28, ఫిబ్రవరి 2022, సోమవారం

గరికపాటి వారిని కించపరచటం గురించి.....

ఎప్పుడో పదహారేళ్ళ క్రిందట ఏదో‌ ప్రవవనంలో గరికపాటి వారు అన్న కొన్ని మాటలు విశ్వబ్రాహ్మణుల మనోభావాలను గాయపరచాయట.

ఎవరినో కించపరచే ఉద్దేశంతో గరికపాటివారు మాట్లాడే అవకాశం లేదు.

కానీ పదహారేళ్ళ తరువాత ఇప్పుడు మనోభావాలు గాయపడటం ఏమిటీ? 

ఇన్ని సంవత్సరలలోనూ ఏవిశ్వబ్రాహ్మణులూ ఈమాటలు విననే లేదా? ఇన్నాళ్ళూ గాయపడని మనోభావాలు ఇప్పుడు గాయపడటం ఏమిటో. ఒక మాయలాగా ఉంది.

గరికపాటి వారికి పద్మశ్రీ పురస్కారం వచ్చి నెల అయిందో లేదో.  ఇంతలో ఈవిధంగా మనస్తాపం కలిగింది.

ఇది ఎవరో కావాలని లేవనెత్తిన వివాదంలా అనిపిస్తోంది.

ఈ‌ వివాదం సందర్భంగా చివరకు గరికపాటి వారు విశ్వబ్రాహ్మణుల మన్నన కోరవలసి వచ్చింది. ఈ క్రింది వీడియోను తిలకించండి. (ఈ వీడియోను మీరు యూట్యూబులో చూడవలసి ఉంటుంది. వేరే సైట్లలో అది నేరుగా నడవదు!) ఆయన నిజంగా ఎంత క్షోభపడ్డారో తెలుస్తున్నంది. పదిమంది హితమూ‌ కోరి ప్రవచనం చేసే సరస్వతీమూర్తికి ఇలాంటి అవమానం జరగటం దుస్సహం.


 

అసలు ఇదంతా ఒక దురదృష్టకరమైన సంగతి. 

      గరికపాటి కింత కష్టంబు కలిగించి
      యెవరు సంతసించి యెగిరి రట్టి
      వారు పొందగలరు రౌరవనరకంబు
      వారి వంశములును వసుధ నణగు
 
సరస్వతీమూర్తిని అవమానించి ప్రవర్తించిన వారికి జరిగేది అంతే. విధిని ఎవరూ తప్పించలేరు.


26, ఫిబ్రవరి 2022, శనివారం

పరమపురుష హరి రామయ్యా

పరమపురుష హరి రామయ్యా నీ
        సరివా రెవ్వరు రామయ్యా 
కరుణ గలాడవు రామయ్యా మము
        కరుణించవయా రామయ్యా
 

తరణికులంబున రామయ్యా ఈ
        ధ‌రను పొడమితివి రామయ్యా
సురలను బ్రోవగ రామయ్యా ఒక
        నరుడ వైతివట రామయ్యా
హరి నరు డగుటను రామయ్యా ఆ
        సురారు లెఱుగరు రామయ్యా
ఎఱిగి మునీంద్రుడు రామయ్యా నీ
        గురువై నిలిచెను రామయ్యా
 
హరు విల్లెక్కిడ రామయ్యా స
        త్వర మది విరిగెను రామయ్యా
ధరణిజ ముదమున రామయ్యా నిను
        వరియించెను భళి రామయ్యా
పరశురాముడును రామయ్యా నిను
        హరివని యెఱిగెను రామయ్యా
తరుణి సీతతో రామయ్యా నిజ
        పురమున నుంటివి రామయ్యా

వనముల కంపెను రామయ్యా నీ
        పినతల్లియె నిను రామయ్యా
వనమున సీతను రామయ్యా రా
        వణుడు మ్రుచ్చిలెను రామయ్యా
వననిధిని దాటి రామయ్యా రా
        వణుని జంపితివి రామయ్యా
జనకాత్మజతో రామయ్యా భూ
        జనుల నేలితివి రామయ్యా


24, ఫిబ్రవరి 2022, గురువారం

పొగడరేలనో మీరు బుధ్ధిమంతులారా

పొగడరేలనో మీరు బుధ్ధిమంతులారా
జగదీశుని రాముని చక్కగ మనసారా

పొగడెద రేలా మీరు బుధ్ధిహీనులను తుళువ
లగు వారి సి‌‌రులపై యాశతో ననిశమును
పొగడితే హరి మీకు తగు ధనము లీయడా
పగవాడా యేమి యీ భగవంతుడు

పొగడెద రేలా మీరు పొలతికల మూన్నాళ్ళ
సొగసులను వెఱ్ఱులై చోద్యంబుగా దోచు
జగమున హరి కంటెను సొగసరు లున్నారా
పొగడితే రామునే పొగడవలయును

పొగడెద రేలా స్వల్ఫభోగములను దేవతల
నగచాట్లు పడుచు జపయాగాదుల నెఱపుచు
తగినసౌఖ్యము లడుగ తగునుగా దైవమునే
భగవంతునితో మీకు పంతమున్నదా


23, ఫిబ్రవరి 2022, బుధవారం

రామ రామ అంటే చాలదా నీకు శ్రీరాముని దయ ఉంటే చాలదా

రామ రామ అంటే చాలదా నీకు శ్రీ
రాముని దయ ఉంటే చాలదా

నానాయోనులను బుట్టి నానాయాతనలు పడి
యీనాటికి మనిషివైతి వింతే చాలదా నీకు 
మానవజన్మము సద్వినియోగ మైతే అంతే చాలదా 
నీనోటిగూటి చిలుక నియతముగ ప్రేమతో 

మరలమరల యిటువలెనే మనిషిజన్మ దొరుకునా
మరల దొరకినను బుధ్ధిమంతుడవే యదుదువా
హరిపై గురి కుదిరిన దిప్పుడు అహా అంతే చాలదా
నిరంతరము జీవుడా నీవెంతో ప్రేమతో

కుదిరిన గురి కుదిరినట్లె కుదురుగా నుండగా
మదిలో శ్రీరామునిపై మమత మాయ కుండగా
నిదురను గూడ రాముని నామము వదల కుండిన చాలదా
సదమలచిత్తమున నెప్పుడు చక్కగా ప్రేమతో

22, ఫిబ్రవరి 2022, మంగళవారం

శ్రీరామ శ్రీరామ శ్రీరామా భవతారకనామా శ్రీరామా

శ్రీరామ శ్రీరామ శ్రీరామా భవతారకనామా శ్రీరామా

నారాయణ హరి శ్రీరామా జగన్నాథ పరాత్ప‌ర శ్రీరామా


నారదాదిమునినాయకసన్నుత శ్రీరఘునాయక శ్రీరామా

దారుణదైత్యకులాంతకవిక్రమ దశరథనందన శ్రీరామా

మారజనక సుకుమారవపుష హరి మానవనాయక శ్రీరామా

ధారాధరఘనశ్యామవపుష వరదాయక శుభదా శ్రీరామా


మునిగణయాగవివర్ధనకారణ మోహవిదారణ శ్రీరామా

జనకసుతాహృదయాలయవిహరణ సద్గుణధామా శ్రీరామా

దినకరకోటిసమానప్రకాశా దేవదేవ హరి శ్రీరామా

వనరుహలోచన వనమాలాధర వననిధిబంధన శ్రీరామా


ఘనపాపాంతక ఘనతాపాంతక ఘనశాపాంతక శ్రీరామా

వనజాసననుత వాసవసన్నుత త్రినయనసన్నుత శ్రీరామా

దినపతికులపతి దైవతకులపతి జనపతికులపతి శ్రీరామా

నను కరుణించుము నాస్వామీ కరుణాక‌ర శ్రీకర శ్రీరామా


సందియమెందుకె మనసా శ్రీరఘునందను జేరవే

సందియమెందుకె మనసా శ్రీరఘునందను జేరవే
అందరి వాడా రాముడు మనసా ఆశ్రయించవే

శ్రీరఘురాముని సీతానాథుని సేవించగదే మనసా
కారుణ్యాలయు డాతడు మెచ్చిన కలుగును మోక్షము మనసా
ధరపై రామున కన్యదైవమును తలపగరాదే మనసా
పరమాత్ముడు శ్రీరామచంద్రుడని మరువగరాదే మనసా

సర్వవేళలను సాకేతపు‌రసార్వభౌమునే మనసా
సర్వవిధములుగ సేవించుటయే చాలమంచిదో మనసా
సర్వము రామమమయంబని యెఱిగిన శాంతి కలుగునే మనసా
గర్వాదికములు తాపత్రయములు కనుమరుగగునే మనసా

మున్ను సుజను లీభక్తిమార్గమున పోయితరించిరి మనసా
తన్ను నమ్మినవారికి దశరథతనయుడు సులభుడు మనసా
వెన్నవంటిదా రాముని హృదయము వేడి తరించవె మనసా
కన్నతండ్రి రఘురాము డెన్నడును కాదనబోడే మనసా

21, ఫిబ్రవరి 2022, సోమవారం

పదిలక్షలు దాటిన శ్యామలీయం వీక్షణల సంఖ్య!

 
 
వీక్షణల సంఖ్య యిదిగో
లక్షలు లక్షలుగ పెరిగి లక్ష్యం బనుచున్
లక్షణముగ చేరెను పది
లక్షల శిఖరాగ్రమునకు రామా కనుమా 


రామరామ రామరామ రామరామ రామరాం

రామరామ రామరామ రామరామ రామరాం
రామరామ రామరామ రామరామ రామరాం

భూమిమీద కొడుకంటే రాముడందు రామరాం
భూమీశుడు దశరథుడే పొగడునిట్లు రామరాం
భూమిమీద యన్నయన్న రాముడందు రామరాం
సౌమిత్రియె యీమాటకు సాక్ష్యమందు రామరాం
 
భూమిమీద భర్తయన్న రాముడందు రామరాం
భూమిజాత సాక్ష్యమందు నీమాటకు రామరాం
భూమిమీద మిత్ర్రుడన్న రాముడందు రామరాం
ప్రేమమీఱ సుగ్రీవుడు పేర్కొనునిటు రామరాం
 
భూమిమీద దైవమన్న రాముడందు రామరాం
సామీరియె సాక్ష్యమిచ్చు నీమాటకు రామరాం
శ్రీమన్నారాయణుడే రాముడందు రామరాం
కామారి సాక్ష్యమిచ్చు నీమాటకు రామరాం

19, ఫిబ్రవరి 2022, శనివారం

వినుడు మా ఆనందము వివరించెదము

వినుడు మా ఆనందము వివరించెదము
జనులార మాకదే చాలు చాలు

హరియేమి యిచ్చినా ఆనందము మాకు
హరియేమి గైకొన్న ఆనందము
హరేరామ యనుటయే ఆనందము మాకు
హరేకృష్ణ యనుటయే ఆనందము

హరినామధ్యానమే ఆనందము మాకు
హరిపాదసేవనమే ఆనందము
హరిని కీర్తించుటే ఆనందము మాకు
హరిని భావించుటే ఆనందము

హరిభక్తుల దర్శనమే ఆనందము మాకు
హ‌రిభక్తుల జేరుటే ఆనందము
హరిభక్తుల పొగడుటే ఆనందము మాకు
హరిభక్తుల గొల్చుటే ఆనందము

18, ఫిబ్రవరి 2022, శుక్రవారం

భక్తిసముద్రంలో ప్రజాయుధ్ధనౌక మునిగిపోతేనేమీ?


ఈ రోజున ఆంధ్రజ్యోతి పత్రికలో రంగనాయకమ్మ గారి వ్యాసం ఒకటి  భక్తి సముద్రంలో మునిగిపోయిన ‘ప్రజాయుద్ధ నౌక' అన్న శీర్షికతో వచ్చింది.

ఈమధ్య గద్దర్ గారి ధోరణిలో కొట్టవచ్చినట్లు కనిపించిన మార్పు ప్రజానీకానికి ఆశ్చర్యం కలిగించిన మాట వాస్తవం. అయన దైవసంకీర్తనం చేస్తూ టీవీలో కనిపిస్తారని కలలో కూడా మనం ఊహించలేదు కదా.

రంగనాయకమ్మ గారు ఆశ్చర్యపోయి ఊరుకోలేదు మనలాగా.

మనం మెచ్చుకునే కవి, అతని మాటలకే, రాతలకే విరుద్ధంగా తిరిగితే, విమర్శించక మానకూడదని చిరాకుపడి ఆయన్ని అక్షేపించటానికి ఈవ్యాసం వ్రాసారు.

అయనలో వచ్చిన ఈ మార్పునుమెచ్చుకుంటూ‌ ఎవరైనా వ్యాసాలు గట్రా వ్రాసారేమో తెలియదు. నాదృష్టికి ఐతే రాలేదు.

రంగనాయకమ్మ గారి వ్యాసంలో ముఖ్యమైన విషయాలు సంక్ష్హిప్తంగా.  

గద్దర్ మొదట్లో చొక్కా కూడా ధరించే వాడు కాదు. అది ఎబ్బెట్టుగా అనిపించి 2004లో రంగనాయకమ్మగారు ఒక వ్యాసంలో ప్రస్తావిస్తే ఆతరువాత నుండీ ఆయన చొక్కా ధరించటం మొదలు పెట్టాడు. 

నేడుగద్దర్ రియల్ ఎస్టేట్ వ్యాపారులూ, పాలకవర్గాల స్వాముల వాళ్ళూ, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాధినేతలు కలిసి తలపెట్టిన భక్తి టూరిజానికి ప్రచారకుడిగా గద్దరు తయారయ్యాడు చూడండి, అది చూసి ఎందరో బాధపడుతూ ఉంటే చూడలేక మళ్ళా రంగనాయకమ్మ గారు ఈవ్యాసం వ్రాస్తున్నారు.

గద్దర్‌ను అనుసరించి ఎందరో మా జీవితాలు ఆగమైపోయాయి అనుకుంటున్నారు. ఇప్పుడు రామ జపం, క్రిష్ణ జపం, రామానుజ జపం చేస్తున్నాడే గద్దర్ అని జనఘోష.  గతంలో ప్రత్యేక తెలంగాణ రావాలని భద్రాచలంలో, సీతమ్మ తల్లిని గద్దర్ మొక్కుకున్నాడని  ఒక వార్త కూడా ఉంది. 

రంగనాయకమ్మ ఆంటారూ, ". నిన్న ఏకంగా, జీయరు చానల్ అని అనధికారికంగా పిలిచే ఒక టీవీ చానల్లో, ఏం జరిగిందో చూశాను! భక్తి పారవశ్యంలో మునిగాడు గద్దరు. అతడు చేసిన ప్రశంసా వాక్యాల్నీ, భజన కీర్తనల్ని గుర్తు చేసే మైలు పొడవు పాటనీ విన్నాను. అంటే, ఒక నాటి ప్రజాయుద్ధ నౌక, ఈ నాడు భక్తి సముద్రంలో మునిగి పోయిందన్న మాట!" అని

రంగనాయకమ్మ గారి ఉద్దేశ‌ం‌ ప్రకారం, ఏఁ, ఒక మనిషికి అభిప్రాయాలు మార్చుకునే హక్కు లేదా? అభిప్రాయాలు మారవా?’ అని గద్దరో, అతడి భక్తులో, అడగొచ్చు. తప్పకుండా, ఆ హక్కు వుంది. ఉంటే, తగిన కారణం చెప్పాలి!‘ఒకప్పుడు వీర విప్లవ కవిత్వ నినాదాలు ఇచ్చి, గానాలు చేసి, ఇప్పుడు ఇలా పాలకవర్గ ఆధ్యాత్మిక సేవకుడైనావేమీ?’ అని విమర్శలతో అడిగే హక్కు, అతడి వెనకటి అభిమానులకు కూడా వుంటుంది.

ఇక్కడ ఇటువంటి మార్పును మనం ఇదివరలో చూడలేదా ఎక్కడా అని ఒక్కసారి ఆలోచిద్దాం.

విప్మవకారుడిగా బందిఖానాకు వెళ్ళిన అరవింద ఘోష్ అక్కడి నుండి యోగి అరవిందులుగా బయటకు వచ్చాడు.  అయన్ని నిజానికి తన తండ్రి విదేశాల్లో ఉంచి భారతీయ వాసనలు అంటి పాడైపోకుండా ఉండాలని ఆశించి ఎంతో కట్టుదిట్టాలు చేసి పెంచాడు. కాని విధి, అరవిందుణ్ణి ఋషిని చేసింది.

చలం సాహిత్యం ఎంత అలజడి రేపిందో అందరికీ తెలుసు. చివరికి పదిమందికీ తెలిసేలా అయన పుస్తకాలు చదవటానికి కూడా అరోజుల్లో జనం భయపడే వారని విన్నాను. స్త్రీస్వాతంత్ర్యం అంటూ గోలగోలగా దాదాపు విశృంఖల శృంగారం వ్రాసిన చలం చివరకు రమణాశ్రమంలో చేరాడు. తానంత వరకూ వ్రాసినదంతా ప్రక్కకు త్రోసి పారేసాడు. మీకి తెలుసా? భగవద్గీతకు మంచి వ్యాఖ్యను కూడా వ్రాసాడు. గీతాంజలిని కూడా తెలుగు చేసాడనుకుంటాను.

తన అభిప్రాయాలు మారితే దానికి ఎవరు కాని ప్రజాబాహుళ్యానికి ఎందుకు సమాధానం చెప్పుకోవాలీ? చలం తన అభిమానులకు సమాధాన‌ం ఎమని చెప్పాడూ? అరవిందుడు విప్లవకారులకు క్షమాపణ ఏమైనా చెప్పాడా?

ఈరోజున గద్దర్ నిజంగా భక్తి మార్గం పట్టి ఉంటే అదేదో‌ అనిదంపూర్వం అన్నట్లు రంగనాయకమ్మ ఆక్షేపించటమూ గోలపెట్టటమూ పొరపాటు.


17, ఫిబ్రవరి 2022, గురువారం

పరవశించి సుజనులార భజనచేయరే

పరవశించి సుజనులార భజనచేయరే
హరేరామ హరేకృష్ణ యనుచు పాడరే
 
పుంసాంమోహనరూప పురుషోత్తమ శ్రీరామ
హింసావిదూరహరి ఇనకులవిభూషణ యని
సంసారపంకవిశోషణభాస్కర శ్రీకృష్ణ
కంసాదిదానవగణధ్వంసనబహునిపుణ యని

నిరుపమానందకంద నిర్మోహ నిరంజన యని
పరమేశ్వర సుప్రకాశ భక్తజనాశ్రయ యని
పరంతప పరాత్పర సురాసురైకవంద్య యని
కరుణామయ నిరుపమానఘనవిక్రమశోభిత యని 

కలియుగమున హరినామము కన్న రక్ష లేద కద
పలికినచో హరినామము భవబంధము తెగును కద
నలువ యిచ్చిన నాలుకకు నారాయణ యనిన కద
ఫలము దక్కు సుజనులార భజనచేయండి మీరు
 

13, ఫిబ్రవరి 2022, ఆదివారం

ఘోరసంసారమహాకూపమగ్నుల మయ్య

ఘోరసంసారమహాకూపమగ్నుల మయ్య
శ్రీరఘురామ మము చేదుకోవయ్య
 
ఇచట నజ్ఞానతిమిర మెపుడు తొలగకున్నది
ఇచట కామాదిసర్పగణము కఱచుచున్నది
ఇచటనుండి వెడలుదారి యెఱుగరాకున్నది
ఇచట నీదు కృప గాక యేమి దిక్కున్నది
 
మమ్మిందు పడవేసిన మహితశక్తి యేదో
మమ్మేటికి ద్రోచెనదో మరియీ బావిలో
వమ్ముపఱచె మాబ్రతుకులు భగవంతుడా మే
మెమ్మెయి నీదయలేక యిది వెడలుదుము
 
భక్తులము సంసారవిరక్తులము కాని మేమ
శక్తులము బయటపడగ చక్కగ నిను జేరగ
యుక్తి వేరొండు లేదు యుచితమనుచు నీవే
ముక్తులముగ జేయవయ్య మోమాట మేల


11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

నమోస్తుతే జానకీనాయక శ్రీరామ

నమోస్తుతే జానకీనాయక శ్రీరామ
నమోస్తుతే లోకైకనాయ శ్రీరామ
 
వాసవాదివినుత రామ దాసపోష నమోస్తుతే
దాసహృన్నివాస రామ దాశరథీ నమోస్తుతే

దాశరథీ రామచంద్ర నాశరహిత నమోస్తుతే
నాశరహితదివ్యకీర్తి నారాయణ నమోస్తుతే
 
నారాయణ సంసా‌ర నివారణ హరి నమోస్తుతే
వారణేంద్రవరద దానవా‌రి శౌరి నమోస్తుతే

వారిజాక్ష లోకావనపరాయణ నమోస్తుతే
పరాత్ప‌ర యోగిరాజవందిత హరి నమోస్తుతే

వందితనారదాదిమునిబృంద హరి నమోస్తుతే
బృందారకజనవాంచితఫలదాయక నమోస్తుతే

ఫలాపేక్షరహితసుజనపాలనచణ నమోస్తుతే
పాలితబ్రహ్మాండజాల పరమపురుష నమోస్తుతే

9, ఫిబ్రవరి 2022, బుధవారం

సదయహృద శ్రీరామచంద్ర కటాక్షించుమా

సదయహృదయ శ్రీరామచంద్ర కటాక్షించుమా నీ
పదాంభోజయుగళి నమితభక్తి గొలుచువాడరా

పదవులపై మోహములను సదయ తొలగించుమా హరి
పెదవులపై మోహములను సదయ తొలగించుమా అం
గదములపై మోహములను సదయ తొలగించుమా దు
ర్మదము నాలో చొరగ నీక సదయ కాపాడుమా

నిదురతో పనిలేని యటుల సదయ దీవించుమా సం
పదలతో పనిలేని యటుల సదయ కావించుమా ఆ
పదలు నను  తాకగ నీక సదయ రక్షించుమా నా
హృదయసింహ పీఠిక మీద సదయ భాసించుమా

విదుల సత్సాంగత్యము నాకు సదయ కల్గించుమా నీ
పదములే ధ్యానించు నటుల సదయ నన్నుంచుమా సొం
పొదవగా నీకీర్తి నుడువ సదయ నను చేయుమా నీ
పదమునే నేచేరు నటుల సదయ మన్నించుమా

8, ఫిబ్రవరి 2022, మంగళవారం

రామా రామా మేఘశ్యామా

రామా రామా మేఘశ్యామా శ్రీమదయోధ్యాపురధామా
తామసహర భవతారకనామా ధర్మస్వరూపా శ్రీరామా

శ్రీగరుడధ్వజ దనుజవిరామా యోగిరాజహృదయేప్సిత ధామా
సాగరకన్యాహృదయారామా నాగశయన హరి శ్రీరామా

జనపతి దశరథనందన రామా మునిపతిమఖసంరక్షక రామా
జనకసుతాహృదయేశ్వర రామా నను కరుణించుము శ్రీరామా
 
రాకాచంద్రనిభానన రామా భీకరరావణసంహర రామా 
లోకాధీశ్వరసన్నుత రామా నీకు మ్రొక్కెదను శ్రీరామా

సకలభూతహితకారక రామా సకలజగత్ప్రియపావన నామా
సలకాభీష్టప్రదాయక రామా ఇక భవముడుపుము శ్రీరామా3, ఫిబ్రవరి 2022, గురువారం

నిత్యము సుజనులు నీకు మ్రొక్కేరు

నిత్యము సుజనులు నీకు మ్రొక్కేరు
సత్యము సత్యమిది జానకిరామ

ధనమున్నదని మదము తలకెక్కని వారు
ధనములేదని చింత దాల్చనివారు
ధనముల కితరులకు తలవంచని వారు
ధనమన్న సద్భక్తి ధనమను వారు

పరులు మెచ్చిరేని గర్వపడకుండెడి వారు
పరులు మెచ్చరేని చింతపడని వారు
పరులను సేవించి బ్రతుకకుండు వారు
హరిసేవయే పరమార్ధమను వారు

పామరులను కూడ భావించని వారు
పామరులు తిట్ట చింతపడని వారు
కామాదులయం దరతి కలిగినట్టి వారు
రామనామభజనారతి గల వారు

1, ఫిబ్రవరి 2022, మంగళవారం

ఆంధ్రయోగీంద్రులు అవధూత వ్యాసమూర్తి సిధ్ధాంతి గారి జోస్యం కరోనా గురించేనా?

 
శ్రీ బి. రామరాజు గారు తమ కుమార్తె రుక్మిణి సహాయంతో ఆంధ్రయోగులు అనేకమందిని గురించి సమగ్రమైన పరిశోధన చేసి"ఆంధ్రయోగులు" అన్న ఆరు సంపుటాల ఉద్గ్రంథాన్ని రచించారు. అది చాలా ప్రసిధ్ధి చెందింది.

అంధ్రయోగులు గ్రంథంలోని మూడవ సంపుటంలో శ్రీ అవధూత వ్యాసమూర్తి సిధ్ధాంతి గారి గురించిన వ్యాసం ఉంది. అది ఆసంపుటిలో‌24వ వ్యాసంగా ఉంది. 183వ పేజీ నుండి 189వ పేజీ వరకూ ఆ వ్యాసం విస్తరించి కనిపిస్తున్నది. ఈ సంపుటం 2004లో ప్రచురించబడింది.

వ్యాసమూర్తి గారి గురించిన ఆ వ్యాసంలోని ఒక సంగతి శ్యామలీయం పాఠకులతో పంచుకోవాలన్న ఆలోచనతో ఈ చిరు వ్యాసం వ్రాస్తున్నాను.

వ్యాసమూర్తి గారి 1888 - 1998 మధ్యకాలంలో జీవించిన ఆంధ్రయోగీంద్రులు.

సంపుటిలోని 187వ పేజీలో ఉన్న వాక్యం "క్రీ.శ. 2000 నాటి నుండి ప్రపంచంలోని జనసంఖ్య మూడవవంతు తుడిచిపెట్టుకొని పోతుంది" అని. ప్రస్తుతం ప్రపంచ జనభా 790కోట్లు అంటే అందులో మూడవవంతు 264కోట్లు! చాలా చాలా భయంకరమైన పెద్దసంఖ్య!

విశ్వహిందు మాసపత్రిక భావిభారతభాగ్యోదయం శీర్షికతో జూలై-ఆగష్టు 1999 సంచికలో రావు గారి వ్యాసం అని కుండలీకరణాల్లో పేర్కొన్నారు.  రావు గారు ఎవరన్న దానికి సమాధానం వ్యాసంలో 186 వపేజీలోనూ, చివర ఆధారాలలోనూ వివరం ఇచ్చారు - వారు వ్యాసమూర్తి గారి అనుగు శిష్యుడైన వెదురుమూడి వాసి చింతలూరి వేంకట రామమోహన రావు గారు. 

ఈ పైన నేను పేర్కొన్న వాక్యం ఉన్న సందర్భంలో వ్యాసమూర్తి గారి కాలజ్ఞానం రావు గారి ప్రసక్తితో మొదలై ఒక దాక్షిణాత్య స్త్రీ సహాయంతో వాజపేయీ గారి ప్రభుత్వం ఏర్పడటమూ అది 11 నెలలకే ఆ దాక్షిణాత్య స్త్రీ సహాయనిరాకరణతో కూలిపోవటమూ తిరిగి అధికారం చేపట్టి 15 సంవత్సరాలు పరిపాలించటమూ అన్న విషయాలను ప్రస్తావించి తరువాత క్రీ.శ. 2000 నాటి నుండి ప్రపంచంలోని జనసంఖ్య మూడవవంతు తుడిచిపెట్టుకొని పోతుంది" అన్న ఆశ్చర్యకరమైన వాక్యం వస్తుంది.

ఇక్కడ ఆలోచనీయమైన అంశం ఏమిటంటే వ్యాసమూర్తి గారు చెప్పిన జోస్యం ఈకరోనా విలయం గురించేనా అన్నది. ఒక వేళ ఈ మహావిలయంలో కరోనా అన్నది మొదటి అధ్యాయం కాదుకదా అన్న శంక కూడా కలుగుతోంది.

ఐతే క్రమంగా ప్రపంచజనభా తగ్గటం 2000 నాటినుండీ మొదలు కావచ్చును కదా అన్న విషయం కూడా మనం ఆలోచించాలి. ఇలా జరగటానికి కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆవిధంగా ఏమీ జనవిలయం ఉండకపోవచ్చును అనుకోవచ్చును.