22, జులై 2021, గురువారం

అంటుకొనక మానవు అంటుకొనిన వదలవు

అంటుకొనక మానవు అంటుకొనిన వదలవు
తుంటరి సంసారమా తొలగిపోవే

ఎచటెచటి జీవులనో యీడ్చుకొని వచ్చేవే
ఇచట కూలనేసేవే యేడిపించేవే
ప్రచురమై నీమాయ పట్టరాని దాయెనే
విచిత్రములు చాలించి వెడలిపోవే

రామభక్తులతో నీపరాచికాలాపవే
నీమాయలు వారిముందు నిలువలేవే
కాముడు నీతోడైతే కానీవే దానికేమి ఆ
కామునితో కలసినీవు కదలిపోవే

హరుడు కాడు వీడు కాము నగ్గిబెట్ట డనుకొనకే
హరి వేరు హరుడు వేరనుకొనబోకే
హరియే శ్రీరాముడే యతనిభక్తు లసాధ్యులే
మరిమరి విసిగించక మరలిపోవే