వివేచన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వివేచన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, నవంబర్ 2023, బుధవారం

చక్కబడు టెట్లు

 
తప్పొప్పు లెఱుగును తన తప్పులెఱుగును
  కాని చేయుచుండు కానిపనులు

ధర్మంబు నెఱుగును తనధర్మ మెఱుగును
  కాని యధర్మముల్ మానలేడు

నీతినెఱుగు లోకరీతి నెఱుంగును
  కాని నీతికి తాను కట్టుబడడు

సత్యంబునెఱుగు నసత్యంబు నెఱుగును
  కాని యసత్యమే కడుప్రియంబు


కలిప్రభావంబుచే బుధ్ధి గాడితప్పి
మనుజు డిట్లుండ నీశ్వరా మంచిదారి
కెట్లు వచ్చును మోక్ష మదెట్లు కలుగు
నీవు దయజూపకున్నచో నిక్కముగను


రాళ్ళు విసిరి నీవు సాధించునది లేదు

 
ఎంతటి శక్తి నార్జించినా రాముని
  శక్తి యంతటి గొప్ప శక్తి కాదు

ఎంతటి జయము నార్జించినా రాముని
  జయము నంతటి గొప్ప జయము కాదు

ఎంతటి కీర్తినార్జించినా రాముని
  కీర్తియంతటి గొప్ప కీర్తి కాదు

ఎంతటి మహిమ గడించినా రాముని
  మహిమ యంతటి గొప్ప మహిమ కాదు 


రామచంద్రునిపై కొన్ని రాళ్ళు విసిరి
నీవు సాధించునది లేదు నింద తప్ప
చక్కగా రామశక్తియు జయము కీర్తి
మహిమలను పొగడుట ముక్తి మార్గమగును


23, జూన్ 2020, మంగళవారం

ఇన్నాళ్ళు బ్రతికితి నెన్నాళ్ళు బ్రతుకుదు




ఏమేమొ చదివితి నిక నేమి చదువుదు
చదువు లెందుల కన్న శంక కలిగె

ఏమేమొ చేసితి నిక నేమి చేయుదు
చేయు టెందుల కన్న చింత కలిగె

ఏమేమొ జూచితి నిక నేమి జూచెద
జూచు టెందుల కన్న జూడ్కి గలిగె

ఇన్నాళ్ళు బ్రతికితి నెన్నాళ్ళు బ్రతుకుదు
నింక మీదట నను శంక కలిగె

చదువ దగినట్టి నిను గూర్చి చదువకుండ
చేయ దగినట్టి నీపూజ చేయకుండ
చూడ దగినట్టి నిను నేను చూడకుండ
ఎన్ని యేండ్లుండి భూమిపై నేమి ఫలము





16, జనవరి 2015, శుక్రవారం

నీ‌ కరుణ తప్ప నేనేమీ యెరుగను




నీ నామ మెఱుగను నీ రూప మెఱుగను
నీ ధామ మెఱుగను నిన్నెఱుగను

నీ తీరు నెఱుగను నీ సౌరు నెఱుగను
నీ వారి నెఱుగను నిన్నెఱుగను

నీ యున్కి నెఱుగను నీ‌ మన్కు లెఱుగను
నీ తత్త్వ మెఱుగను నిన్నెఱుగను

నీ శక్తు లెఱుగను నీ‌ యుక్తు లెఱుగను
నీ చెయ్వు లెఱుగను నిన్నెఱుగను

నిన్ను ధ్యానించు విధమును నే నెఱుగను
నిన్నెఱింగెడి విధమును నే నెఱుగను
నిత్య మీశ్వర నాపట్ల నడచుచుండు
నీదు కరుణకు నితరంబు నే నెఱుగను





10, జనవరి 2015, శనివారం

కథను రక్తికట్టించే మరికొన్ని పాత్రలు






నామాటలను మెచ్చి నాపక్ష మగువారు
నావారలే యది నా కెఱుకయె

నాతోడి స్నేహంబు నడిపించువారును
నావారలే యది నా కెఱుకయె

నాయందు ప్రేమతో నాకండ యగువారు
నావారలే యది నా కెఱుకయె

నాయున్కిమన్కి కానందించు వారెల్ల
నావారలే యది నా కెఱుకయె

నాదు ప్రస్తుతజీవననాటకమున
కథను రక్తికట్టించగా కలిగి నట్టి
పాత్రలుగ వీరినెంచద సూత్రధారి
వీవటంచును గమనింతు నీశ యెపుడు




కథను రక్తికట్టించు పాత్రలు






నామాటలకు జాల నవ్వుకొనెడు వారు
నావారలే యది నా కెఱుకయె

నాపైన వైరంబు నడిపించువారును
నావారలే యది నా కెఱుకయె

నా యందు ప్రేముడి నటియించువారును
నావారలే యది నా కెఱుకయె

నాయున్కి నెఱుగమి నటియించువారును
నావారలే యది నా కెఱుకయె

నాదు ప్రస్తుతజీవననాటకమున
కథను రక్తికట్టించగా కలిగి నట్టి
పాత్రలుగ వీరినెంచద సూత్రధారి
వీవటంచును గమనింతు నీశ యెపుడు




23, డిసెంబర్ 2014, మంగళవారం

నేటి వారిని నడిపించ నీక తగును






నేటి వారికి జెప్పు నేర్పుగలాడనే
నేరు పట్టిది చూడ నీక చెల్లు

నేటి వారల మేథ నాకింతయును లేదు
దాని మించిన మేథ తనరు నీక

నేటి కాలంబున నామాట లతుకవు
కాలోచితప్రజ్ఞ గలుగు నీక

నేటి వర్తనములు నే నేర్వగా లేను
నేరుపు లన్నియు నేర్తువీవ

నిన్న చెల్లితినో లేదొ నేనెఱుంగ
నేడు చెల్లుట కనరామి నిశ్చయంబు
నేడు రేపను బేధంబు నీకు లేదు
నేటి వారిని నడిపించ నీక తగును




22, డిసెంబర్ 2014, సోమవారం

జీవన చక్రం






ఒకజీవి కడుపులో నొకజీవి పొడమును
గర్భనరకమున గాసివడుచు

పూర్వభవంబుల బుధ్ధిహీనతచేత
జేసినచెయ్వుల జెప్పుకొనుచు

పరమాత్మ నీ దయ భావించి వేడుచు
పరిపరివిధముల పనవుచుండు

శపథంబు చేయును సచ్చరితంబున
నిలపైన మున్ముందు మెలిగెదనని

మాతృగర్భంబు వెల్వడి మహికి వచ్చి
మరచు నా గర్భనరకమున్ మరచు నిన్ను
మరచు శపధంబు మాయలో‌ మరల మునుగు
దుదిని వేరొక్క గర్భంబు దూరువరకు




20, డిసెంబర్ 2014, శనివారం

ఎఱిగిన దొక్క నీవే కదయ్య





ఈశ్వరా యీ సృష్టి యెందుకు చేసెదో
యెఱిగిన దొక్క నీవే గదయ్య

ఈశ్వరా జీవుల మెందు కిందుంటిమో
యెఱిగిన దొక్క నీవే గదయ్య

ఈశ్వరా మాయలో నెందుకు ముంచెదో
యెఱిగిన దొక్క నీవే గదయ్య

ఈశ్వరా యేజీవి కెప్పుడు మోక్షమో
యెఱిగిన దొక్క నీవే గదయ్య

యేమి చేయుదు నీ ప్రశ్న లెవరి నడిగి
యేమి లాభంబు లేదని యెఱిగి తుదకు
చేయునది లేక కరుణతో చెప్పుమనుచు
నిన్ను ప్రార్థించుచుంటి ప్రసన్నమూర్తి




18, డిసెంబర్ 2014, గురువారం

నీకునై ఘనతపోనిష్ఠల పనిలేదు





నీకునై ఘనతపోనిష్ఠల పనిలేదు
తన మనంబున నిన్ను తలచుచున్న

నీకునై విద్యల నేర్వగ బనిలేదు
తన బుధ్ధి నీయందు తగిలియున్న

నీకునై జగమును ఛీకొట్ట బనిలేదు
తన యహమిక నిన్ను దాల్చియున్న

నీకునై యందదు నెమకెడు పనిలేదు
తన చిత్తమున నిన్ను గనుచునున్న

ఇల మనోబుధ్యంహకారములను నిన్ను
తవిలి యుండిన చాలదె భవము విడగ
నీశ్వరా యేను వెఱ్ఱినై యిన్ని నాళ్ళు
నింద్రియంబల దవిలితి నెఱుక లేక




12, డిసెంబర్ 2014, శుక్రవారం

కవులెల్ల నినుగూర్చి ఘనముగా వ్రాయరే





కవులెల్ల నినుగూర్చి ఘనముగా వ్రాయరే
వర్ణనలందుండు వారికి రుచి

పౌరాణికుల నుడుల్ పొడవులై సాగవే
భవదద్భుత కథల్ వారికి రుచి

వేదాంతు లాత్మ నన్వేషించరే నిన్ను
బ్రహ్మవిజ్ఞానంబు వారికి రుచి

భక్తు లనిశమును భావించరే నిన్ను
పరవశించుటలోన వారికి రుచి

ఎవరి రుచి యెందు వర్తించు నెట్టి భంగి
నట్లు బుధులెల్ల నిన్నెప్పు డఱయు వారు
పామరుడ వీరిలో జేరువాడ గాను
నన్ను కృపజూడు మీశ్వరా కన్నతండ్రి




28, నవంబర్ 2014, శుక్రవారం

అరయ వేమి నీ దయ కంగలార్చు చుంటి.





పాంచభౌతికదేహపంజరంబున జిక్కి
పడరాని యిడుములు పడుచు నుంటి

ఉఱక లోకులతోడ కొఱగాని వాదాల
మత్తులోపడి నిన్ను మరచు చుంటి

ఉత్తుత్తి సుఖముల కూగిస లాడుచు
నటునిటు పరుగుల నలయు చుంటి

ఎట్టుల నీదారి పట్టుకొందు నటంచు
వగచుచు నిత్యంబు పనవు చుంటి

ఏమి చెప్పుదు నయ్య నే నిట్టు లుంటి
ఎటుల భవవార్థి గడచుటో‌ యెఱుగ కుంటి
దేవుడా యెటనుంటి విక దిక్కు నీవె యంటి
అరయ వేమి నీ దయ కంగలార్చు చుంటి




25, నవంబర్ 2014, మంగళవారం

నీవు నావాడవై యుండినావు చాలు





చక్కగ నా చేత జరుగనై నట్టివి
నీ దయచేతనే నెఱపు చుంటి

జరిగిన వన్నియు జరిపించినది తామె
యనెడు ప్రచారముల్ వినుచు నుంటి

ముదిమిని నా భారమును వహించెడు వార
లెవ్వరు లేరని యెఱిగి యుంటి

రాబోవు కాలాన నాబోటి వానికి
తలచువారలు లేమి తెలిసి యుంటి

ఈశ్వరా నేడు నీవు నా కిచ్చి నట్టి
జీవితం బిది దీనికి చింత లేదు
ఎవరు నన్నెన్న మానిన నేమి గాని
నీవు నావాడవై యుండినావు చాలు




24, నవంబర్ 2014, సోమవారం

సర్వవిధముల నా కతిసన్నిహితుడు






ఈ చరాచర సృష్టి నెనుబది నాలుగు
లక్షల జీవాళి లక్షణముల

నెఱుగుచు వాటికి నెల్లవేళల నుత్త
మంబగు గతులను మలుచు వాడు

వాటికి గలుగు నుపాధిగతంబగు
చిక్కులు దీర్చుచు నక్కజముగ

నక్షీణకృపను సంరక్షణం బొనరించ
క్షణ మేని విశ్రాంతి గొనని వాడు

జీవులాడెడు నాటల చిత్రగతులు
మందహాసంబుతో జూచు మంచివాడు
సర్వవిధముల నా కతిసన్నిహితుడు
వాని నీశ్వరు నిత్యంబు బ్రస్తుతింతు







20, నవంబర్ 2014, గురువారం

దారిజూప నుఱక తహతహలాడెద వీశ్వరా





పండుగో పబ్బమో వచ్చినప్పుడు మాత్ర
మొక్క మా రెట్టులో మ్రొక్కువారు

తల్లివై తండ్రివై దాతవై నేతవై
యుండు నిన్నే మరచి యుండువారు

కొంగ్రొత్తమతముల క్రొత్తబోధనలతో
క్రొత్తదేవుళ్ళను కొలుచు వారు

అందరకన్నను నాప్తుండ వగు నిన్ను
తిట్టుచు నిత్యంబు తిరుగువారు

నిండి యుండిరయ్య నేడు లోకంబున
వారిపట్ల జాలిబరపి నీవు
దారిజూప నుఱక తహతహలాడెద
వీశ్వరా మహాత్మ యివియె నుతులు






18, నవంబర్ 2014, మంగళవారం

ఈశ్వరా మోక్షమందుట కేమి యడ్డు






సహజమై కోపంబు సర్పంబు లందుండు
పులులందు క్రూరత పొంగుచుండు

హరిణంబులందుండు నమిత భయంబును
దొంగలై నక్కలు తోచుచుండు

తోడేళ్ళు తిండిపోతుల రీతిగా నుండు
కోతులయం దతికుతుక ముండు

గాడిదలకు బుధ్ధి కడుస్వల్పమై యుండు
శుచి నెఱుంగక యుండు సూకరములు

వాయి లేనట్టి వటులుండ వచ్చుగాక
మనుజులకు జంతుబుద్దులు మంచి వగునె
మనసులందున నినునిల్పి మసలి రేని
ఈశ్వరా మోక్షమందుట కేమి యడ్డు







ఎంచ నీ కంటె సద్గురు వెవ్వడయ్య






స్వపరభేదంబులు క్షణము చాలించు నా
వలి క్షణమున బంధుగులను దలచు

ఇంద్రియసుఖముల నీసడించును క్షణ
మవి గోరి మరుక్షణ మలమటించు

సత్యంబు పై నిల్చు క్షణము నా బుధ్ధి య
సత్యంబు నే బల్కు క్షణము పిదప

ఈ బుధ్ధి యీ క్షణ మీశ్వర నిన్నెంచు
నంతలో పోవు నన్యముల కడకు

చంచలంబగు నాబుధ్ధి జాడ్య ముడిపి
మంచి దారికి నీవె రప్పించవలయు
ఎంచ నీ కంటె సద్గురు వెవ్వడయ్య
ఈశ్వరా నన్ను రక్షించవే మహాత్మ







17, నవంబర్ 2014, సోమవారం

ఎఱుక గల్గిన యీక్షణ మేను నీది






ఇపుడు చక్కగ నున్న యింద్రియంబుల సత్త్వ
మెన్నాళ్ళు నిలచునో యెవరి కెఱుక

తనదంచు మురిపాన దాల్చి తిరుగెడు దేహ
మెన్నాళ్ళు నిలచునో యెవరి కెఱుక

లోకంబు తనకిచ్చు నీ కొద్ది మరియాద
యెన్నాళ్ళు నిలుచునో యెవరి కెఱుక

ఈశ్వరార్పితమైన యీ బుధ్ధి చక్కగా
యెన్నాళ్ళు నిలుచునో యెవరి కెఱుక

నీది నీదన నిజముగా నేది యుండె
నెఱుక గల్గిన యీక్షణ మేను నీది
యిదియె పదిలంబుగా బట్టి యీశ్వరునకు
పాదపూజల వెచ్చించ వలయునయ్య







విన్నపం బిదె నీ మాట వినవలతును







వినిపించెదను నీకు విన్నపం బొక్కటి
వివరంబుగా నీవు వినవలయును

ఇన్ని జన్మము లెత్త నేమిటి కో తండ్రి
యింకెన్ని జన్మంబు లెత్తవలయు

మరలమరల నేను మానవుండుగ బుట్టి
మానక చెడుచుండి మాయవలన

పాపపుణ్యంబుల వలలోన చిక్కుచు
క్రిందుమీదగుటేమి క్రీడ నీకు

మరియు నీ యంశ నేనను మాట యొకటి
పలుకుచుండెద వద్దాని భావ మేమి
నేను నీ వైన యెడమేల నీకు నాకు
విన్నపం బిదె నీ మాట వినవలతును







నీ దివ్యవిభవంబు మఱువకుండ







సుకవు లద్భుతమైన స్తోత్రంబులం జేసి
సేవించి ధన్యులై చెలగు చుండ

పరమమౌ ప్రేమచే పరవశమై భక్త
కోటి నిన్నెప్పుడు కొలుచు చుండ

నీ దైన తత్త్వంబు నిత్యంబు భావించి
ముదమున యోగీంద్రముఖ్యు లుండ

నీ దయ చాలని నిరతంబు పామరుల్
ప్రార్థించు వారలై పరగు చుండ

అందరకు నీదు సత్కృప యలరు చుండ
జీవులందరు తుది నిన్ను చేరు చుండ
నెఱపు  నీ దివ్యవిభవంబు మఱువ కుండ
నుండ జేయవె యీశ్వరా యుర్విమీద