భారవి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భారవి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, జనవరి 2016, శనివారం

కిరాతార్జునీయంలో చిత్రకవిత్వం - 5

నారాయణాపరస్వరూపమైన అర్జునుడి సంగతి తెలియక అత్యుత్సాహంతో‌ అతడిపై తలపడటానికి సాహసించి పరాభూతులై చట్రాతిపై కొట్టిన కుండ పెంకుల్లా తలొక దిక్కుకూ పరుగెడుతున్న ప్రమథగణాల్ని వారి నాయకుడైన దేవసేనాని కుమారస్వామి మందలిస్తున్నట్లుగా భారవి మహాకవి వ్రాస్తున్న అద్భుతమైన శ్లోకాల్ని చదువుతున్నాం.

కుమారస్వామి ఇలా అంటూన్నాడు. రాక్షసులతో ఒక ఆటలాగా యుధ్ధం చేసే మీ‌ శౌర్యం అంతా ఏమయ్యింది? మీ పరువు మీరే తీసుకుంటున్నారే! మీ‌రు అప్యాయంగా పదునుపెట్టుకున్న మీ కత్తుల తళతళలు మీ ముఖం మీదే పడుతూ‌ మిమ్మల్ని పరిహాసం చేస్తున్నాయే. ధనుర్భాణాలు ధరించి కూడా రక్షణ కోసం అడవిలో దారులు వెతుక్కుంటూ పరిగెడుతున్నారా

మీగురించి మీరు గొప్పగా భావించుకుంటారే. అదంతా చెడింది కదా? శివగణాలుగా మీకు లోకాల్లో వ్యాపించి ఉన్న కీర్తి అంతా మాయమైపోయి నట్లేనా? ఏ మంత గొప్ప ఆపద ముంచుకొచ్చిందని యుధ్ధం నుండి పారిపోతున్నారూ? ఇలా పారిపోవటం ఎంత పాప కార్యం. మీ వలన సదాశివుడికే చెడ్డపేరు వస్తోంది కదా?!

నాసురోఽయం‌ న వా నాగో
ధరసంస్థో న రాక్షసః
నా సుఖోఽయం నవాభోగో
ధరణిస్థోహి రాజసః


న+అసురః+అయం --> నాసురోఽయం అవుతుంది. ఇక్కడ, అయం అంటే ఇతడు అని అర్జునుడిని ఉద్దేశించి చెప్పటం. అసురః న అంటే దైత్యుడు కాడు. న + వా +‌నాగో -> నవానాగో అంటే నాగుడు కాదు. అంటే ఏ వాసుకియో ఆదిశేషుడో వంటి నాగేంద్రుడు కాదు అని. ధరసంస్థో అంటే ధర (భూమి) మీద ఉన్న, రాక్షసః న అంటే రాక్షసుడు కాదు. ధరసంస్థ అంటే భూమిమీద ఉండేది పర్వతం కదా అన్న అర్థంలో పర్వతం‌ లాంటి రాక్షసుకుడు కాదు అనటం  సుఖః + అయం -> సుఖోయం అంటే ఇతడు సుఖంగా (సులభంగా) గెలువ తగినవాడు. ఎందుకంటే ధరణిస్థః అనగా భూమిమీద బతికే వాడే కాని దివ్యుడు కాదు. న రాజసః -> రజోగుణం‌ పండిన వాడు కాదు (తపస్వికదా). నవ + అభోగః -> కొత్తగా తెలియనిది (యుధ్ధం) ప్రయత్నిస్తున్నవాడు.

భావం చూదాం. కుమారస్వామి ఏమని మందలిస్తున్నారంటే ప్రమథుల్ని, ఇతను దైత్యుడు కాదు,  పర్వతం లాంటి రాక్షసుడూ కాడు. ఏ మహానాగుడూ‌ కాదు. కేవలం‌ ఒక భూలోకవాసి ఐన మనిషి మాత్రమే. ఇతను తపస్సు చేసుకునే వాడే కాని యుధ్ధాల వంటి పౌరుషవిద్యల్లో ఆరితేరిన వాడు కాదు. కేవలం కొత్తకొత్తగా యుధ్దవిద్యను ప్రయత్నిస్తున్న వాడు మాత్రమే. ఇంత మాత్రానికే బెదిరి పరెగుత్తుతారా అని ప్రమథుల్ని గద్దించటం అన్నమాట.

ఈ శ్లోకంలో మొదట చెప్పుకోవలసిన విశేషం అసుర, రాక్షస అన్న రెండు మాటల్ని కవి వాడటం. సామాన్యంగా ఈ మాటల్ని సమానార్థప్రతిబోధకాలుగా వాడతాం కాబట్టి ఒకే అర్థం వచ్చే మాటల్ని రెండు వాడటం పునరుక్తి అనే దోషం కదా అన్న అనుమానం వస్తుంది అందరికీ. అది నివృత్తి చేసుకోవాలి.

సురలు అసురలు అని దేవయోనులు రెండురకాలు. సురలు అంటే దేవతలు అదితి సంతానం. వీళ్ళని ఆదిత్యులు అని అందుకే పిలుస్తారు. అసురలు అంటే దితి సంతానం. అందుకని వీళ్ళని దైత్యులు అని అంటారు. ఇకపోతే దనువు అనే వాడి సంతతిని దానవులు అని పిలుస్తారు. కశ్యపప్రజాపతికి సురస అనే ఆమె వలన జన్మించిన వారు, యక్షులు, రాక్షసులు అని రెండు జాతులు. సురస సంతానంలో ఆకలి బాధతో కొందరు యక్షామ అని మరికొందరు రక్షామ అని గోలచేసారు. వాళ్ళూ, వాళ్ళ సంతతి వాళ్ళూ యక్షులూ‌ రాక్షసులునూ అయ్యారు.కాని సామాన్యంగా అందరినీ కలేసి పిలుస్తూ ఉంటాం దానవులనీ రాక్షసులనీ, దైత్యులనీ.

ఇప్పుడు ఈ‌శ్లోకంలో చెప్పుకోవలసిన రెండవదీ ముఖ్యమైనదీ‌ అయిన విశేషం, బంధకవిత్వం. బంధకవిత్వం అనేది చిత్రకవిత్వ ప్రక్రియల్లో ఒకటి. ఒక పద్యాన్నో శ్లోకాన్నో ఒక పజిల్ వంటి అమరికలో పేర్చి చూపటం బంధకవిత్వం అవుతుంది.   ఇక్కడ ఈ‌ శ్లోకంలో‌ భారవి మహాకవి చూపిన బంధకవిత్వ విశేషం గోమూత్రికాబంధం.


నా
సు
రో
యం

వా
నా
గో


సం
స్థో

రా
క్ష
సః

X
X
X
X
X
X
X
X
X
X
X
X
X
X
X
నా
సు
ఖో
యం

వా
భో
గో


ణి
స్థో
హి
రా

సః


ఈ గోమూత్రికా బంధం ఒక తేలికైన బంధం. మీరు మొదటి రెండు పాదాలను ఒక వరుసగానూ చివరి రెండు పాదాలనూ ఒక వరుసగానూ వ్రాయండి. పై వరుస మొదటి అక్షరం, తరువాత క్రిందివరుస రెండవ అక్షరం, మళ్ళా పై వరుస మూడవ అక్షరం అలా కలిపి చరివితే అది పై వరుస అవుతుంది. (పైన పటంలో నీలం రంగులొ చూపిన అక్షరక్రమంలో చదవండి) అలాగే క్రిందివరుసనుండి అలాగే క్రిందికీ పైకీ అక్షరం మార్చి అక్షరం చదువుతూ పోతే మళ్ళా అది క్రింది పాదమే అవుతుంది. (పైన పటంలో ఆకుపచ్చరంగు అక్షరాలను క్రమంలో చదవండి).

ఇలా గోమూత్రికా బంధం కురరాలంటే పైవరుసలో సరిస్థానాల్లోని(2,4,6...) అక్షరాలు క్రింది వరుసలోని సరిస్థానాల్లోని(2,4,6...) అక్షరాలతో సరిగ్గా సమానంగా ఉండాలి.

ఈ విధమైన బంధానికి గోమూత్రిక అని పేరెందుకు వచ్చిందీ అన్న సందేహం వస్తుంది కదా.  గోజాతి నడుస్తూ మూత్రవిసర్జన చేసినప్పుడు క్రింద తన్మూత్రం చేసే చిత్రాకృతి ఇంచుమించు ఇలా ఉంటుంది కాబట్టి ఈ బంధానికి గోమూత్రిక అన్న పేరు.

నిజానికి ఈ‌ గోమూత్రికా బంధాన్ని మరికొంచెం జటిలంగా కూడా వ్రాస్తారు. పైన ఇచ్చిన పటంలో మధ్యవరుసలో X అనే గుర్తు పెట్టి చూపటం గమనించారు కదా.  ఆ స్థానాల్లో X బదులుగా అక్షరాలు వచ్చేలా వ్రాస్తే అది కూడా గోమూత్రికా బంధమే కాని వ్రాయటంలో ప్రయాస హెచ్చుగా ఉంటుంది.

అలాంటి జటిలమైన గోమూత్రికా బంధానికి ఉదహరణ ఒకటి మన ముక్కు తిమ్మన్న గారి పారిజాతాపహరణంలో ఉంది.

కం. విదళితదైత్య రమాగృహ
పదసారస వినతదేవ పతగేశహయా
చిదమిత చైత్యశమావహ
మదసరణ విమలభావమతపాశజయా (5-94) 

వి
ళి
దై

గృ

సా


దే

గే









త్య
మా



వి




యా




చి
మి
దై



వా


భా

పా








ఈ రకమైన గోమూత్రికాబంధాన్ని చదివే విధానం ఏమిటంటే పైవరుసలోని ప్రతి అక్షరం తరువాత మధ్యవరుసలోని అక్షరం వస్తుంది. అలాగే క్రిందివరసలోని ప్రతి అక్షరం తరువాత మధ్యవరుసలోని అక్షరం వస్తుంది. అంటే మధ్యవరుసలోని అక్షరాలు పైవరుసకీ క్రిందివరుసకీ కూడా సమంగా వర్తిస్తాయన్నమాట.  పై కందపద్యం ఒక సారి పరిశీలనగా చూడండి. సరిస్థానాల్లో మొదటి రెండు పాదాల్లో ఏఏ అక్షరాలున్నాయో సరిగ్గా అవే స్థానాల్లో అవే అక్షరాలు క్రింది రెండు పాదాల్లోనూ‌ ఉన్నాయి కదా.

బారవి మనమీద దయతలచి గోమూత్రికాబంధాన్ని రెండుపేటల్లో అల్లితే ముక్కు తిమ్మనార్యుడు మరో రెండాకులు ఎక్కువ చదివి నట్లున్నాడు. ఏకంగా తిమ్మన్నగారు మూడుపేటల గోమూత్రికాబంధం వ్రాసారు.



13, జనవరి 2016, బుధవారం

కిరాతార్జునీయంలో చిత్రకవిత్వం - 4

దేవత లన్నాక రాక్షసులతో యుధ్ధాలు రాకుండా ఉండవు. రాక్షసు లన్నాక వాళ్ళకి లోకం మీద పడి అల్లకల్లోలం చేయకపోతే తోచదు. దేవతలతో తలపడక పోతే వాళ్ళకు తీట తీరటమూ‌ కుదరదు. ఒక్కో సారి రాక్షసులదే‌ పైచేయ్యి ఐనట్లూ కనిపిస్తుంది. అలాంటి సందర్భాలు వస్తే దేవతలు పోయి శివకేశవుల ముందు గోడు వెళ్ళబోసుకుంటారు. అవసరం ఐన సందర్భాలలో విష్ణువు భూలోకానికి వచ్చి మరీ రాక్షసుల సంగతి చూస్తాడు. ఒక్కొక్క సారి శివుడే స్వయంగా ప్రమథగణాలతో సహా వెళ్ళి దేవతలకు యుధ్ధంలో సహాయం చేస్తాడు.  ఆ యుధ్ధాలలో‌ ప్రమథులకు రాక్షసులతో‌ యుధ్ధం మంచినీళ్ళ ప్రాయంగా ఉంటుంది. అదొక అట వాళ్ళకి.

అలాంటి ప్రమథులు శివుడితో పాటు పోయి అర్జునుడనే నారాయణాంశసంభూతుడితో తలపడి తలలు బొప్పి కట్టించుకొని పారిపోసాగారు.  కుమారస్వామి వాళ్ళకు నాయకుడు కాబట్టి వాళ్ళను మందలిస్తున్నాడు.

మీరేమో‌ రాక్షసులతోనే ఒక ఆటలాగా యుధ్ధం చేసే వాళ్ళే. ఎంత వీరుడైనా కానీ ఒక మనిషి ముందు నిలబడలేక పారిపోతారా? అని కోప్పడి ఇంకా ఇలా అంటున్నాడు.

మీరు కంగారు కంగారుగా పరుగులు పెడుతూ‌ పారిపోతుంటే, మీ‌ బడాబడా కత్తులమీద సూర్యకాంతి తళుక్కు తళుక్కు మని మెరుస్తూ మీ‌ ముఖాల కేసి చూసి నవ్వుతున్నట్లుగా అనిపిస్తోంది. ఓరి బడుధ్ధాయిలూ యుధ్ధంలోంచి పారిపోయేవాళ్ళకు కత్తులెందుకురా అని మిమ్మల్ని అవి పరిహాసం చేస్తున్నాయి సుమా.

వనేఽవనే వనసదాం
మార్గం మార్గముపేయుషామ్‌
బాణైర్భాణైః సమాసక్తం
శంకేఽశంకేన శామ్యతి

వనసదాం అన్న మాటకు వనాలు అనగా అడవుల్లో తిరిగేవారని అర్థం.  వనే+అవనే --> వనేఽవనే అవుతున్నది. ఇక్కడ అవనము అంటే రక్షణ అని అర్థం. వనే అన్న మాటకు మార్గం+ ఉపేయుషాం (దారిని పట్టిన వారికి) అన్న చోటి మార్గం తో‌ అన్వయం.  బాణైః + బాణైః  --> బాణైర్బాణైః అంటే (రివ్వు రివ్వుమని) చప్పుడు చేస్తూ పోయే బాణాలు అని అర్థం.  శంకే+అశం+కేన --> శంకేఽశంకేన అవుతోంది. అశం అంటే దుఃఖం. శంక అంటే తెలిసిందే‌,అనుమానం అని. కేన అంటే ఎలాగు అని ప్రశ్నార్థం.

ఈ‌శ్లోకం‌ భావం తెలుసుకుందాం. అడవుల్లో మృగాలుంటాయి. వనచరులైన మనుష్యులూ‌ ఉంటారు. వాళ్ళ సంచారానికి అనువైన మార్గాలు కొన్ని అడవిలో గుర్తులుగా తెలుస్తూనే ఉంటాయి. ఆ మార్గాలు వాళ్ళ గుంపులు సంచరించే మార్గాలు కాబట్టి వాటిలో తిరుగున్నంత కాలం ఆ వనచరులకు ఆ అడవుల్లో కొంతగా రక్షణ ఉంటుంది. దారితప్పి తిరిగితే వాళ్ళకూ‌ భయమే అడవుల్లో. ఇప్పుడు మీరంతా అలాంటి సురక్షితమైన దారుల్ని ఈ అడవులో వెతుక్కుంటూ పరుగులు తీస్తున్నారు అని ప్రమథులపై కుమారస్వామి ఆక్షేపణ. అలా తలదాచుకుందుకు పరిగెట్టే మీకు చేతులో దనుస్సులూ మూపున వాడిబాణాలూ‌ ఎందుకూ? రివ్వురివ్వున చప్పుళ్ళు చేస్తూ‌ శత్రువులను హడలెత్తించే బాణాలతో‌ కూడిన అమ్ములపొదులు మీ‌ మూపున ఉన్నా ఏమీ లాభం లేకుండా ఉందే? మీ‌ కష్టం ఎలా తొలగుతుందా అని నాకు అనుమానం వస్తోంది అని కుమారస్వామి తన వీరులపైన జాలి పడుతున్నాడు.

చేతిలో‌ తళతళల కత్తులూ మూపున వేగంతోనే భయంకరమైన చప్పుళ్ళు చేసే‌ బాణాలూ ఉన్న మీకు ఎంత కష్టం వచ్చిందీ అని కుమారస్వామి ఎత్తిపొడుపు.

ఈ శ్లోకంలో‌ కూడా యమకాలంకారం ఉంది.

ఐతే ఇక్కడ యమకానికి వాడిన అక్షరసముదాయాలు వెంటవెంటనే‌ పాదం మొదటనే రావటం చూస్తున్నాం. దీన్ని పాదాది యమకం అంటారు. సంధికార్యాలవలన యమకం సాధించటం కొన్నిచోట్ల చూస్తున్నాం. వనేమార్గే అంటే అడవిదారిలో అనీ, మార్గముపేయుషాం అంటేదారి వెతుక్కుంటున్నారనీ అర్థవైచిత్రి ఒకటి చూస్తున్నాం, అలాగే బాణైః అన్నపదాన్నే రెండుసార్లు వరసగా ప్రయోగించినా అర్థాలు వేరుగా తీసుకున్నాడు కవి.



9, జనవరి 2016, శనివారం

కిరాతార్జునీయంలో చిత్రకవిత్వం - 3

అర్జునుడు చాలా మాసాలనుండీ తపస్సు చేస్తున్నాడు. అందువల్ల బాగా చిక్కిపోయి కూర్చున్నాడు. తనదగ్గర ఆయుధాలన్నీ ఉంచుకున్నా ఆయన వాటితో సాధన చేయటం లేదు కాబట్టి అభ్యాసం తప్పి ఉండాలి. అదీ కాక కొండలూ‌ అడవులూ వంటి ప్రాంతాల్లో యుధ్ధం చేయటం తమకు అలవాటైన వ్యవహారం‌ కాని పట్టణవాసి ఐన అర్జునుడికి కొత్తే‌ కదా. అదీ‌ కాక  తమను స్వయంగా దేవసేనాపతి ఐన కుమారస్వామివారు యుధ్ధానికి తీసుకొని వచ్చారు. అర్జునుడికి ప్రక్కన ఎవరూ వ్యూహకర్తలుగా లేరు. తామా మంచి బలగంగా ఉన్నారు. అర్జునుడా ఒంటరిగా ఉన్నాడు. పైగా ఈ యుధ్ధాన్ని సాక్షాత్తూ పరమేశ్వరుడే ప్రోత్సహించి స్వయంగా దానిలో‌ పాల్గొన వచ్చాడు. ఇంక తమకు తిరుగేముంది. అర్జునుడికి తమతో తలపడటం ఎలాసాధ్యం?

ఇలా ఆలోచించారేమో ప్రమథులు. కాని అర్జునుడు వాళ్ళమీద విరుచుకుపడి వాళ్ళ ధైర్యాన్ని క్షణంలో మటుమాయం చేసాడు. హఠాత్తుగా అనుకోనిది జరిగితే ఎంతవారూ వెనుకంజ వేయక తప్పుతుందా? దానితో ప్రమథగణం పలాయనం చిత్తగించసాగారు. అప్పుడు చిరాకుపడి కుమారస్వామి వాళ్ళని మందలించి యుధ్ధానికి పురికొల్పటానికి పూనుకొని ఇలా అంటున్నాడు.

మా విహాసిష్ట సమరం
సమరంతవ్యసంయతః
క్షతం క్షుణ్ణాసురగణై
రగణైరివ కిం యశః 

ఇది ఈ కిరాతార్జునీయం, పదిహేనవ సర్గలోని 8వ శ్లోకం.

దీని భావం ఏమిటంటే, మీరెంత గొప్ప వీరులో మీకు గుర్తుందా? మీరంతా యుధ్ధాన్నీ ఆటనీ సమానంగా చూస్తారని పేరే!  అలాంటిది మీరు ఇప్పుడు యుధ్ధరంగం  నుండి పారిపోతారా? యుధ్ధం వదిలిపోవద్దు. మీరంతా అసురగణాల్ని క్షుణ్ణం చేసేవారే (అంటే పొడిచేసేవారే అని) అలాంటిది మీరే ఒక గణంగా (ఒక జట్టుగా) నిలబడలేక తలొకదారీ పడుతున్నారా? ఇలా సామాన్యుల్లాగా ప్రవర్తించి మీ‌ కీర్తికి నష్టం కలిగించే పనిని మీరే స్వయంగా చేస్తున్నారు సుమా అంటున్నాడు కుమారస్వామి.

ఇప్పుడు ఈ శ్లోకంలోని విశేషం చూదాం.

శ్లోకంలో‌ కొన్ని చోట్ల క్రీగీటులు పెట్టంట‌ం‌ జరిగింది గమనించారు కదా?  మొదటి పాదం చివర సమరం అని వచ్చింది. ఆ సమరం అనే దానితోటే రెండవపాదం మొదలయ్యింది. మూడవపాదం చివర రగణై అని అన్నది ఉన్నది కదా అదే నాలుగవపాదం మొదట్లోనూ వచ్చింది.

ఇలా కొన్ని పదాలు లేదా పదభాగాలు మళ్ళామళ్ళా రావటాన్ని యమకం అంటారు. ఇక్కడ ఉన్న యమకం విశేషాన్ని పాదాంతాది యమకం అంటారు. పాదాంతం అంటే పాదం చివర అనీ పదాది అంటే పాదం మొదట అని అర్థం.

యమకం అనేది ఒక అలంకారం. మనకి అలంకారం అంటే నగ అన్న సామాన్యార్థం తెలుసు. కావ్యాల్లో అలంకారం అన్నమాటకు అర్థం చూదాం.

పాఠశాలల్లో తెలుగు నేర్చినప్పుడు ఉపమా ఉత్ప్రేక్షా అంటూ కొన్ని అలంకారాలు హడలేసి చదివించి ఉంటారు కదా. మార్కుల చదువుల్లో అవి భట్టీయం వేసి హమ్మయ్య అని గట్టెక్కేయటమే‌ కాని రసదృష్టితో‌ వాటిని ఆలోచించే అవకాశమూ‌ మనకు ఆరోజుల్లో ఉండదు. దానికి తగిన పరిణతీ‌ మనకు అప్పుడు ఉండటమూ‌ అరుదే. అందుచేత ఇప్పుడు మరొకసారి అవసరమైనంతగా ఈ విషయాన్ని స్పర్శిద్దాం.

అలంకారాలను అసలు ఎందుకు ధరిస్తారు ఆడవాళ్ళు? "ఆ మాటకు వస్తే పూర్వం మగవాళ్ళూ ఆడవాళ్ళతో పోటీగా సమానంగానే నగలు ధరించే వారు. ఇప్పుడు వాళ్ళకు చేయించటానికే ఎక్కడి డబ్బులూ సరిపోవటం లేదు కాబట్టి మగాళ్ళు నగలు వేసుకోవటం మానేసా"రని ఒకసారి మానాన్నగారు చమత్కరించారు. అది సరే, ఎందుకు ధరిస్తారు నగలు అన్న ప్రశ్నకు ఠక్కున వచ్చే సమాధానం అందం కోసం అని. అందగా ఉన్నా అలంకారాలు ధరిస్తూనే ఉన్నారే మరి?  అలాగంటే, అలంకారాలవలన అందం ఇనుమడిస్తోంది కాబట్టి అని సమాధానం.

అలాగే కావ్యం యొక్క సౌందర్యం దానిలోని రసమే. ఆ రసాన్ని అవిష్కరించేవి కథా, కథాగమనమూ, కవితాపుష్ఠీ వగైరా. ఐతే ఒక రసపుష్ఠి కల కావ్యానికి కూడా దాని సౌందర్యాన్ని ఇనుమడింప జేయటానికి కొన్నికొన్ని కవితాప్రక్రియలను కవులు వాడుక చేస్తూ ఉంటారు. అవి అనేక రకాలు. అన్నింటి గురించీ వ్రాయటానికి ఇది సందర్భం కాదు. కాని వాటిలో ముఖ్యమైనవి కావ్యానికి శోభను ఇనుమడింప జేసేవి కొన్ని విధానాలను అలంకారాలు అంటారు. అవి సాధారణంగా మాటలపొందిక కారణంగా చేసే చమత్కారాలూ (అంటే శబ్దాలంకారాలు) అలాగే చిత్రవిచిత్రమైన భావనలనూ అన్వయాలనూ చూపటంతో చేసే చమత్కారాలూ (అవి అర్థాలంకారాలు) అంటారు. ఇవి చదువరులకు మరింత అహ్లాదాన్ని కలిగిస్తాయి. అప్పుడు కావ్యం‌ మరింతగా బాగుంటుంది. భలే అందమైన కావ్యమే‌ అని మనచేత అనిపిస్తాయీ ఈ‌ అలంకారాల చమత్కారాలు.  అందుచేత కావ్యంలో అలంకారం అంటే సౌందర్యం అనే అర్థం చెప్పుకోవాలి. ఉన్న కావ్యగత సౌందర్యానికి ఈ‌ అలంకారాలు జోడింపు సౌందర్యాలన్నమాట.

అందుకనే వామనుడు తన కావ్యాలంకారసూత్రంలో సౌందర్యమలంకారః అని చెప్పాడు. వాచా ఈ మాటల కర్థం అలంకారం అంటే సౌందర్యం అనే.

అలంకారశాస్త్రగ్రంథం ఐన అలంకారసర్వస్వం అని ఒకటుంది. దాన్ని వ్రాసింది 12వ శతాబ్దం వాడైన రుయ్యకుడు.  ఎందకనో కాని ఆయనను రాజానక రుయ్యకుడు అని పిలుస్తారు. అందులో ఆయన యమకానికి నిర్వచనంగా "స్వరవ్యంజనసముదాయపౌనర్యుక్తం యమకమ్‌" అని చెప్పాదు.

స్వరములు అంటే అచ్చులు . అ, ఆ.. మొదలైన అచ్చులు.
వ్యంజనాలు అంటే హల్లులు. క, ఖ,గ,ఘ... మొదలైనవి.
సముదాయం అంటే ఒకటి కన్న ఎక్కువగా ఉండటం.
స్వరవ్యంజన సముదాయం అంటే ఒకటికన్న ఎక్కువ అక్షరాలలో అచ్చులు హల్లుల వరుస అని.
పునరుక్తి అంటే చెప్పినదే మళ్ళా చెప్పటం.
పౌనర్యుక్తం అంటే ఏవైనా మరలా మరలా చెప్పబడినవి అని అర్థం.
ఇప్పుడు స్వరవ్యంజన సముదాయ పౌనర్యుక్తం అంటే వరుసగా ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో అచ్చులూ‌ హల్లులూ పునరుక్తిగా వచ్చిన సందర్భం అన్నమాట.
దీనినే రుయ్యకుడి సూత్రం యమకం అంటోంది.

వరుసగా కొన్ని అక్షరాలు సామ్యంగా (అవే అచ్చులూ హల్లులుగా) ఉండటం అన్నారు కాని అవే పదాలు అనలేదు. ఇది బాగా గమనించాలి మనం.

ఇలా సామ్యం కల భాగం పూర్తి మాట కానక్కరలేదు. అందుచే ఆ ఫణంగా దానికొక అర్థం ఉండవలసిన పనిలేదు. ఒకవేళ పూర్తిమాట ఐతే  కూడా కావచ్చును. అభ్యంతరం‌ లేదు.

పునరుక్తి అంటున్నాం కదా, ఒక చోట పూర్తిమాటగా ఉండి మరొక చోట అంతకన్నా పెద్దపదంలో భాగం కావచ్చును. అందుచేత ఒకచోట ఆ అక్షరసముదాయం అర్థవంతంగా ఉండి మరొకచోట ఉండకపోవచ్చును.  ఒకవేళ రెండుచోట్లా పూర్తిగా అదే పదం ఐన పక్షంలో వేరు వేరు అర్థాలు చెప్పుకొనేలా ప్రయోగించబడాలి.

ఇక్కడ పరిస్థితి చూదాం.

మావిహాసిష్ట సమరం అన్నప్పుడు సమరం అన్నది యుధ్ధం అన్న అర్థంలో ఉన్నది. వెంటనే రెండవపాదంలో సమరంత అన్న చోట  సమ రంత అని రెండు మాటలున్నాయి. సమ అంటే తెలిసిందే సమానంగా అని. రంత అంటే క్రీడించే వాడు అనీ అర్థం. సమరంత అన్న సమాసోక్తిగా చూస్తే సమరం అన్న అక్షరసముదాయం వచ్చింది.

అలాగే  క్షుణ్ణాసురగణైః అని మొదటి ప్రయోగాన్ని క్షుణ్ణ + అసుర గణైః అని విభజించుకోవలసి ఉంది. వెంటనే వచ్చే రెండవ ప్రయోగం కొంచెం చిత్రం. ఎందుకంటే గణైః + అగణైః అన్న చోట సంధి కార్యం వలన గణైరగణైః అయ్యింది ఈ ర- నుండి నాలుగవ  పాదం మొదలై రగణై అన్న అక్షరసముదాయం పునరుక్తి ఐనది.

ఈ విధంగా కవి ఇక్కడ యమకం అన్న అలంకారాన్ని వాడాడు.

ఈ శ్లోకంలో శబ్దాలంకారం ఉన్నది కాని చిత్రకవిత్వం లేదు. నిజమే. కాని ప్రతిశ్లోకంలోనూ‌ ఉండక్కర్లేదుగా. అత్యథికశాతం శ్లోకాల్లో ఉన్నాయి. మొత్తం మీద శ్లోకాని కొక తీరున చిత్రంగా అనిపించే విధంగా ఈ‌ సర్గ అంతా ఉంటుంది. అందుచేత చిత్రకవిత్వం నేరుగా లేదు కదా అని ఈ‌ శ్లోకాన్ని టూకీగా తేల్చకుండా విస్తృతంగా వ్రాయవలసి వచ్చింది. మొత్తం సర్గకు మనం వ్యాఖ్యానించుకున్నాక మరలా అన్ని శ్లోకాలను ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే ఈ‌ సర్గయొక్క వైభవం కవి యొక్క కవితాపాటవం మనకి బాగా అనుభూతిలోనికి వస్తాయి. ముఖ్యంగా యమకాలతో అక్షరాలా సర్కసుఫీట్లు చేయించటమూ మనం బాగా ఆనందించగలం.



8, జనవరి 2016, శుక్రవారం

కిరాతార్జునీయంలో చిత్రకవిత్వం - 2

అర్జునుడితో తలపడి తలలు బొప్పికట్టించుకొని కుయ్యోమొఱ్ఱో అని ప్రమధులు ఆయుధాలనుకూడా పారేసి పారిపోయారని చదువుకున్నాం. వాళ్ళకి తమపక్షాన సాక్షాత్తూ పరమశివుడే ఉన్నాడు కదా భయం దేనికి అన్న ఆలోచన కూడా రాలేదు. స్వయంగా వాళ్ళ సేనాపతి దేవసేనాని కుమారస్వామి నాయకత్వం వహిస్తూ అక్కడే వాళ్ళమధ్యనే ఉన్నా వాళ్ళెవరూ ఆ సంగతే ఆలోచించలేదు. పారిపోయారంతే. సరే లెండి, అసలు అక్కడ సాక్షాత్తూ శివుడున్నా వాళ్ళు పారిపోయారంటుంటే కుమారస్వామి గురించి ఎందుకు అనటం?

అలా పారిపోతున్న వాళ్ళ మీద అర్జునుడికి కాస్త దయ కలిగిందని కదా అన్నాడు కవి? అవును మరి. గొప్పగొప్ప వాళ్ళు అసలే బాధలో గోలపెడుతున్నవాళ్ళని మరింతగా బాధించటానికి ప్రయత్నిస్తారా ఏమిటి? ప్రయత్నించరు కదా. అందుకే అర్జునుడు కూడా వాళ్ళని కొంచెం మెల్లమెల్లగానే అదిలించాడు. అంతే కాని ఆ వెన్ను చూపుతున్న వాళ్ళని మరీ ఏడిపిస్తూ వాడిబాణాలతో వేగంగా తరమలేదు.

ఇదంతా చూసి శివుడు నవ్వుకున్నాడేమో. కాని కుమారస్వామికి మాత్రం ఉక్రోషం వచ్చి ఒళ్ళు మండిపోయింది. తన సమక్షంలోనే తన సైన్యం తననీ కనీసం శివుణ్ణైనా లెక్కపెట్టకుండా పొలోమని యుధ్ధరంగం నుండి పరిగెత్తటమా? వెంటనే ఆయన ఆ పారిపొతున్న సైన్యం ముందుకు వేగంగా వెళ్ళి నిలబడి అదిలించాడు. వాళ్ళు కొంచెం సంశయంగా అగగానే వాళ్ళకు గట్టిగా పాఠం చెప్పటం మొదలు పెట్టాడు.

అథాగ్రే హసితా సాచి
స్థితేన చిరకీర్తినా
సేనాన్యా తే జగదిరే
కించిదాయస్త చేతసా

ఈ శ్లోకం‌ యొక్క భావం ఎమిటంటే, చిరస్థాయిగా ఉండే గొప్పకీర్తికల ఆ  కుమారస్వామి, తన సైన్యం దురవస్థ చూసి, వాళ్ళ ఎదుటకు వెళ్ళాడు. అయన మనస్సు కొంచెం‌ బాధతో ఉంది. ఐనా నవ్వుతూ వాళ్ళ ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఆయన వాళ్ళకు ధైర్యం చెప్పటానికి గాను ఇలా మాట్లాడుతున్నారు అని.

ఈ శ్లోకంలో చిత్రంగా ఉండే సంగతి ఏమిటబ్బా అని అడుతున్నారు కదా?

ఇది ఒక నిరోష్ఠ్య శ్లోకం. అర్థం కాలేదా? ఓష్ఠం అంటే పెదవి. ఓష్ఠ్యం అంటే పెదవుల సహాయంతో కుదిరేది అని అర్థం. నిరోష్ఠ్యం అంటే పెదవుల సాయం అక్కర్లేనిది అని.

ఈ శ్లోకాన్ని పైకి చదవండి. పెదవులు కదపకుండానే మొత్తం శ్లోకం‌ నడిచింది కదా?

అదే ఇక్కడి విశేషం.

లాక్షణికులు చెప్పేది ఏమిటంటే ఏ మాట(ల) కైతే ప-వర్గమూ (అంటే ప,ఫ,బ,భ.మ) , వ, ఉ,ఊ, ఒ,ఓ అనే అక్షరాలూ వాడమో అవి నిరోష్ఠ్యాలు అని. మొత్తం శ్లోకమైనా తెలుగుపద్యమైనా అలా వ్రాస్తే అది నిరోష్ఠ్యం అనిపించుకుంటుంది.

నిరోష్ఠ్యం గా పద్యం వ్రాసినా శ్లోకం వ్రాసినా అదీ చిత్రకవిత్వమే అవుతుంది.

దండి అనే‌ కవి సంస్కృతంలో దశకుమారచరితం అని ఒక అద్భుతమైన కావ్యం వ్రాసాడు. అందులో అనేక కథలున్నాయి. ఒక కథ మంత్రగుప్తుడు అనే సాహసి గురించినది. ఆ మంత్రగుప్తుడు సాహసయాత్రల్లో ఒకదానిలో ఒక అందమైన అమ్మాయిని సంపాదించుకున్నాడు. సరసంలో భాగంగా ఆ పిల్ల మంత్రగుప్తుడి పెదవి కొరికింది. కొంచెం ప్రేమ ఎక్కువైనట్లుంది. అందుకని పెదవి చిట్లింది. ఒక వైపు బాధ, మరొకవైపు ఆనందం ఆ మహానుభావుడికి. సరే అతను ఆ అమ్మాయికి కథ చెప్పటం‌ మొదలు పెట్టాడు. కాని ఎట్లా పెదవులు కలిపితే బాధ కలుగుతుందే! అందుకని దండి ఆ మంత్రగుప్తుడి పాత్రతో చెప్పించిన కథ అంతా నిరోష్ఠ్యంగా వ్రాసాడు. చూసారా మరి. సారస్యం అంటే అదీ. ఎవరండీ పాత కవుల భావుకతని ఎగతాళి చేసేదీ?

మీరు కందుకూరి వీరేశలింగం‌ పంతులు గారి పేరు వినే ఉంటారు కదా. ఆయన గురించి నాలుగు మాటలు చెప్పమంటే ఆయన సంఘసంస్కరణాకార్యక్రమాల గురించి చెబుతారు కదా? ఐతే మరొక సంగతి కూడా ఆయన గురించి ఈ సారి చెప్పండి. వీరేశలింగం పంతులు గారు శుద్ధాంధ్ర నిరోష్ఠ్య నిర్వచననైషధము అని ఒక అచ్చతెలుగు కావ్యం వ్రాసారు. అంటే ఒట్టుపెట్టుకొని ఒక్క సంస్కృతం ముక్కా ఎక్కడా రాకుండా  నలుడి చరిత్రను ఏకంగా ఒక కావ్యంగా వ్రాసారన్న మాట. అదే గొప్ప విశేషం ఐతే అంతకన్నా గొప్ప విశేషం, అది నిరోష్ఠ్యకావ్యం కావటం. అంటే ఆ కావ్యం మొత్తం మీద ఎక్కడా ప, ఫ, బ,భ, మ, వ ఉ, ఊ, ఒ, ఓ అనే అక్షరాలు లేవు. అన్నట్లు నిర్వచనం అని కూడా ఆ గ్రంథం పేరులో ఉంది కదా. దానర్థం పద్యాలు తప్ప వచనంగా పంతులు గారు ఎక్కడా వ్రాయలేదన్నమాట. సామాన్యమైన సంగతి కాదు కదా ఈ కావ్యం ఆయన వ్రాయటం?

శాకల్యమల్లయ్య భట్టు అనే కవి నిరోష్ఠ్య రామాయణం వ్రాసాడు.

మరింగంటి సింగనాచార్యులు శుద్దాంధ్ర నిరోష్ఠ్య సీతాకల్యాణం కావ్యం రాశారు.

వరంగల్‌కు చెందిన ఠంయాల లక్ష్మీనరసింహాచార్యులు నిరోష్ఠ్య కావ్యాలు వ్రాసారని విన్నాను వివరాలు తెలియవు.

నల్లంతిఘల్ చక్రవర్తుల లక్ష్మీనరసింహాచార్యులు అనే‌ కవి గారు శుద్ధాంధ్ర నిర్గద్య నిరోష్ఠ్య కేకయ రాజనందన చరిత్రం అనే గ్రంధం వ్రాసారు. నిర్గద్యం అంటే గద్యం లేనిది అని. నిర్వచనం అన్నా అర్థం అదే.

ఇలా నిరోష్ఠ్యంగా ఒక పద్యమో శ్లోకమో వ్రాయటమే‌ కాదు, ఏకంగా కవులు కావ్యాలే వ్రాసారు.

ఇప్పుడు మరొకసారి భారవి ఇచ్చిన ఈ‌నిరోష్ఠ్యశ్లోకాన్ని పెదవులు అస్సలు కదపకుండా హాయిగా చదివి ఆనందించండి. మీదే ఆలస్యం. ఇంకా కొంచెం అనుమానం ఉన్న వాళ్ళకి ఒక ఉపాయం చెప్పనా, పెదవుల సంగతి అలా ఉంచండి. పళ్ళను గిట్టకరచుకొని ఈ‌ శ్లోకాన్ని చదివిచూడండి, పెదవులతో‌ పని లేకుండా ఎలా పనిజరిగిపోతుందో.

7, జనవరి 2016, గురువారం

కిరాతార్జునీయంలో చిత్రకవిత్వం - 1

భారవి వ్రాసిన కిరాతార్జునీయం కావ్యంలో కిరాతుడి రూపంలో ఉన్న శివుడికీ తాపసిగా ఉన్న అర్జునుడికీ‌ యుధ్ధం పదునాల్గవ సర్గలో ప్రారంభం అవుతుంది. ఆ యధ్ధం పదునెనిమిదవ సర్గ మొదట్లో ముగుస్తుంది. ఆ సర్గతో‌ కావ్యమూ సంపూర్ణం అవుతుంది. భారవి ఆ ఇద్దరి మధ్య జరిగిన యుధ్ధాన్ని వర్ణించే‌ సందర్భంలో పదిహేనవ సర్గలో చిత్రకవిత్వాన్ని గొప్పగా వ్రాసాడు. మనకు కిరాతార్జునీయం పూర్వాపరాలన్నీ బాగానే తెలుసును. అదీకాక గత టపాలో‌ ముందు మాటలో కొంత తలస్పర్శిగా యుధ్ధానికి దారితీసిన పరిస్థితుల్నీ పరామర్శించాం. ఇప్పుడు ఎకాయెకీన చిత్రకవిత్వం ఉన్న పదిహేనవ సర్గలోనికి వచ్చేస్తున్నాం.

అర్జునుడి మీదికి బోయవాడి వేషంలో శివుడూ అలాగే బోయపరివారంగా కనిపిస్తున్న ప్రమథగణాలూ యుధ్ధానికి దిగాయి. అర్జునుడి బాణాలు ఆ ప్రమథగణాల్ని కప్పేశాయి. ఒక తామరకొలను ఉందనుకోండి. చంద్రోదయం‌ కాగానే పండువెంన్ల ఒక్కసారిగా ఆ తామరపూవులమీద కురిస్తే ఏం‌ జరుగుతుంది. అన్నీ‌ వెలాతెలాపోయి ముడుచుకొని పోతాయి వాడిపోయి. ఒక్కో తామర పూవు మీదకీ‌ ఒక్కొక్క చంద్రకిరణం‌ తాపీగా రాదు కదా. ఆన్నింటినీ ఒక్కసారిగా వెన్నెల ముంచెత్తుతుంది. ఆనీ‌ ఒక్కసారిగా వాడిపోతాయి. అలా అర్జునుడి బాణాలవర్షం ప్రమథసందోహం అందరిమీదా ఒక్కసారిగా వెల్లువెత్తింది. అందరూ శివుడిని కూడా స్మరించకుండా లబోదిబో మని పారిపోయారట. ప్రమథులు శివుణ్ణీ స్మరించకుండా ఉండగలరా? ఎవరికైనా ఆపద వస్తే‌ శివుణ్ణి తలచుకుంటారే. మరి నిత్యం‌ కళ్ళు తెరుస్తే శివుడూ కళ్ళుమూస్తే కూడా శివుడే ఐన ప్రమథులకే శివుణ్ణి వేడాలని తోచలేదా‌ అంటే. బాణాలలా ఒక్కసారి తుఫానులాగా ముంచెత్తేసరికి మనస్సులు పనిచేయక గాభరా పడి పారిపోయారన్నమాట. ఏదో‌ అర్జునుడిని తికమక పెడదాం అని తేలిగ్గా తీసుకొని వచ్చిన ప్రమథులకే ఆపద కలిగినట్లై వాళ్ళు గొప్పగా సంభ్రమం చెంది పారిపోయారు. చివరికి వాళ్ళ కంటికీ‌ మనస్సుకీ‌ శివుడు కూడా అనలేదు!

ఆ బోయసేన దురవస్థను చూసి అర్జునిడి మనస్సు దయతో‌ కరిగిపోయిందట!

స సాసిః సాసుసూః సాసో
యేయేయేయాయయాయయః
లలౌలీలాం లలోఽలోలః
శశీశశిశుశీః శశన్     (5)

ఇది ఈ 15వ సర్గలో 5వ శ్లోకం. చిత్రకవిత్వం రుచిచూపిస్తున్న మొదటిశ్లోకం ఈ‌ సర్గలో.

ఈ శ్లోకంలో‌ చిత్రమైన విషయం ఏమిటీ అంటే చూడండి శ్లోకంలోని నాలుగు పాదాల్లోనూ ఒక్కొక్క పాదానికీ ఒక్కొక్క అక్షరాన్ని గుణింతం బేధంమాత్రం చేసి వాడుతూ నిర్మించటం.

మంచి వయ్యాకరణీ, గొప్పకవీ మహాపండితుడూ‌ ఐతే‌ తప్ప ఇలాంటి శ్లోకం వ్రాయటం‌ కుదిరేపని కాదు.

జాగ్రత్తగా పగలగొట్టుకొని ఈ శ్లోకంలోని శబ్దాలను గ్రహించాలంటే సంస్కృతంలోని ఏకాక్షరనిఘంటువులూ వగైరా తెలిసి ఉండాలి. లేకుంటే మనవల్ల కాదు.

స + అసి --> సాసి. అసి అంటే కత్తి. అసిధారావ్రతం‌ అన్నమాట విన్నారా? అక్కడ అసి అంటే కత్తి అని అర్థం మీరు ఎప్పుడో తెలుసుకొని ఉంటారు. ఇక్కడ స+అసి అని సంధిచేసి సాసి అన్నాడు కవి. ఇప్పుడు సాసి అంటే అర్థం కత్తి కలవాడు అని వస్తున్నది.

స + అసుసూః --> సాసుసూః. అసుసుః అంటే బాణం. కాబట్టి సాసుసూః అంటే బాణాలు కలవాడు.

స + ఆసః --> సాసః. ఆసః అంటే విల్లు అని అర్థం. సాసః అంటే ఇప్పుడు ధనుస్సు కలవాడు అని అర్ధం వస్తున్నది కదా.

యేయ + అయేయ + ఆయయ + అయయః --> యేయాయేయాయయాయయః అవుతున్నది. యేయము అంటే ప్రయాణసాధనం వాహనం. యేయః అంటే యేయము కలవాడు. వాహనం‌మీద ఉన్న వాడన్న మాట. అయేయః అంటే వాహనం‌ లేనివాడు. అయయ అంటే అటువంటి వారిని, అయేయః అనగా వాహనాలు లేని వాళ్ళని చేస్తున్నాడు అని అర్థం. అంటే వాహనాలున్న శత్రువుల్నీ నేలమీద ఉన్న శత్రువుల్నీ కూడా చితగ్గొట్టి వాళ్ళ వాహనాలు లాక్కుంటున్నాడు అని తాత్పర్యం.

లలః అంటె అందగాడు అని అర్థం.

అలోలః అంటే ఏవిధంగానూ మనస్సు అటూ ఇటూ చంచలంగా ఉండని వాడు. అంటే మంచి ఏకాగ్రతతో యుధ్ధం చేస్తున్న వాడు అని అర్థం.

శశి +‌ఈశ --> శశీశ. శశి అంటే అందరికీ‌ తెలుసును కదా చంద్రుడని. ఈశుడంటే అధిపతి. శశీశు డంటే చంద్రుడికి ప్రభువు ఐన శివుడు అని అర్థం వస్తోంది.

శశీశ + శిశుశీః  --> శశీశశిశుశీః. శిశువు అంటే బిడ్డ. ఇక్కడ స్మరిస్తున్నది శివుడి కొడుకైన కుమారస్వామిని. కుమారస్వామిని ఎందుకంటే ఆయన గొప్ప అందగాడు. అంతే కాక గొప్పపరాక్రమశాలి. సాక్షాత్తూ దేవతలకు సైన్యాధిపతి కూడా.  ఆయన దేవసేనాధిపతి అన్న మాట అటుంచండి. ఇక్కడ శివుడి సేనలకూ నాయకత్వం వహిస్తున్నది కూడా సాక్షాత్తూ ఆ కుమారస్వామివారేను.

శశన్  అంటే పారద్రోలటం‌ అన్న అర్థం ఇక్కడ.

అందుచేత శశీశశిశుశీః శశన్ అంటే చంద్రుడి ప్రభువైన శివుడి కొడుకు కుమారస్వామిని పరిగెత్తించే వాడు. అంటె దేవసేనాని ఐన కుమారస్వామినే గెలిచే సత్తా ఉన్నవాడు అని అర్థం. అంటే యుధ్ధంలో  అర్జునిడి నైపుణ్యాన్ని ఆ కుమారస్వామి కూడా తట్టుకోలేకపోయాడని కవి హృదయం అన్నమాట.

లీలాం అంటే విలాసాన్ని, శోభను అని అర్థం.

లలౌ అంటే పొందాడు అని అర్థం.

హమ్మయ్య. అర్థాలు తీసాం‌ కదా. ఇప్పుడు మొత్తం‌ శ్లోకం లోని భావాన్ని మననం చేసుకుందాం.

ప్రమథసైన్యాన్ని అవలీలగా పారద్రోలిన అర్జునుడి పరాక్రమశోభను కవి ప్రస్తుతి చేస్తున్నాడు. అర్జునుడు నడుముకు ఖడ్గాన్ని ధరించాడు. చేతిలో విల్లమ్ములు పట్టుకున్నాడు. వాహనాలమీద వచ్చి యుధ్ధానికి దిగిన వాళ్ళనీ, పదాతిసైన్యాన్నీ చిందరవందరచేసి పారద్రోలి వాళ్ళ ఆయుధాలూ వాహనాలూ స్వాధీనం చేసుకున్నాడు. అర్జునుడు గొప్ప అందగాడు. అందలోనే‌ కాదు పరాక్రమంలోనూ‌ సాక్షాత్తూ కుమారస్వామినే మించిపోయాడు! అటువంటి వాడైన అర్జునుడు యుధ్ధరంగంలో గొప్పశోభతో‌ ప్రకాశిస్తున్నాడు. ఎందుకంటే ఆ కుమారస్వామితో అనే కాదు ఆయన తండ్రిమీదనే తెగబడి యుధ్ధం చేస్తున్నాడు కదా, అందువల్ల ఆయన శోభ చాలా గొప్పగా ఉందట యుధ్ధంలో.

ఇదీ ఈ‌శ్లోకం లోని భావం.



6, జనవరి 2016, బుధవారం

భారవి చిత్రకవిత్వం ఉన్న కథకు ముందుమాటలు.

భారవిమహాకవి వ్రాసిన కావ్యం కిరాతార్జునీయం. అంటే ఒక కిరాతుడికీ అర్జునుడికీ‌ మధ్య జరిగిన కథ అని స్థూలంగా అర్థం చెప్పుకోవచ్చును. పాఠకలోకానికి ఈ‌ కథ పరిచయం ఉన్నదే. ఇక్కడ కిరాతుడిగా వచ్చి అర్జునుడి పరాక్రమానికి సవాలు విసిరిన వాడు సాక్షాత్తూ పరమశివుడే.

అసలు అలా సవాలు విసరవలసిన అవసరం ఏమి వచ్చిందీ‌ శివుడికి అన్న ప్రశ్న వస్తుంది సహజంగా. అర్జునుడేమో పరమేశ్వరుడి నుండి పాశుపతాస్త్రం కోరుతున్నాడు. ఇవ్వటానికి శివుడి కేమీ‌ అభ్యంతరం లేదు. కాని ఇచ్చే ముందు ఒక పని చేయాలి కదా. యావత్తు ప్రపంచాన్నీ తుదముట్టించే శక్తి కల గొప్ప ప్రమాదకరమైన అస్త్రాన్ని పుచ్చుకుందుకు ఆ అర్జునుడికి అర్హత ఉన్నదా అని పరీక్షించి నిగ్గుతేల్చాలి కదా. ఈ విషయంలో‌ సత్యాసత్యాలు తనకి తెలిసినా యావత్ప్రపంచానికీ‌ కూడా వెల్లడి కావాలి మొదట. ఆ తరువాతనే అస్త్రం తానిచ్చేదీ అతడు పుచ్చుకునేదీను. అయన తగిన సమయం కోసం చూస్తున్నాడు.

దేవతలకు జాతి శత్రువులు రాక్షసులు. దేవతలు లోకోపకారులు. రాక్షసులు లోకాపకారులు. ఇవి వారికి సహజగుణాలు. అందుచేత వాళ్ళ మధ్య వైరమూ అంతే సహజం. అర్జునుడిది దేవాంశ. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఆ దేవదేవుడి అంశ. సాక్షాత్తూ విష్ణువు రెండు రూపాలైన నరనారాయణుల్లో ఒకాయన ఐన నరుడే అర్జునుడు, మరొకాయన ఐన నారాయణుడే శ్రీకృష్ణభగవానుడు. ఆ ఇద్దరూ భూమ్మీదకి వచ్చినది రాక్షసాంశలతో‌ జన్మించి లోకాకారం చేస్తున్న దుర్మార్గులందరినీ‌ హతమార్చి భూభారం తగ్గించటానికి. భూమికి భారం అంటే‌ అధర్మమే అని అర్థం. మరి కొన్నాళ్ళల్లో పెద్ద యుధ్ధం రాబోతోంది. తమ అంశలని తుదముట్టించటానికే వస్తోంది యుధ్ధం అని రాక్షసులకు బాగానే తెలుసు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళూ శక్తికొద్దీ చేస్తున్నారు. అర్జునుడు పాశుపతం అనే జగత్సంహారకాస్త్రాన్ని కోరి శివుడి కోసం తపస్సు చేస్తున్నాడూ‌ అంటే‌ ఆ అస్త్రం సృష్టించబోయే విధ్వంసానికి బలయ్యేది తమవైపు బలగమే అని రాక్షసులకు నమ్మకంగా తెలుసు. అందుకే ఈ అర్జునుడి తపస్సు సఫలం అయ్యేలా ఉంది అనిపించగానే అర్జునుడిని చంపెయ్యాలని అడవిపంది రూపంలో మూకాసురుడు అనే‌ రాక్షసుడు వచ్చాడు. సమయం వచ్చింది అనుకున్నాడు శివుడు.

అర్జునుడు ఆ రాక్షసుణ్ణి చంపలేడా? చులాగ్గా చంపగలడు. మరింకే. శివుడికి అనుమానం లేదు కదా? ఆ రాక్షసుడికి అర్జునుడి చేతిలో మూడిందిలే అని ఊరుకోవచ్చు కదా. ఊరుకుంటే కథేం ఉందీ? ఆయన ఆలోచన వేరేగా ఉంది. ఈ వంక బెట్టుకుని అర్జునుడి సత్తా పరీక్షించాలి అనుకుంటున్నా డాయన. గిల్లి కజ్జా తెచ్చుకుని అర్జునుడి పరాక్రమం ఏపాటిదో చూసి వినోదించవచ్చును. లోకానికీ తెలిసివస్తుంది.

అర్జునుడి తపస్సు లోని ఆంతర్యం మునీశ్వరులకే అంతుబట్టలేదు. అర్జునుడిని శివానుగ్రహం కోరి తపస్సు చేయమనీ‌ పాశుపతం అడగమనీ‌ సలహా ఇచ్చింది సాక్షాత్తూ‌ శచీపురందర ఋషి. అంటే ఇంద్రుడు. ఆయన ఆంతర్యం అందరికీ ఎలా సులువుగా తెలుస్తుందీ? అందుచేత వాళ్ళు  భయపడి, శివుడి దగ్గర ఆ తపస్సు గురించి ప్రస్తావించారు. అప్పుడు శివుడన్నాడు గదా, ఈ‌ అర్జునుడి ప్రయోజనం మోక్షం కాదు. లోకోపకారం. ఇతను నరనారాయణుల్లో నరుడు. శ్రీకృష్ణుడే నారాయణుడు. వీళ్ళిద్దరూ‌ బ్రహ్మదేవుడి ప్రార్థన మేరకు రాక్షసులను చంపి ప్రజల్ని కాపాడ్డానికి భూమిమీద అవతారాలు ధరించారు. ఇప్పుడు మూకాసురుడనే వాడు అర్జునుడినే చంపాలని అడవిపంది వేషంలో‌ వెళుతున్నాడు. దారేబోయే అడవిపందే‌ కదా అని అర్జునుడు పట్టించుకోడు కాబట్టి దగ్గరగా వెళ్ళాక నిజరూపం ధరించి ఆయన్ను చంపాలని వాడి కుయుక్తి. అందరం అర్జునుడి ఆశ్రమానికి వెళదాం రండి. అర్జునుడితో‌ పోటీపడి ఆ పందిని నేనే చంపి అతడితో‌ కావాలని తగాదా పెట్టుకుంటాను. మిగతా కథ అంతా మీరే స్వయంగా చూద్దురు కాని పదండి అన్నాడు.

శివుడి సంకల్పం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది కదా! ఆ అడవిపంది రూపంలోని రాక్షసుడిని అర్జునుడూ బోయవాడి రూపంలో ఉన్న శివుడూ ఒకేసారి బాణాలతో కొట్టటమూ వాడు గిరిగిరా తిరిగి చావటమూ జరిగింది. నా బాణానికి చచ్చాడంటే నా బాణానికే చచ్చాడయ్యా అని శివుడూ అర్జునుడూ గోలగోలగా తగాదా పడ్డారు. చిలికి చిలికి గాలివాన అయ్యింది. యుధ్ధానికి దిగారు. ఒకప్రక్కన బక్కచిక్కిన అర్జునుడు, మరొక ప్రక్కన బోయవాళ్ళ నాయకుడి వేషంలో శివుడూ ఆయన బలగమూ తలపడ్డారు.

ఇదొక చిత్రమైన యుధ్ధం. అర్జునుడి శక్తిని ప్రపంచానికి విదితం చేయటానికి శివుడు లీలా యుధ్ధం చేస్తున్నాడు. అటు శ్రీమహావిష్ణువు అంశ ఐన అర్జునుడు తపస్సు కారణంగా బక్కచిక్కిపోయి ఉన్నా దీపశిఖలాగా ప్రకాశిస్తూ క్షత్రియపౌరుషానికి ఒక బోయవాడు పరీక్షపెట్టటమా అన్న కోపంతో రెచ్చిపోయి యుధ్ధం చేస్తున్నాడు. చిత్రాతిచిత్రమైనది కాబట్టి ఈ‌యుధ్దం భారవిమహాకవి కూడా యుధ్ధవర్ణన అంతా కూడా చిత్రకవిత్వంతో హోరెత్తించాడు.

ఇప్పుడు మనం ఆ చిత్రకవిత్వపు సర్గను పరిశీలించబోతున్నాం.

5, జనవరి 2016, మంగళవారం

భారవి కిరాతార్జునీయంలో చిత్రకవిత్వం తమాషాలు.

నాకు సంస్కృతంలో ఓనమాలు కూడా రాకపోయినా భారవి నాకు అభిమాన కవిశేఖరుడు.

నాకు చిన్నతనంలో హైస్కూల్లో ఆరవతరగతి లోనో యేడవతరగతి లోనో గుర్తులేదు కాని ఏదో పోటీపరీక్షలో బహుమగా వచ్చిన ఒక పుస్తకం పేరు ఆదర్శకథావళి. అందులో భారవి కథ కూడా ఉంది. అది నాకు బాగా నచ్చింది. ఎంత బాగా అంటే ఇప్పటికీ సవిస్తరంగా అది జ్ఞాపకం ఉంది. ఆ పుస్తకంలో ఇంకా‌ భీష్ముడు, ధృవుడు, ప్రహ్లాదుడు వంటికథలు చాలానే ఉన్నాయి.

ఈ మధ్యకాలంలో శ్రీ కష్టేఫలీ బ్లాగు శర్మగారు కూడా భారవి గురించి ఒక టపా వ్రాసారు. ఆ టపా క్రింద నేనొక వ్యాఖ్యనూ  ఉంచాను.

ముందుగా ఆదర్శకథావళి పుస్తకంలోని భారవి కథను కొంచెం క్లుప్తంగా చెబుతాను. చాలా కాలం కావటం వలన అక్కడక్కడా నా ఊహలు చోటుచేసుకొని ఉండవచ్చును కాని కథా క్రమం‌ అంతా ఆ పుస్తకం లోనిదే!

భారవి నవయువకుడిగా ఉన్నరోజుల్లోనే అతడి కవిత్వానికి కవిపండితలోకం‌ బ్రహ్మరథం‌ పట్టింది. ఐనా భారవి మనస్సులో అసంతృప్తి. అందరూ తనను ఆకాశాని కెత్తేస్తుంటే, తండ్రి మాత్రం, "ఆఁ కుర్రవాడు. వాడికేం‌ తెలుసులెండి. ఏదో గిలుకుతున్నాడు" అని తేలిగ్గా మాట్లాడేవాడు. ఒకరోజున రాజసన్మానం అందుకున్నాడు భారవి. ఇంటికి వచ్చి తల్లితో తన ఆనందం‌ పంచుకున్నాడు. ఈ‌ సారైనా నాన్నగారు అభినందిస్తారని నమ్మకంగా గంపెడాశ పెట్టుకున్నాడు. తీరా నాన్నగారు ఇంటికి వచ్చి సంగతి విని, "ఆహాఁ అలాగా" అని చప్పరించేసాడు. ఒళ్ళు మండిపోయింది భారవికి.

తనని చూసి అసూయతో‌ మెచ్చక తేలిగ్గా తీసుకొనే‌ తండ్రి నెత్తిన ఒక బండ పడేస్తే పీడా పోతుందని కోపంగా, పచ్చడిబండ తీసుకొని అటక యెక్కి కూర్చున్నాడు మంచి సమయం కోసం‌ చూస్తూ. అన్నం వడ్డిస్తూ‌ తల్లి "భారవిని కాస్త మెచ్చుకుంటే మీ‌ సొమ్మేం‌ పోతుందండీ, పిచ్చి సన్నాసి ఎంత ఎదురుచూసాడో మీరో మంచి మాట అంటారనీ" అని అడిగింది. దానికి తండ్రి గారు చిన్నగా నవ్వి "వాడేమీ‌ నొచ్చుకోడే. తండ్రిని నేనే వాణ్ణి పొగిడితే వాడికి ఆయుక్షీణం అని వాడికి మాత్రం‌ తెలియదా, వాడి కంటే గొప్ప కవి ఉన్నాడా ఈ లోకంలో నేడూ" అన్నారు. భారవికి తలతిరిగిపోయింది. దిగివచ్చి కన్నీళ్ళతో‌ తండ్రి పాదాలపై బడి తాను పొరబడ్డాననీ, అకృత్యానికీ‌ సిధ్ధపడ్డాననీ విన్నవించుకున్నాడు. నన్ను శిక్షించండి" అని తలవంచుకున్నాడు.  ఫరవాలేదు లేరా అంటే వదలడే. అప్పుడు నాన్నగారు "సరే అబ్బాయీ, నువ్వూ మీ‌ఆవిడా ఒక సంవత్సరం మీ‌ అత్తారింట్లో‌ ఉండి రండి" అన్నాడు.

ఇదేం శిక్షా? అనుకున్నాడు భారవి. వెంటనే తన భార్య చారుమతితో‌సహా , మావఁగారు  అన్నంభట్టు ఇంటికి చేరుకున్నాడు.  అంతా మహామర్యాద చేసారు. తమ ఊళ్ళో భారవి పేరు ఎలా మారుమోగుతోందో తమకు ఎంత గర్వంగా ఉందో‌ ఒకటికి పదిసార్లు చెప్పారు. భారవికి సంతోషం‌ కలిగింది. మొదటినాడు ముత్యపు చుట్టం, రెండవనాడు రత్నపు చుట్టం, మూడవనాడు మురికి చుట్టం అన్నారు కదా. రోజులు గడవటంతో మెల్లగా మర్యాదలు మాయమైనాయి. అల్లుడుగారి రాకకు కారణం అడిగితే సమాధానం లేదు. అన్నంభట్టంతవాడే చీదరించుకున్నాడు. మెల్లగా పొలంపనులు పాలేరు పనులూ‌ అప్పగించారు. భారవికి తండ్రిగారు వేసిన శిక్ష ఏమిటో మెల్లగా అవగాహనకు వచ్చింది.

ఒకరోజున చారుమతి పొలానికి అన్నం తీసుకొని ఎప్పటి లాగానే వచ్చి, తటపటాయిస్తూనే కన్నీళ్ళతో చెప్పింది. నా పరిస్థితి బాగోలేదు. రేపు వరలక్ష్మీవ్రతం. చేసుకొనే యోగం లేదు. వదినలు వైభవంగా చేసుకుంటున్నారు ఏర్పాట్లు. నా చేతిలో చిల్లిగవ్వ లేదు. కనీసం‌ కొత్తచీరైనా కొనలేను కదా అంది. భారవి మ్రాన్పడ్డాడు. కొంచెం ఆలోచించి చిరునవ్వుతో‌ "ఈ వూళ్ళో వరహాలసెట్టి నా మిత్రుడని నీకూ‌ తెలుసు కదా. అతడిని అడిగి డబ్బులూ సరకులూ కావలసినంత తెచ్చుకో ఆనక నేను తీర్చుతాను. పైగా ఇంకొక మాట, ఊరికే తీసుకుంటే బాగోదు కదా, ఆతనికి ఇదిగో‌ ఈ‌ శ్లోకం తాకట్టు పెట్టు. నేను ఒక కావ్యం వ్రాస్తున్నానులే దానిలోనిది. సరేనా నిశ్చింతగా వెళ్ళిరా" అన్నాడు.

వరహాల సెట్టి శ్లోకాన్ని కళ్ళకద్దుకుని, "సమయానికి వచ్చారు. రేపుండే వాణ్ణి కాదు ఊళ్ళో. కావలసినంత తీసుకోండి అసలు తాకట్టెందుకూ‌" అన్నాడు. వరలక్ష్మీ వ్రతం బ్రహ్మాండంగా చేసుకుంది చారుమతి. వదినలకూ‌ అన్నలకూ‌ మరి నోట మాట రాలేదు. 

వరహాలసెట్టి సముద్రవ్యాపారానికి మర్నాడే కాబోలు వెళ్ళిపోయాడు. సంవత్సరం గడువూ‌ ముగిసిన తక్షణం మొగుడూ పెళ్ళాలు ప్రయాణమయ్యారు. ఆన్నివిషయాలనూ‌ అత్తింటివారికి చెప్పి వాళ్ళ క్షమాపణలూ‌,ఘనసన్మానాలూ అందుకొని భారవి వెళ్ళిపోయాడు. శ్లోకం సెట్టిగారి దగ్గరుంది. ఆయనేమో‌ నెలలుగా అజాపజా లేడు. నెలలు సంవత్సరాలయ్యాయి.

సెట్టిగారు సముద్రవ్యాపారంలో ఓడములిగి చచ్చీ‌చెడీ ఎదో‌ ద్వీపం చేరాడు. అక్కడి వాళ్ళ భాష మనకి తెలియదు. మెల్లగా అక్కడే చచ్చినట్లు ఉండిపోయి, పధ్ధెనిమిదేళ్ళ తరువాత ఏదో‌ ఓడ అక్కడికి రావటమూ వాళ్ళకు తన భాష తెలియటమూ జరిగి, బ్రతుకు జీవుడా అని ఒక రాత్రిపూట స్వస్థలం చేరాడు. పెళ్ళాం సంతోషం‌ చెప్పతరమా.  తన సంతోషం చెప్పతరమా? కాని, ఇంట్లో ఎవడో నవయువకుడు! భార్యలను నమ్మరాదు అని బాధపడ్డాడు. ఆవేశం‌ అణచుకోలేక ఒక చూరున ఉన్న కత్తిని బయటకు లాగాడు ఒరతో సహా. ఏదో తాళపత్రం పట్టుబట్టలో చుట్టి ఉన్నది బయట పడింది. దాన్ని తీసి చదివాడు.

    సహసా విదధీత న క్రియా
    మవివేకః పరమాపదాం పదం
    వృణుతే హి విమృశ్యకారిణం
    గుణలుబ్ధా స్స్వయమేవ సంపదః -
 
ఆ శ్లోకం భావం తలకెక్కింది అంత కోపం లోనూ. ఆ శ్లోకం చెబుతోంది. కేవలం సాహసించి యే పనయినా చేయరాదు. అవివేకం వలన అతిప్రమాదకరమైన ఆపదలు కలుగుతాయి. బాగా మంచీ చెడు విచారించి పనిచేయటం ఉత్తమం. అటువంటి గుణవంతులను సంపదలు స్వయంగా వచ్చి చేరుతాయి అని. అవును, రేపు వివరం కనుక్కున్నాకే ఏం‌ చేయాలో ఆలోచించవచ్చును అని శాంతించాడు.

తెల్లవారింది. ఊరంతా అబ్బురంగా చెప్పుకున్నారు. అందరూ ఆ అమ్మ చలవ అన్నారు. సెట్టికి మండిపోతోంది. ఆయమ్మ చలవ అడిగో ఆ మంచం మీద కూర్చున్నాడు అని ఆ అబ్బాయిని చూపించాడు. విషయం అర్థం ఐన ఒక పెద్ద ముత్తైదువ ఇలా అంది. "సెట్టీ, నువ్వు ఓడ మీద పోయే నాటికే మీ ఆవిడకు నెలలు నిండుతున్నాయి కదా. ఆ బిడ్డ వీడే‌నయ్యా" అంది. సెట్టి తలతిరిగిపోయింది.  ఎంతపెద్ద పొరపాటైపోయిందీ. ఎంత ప్రమాదం తప్పిందీ. ఆ శ్లోకం రక్షించకపోతే ఇంకే మన్నా ఉందా! అనుకున్నాడు.

వార్త తెలిసి భారవి కూడా వచ్చి సెట్టిని అభినందించి. "పైకం ఇదిగో‌నయ్యా నా శ్లోకం‌ తిరిగి ఇవ్వు. అది నా  కిరాతర్జునీయ కావ్యం‌ ద్వితీయ సర్గ లోనిది. నువ్వు ఎప్పటికైనా వస్తావని ఎదురుచూస్తున్నాను. నీకు తాకట్టు పెట్టిన శ్లోకం చేర్చకుండా కావ్యాన్ని ఎలా ప్రకటించేదీ? నీ రాక కోసమే వెయ్యి కళ్ళతో‌ ఎదురుచూస్తున్నా" అన్నాడు. సెట్టి భారవి కాళ్ళ మీద పడి, "కవిగారూ, మీ‌ శ్లోకం పుణ్యమా అని నా ఇల్లు నిలబడింది." అని జరిగిందంతా కవికి విన్నవించి తానే భారవికి అఖండ సన్మానం చేసి శ్లోకంతో‌ సహా బ్రహ్మాండంగా ఊరేగించి పంపించాడు.

ఇదండీ‌ భారవి మహాకవి కథ.  మనసు పెట్టి ఒక సారి ఆలోచించి చూస్తే ఈ‌ కథలో మనకు పనికి వచ్చే విషయాలు బోలెడన్ని ఉన్నాయి.

భారవి వరహాల సెట్టికి తాకట్టు పెట్టినది కిరాతార్జునీయం‌ అనే ఆయన సంస్కృత కావ్యంలోని రెండవ సర్గలో 30 శ్లోకం. మహా అద్బుతమైన కావ్యం అది. 

కిరాతుడి రూపంలో వచ్చిన శివుడికీ‌, శివానుగ్రహంకోసం తపస్సు చేస్తున్న అర్జునుడికీ మధ్యన జరిగిన యుధ్ధం గురించిన ఘట్టాన్ని ఆ కావ్యంలో‌ భారవి మహాకవి చిత్రకవిత్వంతో‌ నింపి బ్రహ్మాండంగా వ్రాసాడు. అది ఆ కావ్యంలోని పదిహేనవ సర్గ.  

ఆ సర్గలో ఉన్నవి 53 శ్లోకాలు.  రోజుకు ఒక చిత్రకవిత్వం కల శ్లోకం చొప్పున ఆ తమాషా కవిత్వం అంతా ఆస్వాదిద్దాం.