7, ఏప్రిల్ 2018, శనివారం

పరమాద్భుతంబగు వేషము



పరమాద్భుతం బగు వేషము పరమాత్ముని నరరూపము
నరజాతికి చిరకాలము స్మరణీయమా ఘనచరితము

సుర లందరు చనుదెంచి ఓ‌పరమాత్మ ఆ దశకంఠుని
పరిమార్చగ నరరూపము ధరియించవే యని వేడగ
కరుణించి యా సురజాతిని కరుణించి మానవజాతిని
హరి వచ్చెను సిరి సీతగా యరుదెంచగ తనవెంబడి

ఇనవంశ మందున రాముడై జనియించెను ఘనశ్యాముడు
మునిరాజుల ఘనమైన దీవన లందెను రఘుబాలుడు
ఘనరుద్రచాపము నెక్కిడి జనకాత్మజ సీతను పొందెను
తనతండ్రి యానతిమేరకు వనవాసదీక్షను పూనెను

హరిణాక్షి సీతను మ్రుచ్చిలి యరిగె నట పౌలస్త్యుడు
హరి కయోనిజ జాడను మరుతాత్మజు డెరిగింపగ
శరనిధి వైళమ దాటి ఆ దురితాత్ముని తెగటార్చెను
సురలందరు నుతియించగ ధరణిజతో ధరనేలెను

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.