శా. నీవే చేసితి వింత సృష్టియును నీ నిర్మాణచాతుర్యమున్ భావింపం గడు శక్తిహీనులు గదా బ్రహ్మాండసంచారులౌ జీవుల్ బేలలు వారికే మెఱుక నీ చేతల్ తలంపుల్ ప్రభూ నీ వైదగ్ధ్యము నీది పావులు కదా నీక్రీడలో నెల్లరున్ |
ఉ. ఆటయె గాక లోకముల నందముగా సృజియించి వాటికే చేటును గల్గనీయక విశేషకృపాన్వితదృష్టి భ్రోచుచున్ మాటికి వాటిలో దిరుగ మక్కువజూపుచు నంతలోన మో మాటము లేక నన్నిటిని మాయము చేయుట నేమి యందునో |
మ. అది కాదోయి మహానుభావ మరి నిన్నాందరూపుండునా చదువుల్ ప్రస్తుతి జేయుచుండు గనుకన్ సర్వేశ క్రీడార్థమై పదునాల్గో పదివేలొ లోకముల నుత్పాదించి నావన్న చో నది హాస్యాస్పదమైన మాట యనరా అథ్యాత్మవేత్తల్ ప్రభూ |
మ. వివిధోత్తుంగతరంగసంతితిని యే వేళన్ గభీరార్ణవం బవిరామంబుగ దోపజేయు నది క్రీడార్థమై చేయు నా నెవరైనం దలపోయు టుండదు కదా యేరీతి స్వాభావికం బవు మున్నీట తరంగసంఘ మటు నీ యందొప్పు సృష్ట్యాదులున్ |
ఉ. నీ దగు దివ్యతేజమున నిండని దేమియు లేదు సృష్టిలో మేదిని హేతువాదులగు మిత్రులు కొందరు నీవు లేవు నా వాదన చేయుచుందు రటువంటి యమాయకు లాడు మాటలన్ వేదన చెందకన్ హృదయవేద్యుని నిన్ను భజింతు నెప్పుడున్ |
ఉ. సృష్టికి పూజనీయతయె శూన్యమటంచు వచింతు రక్కటా దుష్టమనస్కులైన విమతుల్ మరి వారల బోధనంబనన్ సృష్టియొనర్చినందులకు చేయగ వచ్చును నీకు పూజ యు త్కృష్టత నొప్పు సృష్టి కిడరాదొక యించుక గౌరవంబనన్ |
ఉ.అరయగ సృష్టియంతయు మహాత్మ త్వదీయ విభూతి లేశమై పరమపవిత్రమైనదను భావన నుండెద దీని యందు నీ సురుచిరమూర్తినే కలయజూచుచు నుందును నీకు మ్రొక్కి నీ చరణనఖాంకురంబులను జల్పములంచన నేను వెఱ్ఱినే |
ఉ. అణువున నైన నీవు గల వందురు సృష్టిని జొచ్చి సత్యమే అణువగు నీ స్వరూపమున నందురు సృష్టిని గూర్చి సత్యమే గుణమగు నెట్లు చెప్పినను కొంచెపు బేధము దృష్టికోణమే ప్రణతులు విశ్వరూప నిను భావన జేసెడు భాగ్యముంచవే |
29, జులై 2015, బుధవారం
సృష్టి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ప్రహ్లాదోపాఖ్యానంలో తండ్రికి కొడుకిలాగే చెప్పడం గుర్తొచ్చిందండి. బావున్నాయి.
రిప్లయితొలగించండిప్రహ్లాదోపాఖ్యానంలో తండ్రికి కొడుకిలాగే చెప్పడం గుర్తొచ్చిందండి. బావున్నాయి.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిశ్యామలీయములు లేకున్నా సృష్టి విధాతా నీకు నామమేది ??
జిలేబి
శ్యామలీయములు ఎన్నాళ్ళున్నను అవి కొన్నాళ్ళే అగును.
తొలగించండిశ్యామలీయములు తిరిగి వచ్చినప్పుడు గుర్తుపట్టువారు కొందరే యగుదురు. శ్యామలీయము మాత్రము అందరిని గుర్తించును.
నామరూపాత్మకమైనది ప్రకృతి. అందుచేత ప్రకృతిలోని జీవులకు మాత్రమే వాటితో వ్యవహారము అవసరమై యుండును. అందుచేత చేత, సృష్టివిధాతకు నామము రూపము అనునవి సృష్టిలోని జీవుల యొక్క అవసరారర్థము ఆయా జీవులచే అనంతవిధములుగా కల్పించుకొన బడినవి మాత్రమే అని గ్రహించవలెను.