29, జులై 2015, బుధవారం

సృష్టి
శా. నీవే చేసితి వింత సృష్టియును నీ నిర్మాణచాతుర్యమున్
భావింపం గడు శక్తిహీనులు గదా బ్రహ్మాండసంచారులౌ
జీవుల్ బేలలు వారికే మెఱుక నీ చేతల్ తలంపుల్  ప్రభూ
నీ వైదగ్ధ్యము నీది పావులు కదా నీక్రీడలో నెల్లరున్
ఉ. ఆటయె గాక లోకముల నందముగా సృజియించి వాటికే
చేటును గల్గనీయక విశేషకృపాన్వితదృష్టి భ్రోచుచున్
మాటికి వాటిలో దిరుగ మక్కువజూపుచు నంతలోన మో
మాటము లేక నన్నిటిని మాయము చేయుట నేమి యందునో
మ. అది కాదోయి మహానుభావ మరి నిన్నాందరూపుండునా
చదువుల్ ప్రస్తుతి జేయుచుండు గనుకన్ సర్వేశ క్రీడార్థమై
పదునాల్గో పదివేలొ లోకముల నుత్పాదించి నావన్న చో
నది హాస్యాస్పదమైన మాట యనరా అథ్యాత్మవేత్తల్ ప్రభూ
మ. వివిధోత్తుంగతరంగసంతితిని యే వేళన్ గభీరార్ణవం
బవిరామంబుగ దోపజేయు నది క్రీడార్థమై చేయు నా
నెవరైనం దలపోయు టుండదు కదా యేరీతి స్వాభావికం
బవు మున్నీట తరంగసంఘ మటు నీ యందొప్పు సృష్ట్యాదులున్
ఉ. నీ దగు దివ్యతేజమున నిండని దేమియు లేదు సృష్టిలో
మేదిని హేతువాదులగు మిత్రులు కొందరు నీవు లేవు నా
వాదన చేయుచుందు రటువంటి యమాయకు లాడు మాటలన్
వేదన చెందకన్ హృదయవేద్యుని నిన్ను భజింతు నెప్పుడున్
ఉ. సృష్టికి పూజనీయతయె శూన్యమటంచు వచింతు రక్కటా
దుష్టమనస్కులైన విమతుల్ మరి వారల బోధనంబనన్
సృష్టియొనర్చినందులకు చేయగ వచ్చును నీకు పూజ యు
త్కృష్టత నొప్పు సృష్టి కిడరాదొక యించుక గౌరవంబనన్
ఉ.అరయగ సృష్టియంతయు మహాత్మ త్వదీయ విభూతి లేశమై
పరమపవిత్రమైనదను భావన నుండెద దీని యందు నీ
సురుచిరమూర్తినే కలయజూచుచు నుందును నీకు మ్రొక్కి నీ
చరణనఖాంకురంబులను జల్పములంచన నేను వెఱ్ఱినే
ఉ. అణువున నైన నీవు గల వందురు సృష్టిని జొచ్చి సత్యమే
అణువగు నీ స్వరూపమున నందురు సృష్టిని గూర్చి సత్యమే
గుణమగు నెట్లు చెప్పినను  కొంచెపు బేధము దృష్టికోణమే
ప్రణతులు విశ్వరూప నిను భావన జేసెడు భాగ్యముంచవే

ఏమి ఆడించేవయా రామఏమి ఆడించేవయా రామ
ఏమి పాడించేవయా
నీ మాయలో ముంచి నిండారు ప్రేమతో
వేమారు సరిక్రొత్త వేషాలు వేసి


నీవు చేసిన సృష్టి నీ యాన చొప్పున
భావించి చొచ్చితిని పరమాదరమ్మున
నీవు చూపిన దృష్టి నే బఱప నందున
భావించ లేనైతి నీ సృష్టి పెలుచన
  అరయ నిది యెల్ల నీ యాటయే నాయె
  సరికొత్త వేషాన తిరిగి మొదలాయె


నీ మాట మఱచితి నీ యాన మఱచితి
నీ సౌరు మఱచితి నీ తీరు మఱచితి
నీ ప్రేమ మఱచితి నీ యున్కి మఱచితి
నిన్ను నే మఱచితి నన్ను నే మఱచితి
  అరయ నిది యెల్ల నీ యాటయే నాయె
  సరికొత్త వేషాన తిరిగి మొదలాయె


నిను నేను మఱచినా నను నీవు మఱువవు
నను నేను మఱచితే కొనగోట మీటి
అనుకొన్న రీతిగా ఆడించుతావు
ఘనుడ నీ యాటలో గడితేర నైతి
  అరయ నిది యెల్ల నీ యాటయే నాయె
  సరికొత్త వేషాన తిరిగి మొదలాయె

28, జులై 2015, మంగళవారం

మహానుభావుడు
ఇతడు మహానుభావుడని యెవ్వని గూర్చి ప్రశంశ గల్గునో
యతడొక ధన్యజీవి మరి యాతడు చక్కగ జూపినట్టి యు
న్నతపథమందు దేశ జననాయకులుం ప్రజలుం జరించుటే
యతనికి నెత్తగా తగినయట్టి నివాళి గదా పరాత్పరా


23, జులై 2015, గురువారం

విన్నపం
ఉ. ఏటినిబడ్డవాని కొకటే కద నాశయమై రహించు నే
చేటును బొందకుండ వెస చేరగ నొడ్డున నేటిగట్టు పూ
దోటల సోయగంబు మది దూరునె తద్వ్యతిరేకధోరణిన్
మాటికి స్వల్పసౌఖ్యముల మానక గోరును నా మనంబహో
ఉ. నాలుగు మంచిమాటలను నల్గురు చెప్పచు నుందు రెప్పుడున్
మేలు పరోపకారమని మేలగు సజ్జన గోష్ఠి నుంటయున్
మేలు త్రిశుధ్ధివర్తనము మేలు పరాత్పర కీర్తనంబు నా
నేల యెఱింగియున్ నడువ దీమన మించుక మంచిదారిలో
ఉ. నేనిపు డేమి సేయుదును నీ శుభ పాదసరోరుహమ్ములన్
ధ్యానము సేయ నొక్క క్షణమైనను బుధ్ధిగ నుండ నొల్ల దీ
మానస మీశ్వరా పనికిమాలిన చోటుల సంచరించుటన్
మానగ లేని దాని పయి మానక నీ దయ చూపవే ప్రభూ
మ. ఇది నా మాటను లెక్కచేయ దిక నీవే చూచి రక్షించ బూ
నుదు వేనిన్ సరియైన దారి జను మానున్ దుష్క్రియాసక్తి  సం
పదలున్ బంధుజనంబులున్ బిరుదులున్ భావించి యల్లాడుటల్
వదలున్ నీ శుభనామకీర్తనమహాభాగ్యంబు నాశించెడున్
ఉ. దేవుడ వీవు నీవలన దీరని కార్యమొకండు గల్గునే
జీవుడ నేను నాదయిన చిత్తము నిన్ను గ్రహింప నేర్చునే
కావున నీవు మాయ దొలగం గృప సేయుము నీదు తత్త్వమున్
భావన జేయనిమ్ము భవబంధము డుల్లగ నిమ్ము నెమ్మికన్
ఉ. విన్నప మాలకించితివి వీఱిడి వోవగ నీక దాని నా
పన్నశరణ్య నీ దయకు పాత్రము సేయుము నా మనంబు ని
న్నెన్నడు గాని యేమఱక యీశ్వర కూర్మిభజించు నట్లుగా
మన్నన చేయుమయ్య పరమాత్మ పరాత్పర సర్వరక్షకా

22, జులై 2015, బుధవారం

వేయికి మిక్కిలి జన్మము లాయె

వేయికి మిక్కిలి జన్మము లాయె
  వేచిన దింక చాలునయా
మాయ నుండి నను దయతో విడుదల
  చేయవె నీదరి చేరగ నీవె


కడు ముచ్చట పడి యడిగితి సరియే
పుడమికి నవ్వుచు పంపితి విచ్చట
నడుగిడి యుగములు జన్మలు పెక్కులు
గడిపితి నీతో నడిపితి నెయ్యము
గడచిన బ్రతుకుల కలిగిన స్నేహము
విడువని నిన్నేమని పొగడుదును
నడుచెద నిటు నీ యడుగుల నడుగిడి
ఇడిముడియా ఈ నీ నా ప్రేముడి

బడుగు వీ డని తలపవు రామా
కుడిపెద వోహో కరుణామృతము
కడలి కంటె గంభీరము నీ హృది
బడలనీక నను పాలించెదవు

21, జులై 2015, మంగళవారం

అన్నము పానము హరినామమే


అన్నము పానము హరినామమే యనగ
నున్న మాకు పొట్టతిప్ప లన్నవి గలవే
వింతవింతరుచులపైన వెఱ్ఱిమోహములవి లేవు
వింతవింతహరికథలను వినెడు మోహ మొకటె గాని
ఎంత మంచిభోజన మన్న చింతయెన్నడును లేదు
సంతతశ్రీరామనామచింతనాసక్తియె గాని
అన్నదినదినమీ పొట్ట కెంత తిండితీర్థములతోడ
మనుజుడు బ్రతుకంత సేవ మానకుండ జేయు గాని
తనివితీరునది లేదు తనకు మోక్షప్రాప్తి లేదు
కనుక రామభజనమందు తనియుచుందుమెపుడు గాన    
అన్నహరినామామృతపాన మదియె చాలునన్న తెలివి
తరచుగాను కలుగు రామదాసులైన వారి యందు
నరులయందు కుక్షింభరులై నడువకుండు వార మగుట
తిరముగ శ్రీరాముడు మమ్ము కరుణ జూచుచుండు గాన           
అన్న


భగవంతుని మీరు తగిలి యుండేరోభగవంతుని మీరు తగిలి యుండేరో
తగని తలపుల తోడ తల్లడిల్లేరో


రాముని మరచి మీరు కాముని దాసులై
భూమికి బరువులనగ పొరలుచుండేరో
కామితార్థములు కాంతాకనకంబు లనువారు
వేమరు పుట్టి చచ్చి యేమి సాధించేరు


ఏల వీరి వారి వద్ద కాలము గడిపేరు
మేలైన గురువెవ్వడు మీకు రాముని కన్న
చాలింతురో వెఱ్ఱి సాకులు మీఱింక
బేలలై తప్పుడు త్రోవల పాలయ్యేరో


ఇతరుల మాటలెన్ని యిడుములు కుడుచేరో
పతియుగతియు రాముడన్న హితమెంచేరో
మతిలేని వాదాలు మానక చేసేరో
మతిమంతులై రామమార్గ మెన్నేరో

17, జులై 2015, శుక్రవారం

రామకృపాధార ఒకటి నా మీద కురిసెను
రామకృపాధార ఒకటి
నా మీద కురిసెను
ఆ మధుర సుధావృష్టి
నా మనసు తడిసెను

అంతులేని ప్రయాణము
చింతలతో నరకము
ఎంత తిరిగినా తెలియ ద
చింత్యమైన గమ్యము
సుంత విశ్రాంతి గొనే
టంత భాగ్య మెక్కడిది
పంతమేల రామ యొ
క్కింత సాయపడమంటే

ఒక నల్లని మేఘమై
ఒక చల్లని గాలియై
ఒక హాయగు స్పర్శయై
ఒక కమ్మని తావియై
ఒక సుమధుర గర్జయై
సకలతాప మర్దనియై
ఒక లీలను నను ముంచుచు
వికసించెను విభుని దయ

ఇది నాకు చాలు గదా ఈ జన్మకు
ముదితాత్ముడ నైతి రామభూవరు కృపకు
విదితమాయె ఆ మబ్బు వెంబడి పోయి
సదయుని గేహమ్ము చేరజాలుదు ననుచు
అదిగదిగో కదలు చున్నదా నల్లమబ్బు
కదలిపోవు చుంటి రామ కారుణ్యవృష్టి
పదే పదే హాసశంపాలతల వెలుగుల
నిదే దారిచూపుచుండె నీశ్వరుడు నాకు
16, జులై 2015, గురువారం

విడువక నాతో నిలచితివి నే పాడినవి విని మెచ్చితివి

విడువక నాతో నిలచితివి నే
పాడినవి విని మెచ్చితివి నా
కేడుగడవు నీ కేమిత్తునయా నీ
వేడుక తీరగ పాడుట గాక

తడవకు తప్పులు వెదికే జగమును
విడిచి నీ మరువును సొచ్చితిని
గడబిడ పడు నా మనసున నీవే
వడివడి శాంతము నింపితివి 

గడచిన బ్రతుకుల కలిగిన స్నేహము
విడువని నిన్నేమని పొగడుదును
నడువనిమ్ము నీ యడుగుల నడుగిడి
ఇడిముడియా ఈ నీ నా ప్రేముడి

బడుగు వీ డని తలపవు రామా
కుడిపెద వోహో కరుణామృతము
కడలి కంటె గంభీరము నీ హృది
బడలనీక నను పాలించెదవు
15, జులై 2015, బుధవారం

మౌనముగ రాముని మనసున ధ్యానింపుము
మౌనముగ రాముని మనసున ధ్యానింపుము
మానక ధ్యానింతు వేని మంచి జరుగునువారి వీరి మాటలకు బదులు పలుక కుండుము
ఊరక నిందించు వారి నేరమెంచ బోకుము
కారులఱచు వారలకు దూరముగ నిలచి
పారమార్థికము నిచ్చు దారిలోన నుండుము
మౌనముగ

కర్మముచే కలుగుచుండు కష్టములు సుఖములు
ధర్మపరుడవై నీవు దాశరథిని తలచుము
నిర్మలాంతఃకరణము నీవు దాల్చి యుండుము
నిర్మములను దాశరథి నిత్యము రక్షించును
మౌనముగ

భూమి నెవరు గాని నిన్ను బ్రోచు వారు కాదు
రామరక్ష తప్ప ధరను రక్ష వేరు లేదు
ధీమంతులకు భువిని కామితములు లేవు
రామదాసులకు నిజము రాముడొకడు చాలు
మౌనముగ
2, జులై 2015, గురువారం

జూలై 2015 మాలిక సంచికలో నా కథ

ఈ జూలై 2015 మాలిక సంచికలో నా కథ ఒకటి ప్రచురితమైనది.
పాఠకులు చదివి అక్కడే అభిప్రాయాలను చెప్పవలసిందిగా ప్రార్థనఈ కథకు బీజావాపనం చేసిన సంఘటన కష్టేఫలీ భాగులో ఇటివల నేను చేసిన ఒక వ్యాఖ్య!

అ వ్యాఖ్యను క్రింద ఇస్తున్నాను:

0
0

Rate This
ఈ కథలో ఒక బ్రాహ్మణుడి ప్రసక్తి వస్తుంది. కాని దాని గురించిన విచికిత్స ఇక్కడ చేయటానికి వలనుపడదు. అది ఒక విస్తారమైన విషయం. ఎలా సుళువుగా చెప్పాలో అన్నది ఇబ్బంది. బహుశః ఒక కథారూపంగా మలచి చెప్పితేనే అందులోని సారస్యమూ మిగతా కథా కమామిషూ మన తలలకు బోధపడుతాయి. కాని దురదృష్టవశాత్తు ఆ విషయంలో ఇప్పుడు వ్రాయటానికి నాకు తీరటం లేదు.ఆఫీసుపని సమయం కదా! అందువలన అన్నమాట. దైవానుగ్రహం ఉంటే ఈ రాత్రి ఆ పని చేయాలని భావిస్తున్నాను.

అదండి సంగతి,
కథను తప్పక చదివి మీ అభిప్రాయాలు వ్రాయండి.

( అడక్క పోతే అమ్మ కూడా పెట్టదు,  కోరకపోతే కామెంట్లు కూడా రావు అంటారు కదా! )