7, జులై 2021, బుధవారం

భక్తులు శ్రీరఘురాముని కీర్తన పాడుచునున్నా రదిగో

భక్తులు శ్రీరఘురాముని కీర్తన పాడుచునున్నా రదిగో జీవ
న్ముక్తులు రాముని పాదంబులకు మ్రొక్కుచునున్నా రదిగో

పౌరాణికులు రామాయణమును పలుకుచునున్నా రదిగో
పౌరులు రాముని గాథలనెన్ని పలుకుచునున్నా రదిగో
వీరులు రాముని విజయశీలమును విశదము చేసే రదిగో
నారీమణులు రామజయంబని నవ్వుచు పలికే రదిగో

వేదమంత్రముల వేదవేద్యునే విప్రులు పొగిడే రదిగో
వేదాంతులు రఘురాముని తత్త్వము విశదము చేసే రదిగో
శ్రీదయితుని కథ నటులు సొంపుగ చెలగి నటించే రదిగో
మోదముతో పురముఖ్యులు రాముని పొగడుచు తిరిగే రదిగో

గాయకు లందరు రాముని కీర్తిని కమ్మగ పాడే రదిగో
తీయని కవితల రాముని కవులు హాయిగ కొలిచే రదిగో
ప్రాయపు పడుచులు నాట్యాంజలులను రామునకిచ్చే రదిగో
శ్రీయుతమూర్తిని చూడగ నింగిని చేరిన సురగణ మదిగో


1 కామెంట్‌:

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.