5, జులై 2021, సోమవారం

వచ్చినాడు శ్రీహరి దిగివచ్చినాడు

వచ్చినాడు శ్రీహరి దిగివచ్చినాడు
వచ్చి దశరధుని యిల్లు సొచ్చినాడు

సొచ్చి శ్రీరాముడను సొంపైన పేరుతో
మెచ్చగా జగమెల్ల మెఱసినాడు
ముచ్చటగా విద్యలెల్ల మోహనాంగు డంతట
హెచ్చైన శ్రధ్ధతో నేర్చినాడు

దనుజసంహారమును మునియాగరక్షణము
మొనలతో సాధించి మునివెంబడి
జని మిథిలకు పశుపతి ధనువునెత్తి జానకి
వనిత నర్ధాంగిగ బడసినాడు

తన వనితను మ్రుచ్చిలి జనిన రావణుని యుధ్ధ
మున సబాంధవముగా మొత్తినాడు
తనను గొల్చు భక్తులను తద్దయు ప్రేముడితో
తనయొద్దకు రప్పించుకొను చున్నాడు