24, జులై 2021, శనివారం

చేరవే రామునే చిత్తమా

చేరవే రామునే చిత్తమా కైవల్యము
చేరుమార్గ మదేనే చిత్తమా

చేరి రఘురాముని కోరి భజియించవే
నారాయణు డాతడని నమ్మవే
దారే లేనట్టి సంసారసాగరము దాటు
తీరు శ్రీరామభజన తెలుసుకోవే

పాపుణ్యముల చేత వచ్చుచుండు తనువులు
నీ పని ఆ రెంటిని నిరసించుటే
శ్రీపతి భక్తులకు లేవు పాపాలు పుణ్యాలు
తాపత్రయంబులును తనువు లన్నవి

భూరికృపాళువైన శ్రీరాముడై యున్న
వారిజాక్షు  పాదపంకేరుహంబుల
చేరి భజియించెడు వారికి కైవల్యమే
చేరువగు చుండు సంసారము తొలగి