6, మార్చి 2019, బుధవారం

సీతారాములు తల్లిదండ్రులని


సీతారాములు తల్లిదండ్రులని చెప్పుకు తిరిగేము
భూతలమంతా మాయిల్లే నని ప్రీతిగ పలికేము

ఆదరించు రఘురాము డుండగ అన్యుల గొడవేల
కోదండరాముడు కోర్కెలు తీర్చ కొఱతలుండు టేడ
వేదవేద్యుని నామముండగ వేరు విద్యలేల
మోదముతో చరింతు మెప్పుడును వేదనలు లేక

శ్రీమహాలక్ష్మి చింతలు తీర్చు సీతమ్మ బిడ్డలము
ప్రేమామృతవారాశి మాయమ్మ రేబవళ్ళు మాకు
గోముగ నిచ్చలు రామభక్తిని కూరిమితో నేర్ప
మే మన్యము లపేక్షచేయక స్వామిని కొలిచేము

రామరామ శ్రీ రఘురామా యని రక్తి మీఱ పాడ
మేము నేర్చితిమి రామచంద్రుడు మిక్కిలి మెచ్చగను
మేము నేర్చినది వినుచు సీతమ్మ మిక్కిలి పొంగగను
రామభక్తిని చాటుచు మేము భూమిని తిరిగేము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.