కం. గర్వించక శ్రీరాముని
సర్వాత్మకుడైన హరిని చక్కగ గొలువన్
సర్వార్ధంబులు కలుగుట
యుర్వినిగల సుజను లెఱిగి యుందురు సతమున్
కం. గర్వించక శ్రీరాముని
సర్వాత్మకుడైన హరిని చక్కగ గొలువన్
సర్వార్ధంబులు కలుగుట
యుర్వినిగల సుజను లెఱిగి యుందురు సతమున్
కం. సవినయముగ వర్తింపను
అవసరమను పేర కల్లలాడక యుండన్
దివిజులు మెచ్చగ భువిపై
నివసించగ రామచంద్ర నీదయచాలున్
కం. ధర నివి యవి భోగింపగ
వరములు నాకేల రామ వలదు మహాత్మా
మరి యేమి వలయు ననగా
నిరుపమకరుణాలవాల నీదయచాలున్
సిరులా నమ్మగ రానివి
తరుణుల ప్రేముడులు నమ్మ దగనివి తనువుల్
సరిసరి బుడగలె రామా
నిరంతరం బగుచు వచ్చు నీదయచాలున్
కం. నాతికి నీదయ దక్కెను
కోతులరాయనికి దక్కె గొప్పగ నాసం
పాతికి దక్కెను ముందే
యాతని తమ్మునకు దక్కె నది శ్రీరామా
కం. నీవాడెవ్వడు రామా
పైవాడెవడయ్య నీకు వైకుంఠపతీ
భావింపగ నందరమును
నీవారమె తండ్రి మాకు నీదయచాలున్
కం. జగదేకసార్వభౌమా
అగణితసుగుణాభిరామ అసురవిరామా
గగనశ్యామా రామా
నిగమవినుత పూర్ణకామ నీదయచాలున్
కం. నను బ్రోచు దొరవు నీవని
మనసారా నమ్మినాను మంగళనామా
మునిజనహృదయారామా
జననుతసుగుణాభిరామ జానకిరామా
కం. నిను నమ్ముకొంటి రామా
సనకాదిమునీంద్రవినుతసద్గుణధామా
వనమాలికాభిరామా
వనజాసనవినుతలోకపావననామా