31, జులై 2021, శనివారం

నేలను నాలుగు చెరగుల నిదిగో నీనామం వినిపించేను

నేలను నాలుగు చెరగుల నిదిగో నీనామం వినిపించేను
గాలికొడుకును బ్రోచిన నామం కలకాలం ధర నిలచేను

సురలను నరులను కాచిన నామం సుధావృష్టి కురిపించేను
పరముల నిచ్చే పావననామం పాపాటవులను కాల్చేను
హరునకు మిక్కిలి ప్రియమగు నామం అందరను రక్షించేను
పరమపూజ్యమై వరలెడు నామం బ్రహ్మపదము నే యిచ్చేను
 
సాధుజనులకు రుచియగు నామం చక్కగ పృధివిని నిలచేను
బోధగురువులు తెలిపే నామం పుణ్యప్రదమై వెలిగేను
భాధలనుండి కాచెడు నామం భవభయమును వెడలించేను
మాధవదేవా రామనామం మానవులను రక్షించేను

భక్తులు భజనలు చేసే నామం పావనమై చవులూరేను
శక్తికొలదిగా శ్రీరామ నామం జనులు చేయ కననయ్యేను
ముక్తి నొసంగే మంచి నామం భూమి నిదొకటే చూడగను
యుక్తియుక్తమగు నీమాటకు తలయూపుదు వీవని యెఱుగుదును

ఏల తెలియనైతిరా యిందిరారమణ

ఏల తెలియనైతినిరా యిందిరారమణ నే
కాలమెంతో గడపితిని కాసులవేటలో

మొదటినుండి ధనార్జనయె ముఖ్యమనుచు తలచి నే
చదివినట్టి చదువులెల్ల చదివినదే కాసులకై
చదివి చదివి ధనములను సంపాదించి యికచాలని
కుదురుగా కూర్చొనుటయె కుదరదన్న సంగతినే

ఎంతచెట్టు కంతగాలి యెంతసంపాదించితే
నంత కర్చువెచ్చములను అదరిపాటునుం గలుగు
చింతలు చీకాకులేను చివర కిచ్చట మిగులునని
ఎంత పోగుచేసిన కాని ఏమీ తృప్తియుండదని

రామనామ రత్నముండ రాళ్ళురప్పలేరు నా
పామరత్వ మెంతటిదో పరమపురుష చూడవయా
రామా యిది పురాణవైరాగ్యము కాకుండ నీవె
స్వామీ నీనామ మొకటె చాలను సద్భుధ్ధి నీవె


రామదేవుడా పూజలంద రావయా

రామదేవుడా పూజలంద రావయా
ప్రేమతో మాయింటికి విచ్చేయవయ్యా

సీమంతినీమణి సీతమ్మతో కూడి
సౌమిత్రి తోడురా సామీరి వెంటరా
స్వామీ మాయింటికి చనుదెంచవే
కామితము మాకిది కరుణించవే
 
ప్రేమతో‌ పిలచిన విచ్చేయ నేడు నీ
కేమి సందేహమో యెఱుగుదు లేవయ్యా
ఏమి మర్యాదలీ  సామాన్యుడు
పామరుడొసగునని భావించకుము
 
పూరింట నటవిలో పొలతితో నుంటివే
ఓ‌ రామ నాయిల్లు పూరిల్లగు గాక
కూరిమి పూజించి కుడువబెట్టగ
ఆరాటపడు భక్తు నాదరించుము

రామా నీదయ వేడుదు

రామా నీదయ వేడుదు సీతా
రామా రక్షించరా రాజీవనయన

రామా బాల్యము నుండి ప్రేమతో నీనామ
మేమరక నే చేయు టెఱుగవో నీవు
కామాదిరిపులు ముష్కరులు నేడు న
న్నేమేమో చేయగ నీడ్చుచున్నా రిదె

రామా ఓ వైకుంఠధామా నీదయ లేక
నేమి చేయుదునయ్య నెంత పోరాడుదు
ఏమో వీరికి లొంగి యామీద కాలుని
ధాములు ధూములు తన్నులు తిందునో

పతితపావననామ బ్రహ్మాండపాలనా
చతుర శ్రీరామ నాసంగతి నెఱిగియు
హితము చేయక యుండ నేమి కారణమయ్య
యితరుడ నాయేమి యినకులతిలక


బ్రతుకే సందిగ్ధమైన వారికి

బ్రతుకే సందిగ్ధమైన వారికి మంచి
బ్రతుకు నిచ్చెదవు నీవు రామచంద్రుడా

అన్నవలన తనకు ప్రాణహాని కలుగగా
అన్న ఎక్కరాని కొండ నధిరోహించి
యున్నవేళ సుగ్రీవున కన్నరాజ్యము
తిన్నగా నొసగితివి దేవదేవ

అన్నవలన తనకు ప్రాణహాని కలుగగా
అన్నతోడ కయ్యమాడు నిన్నుచేరి
యున్న విభీషణనునకు నీ వన్నరాజ్యము
తిన్నగా నొసగితివి దేవదేవ

ఎన్న డెవరు బ్రతుకుచెడి నిన్నుచేరినా
వెన్నుదన్నుగా నిలిచి సన్నుతాంగ
యెన్న డెఱుగనంత సిరుల మన్నన చేసి
తిన్నగా రక్షింతువు దేవదేవ



30, జులై 2021, శుక్రవారం

మంత్ర మొక్కటున్నచో మాకు చెప్పరే

మంత్ర మొక్కటున్నచో మాకు చెప్పరే పర 
మంత్రతంత్రయంత్రముల మట్టుబెట్టేది
 
మా మంచిని చూడలేని కామాదులనే
తామసుల ఆగడాలు తగ్గించేది
మా మీద వారి దుష్టమంత్రతంత్రాల
నే మాత్రము పారకుండ నెగురగొట్టేది

రామమంత్ర మనే‌ మంత్ర రాజమున్నది
కామమోహాది రిపుల గడ్డుతంత్రాల
నేమరక తొలగించి యెల్లవేళల
క్షేమమును కలిగించును శీఘ్రమే‌ యది

ఆ మంత్రము నెట్లుచేసే‌ దయ్యా మేము
రామ రామ యని పలుకుటె రామమంత్రము
రామ మంత్రమునకు సాటి రాగల దొకటి
భూమిపైన లేదు స్వర్గభూమిని లేదు


అందరు కలసి చేయండి శ్రీహరిసంకీర్తనము

అందరు కలసి చేయండి శ్రీహరిసంకీర్తనము
అందరు హాయిగ చేయండి శ్రీహరిసంకీర్తనము

అన్ని వేళలను చేయదగినది హరిసంకీర్తనము
అన్ని శుభములకు మూలమైనది హరిసంకీర్తనము 
అన్ని పనులలో మిన్నయైనది హరిసంకీర్తనము
అన్ని జాతుల కాచరణీయము హరిసంకీర్తనము
 
హరేరామ యని చేయండి శ్రీహరిసంకీర్తనము
హరేకృష్ణ యని చేయండి శ్రీహరిసంకీర్తనము
హరేనృహరి యని చేయండి శ్రీహరిసంకీర్తనము
హరి ప్రీతిగా చేయండి శ్రీహరిసంకీర్తనము
 
అరిషడ్వర్గము నణచాలంటే హరిసంకీర్తనము
మరలపుట్టువు వలదనుకొంటే హరిసంకీర్తనము
పరమపదమును చేరాలంటే హరిసంకీర్తనము
నరులాగా మరి చేయండీ శ్రీహరిసంకీర్తనము
 
 

హరికన్నను పెద్దచుట్ట మవనిని గలడా మనకు హరిసేవకు మించినపని యవనిని గలదా

హరికన్నను పెద్దచుట్ట మవనిని గలడా మనకు
హరిసేవకు మించినపని యవనిని గలదా

పెద్దవాడు మనసులోన పెద్దవాడు మహిమలోన
పెద్దవాడు సురలలోన పెద్దవాడు సృష్టిలోన
పెద్దవాడు కరుణలోన వీని కన్నను
పెద్దవాడు లేడు మనకు పెద్ధచుట్టము వీడు

అంత పెద్దవాడయ్యు ననవరతము వీడు మన
చెంతనే యుండువాడు చిత్తశుధ్ధి కలిగి మీరు
చింతించిన చాలును కడు శీఘ్రము గాను
చింతలన్నియు దీర్చి హరి చెలగు పెద్దచుట్టమై

కొందరేమొ రాముడనుచు కూరిమితో కొలువగను
కొందరేమొ కృష్ణుడనుచు గొప్పలీల లెన్నగను
కొందరు గోవిందుడని కొనియాడగ ని
ట్లందరి  సేవలను పొందు హరియె  పెద్దచుట్ఞము


రామ రణభీకరా రమ్యసుగుణాకరా

రామ రణభీకరా రమ్యసుగుణాకరా
ధీవర సీతావరా కావరా దయాకరా

సకలనిగమములును పొగడు శాశ్వతుడవు నీవురా
సకలమునీంద్రులును కొలుచు చక్రధరుడ వీవురా
సకలభూతకోటిహృదయసంస్థితుడవు నీవురా
సకలభక్తజనసన్నుత శాంతమూర్తి వీవురా

సకలసుజనులకును మేలు సలుపువాడ వీవురా
సకలదానవులను పట్టి చంపువాడ వీవురా
సకలలోకవంద్యుడ వగు చక్రవర్తి వీవురా
సకలతాపహరుడ వగు సాకేతరాముడా

సకలలోకములను కనుసన్నలలో నడుపుచు
సకలభక్తులకును సర్వసౌఖ్యముల నొసగుచు
వికచోత్పలనేత్ర నీవు విరాజిల్లుచుందువే
ఒకనాడును నిన్ను పొగడకుండ నేనుందునా

నేనెవరిని పొగడుదురా నిన్నుకాక

నేనెవరిని పొగడుదురా నిన్నుకాక నా
కైనను బ్రహ్మ కైన నాధార మీవే

తెలిసీతెలియక మానవులను నేను పొగిడితే
కలిగే లాభాలు నాల్గుకాసులే కాదా
ఇల గల్గు స్వల్పసిరుల నేమి తోడ్కొని పోదు
తెలివిగలిగి నినుపొగడి తీరుదు కాక

తెలిసీతెలియక నేను దేవతలను పొగడితే
కలిగే సంపదలు బంధకారణములు కావా
తెలిసితెలిసి బంధాలు తగిలించుకొందునా
తెలివిగలిగి యుందునా దేవదేవ

తెలివిచాలక నీదు దివ్యతత్త్వము నెన్న
పలుకులు వెదకుదును గాక పరమపురుష రామ
తెలివిగలిగి నీనామము కలనైన విడువనే
పలుకుదునా యొరుల సంభావించి నేను





29, జులై 2021, గురువారం

పరమపదము చేర్చునామము పరమసులభనామము

పరమపదము చేర్చునామము పరమసులభనామము
పరమసుఖదనామము పరమాత్ముని నామము 
 
రామతారకనామ మని రమ్యమైన నామమని
భూమినెంతో పేరుగల నామము హరినామము
కామితార్ధ మేదైనను ఘనముగనిడు నామము
ప్రేనతోడ రసన సేవించదగిన నామము
 
హరేరామ హరేరామ యనెడు వారిదె భాగ్యము
హరేకృష్ణ హరేకృష్ణ  యనెడు వారిదె భాగ్యము
నిరుపమాన మగు నామము నిర్మలశుభనామము
హరిభక్తుల నెల్లప్పుడు నాదుకొనే నామము

చేయండీ చిత్తమలర శ్రీరాముని శుభనామము
చేయండీ యనవరతము చేయువారిదె భాగ్యము
చేయండీ శివదేవుడు చేయుచుండెడు నామము
చేయండీ రామనామము చేసినచో కైవల్యము


28, జులై 2021, బుధవారం

రాముని నామము చేయండీ

రాముని నామము చేయండీ శ్రీ
రాముని సన్నిధి చేరండీ

రాముని నామమునకు సాటిరావండీ యే సంపదలు
రాముని నామమునకు సాటిరావండీ యే మంత్రములు
రాముని నామమునకు సాటిరావండీ యే యజ్ఞములు
రాముని నామమునకు సాటిరావండీ ధరనేవైనా

రాముని నామమునకు భువనత్రయమున సాటిలేదండీ
రాముని నామమునకు మించి బ్రహ్మాండంబున లేదండీ
రాముని నామమునకు శి‌రసా బ్రహ్మాదులును మ్రొక్కెదరు
రాముని నామము నాశివుడే యేమరక ధ్యానించేను

రాముని నామము నాలుకపై గోముగ నిత్యము నిలపండీ
రాముని నామమె సర్వమని ప్రేమగ నిత్యము తలచండీ
రాముని నామము నిక్కమగు రక్షణకవచము నమ్మండీ
రాముని నాముము కైవల్యప్రదమని యందరు తెలియండీ




నిరుపమసద్గుణనిధి దాశ‌రథీ పరమదయాళో పాలయ మాం

నిరుపమసద్గుణనిధి దాశ‌రథీ పరమదయాళో పాలయ మాం
కరివరదాచ్యుత కాంచనచేలా పరమదయాళో పాలయ మాం

సరసిజలోచన శ్యామలాంగ హరి పరమదయాళో పాలయ మాం
సురవైరిగణాంతకపటువిక్రమ పరమదయాళో పాలయ మాం
సురగణనాథప్రశంసితవిక్రమ పరమదయాళో పాలయ మాం
వరమునినిత్యసుపూజితచరణా పరమదయాళో పాలయ మాం

ధరణీతనయాహృదయమహాలయ పరమదయాళో పాలయ మాం
గిరికన్యాహృదయేశప్రశంసిత పరమదయాళో పాలయ మాం
నిరవధిసుఖసంధాయకనామా పరమదయాళో పాలయ మాం
దురితవినాశన రవిశశిలోచన పరమదయాళో పాలయ మాం

నరహరి సంసారార్ణవతారక పరమదయాళో పాలయ మాం
పరిహృత రావణ రామశుభాకృతి పరమదయాళో పాలయ మాం
నరకాదికదానవవిధ్వంసక పరమదయాళో పాలయ మాం
ము‌రహర మాధవ ముకుంద కేశవ పరమదయాహళో పాలయ మాం




26, జులై 2021, సోమవారం

మనకు రామభజన చాల మంచిదనుచు చెప్పినారు

మనకు రామభజన చాల మంచిదనుచు చెప్పినారు
కనుక విదులు చెప్పినట్లు మనసా చేయవే

శౌరినెంచి సర్వాపన్నివారినెంచి రామచంద్రు
కారుణ్యాలయునకు భజన కడగి చేయవే
ధారాళముగ నెల్లప్పుడును దాశరథి సద్గుణములు
కూరిమితో నుగ్గడించి కొనవె సద్గతి

పనికిమాలి నట్టి సిరుల వెనుక నీవు పరుగులెత్తి
మనసా భంగపడ నేటికి మంచివాడగు
ఇనకులేశ్వరుని మరువ కెల్లప్పుడును భజనచేసి
వినుతశీల కైవల్యమే విలుచుకొనవే

హరి తారకనామమెపుడు నాడుచుండ నాల్కపైప
పరమభాగవతుడు వానివంక జూడగా
నరకభటు లశక్తులు వాడు నారాయణుని కృపచేత
పరమపదము పొందుమాట పరమసత్యమే







25, జులై 2021, ఆదివారం

నోరారగ హరి శ్రీరఘురాముని కీరితి పాడరె మీరిపుడు

నోరారగ హరి శ్రీరఘురాముని
కీరితి పాడరె మీరిపుడు

పాడరె విబుధులు పదుగురు మెచ్చగ
వేడుక జనులెల్ల వినగను
వేడుచు మీరిటు పాడుట కనుగొని
నేడు రాముడు కృప జూడగను

సంతోషముగా చక్కగ పాడండి
చింతలు విడచి చిన్మయుని
సంతయకరుణాస్వాంతుని బహు మతి
మంతులు సురలును మరిమరి మెచ్చగ

పరమమంత్రములు హ‌రికీర్తనలు
పరిపరివిధముల పాడుటచే
నరులు పొందెదరు మరిభవనాశము
హరిసాన్నిధ్యము తిరమగును

కొండలతో ఆటలాడు గొప్పవాడు వీడు

కొండలతో ఆటలాడు గొప్పవాడు వీడు
కొండలంత ఆపదలైన గోటమీటు వాడు

మునిగిపోవు కొండనరసి మొత్తుకొను సురాసురుల
కనులజూచి నవ్వుకొనుచు కమఠమై వీడు
తనవీపున పెనుకొండను దాల్చినాడే
మనవాని బలమునెన్న మాటలున్నవే

పెద్దచిన్న కొండలన్ని వీనిపేరు విన్నంతనే
ముద్దుముద్దుగా నొదిగిపోయెనే వెన్న
ముద్దలట్లు కపుల హస్తములను రాముడు
ముద్దరాలికై సాగరమును కట్టువేళ

వానకాదు రాళ్ళవాన వచ్చి మీదపడిన వేళ
తాను కొనగోటను గిరిని దాల్ఛెనే వీడు
వీని యండనున్న చాలు విచ్చిపోవును
కాని సోకదే భక్తుని కష్టమెన్నడు









24, జులై 2021, శనివారం

చేరవే రామునే చిత్తమా

చేరవే రామునే చిత్తమా కైవల్యము
చేరుమార్గ మదేనే చిత్తమా

చేరి రఘురాముని కోరి భజియించవే
నారాయణు డాతడని నమ్మవే
దారే లేనట్టి సంసారసాగరము దాటు
తీరు శ్రీరామభజన తెలుసుకోవే

పాపుణ్యముల చేత వచ్చుచుండు తనువులు
నీ పని ఆ రెంటిని నిరసించుటే
శ్రీపతి భక్తులకు లేవు పాపాలు పుణ్యాలు
తాపత్రయంబులును తనువు లన్నవి

భూరికృపాళువైన శ్రీరాముడై యున్న
వారిజాక్షు  పాదపంకేరుహంబుల
చేరి భజియించెడు వారికి కైవల్యమే
చేరువగు చుండు సంసారము తొలగి



కరి హరికి లంచమిచ్చి గట్టెక్కనా

కరి హరికి లంచమిచ్చి గట్టెక్కనా కృష్ణ
హరికి లంచమిచ్చి వస్త్ర మార్జించెనా

హరిచేసిన విశ్వమందు హరిది కాని దేమున్నది
హరికి మీరిచ్ఛెదమని యాశజూపగ
హరి కీయగ దలచినచో నాత్మల నర్పింపుడు
మరి యితరము లిచ్చుటయను మాటే  లేదు

సదయునకు భక్తి తోడ సమర్పణము వేరు
అది యిమ్మా యిది గైకొని యనుటే వేరు
హృదయేశ్వరు డనుచు మీ రెంచుకున్న విభునితో
వదలు డింక బేరాలాడు పాడుబుధ్ధిని

పామరులై భగవంతుని పట్టి పీడింతు రేల
రాముడు మిము లంచమడిగి రక్షించునా
స్వామి పట్ల నచంచలభక్తి మీకున్నచాలు
మీమీ యాపదలు గడచి మేలు కలుగును

నిన్ను మరచి యొక్కనా డున్నానా చెప్పవయ్య

నిన్ను మరచి యొక్కనా డున్నానా చెప్పవయ్య
చిన్నచిన్న తప్పులు నీవెన్నవచ్ఛునా

ఎన్నేనియు విధములుగ నిన్ను నేను పొగడుచుండ
సన్నుతాంగ చెవిటినటన శాయవచ్చునా
కన్నులార నిన్నుచూడ కాచుకొని నేనిచ్చట
నున్న వేళ నీవు డాగి యుండవచ్చునా

తిన్నగాను నిన్నుపొగడ తెలివి నాకు చాలకున్న
అన్పన్నా తప్పులెన్ని యలుగవచ్చునా
నిన్నుపొగడ బ్రహ్మ వశమె నేనెంతటి వాడనన్న
చిన్నమాట నీకు మనవి చేయవచ్చునా

ధరమీదను రాకాసులదండు పెరుగుచున్నదని
మరలమరల మనవిచేయ మరువవచ్చునా
పరమపురుష నీదు కీర్తి పతాకము నెత్తిపట్టి
పరుగుపెట్టు నన్ను తప్పు పట్టవచ్చునా






హరిహరీ హరిహరీ యనవలెను మీరు

హరిహరీ హరిహరీ యనవలెను  మీరు
హరివారలై  ధరను తిరుగనేవలెను
 
భగవంతుని నామమునే పలుకుచున్నారా మీరు
తగినకార్య మదేనని తలచుచున్నారా
పగలు రేలు హరినామము పలుకుచున్నారా మీరు
జగదీశ్వరు కథలనే చదువుచున్నారా

హరేరామ హరేరామ యనుచున్నారా మీరు
హరేకృష్ణ హరేకృష్ణ యనుచున్నారా
హరిభక్తుల కలిసిమెలసి తిరుగుచున్నారా మీరు
హరిక్షేత్రములకు నెప్పుడు నరుగుచున్నారా
 
హ‌రికీర్తన చేయుచు తిరుగుచున్నారా మీరు
హరినిసేవించుచు నలయకున్నారా
హరికన్యుల తలపమని యనుచున్నారా మీరు
హరియందు మనసునిలిపి యలరుచున్నారా


23, జులై 2021, శుక్రవారం

సామాన్యమా యేమి రాముని విక్రమము

సామాన్యమా యేమి రాముని విక్రమము
ప్రేమతో మునులెల్ల వేనోళ్ళ పొగడునది

పదునాలుగువేల మంది దనుజులను దునుమాడ
నిదిగో యీ మూడుఘడియ లించుక హెచ్చాయె
ఆదిగో ఆ గహలోపల అమ్మ సీతమ్మ నునిచి
వదినకు కాపున్న తమ్ముడు ముదమున జూడ

అతివిక్రము డైన హరికి అతిసులభమాయ నిది
ప్రతిలేని బాణపరంపరను రిపుల గూల్చి
సతికి మోదమును గూర్చి సంతోషమును పొంది
అతివ మునుల కికమీదట నభయమ్మని పలికె

మ‌రలమరల కౌగలించి మహనీయచరిత సీత
పరమహర్షమును పొంది పరవశించుచు
నిరుపమాన పరాక్రమ నీరేజదళనేత్ర
హరివి నీవనచు తోచు నని రాముని మెచ్చె









తనకేమి యెఱుక రామ తన కేమెఱుక

తనకేమి యెఱుక రామ తన కేమెఱుక
కనుక కరుణజూపుమా కాదనక
 
తనను పంపు వాడెవడో తన కేమెఱుక  వాని
మనసులో నేమున్నదొ తన కేమెఱుక
తానెపుడు వచ్చునో తన కే‌మెఱుక మరలి
తానెపుడు పోవునో తన కేమెఱుక

తానేల వచ్చెనో తన కేమెఱుక వచ్చి
తానేమి చేయుచుండె తన కేమెఱుక
తానేమి యెఱుగునో తన కేమెఱుక తనకు
తానేల తెలియడో తన కేమెఱుక
 
తత్త్వ బోధ యన్న నేమొ తన కేమెఱుక యింక
తత్త్వచింతన మన్న తన కేమెఱుక 
తత్త్వవిదులెవ్వరో తన కేమెఱుక పర
తత్త్వము నీవే ననుచు తన కేమెఱుక
 
 

పడ వెక్కుదువు కాని పదవయ్య రాముడా

పడ వెక్కుదువు కాని పదవయ్య రాముడా
అడవులేలే గంగ కవలి యొడ్డున

పినతల్లి కోరికలను విని నొచ్చుకొనినావు
వనములేను చాలమేలని వచ్చినావు
జనకు డాజ్ఞ చేసెనని వనముల కేగేవొ
నను నేడు నావకట్ట మనుచున్నావు

అడవులన్న రాకాసుల కాటపట్లు రాముడా
వడివడి జనుచుంటి వటు వనితతోడ
జడుపేమి నీకును లక్ష్మణునకు కానియీ
పుడమిసుతను తోడుకొని పోవుటేమో

వనులలోని మునుల కిక కనువిందు చేయుమా
మునులే నిను రప్పించు కొనుచున్నారో
మునులతోడ నీకుండిన యనుబంధ మెట్టిదో
మునుముందు తెలియునులే పోయిరావయా




హరియే సర్వం బని తెలియవయా హరిసాన్నిధ్యం బబ్బునయా

హరియే సర్వం బని తెలియవయా  
హరిసాన్నిధ్యం బబ్బునయా

హరినామము నీ వెప్పుడు చేసిన ఆనందము నీ కప్పుడు కలుగును
హరికథలను నీ వెప్పుడు చదివిన ఆనందము నీ కప్పుడు కలుగును
హరి నీ తలపున కెప్పుడు వచ్చిన ఆనందము నీ కప్పుడు కలుగును
హరి సన్నిథి నీ వెప్పుడు నిలచిన ఆనందము నీ కప్పుడు కలుగును
 
హరిపారమ్యుము నెఱిగితివా నీ‌ కభయము నిత్యము కలుగుచు నుండును
హరి రామాకృతి కొలిచెదవా నీ కభయము నిత్యము కలుగుచు నుండును
హరిని కృష్ణుడని కొలిచెదవా నీ కభయము నిత్యము కలుగుచు నుండును
హరేరామ యని పలికెదవా నీ కభయము నిత్యము కలుగుచు నుండును
 
హరిభక్తులతో మెలగెదవా నీ కనిశము శుభములు కలుగుచు నుండును
హరిభక్తుడవై నిలిచితివా నీ‌ కనిశము శుభములు కలుగుచు నుండును
హరినే కడు ప్రేమించెదవా నీ కనిశము శుభములు కలుగుచు నుండును 
హరి నీవాడని నమ్మితివా నీ కనిశము శుభములు కలుగుచు నుండును
 
 

22, జులై 2021, గురువారం

కైవల్య మేరీతి కలిగేనో యే దేవుడు మాకది యిచ్చేనో

కైవల్య మేరీతి కలిగేనో యే
దేవుడు మాకది యిచ్చేనో
 
సేవించవలయును శ్రీరాముని మీరు
భావించవలయు నా పరమాత్ముని 
సేవ లందెడు వాడు శ్రీమహావిష్ణువే
కావున కలుగునది కైవల్యమే

ప్రేమించవలయును శ్రీరాముని రసస
రామనామము నందు రమియింపగ
రాముడంటే యెవరు శ్రీమహావిష్ణువే
ఆ మోక్షపదము మీ కబ్బేనులే

చేయగా వలయును శ్రీరాముని భజన
హాయిగా తీయగా నలుపెఱుగక
చేయండి రాముడా శ్రీమహావిష్ణువే
చేయ కైవల్యమే సిధ్ధించులే

నరులార రామనామం మరచేరు మీరు పాపం

నరులార రామనామం
మరచేరు మీరు పాపం

సిరి వెంటనంటి వచ్చేనా
హరి వెంటనంటి కాచేనా
నరులార తెలియలేరా
మరి చేయరేల నామం

స్మరుని స్మరించుట మేలో
హరిని స్మరించుట మేలో
నరులార యెఱుగలేరా
మరి చేయరేల నామం

నరసేవన ముత్తమమో
హరిసేవన ముత్తమమో
నరులార అరయలేరా
మరి చేయరేల నామం


సాకేతరాముడే చక్కనివాడే

సాకేతరాముడే చక్కనివాడే
నీకు తోడునీడగ నిలిచియున్నాడే
 
జానకీరాముడే జగన్నాథుడే
మాననీయచరితుడే మహావిష్ణువే
ఈనాడు నీవాడై నీహృదయములో
తానై కొలువైనాడు దయాశాలియై

పూవిచ్చేవూ ఒక పండిచ్చేవూ
నీవిచ్చేదేమి ఈ నిఖిలసృష్టి వీడిదే
నీవిచ్చుట నీప్రేమభావన తోడ
నీవడిగిన వన్నీ వాడు నీకిచ్చేనే

దేవతలకైన వాడు తెలియగ రాడే
ఏ విద్యల చేత వీని నెఱుగగ రాదే
కేవలము నీభక్తికి నీవశుడై నీ
భావములో నుండు వీడు నీవాడేనే

అంటుకొనక మానవు అంటుకొనిన వదలవు

అంటుకొనక మానవు అంటుకొనిన వదలవు
తుంటరి సంసారమా తొలగిపోవే

ఎచటెచటి జీవులనో యీడ్చుకొని వచ్చేవే
ఇచట కూలనేసేవే యేడిపించేవే
ప్రచురమై నీమాయ పట్టరాని దాయెనే
విచిత్రములు చాలించి వెడలిపోవే

రామభక్తులతో నీపరాచికాలాపవే
నీమాయలు వారిముందు నిలువలేవే
కాముడు నీతోడైతే కానీవే దానికేమి ఆ
కామునితో కలసినీవు కదలిపోవే

హరుడు కాడు వీడు కాము నగ్గిబెట్ట డనుకొనకే
హరి వేరు హరుడు వేరనుకొనబోకే
హరియే శ్రీరాముడే యతనిభక్తు లసాధ్యులే
మరిమరి విసిగించక మరలిపోవే


నేను రాముని భక్తుడ

నేను రాముని భక్తుడ
కా నన్యుడ ముమ్మాటికి

కాను మానవుడ కాను దానవుడ
కాను యక్షుడను కానయ్య
కాను వేలుపును కాను సిధ్ధుడను
నేనే జాతికి చెందను

కాను పారుడను కాను శూద్రుడను
కాను క్షత్రియుడ కానయ్య
కాను వైశ్యుడను కాను పంచముడ
నేనే వర్ణము పొందను

కాను గృహస్థుడ కాను వనస్థుడ
కాను వటువును కానయ్య
కాను సన్యాసిని కాను ద్రిమ్మరిని
లేనే ఆశ్రమ మందున

శ్రీహరినామము చేయనివానికి చిత్తశాంతి కలదా

శ్రీహరినామము చేయనివానికి చిత్తశాంతి లేదు
శ్రీహరినామము చేసెడివానికి చెడిపోవుట లేదు

రామనామమును రుచిమరగినచో రక్తిముక్తి కలవు
కామునిమైత్రిని మరగినచో బహుకష్టములే కలవు

రామరామయని పలికేవానికి రామరక్ష కలదు
రామునిలేడని పలికేవానికి రక్షకు డెట గలడు

శ్రీహరిపై మమకార ముంచిన చింతలు నిను వదలు
దేహముపై మమకార ముంచిన దీనతయే మిగులు

రాముని మారుతివలె కొలిచినచో బ్రహ్మపదము కలుగు
రాముని రావణువలె తిట్టినచో రావణుగతి కలుగు

హరిభక్తులతో కలసితిరిగిన హరికృప సిధ్ధించు
హరివిద్వేషుల కలసితిరుగుట అధోగతికి దించు 

పరమానందము రామనామమని భావించిన ముక్తి
పరమానందము నెఱుగడు కాముని భావించిన వ్యక్తి

హరిసంసేవన కంకితమైతే హరిపదమును చేరు
నరులసేవకే యంకితమైతే నరకమునే చేరు

హరిని తలచిన చిత్తశాంతితో హాయిగొనును నరుడు
హరిని మరచితే చిత్తశాంతికై యలమటించు నరుడు





21, జులై 2021, బుధవారం

ప్రావృణ్ణీలపయోధరోపమ భవ్యవిగ్రహ రామా

ప్రావృణ్ణీలపయోధరోపమ భవ్యవిగ్రహ రామా
నీ వృత్తాంతము సుజనులు మదిలో నిత్యమెన్నెదరు రామా

దశరథనందన తరణికులోత్తమ ధర్మవిగ్రహా రామా
ప్రశమితశాత్రవగణసందోహా భార్గవసన్నుత రామా

కోసలతనయాసౌఖ్యవివర్ధన కువలయపోషక రామా
భాసురతేజా భాస్కరతేజా దాసపోషక రామా
 
సురగణతోషణ మునిగణతోషణ వరగుణభూషణ రామా
సురుచిర భాషణ సుజనసుపోషణ సుమధురభాషణ  రామా
 
వరశుభనామా జగదభిరామా భండనభీమా రామా
ధరణీతనయాహృదయమహాలయ దైవతవిగ్రహ రామా

సురగణసన్నుత మునిగణసన్నుత వరశుభవిక్రమ రామా
పరమపవిత్రా శుభదచరత్రా పాపలవిత్రా రామా
 
రావణాదిఘనరాక్షసవిదళన రాజలలామా రామా
పావననామా కునుజవిరామా వైకుంఠధామా రామా
 
పావనమూర్తీ శాశ్వతకీర్తివిభాసితమూర్తీ రామా
శ్రీవిశ్వేశ్వరచింతితమూర్తీ చిన్మయమూర్తీ రామా

సీతానాయక శాంతిప్రదాయక క్షితిపతినాయక రామా
మాతండ్రీ భవతారకనామా మంగళదాయక రామా


ఒక్కమాట చెప్పవయ్య

ఒక్కమాట చెప్పవయ్య యుర్వినున్న వారెల్ల
నిక్కువముగ నీకళలై నేలనున్న వారేగా

అందరును నీకళలై యవనిపై నుండగ
కొందరికి లేనిపోని గొప్పలేమి
కొందరను తక్కువగ కువలయ మెంచుటా
అందరొక్కటే కద యరమరి కేలయ్య

పామైన చీమైన పట్టపుటేనుగైన
సామవేదియైన వట్టి జడుడైనను
స్వామి నీ కళావిలాసంబులే యగు నెడ
ఏమయ్య బేధముల నెంచగ నేలయ్య

నీమాయచే మేము నిజమెఱుగము కాని
ఆ మాయ పొరతొలగ నందరొక్కటే
రామచంద్ర జానకిరమణ నిన్ను మాలో
ధీమంతులమగుచు తెలియగ నీవయ్య

నామనసు నీదాయె నామమత నీదాయె

నామనసు నీదాయె నామమత నీదాయె 
నామాట నాపాట నాబ్రతుకె నీదాయె

భక్తుడేమి పలుకవచ్చు పలుకనే రాదో
భక్తుడేమి పాడవచ్చు పాడరాదో
యుక్తాయుక్తముల నుర్వి నుండువారికి
ముక్తిప్రద సుద్దులాడ బోలునటయ్య

రేపుమాపు నీపాటల కాపద వచ్చుచో
నీపాట్లు నీవే పడి నిలుపుకోరా
కోప మేమిటయ్య నాకు కోదండరామ నా
కోపతాపములును నీ‌కొఱకే కాదా

రామయ్య నీది కాని దేమున్నదయ్య
కామించి నాదన నీ భూమి పైన 
ఏమిటి కిదియది యన నే నేమందు నయ్య
ఏమన్న మానిన నది నీ యిఛ్చయే గాక
 
 

20, జులై 2021, మంగళవారం

తారకనామము చేయండీ యిక నారకభయమును వీడండీ

తారకనామము చేయండీ యిక నారకభయమును వీడండీ
కూరిమి కలిగి చేయండీ వైకుంఠధామమును చేరండీ

నేరుపు మీఱగ నరనారీజనులారా చక్కగ చేయండీ
ధారాళముగా వరములిచ్చు హరి దయనే మీరు పొందండీ
నారాయణుడే శ్రీరాముడని నమ్మి నామమును చేయండి
శ్రీరామనామము చేసినచో హరి చేయందించును నమ్మండీ

సిరులొసగెడి మంత్రముల కాదని హరిమంత్రమునే చేయండీ
హరిమంత్రము కానట్టి మంత్రమున నభయము కలుగుట లేదండీ
హరిమంత్రము మీకబ్బినచో నిక సిరులకు కొరతలు రావండీ
మరువక మనసా రామరామ యని మహధ్భాగ్యమే పొందండీ

భక్తవత్సలుడు రాముని నామము పరమపావనము తెలియండీ
ముక్తి సులభముగ దొ‌రకు నుపాయము భూజనులకీదే చూడండీ
రక్తిమీఱగ రామనామసుధ శక్తికొలదిగా త్రాగండీ
యుక్తి వేరోకటి లేదండీ  హరిభక్తులె తరియించేరండీ




జగములనేలే రఘుపతి నీదయ చాలును చాలును చాలునురా

జగములనేలే రఘుపతి నీదయ చాలును చాలును చాలునురా
తగదిక నరులను కొలుచుట నాకని తలచెద తలచెద తలచెదరా

కరుణయెలేని నరులను కొలుచుట కష్టము కష్టము కష్టమురా
పరులను కొలుచుచు బ్రతికెడు వానికి బాధలు బాధలు బాధలెగా
పరులబాధలు నరులకెన్నడును ఫట్టవు పట్టవు పట్టవురా
హరి కరుణామయ నీచరణములే శరణము శరణము శరణమురా

ధారుణి నరునకు మారుని స్నేహము తగనిది తగనిది తగనిదిరా
దారుణమగు ధనమోహము నరునకు తగనిది తగనిది తగనిదిరా
దారాసుతులను గూర్చి మోహమును తగనిది తగనిది తగనిదిరా
తారకరామా నీపదసేవయె తగినది తగినది తగినదిరా

హరి నామదిలో నిలువుము నీవని అడిగెద అడిగెద అడిగెదరా
అరిషడ్వర్గముపై విజయమునే అడిగెద అడిగెద అడిగెదరా
హరి యిక ధరపై పుట్టువు వలదని అడిగెద ఆడిగెద అడిగెదరా
అరుదగు ఆవరమొకటే యిమ్మని అడిగెద అడిగెద అడిగెదరా





17, జులై 2021, శనివారం

మరువక శ్రీరామనామము మనసా చేయగదే భవ తరణోపాయ మిదేనటే తప్పక చేయగదే

మరువక శ్రీరామనామము మనసా చేయగదే భవ
తరణోపాయ మిదేనటే తప్పక చేయగదే

హరబ్రహ్మాదులకో మనసా ఆతని నామముపై
మరిమరి మక్కువ యని యందురటే మనసా తెలియగదే

సురకోటికిని సుఖములనిచ్చే సొంపగు నామమటే
నరకోటికి భవతారక మటనే విరివిగ చేయగదే

మానక చేసెడువారెవరైనా మరలా పుట్టరటే
జానకిరాముని నామముపై కడు శ్రధ్ధను చూపగదే

మానవజన్మము నెత్తియు రాముని మరచుట తప్పుగదే
జ్ఞానముకలిగిన తారకనామము చక్కగ చేయగదే

భ్రమలడగించే సులభోపాయము రాముని నామమటే
సమవర్తిని బహుదూరము తరిమే చక్కని మంత్రమటే

సుమధురనామము సుందరనామము ఉమామహేశ్వరుడే
కమలాధీశుని నామకోటిలో ఘనముగ నెన్నెగదే







16, జులై 2021, శుక్రవారం

కోరిన విచ్చేనే రాముడు కొల్లగ నిచ్చేనే

కోరిన విచ్చేనే రాముడు కొల్లగ నిచ్చేనే ఇక
కోరిన విచ్చే రాముని నీవు కొలువగ రావలెనే
 
తెలతెలవారక ముందే వత్తురు దేవతలందరు రామునకు
పలువిధములుగా సుప్రభాతములు పాడుచు వేడుకతో
నళినదళాకుక్షుడు మేలుకొని హరి నవ్వుచు పలుకరించగను
కళకళలాడెడు మోములతోడ కదలిపోదురట విన్నావా

వచ్చే భక్తులు పోయే భక్తులు పట్టాభిరాముని యింటి ముంగిట
ముచ్చటగా కనుగొనవే రాముని హెచ్చిన వైభవము
ఇచ్చేరే వా రుపాయనములను ఎంతో ప్రేమతొ రామునకు
పుచ్చుకొనేరే వరము లనేకము భూరికృపాళు వీయగను

సీతారాములు కృపాస్వరూపులు చేరినవారిల కందరకు
ప్రీతిగ నిత్తురు కోరెడు వన్నియు వేడక ముందుగనే
ఆతలిదండ్రుల చూపులె సంపద లన్నివేళల కురియగను
భూతలవాసులు కేమిక వలయును పోయి చూచి రావే


దేవదేవుడా నీకు తెలియని దేమున్నది

దేవదేవుడా నీకు తెలియని దేమున్నది
భావించును తనవాడని భక్తుడు నిన్ను

ఎవ్వానికి నీదు తత్త్వ మెఱుకగునయ్య
ఇవ్వధను నరులె కా దెంచ విరించికిని
రవ్వంతకు మించి తెలియ రానిదే యది
నవ్వుచు నందరి నేలెడు నారాయణుడా

మోహించని మునిలేని మోహనరాముడా
మోహించని వనితలేని మోహనకృష్ణుడా
మోహించని యౌగిలేని ముక్తిరూప యీ
మోహించుట నాయందే పుట్టలేదుగా
 
నీవిలాసమాత్ర మగుచు నెగడు సృష్టిలో
జీవులందరు చూడ నీ‌ చిత్కళలే కదా
కావున నందరును నిన్ను కలియు వారలే
నీవు తనవాడవనుచు భావించు వారే

కోదండరాముని దరిసెనమును కో‌రివచ్చితిమి

కోదండరాముని దరిసెనమును కో‌రివచ్చితిమి ఈ
వేదవేద్యుని కనులజూడ వేచియుంటిమి

దినదినమును బ్రహ్మాదులును దేవదేవుని చూడవత్తురు
వినయమొప్ప గుడిముంగిట వేచియుండెద రెల్లప్పుడు
అనుదినమును హరినిజూడ నంతేలేక భక్తకోటి
చనుదెంతురు హరిధ్యానము సలుపుచు నిట వేచెదరు

హనుమదాదులు వత్తురు వారనగ తొల్లిటి భక్తులు
మునులు వేలుగ వత్తురు మునుముందే హరిభక్తులు
మనుజులలో హరిభక్తులు మముబోంట్లును వచ్చిన
వినయముగా నెవరైనను వేచియుండక తప్పదిచట 

సీతారామలక్ష్మణులను చిత్తమలర చూచితిమి
ప్రీతి నుపాయనములు వివిధంబుల నిచ్చితిమి
చేతోమోదముగాను వారికి సేవచేసుకొంటిమి
సీతాపతి వరములీయ స్వీకరించి మురిసితిమి


15, జులై 2021, గురువారం

మంత్రమంటే నాకుతెలిసిన మంత్రము నీనామమే

మంత్రమంటే నాకుతెలిసిన మంత్రము నీనామమే
తంత్రమంటే నాకుతెలిసిన తంత్రము నీధ్యానమే

రా యను బీజాక్షరమునకు రాజసంబను నర్ధము
మా యను బీజాక్షరమునకు మంచితనమను నర్ధము
హాయిగా నే చెప్పుకొందు నంతకంటెను తెలియక
మాయనే నీరాజసంబును మంచితనమును గెలుచుగా

చదువలేదు శాస్త్ర సంపుటి చదువలేదు గురువువద్ధ
చదివినట్టి కూటివిద్రలు జ్ఞాన మిచ్చినదియు లేదు
సదయ నీయందమితభక్తి జన్మసిధ్ధం బనగ నమ‌రె
విదులు మంత్రమనుచు చెప్పగవింటి నీనామమును గూర్చి

పరమమంత్రము రామమంత్రమె ప్రాణమంత్ర మగుచునుండ
మ‌రల నితరమంత్రములకై మనసుపడుట వెఱ్ఱితనము
హరిహరీ యటువంటి యూహయె ఆత్మకంటదు రామచంద్ర
వరద భక్తవత్సలా నాబ్రతుకు సర్వము రామమయము









నిన్నే నమ్మినానురా నేనెందుబోదురా

నిన్నే నమ్మినానురా నేనెందుబోదురా
కన్నతండ్రి యితరుల కలనైన నమ్మను

నీవు పంపితేనే యిలకు నేను వచ్చినది నిజము
నీవు కోరి నంత కాలము నేనిందే యుందును
భావనలో నిన్నే నింపి పలుకుచునే యుందును
నీవాడనే నని నమ్ముము నేనెందు బోదురా

ఎవరెవరినో గొప్పవారని యెట్లు నమ్మగలనురా
దివిని భువిని నీవొకడవే దేవుడవై యుండగ
అవడుబుధ్ధు లేవేవో యరసి పలుకుచుందురు
భువిని నాయునికి నీకై పొడమినదే యగుటచే

రామచంద్ర నీసద్యశము రాజిల్లగ చిరకాలము
భూమిని నీకొఱకై నిల్ఛి ముచ్చటగ పాడుదును
నీమ మిట్లు నాకున్నదే నేడు దారితప్పను
నీమహిమ వలన నిచ్చలు నీవాడనే యగుదును



శ్రీరఘురామా వందనము

శ్రీరఘురామా వందనము సీతారామా వందనము
కారుణ్యాలయ వందనము కైవల్యప్రద వందనము

నారాయణ హరి వందనము నారకమోచన వందనము
తారకనామా వందనము దశరథనందన వందనము
నేరములెంచక మాకెపుడు ధారాళముగా వరములను
కూరిమితోడను కురిపించే గోవిందా యిదె వందనము

భూవలయాధిప వందనము భూరిప్రతాప వందనము
రావణసంహర వందనము రాజలలామా వందనము
భావించగ బ్రహ్మాదులకు వశము కాదుగా నీలీల
దేవదేవ హరి వందనము దివ్య ప్రభావా వందనము

కామారినుతా వందనము కలుషవిదూరా వందనము
రామచంద్ర హరి వందనము రాజీవానన వందనము
ప్రేమామృతమును భక్తులకు విరివిగ పంచే దేవుడా
శ్రీమదయోధ్యారాజేంద్రా శేషశయన యిదె వందనము




12, జులై 2021, సోమవారం

నిన్నే నమ్మితి రామా న న్నెన్నడు విడువకు రామా

నిన్నే నమ్మితి రామా  న న్నెన్నడు విడువకు రామా
సన్నుతి జేసెద రామా నను చల్లగ చూడుము రామా

సురగణవందిత రామా భాసురగణ శోభిత రామా
కరుణాకర శ్రీరామా హరి పరమపావన నామా

ధరణీతనయాకామా హరి నిరుపమసద్గుణ ధామా
మరువకు నను శ్రీరామా నీ‌కరుణయె చాలును రామా

నీలగగనఘనశ్యామా హరి నీ వాడను శ్రీరామా
నేలకు నింగికి రామా నను నీవిక త్రిప్పకు రామా

మాయామానుషవేష హరి మంజులమృదుసంభాష
శ్రీయుతమంగళమూర్తీ హరి చిన్మయ స్థిరసత్కీర్తీ

రవికులతిలకా రామా ఆరాటము లణచుము రామా
భవభయవారక రామా నీపదములె చాలును రామా 


నీశుభనామము చేయుటే

నీశుభనామము చేయుటే
దాశరథీ నా మతము

కామాదులను త్రోయుటే
స్వామీ చక్కని మతము
పామరత్వము వీడుటే
రామా చక్కని మతము

పామరత్వమును వీడుటకై
నామము చేయుటె విధము
ఏమరక నీనామ సుధ
ప్రేమగ గ్రోలుట నామతము

గోముగ రామహరే యనుటే
స్వామీ నావిధ మందును
నామము నీవే యందును
నామత మదియే‌ నామతము

రామచంద్ర యనరాదా రాఘవేంద్ర యనరాదా

రామచంద్ర యనరాదా రాఘవేంద్ర యనరాదా
నా మనోహరా జగన్నాథా యనరాదా

కామితశుభసందాయక కటాక్షించు మనరాదా
రామా జగదీశ్వరా రక్షరక్ష యనరాదా
స్వామీ నీకన్య మెఱుగ వరదాయక యనరాదా
ప్రేమామృతసాగర నిను విడచియుండ ననరాదా

సన్నుతాంగ నీకెవరును సరిరారని యనరాదా
నిన్ను నమ్ము కొంటి నింక నీది భార మనరాదా
కన్నులార నిన్నుచూడ కటాక్షించు మనరాదా
మిన్నుమన్ను నేకమైన నిన్నువిడవ ననరాదా

రక్తి నిన్ను పొగడుట నారసనకని యనరాదా
భక్తిమీఱ నిన్నుపొగడు వాడనని యనరాదా
ముక్తిదాయకా నాకు మోక్షైమీయు మనరాదా
శక్తికొలది రామునకు సాగిలపడి ఓమససా







10, జులై 2021, శనివారం

శ్రీకర శుభకర శ్రీరామా జయ

శ్రీకర శుభకర శ్రీరామా జయ
లోకశరణ్యా రఘురామా

రామా వికుంఠధామా జలధర
శ్యామా దశరథరామా సద్గుణ
ధామా దనుజవిరామా సీతా
కామా జితభృగురామా జగదభి
రామా పావననామా సంగర
భీమా  నుతసుత్రామా రాజల
లామా జయహే కామారినుతా
సామీరినుతా భూమీశనుతా

ధీరా శ్రుతిసంచారా జగదా
ధారా  ధర్మవిచారా రణగం
భీరా సుజనాధారా నిరుపమ
వీరా దురిత విదారా సద్గుణ
సారా విగతవికారా శ్రీరఘు
వీరా కరుణాపూరా జయహే
వీరేంద్రనుతా గౌ‌రీశ నుతా
శ్రీ‌రామా సంసారనివారా

అమ్మా శ్రీహరి గేహినీ

అమ్మా శ్రీహరి గేహినీ సీ
తమ్మగ వచ్చితి వమ్మా

ధరజొచ్చితివి సీరధ్వజు నిలుజొచ్చితివి
హరుని విల్లు విరచిన మరియాదా
పురుషోత్తముని నీవు పొందితివి రామునే
తరణికులము నీచే ధన్యమాయెనే

వనసీమలందు పతియును నీవు విహరింప
గని రాకాసులరాజు నిను మ్రుచ్చిల
కినిసి వాని లంక జేరి దనుజు రావణు జంపి
ఘనకీర్తి సాధించె నినకులేశుడు

చురచుర నీవు దనుజు జూచిన బూది కాడే
మరి వాని సబాంధవము మసిచేయగ
హరి కీర్తి హెచ్చునని అరి నుపేక్షించినావు
ధర నతిశయించె మగని దర్పము యశమును











ఇట్టిట్టి దనరానిది రామనామము

ఇట్టిట్టి దనరానిది రామనామము చాల
    గట్టిమేలు చేయునది రామనామము

సాధారణమేమి కాదు రామనామము బహు
    బాధల నడగించు నండి రామనామము
మాధుర్యంబున దొడ్ద రామనామము భవ
    వ్యాధిని తొలగించునండి రామనామము

శక్తినిచ్చు మంత్రమండి రామనామము కడు
   రక్తి గూర్చు మంత్రమండి రామనామము
మక్తినిచ్చు మంత్రమండి రామనామము బహు
    భక్తికలిగి చేయండి రామనామము

సమ్యగ్జీవన  మిచ్చును రామనామము మిము
    సరియైన దారి నుంచు రామనామము
రమ్యమైన మంత్రమండి రామనామము మిము
    గమ్యమునకు చేర్చు నావ రామనామము

ఎల్లెడల జయమిచ్చును రామనామము మిము
    తల్లివలె రక్షించును రామనామము
కొల్లలుగ సిరులిచ్చును రామనామము బ్రతు
    కెల్ల పండించునండి రామనామమము

నిరుపమాన మంత్రమండి రామనామము మిము
    కరుణించును శీఘ్రమే రామనామము
పరమహంసమంత్రమండి రామనామము మిము
    పరమాత్ముని దరికి చేర్చు రామనామము

పెద్దలార చేయండి రామనామము మరు
    వద్దండి మీకు రక్ష రామనామము
అద్దరి కిద్దరికి లంకె రామనామము మిము
    దిద్దునండి యోగ్యులుగా రామనామము

పిల్లలకు నేర్పండి రామనామము పసి
    పిల్లలకు రామరక్ష రామనామము
ఎల్లప్పుడు చేయండి రామనామము మిము
    చల్లగా చూచునండి రామనామము 

9, జులై 2021, శుక్రవారం

ఘటమేదైనను గంగాజలమును..

ఘటమేదైనను గంగాజలమును గంగాజలమని యందురుగా
పటమేదైనను కట్టినవానిని వానిగనే గ్రహియింతురుగా

కుమ్మరిసారెకు లోబడి మృత్తిక కొనియెడు వివిధస్వరూపములం
దిమ్ముగ లోకులు మృత్తిక నెట్టుల నీక్షీంచెదరో యట్టులనే
యిమ్మహి వివిధోపాధుల నొదుగుచు నీశ్వర నీసంకల్ఫముచేతన్
నెమ్మది ననునే నెఱిగి చరింతుర నిక్కముగా శ్రీరామవిభో

బహుజన్మంబులు నాకగు గాక యవశ్యము నీకై యెత్తెదను
బహురూపంబులు నాకగు గాక యవశ్యము దాల్చి చరించెదను
బహునటనల నే నుండెద గాక యవశ్యము నిను మెప్పించెదను
విహరింతునురా విశ్వమయా నీ వేడుక తీ‌రగ నీభువిలో

పరిపరి విధముల బహురూపంబుల హరి నే నెట్టుల నుండినను
పరమాత్మా నిను మరువక యుందును మరచి చరించుట నావశమే
కరుణాకర యిది నీ ఘనలీలాకల్పిత నాటకమే కదరా
హరి నీవాడనె యన్ని యుపాధుల పరమసత్యముగ నో రామా


రామా నమ్మిన వాడనే.. రాకమచర్ల వేంకట దాసు కీర్తన

ఓ రామా నమ్మిన వాడనే
శ్రీరామా నమ్మిన వాడనే

రామరామ హిమధామసమానన
నామనోహర నారాయణ హరి

అరమరలేదని పరిపరి విధముల
శరణంటిని యక్కర చూడవు గదె

సుచరితసేవకనిచయాస్పద స
ద్వచననిరంతర ఖఛరాదినుత

సారహీనవికారదుష్టసం
సారసాగరము భారమాయె గదె

నీయెడ నేమి యుపాయము దోచదు
కాయము నీదని కడునమ్మితి గదె

చలమువలదు సత్ఫల మొసగవె నిను
తలచెద పలుమరు నళినదళేక్షణ

శ్రీకర రాకమచర్ల నిలయ కరు
ణాకర నీకృప కాశించితి గదె

( రాకమచర్ల వేంకట దాసు గారి కీర్తన)

Windows emergency update.


Please be advised that Microsoft has released an emergency patch to address a critical flaw in the Windows Print Spooler service that bad actors are actively exploiting.

RUN WINDOWS UPDATE IMMEDIATELY

Follow the instructions in the following link to perform the updates and check your settings:

  1. Run MS Windows Update manually (Steps may be different depending on your version of Windows OS: 
    1. On the Update & Security screen, select Windows Update.
    2. The Windows Update screen appears.  NOTE: If you don’t mind typing, you can get to the Windows Update screen by typing windows update in the Search box located on the taskbar.
    3. The Windows Update screen informs you when Windows 10 last checked for updates and whether any were found.
    4. Select the Check for Updates button to find out whether any updates are available and update Windows 10 on your computer.
    5. You may see a message that one or more updates will be downloaded and installed automatically. You do not have to do anything to install these updates — the update process is automatic.
    6. Return to the desktop to let Windows 10 manage updates automatically.
  1. Ensure ‘Windows Security’ is enabled 


For most of you, your systems will be setup for automatic updates; you may need to restart for the updates to take affect.

Please update your systems immediately.  


Link.   https://msrc.microsoft.com/update-guide/vulnerability/CVE-2021-34527






ఇదియే సత్యము కాదటయ్యా ఇంకేమున్నదిలే

ఇదియే సత్యము కాదటయ్యా ఇంకే మున్నదిలే
కుదురుగ దీని నెఱింగినపిదప కొఱతే మున్నదిలే

ఇది నాతనువని యేమున్నదయా ఇది నీసేవకు పరికరమే
ఇది నాధనమని యేమున్నదయా ఇది నీవిచ్చిన కానుకయే
ఇది నా తలపని యేమున్నదయా హృదయములో నీవేగా
ఇది నాబ్రతుకని యేమున్నదయా ఇది నీ సేవల కంకితమే

ఇది నాసుఖమని యేమున్నదయా ఇది నీలీలా విలాసమే
అది దుఃఖంబని యేమున్నదయా అది నీ లీలా విలాసమే
ఇది మంచిదని యేమున్నదయా యేదైనను నీ విలాసమే
ఇది చెడ్డదని యేమున్నదయా యేదైనను నీ విలాసమే

ఇది నాపలుకని యేమున్నదయా యిటుపలికించున దీవేలే
అది యిదియని యేమున్నదయా అన్నియు నీకళలే
ఇది నాదని యేమున్నదయా యేదయినను నీవిచ్చినదే
సదయా శ్రీరఘురామా ఇటులే చక్కగ సాగిపోదమురా





 






వినరెవ్వరు మంచిమాట నినకులేశ్వర

వినరెవ్వరు మంచిమాట నినకులేశ్వర
వినిపించుట మానహానియును రామచంద్ర 

వినరు కదా నశ్వరములు మనతనువు లంటే
వినరు కదా సంసారంబును దుర్భర మంటే
వినరు కదా సిరిసంపదలను దుస్సహ మంటే
వినరు కదా యీ‌కలిమాయను తెలియం డంటే
 
వినరు కదా హరికీర్తనమును చేయం డంటే
వినరు కదా హరికిపూజలను చేయండంటే 
వినరు కదా హరిభక్తాళిని చేరం డంటే
వినరు కదా భవబంధము లను విడువం డంటే

వినరు కదా భాగవతంబును చదువం డంటే
వినరు కదా రామాయణమును చదువం డంటే
వినరు కదా పరమార్ధంబును తెలియం డంటే
వినరు కదా రామనామమును చేయ మంటే

మాంపాహి శ్రీరామ మహనీయమూర్తీ


మాంపాహి శ్రీరామ మహనీయమూర్తీ
మాంపాహి శ్రీకృష్ణ మంగళమూర్తీ

వందారు భక్తజన మందార రఘురామ ఇందీవరశ్యామ మాంపాహి
కందర్పశతకోటిసుందరా సానంద నందనందన కృష్ణ మాంపాహి

సురవైరిగణనాథకులనాశకా లోకశోకాంతకా రామ మాంపాహి
కురుకులకమలవనదావానలా కృష్ణ గోవింద మాధవ మాంపాహి

భక్తజనపోషకా పరమపురుషా రామ ముక్తిప్రదాయక మాంపాహి
భక్తజనపోషకా పరమపురుషా కృష్ణ ముక్తిప్రదాయక మాంపాహి



సంపాదించరా ధనము సంపాదించరా యింకా ..

సంపాదించరా ధనము సంపాదించరా యింకా
సంపాదించు మనుచు జగము సలుపుచుండు‌రా

జపముచేయరా నామజపముచేయరా యింకా
జపముచేయరా యనుచు జగ మడుగదురా
విపరీతముగా ధనము విలాసములకై వలయు
నపమార్గము చేతనైన నార్జించ మనును జగము

రాముడెక్కడా సీతారాముడెక్కడా యింకా
రామచంద్రుని కరుణ రాదేమి యనునా
ఏమయ్యా యదికావలె నేమయ్యా యిదికావలె
ఏమయ్యా తేవింకా యెపుడు తెచ్చె దను జగము

కష్టపడకురా యింక కష్టపడకురా ఇక నీ
యిష్టదైవమునకు సమయ మీయరా యనునా
కష్టపడి యార్జించక యిష్టమైన విలాసాలు
నష్టపడుట కుదురునా నరుడా తెమ్మను ధనము











8, జులై 2021, గురువారం

నాతప్పులెన్నెదవు నారాయణా

నాతప్పు లెన్నెదవు నారాయణా నేను
నీతప్పులెన్నెదను నీసెలవైన

కావు మీశ్వర యని క‌రిరాజు మొత్తుకొన
నేవేళ కరుదెంచినావో ఏనుగిక
చావబోయెడు వేళ చటుకున నూడిబడి
నీవద్భుతము జేసి నావయ్య బళిబళి

కురుసభను మానిని గొల్లుమనుచు నుండ
మరి యెందు దాగుండి నావో మానినికి
మరియాద చెడుచుండ మరియంతలోనె
పరిరక్షణము చేయ వచ్చితివి బళిబళి

ఏమి చేసెను మున్నింతిని సొదబెట్టి
కామారిప్రభృతులు రాముడా యిదియేమి
యే మన్న నాపైన నింపార గొంటివి
స్వామి నీ చెయుద మీ చాడ్పాయె బళిబళి





హరిహరి హరిహరి యనవే మనసా

హరిహరి హరిహరి యనవే మనసా
హరిస్మరణము విడనాడకు మనసా

హరియే విశ్వం‌ బనవే మనసా
హరియే సర్వం బనవే మనసా
హరియే దైవం‌ బనవే మనసా
హరినా ప్రాణం‌ బనవే మనసా

హరి నామమె చాలనవే మనసా
హరిస్మరణమె చాలనవే మనసా
హరిపూజలె చాలనవే మనసా
హరిభక్తియె చాలనవే మనసా

తారకమంత్రము తలచవె మనసా
చేరవె హరినే శీఘ్రమె మనసా
శ్రీరఘురాముడె శ్రీహరి మనసా
కోరిన కోరిక తీరునె మనసా


తరుణమిదే హరిస్మరణంబునకు

తరుణమిదే హరిస్మరణంబునకు
నరుడా కలితో నడువకురా

ఎన్నిజన్మముల నెత్తితివో యిం
కెన్నిజన్మముల నెత్తుదువో యిపు
డున్నది మంచియుపాధిరా హరి
నెన్ని భజించి తరించుమురా

కరుణగలాడై హరియున్నాడని  
యెఱుగవొ కలితో తిరిగేవు సదా
నరజన్మమును హరికర్పించక
తిరిగిన పాపము తరుగదురా

మదిలో రాముని స్మరణము చేసెడు
సదమలచిత్తులు ముదితాత్ములకు
ముదమున శ్రీహరి ముక్తినొసంగును
యిదిగో స్మరణము నికపై చేయుము















స్మరింంచక నీనామము తరించుట సాధ్యమా

స్మరింంచక నీనామము తరించుట సాధ్యమా
పరంతప రామచంద్ర భవసాగరము

పదివేలజన్మలెత్తి పదికోట్ల మంత్రములు
పదేపదే వల్లించిన ఫలితమే ముండును
కుదురైన భక్తితో గోవింద నారాయణ
సదయా శ్రీరామయను స్మరణ ముఖ్యము

నీనామము పలుకక నీచరితము చదువక
నీనిజతత్త్వమును బుధ్ధిలోన తలపక
పూని యేవేవో చదివి పైన నింకేమొ పలికి
యేనాడును ముక్తి పొంద డెవడును నిజము

హరిభక్తి బడయకుండ హరిభక్తులను తిట్టి
తిరుగు నరుల సమవర్తి తిట్ఠకుండ వదలునే
హరిస్మరణము పండినపుడు మరలజన్మమున్నదా
హరిభక్తులకు ముక్తి యరచేతి పండు

7, జులై 2021, బుధవారం

మఱలమఱల నొక నరశరీరము

మఱలమఱల నొక నరశరీరము
దొఱకునా నీకది దొఱకినను

హరిభక్తియు నీ కబ్బేనో
హరిభక్తిలేని నరజన్మమది
హరిహరి యోర్వగ తరమౌనా
త్వరపడు మిపుడే తరింపగ

హరినితెలుపు చదువబ్బేనో
మరియితరములను మానుగచదివి
హరిహరి బ్రతుకగ తరమౌనా
త్వరపడు మిపుడే తరింపగ

హరేరామయని హాయిగా
స్మరణము చేయుట మరి యదికలదో
హరిస్మరణమునే మరచుటయా
త్వరపడు మిపుడే తరింపగ





భక్తులు శ్రీరఘురాముని కీర్తన పాడుచునున్నా రదిగో

భక్తులు శ్రీరఘురాముని కీర్తన పాడుచునున్నా రదిగో జీవ
న్ముక్తులు రాముని పాదంబులకు మ్రొక్కుచునున్నా రదిగో

పౌరాణికులు రామాయణమును పలుకుచునున్నా రదిగో
పౌరులు రాముని గాథలనెన్ని పలుకుచునున్నా రదిగో
వీరులు రాముని విజయశీలమును విశదము చేసే రదిగో
నారీమణులు రామజయంబని నవ్వుచు పలికే రదిగో

వేదమంత్రముల వేదవేద్యునే విప్రులు పొగిడే రదిగో
వేదాంతులు రఘురాముని తత్త్వము విశదము చేసే రదిగో
శ్రీదయితుని కథ నటులు సొంపుగ చెలగి నటించే రదిగో
మోదముతో పురముఖ్యులు రాముని పొగడుచు తిరిగే రదిగో

గాయకు లందరు రాముని కీర్తిని కమ్మగ పాడే రదిగో
తీయని కవితల రాముని కవులు హాయిగ కొలిచే రదిగో
ప్రాయపు పడుచులు నాట్యాంజలులను రామునకిచ్చే రదిగో
శ్రీయుతమూర్తిని చూడగ నింగిని చేరిన సురగణ మదిగో


6, జులై 2021, మంగళవారం

నరుని రక్షించు హరినామస్మరణము

నరుని రక్షించు హరినామస్మరణము
తరణోపాయమిదే తప్ప వేరు లేదు

సవనంంబు లిన్ని చేసి సత్కార్యము లన్ని చేసి
భవసాగర మీదుద మని భావించుట వెఱ్ఱి
నవనీతహృదయుడైన నారాయణు నామమలే
యవిరళముగ జపియించక భవము దాటడు

మంచివిద్య గలవారును మంచితనము కలవారును
కొంచెము చదువైన నేర్చుకొననట్టి వారలును
అంచితముగ రామనామ మందు శ్రధ్ధజూపిన తరి
యించవచ్చు భవసాగర మిది సత్యము

ఒరుల తప్పు లెన్నుటకే యుబలాటపడు నాల్కకు
హరినామము చేయుటయే యలవడెనా మేలు
హరేరామ హరే‌కృష్ణ యని పలుకుచునుండు వాడు 
నిరాటంకముగ భవమును తరియించును


వేడండీ వేడండీ

వేడండీ వేడండీ వీడే రాముడు
వేడుకతోవరములిచ్చు వాడు దేవుడు

సందేహపరులకును సంకోచపరులకును
వందనం బని మీరు  వచ్చిమ్రొక్కండి
ఇందిరారమణుడే ఈరామచంద్రుడై
యందరి మేలు కోరి యవతరించినాడు

ముందటి జన్మమందు మ్రొక్కినారో లేదో
యెందుకిపు డామాట యిపుడు వేడండి
అందరి వాడండి అడుగువారి కోరిక
ముందే గమనించును ముచ్చటదీర్చును

కందర్పకోటికోటిసుందరు డితడండి
వందారుభక్తజనమందారు డితడండి
వందనీయు డితడండి బ్రహ్మాదులకునైన
వందన మన్నంతనే వరమిచ్చునండి

పనవుచున్నాను నేను ధనముల కొఱకు

పనవుచున్నాను నేను ధనముల కొఱకు
వినుము నాస్థితి నాకే వింతగ దోచు

కొంచెపుసరు కనవచ్చు కొరగాని దనవచ్చు
మంచిదికా దనవచ్చు మనసులే దనవచ్చు
కొంచుబో మనవచ్చు గొప్పగొప్పగ
ఎంచి యద్దానికై యెంతో తహతహ

పసిడి చెడ్డదనవచ్చు పాపహేతు వనవచ్చు
విసమువంటి దనవచ్చు వేడరాని దనవచ్చు
ఉసురుతీయు ననవచ్చు నొప్పుమాటల
అసలు దానికే కదా యయ్యో తహతహ

మాని యట్టి తహతహలు మానవోత్తమ రామ
నేను నీయందు బుధ్ధి నిలిపి యుంద మంటె
దానికేమి నీతలపే కానిమ్మనదు
మానరాని సంసారమాయామోహము







జానకీరమణ నిన్ను చక్కగా కొలువక

జానకీరమణ నిన్ను చక్కగా కొలువక
మానవుడిక తరించగా మార్గమేది

నీనామము ప్రేమతోడ నిరతమును పలుకనిచో
మానవుడు విరాగియగు మాటకలదె
మానవుడగు దానవుడగు మనసార పలుకునెడ
నీనామము పండించును వానిబ్రతుకు

నీసేవను నిష్ఠతోడ నిరతమును చేయనిచో
చేసి ధనపిశాచిసేవ చెడును కాక
వీసమంతైన వాడు వెంటబెట్టుక పోడు
దాసుడైన నీకు బ్రతుకు ధన్యమగును

నీనామము నీరూపము నీచరితము కాక
మానవునకు చాల ముఖ్యమైనది కలదె
హీనుడగుచు నిహసుఖముల కెగబడుట మాని
తాను నీమఱువుసొచ్చిన తరియించును




రామ రామ వైకుంఠధామ

రామ రామ వైకుంఠ
ధామ ప్రేమసాగర

రామ సుగుణభూషణ
రామ సుజనపోషణ
రామ విగుణశోషణ
కామితార్ధద

రామ తాటకాంతక
రామ విరాధాంతక
రామ రావణాంతక
రామ రాఘవ

రామ సీతానాయక
రామ జగన్నాయక
రామ ముక్తిదాయక
హే మనోహరా

నిను నమ్ముకొని యుంటిరా

నిను నమ్ముకొని యుంటిరా శ్రీరామ 
     నిబ్బరంబుగ నుంటిరా
నను నీవు గమనింపరా నారామ 
     నామీద దయయుంచరా

తనువు స్వాస్థ్యముదప్పి తహతహ పడుగాక
ధనము లార్జించక దినము లేగతి దొఱలు
వినవయ్య నే తెచ్చు ధనము ముఖ్యము కాని
జననాధ నాపట్ల జాలి యెవ్వరికి
హరి హరి దినమెల్ల నార్జన కర్పించి
తరచు నీ ధ్యానమే తప్పుచున్నానయ్య
పరమాత్మ నీవు నాపాట్లను గమనించి
సరిపుచ్చుకొనవలెను సాకేతరామ

ఎన్నాళ్ళు గడుచునిటు లెఱుగకున్నానయ్య
ఎన్నేళ్ళు ధనములార్జింజి పోసిన కాని
ఎన్నడును చాలుచాలన్న మాటేరాదు
మన్నించి నాబాధ మరలించవయ్య


5, జులై 2021, సోమవారం

వచ్చినాడు శ్రీహరి దిగివచ్చినాడు

వచ్చినాడు శ్రీహరి దిగివచ్చినాడు
వచ్చి దశరధుని యిల్లు సొచ్చినాడు

సొచ్చి శ్రీరాముడను సొంపైన పేరుతో
మెచ్చగా జగమెల్ల మెఱసినాడు
ముచ్చటగా విద్యలెల్ల మోహనాంగు డంతట
హెచ్చైన శ్రధ్ధతో నేర్చినాడు

దనుజసంహారమును మునియాగరక్షణము
మొనలతో సాధించి మునివెంబడి
జని మిథిలకు పశుపతి ధనువునెత్తి జానకి
వనిత నర్ధాంగిగ బడసినాడు

తన వనితను మ్రుచ్చిలి జనిన రావణుని యుధ్ధ
మున సబాంధవముగా మొత్తినాడు
తనను గొల్చు భక్తులను తద్దయు ప్రేముడితో
తనయొద్దకు రప్పించుకొను చున్నాడు



4, జులై 2021, ఆదివారం

మీవిధానమేదో మీరు తెలుపుడీ

మీవిధానమేదో మీరు తెలుపుడీ
దైవమా రాముడని మావిధానము

దైవమే లేడనుచు తలచు టొక్క విధము
దైవము తనవాడని తలచు టొక్క విధము
దైవమునకు బంటునని తలచు టొక్క విధము
దైవమును తనలోన దర్శించు టొక్క విధము

దైవముతో పనియేమని తలచు టొక్క విధము
దైవకార్యమే పనిగా తలచు టొక్క విధము
దైవసేవ కన్యమెపుడు తలపని దొక విధము
దైవసేవ లోన తాను తరియించు టొక విధము

దైవమని రాముని లోదలపని దొక విధము
దైవమా రాముడనెడు భావన యొక విధము
దైవమగు రామునకు దాస్య మొక్క విధము
దైవము రామునితోడి తాదాత్మ్య మొక విధము


దరిసెనమిఛ్చి నన్ను దయజూడర

దరిసెనమిచ్చి నన్ను దయజూడర నీవు
కరుణగలాడవు కాదటర

శ్రీరామచంద్ర యని సీతాపతీ యని
ఓ రాఘవా  జగదోధ్ధారకా యని
నారాయణా యని నాకన్నతండ్రి యని
పేరుపేరున నిన్ను పిలచినా పలుకవు

నారక మనునది వేరెక్కడున్నది
ఘోరాతిఘోరసంసారమె నరకము
రారా దరిసెన మీర రామచంద్రా కన్ను
లారా నిన్ను చూడ తీరు సంసారము

నారాయణా నీవు నన్ను రక్షించవో
వేరెవ్వరున్నారు వేడుకొనగ నాకు
రారా కలలో నైన శ్రీరామ కనుపించి
భూరికృపాళుడన్న పేరు నిలుపుకొనర

నామనవిని వినవయ్య నారాయణ

రామ రామ నారాయణ రఘుపుంగవ నీవు
నామనవిని వినవయ్య నారాయణ

వేయిజన్మములుగ నారాయణ బ్రతుకు
హాయన్న దెఱుగనో నారాయణ
చేయెత్తి మ్రొక్కెదెను నారాయణ ఇది య
న్యాయమే యందును నారాయణ

మరి యెన్ని జన్మములు నారాయణ నేను
ధరమీద గడుపుదును నారాయణ
తరచు రాకపోకల నారాయణ నా
కొరుగున దేమున్నది నారాయణ

పరమాత్ముడవయా నారాయణ నాకు
తిరుగుడు తప్పించుము నారాయణ
దరిజేర్చుకొనవయ్య నారాయణ యింక
కరుణజూపించుము నారాయణ




మంచిచెడ్డ లెఱుగునా మన రాముడు శిశువమ్మా

మంచిచెడ్డ లెఱుగునా మన రాముడు శిశువమ్మా
కొంచె మోర్చుకోవమ్మా కోపమేలమ్మా

రాముని బొమ్మవిల్లు లాగికొన జూచితివి
రాముడు కోపించి నీ మోమున విసిరె
సామెత చెప్పిట్లు సరికిసరిగ చెల్లాయె
ఈమాత్రమునకు కోప మెందు కమ్మ

ఆసపెట్టి యొకబొమ్మ నీవందించ వేఱొకటి
మోసమునకు కినిసి వాడు మొత్తెను నిన్ను
చేసుకున్నవారికి చేసుకున్నంతాయె
దోసమెంచ నేల వాడు దుడు కటంచు

భరతు డిట్లు చేయడే వంటి మాట లెందుకు
భరతుడైన రాముడైన పసిబాలురే
సురలు కూడ పొగడగ నరపాలుని బిడ్డలను
మురిపెముగ చూడమే ముందుముందు


ఏమయ్యా రామయ్యా ఏమని నిను పొగడుదురా

ఏమయ్యా రామయ్యా ఏమని నిను పొగడుదురా
ఏమి మధురనామమురా యీశ్వర నీది

కామితార్ధవరదుడ ఘనుడా వైకుంఠ
ధాముడా శ్రీహరి దయాలవాల
భూమికి దిగినావు మాపుణ్యముపండి
మామనసుల నిండినావు మాభాగ్యము

రామ రామ యనినచాలు రక్షించబడుదురని
భూమిని చాటించినట్టి పుణ్యచరిత్ర
నీమహిమ చాటినారు నీరేజాసనుడును
కామారియు నింక పొగడగా నాతరమా

రామ హరే కృష్ణ హరే రాజీవనయన హరే
పామరుడను నన్ను కావవయ్యా శ్రీహరీ
నీమహిమ పొగడలేను నిన్ను ధ్యానించలేనని
నామభజన చేయగలను నన్నేలరా




రాముడనై లోకములను రక్షించెద

రాముడనై లోకములను రక్షించెద నేను
కాముకుడగు రావణుని కడతేర్చెద

అని పలికి దేవతల కభయమిచ్చి దశరథ
తనయుడవై నారాయణ ధరకు విచ్చేసి
మనుజులకు సధ్ధర్మ మార్గము నుపదేశించి
జనులమెప్పు బడసితివి వనవాసము చేసితివి

అని పలికిన దేవ నీవు దనుజకోటి నణగించి
మునులమెప్పు రామా చేగొనినావయ్య
నిను మోసముచేసి సీతను రావణు డపహరించ
నని వానిని తెగటార్చి ఘనత చాటినావు

అని పలికన నీపలకు లమోఘంబులై నిలచె
అనిని రావణునిచా వఖిలలోక హితకరమై
వనితలకది శుభవార్తగ వ్యాపించెను
మునులు సురలు నారాయణ నిను పొగడిరంత





3, జులై 2021, శనివారం

జయజయ రామ హరే

జయజయ రామ హరే జయజయ రామ హరే
జయజయ దుర్భరసంసారాపనయన హరే

దశరథనందన జానకిరమణ ధర్మావతార హరే
ప్రశమితభార్గవరామదవానలవార్షుకమేఘ హరే
దశముఖమర్దన దానవవంశవిదారణ రామ హరే
విశదయశోవివర్ధననిరుపమవిక్రమ రామ హరే

కైలాసాధిపప్రముఖప్రశంసితశీల మహాత్మ హరే
నీలగగనఘనశ్యామమహాద్భుతనిర్మలమూర్తి హరే
పాలితత్రిభువన భండనభీమ పట్టాభిరామ హరే
కాలాతీత సుగుణోపేత కరుణాధామ హరే

చింతాశోకప్రశమనతత్పర సీతారామ హరే
చింతితఫలప్రద శీఘ్రఫలప్రద శ్రీరామచంద్ర హరే
శాంతస్వరూప చిరసుఖరూప సాకేతరామ హరే
భ్రాంతినివారణ కైవల్యకారణ రామచంద్ర నృహరే

ఈశ్వరు డితడని యెఱుగని వారికి

ఈశ్వరు డితడని యెఱుగని వారికి
శాశ్వతానందము సమకూరునా

సమకూరునే కాక సత్కర్మలను జేసి
సమధికైశ్వర్యమును సంతోషగరిమ
అమరునేగాక పుణ్యాత్ములకు స్వర్గ
మమరునా కైవల్య మంత మాత్రమున

బహుమంత్రముల చేత బహుదేవతల గొల్చి
బహుసిధ్ధులను వశపరచుకొను కాక
బహుపదవులను గెలువవచ్చునే కాక తా
విహరించ మోక్షపురవీధులను వశమా

రామచంద్రుడె మోక్షప్రదుడు సర్వేశుడని
రామమంత్రము నెపుడు రసనపైనిల్పి
రాముని మిక్కిలి ప్రేమతో సేవించు
ధీమంతులకు ముక్తి దీపించు గాక




1, జులై 2021, గురువారం

ఇచట భోగించవలె

ఇచట భోగించవలె నెంత పుణ్యమున్న నీ
విచట ననుభవించవలె నే పాపఫలమైన

పొంది స్వర్గమును నీవు పుణ్యముల మూలమున
నందు చేయువిహారంబు లవి బహుమతులు
అందాల స్వర్గవాస మనుభవించి పుణ్యము
బొందితో భోగించగ భూమికి రావలయును

చేసినట్టి పాపములకు శిక్షగా నరకమున
గాసి నొందు చటుల కొంత కాలము పిదప
నీసురో మనుచు మెక్క నీ భువికి రావలెను
చేసుకున్న వాటి కిటుల చెల్లువేయ వలయును

భూమికిట్లు రప్పించెడు పుణ్యపాపాలేల
రామనామముండ నీకీ రాపిడి యేల
కామిత మొక మోక్షమే కావున శ్రీరాముని
యేమరక నీవు సేవించుటే ముఖ్యము 


కాదనరాని మహిమలు గలిగిన

కాదనరాని మహిమలు గలిగిన ఘనుడయ్యా యితడు
వేదవేద్యుడని పెద్దలు నుడివిన  వీరుడు రాఘవుడు

వేయిమందికిని లొంగని రుద్రుని వింటిని వీడెత్తె
హాయిగ నెత్తగ జ్యానెక్కించెడు నప్పుడదే విరిగె
న్యాయము కాదని భార్గవు డనగ  నాతని నెదిరించె
శ్రీయుతమూర్తి వైష్ణవధనువును చేనంది నవ్వె

ముల్లోకములకు ముప్పై నిలచిన మూర్ఖుడు రావణుని
ఇల్లాలిని రక్షించుట కొఱకై హెచ్చరించి తాకె
ప్రల్లదు గుండెలు బ్రద్దలుచేసెను బ్రహ్మాస్రముచేత
తెల్లముగా రఘంరాముని కీర్తియు దెసలను వ్యాపించె

వీనిపక్షమున పోరిన వానరవీరులు పదిలమట
కాని రక్కసుల మూకసమస్తము కాటికి పోయెనట
జానకి నాథుడు నారాయణుడని చాటెనుగా నలువ
ఔనని శివుడును సెలవిచ్చెనిదే హరియే రాఘవుడు


నిజమైన ధనమనగ

నిజమైన ధనమనగ నీనామమే మాకు
ఋజువైన పనియనగ నీసేవయే

నరులమై పుట్టుట నారాయణ మాకు
తిరమైన నీకృపయె తెలియగాను
మరి రామనామము మాకబ్బినది యన్న
తిరమైన నీకృపయె తెలియగాను

పరమాత్మ నినుగూర్చి పాడుభాగ్యము మాకు
తిరమైన నీకృపయె తెలియగాను
పరవశించి మేము పాడుచున్నామంటె
తిరమైన నీకృపయె తెలియగాను

మరి నీవు మన్నించి మాసేవ లొప్పుట
తిరమైన నీకృపయె తెలియగాను
చిరుసేవలకు మురిసి వరము లిచ్చేవంటె
తిరమైన నీకృపయె తెలియగాను



మనసే శ్రీరామమంది‌రము

మనసే శ్రీరామమంది‌రము వా డి
చ్చిన వరమేలే యీ జీవితము

హరిసేవలకై యమరిన వివిగో
పరికరములు కడు వాటముగ
కరచరణములనగా తనువున
మరి యన్యములకు మరలవవి

హరికీర్తనకై యమరిన దిదిగో
అరయుడు నాలుక యను బాకా
హరినామముగా కన్యము పలుకదు
పరాయివారికి పలుకదది

హరిమందిరమున నర్చనచేయగ
హరి నియమించె నదిచాలు
హరిపూజారికి హరియేసర్వము
హరియే జీవిత మదిచాలు




చేయండి చేయండి చిన్నినామము

చేయండి చేయండి చిన్నినామము తీయ
తీయని మన రామదేవుని నామము

చేయండి సుజనకోటి చేయునామము మీరు
చేయండి హరిని తెలియజెప్పు నామము
చేయండి కలిమాయ చెఱచునామము మీరు
చేయండి శ్రీహరిదరికి చేర్చునామము

చేయండి నిచ్చలును చిత్తశుద్ధితో మీరు
చేయండి హరిభక్తి గలిగి శ్రధ్ధతో
చేయండి రాముడు రక్షించితీరును మీరు
చేయండి చింతలన్ని చెదరిపోవును

చేయండి సామీరి చేయునట్లుగ మీరు
చేయండి శివుడెపుడు చేయునట్లుగ
చేయండి నామభజన శ్రేష్ఠకార్యము మీరు
చేయండి చేయించండి రేయింబవళ్ళు

ప్రేమమయాకృతివి నీవు

ప్రేమమయాకృతివి నీవు రామచంద్రుడ
మామీదను దయజూపుము రామచంద్రుడ

శరవర్షము కురిపించెడు జాణవు నీవు
వరవర్షము కురిపించెడు వాడవు నీవు
నిరుపమాన సుగుణగణాన్వితుడవు నీవు
నరుడవా కావు కావు నారాయణుడవు

పరమయోగిపూజితుడగు వాడవు నీవు
పరమసుఖము నందించెడు వాడవు నీవు
పరబ్రహ్మ స్వరూపుడవు పరమాత్ముడవు
సరి సరి నరుడవా సాక్షాత్తు హరివే

సురకార్యము మదినితలచి సురుచిరలీల
విరచించిన రామాకృతి వేదవేద్యుడ
ధరను పావనము చేసెను దానవాంతక
అరయ భవతారకమై అలరె నీపేరు

రాముడు రాముడు రాముడు

రాముడు రాముడు రాముడు
రాముడు భువనాధారుడు

రాముడు సురగణ వంద్యుడు
రాముడు మునిగణ వంద్యుడు
రాముడు త్రిజగద్వంద్యుడు
రాముడు రవికుల భూషణుడు

రాముడు సుగుణగణాన్వితుడు
రాముడు రణవిజయాన్వితుడు
రాముడు సుజనోపాస్యుడు
రాముడు శుభవరవితరణుడు

రాముడు సీతాసమేతుడు
రాముడు హనుమత్సేవితుడు
రాముడు భక్తజనాశ్రయుడు
రాముడు హరి పరమేశ్వరుడు