25, ఏప్రిల్ 2018, బుధవారం

ఇదిగో యీ రామనామ మింత గొప్ప దున్నది


ఇదిగో యీ రామనామ మింత గొప్ప దున్నది
వదలక సేవించు నాకు ప్రాణ మదియై యున్నది

అన్ని సౌఖ్యము లాత్మకింపుగ నందజేయుచు నున్నది
అన్ని కష్టము లందదే నన్నాదు కొనుచు నున్నది
అన్ని వేళల తోడు నీడై యనుసరించుచు నున్నది
అన్ని విధముల జన్మజన్మల పెన్నిధి యన దగినది

కనులు తెరచిన క్షణము నుండి మనసున మెదలాడుచు
కనులు మూసిన క్షణము నుండి కలల తానే మెదలుచు
మనసున తా నిండి యుండి మధురమధుర మగుచును
తనకు తానై కరుణతో‌ నన్ననుక్షణమును నడపుచు

నియమనిష్ట లెఱుగడే‌ యని నింద జూపి వదలక
భయము భక్తి లేని వాడని వదలి దూరము పోవక
దయయు సత్యము వీని బ్రతుకున తక్కువే‌ యని జూడక
జయము నిచ్చును బ్రోచుచున్నది చాలునది ముమ్మాటికి


22, ఏప్రిల్ 2018, ఆదివారం

మణులు మంత్రాలు మనకు మంచి చేయునా


మణులు మంత్రాలు మనకు మంచి చేయునా
మనసులోని రాముడే మంచి చేయునా

మణులు మంత్రాలతో మనకబ్బు నట్టివి
మనసుల రంజింపజేయు మాట సత్యమే
తనువుండు నన్నాళ్ళె మన కవి భోగ్యములు
మన వెంట రానట్టివి మన కెంత మంచివి

అకళంక చరితుడై యలరు శ్రీరాముడు
సకలసుగుణధాముడు సద్భక్త వరదుడు
సకలలోక హితునిగా సంభవించిన వాడు
ఒకనాటికి విడువక నొడ్డు చేర్చు వాడు

జనులార యోచించుడు చక్కగా మీరు
తనకు మాలిన ధర్మ మనగ లేదు కనుక
వెనుకముందు లెంచి సద్వివేకబుధ్ధి కలిగి
మనసెటు మ్రొగ్గునో జనుడటు హాయిగా

21, ఏప్రిల్ 2018, శనివారం

తీయనైన మాట యొకటి తెలిపెద


తీయనైన మాట యొకటి తెలిపెద వినుమా
హాయిగొలిపి మంచి చేయు నందమైన మాట

ఎవరెంత తీయగా నేమి మాట్లాడినను
చివర కట్టి మాటలలో చిన్నగా నేని
యవలివారి స్వార్థమే యగుపించును
భువి నట్టిది కానిదై రవళించు నీమాట

ఇది మేలు చేయనని యెవరేమని చెప్పిన
నది కొంతగ మేలు చేయు నట్టి దైనను
వదలక నిహపరముల పట్టి మేలు చేయు
సదమలమై నట్టి దిది చక్కగా వినుడు

అన్నిమంత్రముల సారమైనట్టి మాట
చిన్నదైనను మోక్షసింహాసనమున
నిన్నుంచెడి మాట నీవుపాసించుమా
అన్నా శ్రీరామమంత్ర మదే గొప్పమాట

20, ఏప్రిల్ 2018, శుక్రవారం

హరి నీ వుండగ నన్నిటికి


హరి నీ వుండగ నన్నిటికి నిక
పరుల నెంచెడు పనిలేదు కద

కలదని లేదని కలహము లాడుచు
కలదో లేదో కలయో నిజమో
తెలియని మాకు తెలివిడి కలుగ
నిలపై కలిగి యినవంశమున

రాముడనే శుభనామముతో మా
భూమిని ధర్మము పొసగ నిల్పితివి
కామితార్థములు కలిగించెడు నీ
నామమె చాలును నరులందరకు

ఇహమో పరమో యెట నగు గాక
మహిమలు జూపుచు మాకడ నీవే
యహరహ ముండగ నానందమున
విహరింతుము నిర్భీతులమై

18, ఏప్రిల్ 2018, బుధవారం

దేవతలూ అప్సరసలూ

ఈ రోజున మిత్రులు మధుసూదన్ గారి నుండి ఒక ప్రశ్న విన్నాను. అందఱను స్వర్గ సౌఖ్య సంతృప్తులనుగాఁ జేయుచున్న దేవవేశ్యలందఱను సతులుగాఁ బరిగణింపవచ్చునా?" యని.

కొంచెం‌ బాధ కలిగినా అది అనేకమందికి ఉండే సందేహమే‌ కాబట్టి అలా వారు అనటాన్ని తప్పుబట్టలేను. ఇది లోకసహజమైన అభిప్రాయం కాబట్టి.

ఈ విషయంలో నాకు తెలిసిన నాలుగు ముక్కలు వ్రాయాలని అనిపించింది.

దేవతలు ప్రధానంగా తైజసమైన రూపం కలవారు. అంటే వారందరూ తేజోమూర్తులే ఐతే వారు శారీరకంగా కరచరణాద్యవయవాలూ మానసికమైన కామాదిక వికారాలూ లేని వారా అంటే లేని వారే కాని కార్యార్థం రూపధారణం చేస్తా రంతే.

మనం ఇంద్రుడు అంటాం. విశ్వనాథవారు శచీపురందర ఋషి అంటారు. సినిమాల్లోనూ‌ నాటకాల్లోనూ వారి అవసరాలకోసం నీచపాత్రను చేసి చూపుతారు నిరభ్యంతరంగా. అంటే కథాగమనం కోసమూ, వారు పైకెత్తవలసిన పాత్రలు పండటం కోసమూ వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇంద్రుడైనా మరెవరైనా సరే దుష్టపాత్ర కావలసి వస్తుంది తరచుగా.

కాని నిజం ఏమిటి చూదాం.

ఇంద్రుడు త్రిలోకాలనూ‌ పాలించే కర్తవ్యం ఉన్నవాడు.

ముఖ్యంగా అయన మునులందరకూ‌ పరీక్షాధికారి.

మీరొక పోటీ పరీక్షకు బాగా తయారవుతారు. ప్రశ్నాపత్రం మరీ సులభంగా ఉందనుకోండి.

అయ్యయ్యో‌ అందరూ సుబ్బరంగా చాలా బాగా వ్రాసేస్తారు. నాలా బాగా తెలివైన వాడికి అది చూపించే‌ అవకాశం ఈ‌డొక్కు పరీక్ష పుణ్యమా అని తప్పిపోయింది అని అనుకుంటారు. ఇబ్బడిముబ్బడిగా అందరికీ మంచి మార్కులు పడిపోతే మనం గుంపులో గోవిందా ఐపోతామే అని ఆదుర్దా పడతారు. నిజమే‌ కదా?

సరే నండి. వీళ్ళిలా అనుకుంటారు అభ్యర్థు లంతానూ అని ఊహించుకొని ప్రశ్నపత్రాన్ని కాస్త కఠినంగా బిగించి ఇచ్చారను కోండి. ఏమవుతుంది?

హారి వీడి దుంపతెగా. ఇంత కర్కోటంగా పరీక్షాపత్రం ఉంటే ఎలాగూ? అందరినీ‌ బాగా ఏడిపించాలని ఎవడో శాడిష్టు మన కొంపముంచాడే! ఏంత బాగా తయారయ్యానూ, ఎంత కాలం నుండి తరారయ్యానూ, దీనికోసం ఎన్ని కష్టాలు పడ్డానూ, వేరే అవకాశాలు ఎన్ని వదలు కున్నానూ అంటూ రాగాలు తీస్తారు. ఇదీ నిజమే‌ కదా.

అసలు పరీక్షా పత్రం అనేదానిలో కాఠిన్యం ఎందుకూ అవసరమా?

మీరే ఒక పరీక్ష పెడుతున్నారనుకోండి. మీ‌ అఫీసులో‌ ఒక జూనియర్ సైంటిష్టో మరొకటో‌ అని.

ఉన్నదేమో ఒక్క పోష్టు. అభ్యర్థులు అక్షరాలా మూడువేలమంది అని కూడా అనుకోండి.

సరే లెక్కప్రకారం పరీక్షలో ఫష్టు పదిమందికీ ఇంటర్వ్యూ నిర్వహించి మీరో మరొక టీమో చివరకు ఒకరిని నిర్థారించాలి. అదీ ప్లాను.

ఐతే మూడువేల మందిలో దాదాపు అందరూ ఒకేలా సరైన సమాధానాలు ఆటోమాటిగ్గా గీకి పారేసేలా PV = RT అనే సూత్రాన్ని ఏమని పిలుస్తారూ. అందులో R అంటే ఏమిటీ అనొకటీ, సోడియం క్లోరైడ్ అనే రసాయనపదార్థాన్ని ఏమంటారూ దాన్ని ఎందుకు వినియోగిస్తారూ, గ్రిగ్నార్డ్ రియేజెంట్లు ఎందుకు పనుకొస్తాయీ లాంటి ప్రశ్నలు సంధించారనుకోండి. చివరికి ఏంజరుగుతుందీ. సగానికి పైబడి అభ్యర్థులంతా నూటికి నూరు తెచ్చికొని గుమ్మంలో కూర్చుంటారు? ఏ పదిమందిని పిలుస్తారు వాళ్ళలోంచి?

అందుచేత ప్రశ్నాపత్రం అవసరానికి తగినంత కఠినంగా ఉండవలసి వస్తుంది. తప్పదు. నిజానికి అవసరమైన దానికన్నా కూడా సాధారణంగా కష్టంగానే ఉంటుంది మరి.

ఏదో నూరు యజ్ఞాలు చేసేస్తే చాలు ఇంద్రుడి పదవి ఊడగొట్టి ఆ యజ్ఞకర్త కాస్తా ఇంద్రుడైపోతాడూ అందుకే ఇంద్రుడు ఎవరి యాగాలూ సాగనివ్వడూ. అలాగే మునులు తపస్సు చేస్తుంటే వాళ్ళ తపస్సు వల్ల ప్రకృతి వారికి వశమై పోతుందీ‌ తన ప్రభ పదిపోతుందీ అని అందరి తపస్సులనూ ఇంద్రుడు చెడగొడుతూ ఉంటాడూ‌ అని కూడా జనం అనుకుంటారు.

నిజం‌ కాదు.

అయనకు తపస్సూ తెలుసును. దాని విలువా తెలుసును. ఆయస స్వయంగా గొప్ప ఋషి, వేదమంత్ర దృష్ట. అమ్మవారి ముఖ్యభక్తులలో ఒకడు.

ఎవరైనా తపస్సు ద్వారా ఏదన్నా ఉద్దేశాన్ని సాధించుకొనేందుకు చేస్తున్నా రనుకోండి. అది ఫలిస్తే వారికి అపూర్వమైన అవకాశంగా ప్రకృతిపై పెత్తనమే వస్తుంది అనుకోండి. ఇంకా గొప్పగొప్ప మంచీ చెడులు వారి అధీనంలోని వస్తాయనుకోండి.

అప్పుడు ఇంద్రుడు కలుగ జేసుకోవాలి.

అదికావాలీ‌ ఇదికావాలీ అని తపస్సు చేసే వాళ్ళకు ఆ తపఃఫలితంగా లభించే‌ శక్తిని భరించే సామర్థ్యం ఉండాలి ముందుగా.

అది ఉందా వాళ్ళకి అని చూసే పూచీ ఆ ఇంద్రుడు తీసుకోవాలి.

ఉదాహరణకు విశ్వామిత్రుడు కేవలం వశిష్ఠమహర్షి పైన కక్షసాధింపు కోసమే తపస్సును ఎన్నుకున్నాడు. తపశ్శక్తితో ఆయన ముందుకు వెళ్ళి చూడూ‌ ఇప్పుడు నా తపస్సే గొప్పది అని చూపా లనుకున్నాడు. ఆయన లక్ష్యంగా నిర్దేశించుకొన్న బ్రహ్మర్షిత్వం అన్నది ఎంత గొప్ప శాంతమూర్తికి తప్ప సాధ్యం కానిదో ఆయన తొలుత అవగాహన చేసుకోలేదనే చెప్పాలి.

ఇంద్రుడు ఆయనకు పరీక్షలు పెట్టాడు. రకరకాలుగా విసిగించాడు.

ఆయనతో కాపురంచేసిన మేనక అలాంటి ఒక కథానాయకి.

ఆయన కోపాగ్నికి బలై శిలారూపం ధరించిన రంభ మరొక పాత్ర.

కాని ఈ‌పరీక్షలే విశ్వామిత్రుడిలో మొదట అసహనాన్నీ కోపాగ్నినీ‌ రగిల్చినా ఆయన చివరకు విషయం అర్థం చేసుకున్నాడు.

విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావటమే‌ కాదు. విష్ణ్వతారమైన రామచంద్రమూర్తికి గురువు కూడా కాగలిగాడు.

ఇంద్రుడి పరీక్షల వలన మంచే‌ జరిగించి.

ఆయన స్వయంగా అందరూ నిత్యం ఆరాధించే గాయత్రీ మంత్రదఋష్ట అన్నది మనకు తెలుసు.

అయన గొప్పదనానికి ఇంద్రుడు కూడా గొప్ప కారణమే.

అనవసరంగా ఇంద్రుడి సోది ఎందుకు చెప్పాను అనవచ్చును. సరే, ఇంక అప్సరసల సంగతి చూదాం.

పురూరవుడు అని గొప్పరాజు. అయన ఊర్వశిని వలచి ఇంద్రుడి అనుమతితో‌ భార్యను చేసుకొన్నాడు.

కొన్నాళ్ళ తరువాత ఆవిడ కాస్తా గడువు తీరిపోయింది. సెలవు అని చులాగ్గా అనేసి వెళ్ళిపోతే పురూరవుడు అక్షరాలా లబలబ లాడాడు.

మళ్ళీ కాళ్ళావేళ్ళా పడి ఆమెను వెనక్కు తెచ్చుకున్నాడు.

ఒకసారి ఊర్వశి పురూరవుడితో ఒక కొండమీద విహారానికి వెళ్ళింది ఆ కొండమీద అడవుల్లో కొంత కాలం విహరించారు. అప్పుడు ఆవిడ పురూరవుడితో, రాజా ఈ‌కొండమీద సాక్షాత్తూ విష్ణుమహాదేవుడు వరాహనారసింహద్వయ రూపిగా వెలసి ఉన్నాడు సుమా- ఇది మహనీయమైన పుణ్యక్షేత్రం అన్నది. పురూరవుడికి ఎంతో అబ్బురం‌ కలిగింది. ఎక్కడ ఎక్కడ అని ఆరాట పడ్డాడు. ఆవిడ తాపీగా ఈ కొండమీదా నిశ్చయంగా ఉన్నాడు. ఎక్కడో మనం వెదుకుదాం అన్నది.

ఇద్దరూ శ్రమపడి చెట్లూ పుట్టలూ గుహలూ వగైరా బాగా గాలించి స్వామిని దర్శనం చేసుకొన్నారు.

అదే పరమపవిత్రమైన సింహాచల మహాక్షేత్రం.

ఈవిధంగా ఊర్వశీదేవి మనకు వరాహనరసింహస్వామిని పరిచంయం చేసింది. మహనీయురాలు.

అవిడ దేవత. మనలాగా పరిమితులు కల మానవశరీరి కాదు.

అవిడకు ఆకొండమీద దేవు డున్నాడని ముందే గమనిక కలిగింది.

తన దివ్యశక్తితో భవద్దర్శనం చేసుకొన్నది.

కాని పురూరవుణ్ణి తరింపజేయాలన్నది ఆమె సంకల్పం.

అందుకే తనకు సరిగా తెలియదు అని అమాయకంగా చెప్పి, ఆయనతో జాగ్రత్తగా స్వామిని భక్తితో వెదకించింది.

నిజానికి ఇది ఆమెసంకల్పమా?

దేవతల సంకల్పం.

దేవప్రభువూ‌ పురూరవుడికి శ్రేయోభిలాషీ మిత్రుడూ ఐన ఇంద్రుడి సంకల్పం ఇది.

ఊర్వశి మంచి పాత్రపోషించింది ఈ వ్యవహారంలో.

ఇంద్రుడు ఒక పధకం ప్రకారం ఊర్వశిని పురూరవుడికి పరిచయం చేసాడు నాటకీయంగా. ఆమెను సశరీరంగా చూడటంతో పురూరవుడు ఆమెపై మరులు గొనటమూ దేవసంకల్పమే.  ఆయనద్వారా సింహాచలం దేవుణ్ణి మనకు చూపటం అన్నది దేవతల పధకం. దాని కారణంగా పురూరవుడు నిత్యస్మరణీయుడూ తరించిన వాడూ అయ్యాడు.

చివరికి ఊర్వశీ పురూరవుల కథలో ఏమి జరిగింది.

దేవసంకల్పం నెఱవేరింది,

ఊర్వశి వెనుదిరిగింది.

మళ్ళా ఆ పురూరవుడు ఆమెకోసం‌ ఈ సారి పెద్ద తపస్సు చేసాడు.

దేవతలకు నియమం. తమకోసం తపస్సు చేస్తే వాళ్ళకు యోగ్యమైన వరాలు ఇవ్వాలి. తప్పదు.

ఊర్వశీ దిగిరాక తప్పదు.

వచ్చి ఏమిచేసింది?

ఓ రాజా, శరీరధారులకు ఉండే ఈ‌కోరికలు స్వల్పప్రయోజనం కలవి మాత్రమే సుమా అని చెప్పింది. ఆయనకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేసింది.

పురూరవుడు జ్ఞానవంతుడై తన శరీరాన్ని కాక సంపూర్ణంగా భగవంతుని ప్రేమించి తరించాడు.

ఈ‌కథలు ఎందుకు చెప్పానో‌ పాఠకులు కొంచెం అవగాహన చేసుకొని ఉంటారని ఆశిస్తున్నాను.

దేవతల తప్పులు వెదకకండి. అది దోషం.

భగవంతుడి తప్పులు వెదకకండి. అది అపచారం.

మన శక్తియుక్తులు అతిస్వల్పమైనవి. మొన్న రాత్రి భోజనంలో ఏమి కూర తిన్నావు అంటే ఈ‌ ఉదయం ఎంతో‌మందికి సరిగా గుర్తుకు రాదు. ఎన్నో‌ జన్మల గురించీ వాటిలో మనం ప్రోగుచేసుకొన్న కర్మఫలాల గురించీ ఎవరికి తెలుస్తుంది?

దేవతలకు తెలుస్తుంది.

వారు సహాయం చేస్తారు.

మనకోసం, అవసరమైతే, మనమధ్యనే ఉండి వారు నయానో భయానో, మనకు అభ్యున్నతిని చేకూరుస్తూ ఉంటారు.

ఒక్కొక్క సారి వాళ్ళు మనని కష్టాల పాలు చేస్తున్నారని అనిపించవచ్చు. వాళ్ళు క్రూరులనీ అనిపించవచ్చును.

వారు ఉద్దేశించిన మంచిని మనం అందుకొన్న నాడు వాళ్ళు సంతోషిస్తారు.

అందుచేత దయచేసి దేవతల పట్ల కాని అప్సరసల పట్ల కాని చులకన మాటలు మాట్లాడ కూడదని అర్థం చేసుకోండి.

మాట వరసకు ఒక అప్సరస స్వర్గంలో ఒకనికి కామాది సుఖాలను అందిస్తున్నది అనుకుంటే దాని అర్థం ఆమె మానవలోకం నుండి వచ్చిన ఒకడి కోసం మానవస్త్రీలాగూ ఐపోయి మన లోకంలో ఉంటారని చెప్పబడే ఒక వేశ్యలాగా ప్రవర్తిస్తుందని కాదు. కానే‌ కాదు. ఆ భోగాల పట్ల ఆజీవికి మిగిలి ఉన్న ఆసక్తిని తగ్గించి నయంచేసేందుకు ఆవిడ దగ్గర ఉపాయం ఉందని. తేజో‌జీవులైన వారి వద్ద ఉండే ఉపాయం ఏమిటంటే వారి తేజస్సుల ప్రభావం ఆ జీవులను ఆకర్షించి వారి నుండి మోహాదులను తొలగించటం. ఆమె అలా తొలగిస్తున్నది అని అర్థం.

లౌకిక సాహిత్యంలోనికి తెచ్చేసరికి ఈ అవగాహనలన్నీ కూడా పరమపవిత్రము లన్నవి పరమ జుగుప్సాకరంగా ప్రతిబింబించబడ్దాయి.

అది కవుల తప్పా మనతప్పా అన్నది పక్కన బెడదాం. ఆచర్చ వలన మనకు ఉపయోగం లేదు.

ఇప్పడు సరైన దృక్పథంతో అర్థం చేసుకోవటం మేలు చేస్తుంది.

చివరగా పాఠకులకు ఒక విన్నపం. నాకు తోచిన ముక్కలు నాలుగు చెప్పాను. అందరికీ‌ నచ్చకపోవచ్చును. ఏదో‌ పత్రికల వాళ్ళకు నా స్వబుధ్ధి వ్యవహారమే అని హామీ ఇచ్చినట్లుగా మీకు కూడా ఇది నాకు తెలిసిన నాలుగుముక్కలే‌ కాని ఎవర్నీ‌ మెప్పించటానికి కాని నొప్పించటానికి కాని కావని వివ్నవించటమైనది అని చెప్పుకుంటున్నాను.

మరిమరి నిన్నే మనసున దలచుచు



మరిమరి నిన్నే మనసున దలచుచు
మురియగ భక్తులు ముచ్చటగ

చిరుచిరు నగవులు చిందులు వేయుచు
దొరలుచు నుండును నిత్యమును
పరమానందసంభరితులు వారల
నరయుట పండువ యన్నట్లు లుండు

పరమాత్మ నిను భావన చేయుచు
కురియగ కనులు పరమహర్షమున
హరిహరి రామా యనెడు వారలను
ధర నెవ్వడు గను ధన్యుడు వాడు

వసనము జారుట పట్టని వారల
కసరెడు నితరుల గాంచని వారల
దెసలను వేళలు తెలియని వారల
నసదృశుల గను నట్టిడు ధన్యుడు






17, ఏప్రిల్ 2018, మంగళవారం

నానా విధముల


నానా విధముల నేను భ్రష్టుడ
ఐనను నిన్నెఱిగితి నింక శిష్టుడ

నాదైన నాబ్రతుకు నా గొప్పదన మనుచు
నీ దయా లేశముగ నే నెఱుగనైతి
చేదోడుపడు నిన్ను చిన్నబుచ్చితి నని
లో దలపగ నీదు నీలోని దయాగుణము

భయపడుచు భయపడుచు పదిమందికిని
జయపెట్టుట మానితిని స్వామీ నీకు
దయగల దొఱవైన నీకు తప్పు తోచదే
రయమున నాకష్ట మెఱిగి రక్షించినావు

దీనుడ నను దయతోడ తీర్చిదిద్ది నావే
ఈ నాటికి మంచిదారి నెఱిగెడు దాక
దీనిని నీ దయాధర్మదివ్యబిక్ష మందు
నేనెఱిగితి రామచంద్ర నిన్నెఱిగితి నిటుల

16, ఏప్రిల్ 2018, సోమవారం

చందురు వర్ణుడు రాముడు


బంగారానికి సువర్ణము అని పేరు.ఇక్కడ వర్ణము అంటే ప్రకాశం. అంటే బంగారం  మంచి ప్రకాశం కలది అని అర్థం సువర్ణం అన్నమాటకు. అంతే‌కాని వర్ణం అంటే సాధారణంగా మనం రంగు అని అర్థం తీసి మంచిరంగు కలది అని చెప్పుకుంటే అన్వయం అంత అందంగా ఉండదు.

నిత్యజీవితంలో కూడా ఒక వస్తువు రంగు బాగుంది అని చెప్పేటప్పుడు ఆ రంగు తగినంత ప్రకాశమానంగా ఉందనే అర్థంలో చెబుతాం కదా. సాధారణార్థంలో వర్ణం అంటే రంగు అన్నప్పుడు దాని మంచి అని చెప్పి సు- చేర్చి చెప్పటం ఆరంగు ఆకర్షణీయంగా ఉందీ మనస్సుకు బాగాపట్టిందీ అని చెప్పటానికే‌ కదా. అందుకే ఇక్కడ వర్ణం అన్నదాని ప్రకాశం అనే భావనయే గ్రాహ్యం.

అదే కోవకు చెందిన సమాసమే చందురువర్ణుడు. ఇక్కడ రాముడు చందురువర్ణుడట. అంటె చంద్రుని వలే మంచి ప్రకాశం కలవాడు అని అర్థం. మంచి ప్రకాశం‌ కల వస్తువు మన కంటిని ఇట్టే ఆకర్షిస్తుంది. అవునా కాదా? అది ఏరంగు అన్నది ప్రశ్న కాదు. రాముడు చందురుని వలె మంచి ప్రకాశగుణం కలవాడని అనటం ఉద్దేశం ఏమిటట? చంద్రుడు ఎలాగైతే తన ప్రకాశం చేత అందరి మనస్సులకూ ఆహ్లాదం కలిగించి ఠక్కున ఆకట్టుకుంటున్నాడో రామచంద్రుడూ అదేవిధంగా చూడగానే మనస్సును ఆకట్టుకొనే మహానుభావుడు అని చెప్పటం.

నిజానికి చంద్రుణ్ణి చూసి నప్పుడే కాదు - స్మరించినంతనే మనస్స్సులకు చాలా ఆహ్లాదం కలుగుతున్నది! కాకపోతే చూడండి చందమామ మీదనే తిన్నగా అన్ని భాషల అన్ని దేశాల సాహిత్యాలలోనూ ఎంతో కవిత్వం‌ ఉంది. అది సాంప్రదాయయికమే కాదు ముఖ్యంగా జానపదమూ సర్వేసర్వత్రా బోలెడు. అది కాక  తిన్నగా చందమామ పైనే కాకపోయినా  ఏదో రకంగా చందమామను స్మరించే సాహిత్యం దానికి వేల రెట్లు ఉంటుంది కదా. కొంచెం ఆలోచించండి. తెలుగులోనే చందామామా అంటునే చందూరూడా అంటూనే చందామామయ్య అంటునే జానపదాలూ - సినిమపాటలూ కుప్పలు తెప్పలు.

అదే విధంగా రాముడి సంగతీను! ప్రపంచవ్యాప్తంగా రాముడి ఉన్న ఖ్యాతికి ఎందరో రంగనాయకమ్మలు వచ్చినా సరే ఎప్పటికీ‌ ఢోకా ఉండేట్లు లేదు. అనేకానేక దేశాల్లో రామకథ గొప్ప ప్రచారంలో ఉంది. అనేకాకానేకభాషల్లో రామకథ వివిధ సాహిత్యప్రక్రియల్లో నిలబడి ఉంది.  ఇక భారతీయుల సంగతి చెప్పనే‌అక్కర లేదు. నిజానికి నిన్నమొన్నటి దాకా రామాలయం లేని ఊళ్ళే ఉండేవి కావు. ఇప్పటి ఆధునికుల పోకడ వల్ల ఆమాట కొంచెంగా తప్పిందేమో తెలియదు. ఐనా రామకథ ఆధారంగా సినిమాలూ సినిమాపాటలూ ఎంతో ఆదరణ పొందాయి - ఇప్పటికీ పొందుతున్నాయి. ఎప్పటికీ పొందవచ్చును కూడా. అరవైల్లోని లవకుశను బాపూ గారు మరలా కొత్తగా సినిమా తీస్తే అది ఒరిజినల్ లవకుశతో పోటీ అవునా కాదా అన్న చర్చ అటుంచితే బహుళ ప్రజాదరణ పొందింది.

ఎందరో కవులు ఇంకా రామాయణాలు వ్రాస్తూనే ఉన్నారు. అలా వ్రాస్తూనే ఉంటారు. రామస్మరణ ఎంత ఎలా చేసినా తృప్తి కలగదు. ఇంకా చేయాలి రకరకాలుగా అనే కవులకు అనిపిస్తుంది. అనేకభాషల్లో ఇదే పరిస్థితి. మరాఠీలో కాబోలు నూట ఎనభై రామాయణ గ్రంథాలు ఉన్నాయట.

ఇప్పటికీ చిన్నపిల్లలకు అమ్మలూ నాన్నలూ రామాయణం కథ చెబుతూనే ఉన్నారు. ఫక్తు కమ్యూనిష్టు లేదా వీరహేతువాద కుటూంబాల సంగతి ఏమో‌ నాకు తెలియదు కాని ఇంకా అలాంటి బహుస్వల్పశాతం మినహాయిస్తే కొత్త తరాల పిల్లలకు రామనామమూ రామకథా అందుతూనే ఉన్నాయి.


శ్రీనిథి రామాయణం

ఇదంతా ఎందుకు చెప్పాను? నాకు రామభక్తి అనా - అది కాదు. రామనామానికి రాముడికీ‌ ఉన్న డిమాండు గురించి ఒకసారి పర్యావలోకనం చేయటానికి అన్నమాట.

అందుచేత అనేకమంది హృదయారవిందాలకు రామనామం చెవిసోకగానే రాముడు స్ఫురణకు రాగానే ఎంతోకొంత భావోద్వేగం కలుగుతున్నది.

చందురూ వర్ణుని అంద చందమును హృదయారవుందమున
జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు

అదే హృదయారవిందంలో ఆ చందురువర్ణుడైన రామమూర్తిని భావించగానే బ్రహ్మానందం అనుభవించటం అవుతున్నది. మన భక్తివిశేషంగా ఉంటే మనవిషయంలో అది సత్యం. కాకపోయినా తెలుగు పుట్టువుల దృష్టిలో రాముడు అనగానే ఎంతో కొంత ఆహ్లాదం కలుగుతుంది. చంద్రుణ్ణి స్మరించగానే ప్రజల మనస్సులకు ఆహ్లాదం కలుగుతున్నట్లుగానే.

యుగయుగాలుగా ఈ‌లాగునే అందరికీ మనస్సులలో ఆహ్లాదం పంచే వాడు కాబట్టే అయనను రామచంద్రుడు అన్నారు.

సామాన్య జనానికి బంగారం అంటే అహ్లాదం కలుగుతుందా అంటే దాని ధరమీద ఆధారపడిన సంగతి అదెంత సువర్ణం ఐనా సరే.

అందరికీ చంద్రుణ్ణి స్మరిస్తే ఆహ్లాదం కలుగుతుంది. అందుకు చంద్రుడికి మనం ఏమీ చెల్లించనక్కర లేదు కదా.

అలాగే జనానికి రామచంద్రుడిని స్మరించినా చంద్రుడిని స్మరించినట్లే గొప్ప ఆహ్లాద భావన కలుగుతుంది. చెప్పాను కదా. మన భక్తిస్థాయిని బట్టి అది నిజంగా బ్రహ్మానందం కావచ్చును. చంద్రుడి లాగే రాముడూ మననుండి ఏమీ ఆశించకుండానే తన నామరూపాలను స్మరించగానే గొప్పగా అనందం కలిగిస్తున్నాడు.


చందురుని కంటె నీ వందగాడివే


చందురుని కంటె నీ వందగాడివే
యందు కింకేమి సందియము

శృంగారరామ నీ చేసిన సృష్టి నె
బ్భంగిని నినుమించు వాడుండును
అంగజగురుడా యందాల దేవుడా
బంగారు తండ్రి ఏ వంక నీకుండు

అందమైన యీ సృష్టి యందాల నీకళల
యం దొక్కకళ కాక యన్యము కాదే
యిందుగల చరాచరము లీనీచిత్కళలో
పొందెను తదంశలౌ నందచందములు

చందురున కున్న మచ్చలు నీకు లేవుగా
చందురుడు నీ కెటుల సాటివచ్చు

నందరిని చక్కగా నాదరించెడు రామ
చందురుడా నీకిదే సాగి మ్రొక్కేము

15, ఏప్రిల్ 2018, ఆదివారం

వైదేహీవిభునకు వేదస్వరూపునకు


వైదేహీవిభునకు వేదస్వరూపునకు
కోదండరామునకు కోటిదండాలు

పరమసన్నిహితునకు పరమాత్మరూపునకు
సురగణశరణ్యునకు నిరుపమాన వీరునకు
వరమునిప్రస్తుతునకు కరుణాసముద్రునకు
తరణికులోత్తంశునకు ధర్మావతారునకు

పావనాతిపావనునకు పతితపావనునకు
జీవలోకనాయకునకు చింతితార్ధప్రదునకు
దేవారిమర్దనునకు ధీమతాంవరునకు
భావనాగమ్యునకు దైవస్వరూపునకు

నీరేజనేత్రునకు నిరుపమానశాంతునకు
వారాశినియంతకు ఘోరాసురహంతకు
కారణకారణునకు తారకబ్రహ్మమునకు
నారాయణరూపునకు శ్రీరామచంద్రునకు

ఈమధ్యయదువంశమున బుట్టి


ఈమధ్యయదువంశమున బుట్టి
    యామధ్య రఘువంశమున బుట్టి
భూమిపై రాకాసిమూకలను బట్టి
    పొగరణచితివి కాదె తొడగొట్టి

ఔరౌర రాకాసులగు వారలును దేవ
    యోనులని విందుమే దేవతల వోలె
ఆరయ ధర్మాత్ములగుటచే సురజాతి
    కన్నిటను తోడునీడై  యుండు వయ్య
కోరి ధర్మంబును గొంకు పఱచెడు నట్టి
    వారౌట నసురుల నణచేవు నీవు
తీరి కూర్చొని నిన్ను తిట్టిపోసెడు వారు
    ధారుణి నసురుల తలపింతు రయ్య

సూటిగా నొకమాట సీతామనోహరా
    నాట నీమనసున ననుబల్క నిమ్ము   
నేటి కాలము నందు నూటికో కోటికో
    నిన్ను చింతించెడు నిజభక్తుడుండు
మాటిమాటికి ధర్మమార్గమ్ము తప్పుచు
     మనుజులే దనుజులై  చెలరేగుచుండ
పాటితంబగు ధర్మభావనంబును వేగ
    పాటిగొన నీవేల పరుగున రావు
   
తప్పు చేసెడి వారి దండిచ వచ్చిన
    ధర్మావతారుడా దశరథ రామ
తప్పులే‌ బ్రతుకైన ధరపైని రాజుల
    గొప్ప లణగించిన గోపాల కృష్ణ

ఇఫ్ఫుడీ ధరమీద నెందరో దనుజులై
    తిప్పలు పడగ నీ దేవి భూదేవి
చప్పుడు చేయక చక్కగా లచ్చితో
    సరసల్లాపాలు సాగింతు వేమి

ఎందుకు నరులార యీ యాతనలు



ఎందుకు నరులార యీ యాతనలు చే
యందించుచు మనకు గోవిందుడు లేడా

పరమసుఖాకరములు పరమపవిత్రంబులు
హరిదివ్యనామములే యబ్బి యుండగ
నరులార నాలుకలకు నానా నామముల
పరిపరి ప్రాకృతికముల పట్టించ నేటికి

హరియిచ్చిన రామనామ మమృతమై మీకు
పరము నిహము హాయిగా పంచుచుండగ
నరులార యితర మంత్రములజోలి యేల
పరమాన్నము వదలి గడ్డి భక్షిించ నేటికి

అరవచాకిరి చేసి యాస్వామి యీస్వామి
పరమార్థము లేనట్టి పనుల పంచగ
పరితోషమిచ్చు రామబ్రహ్మమును విడచి
హరికి దూరమై చిత్త మల్లాడగ నేటికి

పరితోషమిచ్చు రామబ్రహ్మమును మఱచి
పరమార్థవిదూరతత్త్వభావనంబుల
నిరతము బోధించు లొట్టగురువుల జేరి
యరవచాకిరితో నాత్మ లల్లాడగ నేటికి

14, ఏప్రిల్ 2018, శనివారం

కీటో జెనిక్ డైట్ గురించి

ఈరోజు 2018-04-14న పల్లెప్రపంచంలో ఈ కీటోజెనిక్  డైట్ (కీటోడైట్ క్లుప్తంగా చెప్పాలంటే)   పైన పుంఖానుపుంఖాలుగా వస్తున్న సమాచారాన్ని గురించి ఈ క్రింది వ్యాఖ్యను ఉంచాను:

శ్రీరామకృష్ణ గారు కాని, మీరు కాని వైద్యరంగనిపుణులు కారు. ముఖ్యంగా ఎండోక్రైనాలజీ రంగానికి సంబంధించిన పరిజ్ఞానం ఉన్నవారు కాదు.

మీరు ప్రచారం చేస్తున్న ఆహారవిధానాన్ని కీటోడైట్ అంటారు. సరే ఏదో ఒకటి. ఇది పాటించటం వలన కలిగే అద్భుతఫలితాల గురించి రామకృష్నగారు ఎలాగూ ఊదరగొడుతున్నారు. మీరూ ఆయనవిధానానికి ప్రచారకార్యకర్తృత్వం వహిస్తున్నారు. ఈ విధానం దీర్ఘకాలంలో ఎలాంటి ఫలితాలనిచ్చేదీ అన్నవిషయంపై ఇంకా కూలంకషంగా పరిశోధన జరగవలసి ఉంది.అది జరుగకుండా ఏదీ మా అమ్మగారు వాడారూ, మా స్నేహితులు వాడారూ మీరందరూ వాడండీ అని ప్రచారం చేయటం సరైనదిగా అనిపించదు. అది పధ్ధతి కూడా కాదు. అది శాస్త్రీయవిధానం అస్సలు కానేకాదు. కాని మీ దృష్టిలో అదే సరైన విధానం - ఎందుకంటే మీకు వైద్యపరిశోధనా విధానం గురించి అవగాహన లేకపోవటమే కారణం. దురదృష్టం ఏమిటంటే ఒకరంగంలో సాధికారికంగా మాట్లాడాలంటే ముందు ఆరంగంలో నైపుణ్యం ఉండాలన విషయం మీరు ఒప్పుకోరు. మీ‌ నమ్మకాలే మి దృష్టిలో నిజాలు! అంతే.

రాబోయే కాలంలో ఏమైనా దుష్పరిణామాలు వెలుగులోనికి వస్తే, ముఖ్యంగా తీవ్రమైన పరిణామాలు ఎదురైతే ? వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి?

రామకృష్ణ గారే కాదు, మీలాంటి ప్రచారసారధులూ‌ ఆ దుష్పరిణామాలకు సంపూర్ణంగా బాధ్యులే అన్నది మరవకండి. అప్పుడు మీరు ఎన్ని కొత్త వ్యాసాలు వ్రాసినా ఎంత దిద్దుబాటు ప్రచారం చేసినా జరిగిన నష్టం పూడ్చలేనిదే అవుతుంది. అది మరొక థలిడోమైడ్ ట్రాజెడీగా సంఘాన్ని దెబ్బకొట్ట వచ్చును! ఆలోచించండి.

మీ‌ ప్రచారపుహోరులో వైద్యరంగం పైనా వైద్యులపైనా కూడా కొన్ని అనుచితవ్యాఖ్యలు - ముఖ్యంగా దొంగడాక్టర్లు వగైరా అంటూ - చూసాను. ఇదంత సరైన పధ్దతి కాదు. ఎట్టిపరిస్థితుల్లోనూ‌ కాదు.

మీ దృష్టిలో మీరు నూటికినూరుపాళ్ళు ప్రజాసేవకులమని భావిస్తున్నారని అనిపిస్తున్నది. కాని తమకు తెలియని రంగాల్లో వేళ్ళూ కాళ్ళూ పెట్టి జనానికి హితబోధలు చేయటం అంత హర్షణీయమైనది కాదు.

ఇలా వ్రాసినందుకు మీకు ఆగ్రహం కలుగవచ్చును. దానికి నేనేమీ చేయలేను. నా అభిప్రాయాన్ని నిర్మొగమాటంగా తెలియజేయాలనే తప్ప మీపైన ఏమీ దురుద్దేశంతో వ్రాయలేదని గమనించవలసినదిగా అభ్యర్థిస్తున్నాను.

శ్రీ కొండలరావు గారి నుండి సమాధానం ఇలా వచ్చింది:

మీ వైఖరి గతంలోనూ నాకు తెలుసుకనుక మీరిలా మాత్రమే చెప్పగలరు. జ్ఞానం కొందరికే తెలుసునన్న అహంకారపు వైఖరి అలా మాట్లాడిస్తుంది. అది మీరు కావచ్చు. ఇంకొకరు కావచ్చు. మీరు పూజించే దేవుడు రామాయణాన్ని మీవంటి అద్భుత మహా పండితులు కాకా బోయవాడైన వాల్మీకే వ్రాశాడంటారని మీ వంటి పండితులు చెప్తుండగా నేను విన్నాను. రామక్రుష్ణ కూడా బోయవాడిలాంటి వాడే. ఆయన డాక్టర్లను విమర్షించడం లేదా వారి పాత్రను తక్కువ చేయడం లేదు. నేను కూడా డాక్టర్లు దొంగలు అనలేదు. కొందరు దొంగ డాక్టర్లు అన్నాను. దానికి కట్టుబడి ఉన్నాను. డాక్టర్లలోనూ నీచులు, దుర్మార్గులు, దౌర్భాగ్యులు ఉన్నారు. వైద్యం పేరుతొ సమాజాన్ని ఎంత చిన్నా భిన్నం చేస్తున్నారో, బ్రతకలేక చావలేక సామాన్య మధ్య తరగతి ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో, పడ్డా వాలాది ఖర్మఫలమని వదిలేయాలనుకునే మీ వంటి ప్రబోధకులు ఆలోచించరు. అలా చేయడం పాపమనుకునే బాపతు కాదా మీరు. దయచేసి క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఫలాయనవాదం చేయకుండా..... నేను చర్చకు సిద్ధం. 

1) ఫలితాన్ని మించిన శాస్త్రీయత ఏముంది? 
2) ఇపుడు షుగర్ కు, గుండె జబ్బులకు వాడుతున్న మందుల వల్ల వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ కు సమాధానం ఏమి చెప్తారు మీలాంటి మహా విజ్ఞానులు?
3) ఇప్పటిదాకా కోడిగుడ్డు ఎల్లోని ఎవరు ఎందుకు తినోద్దన్నారు? ఫేట్ ని నెయ్యి, మీగడ వంటి వాటికి ఎవరు దూరం చేసారు?
4) మళ్ళీ ఇపుడు తూచ్ కోడిగుడ్డు ఎల్లో తినాలి అని చెప్తున్నదెవరు?
5) డాక్టర్లు సైతం వారి ఫెమిలీలను, స్వయంగా వారి శరీరాలను నాశనం చేసుకున్నారు. కేవలం వారు మెడికల్ గైడ్లిన్స్ ప్రకారమే నడుచుకుంటారు. వారికా పరిధి ఉంది. కాదంటారా? చదివింది బట్టీ పట్టి అప్పజెప్పడానికి, పరిశీలన ద్వారా కనుక్కొవడం సైన్సె అవుతుందని మీవంటి మేధావులు గుర్తించాలని మనవి. ప్రక్రుతిలో ఉన్నదానినే సైన్స్ కనుక్కోగలదు తప్ప సైన్స్ ప్రక్రుతిని స్రుష్టించలేదని గుర్తించాలి. మేధావులు, జ్ఞానులు మాత్రమే ఏదైనా చెప్పాలనుకునె మూర్ఖత్వం అంత మంచిది కాదు. మేధావులు, జ్ఞానులు సైతం సామాన్యులనుండీ, ప్రక్రుతినుండీ నేర్చుకోవలసిందే.
6) కొన్ని దశాబ్దాలపాటు కోడిగుడ్డు ఎల్లో తినోద్దన్న డాక్టర్లు, ఇపుడు తినమని చెప్తున్నారు. ఫేట్ వలన గుండె జబ్బులు రావని తేల్చారు. మరి అప్పటి గైడ్లైన్స్ ఎందుకలా చెప్పారు, మీరు మొత్తుకునే సైన్స్. ఇపుడు అదే సైన్స్ ఇపుడిలా ఎందుకు చెప్తున్నది? ఇందులో డాక్టర్ల ను తప్పు పట్టాల్నా? మెడికల్ గైడ్లైన్స్ ని తప్పు పట్టాల్నా? దీనివల్ల ఇన్నాళ్లూ కొన్ని కోట్లమంది బలయ్యారు. లక్షల కోట్ల మెడికల్ మాఫియా జరిగింది. దానికి మీరు ఏమి చెప్తారు శ్యామలీయం గారు.
7) అసలు మీకు జీవన విధానం కు , వైద్య విధానం కు తేడా తెలుసా?
8) రామకృష్ణ విధానం ను పూర్తిగా స్టడీ చేసారా?
9) రామకృష్ణ మందులు వాడకం గురించి చెప్తున్నారా? ఆహార నియమాలు గురించి చెప్తున్నారా? నేను స్టడీ చేసే ప్రచారం చేస్తున్నాను. మీవంటి వారి అనుమానాలను, జ్ఞానం కొందరి సొత్తే కావాలని ఆశించేవారి వైఖరిని నేను సమర్ధించను. భయపడను.
10) రామకృష్ణ సూచించిన ఏ పదార్ధం వలన ఏ అనర్ధం ఉంది? భవిష్యత్తులోనైనా అనర్ధం వచ్చే అవకాశం ఉందీ చెప్పగలరా? ప్రకృతి సిద్ధమైన ఆహారం మనిషికి ఎపుడూ కీడు చేయడాన్న ప్రాధమిక సత్యాన్ని సైతం మీరు ఒప్పుకోరు. ఎందుకంటే మీకు తెలిసిందే జ్ఞానం. మీరు చెపితే జ్యోతిష్యం కూడా శాస్త్రీయం అయి తీరాలి. లేకుంటే కూడదన్న మొండి వైఖరి మీది.
11) ఈ విధానం ను ప్రచారంలోకి తెచ్చింది రామకృష్ణ కాదు వైద్యులే నన్నది, ఇప్పటికే వైద్యులు దీనిని ఆమోదిస్తూ తమకు తమ పేషంట్లకు చక్కని ఫలితాలు రాబడుతున్నది గమనించారా? కెనడాకు చెందిన జాసన్ ఫంగ్ దీనిని బయటకు తెచ్చారు. ఆయన వైద్యుడే. కొన్ని వందల ఏళ్లుగా కీటో డైత్ గురించి తెలిసినా మెడికల్ గైడ్లైన్స్ ఎందుకు ప్రచారం చేయడం లేదు. వైజాగ్ కు చెందిన పి.వి.సత్యానారాయణ గారు ప్రముఖ వైద్యులే. ఆయన ఈ విషయంలో డాక్టర్లు అప్డేట్ కావాలని చెప్తున్నది మీరు గమనించారా? నాకు తెలిసి మీరు ఈ విషయాన్ని అధ్యయనం చేయకుండా ప్రతిభా పాఠవం కోసమె కావాలని విమర్షిస్తున్నారు. కాదంటారా? అద్యయనం చేస్తే ఈ విధానంలొ ఏమి తప్పు ఉంది చెప్పండి? దానినీ ప్రచారం చేస్తాను.
12) డాక్టర్ పి.వి.సత్యానారాయణ స్వయంగా పాటించి ఫలితం పొంది, పేషంట్లకు మంచి ఫలితాలు అందిస్తున్నారు ఈ విధానం తోనే నన్నది మీకు తెలుసా?

మంచిని ప్రచారం చేయడానికి నేను ఎపుడూ ముందే ఉంటాను. నేను వాడి ఫలితం పొందాను. నాకు తెలిసిన వందాలది మంది ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతున్నది. డాక్టర్లే ప్రిస్క్రిప్షన్లొ దిక్కుమాలిన మందులు బదులు ఆహారం గురించి వ్రాసేలా మంచి రోజులు రావాలని ఆశిద్దాం.

ఐతే ఆయన, తన వ్యాఖ్యను ఉపసంహరించుకొని మరలా ఇలా అన్నారు:

మీ ప్రశ్నకు కాస్త సమయం తీసుకుని సంయమనంతో సమాధానం చెప్తాను. ముందొక కామెంట్ వ్రాసాను. దానిని డిలీట్ చేసాను.

సరే, కొండలరావు గారు సంయమనంతో ఏదో చెబుతానన్నారు కాబట్టి వేచి చూడాలి. ఆయన తొలగించిన వ్యాఖ్యను ఎందుకు ప్రచురిస్తున్నట్లు నా బ్లాగులో? ఎందుకంటే అది ఆయన తన బ్లాగులో ఉంచిన వెంటనే కాక కొద్ది సమయం తరువాత తొలగించారు. అప్పటికే అది మాలికలో ప్రచురితం ఐపోయింది. ఈ సమయం (సా॥5గం.)లో కూడా అదింకా కనిపిస్తూనే ఉంది. చదివే వారు చదువుతూనే ఉన్నారు. కాబట్టి నేను దానిని ఎత్తి నా బ్లాగులో చూపటంలో దోషం లేదనే భావిస్తున్నాను. (గమనిక:  కొండలరావు గారు తొలగించిన వ్యాఖ్య ఏప్రిల్ 15వ తారీఖున 9:45 ని. సమయంలొనూ కనిపిస్తూనే ఉంది మాలికలో. అంటే తొలగింపులను మన బ్లాగుల్లో చేసినా మాలిక పట్టించుకోదు! ఇది అందరమూ గమనించ వలసిన ముఖ్యవిషయం.  ఒకసారి మాలికలోనికి వచ్చేసిన వ్యాఖ్య కొట్టుకుపోవాలంటే కొన్ని రోజులు పట్టవచ్చును!)

నా వ్యాఖ్యనూ కొండలరావుగారు (కొంత తక్కువ సంయమనంతోనే అనుకోండి) చేసిన ప్రతివ్యాఖ్యనూ చదివి ఎవరికి తోచిన అభిప్రాయానికి వారు రావచ్చును. నా వైఖరిలో ఉన్నదో ఆయన సమాధానంలో ఉన్నదో సవినయత అన్నది ఎవరి కళ్లతో వారు చదువుకొని ఎవరి మనస్సులో వారు నిశ్చయించుకొన వచ్చును.

ఈ కీటోడైట్ గురించి నేను గమనించిన కొన్ని వ్యాసాలను ఇక్కడ పొందు పరుస్తున్నాను.

 (November 15, 2005) Ketogenic Diet Prevents Seizures By Enhancing Brain Energy Production, Increasing Neuron Stability

(November 17, 2015) Endurance athletes who 'go against the grain' become incredible fat-burners

(January 12, 2017) Melanoma mutation likes fat for fuel

(February 28, 2017) Could a ketogenic diet alleviate gout?

(February 27, 2017) Ketogenic diet shown safe, effective option for some with rare and severest form of epilepsy

(May 26, 2016) Fasting-like diet reduces multiple sclerosis symptoms

(Sep 5, 2017 Eat fat, live longer? Mouse study shows a high fat diet increases longevity, strength.

(Apr 14, 2016) Lower-carb diet slows growth of aggressive brain tumor in mouse models











ఇంకా చాలానే పరిశోధనా పత్రాలున్నాయి పరిశీలించవలసినవి.  వీలైనంత వరకూ దొరికిన వన్నీ కూడా ఇక్కడ పొందుపరుద్దామని అనుకుంటున్నాను. అందుచేత ఈటపా సమగ్రం కాదు. ఎప్పటికీ కాకపోవచ్చును. ఎప్పటికప్పుడు కొత్తలింకులు కలుపుతూ ఉంటాను కాబట్టి.

ఈ పరిశోధనాపత్రాలను గిరించి వీలైనంత సరళంగా తెలియజేయాలనే సంకల్పం ఐతే మంచిదే కాని అది నాకు వీలుపడక పోవచ్చును. ఇప్పటికే పనులవత్తిడి వలన ఊపిరి ఆడని పరిస్థితి. ఐనా ఉండబట్టలేక కొండలరావు గారికి ఒక ఉబోస ఇచ్చి చీవాట్లు తిన్నాను. ఇది ఒక పెద్ద చర్చ ఐతే నేను ఆఫీసుపనులు మానుకొని లేదా ఇంటిపనులు మానుకొని సమాధానాల మీద సమాధానాలు వ్రాస్తూ తప్పనిసరైన రక్షణాత్మకధోరణిలో వ్రాస్తూనే ఉండవలసి వస్తుంది. అలాంటి అవకాశం ఏమీ లేదు.

ముగించే ముందు ఒక మాట. కొండలరావు గారి రాబోయే సమాధానాన్నీ ఇక్కడ (అది వచ్చినప్పుడు) పొందుపరచటం అవసరం. అలా చేస్తాను కూడా. ఐతే ఈ వ్యవహారం పేరుతో ఆయనతో కాని మరొకరితో కాని చర్చలు చేస్తూ కూర్చోవటం కుదరదని చెప్పనవసరం లేదు.

13, ఏప్రిల్ 2018, శుక్రవారం

మగడో పెండ్లామో మాటిమాటికి


మగడో పెండ్లామో మాటిమాటికి
నగు గాని భోగాశ తెగదు దేహికి

ఎంత భోగించితే నీ దేహి కామము
కొంతతీరు ననిచెప్ప గూడని దాయె
నంతకంతకు పెరుగు నంతియె కాక
చింతించునే పరము చిత్తములోన

ఒకరికొకరు తామనే యూహయె కాని
యొకనాడును దేవుడే యూహకు రాడు
తగులుకొన్న వారలు తరలిన నైన
తెగదుగా భోగాశ దేహికి రామా

ఎన్నడో యొక దేహికి యీ భోగాశ
యన్నది దిగజారగ నాపై నీపై
తిన్నగా దృష్టి నిలిచి దివ్యపదమున
చెన్నొందు తిరుగుటుడిగి సృష్టిలోపల


నిన్ను నేను మరువక



నిన్ను నేను మరువక నన్ను నీవు విడువక
యన్నా యీ‌యెడబా టన్న దెట్లు కలిగె

మనమధ్యన మాయ తెఱ మంచిది కాదయ్య
తనయంతట తానది మనమధ్యన దూఱిన
మనమిర్వురమును దాని పనిబట్టుట మేలు
మునుకొని నీవటు చేయుదువని నేను ప్రార్థింతు

నేలపైకి వచ్చుట నేను చేసిన తప్పు
యీలాగున కాలచక్రమింత కఠినమైన
జాలమును పన్ను టెఱుగ జాలనైతినే
యేలాగున నైన బయట కీడ్చుమని ప్రార్థింతు

మనుజులలో కలిగిన మహావిష్ణుదేవుడా
నను విడువని దేవుడా నారామచంద్రుడా
వెనుకటి వలె నిన్ను కలసి వేడ్కమై యుండ
కనికరించు మని యిదే‌ కడుగడు ప్రార్థింతు


ఇంతింతన రానట్టి దీతని మహిమ



ఇంతింతన రానట్టి దీతని మహిమ
ఎంతవారి కైన భావ్య మీతని మహిమ

చెడుగు మీద పిడుగై చెలగెడు మహిమ అది
చెడినబ్రతుకు చిగురింప జేసెడు మహిమ
అడిగితే రాజ్యమిచ్చు నట్టిదా మహిమ అది
యడుగకయే రాజ్యమిచ్చు నట్టి దొడ్డమహిమ

యేవారి కైన సుఖమిచ్చెడు మహిమ అది
భావించిన భవరోగము బాపెడు మహిమ
సేవకుని బ్రహ్మనుగా జేసెడు మహిమ అది
దేవతలకు నిత్యసంభావనీయ మహిమ

ఇనకులేశుడు రాము డీతని పేరు ముక్తి
ధనము నిచ్చి ప్రోచు నీతని దివ్యమహిమ
మనుజుడై పుట్టిన మహావిష్ణు వితడు వీని
మనసార గొలువుడీ మంచి జరుగును


11, ఏప్రిల్ 2018, బుధవారం

నమ్మితే కలడు నీకు



నమ్మితే కలడు నీకు నారాయణుడు నీవు
నమ్మకున్న నీకు కలడు నారాయణుడు

నానా దిక్కుల గలడు నారాయణుడు తాను
నానా జీవుల గలడు నారాయణుడు
జ్ఞానరూపు డైనట్టి నారాయణుడు సృష్టి
లో నిండియున్నాడు కానరాకుండ

నామరూపముల కవలి నారాయణుడు కోటి
నామముల వెలుగొందు నారాయణుడు
నామరూపములు దాల్చి నారాయణుడు సీతా
రాముడై వచ్చె లోకరక్షణార్ధమై

ధారాళమైన సుఖము నారాయణుడు నీకు
కోరినంతగా నిచ్చు నారాయణుడు
వైరాగ్యము గలవారికి నారాయణుడు వారు
కోరునట్టి ముక్తినే కొసరెడు వాడు

చదువులచే ప్రజ్ఞ


చదువులచే ప్రజ్ఞ మీకు సంభవించుచో
చదివెడు వారందరకు సంభవించదేమి

తెలియుటకు తగినంత దేవుడొకనిలో
కలిగించక సత్త్వమును గ్రంథము లెన్ని
తలక్రిందులుగా చదివి తహతహలాడి
తెలియున దేమైనా కలదా చెపుడీ

మెలమెల్లగా జీవి మేదిని మీదను
పలు యుపాధుల లోన మెలగుచు తాను
కొలదికొలది తెలియుచు గూఢతత్త్వమును
తెలిసినవే చదువుపేర తెలియును మరల

పోరినంతనే చదువు బుధ్ధి కెక్కదు
మీరున్న స్థితిని బట్టి మీకెఱుకగును
శ్రీరాముని దయగల జీవిక్షణములో
నేరుగా మోక్షవిధ్య నేర్వగలుగును

9, ఏప్రిల్ 2018, సోమవారం

నరులకష్టము లన్ని నారాయణ


నరులకష్టము లన్ని నారాయణా నీవు
నరుడవై  తెలిసితివి నారాయణా

పరమపురషుడ వయ్యు నారాయణా గర్భ
    నరకమున జొచ్చితివి నారాయణా
దురితాత్ములను గూల్చ నారాయణా నీవు
    ధరమీద కలిగితివి నారాయణా
పరిణయవేళనే నారాయణా నీకు
    పరశురాముడు తగిలె నారాయణా
ధరనిచ్చుటకు మారు నారాయణా నిన్ను
    తరిమిరే యడవులకు నారాయణా

అడవి నసురుల వలన నారాయణా నీకు
    పడరాని పాట్లాయె నారాయణా
కడకొక్క తుంటరి నారాయణా సతికి
    నెడబాపెనే నిన్ను నారాయణా
కడచి వారాన్నిధిని నారాయణా తుళువ
    మడియించితివి నీవు నారాయణా
పుడమి నేలెడు వేళ నారాయణా సతిని
    విడువవలసి వచ్చె నారాయణా

ఈ రీతిగా నీకు నారాయణా పుడమి
    ఘోరాపదలు గలిగె నారాయణా
ధీరత్వమును జూపి నారాయణా ధర్మ
    వీరత్వమును జూపి నారాయణా
ఆరాధ్యదైవమై నారాయణా మాకు
    దారిచూపితి వయ్య నారాయణా
శ్రీరామచంద్రుడని నారాయణా నిన్ను
    నోరార పొగడెదము నారాయణా

8, ఏప్రిల్ 2018, ఆదివారం

ఎందరో రాజన్యు లెత్తలేని వింటిని


ఎందరో రాజన్యు లెత్తలేని వింటిని
అందగా డెత్తెనే యవలీలగ

శివుని తేజ మందు నిక్షిప్థమై యుండగ
యెవరెవరో వచ్చి దాని నెత్తనేర్తురే
చివరకు శ్రీరాముడై శ్రీమహావిష్ణువే
యవలీలగ నెత్తగలిగె నంతియె కాక

శివభక్తుడు జనకునింట శ్రీమహాలక్ష్మియే
అవతరించి సీతగా నలరారగ
నెవరికైన శివధనువు నెత్త వచ్చునే
అవలీలగ రాముడెత్తె హరి తానె గాన

హరిహరుల కబేధము నాత్మలో నెఱుగుడు
హరచాపము నెత్తెడు నరపతి గలడే
హరుడెత్తు హరియెత్తు నంతియె కాన
హరి రాముడై దాని నవలీలగ నెత్తె

ఎవరు చూచిరి



ఎవరు చూచిరి నరక మెటనున్నదో
యెవరు చూచిరి స్వర్గ మెందున్నదో

తనవారు లేనట్టి ధరణియే నరకమ్ము
పనిగొని వేధించు వారె యమభటులు
తన చిత్తక్షోభమే తనకు నరకశిక్ష
వినరయ్య నరకమన వేరొక్క టేడ

తనపురాకృతమున దైవమనుకూలమై
తనవారిజేసెనా ధరణిపై జనుల
తనయునికి స్వర్గమై తనరారు గాక
వినరయ్య స్వర్గమన వేరొక్క టేడ

జనులార దేవుడన జానకీపతి డని
మనసులో‌ నెఱిగిరా మరి చింత లేదు
కన నింక స్వర్గ నరకమ్ములే లేవు
వినరయ్య మోక్షమే‌ విశదమై యుండు


ఎంత మంచివాడ వయ్య యీశ్వరుడా


ఎంత మంచివాడ వయ్య యీశ్వరుడా మా
చింతలన్ని దీర్చినా వీశ్వరుడా యీశ్వరుడా

అందాల భూలోక మద్భుత మపురూపమని
చిందులు వేయుచుండ చిటికలోన
నెందుండి వచ్చు నీ యెనలేని కష్టాలని
కొందలపడు మాకు నీవు కూర్చితి వొక యాశను

మాకోసము దిగివచ్చి మాలోన తిరిగితివి
యేకష్టమైనను నెదురుకొంటివి
మాకు నీ చరితమే మంచిపాఠ మాయెను
మాకు నీ నామమే మంత్రరాజ మాయెను

ఏమయ్యా వెన్నుడా యెంతమంచి వాడవు
నీ మేలెన్నడు మేము మరువము
రాముడవై నీవు వచ్చి రక్షించి నావయ్య
యీ‌మానవజాతి చింత లిట్టె తీర్చితివి


7, ఏప్రిల్ 2018, శనివారం

పరమాద్భుతంబగు వేషము



పరమాద్భుతం బగు వేషము పరమాత్ముని నరరూపము
నరజాతికి చిరకాలము స్మరణీయమా ఘనచరితము

సుర లందరు చనుదెంచి ఓ‌పరమాత్మ ఆ దశకంఠుని
పరిమార్చగ నరరూపము ధరియించవే యని వేడగ
కరుణించి యా సురజాతిని కరుణించి మానవజాతిని
హరి వచ్చెను సిరి సీతగా యరుదెంచగ తనవెంబడి

ఇనవంశ మందున రాముడై జనియించెను ఘనశ్యాముడు
మునిరాజుల ఘనమైన దీవన లందెను రఘుబాలుడు
ఘనరుద్రచాపము నెక్కిడి జనకాత్మజ సీతను పొందెను
తనతండ్రి యానతిమేరకు వనవాసదీక్షను పూనెను

హరిణాక్షి సీతను మ్రుచ్చిలి యరిగె నట పౌలస్త్యుడు
హరి కయోనిజ జాడను మరుతాత్మజు డెరిగింపగ
శరనిధి వైళమ దాటి ఆ దురితాత్ముని తెగటార్చెను
సురలందరు నుతియించగ ధరణిజతో ధరనేలెను

6, ఏప్రిల్ 2018, శుక్రవారం

రామకీర్తనమే రమ్యభాషణము


(దేవగాంధారి)

రామకీర్తనమే రమ్యభాషణము
నీ‌మాట లటులుండ నేర్వవలె

కామాసక్తత కామినులను జేరి
యేమని పొగడే వెల్లపుడు
కామము తీరేదా కాయము నిలిచేదా
రామ రామ విరక్తి కలుగదా

పామరత్వమున పరిపరివిధముల
సామాన్యులగు తామసుల
నేమని పొగడేవో మేమి గడించేవో
రామ రామ తుది నేమి మిగులునో

ఏమంత్రంబుల నెంతపఠించిన
నాముష్మిక మది యంతంతే
కామితమగు మోక్షము కలిగించవు
రామ రామ ఈ భ్రమలు మానుమా



5, ఏప్రిల్ 2018, గురువారం

చిరునగవు మోమున చిందులాడుచు



చిరునగవు మోమున చిందులాడుచు నుండు
కరుణామయుడ నన్ను కరుణించవే

యజ్ఞభావిత రామ యజ్ఞసంభవ రామ
యజ్ఞరక్షక రామ యజ్ఞేశ రామ
యజ్ఞవర్థన రామ యజ్ఞాంగ శ్రీరామ
విజ్ఞాపనము నీవు విని నన్ను బ్రోవవే

సర్వవిజ్జయ రామ సర్వమోహన రామ
సర్వార్థప్రద రామ సర్వేశ రామ
సర్వకారణ రామ సర్వజ్ఞ శ్రీరామ
సర్వవాగీశ్వరేశ్వర నన్ను బ్రోవవే

మునిజనాశ్రయ రామ ఘనవిక్రమ రామ
జనకజా పతి రామ జననాథ రామ
వనజనేత్ర రామ శిష్టేష్ట శ్రీరామ
ఘనదుఃఖవారక నను వేగ బ్రోవవే


4, ఏప్రిల్ 2018, బుధవారం

భూమిపై నాకింక పుట్టు వుండక చేసి


(అఠానా)

భూమిపై నాకింక పుట్టు వుండక చేసి
రామచంద్రా నీవు రక్షించవయ్య

కామాదులకు దాసగణములో వాడను
తామసుడను నేను ధర్మమ్ము లెఱుగను
సామాన్యుడను నేను నీమమ్ము లెఱుగను
నీ మహిమచే నాకు రామనామం బబ్బె

చిన్నతనము నుండి యన్నివేళలను
వెన్ను గాచుచు నన్ను విడువక రక్షించు
నిన్ను మదిలో నమ్మి యున్నాను నీకంటె
నెన్నడును హితునిగా నెన్న వేరొకరిని

నీ వీలాసము చేత నెగడు విశ్వంబున
జీవులు నీమాయ చింతించ నేర్తురే
భావించి లెస్సగా భవబంధ ముడుప
కావున నాపైన కరుణ జూపవయ్య


ముందు వెనుకలె కాక


ముందు వెనుకలె కాక యందరు హరిపద
మందుదు రిందుకు సందియమేల

వేరువేరు దారుల వేదపర్వత మెక్కు
వారందరు హరి వద్ద చేరెదరు
శ్రీరమణుని చేరు జీవుల మధ్యన
తారతమ్యా లెంచ దగునా మనకు

దానధర్మంబులు తాపసవృత్తులు
పూని యోగరత బుధ్ధులును
మానని వారును కానని వారును
మానక హరినే మరి చేరెదరు

పరమనిష్ఠగ రామభద్రుని గొలుచుచు
మరువక రామనామస్మరణమును
నరుడెవ్వ డుండు వాడు నారాయణుని
పరమపదమిదే పట్టుచున్నారు


ఒప్పులేమి లేవాయె తప్పులేమొ కొల్లలాయె


ఒప్పులేమి లేవాయె తప్పులేమొ కొల్లలాయె
నిప్పు డెమి చేయువాడ నీశ్వరుడా

తప్పునొప్పు తెలియ జెప్పు ధర్మాత్ము డెవడైన
నెప్పుడైన నొక్కమాట చెప్పినప్పుడు
తప్పుబట్టి యట్టివాని తరిమివేసితిని కాన
నిప్పు డెవరిని బోయి యేమని యడుగుదు

అక్కటా యీ తనువనగ నొక్క యోటి కుండ యని
యొక్కనాడు తలపనైతి నోరయ్యో మోసపోతి
చక్కగా శృంగారించి చనువిచ్చి గారవించి
చిక్కి కాలమునకు నేడు చింతించుచుంటిని

రామరామ యని యంటె రక్షింతు వని వింటి
నీమముగ నిపుడు నేను నామము చెప్పుచుంటి
యేమైన నీవే దక్క యెవరును లేరు కావ
నా మనవి విని నీవు నన్ను కాపాడ వయ్య


3, ఏప్రిల్ 2018, మంగళవారం

కల లెటువంటి వైన కనుటను మానేవా


కల లెటువంటి వైన కనుటను మానేవా
తెలవారి  నిజమైన కలలను కన్నావా

కలలోన యిలలోన కనబడు లోకమిదే
కలబడి దీనియందే గడపే వీవు
కలపైన పెత్తనము కానిపని యైనటులె
యిలపైన నీ గొప్ప యింతింతేను
 
కలవలె జీవితము కరిగిపోవుచు నుండు
తలచి నట్లుండు మన్న దానుండదు
కలిగిన బ్రతుకిది కలవంటిదే యన్న
తెలియ జీవుడె సుమ్మ కలగను వాడు

కలలు నిజములు కాని కరణిని జీవుల
కలలైన రాకపోకలు నని తెలియుము
కలలుడుగు రాముని కరుణ లభించిన
వలచి రాముని చేరవలయును నీవు


నవ్వులపాలు కాక


నవ్వులపాలు కాని నరు డెవ్వడంటే
యెవ్వడా రామునే యెంచునొ వాడే

గరువము కలిగె నేని కాలము నవ్వును
సిరులను వలచె నేని ధరనవ్వును
తరుణుల వలచె నేని దహనుడు నవ్వును
నరుడ నీ బ్రతు కిటుల నవ్వుల పాలు

తిరము యశమనుకొన్న దిక్కులు నవ్వును
పురుషుని మరువ ప్రకృతి నవ్వును
పరుల గొలిచు నేని హరియే నవ్వును
నరుడ నీ బ్రతు కిటుల నవ్వులపాలు

సుర లధికు లన్న పరమాత్మ నవ్వును
పురమును వలచిన బుధ్ధి నమ్మును
హరినే మరచె నేని యాత్మయె నవ్వును
నరుడ నీ బ్రతు కిటుల నవ్వులపాలు







ఏ మంత సద్బుధ్ధి యితరుల గొలుచుట


ఏ మంత సద్బుధ్ధి యితరుల గొలుచుట
రాముడు హరి యని తామెఱిగియును

తలపై సూర్యుడు ధగధగ లాడగ
వెలిగింతురే దివియలు తాము
ఫలహారములతోడ పరితృప్తు లగుదురె
యిల రాజాన్నము గలిగియును

నరపతి నేస్తుడై యరసి రక్షింపగ
నొరుల నెయ్యంబుల కురికెదరె
సురవిటపి తమ పెరటి చెట్టై యుండ
పరు లిచ్చు కాసులు వలచెదరె

జీవుల రక్షించు శ్రీహరి యుండగ
దేవురించెదరే దేవతల
మీవాడు హరి మరి మీరు తారకమంత్ర
భావనలో నుండి పండవలె


నీవాడను కాన నిన్నడిగెద కాక



నీవాడను కాన నిన్నడిగెద గాక
యేవారి నడిగెద నీమాట

నీవ కర్తవు గాన నిన్నడుగెద గాక
యేవారి నడిగెద నీ మాట
కావలసినంతగ కావించిన సృష్టి
నీ వస లెందుకు నిలిపితి వయ్యా

నీవ భర్తవు గాన నిన్నడిగెద గా క
యేవారి నడిగెద నీ మాట
జీవులచే నీవు చేయించు పనులకు
జీవుల కర్తల చేసెద వేలయ్య

నీవ హర్తవు గాన నిన్నడిగెద గాక
యేవారి నడిగెద నీ మాట
జీవభావమణచి శ్రీరామ నీవీ
జీవు నెప్పుడు లో జేర్చెదవయ్య

1, ఏప్రిల్ 2018, ఆదివారం

ఇచ్చి నరాకృతిని



(మోహన)

ఇచ్చి నరాకృతి నింతో యంతో
యిచ్చితివి భక్తి నివి చాలు రామా

నానామాటలు నాలుక నుంచక
నీ నామమునే నిలిపితి వయ్య
దానను మిక్కిలి ధన్యుడ నైతిని
నీ నిస్తులకృప నిర్వ్యాజము గద

తేలక నీ కలి తివుచు మాయల
రేలుబవళ్ళును మేలుగ నిన్నే
నాలో దలచే నయమగు బుధ్ధిని
కీలించితి విది చాలదె రామా

ఇకపై తనువుల నెత్తవలయునా
సకలేశ్వర నీ సంకల్పముచే
నిక నెటులైనను నెన్నడు నీభక్తి
మకరందాసక్తి మానగనీకుమా