31, డిసెంబర్ 2018, సోమవారం

ఏమో నీ వన్నచో


ఏమో నీ వన్నచో నెవరికైన మక్కువే
రామా యదియేమి రహస్యమయ్య

ముక్కు మూసుకొను వారు మునులు నిన్ను చూచిరి
మిక్కిలి మోహించిరిది  యెక్కడి విడ్డూరము
మక్కువ నీపైన మునుల కెక్కుడాయె ననగ
నిక్కముగ నీవు సర్వ నియామకుడైన హరివి

చుప్పనాక వచ్చినది చూచి నిన్ను మెచ్చినది
చప్పున మోహించినది చాల భంగపడినది
అప్పుడే రావణసంహారమునకు తెరలేచె
చెప్పరాని వింతలు నీ చెయుదంబులో హరి

విభీషణుడు నిను గూర్చి విని చాల మెచ్చెను
సభనువీడి వచ్చి నిన్ను శరణమే కోరెను
ప్రభుడ వెల్ల లోకమున కభయ మీయ కుందువె
నభశ్చరుల కభయము నాడే నీ విచ్చినట్లు

ఎఱుగుదురా మీ రెఱుగుదురా


ఎఱుగుదురా మీ రెఱుగుదురా
యెఱుగదగిన దిది యెఱుగుదురా

ఇతడెవరో మీ రెఱుగుదురా యితని విశేషము లెఱుగుదురా
చతురానను మీ రెఱుగుదురా యత డీతని సుతు డెఱుగుదురా
శతక్రతుని మీ రెఱుగుదురా యతని కితడె గతి యెఱుగుదురా
ఇతడే మిము కరుణించినచో నిక పుట్టువులే దెఱుగుదురా

వనమాలాధరు నెఱుగుదురా పరమమనోహరు నెఱుగుదురా
మునిమోక్షప్రదు నెఱుగుదురా మోహవిదారకు నెఱుగుదురా
ఇనవంశప్రభు నెఱుగుదురా ఘనసత్యవ్రతు నెఱుగుదురా
వినుడాతని మీ రెఱిగినచో జననము లేదిక యెఱుగుదురా

భూమిసుతాపతి నెఱుగుదురా రాముని తత్త్వము నెఱుగుదురా
కామితప్రదుడని యెఱుగుదురా ప్రేమమయుండని యెఱుగుదురా
శ్రీమంతుడని యెఱుగుదురా చిన్మయు డితడని యెఱుగుదురా
మీమీ బుధ్ధుల నెఱుగుదురా మీకిక మోక్షం బెఱుగుదురా

27, డిసెంబర్ 2018, గురువారం

నా కొఱకై నీవు నేలకు దిగిరావో


నా కొఱకై నీవు నేలకు దిగిరావో
నీవుండు తావేదో నేనెఱుగ లేను

తెలియమి జేసి ధరకు దిగి వచ్చితి నేను
తెలిసియు నన్ను నీవు దిగనిచ్చినావో
వలదని నీవన్నను భ్రమపడి దిగినానో
అలనాటి నుండి కావు మని వేడుచున్నానే

ఎన్నియుగము లందు వీ యెదురు చూపులు
ఎన్నియుగము లందు వీ పరితాపాలు
ఇన్నాళ్ళ కైన నీ కేల కృప రాదాయె
నన్నిచట వేగుమను టన్నదిది న్యాయమా

ఇక్కడ సంసార మం దింత తిరిగితి సూవె
చక్కనయ్య యీశిక్ష చాలన విదేమయ్య
ఒక్కటై మనముండు టుచితము గానుండు
నిక్కము రామయ్య నీవాడ నేనయ్య


26, డిసెంబర్ 2018, బుధవారం

నినుగూర్చి చింతించు మనసేల యీనాడు


నినుగూర్చి చింతించు మనసేల యీనాడు
ధనముసంపాదించు తలపులో మునిగె

జనియించి సంసారజంజాటమును పొంది
ధనము లార్జించుచు ధరణి గ్రుమ్మరుచు
తనువును పోషించి తనవారి పోషించి
దినములు దొరలించు మనుజుడ గానె

ఎంతగా బుధ్ధిలో నీశ్వరా నీతత్త్వ
చింతనంబును చేయు చిత్తంబునకును
కొంతలో కొంతైన కొఱతగా ధనమున్న
సుంతైన చెదరుట చోద్యమే రామ

అంటి యంటనిరీతి నట్లుంటి వందుచే
బంటుకష్టము లిట్లు ప్రబలుచు నుండె
వెంటరాని ధనము వెంట వెఱ్ఱి పరుగు
వెంటనే యరికట్టి విడిపించ వయ్య



25, డిసెంబర్ 2018, మంగళవారం

పాత 'చందమామ'లు డౌన్ లోడ్ చేయటం ఎలా?


పాత చందమామలు సులువుగా లభిస్తున్నాయి.

మీరు http://www.chandamama.in/ సైట్ లోపలికి వెళ్ళి వివిధభాషల్లో చందమామలను చదువవచ్చును. తెలుగు చందమామల కోసం TELUGU అన్న లింక్ పైన నొక్కితే1947 నుండి అనేక సంవత్సరాల చందమామలు కనబడతాయి. కావలసిన సంవత్సరం ఇమేజ్ పైన క్లిక్ చేస్తే ఆ సంవత్సరం తాలూకు పేజీ తెరచుకుంటుంది అక్కడ ఉన్న మీకు కావలసిన నెల చందమామను క్లిక్ చేసి చదువుకోవచ్చును.

ఐతే నాకు అలా ఓపెన్ ఐన చందమామ ఫార్మేట్ బ్రౌజర్‍లో నచ్చలేదు. దిగుమతి చేసుకొనే విధం అన్వేషించి పట్టుకున్నాను.

1947 జూలై నెల సంచిక నుండి 2007 డెసెంబరు వరకూ ఉన్న సంచికలను మీరు సులువుగా మీ బ్రౌజర్‍లోనే చదువుకో వచ్చును లేదా డౌన్ లోడ్ చేసుకో వచ్చును.

మీరు ఈ లింక్ టైప్ చేసి 1947 జూలై నెల సంచికను డౌన్ లోడ్ చేసుకోవచ్చును. ముఖ్యంగా ఇలా గైతే సమ్చికలు చాల వేగంగా బ్రౌజర్‍లో లోడ్ అవుతున్నాయి. లోడ్ ఐన తరువాత మనం డౌన్ లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి దాచుకోవటమే!

http://www.chandamama.in/resources/telugu/1947/Chandamama-1947-7.pdf

పై లింక్ లోపల 1947-7 అంటే 1947 జూలై నెల. 1947 బదులుగా మీరు మరొక సంవత్సరాన్ని టైప్ చేయవచ్చును. అలాగే చివర 7.pdf బదులుగా 12.pdf అని డెసెంబరు నెల కోసం టైప్ చేయవచ్చును. అక్కడక్కడా కొన్ని నెలల సంచికలు లేవు. ఉదాహరణకు 2007 జూన్ సంచిక లేదిక్కడ. ఆనెలలో ఎందుకనో చందమామ రాలేదేమో మరి.

నా సూచన ఏమిటంటే ఆసక్తి ఉన్నవాళ్ళు చందమామల్ని డౌన్ లోడ్ చేసుకొని ఒక ఫోల్డర్‍లో దాచుకోవటం మంచిది. వీలైతే ఒక పెన్‍డ్రైవ్ లో దాచుకోవటం ఇంకా మంచిది. అవి ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి. కొన్నాళ్ళకి చందమామ వారు ఆ సంచికలని తొలగించినా ఇతరవిధంగా ఇబ్బంది కలిగించినా మనకైతే సమస్య రాకుండా ఉంటుంది.

22, డిసెంబర్ 2018, శనివారం

ఆవల పదునాల్గువే లసురు లుధ్ధతులును


ఆవల పదునాల్గువే లసురు లుధ్ధతులు
నీవల తానొకడె వీరు డీశ్వర సమానుడు

సుదతిని గుహలోన డాచి సోదరుని కాపుంచి
సదమలబలు డగు రాముడు ముదమున విల్లెత్తె
అది విల్లనరాదు సుమా  హరిచేతి చక్రమన
మదోధ్దతులు రాకాసులు మందలుగ కూలిరి

పరిఘను చేపట్టి వచ్చి పడిపోయె దూషణుడు
శిరములు మూడిట్టె తెగ ధరకొఱగె త్రిశిరుడు
ఖరుడు రామశరవహ్నికి కాలిబూడిదాయెను 
హరిని ఋషిగణంబు లెల్ల నమితంబుగ పొగడెను

సీతాలక్ష్మణులు వచ్చి శ్రీరాముని కూడిరి
సీతమ్మరామయ్యను చేరి కౌగలించెను
సీతమ్మ రాకాసుల చేటు నరసి మురిసెను
సీతాలక్ష్మణయుతుడై శ్రీరాముడు మెరిసెను

చింతా కంతైనను చింతలేక వనములకు


చింతా కంతైనను చింతలేక వనములకు
సంతోషముగ రామచంద్రు డరిగెను

వనములైన గాని పట్టణములైన గాని
తనకు సమములే నని జనకుని యొడబరచి
జనకజ నీడగా సౌమిత్రి తోడుగా
వనము లందుండగను బయలుదేరెను

పినతల్లి యడిగెనా విధి యడిగించెనా
వనవాసదీక్ష గొనవలసె నీరాముడు
మునికోటి సురకోటి ముదము నొందగను
వనములకు జననుతుడు బయలు దేరెను

మహాసాధ్వి కైకను మాటాడ బనిచినట్టి
మహావిష్ణు సంకల్పము మనుజుల కేమెరుక
మహావిష్ణువే కద మన రామచంద్రుడు
విహరించు వనములను విరచు రావణుని

21, డిసెంబర్ 2018, శుక్రవారం

ఇల్లాయె నీధరణి విల్లాయె చక్రము


ఇల్లాయె నీధరణి విల్లాయె చక్రము
కొల్లాయె నీకీర్తి గోవిందా

మెల్లగా నీవు శివుని విల్లు పైకెత్తిన
ఫెళ్ళున విరిగె నది వీరేంద్రా
చల్లని తల్లి యా జనకజ సీతమ్మను
పెళ్లాడినావు లోకమెల్ల మెచ్చ

ఎల్లలోకములకు తల్లి సీతమ్మను
చెల్లరే రావణుడు చెఱబట్టగ
త్రుళ్ళిపడుచున్నట్టి దోషాచరుల కెల్ల
చెల్లాయె నాయువు శ్రీరామా

కల్లరి రాకాసిమూక కష్టపెట్ట నోర్చిన
యెల్లదేవతల నవ్వు పెల్లాయె
ఇల్లాలితో కూడి యేలికవై లోకముల
నెల్లకాలమును పాలించవయ్యా


20, డిసెంబర్ 2018, గురువారం

చిక్కులు తీర్చమంటే చిక్కులు పెట్టేవు


చిక్కులు తీర్చమంటే చిక్కులు పెట్టేవు
చక్కని స్వామి యిది సరసత కాదురా

దినదినగండ మని తేలుచున్న దీ బ్రతుకు
వెనుకముందు నీవుండ వీఱిడి నైతినే
దినమణికులతిలక  తెలిసి రక్షించవు
నను కరుణించకున్న నాకేదిరా దిక్కు

ఏమేమి భవములలో నేమేమి పాపాల
నీ మానవుడు చేసె నిప్పటికవి పండె
పాములవలె పట్టి బాధించు చున్నవి
రామయ్య రక్షించ రా వింకేది దిక్కు

పలికెద పలికెదరా పలికెద నీకీర్తి
పలుకను పలుకనురా పరులను కీర్తించి
చిలుకుము చిలుకుమురా చిలుకుము నీకృప
హరిహరి హరి యెపుడు నాకు నీవే దిక్కు

19, డిసెంబర్ 2018, బుధవారం

ఎన్నడును నినుమరచి యున్న వాడను గాను


ఎన్నడును నినుమరచి యున్నవాడను గాను
ఎన్నడును నీమాటల కెదురాడ కున్నాను

అటువంటి నాపైన నలుక బూనితి వీవు
అటువంటి గాగోస నాలకించవు నీవు
అటువంటి నన్నేల నాదరించవు నీవు
ఎటువంటి తప్పు నీయెడల జేసితిని రామ

అటుమొన్న కలలోన కరుగుదెంచిన నీకు
చటుకున మ్రొక్కినది చప్పున మరచితివి
అటమటకాడనా యంత కోపము నీకు
కటకటా యిందుకేమి కారణమో రామయ్య

ధరాసుతావరా సదాదాసుడను రామయ్య
పరత్పరా నినుదక్క పరులనర్ధించనయ
మరల నవ్వుమొగముతో నావంకకు రావయ్య
కరుణదక్క అలుక నీకు సరిగా శోభించదయ

18, డిసెంబర్ 2018, మంగళవారం

కొత్తకొత్త దేవుళ్ళు - ఉత్తుత్తి దేవుళ్ళే


కొత్తకొత్త దేవుళ్ళు - ఉత్తుత్తి దేవుళ్ళే
బత్తి దండగ కాక వారు మోక్షమిచ్చేరా

మనుషుల్లో కొంతమంది మంచి తెలివైన వాళ్ళు
పనిగట్టుకొని సృష్టించిన దేవుళ్ళు వీరు
కనరారు వీరెవరు మనపురాణాలలోన
వినరయ్యా వీరివెంట జనువారి కధోగతే

దొరుకక దొరుకక దొరికినదీ నరజన్మము
సిరులు చింతకాయలని చిత్తవిభ్రమముతో
తిరిగేరో ఈదొంగ దేవుళ్ళ కొలుచుకొనుచు
సరాసరి యధోగతికి జారిపోయేరు మీరు

కామారియైన శివుడు కలడు కదా మరచిరా
రాముడై మీకు నారాయణుడున్నాడుకదా
ఏమనుచు నమ్మరాని యెవరెవరో దేవుళ్ళను
పామరత్వమున కొలచి పతితులై పోయేరో

16, డిసెంబర్ 2018, ఆదివారం

నీ మనసులో దూరి నేనేమి చెప్పేది


నీ మనసులో దూరి నేనేమి చెప్పేది
నామనసులో నున్న నీవే చూడవలె

నీవాడ నీవాడ నీవాడ నని నేను
వేవేల మార్లిదే విన్నవింతునా
నీవున్న మానసము నీది కాకున్నదా
భావమిచ్చి నేను నీ భక్తుడ గానా

కావవే కావవే కావవే యని నీకు
నే విన్నవింతునా నిత్యాశ్రితుడను
భావంబులోనుండి భగవంతుడా
నీ వెఱుగలేవో నిక్కంబుగను

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యని ఇదే
యారాటపడెడు నా యంతరంగమున
చేరియున్నావు నీ చిత్తంబునకు నేను
వేరేమి వివరముగ విన్నవింతును

చాలించవయా పరీక్షలు


చాలించవయా పరీక్షల నింక రామచంద్ర
గాలికంటె పలుచన కావించుచుంటివే

ఇట్టిట్టి వనరానివే యెత్తించి జన్మములు
బిట్టుగ నేడ్పించు టేమి వింతపరీక్ష
పొట్టకేమి వీడు కట్టుపుట్టంబుల కేమి
కొట్టుమిట్టాడు చుండ కూర్చొని చూచేవు

ఎన్నెన్నో జన్మంబులే యెత్తిన పదంపడి
నిన్ను గూర్చి దయతోడ చిన్నచిన్నగ
నన్నెఱుగ నిచ్చి మరి నాచూపు యిహముపై
యున్నదేమో యని విడువ కొకటే పరీక్షలా

ఎప్పటికిని జీవుడనే యెంత పరీక్షించిన
తప్పులేని బ్రతుకు నాకు ధరనే లేదు
ఒప్పుగ నీదరి జేరగ చొప్పడ కున్నావే
యిప్పటితో పరీక్షల నీశ చాలించవే

కాసు లేనివాడు చేతకాని వాడే


కాసు లేనివాడు చేతకాని వాడే వాని
దోసమున్న లేకున్న దోషి వాడే

మొకము దాచుక చాల ముడుచుకొని యుండు
ఒకరూక వెచ్చించ రకరకములుగ నెంచు
చకితుడై యుండును సర్వవేళలయందు
ఒకనాడు రాముడే యుద్ధరించ వలె వీని

ఐనవారింటి పెండ్లి కయిన పోలేడు వాడు
మానక సంతాపించు లోన నంతే కాని
వాని కష్టమెఱుగు వాడొక్క రాముడే
తానొకడే తప్పుబట్ట దలచడు వింటే

పురాకృతమున జేసి పుట్ట కష్టము లెల్ల
వరుసతప్పులవాడు వాడగు ధర మీద
దరిజేర్చు రాముడే దయజూచు నందాక
సరిసరి తనలోన చచ్చిబ్రతుకుచు నుండు


15, డిసెంబర్ 2018, శనివారం

ఎక్కడికని పోదునో చక్కని వాడా


ఎక్కడికని పోదునో చక్కని వాడా యన్ని
దిక్కుల నీటెక్కెమే తేజరిల్లగ

నీవు కనిపించవని నీపైన కోపించి
యేవంకకు పోయి నే నించుక దాగుందును
నీవులేని చోటు లేనేలేదాయె
భావించి యచట దాగ వచ్చును నా నెంచగ

నీవు  మరచినావని నిన్ను నే మరతునా
యే వంకకు పోయి నేనేమి చేయుచున్నను
నీవు నా కన్నులలో నిత్యముందువే
నీ వెలుగులలో కదా నేను విహరించునది

నీవు విశ్వపూజ్యుడవు నీవు నా రాముడవు
నీవు నారాయణుడవు నీవు నా సఖుడవు
యీ విశ్వము నీలో నించుకంతయె
కావున నీపై నలుక కలిగి యెందు దాగుదు

14, డిసెంబర్ 2018, శుక్రవారం

ఏమయా కరుణ రాదేమయా


ఏమయా కరుణ రాదేమయా
రామయా వేగ రావేమయా

ఎన్నాళ్ళు చేసితి మీ సంసారము
చిన్నమెత్తు సుఖమును లేదాయె
అన్ని విధముల సుఖము నిన్ను నమ్ముట యని
యెన్ని నీపాదములే తిన్నగ నమ్మితిమి

నీరూపమే వలచి నీనామమే తలచి
కారుణ్యమూర్తి వని లోనెంచి
ఘోరభవజలధి నుండి తీరమ్ము దాటించి
తీరెదవని నమ్మిన వారము మేమయ్యా

నీవొకడవే గాని నేల నెల్ల జీవులను
బ్రోవ నెవ్వరు లేరు పుణ్యాత్మ
కావవే యుగములే గడువనిచ్చుట యన్న
నే విధముగ నీయశ మినుమడింప జేయును

12, డిసెంబర్ 2018, బుధవారం

ఔరా యీ సంసార మంతరించు టెటులని


ఔరా యీ సంసార మంతరించు టెటులని
మీరు భావించితే శ్రీరాము డున్నాడు

ఏరీతి తనునౌకల ఘోరసంసారజలధి
పారముముట్టెదరయా శ్రీరామనౌక
దారిచూపుచు నిట్టె తీరంబు చూపించ
చేరి హరివాసమున చిరకాల ముందురు

తారకనామమును మీరు తలచునందాక
దారి తెలియలేరు సంసారాటవిని వీడ
శ్రీరామచంద్రుడే దారిచూపించగ
చేరి హరివాసమున చిరకాల ముందురు

దారుణసంసారసర్పధంష్ట్ర లందు చిక్కి
పారిపోలేరు రామభద్రుని వేడక
శౌరిదయాఖండితసంసారులై మీరు
చేరి హరివాసమున చిరకాల ముందురు

11, డిసెంబర్ 2018, మంగళవారం

ఎక్కడికని పోదువో


ఎక్కడికని పోదువో చక్కనివాడా నా
ప్రక్కనుండి నీవెట్లు పారిపోయేవు

దిక్కులన్నిట నిదే దేదీప్యమానమై
పిక్కటిల్లు నీ దివ్యవిభూతి దేవా
యెక్కడ దాగొందువో యింక నీవు చెప్పుమా
నిక్కముగా క్రొత్తతావు నీకొక్క టున్నదా

దక్కితి విక నాకు దంభంబు లేమిటికి
చక్కగా నీవు నా సఖుడవు కావే
యెక్కడ నీవుందువో యక్కడ నేనుండనా
నిక్కముగా నాలోన నిండి నీవుండవే

చక్కనయ్య శ్రీరామచంద్రుడా నిచ్చలు
నొక్కరీతి తలపోయుచుందును నిన్ను
అక్కజముగ నీవును నటుల నన్నెంచుచు
నొక్క నిముష మేని దాగ నుంకించుటున్నదే


అవధారు శ్రీరామ


అవధారు శ్రీరామ అఖిలలోక పరివ్యాప్త
ధవళకీర్తి నీ సేవ దక్కెను నాకు

భానుకులాలంకార దానవగణ సంహార
మానవేంద్ర భక్తపోష మరగితి నిన్ను
దాన నిదే నా దోషతతి యంతరించెను
జ్ఞానమయుడ వైన నీ కలిమి జేసి

సకలలోకేశ్వరా సకలజీవేశ్వరా
ప్రకటించుకొంటి సేవకునిగ నీకు
నికరమైన చిత్తశాంతి నేడబ్భె నీవే
యకళంకశాంతమూర్తి వగుట చేత

విమలవేదాంతసంవేద్యదివ్యమూర్తి నా
యమలినమగు ప్రేమ నీ కందింతును
భ్రమలిదిగో తొలగినవి బాగొప్ప నీపాద
కమలంబులను జేరు కతన నాకు


10, డిసెంబర్ 2018, సోమవారం

శ్రీరామచంద్ర నేరములే చేసితి నేమో


శ్రీరామచంద్ర నేరములే చేసితి నేమో నీవు
కారుణ్యము చూపవేమి కారణ మటు కాక

హరిభక్తశిఖామణుల కవమానము చేసితినో
హరినింద జేయువారి నంటుకొని తిరిగితినో
హరి నీవుకాక దైవమనుచు నొకని తలచితినో
మరి యేమి చేసినతినని మారుమొగము

పరద్రవ్యము లాశించు పాపమే చేసితినో
పరులను సేవించునట్టి పాపమే చేసితినో
పరమాత్మ నిన్నుమరచు పాపమే చేసితినో
మరి యేమి చేసినతినని మారుమొగము

పుడమిపై పలుమార్లు పుట్టుట నా నేరమా
బడలుచును నీనామము విడువమి నా నేరమా
యెడమైన నీ కొఱకై యేడ్చుట నా నేరమా
గడుసువాడ భవమింక కడతేర్చవు

8, డిసెంబర్ 2018, శనివారం

నిత్యసన్నిహితుడు వీడు


నిత్యసన్నిహితుడు వీడు నీకు నాకు నందరకు
అత్యంత ప్రేమమూర్తి యైన రామచంద్రుడు

సోగకన్నుల వాడు సొగసైన తనువు వాడు
యోగీశ్వరేశ్వరుడై యుండువాడు
భోగపరాయణులకు బుధ్ధి కందని వాడు
వాగీశప్రభృతులు ప్రస్తుతించెడు వాడు

పవమానసుతసేవ్యపావనాంఘ్రులవాడు
అవనిజాసమేతుడై యలరు వాడు
భవచక్రప్రవర్తకుడు పరమాత్ముడు వాడు
పవలు రేలు యోగులను పాలించు వాడు

తనపేరు తలచినంత దయను చూపించువాడు
మనసిచ్చికొలిచితే మన్నించు వాడు
తన భక్తులకు మోక్షధనము నందించువాడు
మనుజులార మ్రొక్కరే మహావిష్ణు వీతడు

నమ్మితి నది చాలదా


నమ్మితి నది చాలదా నన్నుధ్ధరించుటకు
నెమ్మదిగ నైన దయ నీకు రాకుండునా

ఇంకొకరి కాళ్ళ మీద నెన్నడును వ్రాలనే
ఇంకొకరి దయనా కేలనయ్యా
వంకలు పెట్టవని పచరించు సేవలలో
లెంకవాడనై యుందు లేవయ్య నిను చాల

ఎవరెవరో దేవతలట యేమేమో యిత్తురట
ఎవరెవరి దయలు నా కేలనయ్యా
ఇవల నవల నాకు నీ వీయలేని దున్నదా
తివిరి సతము సేవింతు దేవుడా నిను చాల

కాలాత్మక రామ కరుణాంబు రాశి న
న్నేలి మోక్షమిచ్చితే చాలునయ్యా
చాలు నింక భవజలధిని సంచరించుట మాను
వేళయైన దని నీవు పిలచెదవని చాల


రామరామ రామరామ


రామరామ రామరామ రామరామ రామరామ
రామ కోదండరామ రామ కళ్యాణ రామ

రామ బ్రహ్మాదిలోకపాలకార్చితా హరి
రామ దశరథమహారాజపుణ్యఫల హరి
రామ గాధేయయాగరక్షణాదక్ష హరి
రామ ఖండితామేయరాజధరచాప హరి

రామ లోకసన్నుత రామ సీతాసమేత
రామ భరతదత్త లోకారాధ్యనిజపాదుక
రామ ఖరదూషణాది రాక్షసాంతక హరి
రామ శరధిబంధన రామ రావణాంతక

రామ వినుతసుత్రామ రామ రాజలలామ
రామ సాకేతరామ రామ పట్టాభిరామ
రామ లోకాభిరామ రామ జానకీరామ
రామ పరంథామ శ్రీరామ వైకుంఠధామ


7, డిసెంబర్ 2018, శుక్రవారం

దేవుళ్ళున్నారు దేవత లున్నారు


దేవుళ్ళున్నారు దేవత లున్నారు
కావగ జీవుల కడువేడుకతో

చిన్నవైన పెద్దవైన జీవుల కోరికలు
మన్నించ దగునేని మానక తీర్చగ
నన్నిట నిదె సుముఖు లగుచు వారున్నారు
పన్నుగ ముక్తి భగవంతు డిచ్చును గాక

సుప్తచైతన్యులైన క్షుద్రు లటులుండగ
సప్తమోక్షభూమికా సంచారజీవుల
కాప్తులైన దేవుళ్ళ యాశీస్సుల వలన
ప్రాప్తించు చున్నది పరమాత్ముని దయ

తారకనామ మొకటి తలచుచుండు జీవుడు
కోరుచుండు మోక్షమే తీరుగ దయచేయ
కారుణ్యమూర్తియై కాచుకొని యున్నాడు
ధీరులార చేరుకొనుడు దేవదేవుని మీరు

3, డిసెంబర్ 2018, సోమవారం

కోరిక తీర్చని దేవుడి కిచ్చిన కొబ్బరిచిప్పలు దండుగ


కోరిక తీర్చని దేవుడి కిచ్చిన కొబ్బరిచిప్పలు దండుగ
కోరగ రానివి కోరెడు మూర్ఖుడు గుడికి పోవుట దండుగ

అడుగ దగినవే యడుగవలె నని యడిగెడు వానికి తెలియాలి
అడిగిన వన్నీ యమరించేందుకు యవసర మేమిటి దేవుడికి
బుడబుడ కోర్కెలు మనిషిబుధ్ధికి పుట్టుచు నుండును నిత్యమును
అడుగదగినవి యడుగదగనివి అంతరంగమున తెలియాలి

అడుగదగినది యొకటే నన్నది యనుభవమున నెఱుకయ్యేను
విడువదగునవి తదితరములను వివేక మొక్కటి కలిగేను
అడుగడుగున తన కంతవరకును యక్కరలుగ తోచిన వెల్ల
అడుగుచు ప్రతిగుడిలో దేవుడి నడుగుట తప్పని తెలిసేను

అడుగదగిన ఆ యొక్కటి యెవ్వని నడుగుట యుక్తమొ తెలియాలి
కడుపుణ్యులకే ఆ యొక్కడైన శ్రీకాంతుని సంగతి తెలిసేను
పుడమిని వాడే రామచంద్రుడను కడిది మగండని తెలిసేను
తడయక నాతక వేడిన మోక్షము తప్పక కలదని తెలిసేను


1, డిసెంబర్ 2018, శనివారం

ఒక్కొక్క కీర్తన


ఒక్కొక్క కీర్తన యొక మంత్రము
చక్కగ నీగొప్ప చాటెడు మంత్రము

జరిగిన తప్పులు సరిజేయు మంత్రము
మరిమరి హితవైన మాటల మంత్రము
నిరుపమానుని కీర్తి పలికెడి మంత్రము
సరిలేని మంత్రము చక్కని మంత్రము

భాగవతులెల్ల సంభావించు మంత్రము
వేగమె మనసును వెలిగించు మంత్రము
భోగము లం దాశ పోకార్చు మంత్రము
యోగభూమిక బుధ్ధి నునిచెడి మంత్రము

ఆరాటము లెల్ల నణచెడు మంత్రము
ధారాళమైన మంచిదనమున్న మంత్రము
కోరిచేగొన్న ముక్తి కూర్చెడు మంత్రము
శ్రీరాముని గూర్చి చెప్పెడి మంత్రము