9, అక్టోబర్ 2023, సోమవారం

శంకరవినుత నమ్మితిని


శంకరవినుత నమ్మితిని నిశ్శంకగ నిన్నే రఘురామా
పంకజనయన నను  కాపాడుము వంకలుబెట్టక రఘురామా

కలిగిన జన్మము లన్నిటి యందును కష్టములే కద రఘురామా
కలునేల నీజన్మము లనుచును తలచి వగచెదను రఘురామా
తెలియక భవముల జిక్కుకొంటిని దీర్ఘకాలముగ రఘురామా
తెలిసినేడు విడిపించుకొనుటకై తిప్పలుపడుచుంటిని రామా

హరి నీసత్కృప కలిగిన గాక యన్యవిధంబుల రఘురామా
నరుడు తరించుట సాధ్యము కాదని నాకెఱుకాయెను రఘురామా
మరలమరల కొఱగాని జన్మముల మలపకు నన్నో రఘురామా
ధర నిక పుట్టువు  లేని విధంబుగ దీవించుము నను రఘురామా

నీనామంబున కన్యము నెఱుగగ నేను చరించుట రఘురామా
లో నెఱుగుదు వోదైవరాయ దయ లోపము చేయకు రఘురామా
దీనుడ నను స్వస్థానము చేర్చుము దివ్యప్రభావా రఘురామా
నే నన్యంబుల వేడెడు వాడను గాను మహాత్మా రఘురామా