురా
శ్రీరామనామామృతమును పానము చేసిన నిక భవ ముండదురా

శ్రీరాముని దివ్యతత్త్వము చింతన చేయని జీవితమెందుకురా
శ్రీరాముని దివ్యతత్త్వము చింతన చేసిన నిక భవ ముండదురా

శ్రీరామచంద్రుని నిత్యము కీర్తన చేయని జీవితమెందుకురా
శ్రీరామచంద్రుని నిత్యము కీర్తన చేసిన నిక భవ ముండదురా

శ్రీరామచంద్రుని సేవలు చక్కగ చేయని జీవితమెందుకురా
శ్రీరామచంద్రుని సేవలు చక్కగ చేసిన నిక భవ ముండదురా

శ్రీరాముడే జీవితంబని పలుకగ నేరని జీవిత మెందుకురా
శ్రీరాముడే జీవితంబని పలికెడు వారల కిక భవ ముండదురా 

శ్రీరామమయముగ జగమును చూడగ నేరని జీవిత మెందుకురా
శ్రీరామమయముగ జగమును చూచెడు వారల కిక భవ ముండదురా

శ్రీరామచంద్రుని పాదాబ్జంబుల చేరని జీవిత మెందుకురా
శ్రీరామచంద్రుని పాదాబ్జంబుల చేరిన నిక భవ ముండదురా

శ్రీరామచంద్రుని కరుణామృతమది చెందని జీవిత మెందుకురా
శ్రీరామచంద్రుని కరుణామృతమే సిధ్ధించిన భవ ముండదురా

శంకరవినుత నమ్మితిని


శంకరవినుత నమ్మితిని నిశ్శంకగ నిన్నే రఘురామా
పంకజనయన నను  కాపాడుము వంకలుబెట్టక రఘురామా

కలిగిన జన్మము లన్నిటి యందును కష్టములే కద రఘురామా
కలునేల నీజన్మము లనుచును తలచి వగచెదను రఘురామా
తెలియక భవముల జిక్కుకొంటిని దీర్ఘకాలముగ రఘురామా
తెలిసినేడు విడిపించుకొనుటకై తిప్పలుపడుచుంటిని రామా

హరి నీసత్కృప కలిగిన గాక యన్యవిధంబుల రఘురామా
నరుడు తరించుట సాధ్యము కాదని నాకెఱుకాయెను రఘురామా
మరలమరల కొఱగాని జన్మముల మలపకు నన్నో రఘురామా
ధర నిక పుట్టువు  లేని విధంబుగ దీవించుము నను రఘురామా

నీనామంబున కన్యము నెఱుగగ నేను చరించుట రఘురామా
లో నెఱుగుదు వోదైవరాయ దయ లోపము చేయకు రఘురామా
దీనుడ నను స్వస్థానము చేర్చుము దివ్యప్రభావా రఘురామా
నే నన్యంబుల వేడెడు వాడను గాను మహాత్మా రఘురామా


8, అక్టోబర్ 2023, ఆదివారం

హరేరామ హ‌రేకృష్ణ యన్నామయ్యా


హరేరామ హ‌రేకృష్ణ యన్నామయ్యా నీవు

సరాసరి వరమిచ్చిన చాలుగదయ్యా


చిన్న పెద్ద తప్పులున్న మన్నించయ్యా మా

కున్నది సద్భక్తి యన్న దొప్పుకోవయ్యా

పప్నగేంద్రశాయి మాంపాహి యన్నామే నీ

కన్న మాకు దిక్కెవ్వరు కరుణించయ్యా


నిన్ను గూర్చి కథలెన్నో విన్నామయ్యా ఆ

పన్నప్రసన్నుండవని భావింతుమయా

కన్నతండ్రి మాప్రార్ధన కాదనకయ్యా మ

మ్మెన్న డింక పుట్టించకు మేలు మాకయ్యా


అన్నన్నా యింకేమీ యడుగబోమయ్యా మా

కున్న దొక్క మోక్షాశయె విన్నావయ్యా

మున్నెందరు భక్తులనో ప్రోచితివయ్యా శ్రీ

మన్నారాయణుడ వీవు మారామయ్యా


కోవెల లోపల దేవు డెవరమ్మా


కోవెల లోపల దేవు డెవరమ్మా - కోదండ‌రాము డమ్మా
దేవుని మహిమను తెలియజెప్పమ్మా - తెలుపుట నావశమా

హరియా ఈదేవు డది చెప్పవమ్మా - అందుకు సందేహమా
హరియైతే శంఖుచక్రాలేవమ్మ - నరునిగ వచ్చెనమ్మా

చిరుచిరు నగవుల దేవేరి యెవరమ్మ - సీతమ్మ కాదటమ్మా
హరిదేవేరి యా శ్రీలక్ష్మియా యీయె - అందుకు సందేహమా

హరి కటుప్రక్కన నావీరు డెవడమ్మ - తరుణీ లక్ష్మణుడమ్మా
హరి రాముడందువు మరి లక్ష్మణు డెవడు - సరి ఆదిశేషుడమ్మా

హరి యాదిశేషులు నరు లెందుకైరమ్మ - సురలట్లు కోరిరమ్మా
నరుడై హరిజంపిన దైత్యుడెవడమ్మ - మరి దశకంఠుడమ్మా

శ్రీరాము పాదాల చెంగట నెవడమ్మ - శ్రీయాంజనేయు డమ్మా
ఏమి యాతని గొప్ప యించుక చెప్పమ్మ - రామయ్య భక్తుడమ్మా

రామభక్తి గొప్పదనమేమి చెప్పమ్మ - ఆమోక్ష మిచ్చేనమ్మా
ఆమోక్షమే యిచ్చు ఈరాముడే గొప్ప - అవునమ్మ నిజమేనమ్మా