26, మార్చి 2019, మంగళవారం

తెలుగువాడు మోసపోని దినం ఉన్నదా?







తెలుగువాడు మోసపోని దినం ఉన్నదా
మోసం చేయని కేంద్రప్రభుత్వమున్నదా?

మోసపోయినా నోరు మూసుకొనే రకాలనే
మోసగించి మోసగించి మురిసే నాయకులనే
మరలమరల బుధ్ధిలేక మనం ఎన్నకుంటున్నాం
భాధ్యతగా మోసపోయి బాధలే పడుతున్నాం ॥ తెలుగువాడు॥

ఆరుదశాబ్దులపాటు అంతులేని కష్టాలు
అభివృధ్ధిని కాంక్షిస్తే అడుగడుగున నష్టాలు
ఎన్నుకున్న నాయకులు మిన్నకున్న తన్నక
మోసమని మొత్తుకునే మెతకతనం చాలిక ॥తెలుగువాడు॥

కలసి ఉన్నప్పుడే కడగండ్లకు లోటులేదు
ముక్కచెక్కలయ్యాక ముఖంచూచే దెవ్వరు
ఆలనపాలన లేని ఆట్టడుగు ఆంద్రజనం
అంతులేని బాధలతో అఘోరించు దినం దినం ॥తెలుగువాడు॥









గమనిక:  2, మార్చి 2015, సోమవారం, 3:10PM సమయంలో  పై గేయాన్ని  ఒక బ్లాగులో వ్యాఖ్యగా వ్రాసాను. శ్యామలీయం బ్లాగులో ఉంచటం బాగుంటుందని ఇక్కడ కూడా అదే రోజున 3:22PM సమయంలో ప్రచురించాను. ఈరోజు 26/3/19న 7:00PM సమయంలో మరలా  ప్రచురిస్తున్నాను.

8 కామెంట్‌లు:


  1. ఆంధ్రులకు కాంగ్రెస్స్ తీరని ద్రోహం చేసింది.అందుకు భారతీయ జనతా పార్టీ,తెలుగుదేశం (వెంకయ్యనాయుడు,చంద్రబాబు నాయుడు )కుమ్మక్కై,తెలుగువారిని కల్లబొల్లి మాటలతో మోసగించారు.ఇంకా రాజకీయనాయకుల్ని నమ్మాలా?అందరూ ఒకటే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ.
      నాకు ఇంకా ఆశ్చర్యం కలిగేది ఏమిటంటే అధికారంలోనికి రాగానే భాజపావారికి కళ్ళు నెత్తికెక్కటం.
      మొన్న వెంకయ్యగారి టివీ‌ఇంటర్వ్యూ చూసారా? ఆయన ప్రతిమాట వెనుకనూ ఎంత అధికారదర్పం!! ఢిల్లీ ఎన్నికల దెబ్బకు వీళ్ళకు కళ్ళు బైర్లు క్రమ్మి ఉంటాయనుకున్నాం‌ కాని అలాంటిదేమీ‌ లేదు. ఈ‌ మోదీ మరొక నహుషుళ్ళాగా ప్రవర్తిస్తున్నాడు. ఎవరో 'సర్పోభవ' అనే రోజు త్వరలోనే వస్తుంది లేండి.

      తొలగించండి
    2. శ్యామలీయం గారు,

      ఇతరులు మోసం చేస్తే మోసపోయేటంత అమయాకులు సీమాంధ్ర తెలుగువారు కాదులేండి. ఎవరేటు పోయినా సంపదా, అధికారం విడవకుండా పట్టుకొని వేలాడటమే లక్ష్యం. కనుకనే తెగేదాక లాగి వేరయ్యారు. దానిని మీద ఎప్పుడు నోరు మెదపరు. ఇప్పుడు కేంద్రం సహాయం చేయటం లేదని ఒకటే పచ్చ మీడీయా గోల. విడిపోయిన తరువాత 9నెలలో ఆంధ్రులలో వచ్చిన మార్పులు ఎమైనా ఉన్నాయా? నమోకి ఆశీర్వచనాలు చేసే బదులు, మీదగ్గర అంత మన్త్ర శక్తి ఉంటే కోస్తా ప్రాంతం అభివృద్ది చెందాలని ఆశీర్వదించవచ్చుకదా!

      తొలగించండి
    3. శ్రీరాం గారూ,

      సీమాంధ్రులు ఎంత అమాయకులు కాకపోతే ఆంధ్రప్రదేశరాష్ట్రావతరణానంతరం వరసపెట్టి ప్రతి ప్రభుత్వమూ తమశక్తియుక్తుల్నీ రాష్ట్రసంపదల్నీ కేవలం హైదరాబాదును అభివృధ్ధిచేయటానికే ముఖ్యంగా వెచ్చిస్తూపోతుంటే, మన రాజధానియే కదా అని ఆనందిస్తూ నోరెత్తకుండా కూర్చున్నారు?

      తెగేదాకా లాగేవారే ఐతే డెబ్బదిమూడులోనే తాడొపేడో తేల్చుకునే వారు. సుబ్బారెడ్డి కృష్ణలో దూకుతా అన్నందుకు దూకవోయ్ ముందు అనే వారు. రేపు మోసం చేయరనే నమ్మకం ఏమిటీ మా ఆంధ్రరాష్ట్రం మాకు పారేయండని హఠం చేసేవారు? అలా యేమీ జరగలేదు కదా? ఇలాంటి పనికిమాలిన పరిణామాలు చూసిచూసి ఇంక తెగేదాకా లాగే క్రోధం‌ కలిగితే అది ధర్మాగ్రహమే అవుతుంది సుమా.

      ఓట్లకోసం ఇచ్చకాలాడి ఇప్పుడు మొడిచేయి చూపితే గుండెమండదా జనానికి? అందరూ పచ్చమీడియాయేనా? మీరే మీడియా పార్టీయో నాకు తెలియదు కాని నేనే మీడియావాడినీ‌కాను సుమా.

      నమోనేదో నిందించానన్నట్లు బాధపడుతున్నట్లున్నారే? ఏ వ్యక్తినీ పేరుపెట్టి నిందించలేదే? ఐనా నమోకు ఎందుకు నిజంగా ఆశీర్వచనాలు చేయాలో చెప్పగలరా? అధికారంలోకి వచ్చినందుకా? అచ్చం తాను ఓడించిన కాంగ్రెసు వాడిలాగానే మెఱమెచ్చుమాటలూ ముష్టివిదుపులుగా ప్రవర్తిస్తున్నందుకా? అది చెప్పండి ముందు.

      నేను ఫలానా ప్రాంతం వాడిగా ముద్రవేసుకుని వీరంగాలేమీ వేయలేదు కొందరు మిత్రులలాగా. కాని మొదటినుండి ఆంధ్రప్రాంతం అనేదానిని ముంచటానికే జరిగిన, జరుగుతున్న యత్నాలను నిరసించాను - అది తప్పు కాదే?

      నా మంత్రశక్తి గురించి ప్రస్తావనదేనికీ? మీ ఛాలెంజ్ దేనికీ? ఇలాంటి వెఱ్ఱిమొఱ్ఱి మాటలకు నేను ప్రతిస్పందనలు చేయాలా? మీకన్నా సుదూరభవిష్యాన్నే చూస్తున్నాను నేను. మొదటినుండి అందుకే అంతా కాలనిర్ణయం అన్న సంగతినీ‌ ప్రస్తావిస్తున్నాను. గమనించండి. చేతనైతే. ఎవరినీ శపించను నేను. ఐనా మీకు తెలుసో తెలియదో, ఎవరి కర్మానుసారి యైన ఫలాలను వారికి అందించే కాలపురుషవాక్యాలే మహాత్ములనోట శాపవాక్యాలలాగా వినిపిస్తాయి - విజ్ఞులు మాత్రం సత్యం గ్రహిస్తారు -అన్యులు మీలా ఆవేశపడతారు. భవభూతి అంటాడు ' లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతే, ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోనుధావతి' అని. అందుచేత ఆశీర్వచనాలూ, మంత్రశక్తులూ, శాపాలు వంటి మాటల్ని వేళాకోళంగా వాడకండి.

      ఈ‌ మాటలు మీకు అర్థమైతే సంతోషం. అర్థం కాకపోతే పెద్దలనడిగి గ్రహించండి. ఇక్కడ చర్చించటానికి యత్నించకండి. ఇది దానికి వేదిక కాదు.

      తొలగించండి
  2. తెలుగువాడంటే ఆంధ్రాలో ఉండేవాడా తెలంగాణాలో ఉండేవాడా? ఇద్దరూనా? ఇద్దరూ అంటే మళ్ళీ కొంతమంది పెద్దమనుషులక్కోపం వచ్చి మా సీమ వేరు మాకో రాష్ట్రం వేరే అన్నారంటే మళ్ళీ పండగే. సర్పోభవ, స-సర్పోభవ, కొండచిలువోభవ, నాగేంద్రోభవ, తాచుపామోభవ. తెలుగువాడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే గతిలేదు; ఇప్పుడు వీళ్ళొచ్చి ఏం చేస్తారండీ మీ అమాయకత్వం కాకపోతే? ఒక్కసారి కాంగ్రెస్ కూలిపోయింది అని చంకలు గుద్దుకున్న జనం రెండు మూడేళ్ళు పోయాక ఏం చేస్తారో చూద్దాం.

    ముందుంది ముసళ్ళ పండగ. సాంబుడు ఎవరో తెల్సినా బావుణ్ణు ముందే వెళ్ళి ఆ ముసలం ఎంత పెద్దదో చూడొచ్చు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డీజీగారూ,

      ఉ. ఈ‌త డమాయకుండు తెలుగింటను పుట్టిన పిచ్చిమొద్దు ఏ
      నేత యొకింత సంతసము నింపెడు మాటలు రెండు పల్కినన్
      జాతికి మేలు చేయునని చక్కగ నమ్మును ఓట్లు గుంజి నీ
      తాతకు చెప్పుకొమ్మనిన తాళగ కేవల మేడ్చుచుండెడిన్

      అంతే నండి.

      తొలగించండి
  3. అవును సార్, చాలా ఆశ్చర్యకరంగా ఉంది వీళ్ళ అధికార దర్పం.
    రాహుల్ గంధీని చూసి వీళ్ళు నేర్చుకున్నదేమిటో మరి. అదే దర్పం.
    అదే అహంకారం. నిజంగా గాని వీళ్ళు సద్వర్తనులైతే బీహార్ విషయంలో
    వీళ్ళ కార్యాచరణ వేరుగా ఉండేది. నిస్సిగ్గుగా ప్రవర్తించి తలవంపుల
    పాలైనా డాంబికం తప్ప ఏ మాత్రపు హుందాతనం లేదు.

    రిప్లయితొలగించండి
  4. ఇదంతా చంద్రబాబు నాయుదు స్వయంకృతాపరాధం.నేను "రాజకీయ ధర్మసందేహాలకు హరిశ్రీ గారి కొంటె సమాధానాలు!' పోస్తులో విశ్లేషించాను.అందులో కొంతభాగం ఇక్కద కూడా వేస్తున్నా.
    --------------
    కల్సి వుండటం వల్ల యెక్కువగా నష్టపోయింది ఆంధ్రా వాళ్లే అనేది నా తిరుగులేని నమ్మకం!హైదరాబాదు మన రాజధాని అనుకుని యెన్ని రేవు పట్నాల్ని మూల పడేసుకున్నాం?ఇవ్వాళ్టికీ దేశాల మధ్యన పెద్దస్థాయిలో జరిగే రవాణా అంతా నౌకల ద్వారానే జరుగుతుందని తెలిస్తే ఈ యాభయ్యేళ్ళలో మనం యెంత రెవెన్యూ పోగొట్టుకున్నామో తెలిస్తే ప్రాణం వుసూరు మంటుంది యే కొంచెం బుర్ర గలవాడి కయినా?మంచో చెడో తన అవసరం కోసమో ఇన్నేళ్ళు దొంగలని అంత భీభత్సం చేసిన వాళ్ళ నాయకుడే ఇవ్వాళ తెలంగాణా పునర్నిర్మాణానికి ఆంధ్రావాళ్ళనే సాయమడుగుతున్నాడు చూడు!ఈ మాట ఆరోజునే చంద్రబాబు యెందుకు నిగ్గదియ్యలేదు?అన్నేళ్ళ ప్రభుత్వంలో వుండి గణాంకాలతో సహా లెక్క ప్రకారం వాదించి "కలిసి వుందటం పట్ల మేము సర్దుకు పోలేక పోతున్నాం,మీ అంత హుషారుగా మేం పరిగెత్తలేము గనక వెనకబడిపోతున్నాం.మాకు నచ్చలేదు,మేం విడిపోతాం.మా బతుకు మేం బతుకుతాం.మా పరుగు మేం పెడతాం. అని యెంత గట్టిగా అడిగినా అడుగు , నీ ఇష్టం - అంతే గానీ ఆంధ్రావాళ్ళు తెలంగాణాని దోచుకోవడం అనే మాట మాత్రం మాట్లాడ వద్దు" అని ధీమాగా గద్దించి మాట్లాడకుండా గోడ మీద పిల్లివాటం రాజకీయం నడిపాడు,యెందుకు?

    ఆ కాలంలో అట్లా మాట్లాడి వుంటే అతనికి చాలా ముందుగానే ఆంధ్రావాళ్ళు మంచి ఫలితాన్ని ఇచ్చేవాళ్ళు!పబ్లిక్ డయాస్ మీద యెలా మాట్లాడితే యే యెఫెక్టు వస్తుందో తెలుసుకుని వ్యూహాత్మకంగా మాట్లాడటంలో ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రితో పోలిస్తే ఇతను దద్దమ్మ కింద లెఖ్ఖ కొస్తాడు!అట్లా గట్టిగా నిలదీసే లక్షణం ఇతని కుంటే తప్పు వొప్పుకుని లెంపలేసుకోవాల్సిన అక్కడి అధమస్థాయి రాజకీయ నాయకుడు ఇవ్వాళ తను చేసిన తప్పు అనే సరిదిద్దుకున్న వుదారుడిగా కూడా వేషం కట్టి విర్రవీగుతున్నాడు?ప్రజలకి జాతి పరమయిన స్వాభిమానం ఒకటి వుంటుందనీ దాన్ని కాపాడటం కూడా ముఖ్యమేనని తెలుసుకోకుండా మళ్ళీ అధికారం సంపాదించడం తన చుట్టూ జనాన్ని తిప్పుకోవడం కోసమే అనే ఆలోచనా విధానంలో వుండటం వల్లనే అతడవన్నీ చెయ్యలేకపోయాడు.
    --------------
    ఆ కాలంలో ఆంధ్రావాళ్ళ పక్షాన మాట్లాడి వుంటే ఇప్పుదు తిరుగులేని ప్రజాభిమానం అతని పక్షాన వుండేది.కేంద్రం నుంచి యేది కావాలన్నా ధీమాగా వచ్చి వుందేది!

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.