30, ఆగస్టు 2019, శుక్రవారం

ఏం జరిగింది - 3

అర్ధరాత్రి వేళ స్ప్రింగులా లేచి కూర్చుంది సువర్ణ.

రెండు మూడు సార్లు తట్టిలేపితే భాస్కర్ కళ్ళు నులుముకుంటూ లేచాడు.

అతడు విసుగ్గా ఏమన్నా అనేవాడేమో. కాని ఈలోగానే సువర్ణ "సమ్ ధింగ్ రాంగ్ భాస్కర్" అంది!

భాస్కర్ కొంచెం అలర్ట్ అయ్యాడు. "ఏమిటి?" అన్నాడు తనూ లేచి కూర్చుని.

సువర్ణ నేరుగా పాయింట్ లోనికి వచ్చింది.

"అల్బం కొంచెం బరువుగా ఉంది. అందుచేత శాంతి హేండ్‍బేగ్ బరువుగా అనిపించి, దాన్ని మంచం మీద పెట్టింది"

"ఐతే" అన్నాడు భాస్కర్. అతనికి ఇంకా ఆ మాట వెనుక విషయం అర్థం కాలేనట్లుంది.

"హేండ్‍బేగ్‍ మంచం మీద పెట్టాకే, ఇద్దరమూ నీ కప్‍బోర్డ్ దగ్గరకు వెళ్ళాం"

"ఐతే" అన్నాడు అనుమానంగా భాస్కర్.

"అర్థం కాలేదా భాస్కర్? శాంతి నన్ను ట్రిక్ చేయాలంటే,  నన్ను దాటి వెళ్ళి ఆ హేండ్‍బేగ్‍ అందుకోవాలి."

"ఓ. ఓ" అన్నాడు భాస్కర్.

సువర్ణ స్థిరంగా అంది. "భాస్కర్ ఏదో జరిగింది. అది మన లాజికల్ రీజనింగ్‍కి అందటం లేదు"

భాస్కర్‍ కొంచెం అనునయంగా అన్నాడు. "మనం ఇంకా బాగా అలోచించాలి, ఏదో పాయింట్ మిస్ అవుతున్నాం"

సువర్ణకు ఏడుపు గొంతు వచ్చేసింది. "లేదు భాస్కర్. ఇదంతా నార్మల్ కాదు. అసలు ఈ ఇంటి గురించి వాకబు చేసావా నువ్వు ముందుగా" అని నిలదీసింది.

భాస్కర్ కొంచెం గిల్టీగా ముఖం పెట్టాడు.

సువర్ణ పసిగట్టింది.

"విషయం చెప్పు" అంది ఆగొంతులో కోపం ఎక్కువగా ఉందో భయం ఎక్కువగా ఉందో చెప్పటం కొంచెం కష్టం.

కొంచెం లోగొంతుతో భాస్కర్ చెప్పాడు. "మనకంటే ముందు శాంతి, కుమార్ అని ఇందులో ఉండే వాళ్ళట. వాళ్ళు ఏదో పని మీద బెంగుళూరు వెళ్తే, అక్కడ శాంతి చనిపోయింది హఠాత్తుగా. కొన్నాళ్ళకు కుమార్ వచ్చి సామాను తీసుకొని ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడట."

సువర్ణ కళ్ళు పెద్దవయ్యాయి. "శాంతి చచ్చిపోయిందా!"

భాస్కర్ దోషిలా ముఖం పెట్టి "అవును" అన్నాడు.

సువర్ణ ఏడుపు మొదలు పెట్టింది. "ఆ శాంతి దయ్యమై వచ్చి ఇదంతా చేసింది. మనం రేపే ఈ ఫ్లాట్ ఖాళీ చేసి అన్నయ్యా వాళ్ళింటికి వెళ్ళిపోదాం భాస్కర్" అంది.

భాస్కర్ కసురుకున్నాడు. "పిచ్చిదానిలా మాట్లాడకు. దయ్యాలూ గియ్యాలూ ఏమీ ఉండవు"

"మరిందతా ఏమిటి" అని అరిచింది సువర్ణ హిస్టీరికల్‍గా.

"నాకు తెలియదు. ఆలోచించాలి. దెయ్యాలంటూ ఎక్కడా లేవు. ఎవరో ఏదో చేసారు. తెలుసుకుందాం" అన్నాడు భాస్కర్ మొండిగా.

"నో భాస్కర్. ఆ శాంతి మళ్ళీ వస్తుంది. మనకి చాలా ప్రమాదం. వెంటనే వెళ్ళిపోదాం" అంది.

"చచ్చినామె ఎలా వస్తుంది" విసుక్కున్నాడు భాస్కర్.

"అది దయ్యమైంది కాబట్టి" అంది అందోళనగా సువర్ణ. "భాస్కర్. నీ హేతువాదాలు కట్టిపెట్టు. నేనిక్కడ ఒక్కక్షణం ఉండను కాక ఉండను" అంది అరుస్తున్నట్లుగా.

గబగబా సైడ్ టేబుల్ మీద ఉన్న తన మొబైల్ తీసి యూట్యూబ్‍లో ఆంజనేయ దండకం పెట్టింది.

భాస్కర్ గోడ గడియారం కేసి చూసాడు. రెండున్నర.

"తెల్లవార్లూ ఇలా ఇది ప్లే చేస్తూ ఉంటావా" అన్నాడు కోపంగా.

"యస్" అంది సువర్ణ చాలా ధృఢంగా.

"ఇక నిద్రపోయినట్లే" అన్నాడు భాస్కర్ చిరాకుగా.

సువర్ణ గంయ్ మంది. "టు హెల్ విత్ యువర్ స్లీప్. అది మళ్ళీ ఎక్కడొస్తుందో అని హడిలి చస్తున్నా"

భాస్కర్ పిచ్చిదాన్ని చూసినట్లు చూసి అన్నాడు "ప్లీజ్ సువర్ణా. బీ రేషనల్!"

సువర్ణ మాత్రం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అని మొదలు పెట్టింది ఆ దండకం ఆడియోకు తోడుగా.


(సశేషం)

29, ఆగస్టు 2019, గురువారం

ఏం జరిగింది? - 2

ఇద్దరూ ఒకరి ముఖంలోనికి ఒకరు చూసుకుంటూ అలా ఉండిపోయారు నోట మాటలేకుండా.

మొదట భాస్కర్ ఈ లోకం లోనికి వచ్చాడు.

"సువర్ణా, నువ్వు శాంతి ఆల్బమ్‍ని తీసుకొని వెళ్ళటం నిజంగా చూసావా?" అని ప్రశ్నించాడు.

ఇంకా సువర్ణ షాక్ లోనే ఉంది. ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయింది బొమ్మలా. భాస్కర్ కొంచెం సేపు ఆమెను పరిశీలనగా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు.

కొద్ది సేపటికి ఆమె కూడా పూర్తిగా బాహ్యప్రపంచం లోనికి వచ్చింది. భాస్కర్ మళ్ళా అదే ప్రశ్నని అడిగాడు.

"నిజంగానే శాంతి దాన్ని తీసుకొని వెళ్ళింది" అంది.

భాస్కర్ కొంచెం లాజిక్ తీయటానికి ప్రయత్నించాడు. "నో సువర్ణా. నిజంగా నువ్వు చూసి ఉండవు. ఆమెదగ్గర పెద్ద హేండ్‌బేగ్‌ ఉందన్నావు కదా. ఆమె ఆల్బమ్‍ను దానిలో పెట్టుకొని ఉందని అనుకొని ఉంటావు."

"అనుకోవటం కాదు. నా యెదురుగానే ఆమె దానిని బేగ్‍లో పెట్టుకొంది" అంది సువర్ణ.

"ముందుగా బెడ్‍రూమ్‍ నుండి ఎవరు బయటకు వచ్చారు?"

"ఇంచుమించు ఒకేసారి వచ్చాం బయటకు"

"ఖచ్చితంగా కాదు. నువ్వు ముందు బయటకు వచ్చి ఉంటావు. అమె వేగంగా బేగ్ లోపలినుండి ఆల్బమ్ తీసి అరలో పెట్టి కూల్‍గా నీవెనుకే వచ్చింది. దట్సాల్" అన్నాడు భాస్కర్

సువర్ణ అడ్డంగా తలఊపింది. "లేదండీ. శాంతి నాకన్నా మహా ఐతే రెండు మూడు సెకన్ల వెనుక వచ్చిందేమో బయటకు. సమయం చాలదు మీరన్నట్లు చేయటానికి."

భాస్కర్ ఆలోచనలో పడ్డాడు.

"ఒకపని చేదాం సువర్ణా" అన్నాడు చివరికి.

"ఏమిటి" అంది సువర్ణ.

"నేనే శాంతిని అనుకో." భాస్కర్ తన ఆలోచనను వివరించాడు. "సీన్ మనకు చేతనైనంత బాగా ప్లే చేసి చూదాం. నిజంగా ఎంతసేపు పడుతుందో."

"ఓకే" అంది సువర్ణ.

శాంతి వెళ్ళొస్తాను అనేటప్పుడు చొరవగా బెడ్‍కు ఒక అంచున కూర్చొని ఆల్బమ్ చూస్తూ ఉంది. సువర్ణ కప్ బోర్డ్ దగ్గర ఉంది. సువర్ణ శాంతిని దాటి ముందుకు వస్తున్నప్పుడు శాంతి ఆల్బమ్‍ను సువర్ణ చూస్తుండగానే బేగ్‍లో పెట్టి నిలబడింది. సువర్ణ ముందుగా

గుమ్మం దగ్గరకు వచ్చింది. వెనుకనే శాంతి వచ్చింది సువర్ణ లెక్క ప్రకారం. సువర్ణ ఫ్రిజ్ దగ్గరకు వచ్చి కొంచె ప్రక్కకు తిరిగే సరికి శాంతి బెడ్ రూమ్‍ నుండి బయటకు వస్తూ కనబడింది.

శాంతి స్థానంలో భాస్కర్ ఉండి చేతిలో ఆ ఆల్బమ్ తీసుకొని సీన్ రిప్లే చేసి చూసారు. ఐతే హేండ్ బేగ్‍ బదులు అతడు ఒక ప్లాస్టిక్‍ కవర్‍ వాడాడు. సువర్ణ పనిలో పనిగా సెల్‍లో స్టాప్ వాచ్‍ని పెట్టింది.

మొదట శాంతి నేరుగా బయటకు వచ్చి ఉంటే ఎంత సమయం పట్టెదీ లెక్కించారు. సరిగ్గా ఐదు సెకండ్లు పట్టింది. శాంతి కొంచెం వేగంగా నడిస్తే నాలుగుసెకన్లు పట్టింది మళ్ళా రీప్లే చేసి చూస్తే.

ఈసారి శాంతి ట్రిక్ ప్లేచేసి ఉంటే అన్నది పరీక్షించారు. నాలుగు సార్లు రీప్లే చేసి చూసినా చచ్చుపక్షం పదిహేను సెకన్లు పడుతోంది. అది కూడా కప్‌బోర్దూ సీక్రెట్ అరా అప్పటికే తెరచి ఉన్నాయనుకుంటే. కాదూ అవి మూసి ఉన్నాయనుకుంటే మరొక ఆరేడు సెకన్లు

పడుతున్నది.

అంత సమయం లేదూ, నేను ఫ్రిడ్జి దగ్గరకు వచ్చే సమయానికి ఆమె గుమ్మం బయటకు వస్తూ కనిపించిందని సువర్ణ నిష్కర్షగా చెప్తోంది.

ఇద్దరూ మళ్ళా అయోమయానికి లోనయ్యారు. ఏం జరిగిం దసలు?

మెల్లగా సువర్ణకు అనుమానం బలపడ సాగింది.  "ఇదేదో పేరా నార్మల్‍ ఏక్టివిటీ లాగా అనిపిస్తోంది భాస్కర్" అంది ధైర్యం కూడగట్టుకొని.

భాస్కర్ ముఖం చిట్లించాడు. "నాన్సెన్స్ సువర్ణా. అలాంటిదేం కాదు.  ఎక్కడో నువ్వు బోల్తా పడ్డావు నోడౌట్" అన్నాడు.

"నో నో" అంది గట్టిగా సువర్ణ.

కొంచెం ఆలోచించి భాస్కర్ ఒక కొత్త రీజనింగ్ చెప్పాడు. "సువర్ణా. అసలు శాంతి ఆల్బమ్‍ను బయటకు తీయలేదు. ఒకవేళ తీసినా నీదృష్టిని మరలించి దాన్ని అప్పుడే వెనక్కు పెట్టేసింది. నీ దృష్టి మరలి ఉండగానే హేండ్‍బేగ్‍ లోంచి ఏదో ఆల్బమ్‍ బయటకు తీసి దాన్ని చూస్తున్నట్లు నటించింది."

సువర్ణ ఒప్పుకోలేదు. "ఆమె నాదృష్టిని ఏమీ మరలించలేదు" అని ఖచ్చితంగా చెప్పింది.

కొంచెం ఆగి భాస్కర్  "నా కప్‍బోర్డ్ లోపల కూడా సీక్రెట్ అర ఉంది కదూ" అన్నాడు.

"అవును కాని అది ఖాళీగానే ఉంది" అంది సువర్ణ.

"దేర్‍ యూ ఆర్! దేర్ యూ ఆర్!" అని భాస్కర్ ఎక్సైట్ అయ్యాడు.

శాంతి ఆశ్చర్యంగా చూసింది. "ఐతే ఏమిటి?" అంది.

"శాంతి నా కప్ బోర్డ్ లోపలా సీక్రెట్ అర ఉంది చూపుతాను అనగానే నువ్వు వెళ్ళి నా కప్‍బోర్డ్ తెరిచావు. అవునా" అన్నాడు భాస్కర్

"అవునవును" అంది సువర్ణ.

"నువ్వు ముందుకు నడవగానే శాంతి ఆల్బమ్‍ను వెనక్కు పెట్టేసింది క్షణంలో, కప్‍బోర్డ్ మూసింది" భాస్కర్ తాపీగా అన్నాడు. "నువ్వు రెండో సీక్రెట్ అర చూసి మళ్ళా ఇవతలకు వచ్చావు, శాంతి నీ వెనుకనే ఉంది. నువ్వు చూడకుండా తన హేండ్ బేగ్‍ లోనుండి మరొక ఆల్బం తీసి చేత్తో పట్టుకుంది."

తిరుగులేని లాజిక్!

ఇదంతా చాలా సంభావ్యం అనే అనిపించింది సువర్ణకు. తన చేతిలో ఉన్న ఆల్బమ్ ఫేక్ కాబట్టే శాంతి తనకు ఒక్క ఫోటోను కూడా చూపలేదని అనిపించింది. ఆమాటే పైకి అంది.

"ఎక్జాట్లీ" అన్నాడు భాస్కర్ మెచ్చుకోలుగా.

కాని ఆ శాంతికి ఇదంతా చేయటానికి ఏం అవసరం అన్నది ఇద్దరికీ బోధపడలేదు.

ఆలోచిస్తూ కొంచెం సేపు గడిపారు. చివరికి సువర్ణ అంది "నిద్రొస్తోంది భాస్కర్" అని. అప్పటికే నిద్రవేళ దాటి ఒక అరగంటో కొంచెం పైనో సమయం గడిచింది.


(సశేషం)

27, ఆగస్టు 2019, మంగళవారం

ఏం జరిగింది? - 1

కాలింగ్ బెల్ మోగగానే సువర్ణ ఉలిక్కిపడింది.
ఇంకా భాస్కర్ వచ్చే సమయం కాలేదు మరి.

తాము ఈ యింట్లో దిగి ఆట్టే రోజులు కాలేదు. తమ యింటి కాలింగ్ బెల్ కొట్టే వాళ్ళెవరుంటారు? అందునా ఇది గేటేడ్ కమ్యూనిటీ.  బిస్కట్లమ్మే వాళ్ళూ బూరాలమ్మే వాళ్ళూ ఎవరూ నేరుగా ఇంటి మీద పడి బెల్ కొట్టి పిలవటం వీలు కాదు. ఎవరన్నా,  ఇదివరకు ఈఫ్లాట్‍లో ఉండి వెళ్ళిన వాళ్ళ కోసం తెలియక వచ్చారేమో అనుకోవాలి.

మెల్లగా వెళ్ళి తలుపు తీసేలోగా బెల్ మరొక సారి మోగింది. కొంచెం విసుగు వచ్చినా చిరుకోపాన్ని మనస్సులోనే దాచుకొని నవ్వుముఖంతోనే తలుపుతీసింది.

ఎవరో అమ్మాయి. ఇంచుమించు తనవయస్సే ఉంటుంది. గుమ్మంలో నవ్వుముఖంతో నుంచుంది.

ఎంత దాచుకున్నా తన నిద్రముఖం దాగినట్లు లేదు. ఆ అమ్మాయి కొంచెం మొగమాటంగా చూస్తూ అంది. "సారీ అండీ, మిమ్మల్ని నిద్రలో డిస్టర్బ్ చేసినట్లున్నాను. నా పేరు శాంతి. ఈఫ్లాట్‍లో మొన్నటిదాకా ఉండే వాళ్ళం. చిన్న పనుండి వచ్చాను"

"అలాగా. రండి రండి." అని లోపలికి పిలిచింది.

ఆ అమ్మాయి సోఫాలో కూర్చుంటుండగా "కాఫీ తెస్తానుండండి" అంటూ వంటింట్లోకి వెళ్ళబోయింది.

ఇంతలో టీవీలో ప్రోగ్రాం మారి నట్లుంది. ఏదో సీరియల్ మొదలు. అదీ ఒక పాటతో , పెద్దరొదలాంటి సంగీతంతో మొదలయ్యింది.

నీ మొగుడే నా మొగుడూ
ఏ మంటావే పిల్లా
నీ మొగుడే నా మొగుడూ
ప్రేమకు నిలయం వాడే
ఏమంటావే పిల్లా

ఇద్దరు పెళ్ళాల మొగుడై ఎంకటేసుడూ లేడా
ఇద్దరికీ మురిపాలూ ముద్దులు పంచుతు లేడా
ఇద్దరు పెళ్ళాల మొగుడై ఈశ్వరుడూ లేడా
ఇద్దరికీ మురిపాలూ ముద్దులు పంచుతు లేడా

ఒద్దికగా మనముందామే ఒకడే మనమొగు డైతేనేం
ఒద్దిక ఉంటే సంసారంలో ఉంటుంది పిల్లా హాయి

నీ మొగుడే నా మొగుడూ
ఏమంటావే పిల్లా
ఏమంటావే పిల్లా
నువ్వేమంటావే పిల్లా

సువర్ణకు తిక్కతిక్కగా అనిపించింది. "దిక్కుమాలిన పాట, దిక్కుమాలిన పాట!"  అని తిట్టుకుంది. వచ్చిన అమ్మాయి మాత్రం తన్మయంగా టీవీ చూస్తోంది!

"మీరూ ముద్దుల మొగుడు సీరియల్ చూస్తుంటారా? వండర్‍ఫుల్" అంది.

సువర్ణకు చాలా ఇబ్బందిగా అనిపించింది. "సారీ అండీ. చూడను. సీరియల్స్ ఏవీ చూడను.  కాలక్షేపానికి టివీ పెడితే అన్ని చోట్లా ఏవేవో బోర్ ప్రోగ్రాంలే వస్తున్నాయి. ఏదో సినిమా వస్తుంటే కాసేపు చూసి విసుగొచ్చి జోగుతుంటే మీరొచ్చి రక్షించారు. ఆ సినిమా ఐపోయి సీరియల్ మొదలైనట్లుంది" అంది.

వచ్చిన అమ్మాయి అదేం పట్టించుకోకుండా "ఈ ఇల్లు వదిలేదాకా రోజూ మూడింటికి ఈ సీరియల్ ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూసానండీ. ఇప్పుడు కుదరటం లేదు కాని" అంది.

సువర్ణకు ఆశ్చర్యం కలుగలేదు. తన తల్లీ అంతే, పెద్దక్కా అంతే. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళింట్లో టివీని కబ్జా చేసి ఐనా సరే వాళ్ళ కిష్టమైన సీరియల్స్ చూస్తారు.  తానైతే టివీ చూడటమే తక్కువ.  అందుకే "నేను పెద్దగా టివీ ప్రోగ్రాంలు చూడనండీ." అంది.

శాంతి ఆ మాటలు విన్నదో లేదో కాని సీరియల్ చూడ్డంలో ములిగిపోయింది.

సువర్ణ  కాఫీ చేసి తీసుకొని వచ్చింది.

శాంతి సీరియల్ మీదనుండి దృష్టి మరల్చకుండానే కాఫీ తాగింది. ఆ తరువాత, "చాలా బాగుందండీ కాఫీ" అని మెచ్చుకుంది.

ఆమె ఎందుకు వచ్చిందో తెలియదు. ఎంతసేపుంటుందో తెలియదు. సువర్ణ కూడా ఆవిషయం గురించి ప్రస్తావించటానికి మెగమోట పడి ఊరుకుంది.

ఇంతలో భాస్కర్ దగ్గరనుండి ఫోన్.

ఆ అమ్మాయి టీవీ చూస్తోంది కదా. కొంచెం దూరంగా వెళ్ళి మాట్లాడింది. ఇదే కాంప్లెక్సులో తమ దూరపు బంధువు లెవరో ఉన్నారట. ఆ అబ్బాయీ భాస్కర్‍తో పాటే పనిచేస్తున్నాడట. చెప్పటానికి పనికట్టుకొని ఫోన్ చేసాడు. భాస్కర్ ఫోన్ చేస్తే ఒక పట్టాన వదలడు.

ఫోన్ కాల్ ముగించి చూస్తే శాంతి టీవీ ముందు సోఫాలో లేదు.

అయోమయంగా అటూ ఇటూ చూస్తుంటే తమ బెడ్ రూమ్ నుండి బయటకు వచ్చింది శాంతి. ఇల్లంతా తిరిగి చూస్తోందన్న మాట. చాలా ఇబ్బందిగా అనిపించింది ఆమె తమ బెడ్ రూమ్ నుండి రావటం చూసి.

"మీ యిల్లు చాలా నైస్‍గా సద్దుకున్నారండీ. చాలా బాగుంది" అంది.

"థేంక్స్" అంది మరే మనాలో తోచక.

"ఇంత నీట్‍గా సద్దటం అంటే నావల్ల కాదు. కుమార్‍కి నీట్‍నెస్ పిచ్చి పాపం. ఈవిషయంలో చాలా గోల పెట్టేవాడు" అంది శాంతి.

ఆ అమ్మాయి చాల చొరవగా ఉంటుందని అర్థమై పోయింది. వచ్చింది ఎందుకో చెప్పలేదు కాని, ఒక గంటసేపు సువర్ణని కబుర్లతో ముంచెత్తింది. ఆశ్చర్యం ఏమిటంటే సువర్ణ కూడా మెల్లగా ఆమె ధోరణిలోకి వచ్చేసి కబుర్లు చెబుతూ ఉండిపోయింది ఆ గంట సేపూ.

హఠాత్తుగా ఆ అమ్మాయి వాచీ చూసుకుంటూ "చీకటి పడొస్తున్నదండీ వెళ్ళొస్తాను." అని, కొంచెంగా తటపటాయిస్తూ "మా మేరేజీ ఆల్బం ఒకటి కనబడ లేదు. ఒకవేళ ఇక్కడ మర్చిపోయానేమో అని వెదకటానికి వచ్చాను నిజానికి" అంది.

"ఇక్కడా?" అని సువర్ణ ఆశ్చర్యపోయింది.

"లాస్ట్ మార్చిలో మా ఆడపడుచూ వాళ్ళంతా వస్తే అది బయటకు తీసినట్లు గుర్తు."

"ఇక్కడెలా ఉంటుందీ, మాకు అంతా క్లీన్ చేసి ఇచ్చారు కదా ఫ్లాట్‍ని" అంది సువర్ణ.

శాంతి బెడ్ రూమ్ లోపలికి దారి తీసింది.

చేసేది లేక సువర్ణ కూడా యాంత్రికంగా ఆమె వెనుకే వెళ్ళింది.

బెడ్ రూమ్ లోపల కప్ బోర్డ్స్ వాల్ మౌంట్ చేసి ఉన్నాయి ఒక వైపు గోడంతా.

శాంతి కొంచెం మొగమాటంగా "ఇది తెరవచ్చా" అంది.

"తెరవచ్చును. కాని అందులో నా బట్టలు సద్దుకున్నాను ఇప్పటికే. అప్పుడు నాకేమీ కనిపించలేదే" అంది సువర్ణ.

"ఇందులో ఒక సీక్రెట్ అర ఉందండీ" అంటూ శాంతి కప్ బోర్డ్ తెరిచి ఆ అరను చూపి తెరిచింది.

సువర్ణ నోరు తెరిచింది.

అందులో భద్రంగా ఉంది ఆల్బం. అది తప్ప అక్కడ మరే వస్తువులూ లేవు.

అది తీసుకొని శాంతి వెళ్ళిపోయింది. కనీసం సువర్ణకు ఒక్కఫోటో ఐనా మర్యాదకు కూడా చూపించ లేదు. "అయ్యో లేటైపోయిందండీ. వెళ్ళొస్తాను" అంటూ బయలుదేరింది.

ఆమె వెళ్ళాక అరెరే ఒక జాకెట్ గుడ్ద ఐనా పెట్టి పంపాను కాదే అని అనుకుంది సువర్ణ. బుక్ షెల్ఫ్ నుండి ఒక యోగి ఆత్మకథ పుస్తకం తీసి బుక్‍మార్క్ దగ్గర నుండి చదవటం మొదలు పెట్టింది.

ఎంతసేపు గడిచిందో ఏమో కాని భాస్కర్‍ వచ్చి కాలింగ్‍బెల్ మోగించగానే మళ్ళా ఈలోకం లోనికి వచ్చింది.

రాత్రి భోజనాల సమయంలో భాస్కర్‍తో శాంతి వచ్చి వెళ్ళిన విషయం ప్రస్తావించింది. అన్నట్లు మన కప్‌బోర్డులో ఒక సీక్రెట్ అర ఉంది తెలుసునా అని శాంతి ఆ అరను తెరిచి ఆల్బం తీసుకొని వెళ్ళిన సంగతి చెప్పింది.

అవునా అని భాస్కర్‍ ఆశ్చర్యపోయాడు.

ఆ శాంతి నా కళ్ళముందే ఆల్బమ్‍ భద్రంగా ఉందా అని ఫోటోలు కొంచెం చెక్ చేసుకొని మరీ పట్టుకెళ్ళింది. కాని మాటవరసక్కూడా నాకు చూపిస్తానన లేదు అని వింతపడుతూ చెప్పింది.

కర్టెసీ కైనా ఆ అమ్మాయి తమ మారేజీ ఆల్బమ్‍ సువర్ణకు చూప లేదని విని మరింత ఆశ్చర్యపోయాడు.

రాత్రి పడుకొనే ముందు, భాస్కర్ ఆ సీక్రెట్ అర ఎక్కడుందో చూపించమని అడిగాడు. సువర్ణ తన చీరల అరలో చీరలను ప్రక్కకు జరిపి ఆ అరను చూపించి తెరచింది.

అక్కడే భద్రంగా ఉంది ఆ ఫోటో ఆల్బమ్!

ఇద్దరూ ఒకరి ముఖంలోనికి ఒకరు చూసుకుంటూ అలా ఉండిపోయారు నోట మాటలేకుండా.


(సశేషం)

తెలిసినదా రాముడే దేవుడన్నది


తెలిసినదా రాముడే దేవుడన్నది నీ
వల పెఱుగక పిలిచితే పలుకునన్నది

ఇన్నాళ్ళును పెద్దలు చెవి నిలు కట్టుకొని పోరి
వెన్నుడే దేవుడన్న విన నిచ్చగించవు
కన్ను మసకబారి నీ వెన్ను వంగ వచ్చి
యిన్నాళ్ళకు రామునిపై నెంతభక్తి పొడమెను

పామరుడే యైన నేమి పాపియైన నేమని
రామచంద్రు డందరను రక్షించు నెప్పుడు
వేమారులు నిన్ను వాడు విడువక రక్షించ
నీ మనసున కది తోచె నేటి కేమందుము

చెంత జేరి నంత వాడు చేరదీయు నన్నది
చింతలన్ని దీరిచి రక్షించు వా డన్నది
చింతించు వారి కతడు చింతామణి యన్నది
యింతకాలమున కైన నెంత బాగ తోచెను

25, ఆగస్టు 2019, ఆదివారం

నోటిగూటి చిలుక ధాటిగ పలుకవే


నోటిగూటి చిలుక ధాటిగ పలుకవే
మాటిమాటికి రామమంత్రము నీవు

కామక్రోధాదులు కలబోసి పలుకుచు
తామసబుధ్ధులై ధరనుండు నట్టి
పామరులకు నీవు ప్రతివచనము లిచ్చి
రాముని నామము నేమర బోకే

సారవిహీనమీ సంసార మనియెంచి
నారాయణుని యందు నాటించి బుధ్ధి
శ్రీరామనామము చేయుచుండెడి వారి
చేరి కలిసిమెలసి చేయవె భజన

శ్రీరాము డొక్కడే చిక్కుల నడగించు
శ్రీరామచింతనమె చేయవే నీవు
శ్రీరామ జపమున చిత్తశాంతి కలుగు
శ్రీరామజపమునె చేయవే నీవు

23, ఆగస్టు 2019, శుక్రవారం

ఎన్న నందును వింత లెన్నెన్నో


ఎన్న నందును వింత లెన్నెన్నో చేసెను
మొన్న రాముడై వాడు నిన్న కృష్ణుడై

వేయిమంది మోయలేని వింటినెత్తి విరిచెను
ఓయమ్మా కొండనే ఒయ్యన పైకెత్తెను
చేయలేని దేమున్నది శ్రీలోలునకు
మోయు గదా లోకములే మోహనాంగుడు

తాకి యొక రాతిని ముని తరుణిగా చేసెను
తాకి యొక కుబ్జను లలితాంగిగా చేసెను
శ్రీకాంతుడు చేయ లేని చిత్రమున్నదా
లోకములే చేయు గదా లోలాక్షుడు

తరుణిశోకపు మిషను సురారుల నణచెను
తరుణిశోకపు మిషను కురుకుల మణచెను
హరితలచిన ధర్మేతరు లణగిపోరే
నిరుపమాన క్రీడనుడీ నీలవర్ణుడు

నారాయణుడే నాటి శ్రీరాముడు


నారాయణుడే నాటి శ్రీరాముడు
నారాయణుడే నేటి నందబాలుడు

కడలి మీద వారధిని కట్టినట్టి వాడైన
కడలి లోన పురమునే కట్టుకొన్న వాడైన
పుడమి నున్న దుర్జనుల పొడవడగించ
పొడమిన నారాయణ మూర్తియే వాడు

ఒక్కపొలతి చాలునని యూరకున్న వాడైన
పెక్కురౌ సతులతో వేగనేర్చు వాడైన
మక్కువతో ధర్మమును మనకు నేర్పగ
చక్కని నేర్పుగల శౌరియే వాడు

హరేరామ హరేరామ యన్నచో తరింతురు
హరేకృష్ణ హరేకృష్ణ యన్నను తరింతురు
నరులార వాని నెపుడు మరువకుండుడి
మరువక చేరదీయు మంచివా డతడు

       *అందరికీ 2019సం. జన్మాష్టమి శుభాకాంక్షలు*

దొఱకునో దొఱకదో మరల నరజన్మము


దొఱకునో దొఱకదో మరల నరజన్మము
దొఱకినను దొఱకునా హరిచరణ స్మరణము

కల్లగురువుల బోధ లెల్ల గడచి వచ్చి
చల్లగ నుంటి నీ చరణములు చేరి
యెల్లి యే గురుబోధ లేరీతి మలచునో
నల్లనయ్య యింక నాకు నీవే దిక్కు

కపట భక్తుల తోడ కలసి నడచి విసివి
అపరాధ మెఱిగి నిన్నాశ్రయించితిని
విపరీతబుధ్ధులే వెండి తలలెత్తునో
నృపశేఖర రామ నాకు నీవే దిక్కు

ఎన్ని జన్మము లెత్తి యిటు నిన్ను బడసితి
అన్నన్న నాకు నీవున్న నిశ్చింత
ఎన్నటికి నీవాడ నగునట్లు బ్రోవవే
నన్నేలు రాముడా నాకు నీవే దిక్కు

19, ఆగస్టు 2019, సోమవారం

వలదు పాపము వలదు పుణ్యము


వలదు పాపము వలదు పుణ్యము
వలయును నీసేవా భాగ్యము

పుట్టువులకు కారణమౌ పుణ్యపాపంబులు
పట్టుకొనగ నేల నయ్య భగవంతుడా
గట్టిగాను నీపాద కమలంబులను నేను
పట్టుకొంటి నీసేవ ప్రసాదించుమా

నేను చేయు వాడ నని లోనెంచి చేసిన
దేని ఫలితమైన నేను తినక తీరదు
మాన కొనగ నట్టితిండి మంచిదౌ నుపాయము
పూని కర్తృత్వ ముందు బుధ్ధి విడచుటే

రామసేవకులకు పుణ్యరాశితో పనిలేదు
స్వామి నా దరిచేరదు పాపమెన్నడు
కామితార్థ మిమ్ము శ్రీకామినీమనోహర
నీమ మెసగ చేయనీ నీకు సేవలు

కోవెలలో నున్నాడు కోదండరాముడు


కోవెలలో నున్నాడు కోదండరాముడు
దేవేరి సీతతో దివ్యతేజంబుతో

నరుల కొఱకు నరుడైన నారాయణుడు
కరము దుష్కరంబైన కార్యము సేసి
మరల నిదే కొలువాయె మనగుడి లోన
కరుణామయమూర్తి కదా యీతడు

సర్వాభరణములతో స్వామియున్నాడు
సర్వాయుధములతో స్వామియున్నాడు
సర్వదేవతలగూడి స్వామియున్నాడు
సర్వజగద్రక్షకుడై స్వామియున్నాడు

సౌమిత్రి యొకప్రక్కన చక్కగ నిలువ
సామీరి పాదాంబుజంబులు కొలువ
పామరుల నుధ్ధరింప వచ్చినా డిదె
స్వామి సేవ చేసి కొన చయ్యన రండు

సాగించరే రామచంద్రుని భజన


సాగించరే రామచంద్రుని భజన
మ్రోగించుచు తాళములను మిన్నంట

రామ రామ సాకేత రామ రఘురామ
రామరామ జానకీరామ జయరామ
రామరామ కోదండరామ రణభీమ
రామరామ హరేరామ రామ యని మీరు

రామ పట్టాభిరామ రాజీవలోచన
రామ లోకాభిరామ రామ భక్తపోషక
రామ సద్గుణధామ రామ తారకనామ
రామ జలధరశ్యామ రక్షించు మని మీరు

పాహి  పాహి నిర్మూలితపౌలస్త్య రామ
పాహి పాహి సకలలోకపాలక రామ
పాహి పాహి పాపతూలవాతూల రామ
పాహి పాహి పాహి యని పాడుచు మీరు

నమ్ముడు మానుడు నావాడు


నమ్ముడు మానుడు నావాడు నేను
నమ్మి కొలుచుకొను నా రాముడు

కన్నులు తెరచిన కనబడు రాముడు
కన్నులు మూసిన కనబడు రాముడు
వెన్నంటి యున్నాడు విడువక రాముడు
నన్ను కాపాడుచు నా రాముడు

కన్నుల నిదురను కబళించు రాముడు
పన్నుగ నాతోడ పలుకాడు రాముడు
నన్నన్ని వేళల నడిపించు రాముడు
నన్నేలు దొరయైన నా రాముడు

ఎన్నో జన్మల నుండి యేలుచు రాముడు
చిన్న నాడె నన్ను చేపట్టె రాముడు
మన్నించి నాలోన మసలును రాముడు
నన్ను కరుణించు నా రాముడు

18, ఆగస్టు 2019, ఆదివారం

అంగనామణి సీత యడిగి నంతనే


అంగనామణి సీత యడిగి నంతనే
రంగు రంగుల పూలు తెచ్చె రామచంద్రుడు

కొన్ని కొన్ని పూవులకై కోమలాంగుడు నాగు
లున్నట్టి పూల పొదల నెన్నొ కదిపెను
కొన్నింటిని లక్ష్మణుండు కోయుచుండగ
సన్నుతాంగు డవియివి యని సందడి సేసె

పూల రాశి గాంచి యుప్పొంగి సీతమ్మ చాల
మాలికల నల్లినది మగడు మురియగ
చాల మాలికల నిచ్చి బాలికామణి పర్ణ
శాలలోని దైవతముల చక్కగ కొలిచె

దేవుళ్ళను కొలిచి తల్లి తెచ్చి మాలలు మూడు
శ్రీవారి గళసీమకు చేర్చె నొక్కటి
ఆ వెనుకను మరది కొకటి దీవించి యిడ రామ
గోవిందుడు కైసేసె కువలయసుతకు

నులివెచ్చని కాంతిరేఖ పలుకరించగానే


నులివెచ్చని కాంతిరేఖ పలుకరించగానే
పులకించి యొక మొగ్గ పూవైనది

పూవై నలుగడల కాంతి పుంజముల మధ్యన
నీవు దిద్దిన యందాలు నిండిన ప్రకృతిని
పావనప్రత్యూషవేళ పరవశించి చూచి
తావులతో నెంతో సంభావించి మురిసినది

ఇంత యందమైన సృష్టి నెవరు చేసిరన్నది
సుంత ధ్యానించి యెఱిగి సంతోషపడినది
అంతరాత్మలోన నీ యనుగ్రహ మడిగినది
ఎంతో వేడుకొన్నది నీ చెంత చేరంగను

వింతగ కాంతారవాసవిధిని రాముడవై
యంతలోనె పరమాత్మ యరుదెంచినావు
చెంతనున్న సీతమ్మ చేయిజాపి చూప
చింతదీర్చి పూబాలను చేరదీసినావు

పతితపావననామ పట్టాభిరామ


పతితపావననామ పట్టాభిరామ
సతతము నన్నేలు జానకీరామ

మనసున నీనామ స్మరణము కలుగ
కనుదమ్ములు వికసనమును బొందు
ఘనమగు భాగ్యము కలిగెడు గాక
దినదినమును నీ ఘనకృప వలన

అలసిన నాకనుకొలకుల నిదుర
పలుకరించెడు వేళ భావన ముందు
నిలచి యుండు గాక నీ నామ స్మరణ
కలకాలమును నీ ఘనకృప వలన

మరువక నీనామ స్మరణము కలిగి
తరచుగా నీసేవా ధనమది కలిగి
తరియించెడు గాక తప్పక జన్మము
కరుణామయ నీ ఘనకృప వలన

17, ఆగస్టు 2019, శనివారం

తెలియుడీ వీనిని తెల్లంబుగను


తెలియుడీ వీనిని తెల్లంబుగను
తెలివిడి కలిగితే కలుగు మోక్షము

పరగ వీడు మొట్టమొదట వైకుంఠరాముడు
కరుణతో నాయెను కాకుత్స్దరాముడు
అరయగ నతడెంతో అందాలరాముడు
మారాముడు చాల మంచివాడు

ఘనతరమౌ విల్లువిరచె కళ్యాణరాముడు
మానవోత్తముడైన జానకీరాముడు
మౌనిచంద్రులకు వా డానందరాముడు
ధ్యానించు డాతడు ధర్మాత్ముడు

కోలల రావణుని జంపె కోదండరాముడు
చాల గొప్ప రాజగు సాకేతరాముడు
కూలుచు భవబంధము గోవిందరాముడు
కాలాత్మకుడైన కమలాక్షుడు

అతి సులభుని నిన్ను బడసి


అతి సులభుని నిన్ను బడసి యవివేకినై
యితరుల నే వేడెదనా యెంతమాట

నిచ్చలు నా మేలు దలచు నీవు నా కుండగ
పిచ్చివాడనా యొరుల వేడుట కేను
ముచ్చటగా రామచంద్రమూర్తి నిన్నువేడుదు
నచ్చమైన నా మనసు నంకిత మొనరించి

నిరతము వెన్నంటి యున్న నిన్ను నేను మరచి
పరుల నేరీతిపొగడు వాడ నౌదును
పరాత్పర రామచంద్ర వదలక నిను పొగడుదు
నిరంతరము నా మనసు నీపైన నిలిపి

ఇచట నచట నన్ను గూడి ఈశ్వర నీవుండ
ఇచటనే నన్నెఱుగని యెవరి జేరుదు
ఎచటనైన రామచంద్ర యెన్నెదను నిన్నే
విచిత్రమైన ప్రశ్నలిక వేయకుండుమా

రాలుగాయి మనసా నీకు రాము డింత యలుసా


రాలుగాయి మనసా నీకు రాము డింత యలుసా
చాలు చాలు వేషాలు నామజప సాధన చేయగదే

ఎన్నో భవముల నుండియు నీకై యీతడు చేసినదే
యెన్నగదే యాపన్నశరణ్యుం డీశ్వరు నెన్నగదే
తిన్నగ మోక్షము నిచ్చెడు రాముని దీవన లందగదే
మన్ననతో నతడిచ్చిన తారకమంత్రము చేయగదే

ఉదయము  నుండియు నటునిటు పరుగుల నుండితి వెందులకే
నిదుర లేచినది మొదలుగ నీకొక నిలుకడ కనబడదే
హృదయము లోపల గూడుకట్టుకొని యుండిన నీవిభునే
మదిని దలంచవు మన్నన చేయవు మంచిది కాదు సుమా

ఈ నరజన్మము దుర్లభ మందున యీశ్వర క్పవవలన
జ్ఞానము కలిగెను దానిని మరచుచు సంచరించ వలదే
మానక నామజపంబున నుండిన మంచి జరుగు మనసా
ఆనక నా వైకుంఠపురంబున హరికడ నుండెదవే

16, ఆగస్టు 2019, శుక్రవారం

రామ రామ శ్రీరామ యందువు




రామ రామ శ్రీరామ యందు వీ ప్రశ్నకు బదులు చెప్పవయా
స్వామి పట్ల నీ భక్తి యెట్టిదో చక్కగ మా కెఱిగించవయా

పరమమనోహరు డగు రాముని రూపంబు నెడదలో నిలిపితివా
పరమాప్తుండను భావనతో రఘుపతిని త్రిశుధ్ధిగ నమ్మితివా
పరమాదరమున రామచంద్రుని  భక్తుల నెప్పుడు కొలచితెవా
పరమానందము రామసేవ యను భావము కలిగి మెలగితివా

దురదల వలె కోరికలు రేగినను తొలగక సాధన చేసితివా
వరదల వలె కష్టములు కల్గినను వదలక సాధన చేసితివా
సిరులు కలిగినను సిరులు తొలగినను చెదరక సాధన చేసితివా
పరమార్ధము శ్రీరామ నామమను భావన విడువక నిలచితివా

శివు డిచ్చిన శ్రీరామ నామమును చిత్తము నందు ధరించితివా
భవతారక మని రామ నామమును వదలక సాధన చేసితివా
అవిరామముగా సాధన చేసిన నది తప్పక ఫలియించును గా
అవలకు నివలకు తిరుగుట మానెద వందుకు సందేహము లేదు




10, ఆగస్టు 2019, శనివారం

బాధ లెందుకు కలుగుచున్నవో


బాధ లెందుకు కలుగుచున్నవో బోధపడుట లేదు
బోధ కలిగెనా ఎవ్వనికైనా బాధలు కలుగవయా

రామనామ ధనముండగ నయ్యో రాళ్ళురప్ప లేరి
పామరత్వమున పోగులు పెట్టుచు పరవశించ నేల
ఈమహి నెవ్వరి వెంటనైన నివి యెన్నడేగె నయ్యా
యీమాత్రము నీ వెఱుగ కున్నచో నెందుకు నరజన్మ

ఎవరెవరో నీ బంధుమిత్రులని యెంతో ప్రేముడితో
అవనిని వారికి సుఖమును గూర్చగ నలమటింతు వయ్యో
ఎవరి కెవ్వరీ మహిని జీవుడా యెంత కాల మయ్యా
చివరకు నీకు మిత్రుడు చుట్టము సీతాపతి కాదా

బావించుచు శ్రీరామతత్త్వము పాడుచు నీవుండ
నీ వెందున్నను నీ వెటులున్నను నీతో నత డుండ
దేవుడె దిక్కని నమ్మిన నీకిక దీనత యెక్కడిది
ధీవరుడా నీ స్వస్వరూపమున దీపింతువు కాదా


9, ఆగస్టు 2019, శుక్రవారం

సుగుణాభిరాముడు సుందరాకారుడు


సుగుణాభిరాముడు సుందరాకారుడు
జగదేకవీరుడు సర్వేశ్వరుడు

క్షీరోదధిశయనుడు కారణాతీతుడు
ఘోరాసురమర్దనుడు గోవిందుడు
శ్రీరమణీరమణుడు నీరేజనాభుడు
నారాయణుడు దివిజనాథశరణ్యుడు

రవివంశవర్ధనుడు భువనమోహనుడు
సవనసంరక్షకుడు శాంతాత్ముడు
శివదనుర్విదళునుడు సీతాసనాథుడు
స్తవనీయవిక్రముడు జామదగ్నినుతుడు

నీలమేఘశ్యాముడు కాలస్వరూపుడు
కీలాలధిబంధనుడు కేవలుండు
పౌలస్త్యనాశనుడు భావనాతీతుడు
పాలితాఖిలభువనజాలుడీ రాముడు

హరిని విడచి యుండదుగా అమ్మ


హరిని విడచి యుండదుగా అమ్మ వరలక్ష్మి
హరితోడ ధరపైన నవతరించును

హరి నరసింహుడై యవతరించంగను
వరలక్ష్మి చెంచెతగ వచ్చె భూమికి
విరిచి కనకకశిపుని వీడకుగ్రత
చరియించు హరిని ప్రసన్నుని జేసె

వరబలగర్వితుడు రావణుని చంపగ
పరమాత్ముడు రాముడై వచ్చినంత
వరలక్ష్మి సీతయై వచ్చె భూమికి
తరుణి కష్టము లోర్చి ధరనేలెను

ధరాభార ముడుపగా దానవాంతకుడు
పరమాత్ముడు కృష్ణుడై వచ్చినంత
వరలక్ష్మి రుక్మిణిగ వచ్చె భూమికి
హరిభక్తి వైభవము ధరపై చాటె

7, ఆగస్టు 2019, బుధవారం

ఇంతకన్న సిగ్గుచే టేమున్న దయ్య


ఇంతకన్న సిగ్గుచే టేమున్న దయ్య
అంతరించి బుధ్ధి నే నధముడ నైతి

అమ్మకడుపు లోన నే నణగి యుండి నట్టి వేళ
నుమ్మలికములైన వేళ నొక్క నీదు తలపె నాకు
నెమ్మది సమకూర్చ ని న్నెప్పటికిని మరువ నంటి
నెమ్మది నెమ్మదిగ నేను నిన్ను మరచిపోయితిని

నేనపుడే ధనములను నిక్కముగ ముట్ట నంటి
నేనపుడే దుర్మతులను నిక్కముగ చేర నంటి
నేనపుడీ నాలుకను నిగ్రహించి యుందు నంటి
నేనిపుడా తప్పులన్ని నిస్సిగ్గుగ చేయుచుంటి

పుట్టక ముందున్న బుధ్ధి పుట్టగనె మాయమాయె
గట్టిగ నీ నామమైన కడు శ్రధ్ధను చేయనాయె
నిట్టి నా మీద మరల నెట్టుల దయచూపెదవో
పట్టుబట్టి యీదీనుని బాగుచేయ వయ్య రామ

4, ఆగస్టు 2019, ఆదివారం

చేరి మ్రొక్కరె వీడు చిత్తజగురుడు


చేరి మ్రొక్కరె వీడు చిత్తజగురుడు
శ్రీరాముడై మనకు చేరువైనాడు

నీతులు చెప్పలేదు నీతిగా నడచి
ప్రీతిపాత్రుడైనాడు భూతకోటికి
త్రేతాయుగంబున భూతలంబున
సీతాపతి యనుపేర చెలగె ధర్మము

పోరున రాకాసుల పొడిపొడి చేసె
ధారుణిపై నిలపెను ధర్మరాజ్యము
తారక లుండుదాక తరగని గొప్ప
పేరు స్వంతమైనట్టి వీరుడు వాడు

రామనామ మెంతో రమ్యమంత్రము
రామకథయె మిక్కిలి రసవంతము
రామభజన మోక్షసామ్రాజ్యప్రదము
రామచంద్రుడు దైవ  రాయడు కాన

2, ఆగస్టు 2019, శుక్రవారం

నరుడ వైనప్పు డో నారాయణా


నరుడ వైనప్పు డో నారాయణా యీ
గరుడునకు నీ సేవ కలిగించుమా

వెస శేషున కిచ్చితివి వేషము తమ్మునిగ
అసమర్ధుడు గరుడుడని యనుకొంటివా
రసవంతమైన నీదు రామచరితామృతమున
నసలే నా యూసు లేదందువా ప్రభూ

తమ్ములగుచు శంఖుచక్రమ్ములును వచ్చునని
అమ్మ శ్రీలక్ష్మి సీత యగునందువా
తమ్మికంటి సామి నేను తప్పేమి చేసితినని
రమ్మన వీ గరుడునే యమ్మక చెల్ల

నీవు లేక రామకథయె నిశ్చయ మసమగ్రము
రావణుని కొడుకు రామలక్ష్మణులను
భావిని రణమందు నాగబంధముల బట్టగా
వేగ రావలయునని వెన్నుడు పలికె

అండగ నీవు మా కుండగ


అండగ నీవు మా కుండగ భయ మనే
దుండబోదుగా కోదండరాముడా

చెండితివి తాటకను చెచ్చెర గుర్వాజ్ఞపై
మండించి సుబాహుని మసిచేసితివి
దుండగు మారీచుని తోయధిలో వేసితివి
దండుమగడ మాకు నీయండ చాలదా

ఘోరుడు విరాధుని గోతిలో పూడ్చితివి
పోరి ఖరదూషణుల పొడిచేసితివి
మారీచుని వెన్నాడి మట్టిలో కలిపితివి
సారసాక్ష మాకు నీ చాటు చాలదా

నఱకి కబంధుని నాశనము చేసితివి
విరచితివి కుంభకర్ణు విజృంభణము
సురవైరి రావణుని పరిమార్చి మించితివి
పరమవీర మాకు నీ కరుణ చాలదా

1, ఆగస్టు 2019, గురువారం

అందగాడ శ్రీరామచందురుడా


అందగాడ శ్రీరామచందురుడా సీతా
సుందరితో వచ్చి పూజ లందుకోవయ్య

మూడులోకములకు పూజనీయులు మీరు
వేడుకైన జంటయై వెలసినారు
నేడు మాయింటకి వచ్చి నిండారు ప్రేమతో
చేడియయు నీవును చేకొనరే పూజలు

లోకనాథుడ వీవు లోకమాత సీత
మాకు ప్రసన్నులైరి మాభాగ్యము
మీకటాక్షము కాక మేమేమి వలతుము
చేకొనరే పూజలు సీతమ్మయు నీవును

సీతమ్మతో నాడు సింహాసనం బెక్కి
యేతీరున నున్నా వీనాడటులే
ప్రీతితో మాయింట వెలసి మాపూజలు
చేతోమోదంబుగ చేకొందువు రావయ్య

శివశివా యనలేని జీవుడా


శివశివా యనలేని జీవుడా నీకు
శివుడు చెప్పు మంత్రము చెవికెక్కునా

రామమంత్ర మైన నేమి యేమంత్ర మైన నేమి
ప్రేమమీఱ చెప్ప నేమి విననేర్తువా
నీ మనసే విషయవిషనీచకాసారమైన
నేమి చేయగల డయ్య యీశ్వరుడైన

శివుడిచ్చెడి మంత్రము చిత్తజగురు మంత్రము
భవతారక రామమంత్ర మవలంబించి
యవలీలగ చేరవచ్చు  హరిపదంబును కాని
శివుని పై గురికుదరక చెడిపోతివే

గురికుదిరి శివుని వేడుకొనువాడ వొక్కనాడు
తరుణ మెఱిగి శివుడు నిన్ను దయజూచును
దొఱకు నపుడు తారకమంత్రోపదేశము కూడ
నరుడా చేరెదవు నీవు హరిపదంబును

ఎప్పుడును వీడే గొప్పవాడు


ఎప్పుడును వీడే గొప్పవాడు
చెప్పరాని మహిమల చెలగు వెన్నుడు

ఏమేమి చేయలే డితడు కోపించి  పరశు
రాముడై రాజకులంబును కరగించె శ్రీ
రాముడై నీళ్ళపై రాళ్ళను తేలించె బల
రాముడై హస్తినాపురము నొరగించె

ఏమెత్తు వేయలే డితడు చాల చతురుడై
హేమకశిపు గుండెలో నిట్టే డాగె చిన్ని
వామనుడై బలి నిట్టె బంధించె సురవిరోధి
స్త్రీమనోభంజనము చేసి చెలంగె

ఏమేమి యెసగడో యితడు నిజభక్తాళికి
కామధేనువై పెద్ద కల్పవృక్షమై ఐహి
కాముష్మికము లెల్ల నన్నివేళలందు మరి
ఆమోక్షమే యడుగ నిదియు నిచ్చును