1, జులై 2021, గురువారం

కాదనరాని మహిమలు గలిగిన

కాదనరాని మహిమలు గలిగిన ఘనుడయ్యా యితడు
వేదవేద్యుడని పెద్దలు నుడివిన  వీరుడు రాఘవుడు

వేయిమందికిని లొంగని రుద్రుని వింటిని వీడెత్తె
హాయిగ నెత్తగ జ్యానెక్కించెడు నప్పుడదే విరిగె
న్యాయము కాదని భార్గవు డనగ  నాతని నెదిరించె
శ్రీయుతమూర్తి వైష్ణవధనువును చేనంది నవ్వె

ముల్లోకములకు ముప్పై నిలచిన మూర్ఖుడు రావణుని
ఇల్లాలిని రక్షించుట కొఱకై హెచ్చరించి తాకె
ప్రల్లదు గుండెలు బ్రద్దలుచేసెను బ్రహ్మాస్రముచేత
తెల్లముగా రఘంరాముని కీర్తియు దెసలను వ్యాపించె

వీనిపక్షమున పోరిన వానరవీరులు పదిలమట
కాని రక్కసుల మూకసమస్తము కాటికి పోయెనట
జానకి నాథుడు నారాయణుడని చాటెనుగా నలువ
ఔనని శివుడును సెలవిచ్చెనిదే హరియే రాఘవుడు


1 కామెంట్‌:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.