15, ఏప్రిల్ 2018, ఆదివారం

ఎందుకు నరులార యీ యాతనలుఎందుకు నరులార యీ యాతనలు చే
యందించుచు మనకు గోవిందుడు లేడా

పరమసుఖాకరములు పరమపవిత్రంబులు
హరిదివ్యనామములే యబ్బి యుండగ
నరులార నాలుకలకు నానా నామముల
పరిపరి ప్రాకృతికముల పట్టించ నేటికి

హరియిచ్చిన రామనామ మమృతమై మీకు
పరము నిహము హాయిగా పంచుచుండగ
నరులార యితర మంత్రములజోలి యేల
పరమాన్నము వదలి గడ్డి భక్షిించ నేటికి

అరవచాకిరి చేసి యాస్వామి యీస్వామి
పరమార్థము లేనట్టి పనుల పంచగ
పరితోషమిచ్చు రామబ్రహ్మమును విడచి
హరికి దూరమై చిత్త మల్లాడగ నేటికి

పరితోషమిచ్చు రామబ్రహ్మమును మఱచి
పరమార్థవిదూరతత్త్వభావనంబుల
నిరతము బోధించు లొట్టగురువుల జేరి
యరవచాకిరితో నాత్మ లల్లాడగ నేటికి

2 కామెంట్‌లు:

 1. రామ మంత్రం గొప్పది. కానీ ఇతర మంత్రాలు గడ్డితో పోల్చడం బుచికి అనిపిస్తుంది. One can Sing the glory of one's Ishta daivam. Why belittle other gods/paths. All paths and gods are equally good , effective and acceptable. Even Rama or shiva or any other god won't approve of it. Felt like sharing my view. No intention to find fault sir.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీరు కొంత వ్యాఖ్యను ఆంగ్లంలో ఎందుకు వ్రాసారు?

   ఈ బుచికీ యేమిటో!

   శివకేశవులకూ శివశక్తులకూ అబేధం చెబుతాము. తాత్వికంగా రకరకాల దైవాలంటూ లేవు. అందుచేత యేవిధమైన దైవతిరస్కారమూ భావించరా దిక్కడ.

   మంత్రాలు ముఖ్యంగా రెండురకాలు. ఐహికార్ధప్రదములూ పారమార్ధికములూ అని. ఈచరణంలో కేవలం ఐహికసుఖమాత్రప్రదము లైన మంత్రసముఛ్ఛయాన్ని మాత్రమే ఆక్షేపించటం జరిగింది. ఈచరణంలో స్పష్టంగా పరము నీయని మంత్రాలనే గడ్డి అన్నాను అంటే ఐహికాన్ని మాత్రమే ఇచ్చే మంత్రాల పైననే ఆక్షేపణ అని గ్రాహ్యం.

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.