5, ఏప్రిల్ 2018, గురువారం
చిరునగవు మోమున చిందులాడుచు
చిరునగవు మోమున చిందులాడుచు నుండు
కరుణామయుడ నన్ను కరుణించవే
యజ్ఞభావిత రామ యజ్ఞసంభవ రామ
యజ్ఞరక్షక రామ యజ్ఞేశ రామ
యజ్ఞవర్థన రామ యజ్ఞాంగ శ్రీరామ
విజ్ఞాపనము నీవు విని నన్ను బ్రోవవే
సర్వవిజ్జయ రామ సర్వమోహన రామ
సర్వార్థప్రద రామ సర్వేశ రామ
సర్వకారణ రామ సర్వజ్ఞ శ్రీరామ
సర్వవాగీశ్వరేశ్వర నన్ను బ్రోవవే
మునిజనాశ్రయ రామ ఘనవిక్రమ రామ
జనకజా పతి రామ జననాథ రామ
వనజనేత్ర రామ శిష్టేష్ట శ్రీరామ
ఘనదుఃఖవారక నను వేగ బ్రోవవే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
నా చేతకానితనం చూపించడానికి దీన్ని ఇలా మార్చానండి. ఇదేం రాగమో, అసలు అది రాగమో కాదో తెలియదు. క్షమించాలి. పాట ఎలాగా రాయలేను కాని ఇలా మార్చినందుకు.
రిప్లయితొలగించండి===================
చిరునగవు మోమున చిందు
కరుణామయా కరుణించవే
యజ్ఞభావిత, యజ్ఞసంభవ రామ
యజ్ఞరక్షక యజ్ఞేశ రామ రామ
యజ్ఞవర్థన యజ్ఞాంగ శ్రీరామ
జ్ఞానవిజ్ఞానరూపా బ్రోవవే ||చిరు||
సర్వవిజ్జయ సర్వమోహన రామ
సర్వార్థప్రద సర్వేశ రామ రామ
సర్వకారణ సర్వజ్ఞ శ్రీరామ
సర్వవాగీశ్వర బ్రోవవే ||చిరు||
ఘనవిక్రమ మునిజనాశ్రయ రామ
జనకజా పతి జననాథ రామ రామ
వనజనేత్ర శిష్టేష్ట శ్రీరామ
ఘనదుఃఖవారక బ్రోవవే ||చిరు||
అన్నీ చేతనైన వాడు ఆ రాముడొక్కడే. కాబట్టి చేతకానితనం గురించి దిగులుపడకండి.
తొలగించండిపాటను రకరకాలుగా వ్రాయవచ్చు. సంగీతకారుడు ఇచ్చిన బాణీలో మాటల్ని అమర్చటం మొదలు, రచయిత సంగీతపరిజ్ఞానం బొత్తిగా లేకపోయినా తోచింది గిలికేస్తే మామ వంటివాడు బాణీకట్టటం వరకు అనేక పోకడలు ఉంటాయి. మామ అంటే స్వర్గీయ కేవీమహాదేవన్. ఆయన మీద ఒక జోక్ ఉండేది. వార్తాపత్రికలోని శీర్షికలు పేర్చి ఇచ్చినా అందంగా బాణీకట్టేస్తాడని. ఇకపోతే ఒకే పాటకు ఒకేబాణీ అని నియమం ఏమీ లేదు. సాధారణంగా ఒకేపాటను అనేకబాణీల్లో కూర్చవచ్చును. ఒకటికంటే ఎక్కువ బాణీలు శ్రావ్యంగానే ఉండవచ్చును కూడా. ఐతే పెద్దలు ఇచ్చిన బాణీలను మార్చటం అంతమంచిది కాదు. అందుకని అలా చేయటం మంచి సంప్రదాయంకాదు.
అలాగే పెద్దలు ఇచ్చిన పాటల్లో మార్పులూ చేర్పులూ చేయటమూ మంచిసంప్రదాయం కాదు. కొందరు సరైన పాఠందొరకలేదనో మరికొందరు మంచిబాణీ కోసమనో అంటూ సంప్దరాయగీతాలకూ బాణీలను మార్చటం ఆవేదన కలిగిస్తుంది. అందుచేత సంప్రదాయగీతానికి మెరుగులు దిద్దే పనులు ఎవరూ దయచేసి చేయకండి. అది అహంభావం అనిపించుకుంటుంది కాని వినయగుణం కాదు - స్టేజీలెక్కి సవినయంగా స్వల్పంగా మార్చుతున్నా అని చెప్పినా అది అవినయమే. ఒక ఉదాహరణ చెప్పనివ్వండి అన్నమాచార్యుల వారు 'అదివో అల్లదివో హరివాసము' అని అంటే దాన్ని ఆధునికులు 'అదివో అల్లదివో శ్రీహరివాసము' అని మార్చారు. యతిస్థానంలో మార్పు అందంగా లేదు. ఇలా మార్చే అధికారం తీసుకోవటం అన్నమయ్యకు మెఱుగులు దిద్దే సాహసమూ అపచారమూ అని నా ఉద్దేశం.
మీరు నా సంకీర్తనాన్ని మార్చటాన్ని మాత్రం ఆక్షేపించలేను. నావేమీ ప్రసిధ్దరచనలూ కావు - నేను ఇంకా పెద్దల్లో కలవనూ లేదు కదా. మిత్రులకు మార్పులు సూచించటం హర్షణీయమే కాబట్టి ఇబ్బంది లేదు. పైగా మీరు ఇలా వ్రాయటం ఆనందం కలిగించింది. రామప్రీతిగా వ్రాస్తున్న ఈసంకీర్తనలు ఒకింత శ్రధ్ధగా చదివే కొందరైనా పాఠకులున్నారు కదా అని ఆ అనందం అన్నమాట.
ఇప్పుడు మీరు చేసిన మార్పుల గురించి కొంచెం ఆలోచిద్దాం.
మీరు పల్లవిలో ఉన్న రెండుపాదాలూ సమమైన పొడవుతో లేవన్న ఉద్దేశంతో కాబోలును మొదటిపాదాన్ని కత్తిరించారు! నిజానికి పల్లవిలో రెండవపాదం కొద్ది తక్కువనిడివితో ఉండటం సామాన్యమే. శేషం కోపేన పూరయేత్ అన్నట్లుగా, రెండవపాదం ముగింపులో వచ్చే అలాపన దాన్ని సరిచేస్తుంది. సంకీర్తనాసంప్రదాయాన్ని అనుసరించి నేను యతిప్రాసలను పాటిస్తున్నాను. మొదటిపాదంమీద కత్తెరవేసి తోక కత్తిరిస్తే ఉద్దేశించిన యతిస్థానం కాస్తా చివరి మాట మీదకు వెళ్ళిపోయి తూగు దెబ్బతింది. (పాదంలో ఉన్నవి మూడే మాటలూ 12 మాత్రలూ కావటం 6వ లేదా 7వ మాత్రమీదకు యతిస్థానం జరగటం తప్పదు కాని మరీ పొట్టిపాదంలో యతిస్థానం ఉంచలేము. కనీసం 11 లేదా 12 అక్షరాలైనా ఉంటే కాని బాగుండదు యతిస్థానం ఉంచాలంటే. అందుచేత యతిస్థానం ఈ పల్లవిలో లేదనుకోవలసి ఉంది. కాని మూడే మాటలపై తూగు నిలువక రెండవపాదాన్నీ కలిపి పాదాంత విరామం లేకుండా చెప్పవలసి వస్తుంది - అది బాణీ కట్టే వారికి సాధారణంగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది)
అలాగే మీరు ఈగీతంలోని చరణాల్లోని రెండవపాదం కొద్దిగా పొట్టిగా ఉందని గమనించి మరొక రామనామం చేర్చి పూరించాలని చూసారు. అదీ సాధారణంగా జరిగేదే. ఇలాంటి చరణాల్లోనూ హ్రస్వత్వాన్ని రాగాలాపనతో సరిచేయటం జరుగుతుంది. ఇంకొక చిన్న విశేషం కూడా ఉంది. ప్రతిపాదానికి ఒక విరామస్థానం ఉంటుంది చరణాల్లో. అలాగే ప్రతిచరణం మొత్తం మీద కూడా ఒక విరామస్థానం ఉండవచ్చును. ఉంటే అది సాధారణంగా రెండవచరణం ముగింపుగా ఉంటుంది. అక్కడ ఆలాపనకోసం అవకాశం కలగటానికి కాని ఆ రెండవపాదం కొద్ది పొట్టిగా ఉండవచ్చును. ఈ విధానమేమీ నియతం కాదు. కాని ఉన్నప్పుడు మాత్రం ఇదొక మంచి కారణం అన్నమాట. మొత్తం మీద పాదం మధ్యలో వచ్చే స్వల్ప విరామం ఒకటీ, పాదాంతవిరామం ఒకటీ, చరణం మధ్య వచ్చే విరామం ఒకటీ, చరణం తరువాత వచ్చే దీర్ఘవిరామం ఒకటీ అని మూడోనాలుగో ఉండటం జరుగుతుంది. పాదం మధ్యలో వచ్చే విరామం చిన్న తూగు ఐతే మిగిలిన విరామాలు సంగీతంతో నిండుతనం తీసుకొని వచ్చేందుకు తోడ్పడతాయి.
ఒక పేరా ఎగిరిపోయింది పైన్ వ్రాసినదానిలో.
తొలగించండిచరణంలోని పాదాలు ఇంచుమించి సమద్విఖండంగా విరుగుతూ రామనామాంతంగా ఉండేలా వచ్చాయి కదా. మీరు రామనామాన్ని పాదం మధ్యలో నుండి తొలగిస్తే తూగు తేడా వచ్చింది. అందుచేత "యజ్ఞభావిత రామ యజ్ఞసంభవ రామ" అన్నదానిని "యజ్ఞభావిత, యజ్ఞసంభవ రామ" అని మార్చటం వంటి అంత అవసరం కాదు. అప్పుడు యతిస్థానంలో 'సం' వచ్చి కుదరటం లేదు. కుదర్చాలంటే లోపించన రామపదాన్ని సంగీతంతో పూరించాలి!
చాలా తెలియని విషయాలు చెప్పారండి. ధన్యవాదాలు. కనీసం సినిమాలో పాటలకైనా పనికిరానంటారా? :-) ఏమో ఈ మధ్య వచ్చిన బాస్ ఈజ్ బాక్, సింహమైనా దిగదా నీతో సెల్ఫీలు... లాంటి పాట రాముడికి రాయలేనా అని ఆలోచిస్తున్నా :-)
రిప్లయితొలగించండిసినిమాపాటలు వ్రాయటానికి సంగీతసాహిత్యాలతో బొత్తిగా పరిచయం లేకపోయినా ఫర్వాలేదు.
తొలగించండిసినిమాపాటలు పాడటానికి నేడు సంగీతం రాకపోయినా ఇబ్బందిలేదు అస్సలు గాత్రశుధ్ధిలేకపోయినా పర్వాలేదు.
సినిమాపాటలకు సంగీతం బాణీకట్టటానికీ ఈనాడు సంగీతజ్ఞానం అంతగా అవసరం లేదు.
చివరికి సినిమాపాటలు ఓపిగ్గా వినవలసిన అవసరమూ లేదేమో.
మీరు అలా తోచినట్లుగా రాముడి మీద వ్రాసేస్తానంటే ఎవరు మాత్రం కాదనగలరూ? మీ యిష్టం మీది. కానివ్వండి. రాముణ్ణి పొగడే వాళ్ళూ తెగడే వాళ్ళూ పట్టించుకోని వాళ్ళూ అందరూ హాయిగా ఎవరి పని వాళ్ళు చేస్గ్తున్న ప్రపంచంలో మీదారిన మీరు వ్రాయద్దనటం కుదరదు.