10, జులై 2021, శనివారం

ఇట్టిట్టి దనరానిది రామనామము

ఇట్టిట్టి దనరానిది రామనామము చాల
    గట్టిమేలు చేయునది రామనామము

సాధారణమేమి కాదు రామనామము బహు
    బాధల నడగించు నండి రామనామము
మాధుర్యంబున దొడ్ద రామనామము భవ
    వ్యాధిని తొలగించునండి రామనామము

శక్తినిచ్చు మంత్రమండి రామనామము కడు
   రక్తి గూర్చు మంత్రమండి రామనామము
మక్తినిచ్చు మంత్రమండి రామనామము బహు
    భక్తికలిగి చేయండి రామనామము

సమ్యగ్జీవన  మిచ్చును రామనామము మిము
    సరియైన దారి నుంచు రామనామము
రమ్యమైన మంత్రమండి రామనామము మిము
    గమ్యమునకు చేర్చు నావ రామనామము

ఎల్లెడల జయమిచ్చును రామనామము మిము
    తల్లివలె రక్షించును రామనామము
కొల్లలుగ సిరులిచ్చును రామనామము బ్రతు
    కెల్ల పండించునండి రామనామమము

నిరుపమాన మంత్రమండి రామనామము మిము
    కరుణించును శీఘ్రమే రామనామము
పరమహంసమంత్రమండి రామనామము మిము
    పరమాత్ముని దరికి చేర్చు రామనామము

పెద్దలార చేయండి రామనామము మరు
    వద్దండి మీకు రక్ష రామనామము
అద్దరి కిద్దరికి లంకె రామనామము మిము
    దిద్దునండి యోగ్యులుగా రామనామము

పిల్లలకు నేర్పండి రామనామము పసి
    పిల్లలకు రామరక్ష రామనామము
ఎల్లప్పుడు చేయండి రామనామము మిము
    చల్లగా చూచునండి రామనామము