ఏమి ఆడించేవయా రామ
ఏమి పాడించేవయా
నీ మాయలో ముంచి నిండారు ప్రేమతో
వేమారు సరిక్రొత్త వేషాలు వేసి
నీవు చేసిన సృష్టి నీ యాన చొప్పున
భావించి చొచ్చితిని పరమాదరమ్మున
నీవు చూపిన దృష్టి నే బఱప నందున
భావించ లేనైతి నీ సృష్టి పెలుచన
అరయ నిది యెల్ల నీ యాటయే నాయె
సరికొత్త వేషాన తిరిగి మొదలాయె
నీ మాట మఱచితి నీ యాన మఱచితి
నీ సౌరు మఱచితి నీ తీరు మఱచితి
నీ ప్రేమ మఱచితి నీ యున్కి మఱచితి
నిన్ను నే మఱచితి నన్ను నే మఱచితి
అరయ నిది యెల్ల నీ యాటయే నాయె
సరికొత్త వేషాన తిరిగి మొదలాయె
నిను నేను మఱచినా నను నీవు మఱువవు
నను నేను మఱచితే కొనగోట మీటి
అనుకొన్న రీతిగా ఆడించుతావు
ఘనుడ నీ యాటలో గడితేర నైతి
అరయ నిది యెల్ల నీ యాటయే నాయె
సరికొత్త వేషాన తిరిగి మొదలాయె
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.