21, జులై 2021, బుధవారం

ఒక్కమాట చెప్పవయ్య

ఒక్కమాట చెప్పవయ్య యుర్వినున్న వారెల్ల
నిక్కువముగ నీకళలై నేలనున్న వారేగా

అందరును నీకళలై యవనిపై నుండగ
కొందరికి లేనిపోని గొప్పలేమి
కొందరను తక్కువగ కువలయ మెంచుటా
అందరొక్కటే కద యరమరి కేలయ్య

పామైన చీమైన పట్టపుటేనుగైన
సామవేదియైన వట్టి జడుడైనను
స్వామి నీ కళావిలాసంబులే యగు నెడ
ఏమయ్య బేధముల నెంచగ నేలయ్య

నీమాయచే మేము నిజమెఱుగము కాని
ఆ మాయ పొరతొలగ నందరొక్కటే
రామచంద్ర జానకిరమణ నిన్ను మాలో
ధీమంతులమగుచు తెలియగ నీవయ్య

1 కామెంట్‌:

  1. బాగుంది.. అందరూ ఇలాంటి కీర్తనలు చదివితే ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారు

    రిప్లయితొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.