కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, నవంబర్ 2023, గురువారం

సెలెక్టివ్ సింపతీ!

 

చనిపోయిన మరియు చనిపోతున్న గాజానగరపు పనిపిల్లల్లారా 
ఇంకా చనిపోబోతున్న మరింతమంది గాజానగరపు పనిపిల్లల్లారా 
మీకందరికీ వీడ్కోలు ఉత్సవాలను ప్రారంభించింది ఎవరో తెలుసా?
కొందరు రాజకీయకవులు పాడుతున్నట్లు ఇజ్రాయేల్ కాదు
మీకందరకూ ఇన్నాళ్ళూ సుపరిపాలన అందించిన హమాస్ వాళ్ళు
వాళ్ళు ఇజ్రాయేల్ గర్భిణీల పొట్టలు చీల్చి ఎందరో పసికందుల్ని చంపారు.
అప్పుడీ రాజకీయకవులు ఆకళ్ళుతెరవని పిండాలమీద కవితలు పాడలేదు
ప్రతిహింస చెడ్డది అనే ఈకవులు తొలిహింసాకాండను చెడ్డది అనలేదు.
ఆ పుట్టని బిడ్డలను నాడు వాళ్ళు క్షమాపణ అడుగలేదు
బిడ్డలను కనవలసిన పిచ్చితల్లులనూ వాళ్ళు క్షమాపణ అడుగలేదు
ఇప్పుడు మిమ్మని క్షమాపణ అడుగుతున్నారు.
ఎంత సెలక్టివ్ గిల్ట్! ఎంత సెలెక్టివ్ సింపతీ. 
ఏ దిక్కుమాలిన హింసారంభకులనూ చచ్చినా క్షమించకూడదు
సెలెక్టివ్ సింపతీ డ్రామాల కవుల్ని చచ్చినా క్షమించకూడదు
గాజానగరపు పనిపిల్లల్లారా మీరు హమాస్ వాళ్ళని క్షమిస్తారా?
గాజానగరపు పనిపిల్లల్లారా మీరీ దిక్కుమాలిన కవుల్ని క్షమిస్తారా?
ఓ కాలమా నీవు ఈహమాస్ వాళ్ళని క్షమిస్తావా?
ఓ కాలమా ఈ దిక్కుమాలిన కవుల్ని క్షమిస్తావా?



నోట్:   ఇది గాజా పసిపిల్లలు అనే కవితకు ప్రతిస్పందనగా వ్రాసిన కవిత.

13, జనవరి 2023, శుక్రవారం

విరక్తి వచ్చేసింది

సినిమాల మీద విరక్తి వచ్చేసింది
క్రికెట్ మీద విరక్తి వచ్చేసింది
రెండు చోట్లా వయసైపోయిన వాళ్ళదే రాజ్యంగా ఉంటోందని

రాజకీయాల మీద విరక్తి వచ్చేసింది
తెలుగుసాహిత్యం మీద విరక్తి వచ్చేసింది
రెండు చోట్లా మతిలేని వాళ్ళదే రాజ్యంగా ఉంటోందని

ప్రపంచం మీద విరక్తి వచ్చేసింది
జీవితం మీద విరక్తి వచ్చేసింది
ఎక్కడా సంతోషించదగ్గది ఏమీ కనిపించటం లేదని

 

11, అక్టోబర్ 2022, మంగళవారం

నేటికవిత్వం - 8



అందరూ కవు లయ్యారు

రణగుణధ్వని కవిత్వం అయింది


గుణగణభరితకవిత్వం పోయింది

గుణగణరహితకవిత్వం వచ్చింది


వినేవాళ్ళు చెవులు మూసుకున్నారు

కనేవాళ్ళు కళ్ళు మూసుకున్నారు

సరస్వతీదేవి తలుపుల మూసుకుంది




నేటికవిత్వం - 7



ఒకప్పుడు కవులు కవిత్వం రాసేవారు

అప్పుడు జనం దాన్ని చదివేవారు


ఆ కవులూ మాయమయ్యారు

ఆ కవిత్వమూ ఆగిపోయింది


ఇప్పుడు అందరూ కవిత్వం రాసేవారే

ఎక్కడా జనం దాన్ని చదవటంలేదు




10, అక్టోబర్ 2022, సోమవారం

నేటికవిత్వం - 6

రాజుల్నీ బూజుల్నీ పొగడిపొగడి

కవిత్వం అలసిపోయింది


ఇజాల్ని బుజాలపై మోసిమోసి

కవిత్వం సొమ్మసిల్లింది


భాషరాని కవుల కబంధహస్తొల్లో

కవిత్వం గిలగిల్లాడుతోంది


భావహీనమైన కవితల దెబ్బలకి

కవిత్వం చచ్ఛిపోతోంది




నేటికవిత్వం - 5

 

 

కవిత్వాన్ని సృష్టించలేని

కవుల్ని సృష్టించేవి

కవుల ఫాక్టరీలు

ఫాక్టరీ కవుల ఫేక్ కవితలు

కాలుష్యకాసారాలు



నేటికవిత్వం - 4

 

 

కవుల ముఠాల్లో

కవుల మఠాల్లో

కవులుంటా రనుకోకు



నేటికవిత్వం - 3

అనంత మహావిశ్వంలో

అనేక ఒంట‌రి నక్షత్రాలు

ఆనేక తుంటరి గ్రహాలు

గమ్యంలేని పయనంలో

కాలం గడుపుతున్నాయి


అనంత కవిత్వాకాశంలో

అనేక మసక నక్షత్రాలు

అనేక చీకటి పీఠాలు

నిరుపయోగ పయనాల్లో

కాలం గడుపుతున్నాయి

నేటి కవిత్వం - 2

కవివై పోతున్న పెద్దమనిషీ

ముందు చదివేవాళ్ళను వెతుక్కో

కవిత్వం రాస్తున్న పెద్దమనిషీ

ముందు ఆత్మశోధన చేసుకో

కవితలు గిలికే కవిరాజా

ముందు భావాన్ని పలికించు

పాతిక కవితల పుస్తకంలో

పది మంచివిషయాలు చెప్పు

నువ్వెప్పుడో వీపుగోకిన కవి

నీవీపును గోకుతాడు సరే

ఎవరూ కొనని పుస్తకాన్ని

ఎవరెవరికో పంచుతావు సరే

ఐనా సరే చెల్లని పుస్తకాలని

ఎన్నాళ్ళు పంచగలవు మరి

కవులముఠాలు ఎప్పటికీ

కవిత్వాన్ని సృష్టించలేవు

కావలసినన్న అవార్డు లిచ్చుకున్నా

కాలగర్భంలో కలిసిపోతాయి

కవిత్వరహితకవితాసంకలనాలు



నేటికవిత్వం - 1

 

కవిత్వం రాస్తే పేరేమీ రావటంలేదు

పేరున్నోడు రాస్తే కవిత్వం అవుతోంది

ఆకవిత్వం మేటలుమేటలు వేస్తోంది

లోకం శీతకన్ను వేస్తోంది.

20, డిసెంబర్ 2020, ఆదివారం

రారు!

పద్యముల కట్టు వారును
పద్యములను కుట్టు వారును
ఆ కట్టుకుట్ల గొప్ప లెంచు వారును
ఉరక భళీయటంచు యరచు వారును
నావ్రాత లరయ రారు.

కవుల మనువారు
బిరుదులు గలుగు వారు
కవుల సభలందు పాల్గొనగలుగు వారు
కవిముఠాలను నడిపించ గలుగు వారు
విరసులై యుంద్రు
నావ్రాత లరయ రారు

ఎప్పుడో ఎవ్వరో యిటు
తప్పిజారి చదువవత్తురు కాని
బ్లాగ్జాల కవులు గివులు పండితులును రారు
కేవలమును దారితప్పిన కొందరు తప్ప రారు

6, డిసెంబర్ 2019, శుక్రవారం

చచ్చిరి మృగాళ్ళు - మెచ్చిరి జనాలు


నరకాసురులను
అరికట్టేందుకు
మరణమృదంగం మ్రోగినది

చచ్చిరి మృగాళ్ళు
మెచ్చిరి జనాలు
ఇచ్చట న్యాయం జరిగినది

మానవజాతికె
మానవహక్కులు
లేనే లేవవి మృగాళ్ళకు

తెలిసీతెలియని సంఘాల్లారా
బలియైపోయిన బాలిక కూడా
తెలియట్లేదా మనిషేనన్నది దేనికి మీ గడబిడ
పలుకక తమాష చూసా రప్పుడు
తుళువల చావుకు వగచేరిప్పుడు
కలనైనా మీవంకర బుధ్ధులు మారేదే లేదా

ఇదే మంచి శిక్ష సుమా
ఇదే తగిన శిక్ష సుమా
ఇదే - కామపిశాచాల వధే జనహితం

1, డిసెంబర్ 2019, ఆదివారం

ఇదేం దేశం?


ఇదేం దేశం
లేదే భద్రత
లేదే ప్రాణానికి విలువ
వేదం పుట్టిన
ఈ దేశంలో
లేదే ధర్మానికి చోటే

స్తుత్యం స్త్రీత్వం
సత్యం సత్యం
అత్యంత విషాదకరంగా
అత్యాచారం
హత్యాచారం
నిత్యం దేశంలో చూస్తాం

లోపవిషాక్తం
శాపగ్రస్తం
ఈ పావనభారత దేశం
రేపిష్టుల్నీ
పాపాత్ముల్నీ
కాపాడును దేశపు చట్టం

ఈ దేశంలో
ఏ దేవుడికీ
రాదు నివేదనకే లోపం
ఈ దేశంలో
ఏ దేవతకూ
లేదు సుమా గౌరవలోపం

భారతదేశపు
నారీలోకపు
దారుణకష్టం కనుగొనరే
రారే తీర్చగ
గౌరవనీయులు
క్రూరుల్నణచే దేవుళ్ళే

చిక్కున్నారా
ఎక్కిడికక్కడ
మ్రొక్కులనందే రాళ్ళల్లో
దాక్కున్నారా
ఇక్కడి దుష్టుల
ఉక్కడగించ అశక్తులరై


26, మార్చి 2019, మంగళవారం

తెలుగువాడు మోసపోని దినం ఉన్నదా?







తెలుగువాడు మోసపోని దినం ఉన్నదా
మోసం చేయని కేంద్రప్రభుత్వమున్నదా?

మోసపోయినా నోరు మూసుకొనే రకాలనే
మోసగించి మోసగించి మురిసే నాయకులనే
మరలమరల బుధ్ధిలేక మనం ఎన్నకుంటున్నాం
భాధ్యతగా మోసపోయి బాధలే పడుతున్నాం ॥ తెలుగువాడు॥

ఆరుదశాబ్దులపాటు అంతులేని కష్టాలు
అభివృధ్ధిని కాంక్షిస్తే అడుగడుగున నష్టాలు
ఎన్నుకున్న నాయకులు మిన్నకున్న తన్నక
మోసమని మొత్తుకునే మెతకతనం చాలిక ॥తెలుగువాడు॥

కలసి ఉన్నప్పుడే కడగండ్లకు లోటులేదు
ముక్కచెక్కలయ్యాక ముఖంచూచే దెవ్వరు
ఆలనపాలన లేని ఆట్టడుగు ఆంద్రజనం
అంతులేని బాధలతో అఘోరించు దినం దినం ॥తెలుగువాడు॥









గమనిక:  2, మార్చి 2015, సోమవారం, 3:10PM సమయంలో  పై గేయాన్ని  ఒక బ్లాగులో వ్యాఖ్యగా వ్రాసాను. శ్యామలీయం బ్లాగులో ఉంచటం బాగుంటుందని ఇక్కడ కూడా అదే రోజున 3:22PM సమయంలో ప్రచురించాను. ఈరోజు 26/3/19న 7:00PM సమయంలో మరలా  ప్రచురిస్తున్నాను.

21, జనవరి 2019, సోమవారం

రాహిలాకు నివాళిగా



ఉత్తరాయణపుణ్యకాలం పండుగను జనం పతంగులు ఎగురవేసి జరుపుకుంటూ ఉంటే, ఆ పతంగుల మాంజాల పుణ్యమా అని పక్షులు వేలాదిగా చస్తున్నాయి. అప్పుడప్పుడూ ఆ మాంజాలు మనుషుల్నీ బలితీసుకుంటున్నాయి.

అలా ఒక మాంజా మెడకు చుట్టుకొని గుజరాత్‍లో ఒకమ్మాయు రాహిలా ఉస్మాన్ చనిపోయింది.

మరింత విషాదకర విషయం ఏమిటంటే, రాహిలా పక్షిప్రేమికురాలు. పతంగుల బారినుండి పక్షులను రక్షిస్తూ ఉంటుంది!

ఈసారి కూడా గుజరాత్ అటవీశాఖవారు చేపట్టిన పక్షిసంరక్షణలో పాల్గొని మాంజాలలో చిక్కుపడి పడిపోయిన అనేక పక్షులను రాహిలా కాపాడింది.

కార్యక్రమం ముగిసి రాహిలా ఇంటికి వెడుతుండగా దారిలో ఒక మాంజా వచ్చి ఆమెమెడకు చుట్టుకొన్నది. మెడకోసుకొనిపోయి తీవ్రంగా గాయపడిన ఆమెను అస్పత్రిలో చేర్చినా ప్రయోజనం దక్కలేదు!

ఈ వార్తను ఇక్కడ చదివాను నేను. మనసు వికలం ఐనది. రాహిలాకు నివాళిగా కొన్ని పద్యాలు వ్రాస్తున్నాను.


తే. ఉత్తరాయణపుణ్యకాలోచితంబు
గాలిపటముల నెత్తు టాకాశమునకు
అందరకు వినోదాస్పంద బగుటవలన
యెల్లచోటుల సందడి వెల్లివిరియు

తే. ఎవరిపటమును వా రూఱ కెగుర వేయ
చేతులూపుటను వినోద సిధ్ధి కలదె
యొఱుల పటముల పడద్రెంచి యోజమీఱ
ఆకసంబును గెల్చుట యందు కలదు

తే. మంచిదే కాని ఈయూహ మనిషిబుధ్ధి
వెఱ్ఱితలలు వేయుటను జేసి విజయకాంక్ష
గాలిపటముల దారాల గాజుపూత
గరగరలు పుట్టి ప్రాణాంత కంబులాయె

తే. గాలిపటములు తెగవేయ గలుగుటేమి
గాజుపూతల మాంజాల మోజు వలన
పక్షులకు నక్కటా చావు వచ్చుచుండె
మనిషి పండుగ యెంత దుర్మార్గమాయె

కం. అతితెలివి మనిషివేడుక
గతితప్పిన దాని ఫలము కాసింతైనన్
వితరణము చేయు మనిషికి
ప్రతిగా ప్రకృతియును వీని పండుగ వేళన్

తే. పక్షులే కాదు మనుషుల ప్రాణములును
పోవుచున్నవి మాంజాల పుణ్యమునను
ప్రాణహింసకు దిగునట్టి పండుగేల
ఎన్నటికి వచ్చు మనిషి కొక్కింత బుధ్ధి

తే. పక్షిజాతిని రక్షించ ప్రతినబూని
పాడు మాంజాల నుండి కాపాడి తుదకు
పాడు మాంజాకె రాహిలా వసుధ కూలె
నింత కంటెను దుర్వార్త యేమి కలదు


11, జులై 2016, సోమవారం

దేముడు ఎవరో తెలియని ధీమంతుడిని అట.





నిన్న జూలై 10న మాన్యులు శ్రీ లక్కాకుల వెంకట రాజారావు గారు నన్ను ఉద్దేశించి ఒక వ్యాఖ్య రూపంలో ఈ క్రింది పద్యం చెప్పారు.

    నీమమ్మున పల్లె జనులు
    దేముడనుచు మ్రొక్కులిడెడు తీరు తెలిసియున్ ,
    దేముడిలో తప్పు వెదుకు
    ధీమతులకు భాష తీరు తెలుపుము దేవా!

ఈ వ్యాఖ్య నేపథ్యం, రాజారావు గారి చేత రస సిద్ధులు  అనిపించుకొన్న ధన్యజీవి జిలేబీ గారు తమ వరూధినీ బ్లాగులో వ్రాసిన దేవుడు బాబాయ్ టపా. ఈ టపాలో జిలేబీ గారు 'బెత్తం మేష్టారు' అని తమకు సహజమైన వ్యంగ్యధోరణిలో సంబోధించినది నన్నే అన్నది తెలుగుబ్లాగులోకంలో అందరికీ సులభగ్రాహ్యమైన విషయమే.

అదేమి చిత్రమో కాని రాజారావు గారి దృష్టికి రససిధ్ధులుగా కనిపిస్తున్న జిలేబీగారు నా కంటికి మాత్రం ఎందుకనో కాని నిత్యమూ విరససిధ్ధులు గానే కనిపిస్తున్నారు మరి. ఈ రోజున జిలేబీ గారు మా గురువులుంగారు నన్ను బర్తరఫ్ జేసినారు అని ఓ చురక వేసారు నాకు.  కాని ఆ బర్తరఫ్ అవయోగం ఎందుకు తమకు సంప్రాప్తించిందీ అంటే తాము అసభ్యపదజాలంతో కూడిన వ్యాఖ్యను వ్రాయటం కారణంగానే అన్నది మాత్రం జిలేబీ గారు ప్రస్తావించలేదు సుమా. అసభ్యపదాలతో వ్రాయటం కూడా ఒక రససిధ్ధి యోగాభ్యాసవిధానమే అన్న కొత్తసంగతి నాకు నమ్మశక్యం  కాకుండా ఉంది.  నిజమైన ధీమంతులకే ఇలాంటి మహావిషయాలు తెలుస్తాయేమో నాకు తెలియదు.

కొంతకాలంగా గమనిస్తున్నాను. రాజారావు గారు నా విషయంలో కొంత వైమనస్యంతో ఉన్నట్లు కనిపిస్తున్నది. కొన్నికొన్ని సందర్భాల్లో నా మాటలను ఖండిస్తూ తమతమ పద్యవిలాసం చూపారు కూడా. పెద్దలు వారితో విరోధభావం సముచితం కాదని నేను వారి మాటలను మౌనంగా గమనించీ గమనించనట్లే ఉంటున్నాను. కాని ఈ నాడు నాకు కొంచెం హెచ్చు బాధకలిగి సమాధానం వ్రాయవలసి వస్తున్నది. దీని నిడివి కారణంగా ప్రతివ్యాఖ్యగా వ్రాయటం వీలుపడదు కాబట్టి ఒకటపాగా వ్రాస్తున్నాను. దీని అర్థం వారితో విరోధం కోరుతున్నానని కాదు.

    భాషతీరును తెలిసిన వారు మీకు
    దేముడను మాట పుట్టువు తెలియవచ్చు
    దేము నెఱిగిన వారలే ధీమతులన
    నేమి చెప్పుదు దేవునే యెఱుగు దేను

    ఏను పెరిగిన యూళ్ళలో నెన్నడైన
    దేవు డను వారినే గాని దేము డనెడు
    మానవుని చూచి యెఱుగను మాన్యచరిత
    దేముడని మ్రొక్కు వార లేతీరువారొ

    తెలియమిం జేసి కొందరు దేము డనుచు
    వ్రాయు టెఱుగుదు గాని యెవ్వార లేని
    దేముడని పల్కి మ్రొక్కుట తెలియ దయ్య
    నీమ మను మాట నటు లుండనిండు స్వామి

    ఎందు లేనట్టి పదముల కొంద రెఱుక
    చాలమింజేసి వాడెడు చాడ్పు నఱసి
    తెలిసినంతగ తప్పును దిద్ది నంత
    భాష తీఱెఱుగడు నాగ బల్కదగునె

    వ్యావహారిక మను పేర వట్టి గ్రామ్య
    పదములను కూడ వ్రాయుట భావ్య మనుచు
    భావవాదుల మని బల్కువారు మీరు
    భాష యెటులున్న నేమన వచ్చు నింక

    సంప్రదాయమ్ము కలిగిన చక్కనైన
    విద్య సద్విద్య సద్వేద్య పద్యవిద్య
    దాని గౌరవమును దీయ దగదు మనకు
    పద్యముల నైన సుష్టుగా వ్రాయవలయు

    వచనమున గూడ సుష్టువై వరలు భాష
    వాడి నంతట మీదు నవ్యతకు విన్న
    దనము కల్గదు భావముల్ తళుకు చెడవు
    వన్నె గ్రామ్యంబె యందురా వందనములు

    కల్గుచో వైమనస్యంబు కల్గు గాక
    యకట కొద్దిగ శ్యామలీయంబు పైన
    నంత మాత్రంబునకు నేల వింత వింత
    వాదములు నెత్తి పొడుపుల పద్యములును

    పండితుడగాను యెఱిగిన వాడ గాను
    ధీమతుడగాను కొంచెమే తెలిసియుందు
    వినయశీలుడ మీబోటి వారి తోడ
    వాదులాడంగ తగినట్టి వాడ గాను

    ధీమతుడ నని చేసిన దెప్పిపొడుపు
    నా మనంబును కలచిన నాకు బాధ
    కలిగి పలికితి నంతియ కాని యొకరి
    కేమి చెప్పగ తగువాడ నెంతవాడ





10, మార్చి 2015, మంగళవారం

కవి








నిశ్శబ్దంగా వస్తారంతా
నిశ్శబ్దంగా వెళ్తారంతా
కొందరు మధ్యలో గుబాళిస్తారు
కొంద రందులో మన నేస్తాలు

అందరూ లోకాన్ని చూస్తారు
కొందరే లోతుగా చూస్తారు
కొందరు మనకూ చూపిస్తారు
అందుకే వారు మన నేస్తాలు

మౌనంగా చూసేవాడు ముని
మనకు చూపించే వాడు కవి
ముని తనలో తాను జీవిస్తాడు
కవి మన కోసం జీవిస్తాడు

మనం కవిజీవుల్ని పట్టించుకోం
మనం మనసంగతే పట్టించుకోం
జనం ఇంతే అనుకుంటూనే కవి
మనం బాగుండాలని రాస్తాడు

కవి పరితాపాన్ని తెలుసుకోం
కవిని ఋషియని తెలుసుకోం
కవివిలువని మనం తెలుసుకోం
కవిని స్నేహితుడని తెలుసుకోం

కవి శరీరాన్ని కాలం‌ మింగుతుంది
కవిత్వాన్ని జననిర్లక్ష్యం మింగుతుంది
కవిని మరిస్తే ఏం జరుగుతుంది
జాతి భవితనీ కాలం మింగుతుంది







4, మార్చి 2015, బుధవారం

ఏదో ఒకరోజు రాదా, ఏదో ఒక మార్పు రాదా!







ఏదో ఒకరోజు రాదా, ఏదో ఒక మార్పు రాదా!
ఏదారీ లేదనే గోదారే దిక్కనే ఈ దైన్యం తీరిపోదా!

కనువారలు వినువారలు కనబడరని కలగకు,
కనులపొరల మనుషులకు వినయశీలు రలుసులే !
కనబడని దేవతలకు వినబడులే నీఘోష!
మనజనగణ వేదనలు మలగుదినం‌ కలదులే.     ॥ఏదో ఒకరోజు॥

అసలే ఒక శప్తజాతి ఆంధ్రులన్న పేరుందని,
కసిరికసిరి నసిగినసిగి కొసరే రరకొరగ దొరలు!
రుసరుసలా? నువ్విప్పుడు రొక్కిస్తే ఇదేమని!
దసరాపులులే సుమా పసలేని నేతలు!          ॥ ఏదో ఒకరోజు॥

కలకాలం ఉంటాయా కష్టాలూ కన్నీళ్ళూ?
తెలుగువాడి ప్రభ రేపు దేశంలో వెలుగదా?
తలపొగరు నేతలకు తగినశాస్త్రి జరుగదా?
నిలువదా నీ పక్షం నిలింపుల ఔదార్యం!            ॥ఏదో‌ ఒకరోజు॥









24, ఫిబ్రవరి 2015, మంగళవారం

మన టీవీ‌ సీరియళ్ళు



ఏడుపులు మొత్తుకోళ్ళు
అరుపులు పెడబొబ్బలు
మన టీవీ సీరియళ్ళు
చెప్పరానంత కుళ్ళు

మతిలేని కథనాలు
వింతవింత మళుపులు
మన టీవీ సీరియళ్ళు
చెప్పరానంత కుళ్ళు

కుట్రలు కూహకాలు
ఎత్తులు పైయెత్తులు
మన టీవీ సీరియళ్ళు
చెప్పరానంత కుళ్ళు

ఐనా ఈ‌ ఆడవాళ్ళు
వాళ్ళ కింతలేసి కళ్ళు
వాళ్ళే కుళ్ళు సీరియళ్ళు
చూస్తారప్పగించి కళ్ళు

విలన్లంతా ఆడవాళ్ళు
చూస్తే తిరిగేను కళ్ళు
అబ్బబ్బో ఆ విసుళ్ళు
జ్వాలాతోరణాలు ఇళ్ళు

చీకటి పడగానే మగాళ్ళు
చేరుకుంటారు వాకిళ్ళు
టీవీ రణరంగాలా యిళ్ళు
ఐనా కిమ్మనరాదు వాళ్ళు

చూడు డబ్బింగు సీరియళ్ళు
అబ్బో అవి ఇళ్ళా రాజమహళ్ళు
ఆ పట్టుచీరల కష్టాల కావళ్ళు
కళ్ళల్లో మోస్తారు మన ఆడవాళ్ళు

వదలక చూస్తూ  ఆ పటాటోపాలు
అవుతున్నారు కోచ్ పొటాటోలు
దాంతో డబ్బులు మందులపాలు
గట్టిగా అంటే కోపతాపాలు


15, జనవరి 2015, గురువారం

సంక్రాతి గంగిరెద్దుల వాళ్ళని దయతో ఆదరించండి







తే. రంగురంగుల బొంతల గంగిరెద్దు
ముంగిళుల ముందు విన్యాసములను చేయు
పండువిది వచ్చె తోచిన పగిది రూక
లిచ్చి పంపుడీ మనసార మెచ్చి మీరు

తే. చెప్పులైనను నోచరు జీర్ణవస్త్ర
ధారులీ మేళగాండ్రు మీ దయకు పాత్రు
లాదరించుడు మనసార నయ్యలార
అమ్మలార సురవిటపి కొమ్మలార

ఉ. వండిన పిండివంటలను వారికి పెట్టుడు మానుడమ్మ ఆ
యెండిన డొక్కలం గనియొ కించుక బువ్వననుగ్రహించరే
పండువగాదె వారికిని భవ్యమనస్కులు పాతదైననుం
కండువ నయ్యగారి దయగా నిడరే పరమాత్మ మెచ్చగన్

కం. ఈ యేడు వచ్చినారని

పై యేటికి వత్తురనుచు భావింపగ రాద
న్యాయంబుగ నేటేటికి
మాయంబగుచుండి రనెడు మాట దలచుడీ

కం. వీరికి తిండిలేదు మరి వీరల బిడ్డలు పాపలందరున్
నోరు వచింపలేని గతి నుందురు ముద్దకు నోచకుందురున్
వారిని చేరదీయగను వారికి బళ్ళను విద్యనేర్పగన్
కోరవుగా ప్రభుత్వములు కొంచెపువారల పెత్తనంబులన్

కం. అయగారని యమ్మాయని
నయమున ప్రార్థించి మ్రొక్కినారని యైనన్
దయచూపుడు మీరైనను
జయమిచ్చును మీరు చూపు జాలియె మీకున్