16, జనవరి 2015, శుక్రవారం

నీ‌ కరుణ తప్ప నేనేమీ యెరుగను




నీ నామ మెఱుగను నీ రూప మెఱుగను
నీ ధామ మెఱుగను నిన్నెఱుగను

నీ తీరు నెఱుగను నీ సౌరు నెఱుగను
నీ వారి నెఱుగను నిన్నెఱుగను

నీ యున్కి నెఱుగను నీ‌ మన్కు లెఱుగను
నీ తత్త్వ మెఱుగను నిన్నెఱుగను

నీ శక్తు లెఱుగను నీ‌ యుక్తు లెఱుగను
నీ చెయ్వు లెఱుగను నిన్నెఱుగను

నిన్ను ధ్యానించు విధమును నే నెఱుగను
నిన్నెఱింగెడి విధమును నే నెఱుగను
నిత్య మీశ్వర నాపట్ల నడచుచుండు
నీదు కరుణకు నితరంబు నే నెఱుగను





5 కామెంట్‌లు:

  1. మా జిలేబి గారి భాషలో
    తెలిస్తే ఖేల్ ఖతం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంతే కదండీ మరి.

      త్రిపుటి అంటాం. తెలుసుకొనే వాడు, తెలియబడేవాడు, తెలియటమనే క్రియ - ఈ‌ మూడింటినీ కలిపి. ఈ‌ తెలియట మనేది నిజంగా జరిగితే ఏం జరుగుతుందో చూడండి. తెలుసుకొనే వాడికీ తెలియబడే వాడికీ అభేదం అన్న సంగతి బయటపడుతుంది. వేరుగా తెలుసుకొనే వాడెవరూ‌ లేక తెలియటం అనే‌ క్రియ యొక్క ప్రసక్తి అంతరిస్తుంది. ఉన్నది ఒకటే తత్త్వం కాబట్టి, ఈ‌ క్రియాకలాపం లేదు కాబట్టి ధ్యానధ్యాతృధ్యేయమనే త్రిపుటికి అవకాశమే ఉండదు మరి. త్రిపుటినశించి 'తత్త్వమ్‌ అసి' అన్నది సిధ్ధించిన పిదప ఇంక బాహిరవ్యవహారం ఏమీ లేదు. అవునండీ లోకక్రీడ (ఖేల్) ఖతం.

      తొలగించండి
    2. వివరణ అద్భుతంగా ఉందండీ

      తొలగించండి

    3. మానవా, మానవా,

      ఇంత అమాయకం గా ఉంటె ఎట్లా ! నా ప్రతిబింబమై నిన్ను మలచా ! నేనెరుగ నేనెరుగ అంటూ ఏమీ తెలీయ కుండా ఉంటె నా పరువు ఏమి గాను !

      తత్ త్వం అసి !

      జిలేబి

      తొలగించండి
    4. మానమంటే‌ మానటం నావల్ల కావటం లేదండీ జిలేబీగారు.

      జీవుడిగా తాను వేరు బ్రహ్మము వేరు అనుకోవటం ప్రకృతిమాయచేత - అది అవిద్య. తాను బ్రహ్మమునకు ప్రతిబింబమాత్రుడనే అని గ్రహించటం - వైరాగ్యస్థితి. అది శుభేఛ్ఛ అనే మోక్షభూమిక. తానే బ్రహ్మమును అని తెలుసుకోవటం - కైవల్యస్థితి. అది గగనకుసుమంలాంటిది. అదే మోక్షం - అంటే ప్రకృతినుండి పూర్తిగా విడిపోవటం. ఆ తెలివిడి కలిగిన చోట ఉన్నది బ్రహ్మమే. ఇక ప్రకృతిలేదు, మాయలేదు. కాబట్టి జీవుడూ‌ లేడు. ఉన్నది కేవలం‌బ్రహ్మమే.

      ఈ కైవల్యస్థితి గురించి సూచనా మాత్రంగా తప్ప తెలుసుకోనూ లేము చెప్పనూ లేము. ఎందుచేతనంటే ఆస్థితిలో ఏ వ్యాపారమూ ఉండదు. ఆ స్థితిలో ఉండే అక్షరబ్రహ్మానికి పరువూ మర్యాదాలాంటి సాపేక్షమైన భావనలూ ఉండవు కాబట్టి యే యిబ్బందీ కూడా లేదు. (ఎవరికబ్బా!?)

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.