23, జులై 2021, శుక్రవారం

తనకేమి యెఱుక రామ తన కేమెఱుక

తనకేమి యెఱుక రామ తన కేమెఱుక
కనుక కరుణజూపుమా కాదనక
 
తనను పంపు వాడెవడో తన కేమెఱుక  వాని
మనసులో నేమున్నదొ తన కేమెఱుక
తానెపుడు వచ్చునో తన కే‌మెఱుక మరలి
తానెపుడు పోవునో తన కేమెఱుక

తానేల వచ్చెనో తన కేమెఱుక వచ్చి
తానేమి చేయుచుండె తన కేమెఱుక
తానేమి యెఱుగునో తన కేమెఱుక తనకు
తానేల తెలియడో తన కేమెఱుక
 
తత్త్వ బోధ యన్న నేమొ తన కేమెఱుక యింక
తత్త్వచింతన మన్న తన కేమెఱుక 
తత్త్వవిదులెవ్వరో తన కేమెఱుక పర
తత్త్వము నీవే ననుచు తన కేమెఱుక
 
 

1 కామెంట్‌:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.