28, ఫిబ్రవరి 2017, మంగళవారం

ప్రభుత్వపు మొక్కా - వ్యక్తిగతమైన మొక్కా?

ప్రభుత్వపు మొక్కా - వ్యక్తిగతమైన మొక్కా?

మొక్కులు ప్రభుత్వ పక్షానే....తప్పేంటీ? అని వనం జ్వాలానరసింహారావు గారు తన బ్లాగులో ఒక వ్యాసం‌ ప్రకటించారు. ఆ బ్లాగు శీర్షిక ప్రకారం ఆ వ్యాసం ఈనాటి ఆంధ్రజ్యోతిలో వచ్చి ఉండాలి.  వారు లబ్ధప్రతిష్ఠులు. మంచి విషయపరిజ్ఞానమూ‌ పలుకుబడీ‌ ఉన్నవారు కాబట్టి వారు వ్రాసినదల్లా అచ్చయ్యో పరిస్థితి ఉండవచ్చును కాని వ్రాసినదల్లా అంగీకారయోగ్యం‌ కావలసిన అవసరం లేదు.

"దర్శనం స్వామి ఇస్తేనే దొరికేది"...అంతే కాని ఎవరూ ఇచ్చేది కాదు. అదో నమ్మకం. అన్నారు వారు. అక్షరసత్యం. శ్రీ పివీఅర్కే ప్రసాద్ గారి నాహం‌కర్తా హరిః కర్తా అన్న పుస్తకంలో కూడా ఈ‌విషయమై ఒక మంచి ఐతిహ్యం‌ ఉంది. కాని అధికారిక పదవుల్లో ఉన్నవారికి దొరికే ప్రత్యేకదర్శనాలు ప్రత్యేకవిషయాలు. వాటికి ఈ‌నియమం పూర్తిగా వర్తించక పోవచ్చును. అనునిత్యమూ బంగారుపూలతో పూజించిన చక్రవర్తికంటే అడపాదడపా తనకోసం ఒక మట్టిపూవును సమర్పిస్తూ కుండలు చేసుకొనే సామాన్యుడే తనకు అత్యంత ప్రీతిపాత్రుడని స్వామివారే స్వయంగా తెలియజేసిన వృత్తాంతాన్ని స్మరించుకోవాలి ఇక్కడ మనం. తామున్న స్థితి కారణంగా సులభంగా తమ విగ్రహసాన్నిధ్యాన్ని పొంది గర్వించినంత మాత్రాన ఎవరికీ అది తమ ఆత్మీయ సన్నిథి కాదని స్వామివారి సూచన అని గ్రహించటం మంచిది. నిత్యం కేవలం‌ సినీమానటులైనంత మాత్రనే లేదా మరొక పలుకుబడి కల వ్యక్తి ఐనంత మాత్రనే ఎవరెవరో ఎందరెందరో‌ స్వామివారిని దర్శనం చేసుకొని వెడుతున్నారు. వారందరిని స్వామివారు ఆత్రుతతో పిలిపించుకొన్నారని అనుకో గలమా? అసలు వీళ్ళంతా స్వామివారి దర్శనం కోసం వస్తున్నట్లు కాక స్వామివారికి దర్శనం ఇవ్వటానికి వస్తున్నట్లుగా హడావుడి చేస్తున్నారు. శాంతమ్‌ పాపమ్.


ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వ పరంగా చెల్లించిన మొక్కులపై అనవసర రాద్ధాంతం పూర్తిగా అసమంజసం అని వనం వారి అభిప్రాయం. ప్రభుత్వపరంగా సొమ్ము వెచ్చించాలంటే అది ప్రభుత్వం‌ తీర్మానం చేయటం అన్న క్రియాకలాపం ద్వారా జరగాలి కదా? అలా జరగక పోతే అది అనుచితం కాదా?  రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజల బాగోగుల కోసం, రాష్ట్రం బాగుకోసం, ప్రజల పక్షాన, ప్రభుత్వ పక్షాన మొక్కులు చెల్లించుకోవడంలో తప్పేంటో అర్థం కాకపోవటం‌ చిత్రం. ప్రభుత్వమే ఒక తీర్మానం చేయకుండా ఎంత ముఖ్యమంత్రి ఐనా ప్రభుత్వధనాన్ని నేరుగా ఎలా వినియోగిస్తారు? ఇవే ఉద్దేశాలను చూపి మరికొందరు మంత్రులూ‌ ఈ పని చేస్తే సదరు ముఖ్యమంత్రి గారు మాట్లాడటానికి ఏమన్నా ఉందా? ఏమని వారిస్తారు? అసలు వారిస్తారా? ఇలా ప్రభుత్వంలోని మంత్రులే ప్రజలకోసం క్రతువులూ మొక్కులూ‌ అని ప్రభుత్వ ధనాన్ని వెచ్చిస్తుంటే రేపొక కార్యనిర్వహణాధికారో‌ మరొక అధికారో అలాగే ఖజానా సొమ్ముతో యాగాలూ దేవుళ్ళకు ఆభరణాలూ చేయిస్తే ఏమి చేస్తారండీ? వారిది తప్పు అంటారా? ఏ అధికారంతో? తాము చేస్తే ఒప్పైనది ప్రజలకోసం అన్న ఆ మిషలతోనే వేరొక అధికారి చేస్తే తప్పే విధంగా అవుతుందీ?


రాష్ట్రం ఏర్పాటైతే ఫలానా...ఫలానా...దేవుళ్లకు , ఫలానా...ఫలానా ఆభరణాలు మొక్కుగా చెల్లిస్తానని సీఎం కాకముందు కేసీఆర్ మొక్కున్నారు అని వనం వారి వక్కాణింపు. నిజమే  కావచ్చును. అప్పట్లో వ్యక్తిగతంగా మొక్కుకున్న మొక్కుబడిని ఇప్పుడు అధికారిగా ఎలా తీరుస్తారూ?  ఒకానొక వ్యక్తి నాకు ఉద్యోగం వస్తే పదివేలు హుండీలో వేస్తానని మొక్కుకున్నాడు. ఉద్యోగం వచ్చింది. ఆఫీసు సొమ్ము పదివేలను తీసుకొని వెళ్ళి దేవుడి హుండీలో వేసాడు. అది తప్పా ఒప్పా అన్నది పాఠశాలా విద్యార్థిని అడిగినా చెబుతాడు. అవునా కాదా?

సీఎం ఎప్పుడూ తన సొంత డబ్బుతో మొక్కులు చెల్లిస్తానని అనలేదే? అలాంటప్పుడు ఎందుకీ విమర్శలు? అని వనంవారి సమర్థన. బాగుంది. ఇందాక చెప్పిన పిట్టకథలోని వ్యక్తి ఆఫీసు సొమ్ము వేస్తే తప్పేమిటీ నా సొంత డబ్బును హుండీలో వేస్తానని మొక్కుకోలేదే అంటే ఏమన్నమాట? ఈ‌  సమర్థన కూడా అలాగే ఉంది కదా? ఏమన్నా బాగుందా?

కేసీఆర్ గారి ఘనతను వనం వారు ఇలా సెలవిచ్చారు. "గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం శ్రీవారికి ఆభరణాలు సమర్పించలేదని, స్వతంత్ర భారత చరిత్రలో కేసిఆర్ కొత్త సాంప్రదాయానికి నాంది పలికారని టీటీడీ కార్యనిర్వహణ అధికారి స్వయంగా అన్నారు. ప్రభుత్వ పరంగా, శ్రీకృష్ణ దేవరాయలు, మైసూర్ మహారాజు లాంటి వారు మాత్రమే గతంలో శ్రీవారికి ఆభరణాలు సమర్పించారని చెప్పారు. ప్రభుత్వం తరఫున ఆభరణాలు సమర్పించడం కొత్తేమీ కాదనే కదా అర్థం?"  వనం వారు చెప్పేది భలేగా ఉంది. మహారాజులతో ముఖ్యమంత్రులకు పోలిక ఎందుకు? అది చెల్లని వాదన. రాజు సర్వస్వతంత్రుడు. ఆయన చేసే ఖర్చుకు ఎవరికీ‌ రాజు జవాబుదారు కాడు. కాని ముఖ్యమంత్రి కూడా ఒక రాజులాగా ఎవరికీ జవాబుదారు కాని వ్యక్తిగా ఉంటాడా ఎక్కడన్నా? అలోచించండి. కేసీఆర్ గారు నెలకొల్పిన కొత్త సంప్రదాయం అల్లా ప్రభుత్వధనాన్ని ముఖమంత్రి యధేచ్ఛగా వెచ్చించవచ్చును అన్నదే కాని తదన్యం కాదు.

"ఇవాళ దేవుడే నన్ను పిలిపించుకున్నాడు." అని తన పూర్వానుభవాన్ని పురస్కరించుకొని కేసీఆర్ అన్నమాట ఉచితంగానే ఉంది. కాని అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరన్నా కొండకు వచ్చినా, సెలబ్రిటీలం అంటూ చివరకు సినిమావాళ్ళు వచ్చినా ఆలయాధికారులు పూర్ణకుంభాలతో‌ మేళతాళాలతో వారికి ఎదురేగి స్వామివారి తరపున అన్నట్లు మహారాజమర్యాదలు చేయటం అన్న చెడ్ద సంప్రదాయం కొనసాగుతోంది నేడు. ఇదంతా దేవుడే నిర్ణయించి అర్చకస్వాముల్ని పురమాయించి చేయిస్తున్నాడని వనం వారు నమ్మి మనని నమ్మమంటే వారికొక నమస్కారం.

మరి ఎందుకీ అర్థం లేని విమర్శలు? అని వనం వారు ప్రశ్నిస్తున్నారు. నిజంగా విమర్శలను అర్థం లేనివి అన్నంత మాత్రాన తప్పులు ఒప్పులై పోతాయా?

73 కామెంట్‌లు:


  1. కేసీఆర్ పై ఇన్ని విమర్శలా ! ఆయనేం పాపం చేసాడండీ !

    స్వామి వారి డబ్బు వారికే తిరిగి యిచ్చాడు అంతే కదా !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేసింది పాపం అనే అనుకోండి. స్వామి వారు ఆయనకు అధికారం ఇచ్చారనుకుంటే అది ఆయన తనకు ఆభరణాలు చేయించిపెట్టమని ఇచ్చారా యేమిటి?

      తొలగించండి

    2. హిందువులే మరీ యాంటీ హిందూ వాదులై పోయేరు
      కేసీయారు ఏమి చేస్తారు అన్నిటికి సర్దుకో వాల్సిందే స్మీ

      జిలేబి

      తొలగించండి
    3. జిలేబి గారిది చిత్తూరు వారి ఉవాచా? (jk) 🙂

      తొలగించండి
    4. ఏవం డోయ్ విన్న కోట వారు

      మా జిల్లా స్వామి వారాయే వారికి ఆభరణాలొస్తా వుంటే సిరి రా మోకాలొడ్డుతామా :)

      జిలేబి

      తొలగించండి
    5. గమ్మత్తు ఏమిటంటే కెసిఆర్ మొక్కు తెలంగాణ రాష్ట్రం రావాలని, తాను అధికారంలో రావాలని కాదు. తెలంగాణ ఏర్పడ్డాక తోలి ఎన్నికలలో వేరే పార్టీ గెలిచి ఉండుంటే మొక్కు ఎలా తీర్చే వారో మరి?

      తొలగించండి
    6. <"మా జిల్లా స్వామి వారాయే వారికి ఆభరణాలొస్తా వుంటే సిరి రా మోకాలొడ్డుతామా :)"
      అనుకున్నా, జిలేబి గారు ఈ మాటంటారనే అనుకున్నా ☝️🙂.

      తొలగించండి
    7. నాకు రాజకీయాలపై అంతగా ఆసక్తి లేదు. కాబట్టి రాజకీయాలపై ఉబుసుపోకకో హాస్యాలకో కయ్యాలకో టపాలు వ్రాయటం చేయను.

      జీలేబీగారూ వ్యక్తిగతంగా మొక్కుకొని ప్రభుత్వధనాన్ని చట్టసభల అనుమతి లేకుండా స్వయంనిర్ణయాధికారంతో వెచ్చించటాన్ని సమర్థించటం‌ కష్టం‌అని చెప్పటానికే ఈ వ్యాసం కాబట్టి హిందువులు అంటూ‌ ప్రస్తావించటం అసందర్భం అనుకుంటున్నాను.

      జైగారు లేవనెత్తిన ధర్మసందేహం బాగుంది. తనది కాక మరొక పార్టీ‌ ప్రభుత్వం వస్తే రాష్ట్రసాధనకోసం తాను మొక్కుకున్న మొక్కులన్నీ‌ ఆ ప్రభుత్వం తీర్చాల్సిందే అని మరొక నిరాహారదీక్ష చేసేవారేమో కేసీఆర్ అవసరమైతే.

      తొలగించండి
  2. తెలంగాణ ఉద్యమం నడిపింది. ఆంధ్రా పాలకుల పై పోరాడింది. తెలంగాణ తెచ్చింది కె.సి.ఆరే. ఆయనే ప్రభుత్వం. అది ప్రభుత్వ మొక్కే. వనం గారితో ఏఖీభవిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కేసీఆర్ గారే ప్రభుత్వం ఆయనే ప్రజలు అంటే అదేదో పాతాళభైరవిలో మాంత్రికుడి డైలాగులాగా ధ్వనిస్తోంది. ఏ ప్రభుత్వం ఐనా ఏర్పడక ముందే ఏ వ్యక్తి లేదా వ్యక్తులు మొక్కుకున్నా అది తదనంతరకాలపు ప్రభుత్వానికి ఎలా సంక్రమిస్తుందండీ. కేసీఆర్ గారే రాజ్యాంగాధినేతా రాజ్యాంగమూ రాజ్యమూ కాబట్టి అదే న్యాయం అంటారా - అప్పీలు లేదు.

      తొలగించండి
  3. దేవుడికి ఆభరణాలు చెల్లించటం తప్పన్నట్లు మీరు మాట్లాడం సరైనది కాదు. కె.సి.ఆర్. తప్పేమి చేయలేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దేవుడికి మొక్కుకోవటం‌ తప్పు అని కాని మొక్కులు చెల్లించటం తప్పని కాని ధ్వనించేటట్లుగా నేనేమీ వ్రాయలేదు. మొక్కు చెల్లించిన విధానం పైనే అభ్యంతరం.

      తొలగించండి
  4. శ్యామలరావు గారు, వనం వారి టపా చదివాను. నాకొకటే అనిపిస్తోంది - వనం వారు తెలంగాణా ప్రభుత్వంలో ఉన్నతోద్యోగి కాబట్టి ప్రభుత్వం తరఫునే మాట్లాడాలి అనే నమ్మకమే వారి వ్యాసాలకి కారణం - అని నా అనుమానం.

    రిప్లయితొలగించండి
  5. కె.సి.ఆర్ జేబులోంచి ఇచ్చినది కాదు, నుండి ఇచ్చిందే! ఆయనదే ఆయనకిచ్చేరు కె.సి.ఆర్, అంతే

    దేవుడి సొమ్ము చాలా చోట్ల దుర్వినియోగమవుతోంది, కొంతైనా సద్వినియోగమయింది లెద్దురూ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్రమార్జన దేవుడికిచ్చినా సక్రమం కాదు, అలాగే సక్రమార్జన ఐనా తనది కాని సొమ్మును దేవుడికివ్వటం‌ సద్వినియోగం‌ కాదని నా అభిప్రాయం. పరీక్షపాసైతే తమ్ముడికి గుండు కొట్టిస్తా అని మొక్కికోవచ్చునా? అలాగే నాకోరికతీరితే ప్రభుత్వధనాన్ని ఇస్తాననీ‌ మొక్కుకోరాదు కదా. అలా మొక్కుకోకపోయినా ప్రభుత్వధనంతో స్వంత మొక్కు తీర్చుకోరాదు కదా అన్నది నా పాయింటు.

      తొలగించండి
    2. కె.సి.ఆర్ ఇచ్చింది ప్రభుత్వ సొమ్ము కాదు. అది హిందూ ధర్మసంస్థల సొమ్ము, హిందువులది. ఆయన హిందువు, ప్రభుత్వంలో ఉన్నాడు, తన విచక్షణ ఉపయోగించాడు, వ్యక్తిగా మొక్కుకున్నా.

      తొలగించండి
    3. శర్మగారూ, కరెక్టుగా చెప్పారు సర్.

      తొలగించండి
    4. నాగేశ్వరరావు గారూ, వ్యక్తి మొక్కటమూ దానిని ఒక సంస్ద చెల్లించటం నాదృక్కౌణంలౌ సరికాదు.

      తొలగించండి
  6. విన్నకోటవారు,
    ప్రమాదాలేం రావు కదా :)
    ఇవేళ ఈ బ్లాగులో జరిగినదానికి :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చెప్పలేమండోయ్ శర్మ గారు. జిలేబి గారికి కోపం వచ్చి గబగబా నాలుగు పద్యాలు వ్రాయచ్చు. 🙂

      తొలగించండి
    2. నేను మరొక నాలుగు పద్యాలు వడ్డించవచ్చును కూడా.
      ఏమో గుఱ్ఱం‌ ఎగరా వచ్చూ అన్నట్లుగా ఉంది.

      తొలగించండి
  7. (1). వనం వారు తన తెలుగు వ్యాసానికి రెండు రోజుల ముందు ఆంగ్లంలో వ్రాసారు. చక్రవర్తులు, మహారాజులు ఆభరణాలు సమర్పించడంతో పోల్చడం సరికాదని, జవాబుదారీతనం లేని రాచరికాలకు ప్రజాస్వామ్యానికి పోలికెలా కుదురుతుందనీ ఆ టపా క్రింద నేను వ్యాఖ్య వ్రాశాను. ఇంత చిన్న తేడా ఎందుకు మర్చిపోతున్నారో తెలియడం లేదు.
    (2). ఎన్నికలలో వేరే పార్టీ గెలిచుంటే ఈ మొక్కు ఎలా తీరేదో అంటూ పైన గొట్టిముక్కల గారు లేవదీసినది కూడా ఓ అర్ధవంతమైన ప్రశ్న.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 1. విన్నకోట గారు, అసలికి ప్రజాస్వామ్యం లో జవాబుదారితనం ఉందని,రాచరిక పాలనలో జవాబుదారితనం లేదని మీరెలా చెప్పగలరు? మీరు నేను ఆరోజులని చూడలేదు కదా? ప్రజాస్వామ్యం లో ఒక్కొక్క ప్రభుత్వశాఖలో జరిగే అవినీతి వందలకోట్ల లో ఉన్నాయి. కాకినాడలో ఆర్.టి.ఒ. ను పట్టుకొంటే 800 కోట్లు దొరికింది. మొన్నటికి మొన్న నెల్లురు లో మునిసిపల్ కార్పోరేషన్ సి.యి.ఒ. ను పట్టుకొంటే దొరిన సొమ్ము 90కోట్లు, అంతకు ముందు సబ్ రిజిస్తార్ (చదివిమిది పదో తరగతి తండ్రి చనిపోవటం వలన ఉద్యోగంలో చేరాడు)ను పట్టుకొంటే సుమారు 20 కోట్లు. జవాబుదారితనం ఉంటే అన్నివందల కోల్త లంచాలు ప్రభుత్వ అధికారులు తినగలరా? రాచరిక పాలనలో ఉద్యోగులు ఈ విధంగా సమపదను బొక్కలాడినట్లు ఎక్కడైనా చదివారా? నావరకు వర్తమానం కన్నా ఒక 20-30 ఏళ్ల క్రితం పరిస్థితి ఎంతో మెరుగనిపిస్తుంది. అలా గతం తో పోల్చుకొంట్టు పోటే పూర్వకాలంలో ఎంతో మెరుగైన సమాజం ఉండేదని పిస్తుంది. ఆరోజుల్లో నేటిలా ఎక్కువ కాలం బ్రతికేవారు కాదు. రోగాలు రొప్పుల వలన వైద్యం దొరకక ఇంట్లో మనుషులు చనిపోవటం కూడా ఎక్కువ. అటువంటి పరిస్థితిలో మనిషిలో పప భీతి కూడా ఎక్కువ ఉంట్టుంది. అవినీతి తక్కువ గా ఉండి ఉండవచ్చు. నేటి తరం లా పాది తరాలకు సంపాదించి పెట్టు కొందామనే ఆలోచన చేసేవారుకాదు. ఒకప్పుడు ఎవరి ఇంటికైనాపోతే ఆన్నం తినిపొమ్మని బలవంతం చేసేవారు. ఇప్పుడు ఎక్కడైనా అటువంటిది చూస్తున్నామా? కుల వ్యవస్థ రాచరికం ఉన్నంత మాత్రాన పాత తరం వాళ్ళు మనం ఊహించుకొన్నంత దుర్మార్గులు కారు.

      Rs 800 crore assets seized in raid on Andhra Pradesh transport official

      http://www.deccanchronicle.com/nation/crime/300416/rs-800-crore-assets-seized-in-raid-on-andhra-pradesh-official.html

      To be continued...

      తొలగించండి
    2. జవాబుదారీ తనంతో‌చక్కగా పాలించిన రాజులూ‌ ఉన్నారు. ఎందుకు లేరు. విషయం‌ అది కాదు. రాజుకు స్వయం నిర్ణయాధికారం ఉంటుంది. ప్రజాస్వామ్యవ్యవస్థలో అలా ఉండదు. అదే ప్రస్తావనకు వస్తున్న సంగతి. అంతకు మించి మరేమీ‌ లేదు.

      తొలగించండి
    3. కె.సి.ఆర్. మొదట తెలంగాణ ఉద్యమానికి సారద్యం వహించాడు, అంతేకాక ఎన్నికలలో గెలిచిన పార్టికి అధ్యక్షుడు. మీరు పదే పదే కె.సి.ఆర్. ను ఒక వ్యక్తి అని అంట్టున్నారు. ఆయన వ్యక్తి కాదు. ఒక నాయకుడిగా ప్రజల ఆకాంక్షల కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన ఎన్నికలలో గెలవక పోతే, దేవుడి మొక్కులను స్వంత డబ్బులు చెల్లించే వాడేమొ! ఆయన దైవ భక్తి మటుకు శంకించ తగనిది గా లేదు. ఒక్కసారి తెలంగాణా కోసం మొక్కుకున్నాక , సి.యం. కాలేదని దేవుడి మొక్కులు చెల్లించకుండా ఎగ వేసే రకం గాదని అనిపిస్తున్నాది. అయితే ఆయన మొక్కులు చెల్లించినా అది వార్తలలో వచ్చి ఉండేది కాదేమో! (ఏ పదవిలెదు గనుక).

      తొలగించండి
    4. ఇక్కడ ఎవరి దైవభక్తినీ‌ శంకించ లేదు కదా. ఎవరెంత పలుకుబడి కలవారైనా పదవులూ సిరులూ‌ కలవారైనా వారు వ్యక్తులే. మన అభిమానాలు తరువాతి విషయాలు. అదటుంచి చర్చావిషయం‌ ఒకరిశక్తి గురించి కాదు. విధానం గురించే. ఇప్పటికే చర్చ దీర్ఘమైనది. పైగా అభిప్రాయాలు బాగానే పంచుకున్నాం. ఈ చర్చ ఇంకా దీర్ఘంగా కొనసాగటం అవసరం కాదని అనుకుంటాను.

      తొలగించండి
  8. తెలుగు వారు ఎక్కువగా కొలిచే దైవం, ఆ స్వామి పేరు చెప్పుకుని తెలుగు వారే కొద్దో గొప్పో ఉపాధి పొందుతున్నారు ( వేలమంది) కాబట్టి ఖచ్చితం గా ఆయన చేసిన పని మెచ్చుకోలు గా నే ఉంది అని నా అభిప్రాయం కూడాను. శ్రీరామ్ గారు చెప్పినట్లు తినే వారు కోట్ల కొద్దీ తింటూనే ఉన్నారు. మైనారిటీలని వోట్ బ్యాంకుల కోసం బుజ్జగించే రాజకీయ నాయకులు ఉన్నారు. కెసిఆర్ గారు అలా కాకుండా లైవ్ పెట్టి చేసింది చూపించారు. హిందువులని ఎద్దేవా చేయడం ఒక ఫాషన్ గా మారిపోతున్న తరుణం లో ఈ అంశం మెచ్చుకోవలసిందే. అసలు ఏ గుడికి ఇవ్వకుండా ఆయనే తీసుకున్నా మనకేం తెలుస్తుంది? చట్ట ప్రకారం ప్రజల డబ్బు అంటే, అన్ని చట్ట ప్రకారం జరుగుతున్నాయా ? మతం కూడా ముఖ్య భాగమే. భారత దేశం లో మతము అన్నమాట లేకపోతే ఏముంది? ఈ దేవాలయాలు , వైభవాలు లేకపోతే ఇన్ని దండయాత్రలు జరిగేవి కాదు కదా.

    ఇదే విషయం మీద నేను రెండు రోజుల క్రితమే నా బ్లాగు లో వ్రాసాను. అందుకు స్పందిస్తూ వచ్చిన వ్యాఖ్య ఇది:
    Media did not bother to present the facts. The ornaments were not made using Telangaana government funds. It was made from the Telangaana endowment department funds which came from the hundi collections from Telangaana temples. So it is the money donated by Telangaana hindus in temples, going for another hindu temples. What is wrong with it? Balaji (TTD) still gives grants to many temples and charitable programs.
    This is a nice gesture from Govt of Telangaana.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రిక గారూ,
      ఈ వ్యాసానికి వచ్చిన స్పందనల్లో మరొకరూ, మీరూ హిందువులు, మతమూ అన్న విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నారో తెలియటం లేదు. వ్యాసపరిథిలో ఆ అంశం చర్చించనూ‌ లేదు దానిపై ప్రశ్నించనూ‌ లేదు. ఆవేశకావేశాలకు ఆవల, కేవలం విషయంపై పధ్ధతి ప్రకారమే జరిగిందా ఈ‌మొక్కుబడి చెల్లింపు అన్నదే ఇక్కడ వ్యాసంలో వనం వారి వ్యాసంపై పరామర్శ. అంత వరకే. వనం వారు నాకు మిత్రులే. కేసీఆర్ గారిపై నాకేమీ వ్యక్తిగతమైన వ్యతిరేకతా లేదు. గమనించగలరు.

      మీరొక క్రొత్త వాదనను ప్రస్తావించారు. మీ వాదనకు ఆధారం తెలియదు. ఈ‌వాదనలో నిజానిజాలు విచార్యం. వనం వారు స్పష్టంగా "ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వ పరంగా చెల్లించిన మొక్కులపై అనవసర రాద్ధాంతం పూర్తిగా అసమంజసం." అంటూ వ్రాయట‌ం వలన ఆ మొక్కులు ప్రభుత్వపరంగానే తీర్చబడ్డాయని తెలియ వస్తున్నది. వనంవారు వ్రాసింది సాధికారకమైన సమాచారం అని వ్యాసం చదివితే బాగానే స్పష్టపడుతుంది. కాబట్టి మీ వాదనను నేను పరిశీలించి వ్యాఖ్యానించటం‌ చేయటం లేదు.

      తొలగించండి
    2. ఎండోమెంట్స్ డిపార్టుమెంట్ జీవో కూడా విడుదల చేసింది. గూగుల్ చేస్తే దొరకొచ్చు.

      తొలగించండి
    3. ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరికొన్ని ఆలయాలకూ త్వరలో బంగారు ఆభరణాలను సమర్పించనున్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారికి, మహబూబాబాద్‌ జిల్లాలోని కురవి వీరభద్రుడికి ముఖ్యమంత్రి ఆభరణాలు సమర్పించనున్నట్లు దేవాదాయ శాఖ వర్గాల ద్వారా తెలిసింది. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తిరుమల శ్రీవారు, తిరుచానూరు అమ్మవారికి సమర్పించిన బంగారు ఆభరణాల విలువ రూ.5.59 కోట్ల మేర ఉన్నట్టు సమాచారం. గతంలో వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారికి రూ.3.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను కానుకగా అందజేశారు. త్వరలో వివిధ ఆలయాల్లో సమర్పించే ఆభరణాలతో కలిపి మొత్తం కానుకల విలువ రూ.10 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. వీటి ఖర్చును దేవాదాయ శాఖ తన వద్ద గల సర్వశ్రేయోనిధి నుంచి సమకూరుస్తోంది. వివిధ ఆలయాలు తమ రాబడి నుంచి కొంత మొత్తాన్ని ఈ నిధికి జమచేస్తుంటాయి.

      Eenadu February 23rd.

      తొలగించండి
    4. The link to Eenadu news item.

      http://archives.eenadu.net/02-23-2017/news/news.aspx?item=main-news&no=1

      తొలగించండి
    5. నాగేశ్వరరావు గారూ, ముఖ్యమంత్రి గారు ఎండోమెంట్స్ నిధులే ఖర్చు చేసి ఉండవచ్చును. విధివిధానాలు సరిగా పాటించి ఉంచితే అంతవరకూ‌ నయమే. కాని అసంతృప్తి అన్నది అంతమాత్రాన తగ్గదేమో. మొక్కుకున్నది ఒకరు వ్యక్తి గతంగా ఐతే, ఆ తరువాత అధికారం వచ్చింది కదా అని ప్రభుత్వధనాన్ని ఆ మొక్కు తీర్చుకుందుకు - ఒక వేళ రూల్స్ పాటిస్తూ ఐనా సరే - కర్చు చేయటం‌ సమంజసమా అన్న శంక అలాగే ఉంటుంది. సమంజసమే అని కొందరు అన్నా ఆ సమాధానంతో ఆలోచనాపరులు అందరికీ‌ సంతృప్తి కలగటం‌ కష్టం అనుకుంటున్నాను.

      తొలగించండి
    6. తెలంగాణకోసం కెసిఆర్ (తెలంగాణా ప్రజలు కూడా) పదిహేను సంవత్సరాలు పోరాటం చేశారు. మానవ ప్రయత్నంతోబాటు, దైవసహాయాన్నీ అర్థించారు. అన్ని మతాల దేవుళ్ళకూ మొక్కుకున్నారు. మొక్కుకున్నది కూడా రాష్ట్రప్రయోజనాలకే. ఒక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపించిన నేతగా అందరితరపునా వ్యక్తిగతంగా మొక్కుకొనే అవకాశం, మొక్కులు చెల్లించే అదృష్టం ఆయనకు దక్కాయి. అందరి మొక్కులూ చెల్లిస్తున్నారు. నాకిందులో తప్పేమీ కనబడటంలేదండి. లౌకిక రాజ్యం అంటే సర్వమత సమభావన, దేవుడ్ని నమ్మకపోవడం కాదు.

      తొలగించండి
    7. నాగేశ్వరరావు గారూ, మీరు చెప్పినది చాలా వరకు వాస్తవం కావచ్చును. నేను ఆయన ఒక వ్యక్తిగా మొక్కుకొని ఒక అధికారపదవి ఆధారంగా ఆవిధంగా అందుబాటులోనికి వచ్చిన వనరులను మొక్కు తీర్చుకుందుకు వాడవచ్చునా అన్న విషయం ఆలోచిస్తున్నాను. ఇక్కడ లౌకికరాజ్యం‌ అంటే ఏమిటి అన్న ప్రశ్నా లేదు - దేవుడిని నమ్మకపొవటం‌ నమ్మటం గురించిన చర్చ కూడా లేదు. మీకు ఏమీ తప్పు కనపడకపోతే పోనీయండి. మీ ఆలోచనా ధోరణి మీది నా ఆలోచనా ధోరణి నాది.

      తొలగించండి
    8. మీరేదో కె.సి.ఆర్. అందుబాటులో వచ్చిన సొమ్మును దేవుడికిస్తే తప్పని భావిస్తున్నట్లున్నారు. మరి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, తిరుపతి వెంకటేశ్వర స్వామి సొమ్మును ప్రభుత్వాలు వాటి పథకాల కోసం ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేశాయి. ఆ డబ్బులతో పోల్చుకొంటే కె.సి.ఆర్. గారు ఇచ్చిన 5 కోట్ల నగలు నథింగ్. దానికి ఇంత పెడర్థలు పీకవలసిన అవసరం లేదు. దేవాలయాల సొమ్మును సౌత్ ఇండియాలో ప్రభుత్వాలు అన్ని తినేవే.

      తమిళనాడు లో ఎలా తింట్టున్నాయో చూడండి. తెలుగు రాష్ట్రాలు ఇంతకు భిన్నంగా ఉన్నాయా?

      1. TN Hindu Temple loot

      Properties transferred to individuals identified – 8540 acres, Recovered by the Department – not even 10%

      https://storify.com/ranganaathan/tamilnadu-hindu-temple-loot

      https://twitter.com/ranganaathan/status/789109137372164096

      2. Salaries of secular staff in temples range from 1.2 times to over 8 times

      https://twitter.com/db_is_db/status/539259998510284801

      3. This is how congress govt in Karnataka looting Hindu money and using against Hindus

      https://twitter.com/Isoumyas/status/831056582456778752

      తొలగించండి
    9. ఆంధ్ర ప్రభుత్వం, రాజకీయ నాయకులు కె.సి.ఆర్. తిరుపతికి వస్తే వేరే దేశ ప్రధానికి మర్యాద చేసినట్లు మర్యాద చేశారు. అంత హోదాలో వచ్చిన అతను నగలు ఇస్తే తప్పెమి? మన హిందూ రాజులందరు తిరుపతికి వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి కానుకలు చెల్లించినవారే. ఆ సాంప్రదాయాన్ని కె.సి.ఆర్. కూడా పాటించాడు. స్వామి వారికి కానుకలు సమర్పించాడు. కె.సి.ఆర్. బంగారు నగలు ఇచ్చినంత మాత్రాన, మీడీయా ప్రచారం చేసినట్లు అదేదో పెద్ద నేరమో, ఘోరమో, తప్పిదమో కాదు. ఆ సొమ్ము ప్రజలకు ఎదో విధంగా ఉపయోగపడుతూనే ఉంట్టుంది.

      TTD mulls moving 7.5 tonne gold under monetisation scheme

      The Tirumala Tirupati Devasthanam (TTD), which manages the world's richest Hindu temple of Sri Venkateswara Swamy, may move all of its 7.5 tonnes stashed gold under Gold Monetisation Scheme (GMS), launched by Prime Minister Narendra Modi last year.

      http://economictimes.indiatimes.com/articleshow/52053131.cms

      తొలగించండి
    10. ఇదే పని ఒక ముస్లీమో, క్రైసవ ముఖ్యమంత్రో ఒక మసీదుకో, చర్చికో ఇలాగే మొక్కు తీర్చుకోని ఉంటే మీ స్పందన ఇలాగే ఉండేదా??

      తొలగించండి
    11. మనగొప్పలు దేవుడి ముందా? రాజులతో ముఖ్యమంత్రిని పోల్చటం అనుచితం అని నా అభిప్రాయం అని పదేపదే నేను అభ్యంతరం వ్యక్తం చేయవలసిన అవసరం లేదు.

      తొలగించండి
    12. నేనేమీ‌ పడర్థాలు తీయటం‌ లేదండీ. అభిమానంతోఓ దురభిమానంతో‌నూ‌ మాట్లాడటమూ లేదు. అందుబాటులో ఉన్నంత మాత్రాన సొమ్మును ఇష్టారాజ్యంగా - అది దేవుని పేర ఐనా సరే - కర్చు చేయట‌ం‌ తప్పే. ఇంతకు ముందు వాళ్ళూ‌ తిన్నారుగా, వేరేవాళ్ళూ తింటున్నారుగా అన్నది సరైన సమర్థన కాదు.

      తొలగించండి
    13. చిరంజీవి గారూ, నా స్పందన ఇలాగే‌ ఉండేది. మతాభిమానాల గురించి చర్చ కాదిది. జరిగిన పని విధానపరంగా ఎంతవరకూ సబబు అన్నదే చర్చ. ఇలా మరికొందరు కూడా చర్చను మతవిషయంకా చూడటాని ప్రయత్నించారు. పొరపాటు.

      తొలగించండి
  9. మా ఏరియా కౌన్సిలర్ రోడ్లు వేయించినందుకు, ఒక 10 కొట్లు గవర్నమెంటు సొమ్ము మొక్కుగా చెల్లిస్తాడు. కెసీఅర్ అడగకుండా ఉంటాడా??

    రిప్లయితొలగించండి
  10. హిందూ మత సంస్థలని ప్రభుత్వం అజమాయిషీ చేస్తోంది, అది కుదరదని చెప్పండి. హిందూ ధర్మ సంస్థలు ప్రభుత్వ సంస్థలుకాదు, వాటి సొమ్ము ప్రభుత్వ సొమ్ము కాదు. కె.సి.ఆర్ ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టలేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మగారు, మీరన్నది నిజమే. ఇతరమతాల సంస్థలు స్వయంప్రతిపత్తి కలిగి ఉండగా ఆర్షసంస్థలు మాత్రం ప్రభుత్వపు పెత్తనంలో ఉండటం అసందర్భమే. అవమానకరమే. కాని ప్రస్తుతపరిస్థితిలో నా ప్రశ్న ఒకటే - మొక్కు వ్యక్తిగతం ఐతే, దానిని తీర్చటానికి ప్రభుత్వం అయ్యేది ప్రభుత్వేతర సంస్థ నిధి అయ్యేది అది ఖర్చు చేయటం‌ సబబా అని.

      తొలగించండి
  11. పెద్దలు శర్మ గారికి శ్యామలీయం గారికి నమస్కారములు. మీడియా వాస్తవాలను సరిగ్గా కవర్ చేయలేదండి. కెసిఆర్ గారు ప్రభుత్వపు సొమ్మేమీ ఇవ్వలేదు. ఆయన ఎండోమెంట్స్ వారి కామన్ గుడ్ ఫండ్ నుంచి ఇచ్చారు. తెలంగాణ గుళ్లలోని హుండీలలో హిందువులే వేసిన డబ్బులతోనే ఈ కామన్ గుడ్ ఫండ్ పెట్టారు. అంటే, ఇది తెలంగాణా హిందువులు స్వామివారికి ఇచ్చినట్టే లెక్క. తిరుపతి వెంకన్న తెలంగాణాలోని ఎన్నో గుళ్ళకి, ధార్మిక కార్యక్తమాలకు డబ్బులు ఇస్తున్నాడు కదా, మరి తెలంగాణా హిందువులు ఆయనకు కానుకలు ఇస్తే తప్పేమిటి?

    కానుకలు తెలంగాణా హిందువుల ప్రతినిధిగా కెసిఆర్ గారు ఇచ్చారు. భద్రాచలం రాములవారికి కూడా ముఖ్యమంత్రి ఇదే విధంగాతలంబ్రాలు ఇస్తారు. ఇందులో కూడా ఒక్క పైసా కూడా ప్రభుత్వం ఇవ్వదు. అవి కూడా ఎండోమెంటు ఫండ్స్, హిందువులనించి రాబట్టిన సొమ్ములోంచే వస్తాయి.

    కానీ ఇదే సమయంలో హజ్ యాత్రకు సబ్సిడీలు, జెరూసలేంకు సబ్సిడీలు మాత్రం ప్రభుత్వం సొమ్మునించే ఇస్తున్నారు, ఎవ్వరూ దానిని ప్రశ్నించరు, నేను కూడా ఇవ్వొద్దు అని అనను. కానీ, హిందూ దేవాలయానికి హిందువులసొమ్ము ఇచ్చినప్పుడు మాత్రం జనాలకు తట్టుకోవడం కష్టంగా ఉంది.

    మొన్నటికి మొన్నటి టీటీడీ బడ్జెట్ లో సుమారు 200 కోట్లు తిరుపతి చుట్టుపక్కల రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేటాయించారు. నిజానికి ఇవి ప్రభుత్వపు సొమ్ముతో చేయాల్సిన పనులు, కానీ హిందువుల డబ్బు ఖర్చుపెడుతున్నారు. దీనిని మనం ప్రశ్నించం. ఎన్నో ప్రభత్వం పథకాలకు దేవాలయాల భూమిని ప్రభుత్వం హారతి కర్పూరం లా (ఏంతోకొంత ముష్టి పారేసే లాక్కుంటరు లెండి) ఖర్చుపెడుతుంది. అది మనకు పట్టదు. ఇవాల్టికీ మన అమరావతిలో విజయవాడలో ఏంతో ధనం మరియు పరపతి ఉన్న సిద్ధార్థ సంస్థలు దుర్గ గుడి భూములలో యాభయి ఏళ్ళనాటి లీజు రేట్లను చెల్లిస్తూ హాయిగా కాలేజీలు నడుపుకుంటున్నాయి. మనకివేమీ పట్టవు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంచి విషయాలు ప్రస్తావించారు. ప్రభుత్వాలు మొక్కులు మొక్కవచ్చునా - తీర్చవచ్చునా? వ్యక్తుల మొక్కుల్ని ప్రభుత్వాధికారం సహాయంతో‌తీర్చ వచ్చునా ఇత్యాది శంకలే కాని మీరన్నట్లుగా నాకేమీ ఆర్షవిరుధ్ధభావజాలం‌ ఏమీ‌ లేదు. అవ్యవస్థగా ఉన్నవాటిపై ప్రభుత్వం‌ దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరాలి. అందులో ఇబ్బంది ఏమీ లేదు. ఈ విషయం ఈవ్యాసానికి వ్యాఖ్యగా ఎందుకు ప్రస్తావించారో బోధపడదు. శాఖాచంక్రమణం వలన విషయం పలుచన కావటం అనవసర చర్చ తప్ప ప్రయోజనం లేదు కదా.

      తొలగించండి
  12. శ్యామలరావు గారు, అన్ని మంచి ప్రశ్నలే. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభుత్వం అయినపుడు, ఒక వ్యక్తి ప్రభుత్వం తరపున మొక్కుకోవడం, అది ముఖ్యమంత్రి ద్వారా తీర్చుకోవడం ఆరాష్ట్ర ప్రజలకి ఇష్టం అయినపుడు అది తప్పేలా అవుతుంది. ప్రజాధనం దుర్వినియోగమవుతోంది అనుకొంటే, మనం ప్రతి దాన్ని ప్రశ్నించవలసిఉంటుంది. కాదంటారా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. .. రాష్ట్రప్రజలకు ఇష్టం అయినప్పుడు....
      అది చట్టసభలో తీర్మానం ద్వారా ప్రకటితం‌ కావాలి. ఆయనను ఎన్నుకున్నారు కాబట్టి ఆయనేం‌ చేసినా ప్రజాభీష్టం అంటే పొసగదండి.

      తొలగించండి
    2. ప్రజాధనం‌ దుర్వినియోగం అవుతున్నది అనుకుంటే అటువంటి సందర్భాల్లో మీ‌దృష్టికి వచ్చిన వాటిని మీరు ప్రశ్నించవధ్దని ఎవరూ అనరు.

      తొలగించండి
    3. ప్రతి చిన్న విషయానికి చట్టసభలు సమయం కేటాయించలేవు. ఆయన అన్నీ ప్రొసీజర్ ప్రకారమే చేశారు. చట్టసభలు హిందువుల కోసం కామన్ గుడ్ ఫండ్ వాడాలని (ఎండోమెంట్ చట్టం) చెప్పాయి. నిధుల విడుదలకు జీవో విడుదల చేశారు. కానుకల తయారీలో వివాదాలకు ఆస్కారం లేకుండా టీటీడీకే ఆ భాద్యత అప్పచెప్పారు. టీటీడీవారు కూడా సక్రమంగా పద్ధతులు పాటించి, టెండర్లు పిలిచి, పనిని పూర్తి చేశారు.

      తొలగించండి
    4. నాగేశ్వరరావు గారూ, ఓపిగ్గా మరోసారి నా అభిప్రాయం చెప్పనివ్వండి. చట్టాల ప్రకారం చేసినా సరే, ఒక వ్యక్తి మొక్కుకుంటే ఒక సంస్థద్వారా ఆమొక్కు తీరటం అసంతృప్తి కలిగించే విషయమే. ఒక వ్యక్తి కొక స్వంత కంపెనీ ఉండి, అతగాడి మొక్కుల కోసం కంపేనీ రూల్స్ ప్రకారమే ధర్మకార్యాలకు విరాళం పేరుతో‌ నిధులను బోర్డ్ ఆఫ్ డైరక్టర్ల ఆమోదం‌ డ్రామా నడిపించి మరీ (మెజారిటీ షేర్లూ - బోర్డు వ్యవస్థాపక చైర్మన్ గిరీ‌ కూడా అతడివే అనుకుందాం) సమీకరించి దర్జాగా మొక్కు తీర్చుకోవటం సరైన విధానం కాదనే చెప్పాలి. అబ్బెబ్బే అదేం‌ లేదు. ఆలా చేయటంలో ఏమీ ఇబ్బంది లేదు అంటారా? ఇంక వాదం అనవసరం. ఇంక విరమిద్దాం.

      తొలగించండి
  13. శ్యామలరావు గారు,
    మీరన్నట్లు అధిక మెజారిటీతో ఉన్న ప్రభుత్వానికి చట్టసభలో తీర్మానాన్ని నెగ్గించడం పెద్ద పనేమీ కాదు. అయినప్పటికీ ఆ రకంగా తన మొక్కులు చెల్లించుకోవచ్చునా అన్నది ప్రశ్న.
    కామన్ గుడ్ ఫండ్ అంటున్నారు. ఆ ఫండ్ నుంచి ఖర్చు చేయడం దేవాలయాల మెయింట్నెన్స్, పునరుద్ధరణ, నైవేద్యం, వేద పాఠశాలల నిర్వహణ లాంటి నిర్దేశించిన కార్యక్రమాలకు మాత్రమేననీ, అటువంటి పనుల కోసం ఆ దేవాలయాల ఆదాయం మీద కూడా పరిమితులున్నాయనీ అనుకుంటున్నాను.
    ఏమైనప్పటికీ ఈ చర్చ తెగదు, మీరన్నట్లు ఇంక విరమిద్దాం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ. చర్చ విధానం ఎంత సబబూ అన్న ప్రశ్ననుండి వ్యక్తిగతమైన అభిమానదురభిమానాలపైకీ ఇతరవిషయాలపైకి మళ్ళటం‌ జరుగుతోంది. అదీకాక అందరం‌ అభిప్రాయాలను పంచుకున్నాం. అంతవరకే. వాదప్రతివాదాల్లో జయాపజయాలను తేల్చుకోవటం కోసం జరుగుతున్న చర్చ కాదు. అందుకే విరమించుదాం.

      తొలగించండి
    2. కామన్ గుడ్ ఫండ్ ఇతర రాష్ట్ర దేవాలయాలకి కూడా వర్తిస్తుందా లేక సొంత రాష్ట్రానికేనా?

      తొలగించండి
    3. కామన్ గుడ్ ఫండ్ ఇతర రాష్ట్రాల దేవాలయాలకు వర్తిస్తుందా అన్నది వేరే ప్రశ్న. అర్థవంతమైనదే. దీనికి జవాబు వర్తించదనే అనుకుంటాను. కాని నా అభిప్రాయం తప్పు కావచ్చును.

      తొలగించండి
  14. ఈ ఒక్క కామెంటూ వేయరూ!
    ప్లీజ్!!
    భక్త రామదాసు గారికి ప్రభుత్వ సొమ్ముతో ఆభరణాలు చేయిస్తే ఎలాంటి గతిపట్టిందో అలాంటి గతే కేసీఆర్ గారికి పట్టాలని మొక్కుకుంటున్నాను.

    ఎందుకంటారా ఒక దేవుడు ఒక రాష్ట్రాన్ని విడగొట్టడానికి సహాయపడితే అదే దేవుడు ఒక రాష్ట్రాన్ని తిరిగి కలపడానికి కూడా సహాయపడాలి కదా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు మొగమాట పెట్టారు కాబట్టి ఈ ఒక్క కామెంటు వేస్తున్నాను, కాని దీనికి మిగిలిన వారి స్పందనలను ఎలా తిరస్కరించటం అన్నది సమస్య.

      దేవుడి లీలలు మనకు అర్థం కావు. ఐనట్లు ఉన్నా అది సాధారణంగా అపోహే. కాకపోవటానికి కారణం మనం మనమన అహాల-అవసరాల-అనుబంధాల తాలూకు స్పృహలనుండి పూర్తిగా బయటకు వచ్చి పరిశీలించలేని అసమర్థత వలనే. ఏమో - ఇన్నాళ్ళూ ఆంధ్రాసొమ్ములు హైదరాబాదు మోజులో అక్కడ తగలేసి చేయి కాల్చుకున్నది చాలు, ఇక ఆంధ్రాలోనే సద్వినియోగం చేసుకొని అభివృధ్ధి చెందమని దేవుడి ఉద్దేశమేమో? మరలా కలవటం ఎందుకూ - ఇప్పటికి అంధ్రాకు వదిలింది చాలకనా? విడిపోయి ప్రపంచంలోనే మిన్నగా అభివృధ్ధి చెందుతున్నాం ఆస్తుల్లో (అప్పుల్లోనూ!) అని తెలంగాణా సంబరం పడుతుంటే మళ్ళా వాళ్ళని ఆంధ్రాతో పంచుకుని తిని మరోసారి చెడమని అనటం ఎందుకూ? ఇలా ఉభయలూ‌ కలిసుండి చెడింది చాల్లెమ్మని దేవుడి ఆర్డరేమో!

      తొలగించండి
    2. మాస్టారూ, బ్లాగు మీది, నా వ్యాఖ్య ప్రచురించాలో వొద్దూ అనే విషయంలో సర్వ హక్కులూ మీవే.

      తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం గురించి నా అభిప్రాయాలు మిత్రులు అందరికీ తెలిసినవే, పునరుద్ఘాటించడం అవసరం లేదని భావిస్తాను.

      భక్త రామదాసు గుడి కట్టింది ప్రభుత్వ (ప్రజల) సొమ్ముతోనా లేదా వసూలు చేసిన ధనంతోనా అన్న విషయం ఎవరికీ తెలీదు. ఏమయినా ఆయన చరిత్రలో మిగిలి పోయారు. అంతటి అదృష్టం కెసిఆర్ గారికి దక్కితే ఆయన జన్మ ధన్యమే.

      కెసిఆర్ తన మొక్కును తీర్చుకోవడం కోసం ప్రజలను (లేదా సొంత పార్టీ వారిని) స్వచంద దానం అడిగి ఉండుంటే బాగుండేది. తెలంగాణా ప్రజల (లేదా తెరాస) పక్షాన దేవుడికి నగలు ఇఛ్చినట్టు అనిపించేది, ప్రజాధనాన్ని ఏకపక్షాన సొంత మొక్కుకు వాడాడన్న అపవాదు తప్పేది.

      తొలగించండి
    3. తెలంగాణా రాష్ట్రావిర్భావం గురించి మీ అభిప్రాయాలు జగద్విదితమే. భక్తరామదాసుగారు భధ్రాచలరాముడికి గుడికట్టించటంలో ఏసొమ్ములు వినియుక్తం ఐనదీ విస్పష్టంగా మనకు తెలియదని మీరన్నది నిజం. అలాగే కేసీఆర్ గారు విడిగా విరాళాలు సేకరించి దేవుళ్ళకిస్తే ఇంత తగవుండేది కాదేమో అన్నదీ‌ సమంజసమైన పాయింటే. కాని కేసీఆర్ గారి వ్యవహారశైలి ప్రజలూ, ప్రభుత్వమూ, కేసీఆర్ అన్న త్రిపుటి అంతా ఒక్కటే అన్నట్లుంటున్నది. ఆయన అభిప్రాయమే ప్రజాభిప్రాయం. ఆయన అభిప్రాయమే ప్రభుత్వాభిప్రాయం. ఆయన అభిప్రాయమే పార్టీ అభిప్రాయం. ఆయన అభిప్రాయమే రాజ్యమూ - రాజ్యాంగమూను. అలా వ్యవహరించి ఇలా చిక్కులు కొని తెచ్చుకుంటున్నారేమో అని నా ఉద్దేశం. ఐతే ఆయన తన తప్పులెంచే సాహసం చేసేవాళ్ళందరినీ‌ ఫెడీమని సన్నాసులూ ద్రోహులూ అనేస్తూ ఉండటం అయనకూ ఆయన అభిమానులకూ‌ తప్ప మిగతా ప్రపంచానికి అంతగా మింగుడుపడటం‌ లేదు.

      తొలగించండి
  15. వ్యక్తిగత మొక్కులు సొంత డబ్బులతో చేయాలన్న మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఈ సూత్రం దీక్షలకు కూడా వర్తిస్తుందా అన్న ప్రశ్నకు మీరు నాకు కుల/మత/ప్రాంత ద్వేషం అంటకట్టకుండా జవాబు ఇస్తే నా అదృష్టంగా భావిస్తాను.

    http://www.newindianexpress.com/states/andhra-pradesh/2019/feb/09/naidus-delhi-protest-to-cost-rs-112-crore-opposition-questions-wastage-of-public-money-1936622.html

    రిప్లయితొలగించండి
  16. లోగడ శ్రీశైలం జలవివాదం నేపథ్యంలో వనంవారి ఆంగ్లవ్యాసాన్ని తెలుగుచేసి ఈశ్యామలీయం బ్లాగులో ప్రచురించాను. బహుశః మీకు గుర్తు ఉండవచ్చును. విద్వేషాన్ని వెదజల్లే మాటలను, ఆలోచనలను అవి ఏప్రాంతం నుండి వచ్చినా నా కంటపడితే, నా పరిస్థితులు అనుకూలిస్తే తప్పక ఖండిస్తాను. ఎంతపంచదారపూత ఉన్నా అంతర్గతంగా విద్వేషం కనిపిస్తే నా నిరసనను నా పరిమితులకు లోబడి తెలియజేస్తాను. కాని ముఖ్యంగా రాజకీయాల గురించి చురుగ్గా వ్రాసే ఉద్దేశమూ అలవాటూ నాకు లేవు.

    మీరు చంద్రబాబు గారు ఆంద్రప్రదేశప్రభుత్వపరంగా ఢిల్లీలో చేయసంకల్పించిన దీక్ష గురించి ప్రస్తావిస్తున్నారు. మీదృష్టిలో అది చంద్రబాబుగారి వ్యక్తిగతవ్యవహారం. కాని అది ఆంద్రప్రదేశప్రభుత్వం కేంద్రంపెత్తనంపై నిరసన తెలియజేసే కార్యక్రమం అని కూడా గ్రహించవచ్చును. మీరు అక్కడ అధికారపార్టీని చూస్తున్నారు. నేను రాష్ట్రప్రభుత్వాన్ని చూస్తున్నాను. దృక్కోణంలో బేదం వలననే మీకు తప్పుగా కనబడుతోంది.

    ఆంధ్రాప్రయోజనాలకు కించిత్తూ కలిసిరాని జగన్ పార్టీ, మోదీపార్టీలను మీరు ప్రతిపక్షం అని ఒప్పుకుంటే అది మీ యిష్టం. కాని ఆంద్రాలో అలా ఒప్పుకొనేవారు తక్కువే కావచ్చును అన్నది నా దృక్కోణం. రాష్ట్రప్రభుత్వం బానిస కాదు కేంద్రానికి, నిరసన తెలియజేయటం కూడా ద్రోహం అని దానికయ్యే పైసలు దుర్వినియోగం అనటానికీ.

    గతంలో కాంగ్రెసుప్రభుత్వాలు ఢిల్లీచుట్టూ చేసే ప్రదక్షణలు ప్రభుత్వఖర్చుతోనే జరిగేవి కాని అప్పుడెవ్వరూ అది ప్రజాధనదుర్వినియోగం అనలేదనుకుంటాను. నిత్యం నోరుపారేసుకొనే వైకాపా, ఈమధ్యనోరుపారేసుకొనే కళలో దాన్ని మించిపోయిన బీజేపీలు చేసే ఆరోపణలు ఆధారంగా చూస్తే రాష్ట్రప్రభుత్వం అన్నది మోసకారి కాబట్టి ఈప్రభుత్వం ఖర్చుపెట్టే ప్రతిపైసాకూడా ప్రజాధనం వృధా చేయటమే లాగున్నది. ఈఆరోపణ మీకు ఆకర్షణీయంగా కనిపించి దాన్ని మీరు తలకెత్తుకున్నందుకు కారణం ఆంద్రప్రాంతపట్ల విద్వేషం అంతర్గతంగా ఉండటమా అన్నది మీరే ఆలోచించుకోండి. మీరు మాత్రం ఆంధ్రాలో ఉన్న అధికారపార్టీమీద మాత్రం కారణం ఏదైనా ఏఅవకాశమూ వదులుకోకుండా సూటిపోటీ మాటలు విసురుతూ అనందం పొందుతున్నది బ్లాగులోకం నిత్యం గమనిస్తూనే ఉన్నదని నా అభిప్రాయం. ఈధోరణికి కారణం ఏదైనా అది అంతగా మీకు శోభనివ్వటం లేదన్నదే నా విచారం.

    అవునూ వ్యక్తిగతమైన మొక్కుబడికి కేసీఆర్ ప్రభుత్వసొమ్ములు వెచ్చించటానికీ, రాష్ట్రప్రభుత్వం తమ రాష్ట్రప్రయోజనాలను ఆశిస్తూ దీక్షచేయటం ఒకగాటన కట్టటం అనేవిషయంలో మీరు అత్యుత్సాహం చూపారని నాకనిపిస్తోంది. తెలంగాణా అభివృధ్ధి చెందిన రాష్ట్రం ఐనా ఇతోధికంగా అభివృధ్ధి చెందాలనే అందరి ఆకాంక్ష. ఆంధ్రా అభివృధ్ధి చెందుతున్న, చెందవలసిన రాష్ట్రం - అది అభివృధ్ధి చెందటాన్ని అడ్డుకోవటమూ, అలా అడ్డుకొనే వారికి వత్తాసుపలకటమూ ఆంద్రులకు అంతగా రుచిమ్చే వ్యవహారాలు కావని నా విన్నపం. సరే, ఆంద్రా అభివృధ్ధ్జి చెందాలంటే జగనో బీజేపీనో రావాలి అని మీ అభిప్రాయం ఐతే నేను తప్పక విబేధిస్తాను. జగన్ ధోరణిలో చంద్రబాబుపట్ల ద్వేషమే కాని సగుణాత్మకమైనది కనిపించదు. మోదీబంట్లు వచ్చి ఆంద్రాను అభివృధ్ధి చేస్తారంటారా - మోదీ అఖండసాయం గురించి వాళ్ళూ మీరూ తప్ప నమ్మేవారెవరూ నాకు కనబడటం లేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంద్రబాబు & ఆయన సమర్తించే వారి వాదనలకు నేను అభ్యంతరం చెప్పడం లేదు. ఎవరి ఇష్టం వారిదే, అలాగే ఎవరి ఖర్చు కూడా వారిదే కావాలన్న సూత్రం మీదే నా వ్యాఖ్య.

      ఇవ్వాళ ఢిల్లీలోనే కాదు జిల్లాలలో జరిగిన "దీక్షలు" అన్నింటిలోనూ ఒక్క టీడీపీ పార్టీ వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరు. కనీసం ఉభయ కమ్యూనిస్టులు & (ప్రస్తుత) మిత్రపక్షం కాంగ్రెస్ వాళ్ళూ రాలేదు. వాదన కోసం ఉద్దేశ్యం మహోన్నతం & పూర్తిగా ప్రజాభీష్టానికి ప్రతిబింబం అనుకున్నా ఇది పార్టీ కార్యక్రమమే అవుతుంది.

      ప్రజాప్రయోజనాలకు ఎవరు కలిసి వసిస్తారని జనం అనుకుంటారో కొద్ది వారాలలో తెలుస్తుంది. జగన్ గెలిస్తే ఆ విజయానికి మతలబులు అంటకట్టకుండా అంగీకరిస్తారో లేదో చూద్దాం.

      తొలగించండి
    2. జై గారూ, బాబు పోవాలీ జగన్ రావాలీ అని తెలంగాణాలోని కొందరు ఎందుకు తహతహ లాడుతున్నారో అందరికీ తెలుసు. మాదే పెద్దగీత అంటూనే ఆవలిగీత చిన్నది ఐతే బాగుండునని కోరుకొంటూ డాంబికాలు కూడానా?

      తొలగించండి
    3. ఈ పెద్ద గీత చిన్న గీత గొడవలు నాకయితే లేవు. దేశంలో ఉన్న 28 ఇతర రాష్ట్రాలలో ఆంధ్ర కూడా *ఒకటి* తప్ప వేరే ఇంపార్టెన్స్ లేదు.

      తొలగించండి
    4. జై గారూ,
      అబద్దాలు & అభూత కల్పనలు అంటూ మొన్ననొక మాట విసిరారు. ఈరోజున మీరు '...ఒక్క టీడీపీ పార్టీ వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరు....' అంటూ అన్నది అబధ్ధమా? అభూతకల్పనా? లేక రెండూనా? వార్తల్లో చదివినా టీవీల్లో చూసినా అనేకమంది జాతీయరాజకీయనాయకులు చంద్రబాబు దీక్షకు మద్దతు పలుకుతూ మాట్లాడుతున్నారన్నదే స్పష్టం అవుతూ ఉందే! మీరు తొందరపడి ఉంటారని నా అనుమానం.

      తొలగించండి
    5. జై గారూ,
      మీరు ఇక్కడ దేశంలో ఉన్న 28 ఇతర రాష్ట్రాలలో ఆంధ్ర కూడా *ఒకటి* తప్ప వేరే ఇంపార్టెన్స్ లేదు అన్నా అది నిజం కాదని మీకూ తెలుసు, నాకూ తెలుసు, బ్లాగుప్రపంచంలో దాదాపు అందరికీ తెలుసు. కేవలం ఆంద్రారాజకీయాలపైననే మీరు అతిగా స్పందిస్తున్నారు కొంతకాలం నుండి. ముఖ్యంగా ఆంధ్రాలో ప్రస్తుతం ఉన్న అధికారపార్టీ మీద మీరు నిత్యం వీలైనంతగా నేలబారు విసుర్లు విసురుతూనే ఉన్నారు. మీరు తెలంగాణా తప్ప మిగతా 28 రాష్ట్రాల్లో కేవలం ఆంధ్రామీదనే ఇంత కక్షస్థాయి మాటలు విసరుతున్నారే కాని మిగిలిన ఏరాష్ట్రం గురించి ఐనా ఈస్థాయిలో కాకపోయినా కొంచెం తక్కువ స్థాయిలో ఐనా విమర్శలు చేసారా? లేదు కదా! మీరు ఆంద్రాను మిగతారాష్ట్రాల్లో ఒకటి అనేసినా ఆంద్రావాళ్ళు కూడా అలాగే అనలేరు లెండి. ఆంంధ్రప్రాంతం నుండి బ్రతుకు తెరువుకోసం అనేకమందిమి ఈ రాష్ట్రానికి వలసరావలసి వచ్చింది. మా తాతలు 1956కు ముందు ఇక్కడకు రాలేకపోయిన మహాపరాథానికి శిక్షగా దశాబ్దాలుగా ఇక్కడే స్థిరపడి ఉండీ పరాయివాళ్ళమై పోయిన వాళ్ళము తెలంగాణాను మిగతా 28 రాష్ట్రాల్లోనూ ఒకటి అనుకోలేము, ఆంధ్రానూ మిగతా 28 రాష్ట్రాల్లో ఒకటిలే అనుకోలేము. అదీ మా వ్యథ. నవ్విన నాపచేనే పండుతుంది. ఆంధ్రాకు ఈ దెప్పుళ్ళూ ఈ కష్టాలూ కలకాలం ఉండేవి కావు; మీబోటి మేథావులూ సహృదయులూ అలా కష్టనష్ట్ఝాలు ఆంధ్రాకు కలకాలం ఉండాలీ ఇంకా పెరగాలీ అని కోరుకొంటూ నిత్యం సూటిపోటి మాటలంటున్నా ఆంధ్రా తప్పకుండా అభివృధ్ధి చెందుతుంది. మిగతా 28 రాష్ట్రాల్లో ఫలానా రాష్ట్రం *ఒకటి* అభివృధ్ది చెందకూడదని మీరెంత ఘోషపెట్టినా అది తప్పదు.

      తొలగించండి
  17. http://www.andhrajyothy.com/artical?SID=710635

    "సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న దీక్షకు మద్దతుగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన వేల మంది *తెలుగుదేశం పార్టీ* కార్యకర్తలు, అభిమానులు ఢిల్లీ చేరుకున్నారు. శ్రీకాకుళం, అనంతపురం నుంచి రెండు ప్రత్యేక రైళ్ల ద్వారా దాదాపు రెండు వేల మంది *కార్యకర్తలు* తరలివెళ్లారు"

    నా పాయింటు ఇదొక్కటే. చెంద్రాలు సారు అనుకుల మీడియా ప్రకారమే ఇది కేవలం పార్టీకి పరిమితమయిన కార్యక్రమం. ఆ ఖర్చేదో వాళ్ళే పెట్టుకుంటే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జై గారూ, మీరు 'నా పాయింటు ఇదొక్కటే' అన్నా నిజానికి మీ పాయింటు 'ఒక్క టీడీపీ పార్టీ వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరు' అన్న తప్పుడు వార్తను నమ్మి / సృష్ట్టించి ప్రచారం చేయటమే కాని మరొకటి కాదని నా కనిపిస్తోంది.

      తొలగించండి
    2. "అనేకమంది *జాతీయ*రాజకీయనాయకులు చంద్రబాబు దీక్షకు మద్దతు పలుకుతూ మాట్లాడుతున్నారన్నదే స్పష్టం"

      మమతా బెనర్జీ మీటింగుకు కూడా దేశంలో ఎన్నో *పార్టీల* నాయకులు వచ్చారు. అది త్రిణమూల్ కాంగ్రెస్ తన ఖర్చుతో జరిపిన సభ కనుక ఆక్షేపణ లేదు. చంద్రబాబు కూడా బెజవాడలో second anti-BJP front enclave జరుపుతామన్నారు: దానికీ అభ్యంతరం లేదు.

      "ఒక్క టీడీపీ పార్టీ వాళ్ళు తప్ప ఇంకెవరూ లేరు' అన్న *తప్పుడు* వార్తను"

      జగన్ & కన్నా లక్ష్మీ నారాయణ "ద్రోహులు" కనుక వదిలేసినా రఘువీరా, పవన్, లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ, సీపీఐ (చికెన్) నారాయణ, రాఘవులు గార్లను కూడా పిలువలేదు. చంద్రబాబు జేబు సంస్థ రాసిన కథానికం (లింకు పైన, మా ఇంట్లో కూచొని నేను పుట్టించింది కాదు) ప్రకారమే వెళ్ళింది టీడీపీ వాళ్ళు మాత్రమే.

      ఇదే అంశంపై జగన్ రెండేళ్లు బోలెడన్ని సభలు నిర్వహించారు, అవన్నీ వైకాపా ఖర్చుతోనే. పవన్ కళ్యాణ్ & ఉభయ కమ్యూనిస్టులు కూడా సొంత డబ్బులతో నిరసనలు చేసారు.

      మీరు చూసే ఛానెళ్లలో ఈ వార్తలు వచ్చాయో లేదో తెలీదు. వాళ్ళవి అవినీతి సొమ్మంటూ వాదన పక్కతోవ పట్టిస్తే లేదా నాకు కులగజ్జి/ప్రాంతీయతత్వం ఆపాదిస్తే నేను చేయగిలిగిందేమీ లేదు.

      తొలగించండి
    3. జై గారూ, ఇంక ఈ విషయంలో చర్చించటం అనవసరమండీ. You go to your church, we go to ours!

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.