15, జులై 2021, గురువారం

నిన్నే నమ్మినానురా నేనెందుబోదురా

నిన్నే నమ్మినానురా నేనెందుబోదురా
కన్నతండ్రి యితరుల కలనైన నమ్మను

నీవు పంపితేనే యిలకు నేను వచ్చినది నిజము
నీవు కోరి నంత కాలము నేనిందే యుందును
భావనలో నిన్నే నింపి పలుకుచునే యుందును
నీవాడనే నని నమ్ముము నేనెందు బోదురా

ఎవరెవరినో గొప్పవారని యెట్లు నమ్మగలనురా
దివిని భువిని నీవొకడవే దేవుడవై యుండగ
అవడుబుధ్ధు లేవేవో యరసి పలుకుచుందురు
భువిని నాయునికి నీకై పొడమినదే యగుటచే

రామచంద్ర నీసద్యశము రాజిల్లగ చిరకాలము
భూమిని నీకొఱకై నిల్ఛి ముచ్చటగ పాడుదును
నీమ మిట్లు నాకున్నదే నేడు దారితప్పను
నీమహిమ వలన నిచ్చలు నీవాడనే యగుదును



2 కామెంట్‌లు:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.