13, ఏప్రిల్ 2018, శుక్రవారం

నిన్ను నేను మరువక



నిన్ను నేను మరువక నన్ను నీవు విడువక
యన్నా యీ‌యెడబా టన్న దెట్లు కలిగె

మనమధ్యన మాయ తెఱ మంచిది కాదయ్య
తనయంతట తానది మనమధ్యన దూఱిన
మనమిర్వురమును దాని పనిబట్టుట మేలు
మునుకొని నీవటు చేయుదువని నేను ప్రార్థింతు

నేలపైకి వచ్చుట నేను చేసిన తప్పు
యీలాగున కాలచక్రమింత కఠినమైన
జాలమును పన్ను టెఱుగ జాలనైతినే
యేలాగున నైన బయట కీడ్చుమని ప్రార్థింతు

మనుజులలో కలిగిన మహావిష్ణుదేవుడా
నను విడువని దేవుడా నారామచంద్రుడా
వెనుకటి వలె నిన్ను కలసి వేడ్కమై యుండ
కనికరించు మని యిదే‌ కడుగడు ప్రార్థింతు


2 కామెంట్‌లు:

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.